Site icon Sanchika

59. అమ్మ బహుమతి

[box type=’note’ fontsize=’16’] 2018 దీపావళి కథల పోటీకి వచ్చిన కథ. [/box]

[dropcap]”అ[/dropcap]య్యా! పెళ్లి కూతురుని  చేసే కార్యక్రమం పూర్తి అయ్యింది అందరూ వచ్చి అమ్మాయిని అక్షింతలు వేసి ఆశీర్వదించండి” అనేసరికి అందరూ ఫైకి లేచారు. “అమ్ములు…. వెళ్లి మొదట అమ్మ ఆశీర్వాదం తీసుకో తరువాత మిగతావాళ్ళు చేస్తారు” అంది అమ్ములు అత్తా లావణ్య.

అమ్ములు వెళ్లి అమ్మ ఫోటో దగ్గరకి వెళ్లి కళ్ళ నీళ్ళతో ఆవిడ ఆశీర్వాదం తీసుకుంది. తరువాత నాన్న దగ్గరికి వెళ్ళింది ఆయన ఒక పక్క సంతోషం మరోపక్క బాధతో అమ్ములుని ఆశీర్వదించాడు.”అమ్ములు అందరి ఆశీర్వచనాలు అయ్యాకా నా రూం కు రా నీకు ఒక సర్‌ప్రైజ్ ఉంది” అని వెళ్లిపోయారు.

అందరి ఆశీర్వాదాలు అయినంతసేపు నాన్న చెప్పిన సర్‌ప్రైజ్ ఏంటా? అన్న ఆలోచన నన్ను ఉన్న చోట ఉండనీయడం లేదు. అన్ని పూర్తి చేసుకుని నాన్న రూం లోకి వెళ్ళాను. నాన్న నాకు ఒక ప్యాకెట్ ఇచ్చి “అమ్ములు ఇది అమ్మ చనిపోయే ముందు నాకిచ్చి నీకు ఈ రోజు ఇవ్వమంది.”

“ఏంటి నాన్నా ఇది?”

“నాకు తెలీదు తల్లి కాని మీ అమ్మ దీని కోసం చాలా శ్రమ పడింది… దీన్ని నువ్వే ఓపెన్ చెయ్యాలి అని మరి మరి చెప్పింది.”

“సరే నాన్నా”.

అమ్మ నా కోసం దాచింది అంటే ఏదో చాలా స్పెషల్ అయి ఉంటుందనుకుని ఆ ప్యాకెట్ తీసుకుని నా రూంకు వచ్చి ఓపెన్ చేశాను. ఒక నెక్లెస్ బాక్స్, ఒక పుస్తకము ఉన్నాయి. నెక్లెస్ బాక్స్ ఓపెన్ చేసాను పాతకాలం నెక్లెస్ చాలా బాగా ఉంది. దాంట్లో ఒక నోట్ ఉంది. “అమ్ములు ఈ నెక్లెస్ అంటే నీకు చాలా ఇష్టంగా ఉండేది. ఇది నాకు మీ నానమ్మ ఇచ్చింది. దీని కమ్మలు మీ అమ్మమ్మ ఇచ్చింది. చేరోటి ఇచ్చినా ఇవి బాగా మ్యాచ్ అయ్యాయి. నువ్వు నన్ను ‘ఇది నాకు ఎప్పుడు ఇస్తావు అమ్మా’ అంటే నిన్ను పెళ్లికూతురిని చేసిన రోజు ఇస్తాను అంటే…. ‘అయితే ఇప్పుడే చెయ్యి పెళ్లికూతురిని….. వెంటనే నెక్లెస్ ఇచ్చేయి’ అనే దానివి. నేను మీ నాన్నా ఈ విషయాన్ని ఎన్నిసార్లు గుర్తు చేసుకుని నవ్వుకున్నామో?”

