Site icon Sanchika

59. రాజర్షి ఖేలుడు

[box type=’note’ fontsize=’16’] 2018 దసరా కవితల పోటీలలో ప్రత్యేక బహుమతి పొందిన కవిత.
[/box]

రాజర్షి ఖేలుడు
నిర్వచన కథాప్రబంధం

సుగంధి:-
శ్రీనివాస పాదసేవఁజేయుచున్న నన్నిలన్
శ్రీనివాస తేజమంతఁజేరి వాణి దివ్యతన్
మానసాన నిల్పి దివ్య మందహాస భావనల్
కానుకివ్వ; కావ్యకాంతకాంతికూపీరూదితిన్ (1)

తే.గీ.
అయ్యగణపయ్యకుకుడుములారబెట్టి
ఆరుమోముల సామికి హారతిచ్చి
మూడుకన్నులవాడిని ముక్తినడిగి
తల్లి పార్వతి పదసీమ తలనువాత్తు (2)

తే.గీ.
జానకమ్మ మెచ్చిన రామచంద్రమూర్తి
సేవనందున నిల్చిన చిత్తమందు
తామసాగ్నులు చేరవు ధరణి మీద
మోక్షకాంతులు కనుముందు మూర్తిగవ్వు (3)

ఆ.వె.
తల్లి దేవతన్న ధర్మకాంతుల మధ్య
తండ్రి దేవుడన్న తలపులందు
గురువు దేవుడన్న గురుధర్మమందున
భరతభూమి వెలిగే భవ్య రీతి (4)

తే.గీ.
తెలుగు పద్యాల సొబగున తేనెలూరు
తెలుగు పద్యపునాదిన వెలుగు చుండు
నవరసాల నవగణిత నవ్యతంత
వెలుగు; శాస్త్రీయభావాల పెంపుతోటి (5)

ఆ.వె.
గురువు, లఘువు రెండు గుర్తులున్నను చాలు
తెలుగుపద్యమలరు జిలుగుతోటి
గణన యంత్రభాష ఘనముగనిల రెండు
చిహ్నములయందె; సాగేను చిత్రమిదియె (6)

తే.గీ.
తెలుగు గణగుణ తేజస్సు తెలియకుండ
పద్యమునుపాతి పెట్టగ పదపదమని
పలుకుచుండెడివారి కవనమునందు
శాస్త్ర తేజము శూన్యము సత్యమిదియే (7)

తే.గీ.
దివ్య వేదాంగములయందు దినకరునిగ
వెలుగు ఛందస్సున; గణిత వెలుగుకలదు.
శాస్త్ర దృష్టినఁ జూచెడి చదువులన్ని
ఛందమందలి గణితము చదువునెపుడు (8)

తే.గీ.
కనుము; గతకాలమందునే; గణపునాది
మీద, తెలుగు పద్యంబుల మేనునుంచి
రసమయంబుగ; తమ భావరాగమంత
తెల్పినారు పూర్వకవులు; దివ్య యతులు (9)

ఆ.వె.
సూర్యగణవికాస సుగతిన ప్రవచన
గణితముంది; బీజగణితముంది;
నేటి గణితసూత్ర నియమాల తేజంబు;
నాడే కలదు కవన వాడితోటి (10)

తే.గీ.
గణిత తేజాన వెలుగొందు ఘనగణాల
గతిన రాజర్షి ఖేలుని కాంతినంత
తెలుగు పద్యము పులకించ తెలియఁ జేతు
వేదభారతి కరుణించ విఙ్ఞనయ్యి (11)

తే.గీ.
ఓం అనగ విశ్వకంపనమోయి జీవ
కంపనంబున పుట్టిన కాంతిరూపు
నిత్య పారాయణంబున నిల్వ; ఖేల
భూపతి గుణమంత నచటే; పుట్టి పెరిగే (12)

స్వాగతం:
రాగభావ రసరాజిత ఖేలున్
ఆగమాల పతి యాతడే యంటున్
యాగశాల నవ యజ్ఞముఁ సేయన్
రాగ మోదమున రమ్మని పిల్చున్ (13)

