Site icon Sanchika

58. అన్నదాత – సుఖీభవ

[box type=’note’ fontsize=’16’] 2018 దీపావళి కథల పోటీకి వచ్చిన కథ. [/box]

[dropcap]”సా[/dropcap]ర్ మీకు మొదటగా నా కృతఙ్ఞతలు… మీకు ఇలాంటివి ఇష్టం ఉండవని భాస్కర్ గారు చెప్పారు కానీ మీరు చేస్తున్నది తెలిసాక… ఇలాంటివి నలుగురికి తెలిస్తే వాళ్లకు ఇన్‌స్పిరేషన్‌గా ఉంటుంది అని నేనే ఆయన మిమ్మల్ని ఒప్పించే దాకా వదలలేదు… మీరు రెడీ అంటే ఇంటర్వ్యూ మొదలుపెడదాం” అన్నాడు రిపోర్టర్.

“పర్వాలేదు…. నాకు ఇలాంటివి ఇష్టం లేదు కానీ భాస్కర్ చెపితే కాదనలేక పోయాను.”

“మీకు ‘అన్నదాత… సుఖీభవ’ అన్న పథకం మొదలు పెట్టాలి అని ఎందుకు అనిపించింది. దీని వెనుక ఉన్న కథ ఏంటో కొంచెం వివరంగా చెప్పండి”.

“నేను ఒక రైతు కుటుంబంలో పుట్టాను. అమ్మ,నాన్నకు నేను ఒక్కడే సంతానం. ఆయన ఆ కాలానికి ఎం.ఎ. చదివిన ఆయనకు వ్యవసాయం మీద ఉండే మక్కువతో మా పల్లె లోనే ఉండిపోయారు. ఆయనకు జీవితంలో కొన్ని పద్ధతులు ఉన్నాయి. అవి ఎలాంటి పరిస్థితిలో కూడా మార్చుకునేవాళ్ళు కాదు. అందుకు ఆయనకు మొండివాడని, చండశాసనుడు అని కూడా పేర్లు ఉన్నాయి.

చిన్నప్పటి నించి ఆయన దగ్గర నాకు చనువు ఎక్కువ. ఆయన మాటలు వింటూ పెరిగాను కాబట్టి ఆయన మాటలకు నేను చాలా ప్రభావితుణ్ణి అయ్యాను. మనకు అన్నం పెట్టే భూమి  అంటే ఆయనకు చాలా గౌరవం. మిగతా పిల్లలు అందరూ మెడిసిన్, ఇంజనీరింగ్ అని పరుగులు పెడుతుంటే ఆయన ఆశయాలకు అనుగుణంగా నేను అగ్రికల్చర్ డిగ్రీలో చేరాను….. నేను అలా చేరతాను అన్న రోజు ఆయన కళ్ళలో ఆనందం నాకు ఇప్పటికి గుర్తే.

నేను అమ్మ, నాన్న మా పల్లె తప్ప వేరే ప్రపంచం తెలియకుండా పెరిగాను. పాటలు పాడడం కూడా నా కున్న ఒక హాబీ. బాగా పాడతాను అంటారు అందరూ…. అలా ఉన్న నేను కాలేజీ అనే సరికొత్త ప్రపంచం లోకి అడుగుపెట్టాను. మా కాలేజితో పాటు  చుట్టూ ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీ కూడా ఉండేవి. అందుకే చుట్టూ ఎప్పుడు స్టూడెంట్స్‌తో కోలాహలంగా ఉండేది.

నా జీవితాన్ని మార్చేసే సంఘటన నేను నా డిగ్రీ నాలుగో సంవత్సరంలో ఉండగా జరిగింది. నేను నా భార్య సరయును కలసిన రోజు. పండగ సెలవల తరువాత బస్టాండ్‌లో దిగిన నాకు అప్పుడే బస్సు దిగిన సరయు కలిసింది. అది చాలా తెల్లవారి కావడంతో బస్సు స్టాండ్ నిర్మానుష్యంగా ఉంది. ఆటోలు రిక్షాలు లేవు. ఉరి బయట ఉన్న మా హాస్టల్స్‌కి ఉన్న ఒక ఆటో లోనే ఇద్దరూ వెళ్లాల్సివచ్చింది .

తను పక్కనే ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలో కంప్యూటర్ ఇంజనీరింగ్ చదువుతోంది. తను చాలా అందమైనది. చాలా మందికి కలల రాణి. మా మూడు కాలేజ్‌లలో తానే అందగత్తె అన్నా అతిశయోక్తి  కాదేమో? తను నన్ను గుర్తుపట్టి మాట్లాడింది. “నా పాటలు అంటే తనకు చాలా ఇష్టం అని నన్ను ఇలా కలవడం తనకు చాలా సంతోషంగా ఉంది” అన్న మాటలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేసాయి. అంత అందమైన అమ్మాయి నన్ను అలా పొగుడుతుంటే నా కాళ్ళు భూమి మీద నిలువలేదు.

నేను మొదట్లో తన అందానికి ఆకర్షితుణ్ణి అయినా తన వ్యక్తిత్వం  నన్ను తనతో పీకల లోతు ప్రేమలో పడిపోయేలా చేసింది. ఒక ఆరు నెలలు మేము అప్పుడప్పుడు కలిసేవాళ్ళము. మా మధ్య స్నేహం బలపడింది. ఆ తరువాత ఒక రోజు నేను తనతో నా మనసులో మాట చెప్పేసాను. తను చెప్పిన సమాధానం నాకు ఇప్పటికి పదం పొల్లు పోకుండా గుర్తుంది.

