తృతీయాశ్వాసము
తే.గీ
శ్రీనివాసుని చిత్తము సిరులమయము
శ్రీనివాసుని చరణాల చేరువారు
మోక్షమార్గాన పయనించు ముదముతోటి
శ్రీనివాస! దివ్యవికాస! చిద్విలాస! (1)
తే.గీ.
ఏడుకొండలవాడిగ తోడుగుండ
జాలిగుండెలఱేడుగ జయమునివ్వ
మూడు నామాలవాడిగ ముక్తినివ్వ
కదలిరావయ్య వెంకయ్య కలియుగాన (2)
తే.గీ
ఖేలరాజ్యవికాసంబు; ఖేలరాజ్య
వేద ధర్మంబునంతయు వెకిలి చిత్త
మందు నిల్పి; విష్వాచుడు యముడుగయ్యి
అద్రిరాజును రప్పించెనతనికడకు (3)
చంద్రిక:
వినుము వినుము వీరుడయ్యిలన్
కినుక తనము భేలునందునన్
పనుపుమిలనపారబుద్ధితోన్
అనియనే విభుడద్రిరాజుతోన్ (4)
తే.గీ.
లోకమెరిగిన మానవలోకవిభుడు
మహిన ఖేలుడనుచునది మనసువిప్ప
కోపమొందె విష్వాచుడు కుమతిలాగ
స్వాగతించినవారిని చంపదలచి (5)
తే.గీ.
కుటిలతత్వ విష్వాచుని క్రూరమంత
వేగిరంబున గమనించి వీరత మంత్రి
స్వాగతించినవారిని చంపరాదు
వినుము నామాట విష్వాచ వినుమనంగ (6)
తే.గీ.
దురితరాజు విష్వాచుడు తులువగయ్యి
అద్రిరాజును చీకటి అలుముకున్న
గదిన తోయించెనంధులుగాను మలచి
దురితులకు నిత్యముండుడు దూరముగను (7)
తే.గీ.
అద్రి రాజు వెతలనన్ని ఆలకించే
చారులవలన విశ్పల; సాహసాన
అద్రిరాజు సహనశీలి యనగనంత
సాటి రాజును రక్షించ సబల కదిలే (8)
తే.గీ.
కత్తి పట్టెను విశ్పల కదనరంగ
మందు విష్వాచ పీచమునడచు తలపు
నిండుగుండ ; కాళికవ్వుతు నిప్పుకక్కె
పగతురుభయముతోడుండ పారిపోయె (9)
తే.గీ.
విభుని సహకారమంతయు విశ్పల; ఘన
సమరరంగాన పొంది; విజయపథాన
సాగి దుర్మార్గ విష్వాచ జాతకాన్ని
ముప్పతిప్పలు పెట్టెను ముదముగాను (10)
తే.గీ.
శిరములవనిమీదుంచుచు శిక్షవేయు
నీచ విష్పాచుడధరంగ నిగమదీప్తి
నెరుగు విశ్పల మంచిని యెంచువార్ని
చెరకు దూరముగుంచుచు చెలిమి పెంచే (11)
తే.గీ
అద్రి బృందము మిక్కిలి హాయిగుండె
రజ్ర మూకయు సంతసరాగమొందె
అంధులమనుచు కుములుచునందరుండె
నయనహీనులందరు రాణి నయనమనిరి (12)
తే.గీ.
నయన హీనుల బాధను రయముగాను
రాణి గమనించి; కన్నుల రసమునుంచి
కనులు తెప్పించు శాస్త్రవికాసమంత
తలచి పసరును నూరించే ధరణిమీద (13)
తే.గీ.
అంధులంత పసరుమందునంత కళ్ళ
నుంచిరయిదుమాసంబులునోర్పుతోటి
కడకు చూపురాగ నవవికాస మనము
తోటి నాతికీ వందన తోయమిచ్చె (14)
తే.గీ.
నూత్న నయనాల తేజంబు నూత్నశక్తి
నివ్వ, సాటిరాజయిననదీలన రాణి
విశ్పలయెడను భక్తియు వినుత నమ్మ
కంబునుంచే; సుదరహాస కవనమల్లి (15)
తే.గీ.
విశ్పల సహాయ సహకార పెంపునకును
జనులు సాటిరాజులు నవ చలనముంచి
దేశ సుగతిని మరిమరి తేజమందు
నింప ముందుకు సాగిరి నిక్కముగను (16)
తే.గీ.
పాడిపంటల నడుమన పరుగుతీయు
రాజ్యశోభకు విష్వాచరాజు కుమిలి
కుమిలి దుఃఖించి పంటను కూల్చివేయు
పన్నగముపన్ని సాధించె పాప జయము (17)
తే.గీ..