తే.గీ.
దివ్య రాజర్షి ఖేలుని తేజమంత
బాలభానుని కిరణాల వెలుగుచుండ
సూర్యదేవుని మనసునఁ జూచుకొనుచు
తోయమర్పించే; ఖేలుడు తుష్టితోటి (14)

తే.గీ.
సోమమందున తారాడు సోమతేజ!
కృష్ణవర్ణజగతినుండి కృపతనువున
సురనరాళిని రక్షించగ సూర్యదేవ!
కనక నిర్మిత రథమున కదలిరార! (15)

తే.గీ
విశ్వకర్మసుతుడవయ్య విశ్వమేలు
సూర్యదేవ! సోమరసపు సోయగాన
ప్రాణమయ్యి వెలుగుచున్న భవ్య తేజ!
వందనాలయ్య! మార్తాండ! వందనాలు (16)

తే.గీ.
కన్నతల్లి యెవరు నీకు కాంతి తేజ!
బాలభానుడ! వుదయించి ప్రతిదినంబు
మహిత జగమంత వెలిగించి; మమ్ముకాచు
సూర్యనారాయణ! ప్రణవ సుందరాంగ! (17)

తే.గీ.
భువిన భూపాలరాగాలు భూసురగణ
బీజమంత్రాలు కలబోసి పిలువ నిన్ను
లోకమంత వెలుగునిచ్చు లోకనాథ
ధర్మ తేజాన రావయ్య ధర్మచరిత (18)

తే.గీ.
సురనదుల కెరటాలపై సుగతికోరి
వెలుగు చిమ్మేటి కిరణాల వెలుగునందు
జగతి మానసమంతయు జయజయమని
నవరసాలపాటలు పాడె; నలువలాగ (19)

తే.గీ.
ప్రణవ రాజర్షి ఖేలుని వదనదీప్తి
భక్తి సంద్రాన మునగంగ భవ్య రాజు
మానసంబున కదలాడే మాన్య చరిత
సురసరస్వతీ నది భవసోయగంబు (20)

తే.గీ.
అమ్మ! గంగమ్మ! కదలాడు అవని మనది
తల్లి! యమునమ్మ! జలమంత తన్మయంబె!
యిల సరస్వతీనీటిన వెలుగు జిలుగు
ముగ్గురమ్మలు దీవించ మోక్ష పథమె (21)

తే.గీ.
శారదానదీతరగల సరిగమలకు
బాలభానుడు పులకించ వసుధ మీద
కిరణ కెరటాలకాంతిన ఖేలుని మనసు
సుథన సంచరించనాతని చూపు మెరిసే (22)

తే.గీ.
మెరుపు చూపుల ఖేలుడు మెరుపు తీగ
వలె; సరస్వతీనది ముందు నిలచి మోక
రిల్లె దివ్యహవిస్సులు తల్లికివ్వ
సిద్ధమనే భక్తి భావన చేర మదిన (23)

తే.గీ.
దివ్యధినుసుల మంత్రాల దీప్తినందు
రూపమందు హవిస్సుల రూపమందు
దివ్య సుర తేజమలరారు దివిన భువిన
స్వీకరించ హవిస్సును సిరిగ రమ్ము (24)

తే.గీ.
శాస్త్రపథపు హవిస్సుల శక్తి నంత
సర్వవేదాల సారము సన్నుతించె
దివ్యహయ్యంగవీనపు దీప్తినందు
ప్రాణ తేజ హవిస్సుల ప్రసరణుంది (25)

తే.గీ.
సురులకు నరుడు శాస్త్రీయ శుద్ధినందు
వెలుగుతుండు. హవిస్సును విద్యగివ్వ
వింత వింతల కాంతిన వేల్పుసిరులు
నరునకు సురత్వమిచ్చు భూనభములందు (26)

