[box type=’note’ fontsize=’16’] 2018 దీపావళి కథల పోటీకి వచ్చిన కథ. [/box]
[dropcap]చి[/dropcap]మిడిపల్లి స్టేషన్లో కిరండోల్ వెళ్ళే 1 వీ కె పాసింజర్ ఆగింది పొద్దున్నపదిగంటలకు..
స్టేషన్‌కు చాలా దిగువగా, క్వార్టర్స్ ఉండటం వలన మేమంతా ఇళ్ళల్లో నుండే బండినీ, అందులో ఉండే మనుషులనీ చూడటం రోజూ అలవాటు…
చుక్కమ్మ చక్కని లేలేత కూరలతో తట్ట దింపుకుని తనూ బండి దిగింది.. క్వార్టర్స్‌లో ఉండే మేమంతా
కూరలతో వచ్చే చుక్కమ్మ కోసం ఎదురుచూస్తూ ఉండేవాళ్ళం.. ఎందుకంటే ఆ ఊర్లో ఏ వస్తువులూ దొరికేవికావు.. చిమిడిపల్లి రైల్వేస్టేషనూ, క్వార్టర్సు మాత్రమే ఉండేవి.. ఏ సరుకులు కావాలన్నా అరకు వెళ్ళాల్సిందే అక్కడవారంతా.. కూరలూ అంతే.. అందుకని చుక్కమ్మ మూడు, నాలుగు రోజులకొకసారి ఎస్.కోట నుండి పాసింజర్‌లో కూరలు తీసుకునీ వచ్చి అమ్మేది.. ఆమె ఎంత రేటు చెప్తే అంతే – బేరాలు ఉండేవి కావు.. అంతెందుకు. అసలు తమ వరకూ కూరలు వస్తాయా. దార్లోనే కొనుబడి అయిపోతుందా అని ఎదురుచూసేవాళ్ళం.
అంత డిమాండ్ చుక్కమ్మ కూరలకు.
ఆరోజు బండి దిగి మా క్వార్టర్‌కు వచ్చేవేళకు తట్టలో ఇంకా చాలా కొద్దిగా మిగిలాయి కూరలు..
“ఏంటి చుక్కమ్మా!! తాజాకూరలన్నీ ఐపోయాయా.. ఎంపుళ్ళు అయ్యాక వస్తావెపుడూ ఇటు..”
వాడిపోయిన కూరలను చూస్తూనే మొహం వాడిపోయింది నాకు కూడా..
“ఏటీ.. మొన్న పాసింజర్‌లో మీ కోసం నేను కాకరకాయలూ, తోటకూర తీసుకొచ్చీ మీ ఇంటికాడ చూసేసరికి తాళంకప్ప. వైజాగు పోయినారట కదా. ఆ నీలమ్మ చెప్పినాది.. ఇయ్యాలకూడా ఉండరేటో అనుకుంటూనే -ఎందుకైనా మంచిదనీ మీకోసం అట్టేపెట్టాను”అంటూ గంప అడుగున చీరగుడ్డ తీసి, లేత బీరకాయలు, వంకాయలు ఇచ్చింది.. అవి చూడగానే ప్రాణం లేచొచ్చింది నాకు..
“అవున్లే. సడన్ గా మావగారికి బాగా లేదని కబురొస్తే వెళ్ళాం. ఆ మర్నాడే వచ్చేం.. సరే.. అన్నం తిందువు గానీ. ఆ మిగిలిన కూరలమ్ముకునీ రా.. అన్నట్టు చుక్కమ్మా నీకోసం చుక్కల చీర కొన్నాను.. ఇది నువ్వు మళ్ళీ వచ్చినపుడు కట్టుకునీ రావాలి. తెలిసిందా..” అంటూ చీర చేతిలో పెట్టాను. చీర చూస్తూనే కళ్ళు మెరిసిపోయాయి చుక్కమ్మకు.
ఆ వెంటనే మళ్ళీ మొహం మాడ్చుకుంటూ-“వద్దులేమ్మా. ఇట్టాటి సీరలు మేం కడ్తే – ఇంకేటైనా ఉందా.. ఉన్నోళ్ళంలా కనబడ్తే- కూరలు అమ్మలేం –వద్దమ్మా” అంటూ తిరిగి చేతిలో పెట్టింది చుక్కమ్మ..
“అదేంటి. అలా ఎవరడుగుతారు.. అంతా నీ భ్రమ. నువ్ కట్టే చీరకు, కూర కొనడానికీ సంబంధం లేదు.. నువ్ తీసుకోవాల్సిందే.. కట్టి నాకు చూపించాల్సిందే..” పట్టుబట్టాను.
“అమ్మా.. మీకు తెలీదమ్మా.. మావు ఇట్టాంటి సీరలూ, సోకులూ చేస్కోకూడదమ్మా..” అంటూ తను చెప్తున్నా.. నేను మాత్రం ఊర్కోలేదు.. అడవి లాంటి ఆ ఊళ్ళో కూరలు తెచ్చీ మాకు ఇంత అన్నం తినేలా చేస్తున్న చుక్కమ్మ రుణం ఎలా తీరేను! అందుకే ఆమెకీ చీర బహుమానం!! ఆమె ఈ చుక్కల చీరకడ్తే ఎంతందమో… మురిసిపోయాను…
***
అన్నట్టుగానే చుక్కమ్మ చుక్కలచీరతో – నెత్తిన గంప, చేతిలో మరో చిన్న గంపతో లేలేత కూరలతో బండి దిగింది.. చుక్కలా మెరిసిపోతూ…. కళ్ళ నిండా ఆనందం..
అలా చూసిన నాకు రెండు కళ్ళూ చాల్లేదు.. పల్లెపడుచు అందం- చీరకే వన్నె తెచ్చింది..
ఎప్పటిలాగే కూరలన్నీ అమ్ముకున్నాక 2 వి.కె. పాసింజర్‌కు తిరిగి వెళ్ళాల్సిన చుక్కమ్మ – ఆ రోజు వెళ్ళింది.. కానీ ఇంకెపుడూ తిరిగి కూరలతో చిమిడిపల్లి దిగలేదు..
ఆనోటా ఈ నోటా మాత్రం ఆరోజు చుక్కల చీరలో మెరిసిపోయిన చుక్కమ్మను తాగిన మైకంలో ఉన్న రైల్వే ఉద్యోగెవరో ఏదో చేయబోయాడనీ.. దాంతో భయపడిపోయిన చుక్కమ్మ చిమిడిపల్లికి కూరలు తేవడం మానేసిందనీ విన్నాను..
ఆరోజు బలవంతంగా నేను చీర ఇస్తుంటే “మావు ఇట్టాంటి సీరలూ-సోకులూ చేస్కోకూడదమ్మా” అని ఎందుకందో అపుడర్థమైంది నాకు.