[box type=’note’ fontsize=’16’] 2018 దీపావళి కథల పోటీకి వచ్చిన కథ. [/box]
[dropcap]‘ఓ[/dropcap]రి భగవంతుడా.. పిల్ల వళ్ళు మళ్ళీ యింత కాలిపోతోందేమిటీ! రెండురోజులే కదా అయింది, పదిరోజుల జ్వరం పిల్లను పీల్చి పిప్పి చేసి వదిలితే, ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ దురాశ తమను పీల్చి పిప్పి చేసి వదిలింది, యిప్పటికి వారం రోజులుగా తను సెలవులో ఉంది, మొదటి నాలుగు రోజులూ రాత్రి డ్యూటీ చేస్తూ, పాపం పగలంతా పాపను చూసుకున్నాడు రఘు.. ఎంతకూ తగ్గకపోతే హాస్పిటల్‌లో చేర్పించి, రఘుని వారించి, తన పై అధికారిని బ్రతిమలాడి ఓప్పించి తను సెలవు పెట్టింది.
తిరిగి డ్యూటీలో చేరిన తనను భుజంపై చేయి వేసి మరీ ఓదార్చిన ఆ త్రాష్టుడి ముఖం గుర్తుకొచ్చినప్పుడల్లా ఒళ్ళు మండిపోయి వాడి మీద పెట్రోల్ పోసి తగలపెట్టాలన్నంత కోపంతో రగిలిపోతోంది బిందు మనసు. తమ వయసు కంటే పెద్దపిల్లలున్న వాడి బుద్ది మాత్రం అంత చిన్నది పెట్టాడేమో ఆ దేముడు. అయినా తప్పదు తమవి తుమ్మితే ఊడిపోయేలాంటి ఉద్యోగాలు, తమ అవసరాలు అలాంటివాళ్ళకు అవకాశాలు అయ్యో పిల్లకు యింత జ్వరం పెట్టుకుని యిప్పుడీ ఆలోచనలేమిటీ? యిప్పుడు మాత్రం ఎంత ప్రాధేయపడినా సెలవు దొరకదు.. నిన్ననే తన సెక్షన్ ఆడిట్ మొదలైంది, వాడు యివ్వడు అన్నమాట అటుంచి అసలు తను అడగడమే తప్పు. యింక ఆలోచిస్తూ కూర్చోకుండా రఘుని లేపి పాప సంగతి చూసుకోమని తను ఆఫీసుకు పరుగెట్టాలి.’ బుర్రని అతలాకుతలం చేస్తున్న ఆలోచనలను పక్కకు నెట్టి రఘుని లేపి సంగతి చెప్పి తను ఆదరా బాదరా ఆఫీస్ కు పరిగెట్టింది బిందు.
సాయంత్రం ఎలాగైనా త్వరగా పని ముగించుకుని యిల్లు చేరాలన్న ఆలోచనతో యింక అన్నీ మరచిపోయి తన పనిలో పడింది బిందు. యిన్ని యీతిబాధల మధ్య భగవంతుడిచ్చిన వరం బిందుకు పనిలో పడితే యింక యీ ప్రపంచమే తెలియదు. మంచి నేర్పు, ఓర్పే కాక ఏ పనైనా చకచకా వేగంగానే కాదు సమర్ధవంతంగా చేసే బిందు అంటే యాజమాన్యానికి మంచి అభిప్రాయం ఉండడమే ఆమెనో విధంగా రక్షిస్తున్నాయి. అందుకే మిగిలిన వాళ్ళతో వేసినన్ని ‘వెధవ వేషాలు’ బిందుతో వెయ్యడు ఆమె బాస్.
***
ఇంట్లో పిల్ల వళ్ళు జ్వరంతో కాలిపోతోంది, స్పృహ లేకుండా పడున్న పిల్లను చూస్తే రఘుకు కాళ్ళూ చేతులూ ఆడడం లేదు. ‘ఓరి భగవంతుడా.. ఎందుకిలా పగబట్టి వేధిస్తున్నావు? పది రోజులక్రితం తనకూ, బిందుకూ కూడా ఆఫీస్‌లో బాగా ఆలశ్యం అయి చేసే ఓపిక లేక సగం, పిల్ల ఆకలితో ఉంటుందని సగం హోటల్ నుంచి టిఫిన్ తెచ్చుకు తిన్నందుకు తగిన శిక్షగా పాపకు వాంతులూ, విరేచనాలతో ఆసుపత్రి పాలై చావు తప్పి కన్ను లొట్టపోయినంత పని జరిగింది. అదే తిండి తిన్న తాము బాగానే ఉండి పిల్లకు ప్రాణం మీదకు రావడం ఏమిటో! అర్థం కాలేదు. డాక్టర్ మాత్రం పాప అర్భకంగా ఉండడం వలన రోగనిరోధక శక్తి లేకపోవడమే కారణం అన్నారు. అసలే అర్భకంగా ఉండే పాప ఆ దెబ్బతో మరీ నీరసపడిపోయింది.. దగ్గర ఉండి కనిపెట్టుకోడానికి వీల్లేని పరిస్థితి. ఇద్దరూ సంపాదనకు పరిగెట్టి పాపను అలక్ష్యం చేస్తున్నామా అన్న బాధ ఒక వైపు, దాని భవిష్యత్తు కోసమేగా ఇంత కష్టపడేదీ అన్న సమర్ధింపు మరోవైపూ. ఏమిటో ఈ జీవితాలు’ ఆలోచనల్లోంచి తేరుకున్న రఘు ఇల్లు తాళం పెట్టి, పాపను భుజాన వేసుకుని ఆఘమేఘాల మీద ఆటోలో ఆసుపత్రి చేరాడు. కేవలం రెండురోజుల క్రిందటే వేలకు వేలు సమర్పించుకుని అక్కడనుంచి బయటపడ్డా, చూడాలంటే మళ్ళీ ఎంత ప్రొసీజరో! పళ్ళబిగువున బాధనీ, కోపాన్నీ అణచిపెట్టి ఆ ఫార్మాలిటీస్ పూర్తిచేసి, డబ్బు కట్టినా మళ్ళీ తన వంతు వచ్చేవరకూ గంటలకొద్దీ నిరీక్షణ. ఓ పక్క పాప కాలిపోతున్న ఒంటితో స్పృహలేని స్థితిలో చావుబ్రతుకుల మధ్య భుజం మీద.. దేముడా పగవాడికి కూడా వద్దు ఈ దుస్థితి.
