Site icon Sanchika

54. అమ్మనే అలిగితే

[box type=’note’ fontsize=’16’] 2018 దీపావళి కథల పోటీకి వచ్చిన కథ. [/box]

[dropcap]సూ[/dropcap]ర్యుని కిరణాలు కళ్ళపై పడటంతో లేచి కూర్చున్నాడు విశ్వనాధం. ఎదురుగా గడియారం ఎనిమిది గంటలు చూపిస్తోంది. కనీసం భార్య మంగళ హారతి ఇచ్చేప్పుడో, రేడియోలో సుప్రభాతం వచ్చేప్పుడో మెలకువ రాలేదేంటి…. అవునూ.. ఈ వేళ రేడియో మోగడం లేదేంటి…. భార్య ఉంటే ఆరు నూరైనా రేడియో మోగాల్సిందే… కరెంట్ ఏమైనా లేదా…. పైన ఫాన్ తిరుగుతోంది అంటే ఉన్నట్లేగా…. సరే చూద్దాం అనుకుని బాత్రూం కెళ్ళి వచ్చి, ‘ఉన్నావా.. ఏయ్ నిన్నే….’ కొంచెం గట్టిగా పిలిచాడు. సడి లేదు.

పిలుస్తూ వంటింటిలోకి వెళ్ళాడు. అక్కడ లేదు. పెరట్లోకి వెళ్ళాడు లేదు.. హాల్, మరో బెడ్ రూమ్ దేవుడి గది అన్ని చూసాడు. ఎక్కడా లేదు. దేవుడి గదిలో పూజ ఎప్పుడో ముగించినట్లు దీపాలు కొండెక్క డానికి సిద్ధంగా ఉన్నాయి.

మనసెందుకో కీడు శంకించింది. రాత్రి జరిగిన సంఘటన కళ్ళ ముందు తిరిగింది.

‘ఇదిగో… నీకే చెప్తున్నా… రేపు మా క్లబ్ ఫ్రెండ్స్ అయిదుగురు వస్తున్నారు… చేపలు, మటన్ తెస్తాను. పది గంటల వరకు రెండు మూడు రకాలు రెడీ చెయ్….’

‘రేపోక్కరోజు వద్దండీ… శివునికి లక్ష పూల పూజ రేపటితో పూర్తవుతుంది. లలితా సహస్రం చదువుతాను శివపార్వతులకు నిష్టగా నైవేద్యం ఇవ్వాలి. నేనే పసుపు కుంకుమ వాయనాలిస్తాను. ఇంట్లో మాంసాహారం వద్దు.’

‘అదంతా ఏం లేదు…. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఊళ్ళో లేరు. ఇక్కడికొస్తారు అంతే….’

‘నేను రేపోక్కరోజు వద్దని చెబుతున్నా కదా… కారణం కూడా చెప్పా కదా… కావాలంటే ఎక్కడికయినా వెళ్లి పార్టీ చేసుకోండి… నేను వద్దనలేదు కదా…’

‘ఏంటి.. గొంతు బాగా లేస్తోంది… ఎక్కడికో వెళితే, ఎవరు వండి పెడతారు…’

‘హోటల్‌లో నుండి తెచ్చుకోండి’

‘నాకే ఉచిత సలహా లిస్తావా…. అక్కడి నుండి తెచ్చుకున్నాక నువ్వెందుకు ఉండి… చెప్పింది చెయ్..’ చెంప పై ఒక్కటిచ్చాడు. చెంప పై వేళ్ళు అట్లాగే ఎర్రగా తేలాయి. కోపంగా బట్టలేసుకుని వెళ్లి పోయాడు. ఫ్రెండ్స్‌తో తిరిగి హోటల్‌లో సుష్టుగా భోంచేసి వచ్చాడు. వచ్చేసరికి పన్నెండయ్యింది. అన్నపూర్ణ పడుకుని ఉంది. అతనికి తెలుసు ఆమె తినలేదని… అయినా అడగలేదు. గుర్రు పెట్టి నిద్ర పోయాడు.

అలా పడుకున్నది ఇప్పుడే లేవడం…. అయినా ఇలా కొట్టడం అతనికి కొత్తేమీ కాదు…. మరి ఎక్కడి కెళ్ళి ఉంటుంది. బజారుకెళ్ళిం …. ఇంతవరకెప్పుడు ఆమె ఒక్కతీ ఎక్కడికీ వెళ్ళదు. కొడుకుల దగ్గరకేమైనా వెళ్ళిందా… ఏమో…. ఫోన్ చేస్తే…. టేబుల్ పై నున్న సెల్ తీయ బోయాడు… దాని కింద రెప రెపలాడుతూ కనిపించింది కాగితం ….ఆశ్చర్య పోయాడు.

‘నాకు పెళ్ళయిన దగ్గర్నుంచి మీ దగ్గర భార్యగా కాక ఒక దాసిగానే బతికాను… పచ్చిగా చెప్పాలంటే, మీకు వండి పెట్టడానికి, మీకు సుఖాన్ని అందించడానికి ఒక పని మనిషిని కట్నం తీసుకుని మరీ తెచ్చుకున్నారు. నాకు భోజనం పెట్టి నందుకు సరిపడా సేవలు మీకు అందించాను. పెళ్ళయి ముప్పయి సంవత్సరాలు దగ్గరకొస్తున్నా, మీరింకా మారతారని చూసిన నా ఆశ అడియాశే అయ్యింది. అందుకే నేను వెళ్ళిపోతున్నాను. నా గురించి వెదకవద్దు. మీ గౌరవానికి, పరువు, ప్రతిష్ఠలకు భంగం కలగకుండా… మీరు ఎవరికీ ఏ రకంగా సమాధానం చెప్పుకున్నా నాకేం అభ్యంతరం లేదు.. మీ డబ్బు నేనేమీ తీసుకెళ్లడం లేదు. మీరు చేయించిన బంగారం కూడా ఇంట్లోనే పెట్టాను.  మా అన్నయ్య రాఖీకి, ఇంటికెల్లినప్పుడు ఇచ్చిన డబ్బులతో వెళ్ళిపోతున్నాను. నేను ఆత్మహత్య చేసుకునేంత పిరికిదాన్ని కాదు. మిగిలిన నా జీవితం నాకిష్టమైనట్లుగా గడుపుతాను.—సెలవ్-అన్నపూర్ణ’

