తే.గీ.
సృష్టి, స్థితి తిరోదాన సృజనతోటి
లయమనుగ్రహమునుపంచ లాంచనాల
కర్మతత్వమంతనెఱుగు కలహ రహిత
జంటదేవుళ్ళకు ప్రణవ చందనాలు (37)
తే.గీ.
పంచరూపస్వరూపపు భవ్యతంత
తెలిసివర్తించునశ్వనీ దీప్తులార!
శుభ హవిస్సులందుకొనగ సుందరంగ
రండి రండి ముదముమీర రండి రండి (38)
తే.గీ.
శుభకర్మలుఁజేసెడి సురులు మీరు
జనులకారోగ్యమివ్వగ సాగువారు
విశ్వశాంతిని కాంక్షించు వేల్పులార
కదలిరండి జంటగ మమకారమదిన (39)
తే.గీ.
జలద జలవిద్యలన్నియు జయమనగ
నేర్చె విశ్పల ముదమున నేర్పుగాను
నేర్చినచదువునంతయు నీతితోటి
జనులకుపయోగపడునట్లు జవ్వనుంచే (40)
తే.గీ
బావిన పడ ముక్కుపుడక పాటవాన
తీసి విశ్పల పదుగురి దృష్టినపడే
పంచభూతాల మాటున పదును తేలి
మెరియు తేజమంతయు పట్టె మేథతోటి (41)
ఆ.వె.
రేబియనెడినాతి రేయింబగళ్ళను
వేదనీతినంత వేరుచేసి
వేదనీతియందు వెలిగేటి
శాస్త్రాన్ని జనుల నడుమనుంచు జగతిమెచ్చ (42)
ఆ.వె.
భర్తననుసరించి భవ్య పథంబున
సాగు; రేబి పతికి చచ్చుపడగ
కాళ్ళు; విశ్పల రసకాంతి వైద్యముతోటి
జబ్బు నయముఁజేసె సాదరంగ (43)
తే.గీ.
రేబి పతిని రక్షించిన రీతినంత
కథలు కథలుగ చెప్పుచు కనులయందు
ముదము పొంగంగ విశ్పల మోముఁజూచి
రెండు చేతులు జోడించే మెండు జనులు (44)
తే.గీ
సాహసాల విశ్చలఁజూచి సతిగనీమె
తనకు సరయినదనుకొనే ధర్మగతిన
రాజు రారాజు ఖేలుడు రసికజీవి
మొదటి చూపునందే వలపు ముదము పెంచే (45)
స్వాగతం:
కోకిలమ్మ రసకూతలు కూయన్
లోకమంత నవలోగిలిగవ్వన్
వేకువంత జిగి వేల్పుగమారన్
మోకరిల్ల మహిముందటనార్యుల్ (46)
ఆ.వె.
బాటసారులమని పది వరహాలిచ్చి
విశ్పలింటనుండి విభుడు విభుని
సఖుడు ముదము మీర సలలిత శోభన
రాజు విశ్పలందు రక్తి పెంచ (47)
తే.గీ.
తిండిబోతులు మేమని తేల్చ వారు
విశ్పల పాయసాల రుచిని పేర్మిగాను
చూ పెనిర్వురు మెచ్చగ సోయగాన
ఖేల ణణకులు మిక్కిలి కేళిఁజేయ (48)
తే.గీ.
తిండియందున మిన్ననే తినుచు రాజు
కాదు నేనేను మిన్ననే గారవాన
రాజు మిత్రుడు ణణకుడు
రక్తితోటి వాదనలు వినే విశ్పల వాలుగంటి (49)
తే.గీ.
హాసడెందిన రాజుకు హాయినివ్వ
విభుని తిత్తిండి చేసెను విశ్పలపుడు
ఆకలాకలియని యల్లాడవని పతికి
బహురుచులభోజనములు వనిత పెట్టె (50)
తే.గీ.
రాజు యాకలి చావక రయముగాను
మిత్రునిబ్బంది పెట్టగ మేథినందు
మందులిచ్చుచు నరపతి మానసంబు
విశ్పలగెలవ;తిత్తిండి వెళ్ళిపోయె (51)
తే.గీ.
విభుడు మోదాన పరిణయ విషయమంత
వనిత పెద్దలముందున వ్యక్తపరచ
మానసంబున కళ్యాణ మధురిమంత
సిగ్గుమొగ్గలేయగనాతి సిగ్గునుండె (52)
తే.గీ.
వనిత వయ్యారి నవ్వుల వాలుచూపు
రాజు మానసగుడినందు రాగమవ్వ
మన్మథవికాస సంచారి మమతలూరు
ఖేలడెందిన విశ్పల కేళిచేసే (53)
క.