“విశ్వం గారు…. మీరు చాలా మంచివారు… మీలాంటి వ్యక్తిని భర్త గా పొందే అమ్మాయి పెట్టి పుట్టిండాలి. నేను ఆ అమ్మాయిని కావడం నాకు ఇష్టమే కానీ మా నాన్న మాట కాదని నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుని ఆయన  మనసు నొప్పించలేను. ఆయన నాకు దేవుడి కన్నా ఎక్కువ. ఆయనకు నచ్చితే నేను మిమ్మల్ని చేసుకుంటాను.

ఆయన కులమతాల పేరుతో ప్రేమకు అడ్డుచేప్పే  ఛాందసుడు కారు. ఆయనకు నా భర్త ఇలానే ఉండాలని ఒక స్ట్రాంగ్ ఐడియా ఉంది. ఆయన మనసు నాకు బాగా తెలుసు అందుకే నేను నా పెళ్లి గురించి కలలో కూడా ఆలోచించలేదు. నేను ఆయనకు మీ గురించి చెపుతాను. ఆ తరువాత ఆయన ఇష్టం” అంది.

తనకు వాళ్ళ నాన్న మీద ఉండే ప్రేమ నన్ను కదలించివేసింది. ఒక నెల తరువాత వాళ్ళ నాన్న గారు నన్ను కలిశారు.

ఆయనను చూడగానే నా గుండె నోట్లోకి వచ్చినట్టు అయ్యింది. ఆయన చెయ్యత్తు మనిషి గుబురు మీసాలు అయన ఆకారం చూసి ఆయనతో మాట్లాడాలంటే ఎదుటివాళ్ళు కొంచెం జంకుతారు. ఆయన “నీ పేరు..” అన్నారు గంబీరంగా.

“విశ్వంభర్ అండీ… కానీ అంతా విశ్వం అంటారు… నేను అగ్రికల్చర్…” అని చెప్పబోతుంటే ఆయన ఇక చాలు అని సైగ చేసారు. నాకు అర్థం అయిపోయింది, నేను ఆయనకు నచ్చలేదు. ఇక సరయు నాకు దక్కదు అన్న నిర్ణయానికి వచ్చేసాను. అంతలో

“నీ గురించి అన్ని విషయాలు మా అమ్మ ఎప్పుడో చెప్పింది. నీ గొంతు విందాం అని నీ పేరు అడిగానంతే. చూడు బాబు విశ్వం, నాకు డొంకతిరుగుడుగా మాట్లాడడం చేతగాదు. మాకు సరయు ఒకటే పాప…. అదే మా ప్రాణం … మాకు కావాల్సింది తను సుఖంగా ఉండడమే. అన్నింటికన్నా ముందు నేను నీతో నా గురించి కొంచెం చెప్పాలి!

మా నాన్న చిన్నప్పుడే చనిపోయారు… మా అమ్మ చాలా కష్టపడి పెంచి పెద్ద చేసి నన్ను ఒక చిన్న ఉద్యోగంలో స్థిరపరచింది. నేను కష్టపడి ఆవిడను సుఖపెడదాం అనుకునేటప్పటికి ఆవిడ కన్ను మూసింది. నా కోసం అంత కష్టపడ్డ మనిషికి నేను ఏమీ చేయలేకపోయాను అనే భాద నన్ను కుదిపేసింది. ఆ భాద లో నేను ఉండగా మాకు సరయు పుట్టింది. నా ఆనందం అంతా ఇంతా కాదు. నన్ను వదలి ఉండలేక మా అమ్మే మళ్ళీ పుట్టింది అనుకున్నాను.

తాను పుట్టిన క్షణంలోనే నేను నిర్ణయించుకున్నాను ప్రపంచంలో ఉండే సుఖాలన్నీ తనకు ఇవ్వాలి అని. అందుకోసం  ఎంత కష్టమైన పడాలనుకున్నాను. నేను చేస్తున్న ఉద్యోగమే కాకుండా సైడ్ బిజినెస్ కూడా మొదలుపెట్టాను. ఏది చేసినా బ్రహ్మాండంగా కలసివచ్చింది…. అంతా నా తల్లి అదృష్టం.

ఇంకొకరు పుడితే మా అమ్మ మీద నాకు ప్రేమ తగ్గిపోతుందని అనుకునేవాణ్ణి. దేవుడు నా మాట విన్నాడేమో అందుకే మాకు అమ్మ తరువాత మాకు పిల్లలు పుట్టలేదు. తానే మా ప్రపంచం….. నేను ఏమి చేసిన తన కోసమే ఎప్పుడు ఏదయినా తాను అడగకుండా అమర్చిపెట్టడమే నాకు అలవాటు కానీ నేను తన పెళ్లి అనుకునేలోపే తను నిన్ను కావాలంది. నిన్ను నేను ఒక ప్రశ్న అడుగుతాను నిజం చెప్పు.”

“అడగండి సర్” అన్నాను మనసులో రేగుతున్న అలజడి పైకి కనపడకుండా.

“నువ్వు నా కూతురిని ఏం చూసి ప్రేమించావు?” అన్నారు చాలా గంభీరంగా .