ఆ నోట్ పక్కన పెట్టి పుస్తకం ఓపెన్ చేశాను. మొదటి పేజిలో “అమ్ములుకి ప్రేమతో అమ్మ” అని రాసుంది.

రెండవ పేజి తెరిచాను. ఈ బుక్ చదువుతున్నావు అంటే నిన్ను ఈ రోజు పెళ్లికుతురిని చేసి ఉంటారు. రేపో ఎల్లుండో నీకు పెళ్లి జరుగుతుంది. ఈ సమయంలో నేను నీ పక్కనే ఉంటే ఎన్నో జాగ్రత్తలు చెప్పి ఉండేదాన్ని….. నా అనుభవాలు… నా పొరపాట్లు… నా సుఖదుఃఖాలు…

డాక్టర్  నన్ను ఇక మీరు ఆరునెలల కన్నా బ్రతకరు అన్నప్పుడు నాకు చాలా బెంగగా అనిపించింది. నీ పెళ్లి చూడడానికి… నీ పిల్లలతో ఆడుకోవడానికి నేను ఉండను అని బాధ కలిగింది.

అంతలో నేను పెళ్లి అనగానే పడ్డ భయం బెదురూ గుర్తుకు వచ్చాయి.

అత్తగారింట్లో అడుగుపెట్టినప్పుడు నాకు తలెత్తిన ప్రశ్నలు…. నాలో ఉన్న సంశయాలు అన్నింటికీ మా అమ్మ నాకు చెప్పిన పరిష్కారాలు ఆవిడ ఇచ్చిన సలహాలు నాకు జీవితంలో ప్రతి మలుపులో ఎంత ఉపయోగపడ్డాయో గుర్తుకు వచ్చింది. నేను అలా నీకు చెప్పలేకపోతున్నానని ఎంత వెలితిగా అనిపించింది. ఆ తరువాత నేను నీకు చెప్పాలి అనుకుంది రాసి పెట్టచ్చు కదా అనిపించింది. ఈ విషయం ఎవరితో అన్నా చెపితే నవ్వుతారేమో అని ఎవ్వరికి చెప్పలేదు. ఆ రోజు నించి అదే పనిలో ఉన్నాను. మళ్ళీ అనిపించింది ఈ కాలం పిల్లలు చాలా ఫాస్ట్‌గా ఉంటారు, అలాంటి నీకు నేను చెప్పే పాతకాలం నాటి మాటలు నచ్చుతాయా? అనిపించింది .

వెంటనే నాకు మా అమ్మ గుర్తుకు వచ్చింది, మేము వింటాము వినము అని కాకుండా సందర్భము వచ్చినప్పుడు మాకు చెప్పాల్సిన విషయాలు చెపుతూ ఉండేది. ఆ నిముషము ఆ విషయము ఎందుకు చెపుతోంది అని అనిపించినా… మళ్ళీ ఆ విషయాలు జీవితంలో చాలా ఉపయోగపడ్డాయి. వాళ్ళ జీవితానుభవం మనకు చాలా అవసరం. “పెద్దల మాట చద్ది మూట” అన్న మాట పెద్దవాళ్ళు ఉరికే చెప్పలేదు. నా సలహాలు పాటించడం పాటించకపోవడం నీ ఇష్టం కాని చెప్పడం తల్లిగా నా భాద్యత అని రాయడం మొదలుపెట్టాను.

పెళ్లి అనేది జీవితంలో రెండవ అధ్యయానికి నాంది. అది ఇద్దరు మనుషులను పెనవేసే బంధం కాదు రెండు కుటుంబాలను శాశ్వతంగా ఒకటి చేసే బాంధవ్యం. అలా అనుకుంటే ప్రపంచంలో చాలా గొడవలు ఉండవు. ఇదేంటి అమ్మ ఇలా అంటుంది అనుకుంటున్నావా? ఇప్పుడంటే పెళ్లి అంటే ఒక అబ్బాయిని వాళ్ళ అమ్మ నాన్నను చూసి వాళ్ళు బాగుంటే చాలు అనుకుంటున్నాము. కాని వంశాలను ముడి వేసే బంధం పెళ్లి. అందుకే మనవాళ్ళు పెళ్ళికి అంతటి ప్రాధాన్యత ఇస్తారు.

