58. బుద్ధాశ్రమం

0
3

[box type=’note’ fontsize=’16’] 2018 దసరా కవితల పోటీలలో న్యాయ నిర్ణేతలు ఎంపిక చేసిన ఉత్తమ కవితలలో ప్రథమ బహుమతి పొందిన కవిత. [/box]

[dropcap]సా[/dropcap]యంత్రపు సువాసన నా వైపు నీడలా పాకుతున్నప్పుడు
నేను ఆ ఆశ్రమం వైపు అడుగులు వేస్తాను
వృద్ధులు పిల్లల్లా  జీవితాన్ని రివైజ్ చేస్తుంటారు
ఎటు చూసినా ఒక్కొక్కరూ ఒక్కో పుస్తకమై
పేజీలు పేజీలుగా ఎవరికి వాళ్ళను తిప్పుకుంటూ వుంటారు
ఇంతకాలం అక్షరాలను వస్త్రాలు దులిపినట్టు దులిపేశాను
ఇకనైనా గుండెకు అతికించుకోవడం తెలుసుకోవాలి

ఊసులు చెప్పుకుంటూ ఊత కర్రలు వాకింగ్ చేస్తుంటాయి
మోకాళ్ళ మీద నిద్రపుచ్చిన ప్రపంచాలు..
రెప్పల మీద కాపు కాసిన కాలాలు..
వొంగిన నడుముల మీద వొరిగిన ఆకాశాలు..
చల్లారి పోతున్న గ్రహాలు కాదివి
పంచిన వెలుగులు చాల్లేవోయ్ అంటూ
తృప్తిగా కళ్ళద్దాలు సవరించుకుంటున్న నక్షత్రాలు

కింద వృద్ధులు కదులుతుంటారు
చెట్ల మీద ఎవరో కోతికొమ్మచ్చులాడుకుంటారు
బహుశా అవి వారి యవ్వన కాలపు
స్మృతుల ఆకుపచ్చ ఛాయా దీపాలేమో !

పురాతన కవుల్లా నవ్వుతూ రాతి బెంచీలు పిలుస్తాయి
నాకూ నా కవితలకూ మధ్య దూరాన్ని కరిగిస్తూ అటు కదులుతాను
అప్పుడు చెవుల్లోంచి గుండెల్లోకి నిశ్శబ్ద జలపాతాలు ఉరుకుతాయి
ఏ సిమెంటు దిమ్మ మీదో సంతకం చేసి సీటు బుక్ చేసుకోవాలి
అదిగో ఏదో విన్నట్టు గాలి ఎలా నవ్విందో..!

పడుతూ లేస్తూ మొదలు పెట్టి
మళ్ళీ పడుతూ లేస్తూ నడిచే దశ దాకా
మధ్యలో అంతా పరాజితులు లేని పరుగు పందెమే కదా !
ఏమో ఏం కష్టాలు పడ్డారో..ఏం కన్నీళ్ళు పెట్టారో..
విదిల్చిన దేహాల నుంచి పువ్వులే రాలాయో..
సగం విరిగిన ముళ్ళే రాలాయో..

నా ముందు కాలం రూపు గుర్తొచ్చి త్రుళ్ళిపడతాను
చెంతనే సహచరి వాలు కుర్చీలా వాలుతుంది
ఎదుట రెండుగా చీలిన మలిసంజె మసకలాట
కలలు నములుతూ వచ్చి నీళ్ళు నములుతుంటాను
పక్కనే పళ్ళూడిన గోడ పగలబడి నవ్వుతుంది

ఏ లోకానికి వచ్చానో..
ముడతల శరీరాల్లో మడతలు పడని
మనసులు తళుక్కుమంటున్నాయి
నాకేదో బోధపడుతోంది
ఈ సింగిల్ ఫ్రేం లైఫ్ లో
జరామరణాలు..అస్తమయాలు ఫేడవుట్ దృశ్యాలే
నాకు ఎప్పుడూ ఫేడిన్ రంగుల మీదే ఆశ
ముమ్మాటికీ వీళ్ళు వృద్ధులు కాదు..బుద్ధులే
ఈ ఆశ్రమంలో నిత్యమూ
జ్ఞాపకాల స్నానం చేసి మెరిసిపోయే జీవితాలుంటాయి

ప్రపంచంలో ముసలి వాళ్ళందరికీ
ఏ భేదాలూ లేని ఇంత భద్ర ప్రపంచాన్ని కానుకగా ఇస్తే చాలు
పిల్లలు వారి కోసం స్వర్గాన్ని వారే నిర్మించుకుంటారు