“నేను మొదట తన అందానికే ఆకర్షితుణ్ణి అయ్యాను కానీ నేను తన వ్యక్తిత్వాన్ని చూసి ప్రేమించాను ఎంతగా అంటే తాను లేని జీవితాన్ని నేను ఉహించనుకూడా లేను. తనతో జీవితాన్ని పంచుకోవడం కోసం ఏం చేయడానికయినా  సిద్ధం. మీరంటే తనకు చాలా గౌరవం మీరు ఒప్పుకుంటే తప్ప తను నన్ను పెళ్లి చేసుకోదు…. దయ చేసి తనను నాకు దూరం చెయ్యొద్దు” అన్నాను వీలయినా  సౌమ్యంగా నాకు తన మీద ఉండే ప్రేమ ఆయనకు అర్థం కావాలని .

“నా కూతురికి కావాల్సింది ఇయ్యడమే ధ్యేయంగా పెట్టుకున్నాను…. తనేమో నువ్వే తన ప్రాణం అంది నేను మిమ్మల్ని ఎందుకు దూరం చేస్తాను. అవును మీ అమ్మ, నాన్న ఈ పెళ్ళికి ఒప్పుకుంటారా? ఎందుకడుతున్నాను అంటే వాళ్ళు నువ్వు వాళ్లకు దూరం కావడానికి నా కూతురు కారణం అనుకోకూడదు. ఆ చెడ్డ పేరు తనకు ఎప్పటికి రాకూడదు” అన్నారు కొంచెం బాధగా.

“ఆలా వాళ్ళు ఎప్పటికి అనుకోరండి. మా నాన్న, అమ్మ ఆ కాలంలోనే ప్రేమించి పెద్దలను ఒప్పించి మరి పెళ్లి చేసుకున్నారు. మీకు వాళ్ళు ఒప్పుకోరని సందేహమే వద్దు “అన్నాన్నేను స్థిరం గా .

“ఇంకొక విషయం నీతో మాట్లాడాలి” అన్నారు కొంచెం సందేహంగా.

“పర్వాలేదు చెప్పండి సర్ “అన్నాను ఆయన ఇంకేం అడుగుతారో నేను ఏమి చెప్పాలో అని.

“నువ్వు నీ చదువు అయ్యాక మీ పల్లెలో ఉండి వ్యవసాయం చేస్తావని చెప్పింది మా అమ్మ. బాగుంది నువ్వు చదివిన చదువు అదే కాబట్టి నీకు బానే ఉంటుంది కానీ కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివిన నా కూతురు ఆ పల్లెలో ఎం చేస్తుంది? తను ఉద్యోగం తప్పకుండా చెయ్యాలని కాదు చేసే అవసరం తనకు లేదు కానీ తను ఇంత కష్టపడి చదివిన చదువుకు తగ్గ ఉద్యోగం చేస్తే చూడాలని నాకు వాళ్ళ అమ్మకు ఎప్పటినించో కోరిక. నువ్వు ఒక సారి ఆలోచించు రేపు పిల్లలు పుట్టాకా… వాళ్ళ చదువు వాటి కోసం అయినా మీరు సిటీలో ఉండాల్సి రావచ్చు.

దీనికి నేను ఒక మార్గం చెపుతాను. నీ అభిప్రాయం బాగా ఆలోచించుకుని చెప్పు. నీకు ఆరు నెలలు సమయం ఇస్తాను. నువ్వు దీనికి ఒప్పుకున్నాకా నువ్వు ఈ విషయం గురించి మళ్ళీ ఎప్పుడు మాట్లాడకూడదు” అన్నారు .

ఆయన నాకు చెప్పిన పరిష్కరం నన్ను చాలా సంఘర్షణకు గురి చేసింది. ఆయన చెప్పిన మార్గంలో నేను వెళ్తే ఇన్ని రోజులు నేను చేసిన పనులకు అర్థం లేకుండా పోతుంది… చేయకుంటే నా ప్రాణం అనుకున్న సరయు దూరం అవుతుంది. ఇలాంటి ఒక  సమస్య ఎదురుకుంటానని నేను కలలో కూడా అనుకోలేదు.

ఆయన నన్ను నా చదువు అయ్యాక ఆయనతో పాటే ఉండి ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్ చూసుకోవాలి అన్న ఆయన షరతు నేను ఒప్పుకుంటే నేను ఇన్ని రోజులు నేను చదివిన చదువుకు అర్థమే లేకుండా పోతుంది. నా చదువు తరువాత నేను వ్యవసాయం చేస్తాను అని ఆశ పెట్టుకున్న అమ్మ, నాన్నకు ఏమి చెప్పగలను? అలా అని వాళ్ళ ఆశ  కోసం, నా  ఆశయం కోసం ప్రాణం కన్నా ఎక్కువ అనుకున్న  సరయును వదలుకోగలనా? అనేది మిలియన్ డాలర్ క్వశ్చన్. ఇంకా ఆరు నెలలు ఉంది ఈలోపు ఏదో ఒక దారి దొరుకుతుందని దేవుడి మీద భారం వేసాను.

ఆ ఆరు నెలలు నేను ఆయనతో పాటే నన్ను ఆయన బిజినెస్ డీలింగ్స్ కోసం తీసుకెళ్ళేవాళ్ళు. అపుడే పెరుగుతున్న సిటీ మార్కెట్ చాలా లాభాల్లో ఉండేది. అంత డబ్బు నేను జీవితంలో చూడలేదు. నాకు మొదటిసారిగా అనిపించింది ఎన్ని సంవత్సరాలు వ్యవసాయం చేస్తే ఇంత డబ్బు కళ్ళ చూడగలం.