తే.గీ.
శాస్త్రహీన హవిస్సులె సత్యమనుచు
వాటి వెనుకనె పోయెడి వారలంత
నరక కష్టాల మాటున నడిచి నడిచి
కఠిన చిత్తాన వదులును కరుణనంత (27)

తే.గీ.
సోమరసమందు వెలిగేను సూర్యశక్తి
చంద్రతేజము రయమున సతతమొకటి
గయ్యి సోమశక్తిని పెంచు కరుణ తేజ!
ధరణినహవిస్సునంతయు త్రాగరమ్ము (28)

తే.గీ.
యాగవేదికలందున నమరివుండు
గణిత తత్వమునంతయు గమనమందు
నిల్పకున్నను ఫలమంత నిష్పలంబె
దుష్ఫలంబున మరణము తొంగిచూచు (29)

తే.గీ
పక్షి రూపున హంసరూపమున యాగ
వేదికలు నూటయెనిమిది పేర్లతోటి
వెలుగుచున్నవి నిక్కము వెలుగులందు
వెలుగు గణితసూత్రగరిమ వెలుగుదీప్తి (30)

తే.గీ.
నీ చరణసీమ సాక్షిగ నేను చెప్పు
మాటలివి నిప్పులాంటివి మాత నమ్ము
ఋతహవిస్సుల ప్రాణాన్ని ఋతపథాన
ధారపోయగ నేనుంటి ధర్మచరిత (31)

తే.గీ
ఖేలవచనాలమాటున తేలు ఋతము
విన్న భారతి దరహాస విలువఁజెప్ప
వేదవేదాంతాలనెరుగు వేల్పుబృంద
తరముకాదు పంచాగ్నుల తరముకాదు (32)

స్వాగతం:
వాణివమ్మ రసవాక్కుల మాటున్
రాణివమ్మ నవరాగముకున్ పా
రాణివమ్మ సిరిరాగమునందున్
వేణివమ్మ ఘన వేల్పుల తల్లీ (33)

తే.గీ.
మంత్రి భాష్కలుడన్నను మనసువిప్పి
మాటలాడు భేలుడెపుడు మమతతోటి
రాజదర్శనార్థము మంత్రి రాజు వద్ద కేగ
రాజుచూడనేలేదు జగతి మరచి (34)

తే.గీ
యాగశాలల నిర్మాణ యత్నమందు
మురిసిపోయెడి రారాజు ముదమునెరిగి
గతమునందున భూపాల గమనమంత
గుర్తు చేసుకొనియె మంత్రి కుశలశీలి (35)

స్వాగతం:
యాగరూపములు యాగ సుకీర్తుల్
యాగ తేజములు యాగ సుదీప్తుల్
యాగలోకములు యాగములన్నిన్
యాగఖేలునికినన్నియు తెల్సున్ (36)

చంద్రిక:
జయము జయము చంద్రలేజమా
జయము జయము సత్యరూపమా
జయము జయము సత్వపాలకా
జయము జయము శాస్త్ర వేదమా (37)

తేగీ.
గరుడరూపాన వెలుగొందు కాంతిదీప్తి
హంసరూపాన మెరిసేటి హంసదీప్తి
పద్మరూపాననలరారు పసిడిదీప్తి
యాగనిర్మాణ గణితాన జగతీదాగె (38)

తే.గీ
నూట యెనిమిది రూపాల నూత్న యాగ
శాలల నడుమ ఖేలుడు సత్య తేజ
శీలిగ వెలిగి; మునివరాశీస్సులన్ని
రాజు తనువును చుట్టంగ రాగశీలి (39)

తే.గీ.
రాజ రూపాన యాగాగ్ని రక్తిచెంద
బ్రహ్మవిష్ణుమహేశ్వర భవ్య సిరులు
ఖేల రారాజు రూపున కలిసివుండె
ఖేల దీప్తిన యాగాలు గిరిధరంబె (40)

తే.గీ.
దేహమాటున జీవుడు దేవరూపు
పాపకర్మల మూటను పంచుకొనుచు
మాయువస్త్రముఁ దీయును మరల మరల
తనువు పోయిన ధర్మము తరలదెపుడు (41)