కచభారములాగ వెనుక
కుచభారములాగ ముందు కుచకచ హోరున్
కుచకచభారపు పోరున్
వచియింప హరియనుచు కటి పడతిని వదిలెన్ (54)
చంద్రిక:
వరుని వదన పావనత్వమున్
నరవరతను నవ్యతంతయున్
సరిగ తెలుపు సవ్యశక్తితోన్
తరలె సురలు ధర్మ తేజమున్ (55)
తే.గీ.
లోకమంత సంతోషాల లోతులన్ని
చూచి గంతులేయుచుసాగ సోయగమున
ఖేల విభుడు విశ్పలను సుకేళితోటి
వేదధర్మాన పెళ్ళాడే వేల్పులాగ (56)
స్వాగతం:
పెళ్ళిఖేలునికి విశ్పలకంటున్
పెళ్ళివారమని పెళ్ళికి వచ్చెన్
మళ్ళిమళ్ళి సురమాన్యులు నవ్వుల్
తుళ్ళితుళ్ళిపడ దూరములేకన్ (57)
తే.గీ.
పరిణయమయిన విశ్పల పతిపలుకుల
ననుసరించి పేదల జబ్బులన్ని మాయ
చేయు వృత్తిని యావత్తు చేయుచుండె
మనుషులారోగ్యమందున మసలుచుండ (58)
తే.గీ
వద్రియను నాతి సంతానవతిగ మార
కుండుటకు కారణము పతి యూహలన్న
సత్యము తెలిసి విశ్పల సబల వద్రి
మారు మనువుకునొప్పించే మానవతన (59)
తే.గీ.
మనుజులెవ్వరు విశ్పల మాటలందు
మక్కువుంచకున్నను రాజు మాత్రమపుడు
భార్య యోచనలన్నియు భవ్యరీతి
సమ్మతించ వద్రి మనువు సాగిపోయే (60)
తే.గీ.
నూరుతెడ్లుతెగిననావ నుయ్యిలాంటి
సంద్ర మందున వేగాన సాగుతుండె
నావనందు భుజ్యుడనెడి నరుడు వర్త
కుండునుండె; యిదేమని కుములుతుండె (61)
తే.గీ.
భుజ్య! పేదల పాలిట పెన్నిదియను
సూక్తి నీనుండి వచ్చెరా సుందరాంగ
మమ్ము కాడి దేవర! మంచివాడ
యనుచు పేదలాతని నుతులందు ముంచ (62)
తే.గీ.
జనుల మానసంబున భుజ్య చంద్రికలను
గాంచు విశ్పల భుజ్యుని కరుణతోటి
రక్ష చేయగ కదిలింది రయముగాను
రమ్య యోగాన భుజ్యుని రక్షచేసె (63)
తే.గీ.
మురిసి పోయిన భుజ్యుని మురిపెమంత
మనసునందున తారాడ మమతతోటి
అశ్వనీదేవతామూర్తులంత తనకు
ముదముగిచ్చిన గుఱ్ఱాల మోముఁజూచి (64)
తే.గీ.
రాజ! యీ శ్వేత హరులను రమ్యసిరిన
అశ్వనీదేవతామూర్తులంత యిచ్చె
వాటినిపుడు బహుమతిగ భవ్యమదిన
నీకు నేనిచ్చుచుంటిని నిజము నిజము (65)
తే.గీ.
సూర్యఛాయల పుత్రులు సుందరంగ
అశ్వనులయినారని విశ్పలనగ ముదము
మీర వారిని స్తుతియించె ముక్తి నిచ్చు
వైద్య మంత మెరుగు మహా వైద్యులనుచు (66)
తే.గీ.
ఖేలుడంత తన కథను కేళితోటి
తనకే చెప్పుచున్నారన ధర్మరతిన
భర్త మోమున తారాడు భవ్యశక్తి
రీతి గమనించే విశ్పల స్తుతుల నడుమ (67)
తే.గీ.
చిత్ర బావిని విశ్పల చిత్రరీతి
అశ్వనుల సహాయంబున నందరిలన
అచ్చెరువుంద నిర్మించి నందు వివిధ
మందులొచ్చేటి తీరును మహిన దాచే (68)
తే.గీ.
శ్రీనివాసుని దయవున్న సిరులె సిరులు
స్వామి పద సేవనందున సకలమబ్బు
సత్య పథమున సాగేటి సత్య తేజ!
శ్రీనివాస! కాపాడు నాతండ్రి చిద్విలాస! (69)
తే.గీ.
పతిపతిపతిమా మంగళ పతి తిరుపతి
కొండ మీదన వెలసిన కోటి వేణు
వులోకసారిగ మ్రోగగ తలపులందు
మెరియు వేంకట నాయక! మెరుపు నీవే (70)
స్వాగతం:
వెల్గులివ్వ నవవేదిక మీదన్
వెల్గులిచ్చి రసవీణను మీటన్
వెల్గులివ్వయిలవేల్పుగ రారా
వెల్గులందు తిరువేంకటనాథా! (71)
రాజర్షి ఖేలుడు ద్వితీయాశ్వాసం సమాప్తం