నేను మా పెళ్లి టైంకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నాను. మీ నాన్న వాళ్ళ సంబంధం ఇంట్లో అందరికి చాలా నచ్చింది. నాకు మాత్రం ఏం మాత్రం నచ్చలేదు. ఎందుకంటావేమో? వాళ్ళు కట్నం తీసుకున్నారు అన్న ఒకే ఒక కారణం వల్ల. నేను అప్పట్లో నవలలు చదివి… సినిమాలు చూసి కట్నం అనే మాట అడగని వాణ్ణి పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. అదే మాట అంటే మా నాన్న “వరకట్నం అనే ఆచారం ఎవరికీ అపకారం జరగనంత వరకు మంచి ఆచారమే. వాళ్ళ కుటుంబం చాలా మంచిది నేను నీకు ఎప్పుడో ఇవ్వాల్సిన ఆస్తిని ఇప్పుడే ఇస్తున్నాను. అందులో తప్పేమీ లేదు. ఆ అబ్బాయి నిన్ను చాలా బాగా చూసుకుంటాడు. ఒక తండ్రిగా అది నాకు చాలా ముఖ్యం” అనేసరికి నేను ఏమీ మాట్లాడలేకపోయాను.

పెళ్ళికి ముందు మీ నాన్న నాతో మాట్లాడడానికి చాలా ప్రయత్నం చేసారు, కాని నా మాట ఎవరు వినడం లేదన్న అక్కసుతో నేను ఆయనకు నాతో మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. నేను సగం మనసుతోనే పెళ్లి పీటల మీద కూర్చున్నాను. అందరూ నా పెళ్లి అని సంతోషంగా ఉంటే నేను మటుకు నా ఇష్టానికి విరుద్ధంగా నా మెడలు వంచి పెళ్లి చేస్తున్నారు అని లోలోపలే కుమిలిపోయాను. నా పెళ్లి అయిపోయింది నన్ను అత్తవారింటికి పంపారు.

మన చుట్టూ ఉన్న వాళ్ళు  అత్తగారు అంటే ఇలా ఉంటుంది… ఆడపడుచు అంటే ఇలా ఉంటుంది అని కోడలు అంటే కుటుంబాన్ని విడదీస్తుందని ఇలా చాలా చెపుతారు. అది చిన్నప్పటి నించి ఇలాంటి అన్ని విని విని మన మనసులో అదే భావన ముద్రపడిపోతుంది. ఇలా మనుషులు వాళ్ళ వాళ్ళ స్వంత అనుభవాల నించి వచ్చిన నిర్ణయాలను ఇతర మనుషుల మీద రుద్దుతారు. ఒక మనిషి మీద ప్రారంభం లోనే నెగిటివ్ ఫీలింగ్స్ ఉంటే ఆ మనిషితో మనం జీవితాంతం ఎలా అరమరికలు లేకుండా కలసి ఉండగలం. నువ్వు అత్తారింటిలో అడుగుపెట్టేటప్పుడు మటుకు కీప్ యన్ ఓపెన్ మైండ్. మనుషులు అన్న వాళ్ళు ఎప్పుడు ఒకే రకం గా ఉండరు. వాళ్ళు మనతో ఎలా ఉన్నారు అనేది మన ప్రవర్తన మీద  కూడా ఆధారపడిఉంటుంది .