తే.గీ.
పేదజీవుల మోమున పేడఁగొట్టి
పాలనన్నియుఁదీసుకు పారిపోవు
పాప జీవుల గుండెన పండుకొనగ
ఖేలుడవనిననవతరించే కాలుడయ్యి (42)

ఆ.వె.
ఖేల వాక్కులందు మూలవేదములన్ని
వెలుగు బీజదీప్తి వెలుగునందు
రాజులందు మిన్న రారాజు ఖేలుడు
వేదరూపమందు వెలుగుచుండు (43)

స్వాగతం:
వేదమంత్రములు వేల్పులటవ్వన్
వేద కాంతులన వెల్గిడి ఖేలున్
వేదపండితులు వేల్పుగఁగొల్వన్
వేదతత్వములు వెల్గెను పృధ్విన్ (44)

తే.గీ.
రాజులందు నిబర్హణ రాజు;; యాగ
ధర్మమంతయు మతిలేని ధర్మమనుచు
యాగనిందను చేయుచు యతుల వలన
ప్రగతి జగతంత వెనుకంజ పట్టెననును (45)

తే.గీ.
ధనబలంబున తారాడు ధరణి పతియే
రాజు రారాజు యాతని రాగమందె
వాణి కొలువుండనుచు నిబర్హణుండు
యాగమన పెద్దరోగమె యనుచు సాగు (46)

తే.గీ.
ఖేలుని యాగదీక్ష తెలియ మలిన రాజు
ఆ నిబర్హణుడప్పుడు యమునిలాగ
విషము చిందించు విష్వాచ విభుని తోడు
కోరనాతడు సరియని కరము సాచె (47)

తే.గీ.
యాగ తేజాన యశసించు రాగశీలి
ఖేల విభుని మీదకు యుద్దకేళియంచు
రాజులిర్వురు రాగ శరముగలేచి
కత్తిపెట్టిన ఖేలుడు కదనమయ్యె (48)

తే.గీ.
యాగపురుషుని రూపాన యశమునొంది
ఖేలుడు నిబర్హణవిభుడు విలవిలమని
కొట్టుకొనిచచ్చు తీరుగ పట్టిచంప
యాగపురుషుడు ముదమున యోగమయ్యె (49)

తే.గీ
ఆరగించే హవిస్సులనమరులంత
యాగతేజాన కొలువున్న యోగమంత
ఖేలుడెరుకపరిచే జనఖీల నడుమ
ముదమునొందగ నరులంత ముక్తితోటి (50)

తే.గీ.
మానవమనుగడంతయు మసలుచోటు
శుద్ధ వాతావరణము; విస్ఫూర్జితముగ
చేయు శాస్త్రీయ మార్గము చేవగలది
యాగమొక్కటే యనేరాజు యాగభోగి (51)

తే.గీ.
యుగము మారిన జగములై యుగములందు
కలసిసాగిన; యాగమే కలసివచ్చు
జగతి శుభ్రత పెంచగ శాస్త్రమయ్యి
అనుచు రారాజు యలరారే యవనిమీద (52)

తే.గీ.
కలుషవాతావరణమందు కలిసివున్న
విషమునంతఁదీసెడి యాగవేల్పుడెపుడు
పూజనీయంబె: కావున పూజనీయ
మార్గమందుపోమనె రాజు మానవులకు (53)

తే.గీ.
గతమొదిలి మంత్రి భేలుని కడకు వెళ్ళి
వందనంబులు చేయగ సుందరంగ
ముదముమీరగ రారాజు ముగ్ధుడవుతు
దేశ సుగతికి కారణదీప్తినడిగె (54)

తే.గీ.
విభుని మాటలన్నియు విన్నశుభఘడియన
మంత్రి దేశసుగతినంత మహిమమీర
తెలియ చెప్పె”పర్జన్యస్తుతులను” జనులు
ఆలపించగ వర్షాలు హాయిగొచ్చె (55)