అంతలో అప్పుడే డ్యూటీకి వస్తున్న డాక్టర్ శ్రీకాంత్ చకచకా వెడుతున్నవాడల్లా చటుక్కున యిటువైపు చూడడం ఆ దేముడి దయే.
“అరే.. వాట్ మిస్టర్ రఘూ.. ఏమైంది పాపకు? మీరేమిటలా కూర్చుండిపోయారు? ఎమర్జెన్సీ ఫోన్ నంబర్స్ ఉన్నాయి కదా మీ ఫైల్ మీద, పోనీ యిక్కడకు వచ్చాకా అయినా ఆ విభాగానికి వెళ్ళక యిక్కడ కూర్చోడం ఏమిటీ? సరే పదండి, త్వరగా, నర్స్ వెంటనే అటెండ్ అవ్వాలి, పరిస్థితి విషమంగా ఉన్నట్లే అనిపిస్తోంది, ఆ.. రఘూ పాపకు బాగా తగ్గేకానే కదా వెళ్ళారు, ఏమైంది? ఎప్పటినుంచిలా?” వేగంగా నడుస్తూనే అటు నర్స్‌తోనూ యిటు రఘుతోనూ మాట్లాడుతూ అడిగేడు డాక్టర్ శ్రీకాంత్. అక్కడున్న అంతమంది డాక్టర్స్‌లో కాస్త మానవత్వంతోనూ, మంచి మనసుతోనూ మరబొమ్మలా కాక హృదయమున్న మనిషిలా స్పందించేది అతనొకడే.
“రఘూ, మిమ్మల్నే అడిగేది? ఏమంది, పాపకు ఎప్పటినుంచిలా ఉంది? “
మొదటిసారి అడిగిన వెంటనే రఘు ఆలోచిస్తున్నాడు.. బిందు ఏదో చెప్పింది, మంచి నిద్రలో ఉన్న తనను లేపి పాపకు బాగా లేదు వెంటనే ఆసుపత్రికి తీసికెళ్ళమని చెబుతూ, యింకా ఏదో చెప్పింది.. నిద్రలో ఉన్న తన బుర్రకు ఎక్కలేదు.. ఆ జ్ఞాపకం వచ్చింది .. అర్ధరాత్రి నుంచీ పాపకు పెద్ద పెద్ద వాంతులు అయ్యాయనీ.. తరువాత తెల్లవారుఝామునే కాస్త నెమ్మదించి పడుకుందనీ.. పాప పడుకుంది కదా అని తను లేచి పనులన్నీ చేసుకుని.. పాపకు నీరసం రాకుండా కాస్త పాలు పడదామని వచ్చేసరికలా ఒళ్ళు సలసలా కాగిపోతూ స్పృహలేని స్థితిలో ఉందనీ.. తను ఆఫీసుకి వెళ్ళడం తప్పనిసరి అనీ.. ఆ అదీ గుర్తొచ్చింది.
అదే విషయం గబగబా డాక్టర్ కు చెప్పేసాడు రొప్పుతూ, గబగబా నడవడం .. వలన వచ్చిన ఒగుర్పుతో.
“ఓ గాడ్.. వామిటింగ్స్ అయ్యాయా? అదీ చాలా సేపటిక్రింద అయి యిప్పుడు స్పృహలేకుండా యింత జ్వరంతో.. సంథింగ్ రాంగ్.. సస్పెక్టెడ్ ఫుడ్ పాయిజనింగ్!.. సరే వచ్చేసాం ఎమర్జన్సీ వార్డ్‌కు.. సిస్టర్ పాపనలా స్ట్రెచెర్ మీదకు పడుకోబెట్టు, ఆయన భుజం మీదనుంచి తీసుకుని.. రఘూ.. నేను చేయగలిగినదంతా చేస్తాను, ఆపైన భగవంతుడి దయ.. మీరు బాగా ఆలశ్యం చేసారు.. సరే .. మీరు అధైర్యపడకండి, కమాన్ సిస్టర్.. త్వరగా..” అంటూ పాపతో సహా లోపలికి వెళ్ళిపోయాడు.
