Site icon Sanchika

57. స్నేయితం

[box type=’note’ fontsize=’16’] 2018 దీపావళి కథల పోటీకి వచ్చిన కథ. [/box]

[dropcap]శు[/dropcap]భకి చాలా కంగారుగా, బాధగా ఉంది. ఈ మధ్య స్వాతి ప్రవర్తన శ్రుతిమించుతోంది, క్లాసులకు రావడం పూర్తిగా మానేసింది. పోనీ ఒకసారి ఎలాగైనా నచ్చచెబుదాం అంటే అసలు తనకు అవకాశమే ఇవ్వడం లేదు, తనను తప్పించుకుని తిరగడం స్పష్టంగా తెలుస్తోంది. పోనీ ఆంటీకి చెబుదామన్నా ఆవిడ కూడా తనతో ఇదివరకులా ఉండటం లేదు. ఎప్పుడెళ్ళినా స్వాతి ఇంట్లో లేదు అని గుమ్మంలోంచే చెప్పేస్తున్నారు కనీసం లోపలికి కూడా రమ్మనకుండా. ఓ పక్కన పరీక్షలు దగ్గరకొస్తున్నాయి స్వాతి విషయం తన బుర్రను దొలిచేస్తుంటే చదువు కూడా సరిగా సాగడం లేదు.

కొన్ని నెలల క్రితం వరకూ తనూ స్వాతీ ఎలా ఉండేవారు… స్వాతికి ఆ పల్లవి బృందంతో స్నేహం కలిసిన మొదటి రోజులు గుర్తుకొచ్చాయి శుభకు …

“స్వాతీ… ఎందుకే ఆ పల్లవీ వాళ్ళతో తిరుగుతావ్? వాళ్ళకి అంత మంచి పేరు లేదు… అయినా అందరినీ నమ్మే కాలం కాదే ఇది…”

“అమ్మా సుప్రభాత సుందరీ, నీ పేరు ‘శుభ’ అని కాదే… ‘సుప్రభాతం’ అని పెట్టి ఉండాల్సింది. అయినా ‘పల్లవి’ మంచి పేరే కదే…” అల్లరిగా నవ్వింది స్వాతి.

“నీకు చెప్పడం నా బుద్ధి తక్కువ… కానీ ఒక్క మాట.. ఒక్కదానివీ మాత్రం ఆ గేంగ్‌తో వెళ్ళకు.. అంత మంచిది కాదు..”

“చా.. తప్పే.. కాస్త ఫాస్ట్‌గా ఉన్నారంటే వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడటమే… నువ్వూ అందరిలాగే… ” బాధగా అంది స్వాతి.

అమాయకత్వం, మంచితనం, అందం, గలగల లాడే స్వభావం ఉన్న స్వాతి అంటే చాలా ఇష్టం శుభకి… అది ఒక మహిళా కాలేజ్… కంప్యూటర్ బి.ఎస్.సి. మొదటి ఏడు చదువుతున్న వీళ్ళంతా ఒకజట్టుగా తిరిగినా… వీళ్ళిద్దరిదీ మరీ విడదీయలేని స్నేహం… ఎల్.కె.జి నుంచీ కలసి చదువుకున్న నేస్తాలే కాదు పక్క పక్క ఇళ్ళలో ఉన్నవాళ్ళు అవడంతో… ఎప్పుడూ జంటకవుల్లా కలిసే కనబడతారు.

“మన స్వర్ణ మేడం దగ్గర కొన్ని డౌట్స్ క్లియర్ చేసుకోవాలి… వస్తావా?.. అడిగింది శుభ.. స్వాతిని…

“అబ్బా.. ఇప్పుడా… బోర్.. తర్వాత వెళ్ళవే…”

“లేదు.. నా ఎసైన్మెంట్ పూర్తి చెయ్యాలంటే… ఆ డౌట్ తీరాలి… సరే… నువ్వు ఇంటికెళ్ళిపోతావా… వెయిట్  చేస్తావా?  “

“నేను ఇక్కడే వెయిట్ చేస్తా… నువ్వు వెళ్ళవే బాబూ… ఏదో రాసి పడేసేదానికి… డౌటూ… క్లియరూ అంటూ..” విసుగ్గా అంది స్వాతి.