తే.గీ
జనులు దీర్ఘాయువంతను మదిననుంచి
గారవాన “ఆ నో భద్ర క్రతవొ యంతు
విశ్వతః” యని జపతప విధులు చేయ
సకలలోకాల జనులెల్ల చల్లగుండె (56)

తే.గీ.
రాణి విశ్పలాదేవను రాగమదిన
మంత్ర బీజశక్తి సుజన మానసాన
నిరతముంచుచుండగ నిగమ దీప్తి
నింగినంటినదనుమాట నిజమునిజము (57)

స్వాగతం:
రాణి మాటలన రక్తికి మాన్యుల్
రాణి వాక్కు నవరాజసమందున్
వాణి మాటలుగ వాడిగ నుండున్
రాణి వాణియను రాగము హెచ్చన్ (58)

తే.గీ
గూడు తననుండి సృష్టించి కులికే లూత
మూలికాదులనిచ్చుచు మురిసే భూమి
వర్షములనిచ్చి గగనంబు ప్రమదమొందె
సర్వజీవులు తమపని సల్పుచుండె (59)

తే.గీ.
మంత్రి వచనములిని రాజు మానసాన
ధర్మపత్నిదివ్యగుణాల తలపు మెరిసె…
విశ్పలను కొందరు నాడు విశ్పదనగ
తాను విశ్పలనియె యనెదననుకొనియె (60)

తే.గీ.
వినుత గోపూజ సాగించే విశ్పల తను
వెల్ల పులకరింతల సుమజల్లుకురవ
సిరుల గోమాతపూజను చేయువారు
అమరపథమును చేరుదురవనినుండి (61)

తే.గీ.
విశ్పలుండేటి వూరిన విభుదులంత
మెచ్చు శయుడను వాడుండే: మిడిసిపాటు
లేని వాడు గోసంపదె; లేమినంత
చంపుననువాడు సత్యవిశారదుండు (62)

చంద్రిక:
శయుడు సముడు శాంతి మాతకున్
శయుడు శమపు సారమంతయున్
దయన తెలుపు ధర్మశీలియే
శయుడు దమపు శాస్త్రరూపమే (63)

తే.గీ
గోసమూహమందు వెలిగి కులుకు శయుడు
గోస్వరూపంబు గోశాస్త్రకోవిదుండు
మురళీగానమందున గోవు మురియు విధము
తెలిసి వర్తించు నిరతము తెలివితోటి (64)

తే.గీ.
శయుని గోసంపదంతయు శక్తిహీన
మయ్యెనొకసారి, రోగాలకాలవాల
మయ్యి, విశ్ఫల గోవులనన్నిఁజూచి
అశ్వనీదేవతలను సహాయమడిగే (65)

తే.గీ
విశ్పలప్రార్థనలు విన్న వినుతఝరులు
అశ్వనీదేవతలుదివ్యమయిన పసరు
చేయు పద్ధతి విశ్పల చెంతనుంచ
పసరు చేసే యా కన్యక భవ్యరీతి (66)

తే.గీ.
పసరు తిన్న గో గణమంత వసుధ మీద
నూత్న ప్రాణాన తీరగాడె నూత్నరీతి
సిరుల తువ్వాయిలన్నియు చెంగుచెంగు
నెగిరి తల్లి గోవును చేరే నెదమురియగ (67)

తే.గీ.
గోపబాలుని లీలన గోగణంబు
ముదము మీరగ తారాడు మోదమందు
సాధు సంతతి పూజన సాగుచున్న
విశ్పలయె రాజుకు సతయ్యే పేర్మిగాను (68)

తే.గీ.
సతి తలపున మురియుచున్న సత్యరూపు
రాజు వదనాన్ని వీక్షించే రక్తితోటి
రాజు మన సెరిగిన మంత్రి రాజుతోటి
యివ్విధంబుగ వాక్రుచ్చె తలపులన్ని (69)