అప్పటివరకూ పాప ఒంటి వేడి తన ఒంటిని కాల్చేసినా తన గుండె కొంచం చల్లగానే ఉంది.. పాప బ్రతికే ఉంది, పాపకేమీ కాదు అన్న తన ధైర్యాన్నీ, భరోసానీ డాక్టర్ వెడుతూ వెడుతూ అన్న మాటలు తన గుండెకు సెగలా తోచాయి.
ఫుడ్ పాయిజన్ అంటాడేమిటీయన? మామూలుగానే బయటవేమీ కొనిపెట్టం అలాంటిది యింత చచ్చి బ్రతికాకా బయటవేమీ పెట్టలేదే, ఖర్మకాలి ఒక్కసారి పెట్టినందుకే చచ్చినంత పనైంది.. అయినా ఏమైందీ పిల్లకు, అర్భకంగా ఉన్నా ఇంతవరకూ అనారోగ్యం అన్నది తెలియదే.. ఒకేసారి ఇలా ప్రాణం మీదకు రావడం ఏమిటీ? పోనీ అంటే బిందుకు ఒల్లమాలిన శుభ్రం, పాప వస్తువులు, బట్టలు అన్నీ ఎంతో జాగ్రత్తగా శుభ్రంగా ఉంచుతుంది, తినేదేదయినా శుచిగా వేడిగా పెడుతుందే తప్ప పొరపాటున కూడా పాపకు స్టేల్ ఫుడ్ పెట్టదే. ఆఖరుకు పళ్ళుకూడా గోరువెచ్చని నీటిలో ఉప్పువేసి శుభ్రంగా కడిగి తుడిచే పెడుతుందే, మరి యిదెలా? ఆలోచనలతో, ఆరాటంతో మనిషి నిలువెల్లా వేడెక్కిపోయాడు. యిప్పుడెలా? పాపకేదైనా జరిగితే తాము తట్టుకోగలమా? లేదు లేదు దేముడు దయామయుడు తమకంత శిక్ష వేయడు… చల్లగానే చూస్తాడు. పాప బ్రతుకుతుంది.. బ్రతుకుతుంది!
***
రెండు గంటల కాలం రెండు యుగాల్లా తోచింది రఘుకు.. యింతలో బిందు ఫోన్.. పాపను డాక్టర్ శ్రీకాంత్ ట్రీట్ చేస్తున్నాడనగానే.. బిందు నోటి వెంట ‘పోనీలెండి.. దేముడున్నాడు, యింక మన పాపకేం భయంలేదు తగ్గిపోతుంది.. మీరు కాస్త ఆ కేంటిన్‌లో ఏదైనా తినండి’. బిందు గొంతులో రిలీఫ్ చూసాకా రఘు ఫుడ్ పాయిజనింగ్ అన్న విషయాన్ని చెప్పలేక పోయాడు.
యింకో గంట తరువాత విషాద వదనంతో శ్రీకాంత్ బయటకు వచ్చి..”సారీ మిస్టర్ రఘూ, చాలా ప్రయత్నించా కానీ లాభం లేకపోయింది, బేబీ ఈస్ నో మోర్.. స్టమక్ వాష్ చేసాం, వాంతుల వలన బయటకు పోయింది పోగా యింకా కొన్ని చిన్న చిన్న ముక్కలు జీర్ణకోశంలో ఉన్నాయి, వాటిలోంచి కొంచెం పెద్ద ముక్క తీసి ఎనలైజ్ చేస్తే అది ఆపిల్ ముక్క. దానివల్లనే అని నా అనుమానం. పరీక్షకు లాబ్‌కు పంపాను.. సాయంత్రానికల్లా రిపోర్ట్ వస్తుంది.
కొంచెం ముందు తీసుకువస్తే బ్రతికించే అవకాశం ఉండేదేమో, కానీ యిప్పుడు దానిగురించి ఆలోచించే పనిలేదు.. పాపతో మీ అనుబంధం యింతవరకే అని మనసు గట్టి చేసుకోండి. మీ మిసెస్‌కు ఫోన్ చెయ్యండి, ఫార్మాలిటీస్ పూర్తి చేసి బాడీ తీసికెళ్ళచ్చు, మీతో ఎవరైనా .. ఎవరూ రాలేదు కదూ, యిప్పుడు ఎవరి హెల్ప్ అయినా తీసుకోండి. నాకే యింత బాధగా ఉంది.. మరి మీ పరిస్థితి.. ” ఆపై మాట పూర్తి చెయ్యలేక వెళ్ళిపోయాడు.
పాప యింకలేదు.. తమ కంటివెలుగు ఆరిపోయింది అన్న మాట తప్ప డాక్టర్ చెప్పిన ఏ ఒక్క ముక్కా రఘు బుర్రలోకి చేరలేదు.