నేను చిన్నప్పటి నించి డబ్బుకు ఎప్పుడు కష్టపడలేదు మేము ఉండేవాళ్ల కిందే లెక్క కానీ డబ్బు విలువ తెలియాలని అవసరానికి మించి డబ్బు ఇచ్చేవాళ్ళు కాదు. జీవితానికి సరిపడా డబ్బు కావాలి కానీ డబ్బే జీవితం కాకూడదనేది వాళ్ళ వాదన. అది పల్లెటూరు వరకు నిజమే కానీ ఈ సిటీలో ఏం చేయాలన్నా డబ్బు కావాలి. మా అమ్మ దొడ్లో కెళ్ళి కోసుకొచ్చే కరివేపాకు, కొత్తిమీర కూడా ఇక్కడ డబ్బు పెట్టి కొనాలి.

నా ఆలోచన విధానంలో చాలా మార్పు వచ్చింది. నేను ఆయన చెప్పిన దారిలోకి వచ్చేసాను. ఆయన నాకు ఆరు నెలలు ఎందుకో సమయం ఇచ్చారో? ఈ మద్యే అర్థం అయ్యింది. అలా ఆయనతో తిరిగి వ్యాపారంలో లోటుపాట్లు, మెళకువలు నేర్చుకున్నాను. నా స్వంతంగా డీల్స్ క్లోజ్ చేసే స్థాయికి వచ్చాను. నా డిగ్రీ కూడా అయిపొయింది, సరయు ఫైనల్ ఇయర్‌లోకి వచ్చింది. తనకు క్యాంపస్ సెలెక్షన్స్‌లో మంచి కంపెనీలో జాబ్ వచ్చింది. ఇక అమ్మ, నాన్నకు చెప్పడమే మిగిలింది. వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో కూడా నా ఊహకు అందడం లేదు .

సెలవులకు ఇంటికి వెళ్ళాను. అమ్మ మంచి మూడ్‌లో ఉన్నప్పుడు తనకు సరయు ఫొటో చూపించాను. సరయు అమ్మకు చాలా నచ్చింది. ఆ తరువాత వాళ్ళ నాన్న గారి షరతు గురించి చెప్పాను. మా అమ్మ ఆలోచనలో పడిపోయింది. నేను మటుకు అమ్మ చేతులు పట్టుకుని గారాలు పోతూ “అమ్మా… నువ్వేం చేస్తావో? ఎలా చేస్తావో? నాకు తెలియదు నాన్నగారికి చెప్పి ఒప్పించు… తాను లేకుండా నేను ఉండలేను. మా మంచి అమ్మవు కదా… నిన్ను ఇక ఎప్పుడు ఏమీ అడగను.. మా బంగారు అమ్మవు కదా… ప్లీజ్… ప్లీజ్” అన్నాను ఎంతయినా అమ్మ కదా కరిగిపోయింది.

మరుసటి రోజు నాన్న నన్ను పిలిచారు. నేను ఏం అంటారో అని భయపడుతూనే వెళ్ళాను. నాన్న మొదట సరయు ఫొటో చూసారు. ఒక రెండు నిముషాల తరువాత “అయితే నువ్వు సిటీ లోనే ఉండి అక్కడే బిజినెస్ చేస్తావా?” అని అడిగారు, ఆ అడగడం ఎదో నేను తప్పు చేస్తున్నట్టుగా కాక నా నిర్ణయం తెలుసుకోవడానికి అడిగినట్టే ఉంది. నాకు కొంచెం ధైర్యం వచ్చింది. “సరయుకు చాలా మంచి ఉద్యగం వచ్చింది… అది సిటీలోనే… రేపు పిల్లలు పుడితే వాళ్ళ చదువుకు కూడా కష్టం అని వాళ్ళ నాన్న గారి ఉద్దేశం…. ఇక్కడ అన్ని చూసుకోవడానికి మీరు ఉన్నారన్న ధైర్యంతో నేను సరే అన్నాను…. మీ మనసు భాద పెట్టి ఉంటే నన్ను క్షమించండి “అన్నాను.

“నీ భవిష్యత్తు నీకు నచ్చినట్టు ఉండాలి… నీ సుఖమే మాకు కావాలి. సరయు వాళ్ళ అమ్మ, నాన్నని రమ్మను… వాళ్ళు మన ఊరు ఇల్లు వాకిలి చూస్తారు. ఆ తరువాత అన్ని విషయాలు మాట్లాడుదాం” అన్నారు. ఆ నిముషంలో నా కన్నా అదృష్టవంతుడు ఈ ప్రపంచంలో లేడనిపించింది.

సరయు వాళ్ళ అమ్మ, నాన్న వచ్చి అన్ని మాట్లాడి వెళ్లారు. ఒక ఆరునెలల తరువాత మా పెళ్లి అంగరంగ వైభవంగా జరిగిపోయింది. మా పెళ్లి తరువాత తాను ఉద్యోగంలో చేరే వరకు అమ్మ, నాన్న వాళ్ళ దగ్గరే ఒక రెండు నెలలు ఉండిపోయింది. అది వాళ్ళను చాలా దగ్గర చేసింది. నా బిజినెస్ బాగా పుంజుకుంది.

మా మామగారు వాళ్ళు మమ్మల్ని తమతోనే ఉండమన్నారు. కానీ సరయు ఒప్పుకోలేదు. “నువ్వు అమ్మ, నాన్నను పల్లెను వదలి ఇల్లరికం వచ్చావు అంటే అది విని నేను తట్టుకోలేను” అంది. తనకు కొన్ని విషయాలలో నిర్దిష్టమైన అభిప్రాయలు ఉన్నాయి అవి ఎవరు చెప్పినా మార్చుకోదు. తనతో నా జీవితం నేను ఊహించిన దానికన్నా ముధురంగా ఉంది. నేను తనను పెళ్లి చేసుకోవడం నూటికి నూరుపాళ్లు సరియైనది అని రోజూ అనిపిస్తుంది.