ఒక రోజు నన్ను కూర్చోపెట్టుకుని జడ వేస్తూ మా అత్తగారు “వాడికి కట్నం తీసుకోవడం అస్సలు ఇష్టం లేదు… ఒక అమ్మాయి తన వాళ్ళందర్నీ వదలి మన ఇంటికి వచ్చి మనల్ని తన వాళ్ళు అనుకుని మనతో జీవితాంతం ఉంటుంది అంత త్యాగం చేస్తుంది… అలాంటి అమ్మాయి వాళ్ళ కుటుంబం దగ్గర డబ్బు ఆశించడం ఎంత అన్యాయం అమ్మా. నన్ను నేనే అమ్ముకునట్టు కదా! అది నాకు ఏ మాత్రం ఇష్టం లేదు” అన్నాడు. కాని మీ నాన్న గారు మా అవసరం తెలుసుకుని మరి సహాయం చేసారు.

“అవసరం ఏంటి అత్తయ్య?”

“అదే చిన్నాడి ఉద్యోగం కోసం సెక్యూరిటీ డిపాజిట్ లక్ష రూపాయలు కట్టాలి అన్నారు. ఎంత ప్రయత్నం చేసినా అరవైకి మించి కూడలేదు. అయ్యో బంగారం లాంటి ఉద్యోగం చెయ్యి జారిపోతుందే అని ఎంత బాధపడ్డామో! మీ నాన్న విషయం తెలుసుకుని యాభయి వేలు తెచ్చి ఇచ్చారు. “ఇది అమ్మాయి డబ్బే తన కోసం దాచిందే… తన వాళ్ళకు ఉపయోగపడుతుంది అంటే సంతోషిస్తుంది” అని బలవంతంగా ఇచ్చివెళ్లారు .

అప్పుడు అర్థం అయ్యింది మీ నాన్న నాతో మాట్లాడి ఏమి చెప్పాలి అనుకున్నారో? మంచి దంపత్యానికి    కమ్యునికేషన్ చాలా ముఖ్యం అని ఆ రోజు అర్థం అయ్యింది. మనం ఒక నిర్ణయానికి వచ్చే ముందు ఎదుటి వాళ్ళు చెప్పేది ప్రశాంతంగా వినాలి.

బంధువులు అనే వాళ్ళు కూడా భార్యాభర్తల సంబంధంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. పెళ్లిలో బంధువులు అన్న మాటలు… వాళ్ళ చేష్టలు చాలా దూరం వెళ్తాయి. కొందరు పెళ్ళికి వచ్చి పెట్టింది తిని నాలుగు అక్షింతలు వేసి వెళ్లిపోతారు… కొందరు మటుకు పెళ్లిలో వంకలు పెట్టడానికి, తగవులు పెట్టడానికే వస్తారు. మా పెళ్ళిలో పెళ్లి కూతురి తరపు వాళ్ళు మాకు సరిగా మర్యాద చెయ్యలేదని, మా తరపు బంధువులు పెళ్ళికొడుకు వాళ్ళు చాలా అద్వాన్నంగా మాట్లాడారని చెప్పారు .