రోజూ ఎన్నో కేసులూ, ఎన్నో మరణాలూ చూసిన శ్రీకాంత్‌కే మనసంతా బాధతో నిండిపోయింది.. అంతకు ముందు పదిరోజులుగా తనే ట్రీట్ చేయడంతో పాపతో కొంచెం అనుబంధం ఏర్పడిన శ్రీకాంత్ మనసుండబట్టక మళ్ళీ వెనక్కు వచ్చి శిలావిగ్రహంలా పాప మీద ఓ చేయి వేసి కూర్చుండిపోయిన రఘు పరిస్థితి అర్థం అయి అక్కడి ఫార్మాలిటీస్ అన్నీ తనే త్వరత్వరగా పూర్తి అయ్యేలా చూసి.. తనే రఘు సెల్ నుంచే బిందుకు మెసేజ్ పెట్టాడు, ‘పాపను యింటికి తెస్తున్నా, త్వరగా వచ్చెయ్’ అని. అలాగే అతని సెల్‌లో ఉన్న ఓ నంబర్‌కు కాల్ చేసి విషయం వివరించి.. రఘు ఒంటరిగా ఉన్న సంగతి చెప్పి అతని సాయం కోరాడు. అసలు నేటి కార్పొరేట్ వ్యవస్థలో యిలా స్పందించి యింత సాయం చేయడమే గొప్ప సంగతి.
ఎవరి ఏడుపులతో, పెడబొబ్బలతో ప్రమేయం లేకుండా జరగవలసిన తతంగం అంతా జరిగిపోయింది. రఘు షాక్‌లో ఉండి మరబొమ్మలా ఎవరు ఏది చెబితే అది చేస్తున్నాడే కానీ జరిగిన ఘోరం కానీ జరుగుతున్న తతంగం కానీ అతనిలో రిజిస్టర్ అవడం లేదు. బిందు అయితే ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయింది.
నాలుగు రోజుల తరువాత డాక్టర్ శ్రీకాంత్ నుండి ఫోన్. జరిగిన ఘోరానికి సంతాపం తెలియచేస్తూనే, దానికి ఆయన చెప్పిన కారణం వింటూనే నోట మాట రాలేదు రఘుకి. నిశ్చేష్టుడైన అతని నుంచి సెల్ తీసుకున్న అతని అన్న హరి ఆయన చెప్పినది వింటూనే అవాక్కయ్యాడు. టూకీగా దాని సారాంశం చెప్పాలంటే ‘పాప మరణానికి కారణం తనకు పెట్టిన ఆపిల్.. పండు తింటే ఫుడ్ పాయిజనా? అనకుండా సాంతం వినండి, పాప తిన్న ఆపిల్‌లో అధిక మోతాదులో కెమికల్స్ యింజెక్ట్ చెయ్యడమే, అది ఆ పండ్లను త్వరత్వరగా అసహజ పక్వం తేడానికీ, మంచి రంగూ, మెరుపూ కలిగి ఉండడానికీ అలా చేయడం వలనే అది విషపూరితమై యింత దారుణానికి కారణం అయింది. నిజానికి పండ్లనూ, కాయగూరలనూ త్వర త్వరగా పండేలాగా, ఎక్కువ తాజాగా కనబడడానికీ వ్యాపారులు రకరకాల మోళీళు చెయ్యడం ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. సాధారణంగా అది మనిషిని స్లో పాయిజన్‌లా అనారోగ్యాల పాలు చేస్తుందే కానీ ప్రాణాంతకం కాదు, కానీ మన దురదృష్టం కొద్దీ పసి ప్రాణం, దానికి తగట్టే అప్పటికే బాగా సిక్ అయి ఇంకా పూర్తిగా తేరుకోక పోవడం వలన ఆ వాంతులను తట్టుకుని నిలబడలేకపోయింది.. అందులోనూ రాత్రంతా వాంతులయిన పిల్లను వెంటనే తీసుకురాకపోవడం వలన బాగా డీహైడ్రేషన్‌కు గురి అయింది. ప్చ్.. జరగకూడనిదే జరిగిపోయింది.
విషయం తెలిసిన అక్కడున్న అందరూ నివ్వెరబోయారు. ‘పిదప కాలం వచ్చి పడింది, తినే తిండి… అదీ సహజంగా ప్రకృతి యిచ్చే పండ్లను కూడా కల్తీతో కలుషితం చేసేస్తుంటే, ఒక్క పండ్లనేమిటీ, పాలు, కూరగాయలూ, యిక మిగతా నిత్యావసర సరుకుల మాట చెప్పనే అక్కరలేదు..’ అంటూ ఎవరికి తోచిన వ్యాఖ్యలు వాళ్ళు చేస్తుంటే రఘు, బిందు మౌనంగా రోదించడం తప్ప ఏం మాట్లాడలేకపోయారు.
అప్రయత్నంగా బిందుకు ఆ రోజు రాత్రి అన్నం, పాలూ ఏమీ ముట్టని పాపకు మంచిమాటలు చెబుతూ, నీరసంగా వద్దని తోసేస్తున్న దానికి తను బలవంతంగా ఆపిల్ ముక్క తినిపించడం గుర్తుకువచ్చి.. ‘నేనే నా చేతులతో పిల్లకు విషం పెట్టి చంపేసానే’ అని అగ్నిపర్వతం బద్దలైనట్లు భోరున విలపించింది.
అక్కడే ఉన్న బావగారూ, తోటికోడలూ ఆమెను ఓదార్చారు. పిల్లను పుట్టాకా చూడని వాళ్ళు యిలా సాగనంపడానికి రావాల్సి వచ్చిందే అని కన్నీరుమున్నీరయ్యారు. రఘు, బిందులది ప్రేమ వివాహం. యిరువైపులా ఇష్టం లేకపోయినా కొద్దిమంది స్నేహితుల సమక్షంలో గుడిలో దండలు మార్చుకుని ఒకటైన వీళ్ళు యిరువైపు వాళ్ళకూ కాని వాళ్ళూ, లేనివాళ్ళే అయ్యారు. అన్నగారికి తమ్ముడంటే ప్రేమ ఉన్నా తండ్రి మాట జవదాటలేకపోయాడు. యిప్పుడింత కష్టం వచ్చిందే అని పరుగుపరుగున భార్యతో సహా వచ్చాడు.