“సరే.. నువ్విక్కడే కూర్చో… మళ్ళీ నే వెతుక్కోలేను…” అంటూ హడావుడిగా ఫేకల్టీ రూమ్స్ వైపు కదిలింది శుభ.

“ఏయ్ డాలీ… ఎప్పుడు చూసినా ఆ అమ్మమ్మతో ఏం తిరుగుతావ్ కానీ.. మంచి సినిమాకి వెడుతున్నాం క్లాసులు డుమ్మా కొట్టి.. మాతో రాకూడదూ?”

బొమ్మలా ముద్దుగా ఉంటుందని స్వాతికి ఆ గేంగ్ పెట్టిన ముద్దుపేరు ‘డాలీ’.

“ఏం సినిమా?”  కొంచెం ఉత్సాహం కనబడింది స్వాతి గొంతులో.

“ఆ…..  ‘సీతా రామ కల్యాణం…’ ఏం పేరు చెబితే గానీ రావా..? వెక్కిరింపుగా అంది పల్లవి..

రకరకాల మాడ్రన్ డ్రస్సుల్లో… స్టైల్‌గా, స్మార్ట్‌గా ఉంటూ ఎప్పుడూ సందడి చేసే పల్లవి అంటే స్వాతికి గొప్ప ఆరాధన… దానికి తోడు.. అబ్బాయిల కంటే జోరుగా, స్పీడ్‌గా బులెట్ బండి మీద తిరుగుతుంది.

“ఏమిటీ… వస్తానూ… రానూ అని చెప్పకుండా… అలా మౌనంగా ఉంటే ఎలా? మేం త్వరగా వెళ్ళాలి?” తన ప్రశ్నకి జవాబు చెప్పకుండా తన వైపే చూస్తూ ఉండిపోయిన స్వాతిని అడిగింది పల్లవి.

“కానీ శుభ స్వర్ణ మేడం దగ్గరకు వెళ్ళింది…” ఆ చెప్పడంలోనే… తనకు రావాలని ఉంది అని అర్థమైన పల్లవి… నవ్వుతూ.

“శుభ రాదు, నాకు తెలుసు… ఇంతకూ నువ్వు వస్తావా.. రావా? త్వరగా చెప్పు” బైక్ స్టార్ట్ చెయ్యబోతూ అడిగింది.

తను ఆలోచిస్తే వెళ్ళిపోతుందేమో అన్న భయం కలిగింది స్వాతికి, శుభకు తరువాత చెప్పచ్చులే… బయట తను కనబడకపోతే వెళ్ళిపోయిందనుకుని తనూ ఇంటికి వెళ్ళిపోతుందిలే అనుకుంటూ.. నాలుగడుగులు ఆమె వైపు వేసింది. విజయగర్వంతో కూడిన చిరునొవ్వొకటి మెరిసింది పల్లవి పెదవులపై.

“దివ్యా… నువ్వు అనిత స్కూటీ ఎక్కు…” తనవెనక కూర్చున్న అమ్మాయితో అంది.

పల్లవి బైక్ మీద కూర్చుని ఝామ్మని వెడుతూంటే కొత్తరకమైన ఉత్సాహంగా అనిపించింది స్వాతికి… అంతలోనే పాపం శుభ తనకోసం వెతుక్కుంటుందేమో అనిపించినా పల్లవి మాటలతో ఆ మాట మరచిపోయింది…. .బైక్ తిన్నగా మల్టిప్లెక్స్ ఐ మేక్స్ దగ్గర ఆగింది.

అప్పటికే అక్కడున్న అబ్బాయిలు “ఏయ్.. ప్రెట్టీ.. ఏమిటింత ఆలస్యం… షో మొదలయిపోతోంది.. త్వరగా పార్క్ చేసి రండి…” అనడం పల్లవితో అయినా, అందరి కళ్ళూ ఎవరీ కొత్త పిల్ల? అన్నట్లు స్వాతినే చూస్తున్నాయ్.