నాకు మీ నాన్నకు మద్య ఒక చిన్న సంభాషణగా మొదలు అయ్యి పెద్ద గొడవగా మారింది. మీ వాళ్ళది తప్పు అంటే కాదు మీ వాళ్ళది తప్పు అని వాదించుకున్నాము. ఈ గొడవ అటు మా నాన్నకు ఇటు మామగారికి తెలిసింది. వాళ్ళు ఇద్దరు మాకు చెప్పింది ఇది “పెళ్లి అనేది రెండు కుటుంబాలు ఒకటి కావడానికి కలసి చేసుకునే వేడుక. ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ కాదు. మన పురాణాలు అలా ఎన్నటికి చెప్పవు. ఉండే పద్దతులను మనం వక్రీకరిస్తున్నాము. అది ఎవరికీ మంచిది కాదు. నలుగురు మనుషులు కలసినప్పుడు నాలుగు రకాల మాటలు వస్తాయి. తమ గొప్ప కోసం ఏదో చెయ్యాలి అనుకుంటారు. కాని అందరూ మర్చిపోతోందేంటి అంటే మనం మాటలు అంటున్న పిల్ల తను అనుకున్న వాళ్ళను వదలి మన మంచి చెడ్డలు చూడడానికి మన ఇంటికే వస్తోంది అని, ఆ అమ్మాయి బాధపడ్డ మనసుతో మన ఇంట్లో అడుగుపెడితే మనకే కదా నష్టం. పెళ్ళికి ముందే అన్ని మనసు విప్పి మాట్లాడుకోవాలి. అలా చెయ్యకపోతే మిగతావాళ్ళు అందరూ చేరి మన మనసులు పాడు చేస్తారు” అని చెప్పారు. మేము ఆలోచించాము మా గొడవ మాకు చాలా సిల్లీగా అనిపించి గుర్తు వచ్చినప్పుడల్లా నవ్వుకునేవాళ్ళం. ఆ తరువాత ఇలాంటి విషయాలు మా మద్య రాకుండా చూసుకున్నాము. ఇలాంటివన్నీ మా మద్య బంధాన్ని బలోపేతం చేసాయి.

ఆడవాళ్ళ ప్రేమ అపరిమితం. వాళ్ళలో ఉన్న త్యాగం మగవాళ్ళలో చాలా తక్కువ మందికి ఉంటుంది. ఒక మనిషిని ఇద్దరు అపరిమితంగా ప్రేమిస్తే అప్పుడప్పుడు చిన్న చిన్న తగువులు వస్తాయి. ఆ ఇద్దరే తల్లి భార్య. ఇద్దరు అంతే ప్రేమిస్తారు కాని ఎవరి స్థానం వాళ్ళదే. అది వాళ్ళ ఇద్దరు ఎంత త్వరగా అర్థం చేసుకుంటే వాళ్ళ జీవితం అంత ప్రశాంతంగా ఉంటుంది. అత్తగారిగా ఆవిడకు కొన్ని అధికారాలు ఉంటాయి, కోడలిగా కొన్ని భాద్యతలు ఉంటాయి. అవి మన వాళ్ళు కుటుంబం సాఫీగా గడచిపోవడానికి పెట్టారు. దాన్ని అలాగే కంటిన్యూ చేసినంత మాత్రాన మనకు వచ్చిన నష్టమేమి లేదు. ఆవిడ నీకన్నా వయసులో పెద్దది. అలా అని నీ ఆత్మాభిమానం పణంగా పెట్టి బానిసత్వం చెయ్యాల్సిన పని లేదు. దాన్ని నేను ఎప్పుడు ఒప్పుకోను….. కాని అమ్ములు అహంకారానికి ఆత్మాభిమానానికి మద్య చాలా సన్నని గీత ఉంది. దాన్ని నువ్వు తెలుసుకుంటే చాలు. ఎందుకంటే నువ్వు నీ ఆత్మాభిమానాన్ని వదలుకుంటే నీ పిల్లలను అలా పెంచలేవు. వాళ్ళు నిన్ను చూసే వాళ్ళు జీవితం నేర్చుకుంటారు.

మా ఫ్రెండ్ గీత అని ఒక అమ్మాయి ఉండేది. వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మను అప్పుడప్పుడు కొట్టేవారు. అది చిన్నప్పటి నించి అలా చూసి ఉందేమో దానికి అది పెద్ద  విషయం అనిపించేది కాదు. దాని పెళ్లి అయ్యాక దాని భర్త దాన్ని కొట్టినా ఇది మామూలే అని ఊరుకునేది. వాళ్ళ అమ్మ దానికి భర్త కొట్టినా భరించాలి అని నేర్పింది. అది కాదు మనం పిల్లకు నేర్పాల్సింది. నువ్వు ఎప్పుడు తల ఎత్తుకుని జీవించాలి అని నేర్పాలి పిల్లలకు. పిల్లలకు వ్యక్తిత్వం అనేది తల్లితండ్రుల నించే వస్తుంది. చదువు కన్నా ప్రేమ, అభిమానం, పెద్దవాళ్ళ పట్ల గౌరవం నేర్పడం చాలా అవసరం.

