[box type=’note’ fontsize=’16’] సంచిక నిర్వహించిన 2018 దీపావళి కథల పోటీలో న్యాయనిర్ణేతలు/సంపాదకుల ఎంపికలో ప్రోత్సాహక బహుమతి పొందిన కథ. [/box]
[dropcap]గు[/dropcap]డి మునిగిపోయింది! మనూరి అమ్మెరితల్లి గుడి నిండా మునిగిపోయిందహో..!
మిట్ట మధ్యాహ్నం నడినెత్తి మీద చండప్రచండుడు నిప్పులు కక్కుతూంటే, ఊరి మధ్యన రచ్చబండని ఆనుకుని ఉన్న వేప చెట్టు కొమ్మ మీద కూర్చుని డప్పు బాదుతూ అరుస్తున్నాడు వరదయ్య.
కర్ణ కఠోరంగా ఉన్న డప్పు శబ్దానికి ఊరు ఉలిక్కిపడింది! జనాలు ఒక్కొక్కరుగా వచ్చి “ఏంటి వరదయ్యా ఇంత ఎండలో ఈ గోల?” అని అడుగుతున్నారు. వచ్చిన వాళ్ళని చూడగానే పేరుతో పిలిచి మరీ మన ఊరి గుడి మునిగిపోయిందని బాధగా చెప్తూ డప్పు కొడుతున్నాడు వరదయ్య.
దగ్గరగా వంద గడపలున్న ఆ చిన్న గ్రామంలో వరదయ్య చెట్టెక్కి పిచ్చోడిలా అరుస్తున్నాడన్న వార్త నిముషాల మీద ప్రాకేసింది!
వరదయ్య వివేకం తెలిసిన మనిషి! ఏ తాగుబోతో, తుంటిరి గుంటడో అలా అరిస్తే పట్టించుకోరు. వరదయ్య అలా డప్పుబాదుతూ మండుటెండలో వీరంగం వేస్తున్నాడనే సరికి పిన్నా పెద్దా విస్తుపోయి వింత చుడ్డానికి వేపచెట్టు నీడని చేరుకున్నారు.
“అమ్మ అందమే అందం! అమ్మ మహిమలే మహిమలు! ఊరి పిల్లల బతుకుదారి ఆ అమ్మోరితల్లి గుడి! అది కాస్తా మునిగిపోయింది!” అంటూ డప్పు మీద చరిచాడు వరదయ్య.
“పేరయ్యగారు! మీ పెదబాబు ఆ గుడిమెట్లెక్కి శ్రద్దగా దండమెట్టి తల్లి దయ పొంది డాక్టరయ్యాడు? అలాటి చల్లని తల్లి గుడి మునిగిపోయింది!” అని కసిగా డప్పు కొట్టాడు.
వరదయ్యకి పిచ్చి పట్టిందో ఏంటో అని కొందరు మనసులోనే బాధపడ్డారు.
“సీతాలక్కా! మీ సిన్న పాప సివిలింజీనీరు! ఎల్లా గయ్యందేంటి? అమ్మోరితల్లి గుడి మెట్లెక్కేనా? ఇప్పుడా గుడి ముగినిపోయింది?” బాధగా డప్పు మీద కొట్టాడు వరదయ్య. వరదయ్య తన బాధని చెప్తూ అరుస్తూనే ఉన్నాడు, డప్పు బాదుతూనే ఉన్నాడు.
సీతాలు ముందు కొచ్చి, “ఏంటి వరదయ్యా ఆ మాటలు? అలా అనకోడదని నీకు తెలీదా? మండు వేసంగిలో గుడి మునిగిపోవడమేంటి? గుడి మునిగిపోయింది, కోవెల కాలిపోయింది లాంటి మాటలు అనొచ్చా? ఊరికి అరిష్టం కదూ!” అని నచ్చచెప్పింది.
ఇంతకన్నా అరిష్టమా? రావలసిన కష్టం వచ్చేసింది. జరగవలసిన నష్టం జరిగిపోయింది! అంటూ అరిచాడు.
గ్రామ పెద్దలు కొందరు ఎండతాకిడికి తట్టుకోలేక, సహనం కోల్పోయి “వరదయ్యా, నోరు మూసుకుని చెట్టు దిగుతావా? రాళ్ళు విసిరి కొట్టమంటావా? ” అని హెచ్చరించారు.