మా అనురాగానికి ప్రతీకగా మాకు ఇద్దరు పిల్లలు శ్రీరామ్, సాధన వాళ్లతో పాటు నా బిజినెస్ కూడా విపరీతంగా పెరిగింది. నాకు తెలియకుండానే నేను నా మూలం మర్చిపోయి డబ్బు మనిషిని అయిపోయాను. కానీ సరయు ఏ మాత్రం మారలేదు. నేను ఏదన్న ఆడంబరంగా చేద్దామన్న అస్సలు ఒప్పుకునేది కాదు. అది నాకు అస్సలు నచ్చేది కాదు. తను నేను ఇంత సంపాదించినా తాను ఉద్యోగం మానలేదు.

పెద్దలు చెప్పినట్టు “పెరుగుట విరుగుట కొరకే” అని అది నా విషయంలో నిజం కావడం మొదలు పెట్టింది. అమెరికాలో ఆర్థిక మాంద్యం ఇక్కడ మార్కెట్‌ని కుదిపేసింది. అపజయం అనేది తెలియని నాకు అది తట్టుకోలేని పెద్ద దెబ్బ. నాకు ఎదురు దెబ్బలు తగిలే కొద్దీ నాకు విసుగు ఎక్కువ అయ్యింది. సరయు చెపుతూనే ఉంది “వ్యాపారం అన్నాక ఆటుపోట్లు తప్పవు…. మనకు తిండికి బట్టకు ఏ లోటు లేదు. ఒక సంవత్సరం కళ్ళు మూసుకో అన్ని సర్దుకుంటాయి. టెన్షన్ పడకుండా కొంచెం రిలాక్స్ కా” అని. తను చెప్పినంత సేపు బానే ఉండేది మళ్ళీ మామూలే.

విపరీతమైన నిరాశ నిస్పృహల మధ్య ఒక సంవత్సరం గడిచింది. కానీ పరిస్థితిలో ఏ మార్పు లేదు. ఇప్పుడిప్పుడే మారేటట్టు కనిపించలేదు. నాకు ఒక రకమైన డిస్పిరేషన్ వచ్చేసింది. అందరితో మాట్లాడడం మానేసాను. నాకు నేనే అందరికి దూరం అయ్యాను. ఇది సరయూను చాలా భాద పెట్టింది. తను నవ్వడం మర్చిపోయినట్టు అయిపొయింది. దానికి నేను కారణం అవుతానని కలలో కూడా ఊహించలేదు.

ప్రవాహంలో కొట్టుకుపోతున్న వాడికి చిన్న గడ్డిపోచ దొరికినా దాన్ని ఆధారం గా చేసుకుని పైకి రావడానికి ప్రయత్నం చేస్తాడు. నాకు అలాంటి ఒక అవకాశం వచ్చింది. నా స్కూల్ ఫ్రెండ్ ఒకడు తాను పనిచేస్తున్న మల్టి నేషనల్ కంపెనీ హై వే కాంట్రాక్టు చేస్తోందని వచ్చే హైవే పక్కన ఉన్న కొన్ని భూములను వాళ్ళు కొనాలని చూస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన లిస్ట్ ప్రకారం భూములను అమ్మడానికి రైతులను ఒప్పిస్తే వాళ్ళ రియల్ ఎస్టేట్ కంపెనీలో పార్టనర్‌షిప్ ఇస్తారని చెప్పాడు.

నేను చిన్నప్పటి నించి ఏ ఆశయాల నీడలో పెరిగానో వాటి గొంతు నులిమేసే వాళ్ళు అడిగిన పని చేయడం మొదలుపెట్టాను. నేను ఈ పని చేస్తున్నానని సరయుకు కూడా చెప్పలేదు. చెపితే నన్ను ఈ పనిని చేయనివ్వదని నాకు బాగా తెలుసు. ఒక్కొకటిగా నా లిస్టులో ఉన్న అన్ని డీల్స్ చేశాను చివరి రెండు మిగిలిపోయాయి. పేర్లు చూసి నేను ఆశ్చర్యపోయాను. అవి మా అమ్మ, నాన్నవి.

నేను ఉరికి బయలుదేరుతున్నాను, అది చూసి శ్రీరామ్, సాధన కూడా వస్తామని గొడవ చేసారు తీసుకువెళ్లక తప్పలేదు. సరయుకు ఆఫీస్‌లో ఏదో ఇంపార్టెంట్ పని ఉందని తను రాలేదు.

నా ఇష్టం కోసం నన్ను సిటీలో ఉండడానికి ఒప్పుకున్నవాళ్ళు నా కోసం, నా భవిష్యత్తు కోసం ఈ చిన్న పని చేయలేరా? అని ఒక ధీమాలో ఉన్నాను. రాత్రి భోజనాలు అయి పిల్లలు పడుకున్నాకా నేను, అమ్మ, నాన్న బయట వసారాలో కూర్చున్నాము. నేను గొంతు సవరించుకుని “నాన్నా… మీరు ఈ మధ్య పొలం ఏమన్నా కొన్నారా?” అడిగాను.

“అవును రా రామానాయుడు గారు ఆ పొలం అల్లుడికి కట్నంగా ఇచ్చారు. అది ఆ అబ్బాయి అమ్మేయాలనుకున్నాడు. ఎవరో కొంటే అక్కడ ఏం చేస్తారో అని నేనే కొన్నాను. నీకు నీ సమస్యలు చాలా ఉన్నాయి అని చెప్పలేదు” అన్నారు నాకు చెప్పనందుకు నేను భాద పడుతున్నానేమో అని.