చేతికందినపంట నోటతినలేక
బూడిదవ్వుటఁజూచిన పుణ్యశీల
విశ్పల పతియాన పెరగంగ విజయదుర్గ
యయ్యి వాడిఖడ్గముపట్టె నాహవాన (18)
తే.గీ.
కత్తికత్తి కలబడగ కదనమందు
శత్రు శిరములు కుప్పల సందడవ్వ
బతికున్నచాలు ఖరము పాలు తాగి
బ్రతికెదనని విష్వాచుడు పారిపోయె (19)
తే.గీ.
కుమతియింటనున్నసిరిని కొల్లగొట్టి
సుజనులకు సమర్పించు సుందరంగ
అన్న నీతిన విశ్పల అసుర బుద్ది
యున్న విష్వాచ సిరినంత ఊడ్చివేసె (20)
తే.గీ.
దురిత విష్వాచ దుర్మార్గధూర్తమందు
చేతికందినపంటలు చిద్రమయ్యి
మంటలందున పడిపోయి మాడిపోయె
విషపు కళ్ళన సుధకూడ విషముగవ్వు (21)
తే.గీ.
దురిత విష్వాచ దురితపు దుండగాన్ని
వీర విశ్పల కరిగించే వీర సబల
శత్రు రాజ్య జనులనందు సచ్చరిత్ర
వున్నవారినాహ్వానించే నువిదయపుడు (22)
తే.గీ.
జనుల కడుపుమంటలనన్ని జవ్వనపుడు
మదిన గమనించి యాకలి మంట తీర్చ
వేగరీతిన పండేటి వేల్పు పంట
హాలికులకునాశుప్రీహిహాయిగిచ్చె (23)
తే.గీ.
మహిళలందరునొకచోట మసలునట్లు
చేసి; విశ్పల వారికి చెప్పే విద్య
నందు వెలిగేటి ధీశక్తి నంత ముదిత
లమది చదువుల గుడిగ వెలగగ మహిన (24)
తే.గీ.
సదుపయోగ విద్యల రససారమంత
వనితలందరి యెదలందు పదునుగుంచే
విశ్పల; నవశాస్త్రంబున వెలుగులన్ని
నాతులందరికలవడగ నవ్యరీతి (25)
తే.గీ.
దురిత విష్వాచుడప్పుడు దురితరీతి
సంచరించి; ఖేలుని వీర సైనికులను
మాయన నపుంసకులుగను మార్చివేయ
తల్లడిల్లిరి వీరులు ధరణినందు (26)
తే.గీ.
వీరులందరి బాధను వీరవనిత
మనసు పెట్టి తెలుసుకొని మందులివ్వ
స్వల్ప కాలాన మామూలు జనులుగయ్యె
విశ్పలను వేయి నోళ్ళతొ వేల్పుయంటు (27)
తే.గీ.
దురిత విష్వాచుడంతట దురితుడయ్యి
పాడియావులన్నిటికిని పాలురాని
మందునిచ్చి గొడ్డావుల మంద చేయ
గొల్లుమనినారు గోపాలకూటమంత (28)
తే.గీ.
విశ్పలంతట గోగణ విత్తమునకు
పచ్చమందిచ్చి దివ్యంగ పాలనిచ్చు
పాడియావులఁ జేయగ వసుధ మీద
పంచె గోపాలురానంద ప్రణవరసము (29)
తే.గీ.
వినుత గోపూజఁజేయించే విశ్పలటను
గోవులన్న భువిన సురగురువులంటు
గోవునందలి దివ్యత గోప్యతంత
తెలిపే విశ్పల ముదమున దివ్యమదిన (30)
తే.గీ.
శయుని గోసంపదంతయు సంహరించ
నపహరించ; విష్వాచుడు యముడుగయ్యి
కత్తి పట్టిన విశ్పల కదనమందు
కాళికయ్యి గెలిచే నవ ఘనత పెరగ (31)
తే.గీ.
ధర్మపత్ని సుగతిఁజూచి దర్పముగను
ఖేలరాజు వనములందు కేళితోటి
సంచరించెనడవులన్ని సస్యరమగ
మారవలయునన్నమదిన మసలసాగె (32)
తే.గీ.
ఆశ్రమాలను పెంచంగ యతులతోటి
దివ్యమార్గంబు చూపండి దీక్షతోటి
సుగతి పథమంత మీదిగ చూపరండి
అనెడి ; ఖేలవిభుడు నవయశమునొంది (33)
తే.గీ.
పెరిగే యాగశాలలచట పెరిగే యతులు
పెరిగే ధర్మము, సత్యము పెరిగే రుతము
తరిగే కాలుష్యమంతయు; తరిగె బద్ద
కంబును తరిగె దురితవికారములును; (34)
తే.గీ.
యాగశాలల తేజంబు యాగములకు
కావలసినపదార్థాలు క్రమము తప్ప
కుండ విశ్పల పంపగ; కోమలంగ
యతుల యాగములందున యమము హెచ్చె (35)