తే.గీ.
దేశభక్తిన రాణికి దేశమందు
సాటి యెవ్వరనగ రాణిసాటి రాణె
రాణి మేథస్సున జనులరాగముండె
వేదవేదాంతభావాలవెలుగులుండె (70)

తే.గీ.
రాణి పతిభక్తి రమణీయ రక్తియందు
తేలి యాడంగ; రక్షణతీరునందు
సకల జీవులు రాణికి సమమెయన్న
మంత్రి మాటలకు విభుని మనము మురిసే (71)

తే.గీ.
తమరు మహిళలకిచ్చేటి ధర్మరీతి
స్వేచ్ఛయందున ముదితలు వేగరీతి
తోటి ముందడుగున పోయి దురితమంత
తురుముచుండిరని చెప్పి మురిసె మంత్రి (72)

తే.గీ.
తమరి పరిపాలనందున ధర్మసిరిన
వెలిగే భూమాత నిగమాంబ జిలుగు వెలుగు
లన జగన్మాత మెరవంగ లక్ష్మియు మురి
పాన మీ పరిపాలనే పావనమనె (73)


ఆర్యావర్తన రాజువు
ఆర్యుల మదియెరిగి భూమి యందున సిరికిన్
ఆర్యావర్తనమే సరని
ఆర్యులు మెచ్చగ పాలించుమేటివయ్యారాజా! (74)

తే.గీ
రాణి విశ్పల స్త్రీలను రక్తితోటి
గారవించుచు కనపడు కమలనయన!
చేత కత్తున్న కలకంఠి చేవఁ జెప్ప
బ్రహ్మ తరమునుగాదిల బ్రహ్మసాక్షి (75)

తే.గీ.
ముదిత విలువను పెంచేటి ముగ్గమయిన
రాజ్యమిలయందు ఖేలుని రాజ్యమనుచు
శత్రు రాజులు మేచ్చేరు సాహసాన
ఖేల రాజ్యాన వనితల కులుకెకులుకు (76)

తే.గీ.
రాణి విశ్పల వదనాన రమ్య సిరిన
ముగ్గురమ్మలు కొలువుండే;;
ముద్దుతోటి రాణియన్నను విశ్పల రాణెరాణి
మంచి మనసున్న రారాణి మకుటధారి (77)

ఆ.వె.
శ్రీనివాస! దివ్య చిన్మయ దరహాస!
రాగభావతాళ రసవికాస!
వసుధనేలు తండ్రి! పాహిమాం పరమాత్మ
నీ చరణకమలమె నిఖిలమంత (78)

స్వాగతం:
శ్రీనివాస రస చిద్విలాసంబున్
మానసాననిడ మానవుల్ పొందున్.
సూనముక్తియును సూర్యరూపంబున్
స్థానతేజమగు సత్య లోకంబున్ (79)

సుగంధి:
శ్రీనివాస! చిద్విలాస! చింతలందు నీ కళన్
మానసాన నిల్పువారు మాన్యులయ్యి పృథ్వినన్
భానుతేజరూపుతోటి భవ్య దీప్తులొందుదుర్
భూనివాస! రమ్ము రమ్ము భూమినందు రక్షకా! (80)

(రాజర్షి ఖేలుడు ప్రథమాశ్వాసం సమాప్తం)

ద్వితీయాశ్వాసము
సుగంధి:
శ్రీనివాస! శ్రీ నివాస! చిద్విలాసమందునన్
కానవచ్చు దివ్యరూపకాంతీయంత నీవుగా
మానసాలు ముగ్ధమోహమాన్యమయ్యె సామిరా
ధేనువమ్మపాలనందు తీపి చెప్ప రమ్మురా. (1)

ఆ.వె.
ఆనతివ్వకదులుమానంద సాగర!
విష్ణుపథముఁజేరు వేదమంత
చెప్పువాడవయ్య చెలిమిన రావయ్య
సప్తగిరినివాస! సత్య తేజ! (2)

చంద్రిక:
తిరుపతిగిరి తీరమంతటన్
సిరిగలపతి సేవలుండగన్
హరిహరియను హాయిభావమున్
పరము పిలుచు భవ్యరూపునన్ (3)