ఇంతలో ఓ పెద్ద ముత్తయిదువ, “ఆగండహె, వరదయ్య మీదికి ఆమ్మోరు వచ్చింది! ఏం అనకండి” అంది. అంతే! ఊరు మొత్తం వరదయ్యకి కింది నుంచే దండాలు పెడుతూ ‘కోరికలేంటో చెప్పమ్మా’ అని వేడుకున్నారు.
“ఊరికి అరిష్టమొచ్చింది! ఏ పిల్లగాణ్ణి ఏ బర్రె కుమ్మెస్తదో? జీతానికి మోతుబరి దగ్గర కుదురుకున్న ఏ ఆడకూతుర్ని ఏ నేలబావి మింగేస్తదో నేను చెప్పలేను” అంటూ డప్పు చరిచాడు.
తుళ్ళుపడిన తల్లులు తమ పిల్లల్ని, కోడి తన పిల్లల్ని రెక్కల్లో దాచుకున్నట్లుగా దగ్గరగా తీసుకుని గట్టిగా పొదివి పట్టుకున్నారు.
“చలిమిడి కలిపి పట్రండర్రా అమ్మోరికి నైవేద్యం పడదాం” అని ఒకావిడ గట్టిగా అరిచింది.
“గ్లాసుడు పానకం కూడా తెండర్రా” అని మరొక తల్లి సూచించింది.
“వద్దు! తీపి పదార్దాలు తినే, తాగే సందర్భమా ఇది? వద్దు, నాకేం వద్దు” అంటూ చెట్టు మీంచి అరిచి డప్పు డబ డబ బదాడు వరదయ్య.
“అమ్మా! ఊరికొచ్చిన కష్టమేంటో చెప్పండమ్మా, ముందు చెట్టు దిగండమ్మా” అంటూ పిల్లా, పెద్దా, ఆడామాగా తేడా లేకుండా చేతులు జోడించి ప్రాధేయపడ్డారు.
వరదయ్య చెట్టు దిగాడు! అందరూ నిశ్శబ్దమైపోయారు! జోడించిన చేతులు విప్పలేదు! “ఊరికి పట్టుకున్న అరిష్టం చెపుతా” అంటూ డప్పు మీద ఒక సారి కొట్టి చుట్టూ చూసాడు వరదయ్య.
“ఊరి పిల్లగాళ్ళు వింటే వెక్కి వెక్కి ఏడుస్తారు! వారి ఏడుపు నేను చూడలేను! పిల్లల తల్లులు నెత్తి బాదుకుంటారు. ఆ బాధ నేను చూడలేను! తండ్రులు దిగాలుగా తలలు వేలాడదీస్తారు. వాళ్ళ దిగులు నేను చూడలేను! చూడలేనహో” అంటూ డప్పు బాదాడు వరదయ్య.
అందరూ భీతిల్లిన మొహాలతో అతనినే చూస్తూన్నారు.
“చెప్పండమ్మా ఎంత కష్టమైనా ఊరంతా ఒక్కటై చక్క బట్టుకుంటాం. వచ్చిన కష్టం చెప్పండి” అన్నాడొక పెద్ద మనిషి. అవును చక్కబడతాం, చెప్పండి అని మిగిలిన వాళ్ళంతా అరిచారు.
“చక్కబెట్టుకుంటాం అన్నారు. ఆ మాట మీదే ఉంటారా?” అడిగాడు వరదయ్య. “ఉంటాం. మాట తప్పం” అంటూ సమాధాన మిచ్చారు అందరూ.
“గంట మోగాల”
“మోగిస్తాం”
“సరే చెప్పేస్తున్నా! ఊరికి వచ్చిన కష్టం చెప్పేస్తున్నా!” అని ఆగాడు వరదయ్య. చీమ చిట్కుమన్నా వినబడేంత నిశ్శబ్దం అలుముకుంది!
మండుటెండలో ఉన్నామన్న విషయమే ఎవరికి పట్టడం లేదు!
వరదయ్య స్వరం తగ్గించి బాధగా మోహం పెట్టి చెప్పాడు. “గుడి మునిగిపోయింది! గుడి లాంటి బడి! మన ఊరి బడి మూసేసారంట!” అన్నాడు.
తల్లి చంకలో ఉన్న ఒక చంటి పిల్లాడు ఎండ వేడికో, మరెందుకో కేర్‌మని ఏడ్చి గుక్కపట్టాడు. అలా నిశ్శబ్దం ఛేదించబడింది!