హతాశుడయ్యాడు శివశంకర్. ఈ రకమైన తిరుగుబాటు అతను కలలో కూడా ఊహించనిది. మౌనంగా తనకు భయపడుతూ వొదిగి వొదిగి ఉండే పూర్ణేనా ఇలా వెళ్ళిపోయింది…. మెదడంతా మొద్దుబారింది . రేపు అటు బంధువులు, ఇటు చుట్టుపక్కల సమాజం ఏమంటుంది. అసలింత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది…. ఎక్కడికెళుతుంది. ఎప్పుడూ ఆమె పద మంజీరాల మృదుమధుర శబ్దంతో, కరములకున్న గాజులు చేసే చిరుసవ్వడితో అలరారే ఇల్లు ఒకేసారి బిక్కుబిక్కుమంటూ దేవత లేని ఆలయంలా బావురుమంటూ కళావిహీనమై వెలవెలబోతోంది. కాగితాన్ని పట్టుకున్న చేతులు సన్నగా కంపిస్తున్నాయి. అదేంటి….. ఎంతో స్ట్రాంగ్‌గా ఉండే తాను కేవలం భార్య లేకపోతే ఇంతలా బలహీనుడై పోయాడా…. రేపు అందరికి సమాధానం ఏమని చెబుతాడు..

సెల్ మోగడంతో వణికే చేతులతో తీసుకున్నాడు. “నాన్నా….. బావున్నారా….. ఒక్కసారి అమ్మకివ్వండి ఎదో వ్రతం గురించి మీ కోడలు అడుగుతుందిట……” పెద్ద కొడుకంటున్నాడు.

‘అ….మ్మ……అమ్మ…..మరే….లేదు……’

‘ఎక్కడి కెళ్ళింది….. స్నానం చేస్తుందా….. సరే అరగంట ఆగి చేయనా….’

 ‘లేదురా…. అమ్మ వెళ్లిపోయింది…..’

‘ఎక్కడికి….. ఎక్కడికెళ్ళింది నాన్నా’

‘మరే…. ఏమో…. ఎక్కడికెళ్ళిందో తెలియదు…’

‘నాన్నా… ఏం మాట్లాడుతున్నావు…. ఎక్కకెళ్ళిందో తెలియదా…… ఏమైంది….. చెప్పు … మళ్ళీ ఏమైనా గొడవ పడ్డారా….’

‘రాత్రి చిన్న గొడవ…..’

‘ఎప్పటి నుండి కనబడటం లేదు….. ఏమైనా చెప్పిందా… మీతో ఎక్కడి కెళ్తున్నానో చెప్పిందా….’

‘లేదు….. పొద్దున్న లేచేసరికి లేదు….. దీపం వెలిగించి వెళ్ళిపోయింది…..’

‘అదేంటి నాన్నా…. తమ్ముని దగ్గర కెళ్ళిందేమో ఫోన్ చేసావా……’

‘చేయలేదు….. ‘

‘నేను చేస్తాలే……. అక్కడికే వెళ్లి ఉంటుంది…. వాడంటే ప్రాణం కదా…’ పెట్టేసాడు.

ఐదు నిమిషాల్లో మళ్ళీ ఫోన్. ఈ సారి చిన్నోడి దగ్గరనుండి. ‘నాన్నా….. నాన్నా…. అమ్మ ఏమైంది నాన్నా… ఏమన్నావు నాన్నా మళ్ళీ….’ చిన్నోడు దరిదాపు అరుస్తున్నాడు ఫోన్ లో.

అంటే అక్కడికీ వెళ్లలేదని అర్ధమయ్యింది. చేతి నుండి సెల్ జారి పోయింది. పిచ్చివానిలా కిందనే కూలబడి పోయాడు.

బ్రష్ అందించే వాళ్ళు లేరు. కాఫీ ఇచ్చే వాళ్ళు లేరు. షుగర్ పేషంట్‌వి తొందరగా సమయానికి టిఫిన్ తినాలని హడావుడి పడుతూ వేడి వేడి టిఫిన్ ఇచ్చేవాళ్ళు లేరు. స్నానానికి నీళ్ళు కాగాయని తోడేవాళ్ళు లేరు. టవల్, బట్టలు అందించేవాళ్ళు లేరు. అసలు ఏం చేసినా అడిగేవాళ్ళు లేరు…. ఏం చేయక పోయినా అడిగేవాళ్ళు లేరు. బయట అరుగుపై రోజూ అన్నపూర్ణ అన్నం పెట్టె రెండు కుక్క పిల్లలు లోపలికి చూస్తూ అరుస్తున్నాయి. రోజూ జామచెట్టు మీది కొచ్చే పిట్టలు, తమకు గింజలు వేసే అన్నపూర్ణ కనబడక అటు ఇటు తిరుగుతున్నాయి. అన్నీ ఒకటికొకటి తోడుంటే, లోకంలో తానొక్కడే ఒంటరివాడయినట్లు అనిపించింది విశ్వనాధానికి.