“ఏదయితే ఏం లే నాన్నా… ఇప్పుడు ఆ పొలం బంగారం అయ్యింది. ఒక ఫారిన్ కంపెనీ వాళ్ళు దానికి మీరు అడిగిన రేటు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మీరు రేటు చెప్పండి నేను వాళ్లకు చెప్పి ఒప్పిస్తాను. వెంటనే రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం” అని ఆయన వైపు తిరిగాను. ఆయన ముఖం కోపంతో ఎర్రగా మారడం నాకు తెలుస్తూనే ఉంది. ఆయనను అంత కోపం గా నేను ఎప్పుడు చూడలేదు.

మనిషంతా అదిరిపోతూ “విశ్వం నువ్వు ఒక కొడుకుగా అమ్మా,నాన్నా ఎలా ఉన్నారో? చూడడానికి వచ్చావ్ అనుకున్నాను… నా పొలం కొనే మధ్యవర్తిగా వచ్చావని చెప్పి వుంటే నా సమాధానం ఆ రోజే చెప్పేవాడిని.”

“ఏమని నాన్నా?”

“నాకు పొలం అమ్మే ఆలోచన ఏ మాత్రం లేదని.”

“ఇంత మంచి రేట్ వస్తుంటే ఎందుకు వద్దనుకోవాలి నాన్నా?”

“నేను జీవితం ఏ మాట అయితే నీ దగ్గర నించి వినకూడదు అనుకున్నానో అదే విన్నాను… ఇక ఈ విషయం ఇక్కడితో ఆపేయి” అన్నారు.

“ఎందుకు నాన్నా…. డబ్బు ఎవరికీ చేదు… ఈ డబ్బు బ్యాంకులో వేసుకుంటే మీరు ఉన్నంత వరకు ఏ పని చేయకుండా కాలు మీద కాలు వేసుకుని కూర్చోవచ్చు. ఇంకో ఇరవై ఏళ్ళు పంటలు పండించిన ఇప్పుడు వచ్చే డబ్బులో ఐదో వంతు కూడా రాదు. నేను మీ మంచికే చెపుతున్నాను నాన్నా” అన్నా నేను ఆయనను ఎలా అయినా ఒప్పించాలని.

“ఇందులో ఏం మంచి ఉంది. సంవత్సరానికి మూడు పంటలు పండే బంగారం లాంటి పంట భూమిని ఏ ఫ్యాక్టరీకో, ఏ హోటల్‌కో ఇచ్చేస్తే వచ్చే లాభం ఏంటి? చుట్టూ ఉన్న పొలాలు కలుషితం కావడం తప్ప. నీలాంటి వాళ్ళు వచ్చి డబ్బు ఆశ చూపించి పంట పొలాలను ప్లాట్‌గా మార్చేసి, లేకుంటే బిల్డింగ్స్ కట్టేసి అన్ని నాశనం చేస్తున్నారు. ఈ భూతం మన చుట్టూ పక్కల ఉన్న అన్ని ఊర్లని పట్టుకుంది. కుటుంబాలని వేరు చేస్తోంది. వ్యవసాయం తప్పితే వేరే తెలియని వాళ్ళను ఆటోలు నడుపుకునేవాళ్లను, కూలీలను చేస్తోంది.

“అన్నం పరబ్రహ్మ స్వరూపం” అని తినే తిండిని దేవుడితో పోల్చే భారతదేశంలో పుట్టిన ఈ  కాలం   పిల్లల ఆలోచన విధానానికి ఏం తెగులు పుట్టింది….. ప్రతిదాన్ని డబ్బు తోనే లెక్కేస్తారు. వ్యవసాయాన్ని లాభనష్టాలతో బేరీజు వేయడం మొదలుపెడితే తినడానికి తిండి దొరకదు. అసలు వ్యవసాయం అంటే ఏమిటో తెలుసారా నీకు?” వ్యవస్థకు మనం చేసే సాయం వ్యవసాయం”. అలాంటి సాయం నేను వ్యవస్థకు చేస్తున్ననందుకు చాలా గర్వపడుతున్నాను. నా ఆఖరి క్షణం వరకు నేను ఇదే చేస్తాను.

మనిషి  ఆకలి వేస్తె అన్నమే తినాలి డబ్బు తిని బ్రతికే టెక్నాలజీ ఇంకా రాలేదు అలా వచ్చిన రోజు నేను  పొలం అమ్మేస్తాను, అప్పుడు మాట్లాడదాం”అన్నారు తన బాధ, ఆవేశం నాకు తెలియాలని.

“అది కాదు నాన్నా… ఈ నాలుగెకరాల అమ్మినంత మాత్రాన ప్రపంచంలో తిండికి ఏమి లోటు రాదు…. కానీ నా పాడయిపోయిన బిజినెస్ మళ్ళీ చక్కపడుతుంది. నా కోసం ఈ మాత్రం చేయలేరా?” అన్నాను సాధ్యమైనంత ప్లీజింగ్‌గా.

