[box type=’note’ fontsize=’16’] యుక్తాయుక్తాలను గ్రహించగలిగే వివేకం ఎంత అవసరమో, భయాన్ని విడిచి తెలియని దాన్ని తెలుసుకోవడం ఎంత ముఖ్యమో, మూఢతని వీడి జ్ఞానుల సాంగత్యంలో గడపడం వల్ల లభించే ప్రయోజనాన్ని అయిదు కంద పద్యాలలో వివరిస్తున్నారు బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి. [/box]
కం.
యుక్తము కానిది యెయ్యద,
యుక్తము కానిదది యేదియొ, తెలుపు సరియౌ
శక్తినొసంగు వివేకము
ముక్తి నొసంగును జగతిని ముమ్మాటికినిన్.
అడిగియు తెలియందగు, నీ
జడుపును మొగమాటమియును చప్పున విడుమా!
విడుమిక యజ్ఞానమ్మును
వడిగా జ్ఞానుల పదముల బట్టుము సుమ్మా!
గాడిద భంగిని పనులను
నేడులు గడువగ, పనితనమెంతగనున్నన్
పాడియు గాదది, జ్ఞానము
నేడుగడగ తెలియక నరుడెచ్చట నున్నన్.
చెప్పిన శ్రద్ధగ వినిననె,
చప్పున యవగతమగునను చక్కని మాటన్
తప్పియు మరువగరాదది
యొప్పుగ నడవడి గలిగిన నొజ్జయు నేర్పున్.
తెలివిడి యున్ననె విషయము
తెలియును మూఢత మునుగగ తేలగ గలమే?
పలువురు జ్ఞానులు జగతిని
గలరని తెలిసిన యడుగులు కదుపగ రాదే?