సిటీ నుండి ఇద్దరు కొడుకులు భార్గవ్, భాస్కర్‌లు, కోడళ్ళు వారి పిల్లలు వచ్చేసారు. ఏమయ్యిందో అడిగారు. వెదకడం మొదలు పెట్టారు. విషయం బయటకు రాకుండా ఉండాలని నాన్నను తమతో పాటు సిటీకే తీసుకోచ్చేసుకున్నారు. వారం గడిచింది. ఎక్కడా ఆచూకీ లేదు. ఉత్తరం చూసారు. ఆత్మహత్యనయితే చేసుకోదని ఊపిరి పీల్చుకున్నారు.

అయినా ఎవరికీ మనసు మనసులో లేదు. విషయం తెలిస్తే చుట్టాల్లో, ఆఫీసుల్లో ఎంత పరువు తక్కువ…. అయినా అమ్మ తామంటే ఎంత ప్రాణమిచ్చేది…. అలాంటిది… తమతో కనీసం మాట మాత్రంగానయినా చెప్పకుండా ఎలా వెళ్ళింది…..

శివ శంకర్ అయితే గడ్డం పెరిగి మౌనంగా పిచ్చివాడిలా తయారయ్యాడు. ఆమె వెళ్ళిపోవడం అతనికి పెద్ద షాక్.

ఇంట్లో భార్యపై ఎలా పెత్తనం చేలాయించేవాడో…… అది కేవలం భార్య పై మాత్రమే, ఎవరూ పడరని అర్ధమయ్యింది. రోజు రోజుకీ తనని అందరూ ట్రీట్ చేసే విధానం అతని మనస్సుని ఛిద్రం చేస్తోంది. అయినా అందులో వాళ్ళ తప్పేమీ లేదు..

భార్గవ్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగి. భార్య కూడా మరో ప్రైవేట్ కంపెనీలో చేస్తుంది. కాబట్టి ఇద్దరూ పొద్దుటే టిఫిన్లు పెట్టుకుని, వాళ్ళు తయారై పిల్లల్ని తయారు చేసి, వారికి తినిపించి ఒకర్ని స్కూల్‌లో ఒకర్ని కేర్ సెంటర్‌లో వదిలి హడావుడిగా వెళ్లిపోతారు. ఆ హడావుడి బతుకులకు, విశ్వనాధం వచ్చేసరికి అతన్ని పట్టించుకునే తీరిక లేదు. ఏదో గోడకు పెట్టినట్లు ఫ్లాస్క్‌లో కాఫీ, టిఫిన్ ఇచ్చి వెళ్తుంది. వేళకు అన్నీ అమర్చే దిక్కు లేదు. బిక్కు బిక్కుమంటూ ఒక్కడు రోజంతా గడపాలి…. అపార్ట్‌మెంట్ కావడంతో ఇరుగు పొరుగూ లేరు.. దుర్భరమనిపించింది. నాలుగు రోజులు నాలుగు యుగాలుగా అనిపించాయి. ఉండలేక చిన్న కొడుకు భాస్కర్ వచ్చి తీస్కెళతానంటే అక్కడి కెళ్ళాడు.

ఇక్కడ కూడా కొడుకు పొద్దున్న 7 గంటలకల్లా ఆఫీస్ కెళ్ళి పోతాడు. చిన్న పాపను కేర్ సెంటర్‌లో వదిలి స్కూటీపై 9 గంటలకు కోడలు యూనివర్సిటీ కెళ్ళిపోతుంది. రోజంతా ఒక్కడు…. వూరు కాని వూరు… 24 గంటలూ తలుపులు బిగించుకుని ఒక్కడు టీవీ చూస్తూనో పడుకునో గడపాలి. చిన్న పాపతో కోడలు బిజీగా ఉంటుంది పైగా ఆ అమ్మాయి ప్రెగ్నంట్ కాబట్టి కొడుకే ఆమె కన్నీ చేసి వెళతాడు. ఆమె ‘మామయ్యా…. మీకేం కావాలన్నా చేసుకోండి. టిఫిన్ ఉంది. భోజనం తయారు చేసాను. కాఫీ కావాలంటే పెట్టుకోండి….’ అని అన్ని చెప్పి వెళుతుంది. ఎప్పుడు సందడిగా ఫ్రెండ్స్‌తో స్వంత వూర్లో వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు పలకరిస్తుంటే ఇంట్లోని కిరాణం షాప్‌లో కూర్చుని ఉండే విశ్వనాధంకు ఇది సహించ లేకుండా ఉంది. ఎప్పుడెప్పుడు అక్కడి నుండి బయట పడదామని ఉండేది. ఇలాంటి పరిస్థితి తెచ్చిన భార్యపై కోపం వచ్చేది. ఒక్కోసారి తనపై తనకే తన ప్రవర్తనకు అసహ్యం అనిపించేది. ఆమె తనను నొప్పించక ఎంత బాగా చూసుకున్నది. అక్కడున్న పది రోజులు పది యుగాల్లా నడిచాయి. అంతకు ముందు పిల్లల ఇండ్లల్లోకి వచ్చినా అప్పుడు ఎప్పుడైనా భార్యతో కలిసే వచ్చాడు. కాబట్టి ఇంట్లో లాగానే అన్నీ భయపడుకుంటూ వేళకు అందించేది. ఇక్కడ కూడా క్షణం ఖాళీ లేకుడా వడియాలు పెట్టడమో, అల్లం వెల్లుల్లి గ్రైండ్ చేయడమో… ఏవైనా జంతికలు చేసి పెట్టడమో…. అంట్లు కడగడమో… బట్టలు ఆరేయడం, మడత పెట్టడం ఇలా అన్నీ చేసేది. ఆమె లేని 10 రోజుల్లో ఆమె తనకెంత అవసరమో… ఆమె లేకపోతే తను ఎలా ఉండలేదో తెల్సిపోయింది అతనికి. ఇలా ఎంత కాలమో అర్ధమవలేదు. ఆరోజు ఆదివారం కావడంతో అంతా ఇంట్లోనే ఉన్నారు. అంతా ఆ రోజు పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇవ్వడమో, వెదకడమో ఏదయినా చేసి అమ్మ ఆచూకీ తెలుసు కోవాలని అన్ని సోర్స్ లు వెదకడం మొదలు పెట్టారు.