ఈ సారి నాన్న ఏమి మాట్లాడలేదు కానీ అమ్మ “విశ్వం…. తల్లి కన్నా నేల తల్లి గొప్పది రా…. అమ్మ తొమ్మిది నెలలే మోస్తుంది…. నేల తల్లి మనం తల్లి కడుపులోంచి భూమి మీద పడ్డ దగ్గర నించి మనం భూమిలోకి వెళ్లి పోయే వరకు మోస్తుంది… ఇంకా చెప్పాలంటే మనం తినే తిండిని మనకు ఇచ్చి మనం విసర్జించింది కూడా తీసుకుంటుంది. అలాంటి భూమి తల్లికి రేటు కట్టి మన స్వార్థం కోసం ఇష్టం వచ్చినట్టు దుర్వినియోగం చేస్తున్నాము. నువ్వు ఎన్ని చెప్పినా ఆ పొలం అమ్మడం కుదరదు. ఇక ఈ విషయం గురించి అయితే నువ్వు మాట్లాడొద్దు” అమ్మ ఆ మాట చెప్పేటప్పటికీ భోరున వర్షం మొదలు అయ్యింది.

“సరే అమ్మా మీకు నా భవిష్యత్తు కన్నా ఆ నాలుగెకరాల పొలం ఎక్కువ అంటున్నారు కదా? దాన్నే చూసుకుంటూ ఉండండి… నేను నా పిల్లలు ఎందుకు?…. మేము వెళ్తున్నాము” అన్నాను వాళ్ళ మాటలకూ చాలా కోపం వచ్చి.

ఆ నిముషమే వెళ్లి పిల్లలను లేపి బయలుదేరదీసాను. అమ్మ, నాన్న నేను చేస్తున్న పనిని నమ్మలేనట్టు చూస్తున్నారు. అమ్మ మొదట తేరుకుని “వర్షం చాలా పడుతోంది… టీవీలో తుఫాన్ అంటున్నారు. ఒక రెండు రోజులు ఆగి బయలుదేరు. పిల్లలు కష్టపడతారు…. ఇప్పుడు వెళ్ళొద్దురా!” అని బతిమాలింది కానీ నా మాట కాదన్నారన్న ఉక్రోషంతో నిద్రమత్తులో ఉన్న పిల్లలను కార్‌లో వేసుకుని ఇంటికి బయలుదేరాను.

విపరీతమైన వర్షం కష్టపడి ఒక రెండు గంటలు ప్రయాణం చేశాను. ఆ తరువాత ముందరున్న బ్రిడ్జి కూలిపోయి రోడ్ బ్లాక్ చేసారు. సరే వెనకకు వెళదాం అని కార్ వెనుకకు తిప్పాను కానీ ఏరు పొంగి వెనకకు వెళ్లలేక పోయాను. ఎటు కాకుండా మధ్యలో ఇరుక్కుపోయాను. అమ్మ చెపుతూనే ఉంది కానీ నేనే వినలేదు. అక్కడే ఆగి వెయిట్ చేయడం తప్పితే ఏమి చేయలేకపోయాను. అప్పటి వరకు నిద్రపోతున్న పిల్లలు లేచారు. వాళ్లకు ఏమి అర్థం కాలేదు. వాళ్ళ ముఖాలలో భయం స్పష్టంగా తెలుస్తోంది.

అవి ఇవి మాట్లాడి వాళ్ళ దృష్టి మళ్లించడానికి ప్రయత్నించాను కానీ వాళ్ళు చుట్టూ పెరిగిపోతున్న నీటినే చూస్తున్నారు. ఇంకో గంట గడిచే సరికి ఆకలి అని ఏడుపు మొదలుపెట్టారు. నాకు ఏమి చేయడానికి తోచలేదు. కార్ అంతా వెతికాను కానీ ఏమి దొరకలేదు. ఎప్పుడు మేము బయలుదేరిన అమ్మ నా కిష్టమని కొన్ని సరయు, పిల్లలకు ఇష్టమని అన్ని చేసి ఇచ్చేది, ఇప్పుడు అవి ఏమి లేవు. కార్‌లో ఒక వాటర్ బాటిల్ తప్పితే ఇంకేమి లేవు. నీళ్లు ఇచ్చి కొంచెం సేపు మానేజ్ చేశాను. సెల్ ఫోన్‌లో ఛార్జ్ లేదు. నాకు ఏమి పాలుపోలేదు.

దేవుడిని తలచుకుంటూ కూర్చున్నాను. ఇంకో రెండు గంటలు గడిచాయి. ఇప్పుడు పిల్లలకే కాదు నాకు ఆకలి మొదలు అయ్యింది. నాకు ఆకలి అని అనిపించి చాలా సంవత్సరాలే అయ్యింది. ఇప్పుడు ఏమి చేయాలి అనేది పాలుపోలేదు.

దేవుడు నా ప్రార్థన విన్నట్టు ఉన్నాడు. కార్ విండో మీద ఎవరో తట్టినట్టు అయి విండో ఓపెన్ చేశాను. ఒక నలభయ్ ఏళ్ల వ్యక్తి “బాబు…. పక్కన ఏరు చాలా జోరుగా పోతోంది….. ఇక్కడే ఉంటే కార్ లోకి నీళ్లు వచ్చేసి చానా ఇబ్బంది పడిపోతారు. పక్కనే మా పాక ఉంది అక్కడ వచ్చి కూర్చోండి” అన్నాడు చాలా వినయంగా.

అతని వంక అనుమానంగా చూసి “నీ పేరు ఏంటి?”అన్నాను.

“రాముడంటారు బాబు… పక్కనే నా పొలం దాని పక్కనే నా పాక ఉన్నాయి. కార్ లోకి నీళ్లు దూరితే ఇబ్బంది పడతారు బాబు” అన్నాడు.