ఏదో సినిమాకి అంటే తన కాలేజ్ అమ్మాయిలే కదా అని వచ్చేసింది కానీ, తీరా ఇక్కడ ఇంతమంది అబ్బాయిలను చూస్తే బెదురు స్టార్ట్ అయింది.

అక్కడనుంచి వెళ్ళిపోదామా? అని కదలబోయిన ఆమెను “ఈమె స్వాతి.. మా క్లాస్ టాపర్, మంచి బ్రిలియంట్…” అంటూ వాళ్ళకు పరిచయం చేసింది పల్లవి…  స్వాతి చెయ్యి పట్టుకుంటూ.

“హాయ్… రండి రండి… షో స్టార్ట్ అయిపోయినట్లుంది…” అంతా లోపలికి వడివడిగా నడిచారు.

స్వాతికి ఎటూ వెళ్ళే ఛాన్స్ లేక వాళ్ళను అనుసరించింది, తన గురించి ఎందుకలా చెప్పింది? తనేం  టాపర్ కాదే క్లాస్‌లో అనుకుంటూ… అయినా ఆమెకు తనగురించి అలా చెప్పడం బాగుంది అనిపించింది…. అదే పల్లవికి కావలసింది.

అదో హిందీ మూవీ… ‘ఏ’ సర్టిఫికేట్ మూవీ… అంతా జంటలు జంటలుగా విడిపోయి ఆ పిక్చర్ తెగ ఎంజాయ్ చేసేస్తుంటే, తను ఎవరో ముక్కూ మొహం తెలియని అతని పక్కన కూర్చోవలసి రావడం… అలాంటి సినిమా చూడాల్సి రావడం.. తను అలా వచ్చి తప్పు చేసానా అన్న భావం కలిగింది స్వాతికి, లేచి వచ్చెయ్యబోతుంటే… పక్కనున్న అబ్బాయి గట్టిగా తన చెయ్యి పట్టుకు ‘కూర్చో’ అంటూ లాగడం… అంతా తనవైపు చూడడంతో భయమేసి కూర్చుండిపోయింది.

***

ఇక్కడ కాలేజ్‌లో… మేడం దగ్గర డౌట్స్ క్లియర్ చేసుకు బయటకు వచ్చిన శుభకు స్వాతి కనబడక.. చుట్టుపక్కల చూసి… బహుశా తనకు లేట్ అయిందని ఇంటికి వెళ్ళిపోయిందేమో అనుకుని తనూ ఇంటికి బయలు దేరింది. ఇంటికి వచ్చాకా స్వాతి ఇంకా రాలేదని తెలిసి కంగారు పడింది.

తన ఫ్రెండ్స్‌కు ఫోన్ చేసిన శుభకు స్వాతి, పల్లవి వాళ్ళతో కలిసి వెళ్ళిందని తెలిసి కంగారు పడినా… ‘ఏం జరగదులే… వచ్చేస్తుంది’ అని సర్ది చెప్పుకుని, వాళ్ళ అమ్మా వాళ్ళకూ ‘స్వాతి ఇంకో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిందట…’ అంటూ అబద్ధం చెప్పింది.

మొదట అనీజీగా అనిపించినా ఆ సినిమా, వాళ్ళ కంపెనీ స్వాతికి కొత్తగా అనిపించింది. రాత్రి ఇంటికి వచ్చినా మనసులో అదే భావన…. కొత్త ప్రపంచం… కొత్త ఉత్సాహం.

***

మర్నాడు ఉదయం.. కాలేజ్ టైంకి బయలుదేరి వచ్చిన శుభతో తనకు తలనొప్పి అనీ, రాలేననీ పంపేసింది, తనతో బయలుదేరితే, నిన్నటి సంగతి అడిగి తిడుతుందన్న భయంతో… బయటకు వచ్చాకా… సంగతేమిటో కనుక్కుని… వారిద్దామనుకున్న శుభకు ఆ అవకాశం ఇవ్వకుండా.