తమ వూర్లోనుండి వెళ్ళాలంటే వెళితే బస్సు లేదా రైలు. చిన్న వూరు కాబట్టి ఆ సమయానికి ఉన్న బస్సులు గానీ రైళ్ళు గానీ తెల్సుకోవడం కష్టం కాదు. అయితే ముఖ్య సమాచారం అక్కడి చాకలాయన ద్వారా తెల్సింది.

అక్కడికి కొడుకులు వచ్చినప్పుడు చాకలాయన, ‘ఇదేన్దయ్యగారూ…. చిన్నయ్యగార్లు ఇక్కడి కొస్తే అమ్మేమో రైల్వే స్టేషన్‌కు వెళ్ళింది..’ అన్నాడట. అప్పుడు అతని మాట విని వెళ్లి రైల్వే స్టేషన్‌లో వాకబు చేసారు కానీ అప్పుడున్న రైలు నెల్లూరు వైపు వెళ్ళేది అని తెలుసుకుని, అసలు అమ్మకి ఆటు వైపే తెలీదు అటెందుకెళుతుంది, చాకలాయన ఎటు చూసాడో….. అసలే అతను తెలివితక్కువ వాడు అనుకుని వూర్కున్నారు.

కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే భాస్కర్‌కి ఒకసారి అమ్మ, పేపర్‌లో ‘అమ్మ’ అనాథాశ్రమం గురించి అడిగిన విషయం గుర్తొచ్చింది. ఒక రెండు నెలల క్రితం ఆ ఆశ్రమంలో నిస్వార్థంగా సేవ చేయడానికి ఎవరైనా ముందుకొస్తే ఫలానా సెల్ నంబర్‌లో సంప్రదించాలని రాసి ఉంటే, అది ఎక్కడ ఉందిరా…. ఎలా వెళతారు అంటూ అడిగింది. ‘నీకేందుకమ్మా…’ అంటే, ‘మనూర్లో ఎవరో అడిగారు.. చెప్పడానికి… ’ అన్నట్లు గుర్తు. ఏదో అనుమానంతో ఆ ఆశ్రమానికి నెట్‌లో నంబర్ వెదికి చేసాడు. అతని అనుమానం నిజమయ్యింది. పదకొండు రోజుల ముందర 50 ఏళ్ల ఆవిడ సేవ చేయడానికి వచ్చి చేరిందని చెప్పారు. వారు చెప్పిన పోలికలు అమ్మ పోలికలు కలిసాయి.

వెంటనే అందరూ కల్సి బయల్దేరారు.

ఆ గదిలో నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. అన్నపూర్ణ ఒక కుర్చీలో కూర్చోని ఉంది. చుట్టూ ఉన్న సోఫాలో కుర్చీల్లో విశ్వనాధం, భార్గవ్, భాస్కర్ అంతా కూర్చొని ఉన్నారు.

 నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ భార్గవ్ అన్నాడు’ అమ్మా… ఇదేమైనా బావుందామ్మా… ఎందుకలా చెప్పా పెట్టకుండా వచ్చేసావు….. నీకేం తక్కువయ్యింది..’

‘అన్నీ ఎక్కువే అయ్యాయి….. తట్టుకోలేక వచ్చేసాను……’

‘ఏంటమ్మా…. అలా అంటున్నావ్…. నాన్నతో గొడవైతే మేము లేమా మాకు చెప్పలేదు….  అయినా నాన్న కూడా బాగా బాధ పడుతున్నాడు…. అన్నట్లు ఆ రోజు నువ్విచ్చిన సలహా వల్ల మట్టి వినాయకుణ్ణి తెస్తే మన కాలనీకి ప్రథమ బహుమతి వచ్చింది. పైగా వరద బాధితులకు సహాయం చేసిన ఒకే ఒక కాలనీగా మన కాలనీ సెక్రెటరీ రేపు రాష్ట అవతరణ దినోత్సవం రోజున బహుమతి అందుకోబోతున్నాడు. అంతా  నిన్నే గుర్తు చేస్తున్నారు… నీకు సన్మానం… చేస్తానన్నారు’ భాస్కర్ అన్నాడు.

‘..నువ్వు కోరకుండానే చీరలు, బంగారం, నగలు అన్నీ కొనిపెట్టాను కదా… అదంతా నీపై ప్రేమ లేకనే చేసానా…. ఇక వచ్చేసేయ్…..’ విశ్వనాధం అన్నాడు.

మౌనంగానే ఉన్న అన్నపూర్ణను చూస్తూ, ‘అమ్మా… చెప్పమ్మా…. ఇంకా అలా మౌనంగా ఉంటావేం….. నీ మనసులో ఏముందో చెప్పు….. నీకు ఎందుకు బాధయిందో చెప్పు… మేమేవరమైనా నీ మనస్సును బాధ పెట్టామా…. చెప్పమ్మా… కోడళ్ళెవరైనా ఏమైనా అన్నారా…. ఏదైనా మాట్లాడమ్మా… నీ మనసులో ఉన్నది చెప్పక పొతే నా మీద ఒట్టే…’ భాస్కర్ వచ్చి అమ్మ కాళ్ళు పట్టుకుంటూ అన్నాడు.

కొడుకును అక్కున చేర్చుకుంటూ లేపి పక్కన కూర్చోబెట్టుకుంది. ఆమె కళ్ళ ముందు తను బాధపడ్డ కొన్ని సంఘటనలు కదలాడాయి.