పెళ్లి తరువాత మన నిర్ణయాలు అనేవి అందరూ బూతద్దంలో పెట్టి చూస్తారు. కాని అందరిని మనం తీసుకునే నిర్ణయంలో అటు వాళ్ళను ఇటు వాళ్ళను భాగస్వాములను చేస్తే ఎటు నించి సమస్యలు రాకుండా  ఉంటాయి.  మా పెళ్లి అయిన వెంటనే నేను ఉద్యోగం చెయ్యలా వద్దా అన్న ప్రశ్న తలెత్తింది. మీ నాన్న, అత్తయ్య, మామయ్య ఆ విషయాన్నీ నా నిర్ణయానికే వదిలేసారు. వాళ్ళను అడిగి వాళ్ళకు పెద్దరికం ఇచ్చినందుకు వాళ్ళు చాలా సంతోషించారు. మీ నాన్న నన్ను అమ్మమ్మ, తాతయ్యను అడగమన్నారు. నేను ఎందుకు అన్నాను. మీ నాన్న చెప్పిన సమాధానం నన్ను ఆలోచింపచేసింది. “వాళ్ళు నిన్ను కానీ పెంచి ఇంత వరకు చదివించారు… నువ్వు నా భార్యవు అయినంత మాత్రాన వాళ్ళ కూతురివి కాకుండా పోతావా? ఆడపిల్ల మగపిల్లాడు అని చూడకుండా నిన్ను పెద్ద చదువులు చదివించారు. వాళ్ళ సలహా తీసుకో వాళ్ళు సంతోషిస్తారు…. కాని చివరగా నిర్ణయం నీదే” అన్నారు. అదే మాట అమ్మమ్మ వాళ్లతో చెపితే వాళ్ళు మాకు ఎంత మంచి అల్లుడు వచ్చాడని ఎంతో సంతోషించారు. ఆ సంఘటన మా మద్య మంచి స్నేహానికి పునాది వేసింది. నేను నువ్వు పుట్టే వరకు ఉద్యోగం చేసాను, ఆ తరువాత నిన్ను వదలి నాకు ఉద్యోగానికి వెళ్ళ బుద్ధి కాక మానేసాను. నాకు నువ్వు తోడిందే లోకం అయ్యింది.

పెళ్లి తరువాత ఆడపిల్లలు మారిపోతారు అనేది అందరూ చెప్పే కామన్ కంప్లైంట్. మనం పెళ్లికి ముందు అమ్మ, నాన్న అన్ని చూసుకుంటే ఉంటే చదువు తప్పితే మిగతావి పట్టవు మనకు. అత్తగారింటికి వచ్చాకా నీకు చాలా భాద్యతలు వస్తాయి. కొత్తగా వచ్చిన అన్ని బందాలు, భాద్యతలు సరిగా నిర్వహించే హడావిడిలో మనం మన గతాన్ని మర్చిపోతాము. ఒక్కోసారి మన క్లోజ్ ఫ్రెండ్స్‌ని కూడా మర్చిపోతాము. రెండిటికి సమన్వయము చేసుకోవడం పూర్తిగా నీ మీద ఆధారపడి ఉంటుంది.