మా అమ్మ ఎప్పుడు కొలిచే రాముడే వచ్చాడని ఆయన మీదే భారం వేసి పిల్లలను తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళాము. చిన్న పాకలో రాముడు వాళ్ళ ఆవిడ ఉన్నారు. మమ్మల్ని స్వంత మనుషుల్లా చూసారు. పిల్లలకు వేడిగా అన్నం వండి పెట్టింది.

ఆ తరువాత రెండు రోజులు వర్షం విడువకుండా పడుతూనే ఉంది. కరెంట్ లేదు. ఫోన్స్ పనిచేయలేదు. మేము కార్ దిగి వచ్చిన గంటలోపే కార్ నీళ్లలో మునిగిపోయింది. అక్కడే ఉంటే ఊపిరి ఆడక చనిపోయేవాళ్ళము.

ఒక పుట వాళ్ళు  పస్తులు ఉండి మరి మాకు అన్నం పెట్టారు. ఎందుకలా చేసారు అంటే “మాకు పస్తులు అలవాటే సారూ… కానీ పసి పిల్లలను చూస్తూ చూస్తూ అలా ఆకలికి వదిలేయలేము…. పంట పండించే రైతుకు తన పంట నలుగురు తింటేనే మనసుకు తృప్తి. ఒక సారి అలా తిండి పెట్టడంలో ఉన్న ఆనందం తెలిస్తే అది ఎప్పటికి వదలరు. అందుకే కదా సారూ అన్నదాతలు అన్ని కష్టాలకు ఓర్చి ఇంకా వ్యవసాయం చేస్తున్నారు”  ఆ మాట నాకు చెంప దెబ్బ తగిలినట్టు అయ్యింది.

ఐదో రోజుకు నీళ్లు తగ్గి రోడ్డు కనిపించింది. కరెంట్ రాంగానే ఫోన్ ఛార్జ్ చేసి సరయుకు ఫోన్ చేశాను. మామయ్య ఎత్తారు, సరయు మా గురించి బెంగ పెట్టుకుని జ్వరంతో హాస్పిటల్‌లో ఉందని చెప్పారు. నేను పిల్లలు రాముడి సహాయంతో ఒక నాలుగు కిలోమీటర్లు నడచి బస్సు పట్టుకుని ఇల్లు చేరుకున్నాము.

వచ్చేసే ముందు రాముడికి డబ్బు ఇవ్వబోతే తాను అస్సలు ఒప్పుకోలేదు. “నేను పెద్ద చేసింది ఏమి లేదు బాబు…. నేను పండించిన నలుగురికి పెట్టినట్టే మీకు పెట్టాను… దీన్ని డబ్బుతో లెక్కవెయ్యొద్దు” అన్నాడు. ఆ దెబ్బకు నాకున్న డబ్బు జబ్బు పూర్తిగా వదిలింది.

ఆ తరువాత  ఒక రెండు వారాలు నా మెదడులో ఒకటే ఆలోచన ఏమి చేస్తే నేను చేసిన తప్పును సరిదిద్దగలను అని. నా మనసులో ఒక ఆలోచన రూపు దిద్దుకుంది. ఆ సమయంలో నాకు భాస్కర్ పరిచయం అయ్యాడు.

నేను నాకు ఉండే ఆస్తులు అన్ని అమ్మేసి మా ఊరులో ఉన్న చాలా పొలాలు ఇరవై ఏళ్లకు లీజుకు తీసుకున్నాను. ఆ సమయంలో వాళ్ళ ఆ పొలాలను అమ్మకూడదు. ఆ పైన ఖర్చులు, లాభం సగం సగం అని అగ్రిమెంట్లు రాయించాను. అలా చేస్తే నాకు నష్టమే…. బిజినెస్‌మాన్ విశ్వం అయితే ఈ డీల్‌కి ఒప్పుకునే వాడు కాదు, కానీ ఇది ఒక రైతు బిడ్డ విశ్వంగా చేశాను. నేను చేసిన ఈ పనికి సరయు చాలా సంతోషించింది. తన చిరున్నవ్వు తిరిగి వచ్చింది.

ఆ పొలాల్లో ఆర్గానిక్ పళ్ళు, కూరగాయలు పండించి మా ఏరియాలో “అన్నదాత – సుఖీభవ” అన్న చిన్న చిన్న షాప్స్ ఓపెన్ చేసి అమ్మడం మొదలు పెట్టాము. రేట్ తక్కువగా ఉండి క్వాలిటీ  బాగా ఉండడంతో డిమాండ్ బాగా పెరిగింది. పక్క ఊళ్ళో పొలాలు కూడా లీజ్‌కి తీసుకున్నాం. నేను నేర్చుకున్న చదువు నాకు ఇక్కడ ఉపయోగపడింది. కొత్త, కొత్త పద్ధతులు ఇంప్లిమెంట్ చేసాము.

విదేశాల్లో ఉంటూ తమ దేశం కోసం ఏదన్నా చేయాలి అనుకునే చాలా మంది దీంట్లో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. అర్జెంటుగా డబ్బు కోసం పంటపొలాలను అమ్ముకోనవసరం లేదు మా “అన్నదాత-సుఖీభవ” పథకంలో చేరచ్చు అని చెపుతున్నాము. పంట పొలాలను అలాగే ప్రిజర్వ్ చేయడమే మా లాంగ్ టర్మ్ గోల్.

నేను చిక్కుకున్న తుపాన్ నన్ను నా జీవితంలో రేగుతున్న తుఫాన్ నించి రక్షించింది. నేను లీజ్‌కు తీసుకున్న మొదటి పొలం రాముడిదే. ఇది నా కథ.”

Exit mobile version