59. రాజర్షి ఖేలుడు

0
4

తే.గీ.
దేహమాటున జీవుడు దేవరూపు
పాపకర్మల మూటను పంచుకొనుచు
మాయువస్త్రముఁ దీయును మరల మరల
తనువు పోయిన ధర్మము తరలదెపుడు (41)

తే.గీ.
పేదజీవుల మోమున పేడఁగొట్టి
పాలనన్నియుఁదీసుకు పారిపోవు
పాప జీవుల గుండెన పండుకొనగ
ఖేలుడవనిననవతరించే కాలుడయ్యి (42)

ఆ.వె.
ఖేల వాక్కులందు మూలవేదములన్ని
వెలుగు బీజదీప్తి వెలుగునందు
రాజులందు మిన్న రారాజు ఖేలుడు
వేదరూపమందు వెలుగుచుండు (43)

స్వాగతం:
వేదమంత్రములు వేల్పులటవ్వన్
వేద కాంతులన వెల్గిడి ఖేలున్
వేదపండితులు వేల్పుగఁగొల్వన్
వేదతత్వములు వెల్గెను పృధ్విన్ (44)

తే.గీ.
రాజులందు నిబర్హణ రాజు;; యాగ
ధర్మమంతయు మతిలేని ధర్మమనుచు
యాగనిందను చేయుచు యతుల వలన
ప్రగతి జగతంత వెనుకంజ పట్టెననును (45)

తే.గీ.
ధనబలంబున తారాడు ధరణి పతియే
రాజు రారాజు యాతని రాగమందె
వాణి కొలువుండనుచు నిబర్హణుండు
యాగమన పెద్దరోగమె యనుచు సాగు (46)

తే.గీ.
ఖేలుని యాగదీక్ష తెలియ మలిన రాజు
ఆ నిబర్హణుడప్పుడు యమునిలాగ
విషము చిందించు విష్వాచ విభుని తోడు
కోరనాతడు సరియని కరము సాచె (47)

తే.గీ.
యాగ తేజాన యశసించు రాగశీలి
ఖేల విభుని మీదకు యుద్దకేళియంచు
రాజులిర్వురు రాగ శరముగలేచి
కత్తిపెట్టిన ఖేలుడు కదనమయ్యె (48)

తే.గీ.
యాగపురుషుని రూపాన యశమునొంది
ఖేలుడు నిబర్హణవిభుడు విలవిలమని
కొట్టుకొనిచచ్చు తీరుగ పట్టిచంప
యాగపురుషుడు ముదమున యోగమయ్యె (49)

తే.గీ
ఆరగించే హవిస్సులనమరులంత
యాగతేజాన కొలువున్న యోగమంత
ఖేలుడెరుకపరిచే జనఖీల నడుమ
ముదమునొందగ నరులంత ముక్తితోటి (50)

తే.గీ.
మానవమనుగడంతయు మసలుచోటు
శుద్ధ వాతావరణము; విస్ఫూర్జితముగ
చేయు శాస్త్రీయ మార్గము చేవగలది
యాగమొక్కటే యనేరాజు యాగభోగి (51)

తే.గీ.
యుగము మారిన జగములై యుగములందు
కలసిసాగిన; యాగమే కలసివచ్చు
జగతి శుభ్రత పెంచగ శాస్త్రమయ్యి
అనుచు రారాజు యలరారే యవనిమీద (52)

తే.గీ.
కలుషవాతావరణమందు కలిసివున్న
విషమునంతఁదీసెడి యాగవేల్పుడెపుడు
పూజనీయంబె: కావున పూజనీయ
మార్గమందుపోమనె రాజు మానవులకు (53)

తే.గీ.
గతమొదిలి మంత్రి భేలుని కడకు వెళ్ళి
వందనంబులు చేయగ సుందరంగ
ముదముమీరగ రారాజు ముగ్ధుడవుతు
దేశ సుగతికి కారణదీప్తినడిగె (54)

తే.గీ.
విభుని మాటలన్నియు విన్నశుభఘడియన
మంత్రి దేశసుగతినంత మహిమమీర
తెలియ చెప్పె”పర్జన్యస్తుతులను” జనులు
ఆలపించగ వర్షాలు హాయిగొచ్చె (55)

తే.గీ
జనులు దీర్ఘాయువంతను మదిననుంచి
గారవాన “ఆ నో భద్ర క్రతవొ యంతు
విశ్వతః” యని జపతప విధులు చేయ
సకలలోకాల జనులెల్ల చల్లగుండె (56)

తే.గీ.
రాణి విశ్పలాదేవను రాగమదిన
మంత్ర బీజశక్తి సుజన మానసాన
నిరతముంచుచుండగ నిగమ దీప్తి
నింగినంటినదనుమాట నిజమునిజము (57)

స్వాగతం:
రాణి మాటలన రక్తికి మాన్యుల్
రాణి వాక్కు నవరాజసమందున్
వాణి మాటలుగ వాడిగ నుండున్
రాణి వాణియను రాగము హెచ్చన్ (58)

తే.గీ
గూడు తననుండి సృష్టించి కులికే లూత
మూలికాదులనిచ్చుచు మురిసే భూమి
వర్షములనిచ్చి గగనంబు ప్రమదమొందె
సర్వజీవులు తమపని సల్పుచుండె (59)

తే.గీ.
మంత్రి వచనములిని రాజు మానసాన
ధర్మపత్నిదివ్యగుణాల తలపు మెరిసె…
విశ్పలను కొందరు నాడు విశ్పదనగ
తాను విశ్పలనియె యనెదననుకొనియె (60)