నిన్నే తీసుకుందాం. మనది కంబైన్డ్ ఫ్యామిలీ. నువ్వు బాబాయ్, పిన్ని, అత్తల మద్య పెగిగావు. వాళ్ళు నిన్ను చాలా ముద్దుగా చూసుకున్నారు. అటు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో నీకు అదే చనువు ఉంది. నాకు ఆరోగ్యం బాగా లేనప్పుడు ఇంట్లో ఉండే అందరూ నిన్ను వాళ్ళ పిల్లల కన్నా బాగా చూసుకున్నారు. ఇప్పుడు నీ పెళ్లి అంటే కూడా వాళ్ళు అన్ని మానుకుని నీ పెళ్ళికి వచ్చి నేను లేని లోటు నీకు తెలియకుండా అన్ని చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళను నువ్వు పెళ్లి అయ్యి వేరే ఇంటికి వెళ్ళిపోయాను అని మర్చిపోతే వాళ్ళు ఎంత బాధపడతారు. పెళ్లి అంటే ఉన్న బంధాలను వదలి వేరే బందుత్వాన్ని కలుపుకోవడం ఏ మాత్రమూ  కాదు. నువ్వు అత్తగారింటికి వెళ్ళినా నీ వాళ్ళు అనుకునేవాళ్ళను   ఎప్పుడు  వదులుకోవద్దు. మీ నాన్న నువ్వు వెళ్లిపోయాకా చాలా వంటరి వాళ్ళు అయిపోతారు… అలా అని అల్లుడిని ఇల్లరికం తెచ్చుకోమని నా ఉద్దేశం కాదు. నువ్వు ఆయన వంటరిగా ఫీల్ కాకుండా చూసుకో. నువ్వు రెండు కుటుంబాలను కలిపే వారధిగా ఉండాలని  నా ఆశ నా ఆకాంక్ష. నువ్వు ఎంత మంచి వారధిగా ఉండాలంటే కొన్నిరోజుల తరువాత ఇవి రెండు కుటుంబాలు కాదు ఒకటే అనిపించాలి. అలా చేయగలిగితే నువ్వు ఈ ఇంటి కూతురిగా ఆ ఇంటి కోడలిగా సెంట్ పర్సెంట్ మార్కులతో పాస్ అయినట్టు.

నువ్వు కొద్దిగా ఓపిక, సహనంతో ఉంటే నీ దాంపత్య జీవితం కన్నుల పండుగగా ఉంటుంది. ఈ విషయాలన్నీ చెప్పి నీకు బోర్ కొట్టించలేదు అనుకుంటాను. నా అనుభవాలు నీతో పంచుకోవడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. నేను ఎక్కడ ఉన్నా నా మనసు నీ చుట్టూ తీరుగుతూనే ఉంటుంది. సంతోషంగా ఉండు నా బంగారు తల్లీ.”

ఇట్లు

అమ్మ.

ఆ తరువాత ఆ పుస్తకంలో కొన్ని చిట్కాలు, నాకు నచ్చిన కొన్ని వంటల రేసిపిస్ ఇలా చాలా రాసింది అమ్మ. నాకు ఆవిడ ఇప్పుడు లేనందుకు బాధ అనిపించినా…. తను ఉండదు అని తెలిసి నాకోసం ఇంత శ్రమ తీసుకుని అన్నిరాసి పెట్టిందని చాలా సంతోషం అనిపించింది. ఆవిడ కడుపున పుట్టినందుకు ఎంతో గర్వంగా అనిపించిది.

వారధి ఎంత బావుంది ఆ మాట. అమ్మ అలా వారధిలా ఉండబట్టే కదా ఇప్పుడు అటు అమ్మమ్మ వాళ్ళు ఇటు నానమ్మ వాళ్ళు నా పెళ్లిని ఇంత బాగా చేయడానికి వచ్చారు. ఈ కాలంలో ఇంతగా నన్ను ప్రేమించే మనుషులు ఉంటే అదే పెద్ద విషయం.

అంతలో నాన్న వచ్చారు “అమ్ములు, అమ్మ నీకు ఏమి ఇచ్చింది” అన్నారు.

“నాన్నా ఇది నేను ఎప్పటికి నా మనసుకు దగ్గరగా పెట్టుకోవాల్సిన పెన్నిది” అన్నాను.

ఆయన ఒక నవ్వు నవ్వేసారు.

Exit mobile version