‘ఏమండీ… కాఫీ తీసుకోండి…….’ పెళ్ళయి వారమయినా మాట్లాడక, అసలు ఒక మనిషి ఉన్నదనే గుర్తించనట్లు వ్యవహరిస్తున్న భర్త ను తనకు తానై మొదటి సారి పలకరించింది.

‘మా అమ్మ నిన్ను చేసుకోకపోతే చస్తానని బెదిరిస్తే చేసుకున్నాను… మరో సారి నా దగ్గరకు రావడానికి ప్రయత్నించకు…’ వేడి వేడి గ్లాసుని అలాగే విసిరి కొడుతూ విసురుగా వెళ్ళిపోయాడు.

చేతుల మీద…. మొహం మీద పడిన వేడి వేడి కాఫీ కన్నా అతని మాటలు, చేతలు మనస్సుని ఛిద్రం చేయగా హతాశురాలైంది.

తర్వాత అత్త ద్వారా, మిగతా వారి ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే అతను అంతకు ముందే ఎవర్నో ప్రేమించాడట. ఇరువైపులా వారూ ఒప్పుకోలేదు. ఈలోగా ఆమె వేరే వారిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయిందట.

అయితే ఇందులో తన తప్పు ఏం ఉందో అర్థం కాలేదు. మంచి కలవారింట పడింది, కూతురు జీవితం బాగుంటుంది అని శక్తికి మించి అప్పు చేసీ అన్నీ భారీగా జరిపించిన తల్లి తండ్రుల ఆనందాన్ని పాడు చేసి వారికి క్షోభ కలిగించడం ఇష్టం లేక, అక్కడి కెళితే ఈ విషయం బయట పడుతుందని ఎవరికీ చెప్పలేదు. అప్పటినుండి కేవలం దేవతలనే నమ్ముకుంది. అయినా ఆమె తప్పులేకుండా తిట్లు, తన్నులు తింటూనే ఉంది. మంచి సంబంధం అని తొమ్మిది తరగతి లోనే పెళ్లి చేస్తూ, అత్తగారింటిలో చదువు కుందువులే బిడ్డా అన్నాడు తండ్రి. కానీ ఇక్కడ చదువుకోవడానికి కాదు కదా ఎప్పుడైనా పేపర్ చదివినట్లు చూసినా కోపంతో చింపేసేవాడు. అతనికి తెలియకుండా దాచుకుని మరీ అతను లేనప్పుడు పేపర్ చదివేది. ఎదురుగుండా ఉండే గ్రంథాలయంలో నుండి పుస్తకాలు తెచ్చుకుని భర్త లేనప్పుడు, దుకాణంలో ఖాళీగా ఉన్నప్పుడు చదువుకునేది. ‘చిరిగినా చొక్కా నైనా తొడుక్కో కానీ పుస్తకం కొనుక్కో’ అన్న పంతులు గారి మాటలని గుర్తుచేసుకుంటూ తల్లిగారిచ్చిన డబ్బుల్ని గ్రంథాలయానికి అప్పుడో ఇప్పుడో కట్టేది.

రెండు ఏళ్ల తర్వాత ఆమె చేసిన పూజల మహత్యమో, అందరూ చేసిన బోధల ఫలితమో, వయసు పెట్టే బాధల ఫలితమో గానీ ఏదో అలా వయసు వేడి చల్లార్చుకునేవాడు.

‘నీ కోసమే కదా…. తిరుపతికి వచ్చింది…. అమ్మ నాన్న…. అక్క మేమంతా ఒక చోట ఉంటే, నువ్వెక్కడో ఉంటావేం… మాతో కల్సి రావాలని తెలీదా…. తప్పిపోతే ఎక్కడ వెదకాలి….. ’ వాళ్ళతో కల్సి తోసుకు రాలేక, చేతిలోని విష్ణు సహస్రనామాలు చదువుతూ కొంచెం వెనక బడిన ఆమెను అందరి ముందే కొడుతూ విసురుగా చేయిపట్టి బర బారా లాక్కెళ్ళాడు..

‘ఏయ్… ఏంటిది… ఇదేమైనా కూరేనా….. తినోద్దని చారెడు ఉప్పేసావా….’ కంచం ఆమె మొహం పైకి గిరాటేస్టూ ఎక్కడ పడిందో చూసుకోకుండా వెళ్లి పోయాడు.

‘ఇదేమైనా మనుషులు తినే కూరేనా….. ఇందులో అసలు వుప్పో కారమో ఉన్నాయా…. వొళ్ళు దగ్గర పెట్టుకునే చేస్తున్నావా….. ’ భయం భయంగా అతను ముద్ద నోట్లో పెట్టుకునే వరకు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని చూస్తున్న ఆమెను చూస్తూ పళ్ళెం ఎత్తేసి హుంకరిస్తూ వెళ్లి పోయాడు.

‘పిలుస్తుంటే పలకవే….. ఎంత కొవ్వెక్కిందే నీకు… అప్పుడే కళ్ళు నెత్తి మీదికెక్కాయా…. ఎన్నిసార్లు అరవాలి… ఏడ చచ్చావు…..’

‘మా ఫ్రెండ్స్ మందు పార్టీ కొస్తున్నారు…. చికెన్, ఫిష్ నాలుగు రకాలుగా చెయ్యమన్నానా…. రెండే రకాలు చేసావేం…. నువ్వసలు ఒక అమ్మకు, అయ్యకు పుట్టలేదే….. అయినా తిందామంటే లేనిట్లో పుట్టినదానివి నీకు ఈ పద్దతులన్నీ ఎలా తెలుస్తాయి…. మా ఫ్రెండ్స్ ముందు నాకు అవమానం చేస్తావా…’ జుట్టు పట్టి ఈడుస్తూ, కడుపులో కాలుతో తంతూ అంటుంటే, బాధతో లుంగచుట్టుకు పోయింది…

‘టిఫిన్ 7 గంటలకల్ల్లా తయారుగా ఉండాలని తెలీదా…. వాకింగ్ నుండి వచ్చి అరగంటయ్యింది… పూజ పూజ అని చంపుతున్నావు… నీకు పూజ లేకుండా చేస్తా చూడు..’ కోపంగా పూజ గదిలోని విగ్రహాలన్నీ చెరిపేస్తూ అరిచాడు.

