Site icon Sanchika

57. క(ర)విత్రయం

2018 దసరా కవితల పోటీలలో సంచిక సంపాదకవర్గం వారి ప్రోత్సాహక బహుమతి పొందిన కవిత.

కం.
నన్నయ తిక్కన యెర్రన
పున్నెము సేయంగబుట్టె పంచమ వేదమ్.
పిన్నలు పెద్దలు మురియగ
విన్నను వినవలెను రీతి విందులనోసగెన్.

కం.
అమ్మకు కొమరులు మువ్వురు
కమ్మని కావ్యాన్నమింత కలిపిరి తినగన్
ఝుమ్మని మధువుప్పొంగెను
కమ్మలపై గంటమాడె కడురమ్యము గాన్.

కం.
పద్దెములు పనస తొనలై
పద్దెనిమిది పర్వములను పంచిరి తీపిన్
సుద్దులు నీతులు గీతయు
విద్దెలు వడ్డించినట్టి విస్తరి వేసేన్.

కం.
భారతి మానస పుత్రిక
భారతమై తెలుగునాట భాగ్యములొసగెన్
సారపు ధర్మము దెలిపిన
వీరుల కథ తెనుగు జేసె వీరులు కవులై

కం.
తెలుగింట వాణి కానుపు
వెలుగొందె కవిత్రయమై వేడుక మీరన్
వెలగించే రవిత్రయమై
పలురీతుల పటిమ జూపి భారతగాథన్.

Exit mobile version