అంత దుఖంలోనూ బిందు తటాలున లేచింది. బావగారి పిల్లలు తింటున్న పండ్లముక్కలనీ, యింట్లో ఫ్రిజ్‌లో ఉన్న పళ్ళన్నీ తీసేసి గబగబా చెత్తబుట్టలో పోసేసింది. అందరికీ ఆమె భయం, జాగ్రత్త అర్థం అయ్యాయి.
“ఏమ్మా! ఏమంటావ్ ఆ షాప్ వాడి మీద కేస్ వేద్దామా? అయినా నా దగ్గర కొన్నవే అని ఋజువేమిటీ అంటూ ఎదురు తిరిగితే? అయినా యిప్పుడు యివన్నీ సర్వసాధారణం అయిపోయాయి.. నాలుగు రోజులు గొడవలూ, అందుకునే ముడుపులు అందుకోగానే ఎక్కడివక్కడే సద్దుమణగడం .. ఎన్ని చూడడం లేదు.. ప్చ్.. యీ సమాజాన్నీ.. దేశాన్నీ ఎలా ఎవడు బాగుచేయగలడో అర్థం కావడంలేదు. యింత మంది అధికారులున్నారు, హెల్త్ ఇన్‌స్పెక్టర్లూ, క్వాలిటీ కంట్రోల్ మెజర్స్ గుడ్డూ, గుడుసూ ఎక్కడికక్కడ టిక్కులు టిక్కులే.. బొక్కలు బొక్కలే అన్నట్లు.. అన్నీ కల్తీలే.. నిత్యావసర వస్తువుల్లో కూడా కల్తీ.. తినే తిండీ, తాగే నీరూ, పీల్చే గాలీ అన్నీ కల్తీ.. అంతటా కల్తీ. అసలు ‘మనిషి ‘ మనసూ, బుద్దీ మొత్తం ‘స్వార్థం, దురాశ , అవినీతీ’ అనే కల్తీతో నిండిపోయాకా, ఏ మార్గంలో అయినా సంపాదనే ధ్యేయంగా అయిపోయాకా ఇంక ఎవరు మాత్రం ఏం చెయ్యగలరు? అయినా మీరెప్పుడూ అక్కడే తీసుకుంటారుగా మరి యిప్పుడే ఇలా జరిగిందంటే వాడు మాత్రం ఏం చేస్తాడూ, పై నుంచి వాడి కొచ్చే సరకు యిలాటిదని పాపం వాడికి మాత్రం తెలుస్తుందా? ఏమో అయినా ఆ డాక్టర్ ఫైల్‌లో అలాగే వ్రాసాము కావాలంటే వాడిని ‘స్యూ’ చెయ్యండీ అని చెప్పారుగా .. పోనీ అలా చేద్దామా? ” మళ్ళీ అడిగాడు.
“వద్దు.. మన రాత యింతే అని ఊరుకుందాము, వాడితో అల్లరిపడితే మహా అయితే నా చిట్టితల్లి ప్రాణానికి విలువకట్టి.. ఐదో పదో వేలు చేతులో పెడతాడు. వద్దు ..” మళ్ళీ ఉప్పెనలాంటి శోకం..
ఆ గర్భ శోకాన్ని ఎవరు తీర్చగలరూ? ఆ గాయాన్నిమానిపించే శక్తి ఒక్క కాలానికి మాత్రమే ఉంది.
***
ఎవరి పనులు మానుకు ఎవరు కూర్చుంటారు.. పది రోజులూ గడచిపోయాకా.. తమ్ముడికీ, మరదలుకీ మరోసారి ధైర్యం చెప్పి, వీలు చూసుకుని తమ యింటికి రమ్మని చెప్పి వెళ్ళిపోయారు.
రఘు గుండె రాయి చేసుకుని విధులకు వెళ్ళి వస్తున్నా బిందు మాత్రం పని మీద దృష్టి పెట్టలేకపోయింది. ఆమె పరిస్థితి అర్థం చేసుకున్న యాజమాన్యం సహృదయంతో జీతం లేని సెలవు మాత్రం మూడు నెలలు మంజూరు చేసి, మనసు కుదుటపరచుకుని విధులకు హాజరుకమ్మనీ, తన ఉద్యోగం తనకు ఉంటుందనీ లిఖితపూర్వకంగా హామీ యిచ్చింది. అది ప్రయివేట్ సంస్థ .. అలా చేయడం నిజంగా బిందుకు పెద్ద ఫేవరే.