‘ఎంత సేపయ్యింది తలుపు కొట్టబట్టి, గొంతు చించుకునేలా అరుస్తున్నాను…. ఎవడితో కులుకుతున్నావు… లం…. వాడ వాడంతా లేచింది…. నీకు మాత్రం తెలివి రాలేదా… ’ అర్ధరాత్రి 12 గంటలకు క్లబ్ నుండి వచ్చి తలుపు కొట్టి వాడ వాడంతా బయటకు వచ్చి చూస్తుంటే అందరిముందే గుడ్లురుముతూ, జుట్టు పట్టి కొడుతూ వీరంగం చేసాడు, వాంతులు అవుతున్నాయని వేసుకున్న మాత్రలో ఉన్న మత్తు మందు వళ్ళ వోల్లెరగక నిద్రపోయిన సంగతి తెలుసుకోకుండా, ప్రెగ్నంట్ అని కూడా చూడకుండా…

ఒకసారి బస్‌లో వెళుతుంటే అసలే రాత్రి అన్నీ సర్దుకుని పడుకునే సరికి 12 దాటినందుకో, పొద్దున్నే 4 గంటలే లేసినందుకో, బస్ కుదుపులు వుయ్యాలలా ఉంది జో కొట్టినందుకో గానీ నిద్ర తనకు తెలియకుండానే ముంచుకొచ్చింది. నిద్రలో తల వంగి అతని భుజం పై వాలిందేమో ….. తలను విసురుగా నెట్టేస్తే వెళ్లి బస్ కిటికీకి తగిలింది. దెబ్బకు తల మొద్దుబారింది. ఒక్క క్షణం గుండె ఆగింది, నిద్రలో ఈ అనుకోని పరిణామానికి.

ఇలా చెప్పుకుంటూ పొతే కోకొల్లలు…. తాను అనుభవించిన నరకం అంతా ఇంతా కాదు. ఇప్పటికీ అతనింటిలో ఉన్నాడంటే భయమే…. చిన్నప్పటి నుండి తండ్రి ఎప్పటికీ చెప్పే నీతి కథల ప్రభావమో…. ఆయన ప్రతి ఏడాది చలివేంద్రం పెట్టి, వారానికోసారి తమింటి దగ్గరలో ఉన్న అనాథాశ్రమంలో తనకు వీలైన సేవ చేసి రావడం వల్లనో గానీ తనకీ, పుట్టినందుకు సమాజానికి ఏదైనా మేలు చేయాలనే  సేవా భావం, భక్తీ బావం ఎక్కువ. కానీ పెళ్లితో అలాంటి ఆశలన్నీ అడియాశలయ్యాయి.

‘నీకు ఎప్పుడు చిన్నకొడుకంటేనే ఇష్టం. ఎప్పుడొచ్చినా వాడి దగ్గరకే వెళతావు. ఇక్కడ ఇద్దరు పిల్లలతో , ఉద్యోగాలతో మేము సతమతమవుతుంటే కనీసం ఎలా ఉన్నార్రా….. అనో వచ్చి నాలుగు రోజులు ఉంది పోదామనో ఉండనే ఉండదు’ పెద్ద కొడుకు నిష్ఠూరమాడడంతో ఒకసారి భార్గవ్ ఇంటికి వెళ్ళినది. అప్పుడు ఆ అపార్ట్‌మెంట్‌లో ఉన్నవాళ్ళంతా కలిసి తిరుమలలో సేవ చేయడానికి వారం రోజులు వెళుతున్నామని రమ్మన్నారు. కోలలతో దేవుడి ముందు ఆడటం కూడా తనకు చాలా ఇష్టమే. ఇక భర్త అనే యముడు లేడు కదా, పైగా ఆ అపార్ట్‌మెంట్‌ వాళ్ళు తనకు కొంచెం పరిచయస్తులే. కాబట్టి తోడూ ఉంటుంది అని కొడుకుతో చెప్పి సరే అంది. ఎంతో సంతోషంతో అన్నీ సర్దుకుంది. కానీ తీరబయల్దేరే రోజు బార్గవ్ కూతురికి జ్వరం. కోడలు తనకు ఆఫీస్‌లో లీవ్ పెట్టే వీలు లేదంది. ‘అత్తయ్య మరెప్పుడైనా వెళుతుంది, ప్రస్తుతానికి పాపను కనిపెట్టుకుని ఇంట్లో ఉంటుంది లే’ అనడంతో ఉత్సాహం అంతా నీరుకారి పోయింది.