చంద్రిక:
కలియుగమున కాంతి దేవుడై
మలినమతుల మంట పెట్టగన్
బలినణచిన భవ్యమార్గమున్
వెలుగ; కదులు వేంకటేశ్వరా (4)

ఆ.వె.
మంత్రి వాక్కులిన్న మనసున్న మారాజు
కంటి వెలుగు గత వికాసమంత
మానసాన నిల్వ మనుధర్మ విశ్పల
తేజమంతఁదలచే దివ్యరీతి (5)

తే.గీ.
పండు వెన్నెల జాబిలి పరువమంత
ప్రకృతి వెల్గుల పార్వతి ప్రాణమంత
వేద విజ్ఞాన మూలాల వెలుగులన్ని
కలిగివుండే; విశ్పల మహీతలమునందు (6)

తే.గీ.
అమ్మ అమ్మ సరస్వతి హాయి హాయి
గఁగొనుమా నాకృతి వెలుగు కరుణతోటి
మాత అక్షింతలనువేయ మరలిరమ్ము
అనుచు విశ్పల ప్రార్థింతునమ్మనెపుడు (7)

తే.గీ.
చుక్కలమ్మ చుక్కలు రస చందమామ
మిత్రులాకాశ సంపద మీరె మీరె
మింట నిలువెల్లకాంతులు మీరెమీరె
ననుచు విశ్పల కీర్తనలాలపించు (8)

చంద్రిక:
విరివలపుల వేదనంతయున్
గిరుల బ్రమర గీతమంతయున్
సరిగి తెలిసి సాగు విశ్పలన్
కురుల నలుపు కోరి చేరేలే (9)

క.
ఆర్యావర్తనమందున
ఆర్యులు మెచ్చేటిరాజు హాటక ఖేలున్
ఆర్యులు ముదమున కొలవగ
ఆర్యుల దీవెనలయందునధిపుడు వెలిగెన్ (10)

తే.గీ.
ఫల మిత్రుడు ణణకుడు గిలనమందు
తిండిబోతన పదుగురు తేల్చినారు
ఆకలమ్మ ముద్దులబిడ్డ యనుచునంత
ముద్దు చేయగ రారాజు ముద్దుగనియె (11)

చంద్రిక:
కణకణమని కడ్పుమాడగన్
ఫణము చెమట పట్టె చూడరా
తిణకక పద తిండి పెట్టెదన్
వణకవలదు భవ్య మిత్రమా (12)

తే.గీ.
అనుచు రారాజు ణణకుని యాకలంత
తీర్చ; రాజమాత కడకు తీసుకోచ్చె;
పాయసాలన్ని త్రాగెడి భవ్యఘడియ
చేరెనని ణణకుండట చిందులేసే (13)

ఆ.వె.
దివిషరాజమాత దేవుని కొలువున
భవ్యమానసాన్ని భక్తితోటి నిల్పి;
జీవులంత నేలమీద సుఖముఁ
బొందవలెనని; ఘన పూజచేసె (14)

తే.గీ.
రాజమాత కేళాంకిక రమ్యవదన
హాససిరినుండ; ణణకుడు హ్లాదకరపు
వందనాలనర్పించేను సుందరంగ
రాజమాత వదనమనురక్తినుండ (15)

తే.గీ.
భోజనంబున ణణకుని పోకడంత
తెలిసిసాగు కేళాంకిక తీపితీపి
వస్తువులనన్ని నోరూర వండి పెట్టె
తిండిబోతు ణణకుడట తిండెతిండి (16)

తే.గీ.
రుచికరంబగు తియ్యని రుచులమాటు
మమతలూరు రుచులనన్ని సమముగాను
కలిపి ణణకునికొడ్డించే కరుణతోటి
రాజమాత కేళాంకిక రయముగాను (17)