రోజులు గడుస్తున్నాయి.. తన బిడ్డ నిండు నూరేళ్ళ జీవితాన్ని బుగ్గిపాలు చేసిన మహమ్మారి ‘కల్తీ’ .. ఏ విధంగా దానిని ఎదుర్కోవాలి, సమాధి చేయాలి. ఏది చేసినా అది తాత్కాలికమే, చేతులు తడపడం, కాసేపు మెలోడ్రామాలు, హైటెక్ డ్రామాలూ.. మరీ కాకపోతే మన రాజకీయ అవకాశవాదులు దానిని తమతమ స్వప్రయోజనాలకోసం ఒకరి పాలన మీద ఒకరు బురద చల్లుకుంటూ, మాటల యీటెలతో ఇష్యూ చేయడం. నాలుగు నాళ్ళ తరువాత అంతా యధాతథం. అది కాదు తనకు కావలసింది. బిందు బుర్ర అహర్నిశలూ దాని గురించిన ఆలోచనలే.
బిందు ఆలోచనలు ఫలించి ఒక బృహత్తర పథకం ఆమె మనసులో రూపుదిద్దుకుంది. అది ఎంతవరకూ అమలు జరపకలదూ, దాని ఫలితం ఎలా ఉంటుందీ అన్న దాని మీద ఆమె దృష్టి లేదు.. అసలు ముందు జనంలో అది నాటాలి.. నాటబడాలి.. ఎలా? ఎలా? కార్య ప్రణాలిక రూపకల్పన శ్రీఘ్రంగా అయిపోయింది. అంతే యిక వేరే ఆలోచన లేక రంగంలోకి దిగిపోయింది బిందు.
***
తను చెప్పదల్చుకున్నదీ, దాని మంచి చెడ్డలూ విపులంగా వ్రాసుకుంది.. ఒకటికి పది సార్లు వల్లె వేసుకుంది.. ఏ పనికయినా చురుకుగా, వేగంగా దూసుకెళ్ళేది యువతే.. కానీ మన దౌర్భాగ్యం కొద్దీ అలాంటి శక్తిని, మహా సైన్యాన్ని సమర్ధవంతంగా మలచలేక మన తల్లి తండ్రులూ, ఉపాధ్యాయులూ వాళ్ళను ఒక మూసలో.. భవిష్యత్తులో డబ్బు సంపాదించే యంత్రాలుగా మాత్రమే మలచ గలుగుతున్నారు. మంచి, మానవత్వం, నైతిక విలువలూ, సామాజిక చైతన్యం, సామాజిక బాధ్యతా యివేవీ నేర్వని మర యంత్రాలుగా మిగిలిపోతున్నారు. యింకా ‘డబ్బు చేసి’ కొందరూ ‘జీవితం మీద సరైన అవగాహన’ లేక కొందరూ, ఒత్తిడి తట్టుకోలేక యింకొందరూ మత్తులో మునుగుతూ తేలుతూ తమలోని శక్తిని నిర్వీర్యం చేసుకుంటున్నారు.. వాళ్ళందరినీ పోగేసి యువత తలుచుకుంటే సాధించలేనిదేమీ లేదని నిరూపించాలి. అలనాడు రామునికి మహాసాగరాన్నే దాటించిన రామదండుకు ఏమాత్రం తీసిపోని నా తమ్ముళ్ళూ, చెల్లెళ్ళూ.. వారి సాయంతో మాత్రమే అనుకున్నది సాధ్యం’ అన్న స్థిర చిత్తంతో గొర్రెల మందలాంటి జనాల మెదళ్ళలో ఆలోచన అనే ‘విత్తు’ నాటడానికి కంకణం కట్టుకుంది బిందు.
మొదట తమ యింటి దగ్గరలో ఉన్న ఓ కాలేజ్‌కు వెళ్ళికాలేజ్ యాజమాన్యం కాళ్ళావేళ్ళా పడి పిల్లలందరినీ ఓ చోట సమావేశపరచడంలో ఆమె సఫలీకృతురాలైంది. ఒక సోషల్ కాజ్ కోసం, సోషల్ రెస్పాన్సిబిలిటీ (సామాజిక బాధ్యత) తో ఆమె పడుతున్న తపన అర్థమైన ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఓ నోటీస్ ద్వారా అందరినీ సమావేశపు హాలులో చేర్చారు.
అసలే మన తెలుగు సినిమాలు చూసి రకరకాల హీరోయిజం చూపే కాలేజీ కుర్రకారు మొదట బిందు అందాన్ని మాత్రమే చూసి కుప్పిగంతులు, పాటలూ, యీలలూ, కేకలూ.. బిందు సహనంతో పిల్లల అల్లరి భరించే తల్లిలా మారింది.
తరువాత ఆమె అనర్గళమైన తన వాక్ప్రవాహంలో వారందరినీ ముంచేసింది. పది నిముషాల అలజడి తరువాత అక్కడంతా నిశ్శబ్దం..
అయితే ముందుగా ఆమె వారికి పరిస్థితి వివరించి.. “ఇష్టపూర్వకంగా, త్రికరణ శుద్దిగా చేసేవారుమాత్రం ముందుకు రండి, ఎటువంటి బలవంతం, మొహమాటం లేవు. దయచేసి దీనిని బహిరంగం చేయకుండా, అనవసరమైన ప్రాచుర్యం కల్పించకుండా.. నెమ్మదిగా చాపక్రింది నీటి చందంగా చెయ్యాలి.. దీనికి సహనం కావాలి, శాంతం కావాలి, అన్నిటికంటే ముందు త్రికరణ శుద్ధిగా యిది అమలు జరగాలనే అంకితభావం ఉండాలి.. ఇదొక యజ్ఞం.. నిశ్శబ్ద విప్లవం కావాలి.. జనాల మెదళ్ళలోకి దీని భావం, సారం యింకిపోవాలి.. ‘నాటబడాలి ‘ అప్పుడే వెంటనే కాకున్నా ఎప్పటికైనా, ఏదోనాటికి మొలకెత్తి.. మొక్కై.. పెరిగి పెరిగి మహా వృక్షం కావాలి.” ఆమె చెప్పిన విషయం, విధానం ఆ యువత మెదళ్ళలో బలంగా నాటుకున్నాయి అనడానికి నిదర్శనంగా.. మొదట తమ ఏరియాతోనే మొదలు.