తే.గీ.
వినుత గోపూజ సాగించే విశ్పల తను
వెల్ల పులకరింతల సుమజల్లుకురవ
సిరుల గోమాతపూజను చేయువారు
అమరపథమును చేరుదురవనినుండి (61)

తే.గీ.
విశ్పలుండేటి వూరిన విభుదులంత
మెచ్చు శయుడను వాడుండే: మిడిసిపాటు
లేని వాడు గోసంపదె; లేమినంత
చంపుననువాడు సత్యవిశారదుండు (62)

చంద్రిక:
శయుడు సముడు శాంతి మాతకున్
శయుడు శమపు సారమంతయున్
దయన తెలుపు ధర్మశీలియే
శయుడు దమపు శాస్త్రరూపమే (63)

తే.గీ
గోసమూహమందు వెలిగి కులుకు శయుడు
గోస్వరూపంబు గోశాస్త్రకోవిదుండు
మురళీగానమందున గోవు మురియు విధము
తెలిసి వర్తించు నిరతము తెలివితోటి (64)

తే.గీ.
శయుని గోసంపదంతయు శక్తిహీన
మయ్యెనొకసారి, రోగాలకాలవాల
మయ్యి, విశ్ఫల గోవులనన్నిఁజూచి
అశ్వనీదేవతలను సహాయమడిగే (65)

తే.గీ
విశ్పలప్రార్థనలు విన్న వినుతఝరులు
అశ్వనీదేవతలుదివ్యమయిన పసరు
చేయు పద్ధతి విశ్పల చెంతనుంచ
పసరు చేసే యా కన్యక భవ్యరీతి (66)

తే.గీ.
పసరు తిన్న గో గణమంత వసుధ మీద
నూత్న ప్రాణాన తీరగాడె నూత్నరీతి
సిరుల తువ్వాయిలన్నియు చెంగుచెంగు
నెగిరి తల్లి గోవును చేరే నెదమురియగ (67)

తే.గీ.
గోపబాలుని లీలన గోగణంబు
ముదము మీరగ తారాడు మోదమందు
సాధు సంతతి పూజన సాగుచున్న
విశ్పలయె రాజుకు సతయ్యే పేర్మిగాను (68)

తే.గీ.
సతి తలపున మురియుచున్న సత్యరూపు
రాజు వదనాన్ని వీక్షించే రక్తితోటి
రాజు మన సెరిగిన మంత్రి రాజుతోటి
యివ్విధంబుగ వాక్రుచ్చె తలపులన్ని (69)

తే.గీ.
దేశభక్తిన రాణికి దేశమందు
సాటి యెవ్వరనగ రాణిసాటి రాణె
రాణి మేథస్సున జనులరాగముండె
వేదవేదాంతభావాలవెలుగులుండె (70)

తే.గీ.
రాణి పతిభక్తి రమణీయ రక్తియందు
తేలి యాడంగ; రక్షణతీరునందు
సకల జీవులు రాణికి సమమెయన్న
మంత్రి మాటలకు విభుని మనము మురిసే (71)

తే.గీ.
తమరు మహిళలకిచ్చేటి ధర్మరీతి
స్వేచ్ఛయందున ముదితలు వేగరీతి
తోటి ముందడుగున పోయి దురితమంత
తురుముచుండిరని చెప్పి మురిసె మంత్రి (72)

తే.గీ.
తమరి పరిపాలనందున ధర్మసిరిన
వెలిగే భూమాత నిగమాంబ జిలుగు వెలుగు
లన జగన్మాత మెరవంగ లక్ష్మియు మురి
పాన మీ పరిపాలనే పావనమనె (73)


ఆర్యావర్తన రాజువు
ఆర్యుల మదియెరిగి భూమి యందున సిరికిన్
ఆర్యావర్తనమే సరని
ఆర్యులు మెచ్చగ పాలించుమేటివయ్యారాజా! (74)

తే.గీ
రాణి విశ్పల స్త్రీలను రక్తితోటి
గారవించుచు కనపడు కమలనయన!
చేత కత్తున్న కలకంఠి చేవఁ జెప్ప
బ్రహ్మ తరమునుగాదిల బ్రహ్మసాక్షి (75)

తే.గీ.
ముదిత విలువను పెంచేటి ముగ్గమయిన
రాజ్యమిలయందు ఖేలుని రాజ్యమనుచు
శత్రు రాజులు మేచ్చేరు సాహసాన
ఖేల రాజ్యాన వనితల కులుకెకులుకు (76)

తే.గీ.
రాణి విశ్పల వదనాన రమ్య సిరిన
ముగ్గురమ్మలు కొలువుండే;;
ముద్దుతోటి రాణియన్నను విశ్పల రాణెరాణి
మంచి మనసున్న రారాణి మకుటధారి (77)

ఆ.వె.
శ్రీనివాస! దివ్య చిన్మయ దరహాస!
రాగభావతాళ రసవికాస!
వసుధనేలు తండ్రి! పాహిమాం పరమాత్మ
నీ చరణకమలమె నిఖిలమంత (78)

స్వాగతం:
శ్రీనివాస రస చిద్విలాసంబున్
మానసాననిడ మానవుల్ పొందున్.
సూనముక్తియును సూర్యరూపంబున్
స్థానతేజమగు సత్య లోకంబున్ (79)

సుగంధి:
శ్రీనివాస! చిద్విలాస! చింతలందు నీ కళన్
మానసాన నిల్పువారు మాన్యులయ్యి పృథ్వినన్
భానుతేజరూపుతోటి భవ్య దీప్తులొందుదుర్
భూనివాస! రమ్ము రమ్ము భూమినందు రక్షకా! (80)

(రాజర్షి ఖేలుడు ప్రథమాశ్వాసం సమాప్తం)