కానీ ‘కాలేజ్ డుమ్మా కొట్టి అంతా కలిసి గండిపేట పిక్నిక్ వెడదాం, నువ్వు కూడా రా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం…’ అంటూ చెప్పిన పల్లవి మాటలు… వద్దని గోలచేస్తున్న వివేకం పీకనొక్కి బయలుదేరేలా చేసాయి.

తమ ఇంటినుంచి కాలేజ్‌కి వెళ్ళే జంక్షన్‌లో తనకోసమే ఎదురు చూస్తున్న పల్లవి బృందాన్ని చూసి ఆశ్చర్యపోయిన స్వాతి… “అరె, నే రానన్నాగా… నా కోసం ఎందుకు వెయిట్  చేస్తున్నారు?” అంటూ అడిగితే… “నువ్వొస్తావని మాకు తెలుసు” అంటూ నవ్వేసింది పల్లవి.

అలా మొదలయింది స్వాతి వాళ్ళ జతలో చేరడం, శుభను తప్పించుకు తిరగడం… వాళ్ళతో ఉన్నంతసేపూ… తప్పనిపించినా, వెళ్ళకుండా ఉండలేని బలహీనత స్వాతికొచ్చేసింది.

సుమారు పదిరోజులలా గడచిపోయాయి… ఇంట్లో అందరి ఎదురుగా అడగలేక, శుభ తటపటాయించడంతో స్వాతికి ధైర్యం వచ్చేసింది. శుభకు ఒంటరిగా దొరకకుండా తప్పించుకు తిరుగుతోంది, కాలేజ్‌కు పూర్తిగా వెళ్ళడమే మానేసింది. ఇంట్లో మాత్రం కాలేజ్‌కని చెప్పి బయలుదేరి… రోజుకో చోటికి.. షాపింగ్, సినిమా… కొత్త ఫ్రెండ్స్ ఇళ్ళు… ఇలా.

కూతురిలో మార్పు స్పష్టంగా తెలుస్తోంది… తల్లికి, మరీ ముఖ్యంగా కూతురు శుభను తప్పించుకు తిరగడం.

“ఏమే… నువ్వూ… శుభా ఏమైనా గొడవపడ్డారా? అది కాలేజ్‌కి వెడదాం అని వచ్చినప్పుడు ఏదో వంక చెప్పి, తర్వాత ఒక్కదానివీ వెడుతున్నావ్?” అడిగింది ఆ రోజు యథాప్రకారం కాస్త ఆలస్యంగా బయలుదేరిన స్వాతిని.

గతుక్కుమన్న స్వాతి వెంటనే సర్దుకుని… “అబ్బే అదేం లేదమ్మా, ఈ మధ్య దానికి కొత్త ఫ్రెండ్స్ దొరికారు… నాకు వాళ్ళు నచ్చక… వాళ్ళతో కలవడం లేదు…” తన గురించి శుభ మనసులో ఉన్న మాట… అలా చెప్పేసింది అనాలోచితంగా.

అప్పటినుంచీ రోజూ తల్లికి శుభ మీద చిలవలూ… పలవలూగా ఏదో ఒకటి చెప్పి వాళ్ళకు శుభమీద ఉన్న సదభిప్రాయాన్ని పలచన చెయ్యడం మొదలుపెట్టింది. శుభ వాళ్ళ అమ్మా, నాన్నా వాళ్ల అక్క డెలివరీ అని వూరికి వెళ్ళడంతో అటువైపు నుంచి ప్రశ్నలూ తప్పాయి అలాగే తను శుభ మీద చెప్పే చాడీల గురించి వాళ్ళకు తెలిసే అవకాశం లేక,  తప్పించుకునే అవకాశం దొరికింది.