ఏడింటిదాకా, ఒక్కోచోట తొమ్మిదింటిదాకా మంచం దిగని ప్రబుద్దులంతా బుద్దిగా ఉదయాన్నే లేచి .. ఫ్రెష్ అయి తలా కొన్ని కరపత్రాలూ, వాటితో బాటు బిందు యిచ్చిన సూచనల ప్రకారం విత్తనాలో, మొక్కలో తీసుకుని యిద్దరు ముగ్గురు జట్టుగా యింటింటికీ వెళ్ళి, ఓర్పుతో వాళ్ళని తమ మాటలు వినేలా చేసుకుని, నేర్పుగా యిప్పుడు చేయబోయే వాటి ఫలితాలు చెప్పి వాళ్ళలో ఆలోచనలు రేకెత్తించి.. యిప్పుడు సమాజంలో ఉన్న ఈ కల్తీ మహమ్మారిని వదిలించుకోవాలంటే, వాటి బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవాలంటే.. కష్టమైనా ఫలితాన్నిచ్చేది ఇద్దొక్కటే మార్గం.. ‘సోషల్ బాయ్‌కాట్.. సామాజిక బహిష్కరణ’ వినడానికిదేదో చాలా కష్టమైన పనిలా అనిపిస్తుంది, మొదట కానీ కొద్దిగా ఇష్టంతో ఆలోచనతో మొదలుపెడితే అదేమంత కష్టం కాదు అనిపిస్తుంది. చూడండి, మనం సామాన్యంగా తినేవి.. ముఖ్యమైన కూరలూ. పండ్లూ.. సరే పండ్లను పక్కన పెడదాం, కొంతకాలం అవి తినకపోయినా వచ్చే నష్టం ఏమీ లేదు.. త్వర త్వరగా ఫలసాయం పొందాలనే ఉద్దేశ్యంతో వేసే ఎరువులూ, పురుగుమందులూ ఆ పండ్లలో, కూరగాయల్లో ఉండే సహజసిద్దమైన పోషక విలువల స్థానే అనారోగ్యాలను కలిగిస్తున్నాయి అన్నది అందరూ అంగీకరించాల్సిన విషయమే. పైగా ఎందులో ఏ విషపదార్ధం ఉందో ఎవరికి తెలుసూ.. కాబట్టి నిత్యావసరాలైన పాలూ, కూరలూ.. మేము మీ అందరికీ అన్ని రకాల కూరగాయల మొక్కలూ, పాదులూ ఇస్తాము, కొద్ది పాటి జాగాలో, యిండ్లలో పెరిగేవే.. రోజూ ఉదయాన్నే మీరు పోసే చెంబుడు నీళ్ళు తప్ప ఏ ప్రతిఫలం ఆశించకుండా సాధ్యమైనంత త్వరలో మీకు కూరగాయలనందిస్తాయి. అయితే అందరింట్లో అన్నీ పెంచుకునే వెసులుబాటు ఉండకపోవచ్చు.. చక్కగా రెండు మూడు యిళ్ళ వారు కలిసి కొన్ని కొన్ని రకాలు పెంచుకుని, పంచుకోండి. ఎంత యింట్లో కాసినా రోజూ ఒకే రకమైన కూరలు తినలేము గనుక.. ఒకరి కూరలు వేరొకరితో మార్చుకోవచ్చు.. దీని వలన పురుగు మందులూ, కల్తీలు లేని తాజా కూరలు, అవి కూడా మనం పండించుకున్న మన పంట తినే ఆనందం మాత్రమే కాదు ఈ ప్రహసనంలో మనం ఒకరికొకరు దగ్గర అవుతాం.. రోజూ కాకపోయినా వారానికోసారయినా మనం యిడియట్ బాక్స్, అంతర్జాల సాలెగూడులో చిక్కుకున్న సాలీడుల్లా కాక, సాటివారితో కాస్త స్నేహం, మాటా మంతీ కలిపే చక్కటి అవకాశం కూడా కలుగుతుంది దీనివలన. పక్క యింటి , ఎదురింట్లో వారితో కూడా ముఖపరిచయమైనా లేకుండా మన నాలుగు గోడలమధ్యా మనకు మనమే వేసుకున్న ‘సాలిటరీ సెల్ ‘ బ్రతుకునుంచి విముక్తి.
‘మీకేమయ్యా.. బానే సెప్తున్నారు గానీ ఈ అపార్టుమెంట్ యిరుకు బ్రతుకుల్లో అయ్యన్నీ సాధ్యమా?’ ఓ పెద్దమడిసి ఆక్రోశం.
