[box type=’note’ fontsize=’16’] 2018 దసరా కవితల పోటీలలో సంచిక సంపాదకవర్గం వారి ప్రోత్సాహక బహుమతి పొందిన కవిత.
[/box]
కం.
[dropcap]అ[/dropcap]దియే విశాఖ, పులకలు
మదినే కలుగును తలంచి మైమరచిననే,
వదలవు గురుతులు మనసును
పదిలముగా భద్రపరచ పసిడిగ నేనే!
కం.
పట్టణమనగ విశాఖయె
మొట్టమొదటిసారిచూచి మురిసితిమి కదా,
ఒట్టే, నగరములేవీ
పట్టవు సుమ్మీ విశాఖపట్న సొగసుకున్!
కం.
సాగరమును కనగానే
వేగమె మురిసెన్ మనస్సు వెల్లివిరిసె నే
ఆగని యుల్లసము మదిని
తీగెలు మీటెను విపంచి తీయని శృతినే…
కం.
నీలాలరాశి సొబగులు
జాలము చేసెను కనులను చల్లని సొబగున్
కాలము తెలియదు సుమ్మీ
బాలలు, పెద్దలు నిరతము వాలగనచటన్ !
కం.
కనరే కైలాస గిరిని
కనరే కొలువైన హరుని కాంచరె కడలిన్
కనరే కొండను వెలసిన
వనదేవతనే కనులకు పండుగ కలుగన్!
కం.
నరసింహుడు వెలసె గిరిని
కరుణించగనే దహరుని కమ్మని పేర్మిన్
హరియించెను నరహరియై
హరివై రిహిరణ్య కశిపు యసువుల తానే!
*దహరుడు = బాలుడు
కం.
ఘనముగ విశాఖ నగరిని
చనినంతను చెమట బాధ చంపును సుమ్మీ,
వినరో సాయంకాలము
వనధీ తీరపు విహార బాళియె చాలున్!