ఇదంతా శుభకు అర్ధం అవుతూనే ఉంది… కానీ తనని తప్పించుకు తిరుగుతున్న స్వాతికి ఏం చెప్పాలో?, ఎలా చెప్పాలో అర్ధం కాక, అటు వాళ్ళ వలన ఆమెకు ఏ ప్రమాదం జరుగుతుందో అనే భయం ఓ వైపు… పోనీ ఆంటీకి చెబుదామా? అంటే ఇన్నాళ్ళూ ఎందుకు చెప్పలేదు? అని తిడతారేమో అన్న భయం… మరో వైపు.. అశాంతిగా గడుస్తోంది కాలం… ఓ వైపు పరీక్షలు దగ్గరకు వస్తున్నాయ్… స్వాతి చదువు పూర్తిగా నిర్లక్షం చేసేసింది.

***

భయపడినంతా అవనే అయింది, ఆ రోజు ఉదయం అనగా వెళ్ళిన స్వాతి రాత్రి పది దాటుతున్నా ఇంటికి రాలేదు, తండ్రి ఆఫీస్ పని మీద ఊరెళ్ళాడు… అప్పటిదాకా ఎలాగో ఎదురుచూసిన తల్లి ఇంక ఆగలేక… శుభ దగ్గరకు వచ్చి ఏడుస్తూ విషయం చెప్పేసరికి శుభ కంగారుపడినా… తన కంగారు బయటపడితే… ఆమె మరీ భయపడుతుందని.

“మరేం ఫర్వాలేదాంటీ… ఏ ఫ్రెండ్ ఇంట్లోనో చదువుకుంటూ టైం చూసుకోలేదేమో, నే కనుక్కుని చూస్తాను.. మీరు కంగారుపడకండి…” అంటూ… తన స్నేహితులకందరికీ ఫోన్ చేస్తే… అనిత ఫ్రెండ్ చంద్రిక చెప్పిన విషయం విని ఆమె భయపడి వెంటనే తమ పిన్ని కొడుకు అయిన శేఖర్‌ని రమ్మని, అతనిని సాయం తీసుకు స్వాతి కోసం బయలుదేరింది.

ఆ రోజు పల్లవి స్నేహితుడు… అరుణ్ అనే అతని పుట్టినరోజు, పార్టీ గండిపేటలో వున్న వాళ్ళ ఫాం హౌస్‌లో అన్న విషయం విన్న దగ్గరనుంచీ శుభ మనసు మనసులో లేదు. విషయం మొదట్లోనే వాళ్ళింట్లో చెప్పేస్తే ఇంతవరకూ వచ్చి… స్వాతి ఇప్పుడు ప్రమాదంలో పడి ఉండేది కాదేమో? దాన్ని ఇంట్లో ఏమైనా అంటారన్న భయంతో విషయం దాచి తప్పు చేసాను అన్న భావంతో ఏడుపు వచ్చేసిందామెకు.

శేఖర్ ఈ మధ్యనే పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో సెలెక్ట్ అయి ట్రైనింగ్ పూర్తి చేసుకు పోస్టింగ్ కోసం చూస్తున్నాడు, ఏడుస్తున్న శుభని కసిరి ‘ఇన్నాళ్ళూ ఆ అమ్మాయి చెడు స్నేహాలు తెలిసీ ఇంట్లో చెప్పక ఊరుకుని ఇప్పుడెందుకు ఏడవడం… అయినా వెడుతున్నాంగా ఏం జరగదులే … ఏడవకు’ అంటూ ఊరడించాడు.

తన బైక్ మీద  అక్కడకు చేరడానికి సుమారు గంట పట్టింది.

ఆ ఏరియాలో ఉన్న తన ఫ్రెండ్‌కి అల్రెడీ ఫోన్ చేసి అడ్రస్ కనుక్కోవడమే కాక అక్కడకు సాయం రమ్మని చెప్పడంతో, అతను అప్పటికే అక్కడకు చేరి… పరిస్థితి అంచనా వేసాడు.