“సాధ్యమే.. అందుకే చెబుతున్నాం.. మా ఆలోచనలను మొదట మీ మెదళ్ళలో నాటి చూడండి.. అర్ధం అవుతుంది. అది కాస్త కష్టమే కానీ అసాధ్యం మాత్రం కాదని.. ఒక్కో ఫ్లాట్లో రెండు కుండీల్లో నాటుకోండి.. తలో రకం చొప్పున పంచుకుని పెంచుకోండి.. కలసికట్టుగా మనం కల్తీతో చేస్తున్న మౌన పోరాటం.. కొనేవాళ్ళు లేకపోతే ఎన్ని రోజులని వాళ్ళ సరుకు, అదీ నిలవ చేయలేని కూరగాయలూ, పళ్ళూ దాచుకోగలరు? వాళ్ళంతట వాళ్ళే దానికి కారణం తెలుసుకోడానికి పరుగులు తీయాలి. అలాగే ప్రతి పాల పేకెట్ యీ బ్రాండ్‌లో కల్తీ ఉంది, యిందులో లేదు అనే మాట లేకుండా అన్నింటిలోనూ కల్తీ జరుగుతున్న ఈ నేపథ్యంలో మనం వాటినీ, వాటినే కాదు.. హార్మోన్ యింజెక్ట్ చేసి అధిక పాలకోసం.. పిచ్చి పిచ్చి వేషాలేసి, పశువులకంటే హీనంగా అటు నోరులేని ఆ జీవాలనూ, యిటు వినియోగదారులనూ వేపుకు తింటున్న వాళ్ళకు కనువిప్పు కలిగేలా వాడకాలు మానేయండి.. మరి ఎలా అని అప్పుడే కంగారు పడకండి.. వాటికి ప్రత్యామ్నాయంగా మేము చుట్టుపక్కల పల్లెలలో తిరిగి మంచి రేటుకు కల్తీ, మోసం లేని నికార్సయిన పాలను పంపిణీ చేసేలా మేము ఏర్పాటు చేస్తాం. దయచేసి సహకరించండి. ముఖ్యంగా కారం, పసుపు, రవ్వలూ లాంటివి రెడీగా దొరుకుతున్నాయి కదా అని బోలెడు డబ్బుపోసి కొంటున్నాము అందులో ఎన్ని రకాలు ఎలా కల్తీ చేస్తున్నారన్నది ప్రత్యేకంగా చెప్పక్కరలేదు.. కొంచెం సమయం కేటాయించి ముడిసరకులతో వాటిని మనమే మిల్లు పట్టించుకుందాము.. సమయం లేదు అనకండి.. మన ఆరోగ్యం కోసం మనం ఆ మాత్రం సమయం నెలకోసారి వాడుకోలేకపోతే ఎలా? టీవీల ముందు, వాట్సాప్‌లతోనూ వృథాగా గడిపే సమయంలో కాస్త మనకోసం, మన యింటికోసం గడిపితే ఎంతో మేలు కదా. యీ యజ్ఞం మనందరికోసం.. మనం ఆ కల్తీ తిండి వలన ఆరోగ్యం, ఒక్కోసారి విలువైన ప్రాణాలు సైతం పోగొట్టుకుని కేసులూ, కోర్టులూ అంటూ తిరిగినా ప్రయోజనం లేదు.. ఎక్కడికక్కడే అమ్యామ్యాలు, అడ్డదారులూ అందుకే మనం ఆ దారి తొక్కం.. అసలు అలాంటి వాళ్ళ ఊసే ఎత్తం.. మన తిండి మనం కొంచెం సహనంతో, ఐకమత్యంతో పండిచుకుందాం.. కల్తీ మహమ్మారిమీద మౌన పోరాటం ప్రకటిద్దాం. వాటిని కొనకా, తినకా ప్రతిఘటిద్దాం.. అప్రకటిత నిశ్శబ్ద విప్లవం.. మన పనేదో మనది.. అంతే.. ఏమాత్రం పెదవి దాటినా దీనికి రాజకీయ రంగులద్దబడతాయి.. తస్మాత్ జాగ్రత్త.’ అతి కొద్ది కాలంలోనే యువత చేసిన ఈ యింటిటి ప్రచారం ఫల రూపం దాల్చి.. వ్యాపార రంగంలో అలజడులు లేస్తున్నాయి.. తాము ఎందుకు బహిష్కరించబడ్డామో తెలుసుకున్న తలలు సిగ్గుతో దించుకున్నాయి.
అలా బిందు నాటిన విత్తు.. పెరిగి పెద్దదయి.. మహా వృక్షంగా కూడా మారబోతోంది.. ఒక ఏరియా చూసి మరొకరుగా సుమారుగా ఆ పట్టణమంతా అదే బాట పట్టారు. అలా.. అలా.. అలా.. అంతా.. మరింకెంత దూరం విస్తరిస్తుందో, కాలంతో బాటు నిలుస్తుందో .. ఏ ఆగ్రహాలకు కొట్టుకుపోతుందో కాలమే నిర్ణయించాలి.
ఆ రోజుకు సరిగ్గా ఓ ఏడాది .. ఆ చిన్న వయసులోనే తనకు తెలియకుండానే తనో మహా క్రతువులో భాగం అయినందుకు ‘పాప’ పెద్దగా నవ్వుతూ బిందు కళ్ళ ముందు నిలచింది.