‘అమ్మా నీ కెప్పుడు అన్నయ్య అంటేనే ప్రేమ. వాడి తరవాత వాడే సుకున్న బట్టలు వాడేసిన పుస్తకాలు, సైకిల్ నాకిచ్చినట్లే, వాడి దగ్గర కెళ్ళాకనే నేను గుర్తొస్తాను. చిన్నవాళ్ళు….. వో పాపతో ప్రెగ్నంట్ ఎలా చేసుకుంటుందో అనైనా ఉండదు…’ చిన్న కొడుకు అలగడంతో పెద్ద కొడుకు ఇంటి నుండి మళ్ళీ తమింటికి వచ్చి పది రోజులు లేకపోవడంతో అస్తవ్యస్తంగా ఉన్న ఇంటిని శుభ్రం చేసుకుని ఇల్లంతా దులుపుకుని అన్నీ కడుక్కుని, కోడలికి  తినడానికి ఫలహారాలు తయారుచేసి మళ్ళీ రెండు బస్సులు ఎక్కి దిగి, చిన్న కొడుకింటి కోచ్చింది. ఆమెకు వాంతులవుతున్నాయని రెస్ట్ తీసుకొమ్మని ఇంటి పని అంతా మీదేసుకుని చేసింది. ఇంట్లో ఒక పెద్దావిడను ఆయాగా పెట్టుకున్నారు. ఆవిడ పాపకు సంబంధించి అంతా చూసుకుంటుంది. ఆమె అక్కడ ఉండగా తుఫాను వచ్చింది. పేపర్లలో, టీవీలో అక్కడి బాధాకరమైన దృశ్యాలు చూసి ఆమె కళ్ళు ఆగకుండా వర్షించాయి. ఇప్పుడు కొడుకు దగ్గరున్నప్పుడైనా మనమేం చేయలేమా.. అనుకుంది.. ఆలోచిస్తే ఆలోచన ఒకటి రూపు దిద్దుకుంది. ఆ కాలనీ అందరూ వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా మీటింగ్ పెట్టుకున్నప్పుడు, కొడుకుతో పాటు తానూ వెళ్ళింది. మీటింగ్‌లో ఆ కార్యక్రమాలన్నిటి గురించి చర్చించాక, ఇంకా ఎవరైనా మాట్లాడతారా…. అని అడిగారు. అప్పుడు ‘నేనొక రెండు నిమిషాలు మాట్లాడవచ్చా….’ అని అడిగింది అన్నపూర్ణ.

‘అమ్మా…. నువ్వేం మాట్లాడతావు. నీకేం తెలీదు. పది మందీ నవ్వుతారు. వద్దు…’ అంటూ కొడుకు చిన్నగా, కోపంగా ఆమెతో అంటున్నా వినకుండా, ‘సభకు నమస్కారం. ఈ సభలో చర్చకు రాని నాకు తెలిసిన రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఒకటి వినాయకచవితి చాలా గ్రాండ్‌గా చేయాలని పెద్ద వినాయకుణ్ణి పెట్టాలని నిర్ణయించారు. అయితే ఆ వినాయకుడు మట్టితో చేసినదయితే మంచిదని అలా అయితే పర్యావరణ పరిరక్షణకు దోహదం చేసిన వాళ్ళమవుతామని నా అభిప్రాయం. ఎందుకంటే ప్లాస్టర్ అఫ్ పారిస్‌తో చేసిన విగ్రహాలు వాటికి వేసిన రంగులు అవీ రసాయనాలతో చేసినవి కావడాన అవి నిమజ్జనం చేసినపుడు ఆ నీటిలో ఉన్న జలచరాలకు, ఆ నీటిని వాడే మనకు ముప్పును కలిగిస్తాయి. వినాయకుల పోటీలో భారీ విగ్రహంగా మనకు పోటీలో బహుమతి రావడం కన్నా, సమాజానికి మేలు చేసిన సంతృప్తి రావడమే మిన్న అని నా అభిప్రాయం. అంతే కాదు, ఇలా మనం ముందు మొదలు పెడితే, అలా పిల్లలు కూడా అది మననుండి నేర్చుకుని తర్వాత కూడా ఇలాంటి సంస్కృతినే కొనసాగిస్తారు. నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు కాబట్టి అలా మనం మన భావి తరానికి దిశా నిర్దేశం చేసే అవకాశం దక్కుతుంది. ఇక రెండవది మానవ సేవయే మాధవ సేవ అన్నారు. మొన్న తుఫాన్ వల్ల అల్లకల్లోలమైన ప్రాంతాలను, ఇల్లు వాకిలీ కోల్పోయినవాల్లను, అయిన వాళ్ళను పోగొట్టుకున్న వాళ్ళను చూస్తున్నాం. అలాంటి వాళ్లకు మనకు చేతనైనంత సహాయం ఏదైనా చేస్తే మంచిదని నా అభిప్రాయం. ఒక్కరిగా చేస్తే ఆ ఉపకారం చిన్నగా ఉంటుంది. కానీ అందరం కలిసి కట్టుగా వస్తు రూపోణో, డబ్బు రూపేణో సహాయం చేయగలిగితే మంచిదని అనిపిస్తోంది. మీరూ ఆలోచించండి. ఎందుకంటే ఈ కాలనీలో ఉన్న వాళ్ళంతా అంతో ఇంతో ఉన్న వాళ్ళే. డబ్బుకు లోటు లేని వాళ్ళే. సమయం మాత్రం ఎవరికీ ఉండదు. కాబటి ఈ రెండు రోజుల్లో నేను అలాంటి ఏ సహాయం చేయాలన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు’ అంటూ కూర్చోగానే అంతా అభినందన పూర్వకంగా చప్పట్లు కొట్టారు. ఆ బాధ్యత ఆమెనే తీసుకోమ్మన్నారు.