పెద్ద సౌండ్‌తో మ్యూజిక్ సిస్టం పెట్టి… ఒళ్ళూపై తెలియకుండా డాన్స్ చేస్తున్నారు ఆడా మగా తేడా తెలియకుండా.. అప్పటికే అంతా బాగా తాగి ఉండడంతో సభ్యత ముసుగు జారిపోయింది… తాగనన్న స్వాతికి… ఆమెకిచ్చిన కోకోకోలాలో… లైట్‌గా కలిపేసి ఇచ్చారేమో… తనకీ కిక్ బానే ఎక్కినా… మీద పడుతున్న చేతుల్ని మాత్రం.. విదిలించి కొడుతూ అరుస్తోంది వద్దని.  ఆ సౌండ్లో.. ఆమె  అరచినా… ఏడ్చినా ఎవరికీ… వినపడదు, వినపడినా… అరణ్యరోదనమే. అక్కడ ఏమాత్రం గొడవచెయ్యకుండా… నిశ్శబ్దంగా శుభ చూపించిన స్వాతిని తనూ.. స్నేహితుడూ సాయంపట్టి… ఎలాగో బైక్ ఎక్కించి వెనక శుభ కూర్చుని గట్టిగా పట్టుకోగా అక్కడనుంచి బయటపడ్డారు. అక్కడి భాగోతం… పోలీస్‌లకు ఉప్పందించి.

అలాంటి స్థితిలో ఇల్లు చేరిన కూతురిని చూసి గుండె ఆగినంత పని అయిందామె తల్లికి…. శుభకూ, శేఖర్‌కూ కన్నీటితో థేంక్స్ చెప్పి స్వాతిని పడక చేర్చింది… కూతురిని క్షేమంగా ఇల్లు చేర్చిన భగవంతుడికి వెయ్యి దండాలు పెట్టింది.

మర్నాడు… ఫోటోస్ తో సహా పేపరుకెక్కిన ఆ ఫాం హౌస్… అందులో లీలలూ చదివిన స్వాతి భయంతో… దుఃఖంతో శుభను అల్లుకుపోయి ఏడ్చేసింది… “నన్ను క్షమించవే…” అంటూ.

ఒక మనిషి వ్యక్తిత్వం ఎలాటిదీ అనేది వాళ్ళ స్నేహితులను చూసి చెప్పచ్చు అని అంటారు. అది నూటికి నూరుపాళ్ళూ నిజం, చిన్నతనంలో స్నేహాలు మంచివో, చెడ్డవో చూసుకుంటే వాళ్ళు జీవితంలో సక్రమ మార్గంలోనే వెడతారన్న నమ్మకం ఉంటుంది.. తెలిసీ తెలియని వయసులో ఇలా మా స్వాతిలా చెడు వైపు, కొత్తదనం అంటూ వ్యామోహాలవైపు వెళ్ళినా నిజమైన స్నేహం వాళ్ళకు రక్షణకవచంలా నిలుస్తుంది.. కన్న మమకారంతో స్వాతి ఏం చెబితే అది నమ్మేసానే కానీ చిన్నప్పటి నుండీ తెలిసిన శుభ ఎలాంటిదో తెలియదా, అయినా నిజంగా స్వాతి చెప్పినట్లు శుభలో తప్పులుంటే అసలు అన్నిసార్లు ఇంటికెందుకు వస్తుందీ, కాస్త ఆలోచిస్తే తనకే అర్థమయ్యేది మార్పు శుభలో కాదు స్వాతిలోనే వచ్చిందనీ, అదే శుభని తప్పించుకుని తిరుగుతోందనీ.. తాము ఎంత దూరం పెట్టినా స్వాతిని కాపాడింది శుభ. తృటిలో తప్పిన పెనుప్రమాదం స్వాతి తల్లిలో పశ్చాత్తాపాన్ని కలిగించింది.

గుడ్డిగా కూతురు చెప్పిన అబద్దాలు నమ్మి చిన్నప్పటినుంచీ తెలిసిన శుభనే అనుమానించి దూరం పెట్టినా… పెద్ద మనసుతో  అంత సాయం చేసిన శుభని కన్నీళ్ళతో దగ్గరకు తీసుకుంది, మా స్వాతి అదృష్టవంతురాలు, హితం కోరేదే నిజమైన స్నేయితం.. అంటూ ఇద్దరినీ అక్కున చేర్చుకుంది ప్రేమగా.

Exit mobile version