అలా నాలుగు రోజులు మొత్తం కాలనీ అంతా తిరిగి పోగుచేసినవి ఆ రోజు కలెక్టర్ కార్యాలయంలో ఇచ్చి రావాలి. ఆ రోజు భాస్కర్ ఆయా జ్వరం అని రాలేదు. అన్నపూర్ణ తప్పనిసరై ఇంట్లోనే ఉంది పాపను కనిపెట్టుకుని ఉండమన్నారు. ఆ రోజు వరకే ఏవైనా విరాళాలు ఇవ్వదల్చుకున్నవారు ఇవ్వవచ్చు, అని ప్రకటన వచ్చింది. ఆ రోజు ఇవ్వకపోతే కాలనీ అందరి దగ్గర గొప్పలు పలికి తాము తినేసినట్లవుతుంది. అన్నపూర్ణ మనసు మనసులో లేదు. ఆరోజు సాయంత్రం అయినా కొడుకును తొందరగా రమ్మని వచ్చేంత వరకు కాలు గాలిన పిల్లిలా తిరిగి, కేవలం అరగంట ముందు వచ్చిన కొడుకుకు అవన్నీ ఇచ్చి పంపించింది అతనోచ్చెంతవరకూ తీసుకున్నారో లేదోనని టెన్షన్‌గా ఎదురుచూసింది.

ఇటీవలే జరిగిన బస్‌లో తలను విసిరి కొట్టిన సంగతి, ఇంట్లో మాత్ర వేసుకుని పడుకుంటే అందరి ముందు కొట్టిన విషయం కొడుకులతో చెప్పుకుని ఏడ్చింది, ఇక తానా బాధ భరించలేనని, నాన్నతో ఇక అక్కడికి తానూ వెళ్లనని. అయినా ఏ కొడుకూ ‘అయ్యో అమ్మా… మేము చిన్నప్పటి నుండి చూస్తున్నాము…. ఇంకా నాన్న మారలేదు. మేము నాన్న నడుగుతామనో…. నువ్వు బాధ పడకమ్మా…. మీకు మేము లేమా అనో ఒక్కరూ ధైర్యం చెప్పలేదు.’

మళ్ళీ భర్త రాగానే మారుమాట్లాడకుండా పంపించారు. అప్పుడే ఆమె మనస్సు ముక్కలయ్యింది. ఛీ…. ఏం బ్రతుకు… సిగ్గు విడిచి పిల్లల దగ్గ్గర విషయం చెప్పినప్పుడైనా ఒక్కరూ, నాన్నా ఇది తప్పు… మరోసారి ఇలా చేయకండి.. అని ఒక్క మాట మాట్లాడలేదు.

ఇప్పుడవన్నీ వాళ్ళ కళ్ళ ముందు పరిచింది. అంతా నేరం చేసినట్లు తలలు వంచుకున్నారు.

‘నా మనస్సు భాధపడ్డ సంఘటనలు చెప్పమంటే మచ్చుకు కొన్ని చెప్పాను. ఒక్కసారి మీరు నా స్థానంలో ఉండి ఆలోచించండి. నేను చేసిన పని తప్పా…. చిన్నప్పటి నుండి నేను కన్న కలలేవీ నేరవేర్చుకోలేక పొయాను. కనీసం ఈ జీవిత చరమాంకం లోనైనా నాకిష్టమైనట్లు నేను బ్రతికే వరమివ్వండి. నాకు నగలు నాణ్యాలు కావాలని నేనెప్పుడు అడగలేదు. అవి కేవలం ఆయన హోదాకు గుర్తుగానే చేయించారు. అంతేకానీ నాపై ప్రేమతో కాదన్ననది మీకంతా తెలుసు. మానవ శరీరం గరిష్టంగా 45 డే(యూనిట్ల) బాధను భరించగలదట. కానీ బిడ్డకు జన్మ నిచ్చేప్పుడు తల్లి యాభై ఏడూ ఏడు డే (యూనిట్ల) నొప్పి భరిస్తుందట. అది 20 ఎముకలు ఒకేసారి విరిగితే పడే బాధకు సమానమట. అలాంటి  కొడుకుల ముందు ఒక్కసారి చెప్పడానికే నేను సిగ్గుతో కుంచించుకుపోయాను. కానీ అది వాళ్ళంత తేలిగ్గా తీసుకున్నాక ఎందుకు చెప్పానా అనిపించింది. అందుకే మీకెవ్వరికీ ఏ బాధలు పెట్టడల్చుకోలేదు. నేనేవ్వరికీ భారం కాదల్చుకోలేదు. దయ చేసి నన్నిలా వదిలెయ్యండి’ చేతులు జోడించి తలను చేతులపై వంచుతూ అంది అన్నపూర్ణ.

‘అలా అనకు పూర్ణా….. నిన్ను బాధ పెట్టిన మాట నిజమే. కానీ నువ్వు లేక నేనుండలేను…. నన్ను క్షమించు. ఇక నీ మనస్సు నొప్పించకుండా చూసుకుంటాను. నువ్వు ఏమేం చేయాలనుకున్నావో ఇప్పుడు అక్కడికొచ్చి అవన్నీ చేసుకో. కానీ రానని మాత్రం అనకు….. దయ చేసి నన్నుక్షమించు..’ కన్నీళ్ల పర్యంత మయ్యాడు విశ్వనాధం, ఆమె చేతులు పట్టుకుంటూ.

‘అమ్మా…. అలా అనకమ్మా…. ఏదో మా బిజీ లో ఉండి మేము నిన్ను నీ బాధను పట్టించుకోలేదు. కానీ నిన్ను వదిలి మేము ఉండలేమమ్మా… మమ్మల్ని క్షమించి రామ్మా…’ .కొడుకులిద్దరూ కన్నీళ్ళతో తల్లి కాళ్ళు కడిగారు.

వీచే గాలి కూడా ఆమె తీర్పు కోసం చెవులు రిక్కించింది. ‘కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ, భోజ్యేషు మాతలతో పాటు ‘క్షమయా ధరిత్రీ’, ‘అమ్మ మనసు వెన్న’ కూడా తన ప్రతిరూపాలే అని నిరూపిస్తూ ఆమె చిరునవ్వు నవ్వింది. ఆ ఆశ్రమ ఆవరణలోనున్న గుడి జేగంటలు ‘శుభం’ అన్నట్లు మృదుమధురంగా మోగాయి.

Exit mobile version