తే.గీ.
వేడివేడివంటలనన్ని పేర్మితోటి
లొట్టలేసుకుంటు తినెను పట్టుబట్టి
తిండితినెడివారికినుండు కండలిలన
మనసు మెచ్చేటి తిండిన మసలమృతము (18)

తే.గీ.
పెరుగు, తేనే చేపావడలరుచిచూచు
నోరె నోరని ణణకుడు నుడువ; మాత
దివిజ దరహాస వదనాన తిండి తినెడి
చోట మీతిమీర కడుపుకు చేటె; యనియె (19)

ఆ.వె.
రాజమాత మాట రతనాల మూటని
పొగిడి ణణకవరుడు; పుడమి మెచ్చు
ఖేల విభుని పెళ్ళి కేళికి వధువును
చూడు మాత యనెను సుమధురంగ (20)

ఆ.వె.
ణణకమాటలందు గణనీయ ధర్మమ
సాంత మెరిగి తల్లి సత్య వచన
మిత్ర వివాహతంతు మేథీనియందున
జరుపువాడు నీవే జరుపుమనియె (21)

చంద్రిక:
జయము జయము జన్మ తేజమా
జయపథమున జాగు చేయకన్
జయపరిణయచందనంబులన్
రయముగనిటు రమ్ము యివ్వగన్ (22)

ఆ.వె.
అనెడి రాజమాత ఆనంద చంద్రికా
వాక్కులన్నివిన్న వసుధ విభుడు
సిగ్గుతెరలమాటు చెలిమిన మార్చేను
మాట; ణణకవరుని మనసు తెలిసి (23)

తే.గీ.
మారువేషాన్ని ధరియించి మాత నేను
లోకమందున జరిగేటి లుకలుకలను
చూచి సరిజేసి వచ్చెద ; చూడమనుచు
ఆనతిమ్మని ప్రార్థించె నవని విభుడు (24)

తే.గీ.
మాటమార్చిన పుత్రుని మనసునెరిగి
మాత కేళాంకిక మదిన మసల ముదము
శిరము వంచిన తనయుని శిరము నిమిరి
సాదరంగ సరాగాన సమ్మతించే (25)

తే.గీ.
ఖేలభూపతి తెప్పించె; కేళితోటి
చిత్రవేషాలయశసించు చిత్రపటము
లన్ని; యరువదినాలుగు అందమందు
సురులరూపాల తలదన్ను సొగసునుండ (26)

తే.గీ.
మారువేషములన్నియు మనసు పెట్టి
చూచి, రారాజు మిత్రుని సోయగంబు
మదినవుంచి; వేషములన్ని మనసు మెచ్చ
తను ధరించెదనని చెప్పె ధరణిమురియ (27)

తే.గీ.
మారు వేషములన్నిట నరపతి బహు
బాగుగనమర వేషాల పదునుఁజూచి
రంగులేసెడివారలే కంగుతినిరి
మురిసిపోయిరి మిత్రులు ముదముగాను (28)

చంద్రిక:
నరపతి నవనాటకాలకున్
గురువని రసగుర్వులందరున్
మరిమరి జయమాటలుంచగన్
మురిసిన విభమోదమెంతయో! (29)

తే.గీ.
రాజ వేదపురుషరూపు రాజు వేయ
ణణకుడును వేషము మార్చె వీణపట్టి
కదలినారు రాజ్య సిరులు కనులతోటి
చూడ కమనీయ భావాల సోయగాన (30)

చంద్రిక:
విరులు సిరులు విశ్పలన్న; యా
సురుల కనుల చిందు ధర్మమున్
కరుణనపడు కాంత మీదనే
నిరతము మహి నిండుగుండగన్ (31)

తే.గీ.
విశ్పల, జననీజనకు ప్రేమయందు
మునిగి తేలుచునిట్లనే ముదముమీర
ఆడబిడ్డలు చదువులనన్ని తెలివి
తేటలున్ననేర్వగవచ్చు దివ్యముగను (32)

తే.గీ.
భోజనాలను పెట్టుచు పొట్టపోసు
కొనెడి వారింట పుట్టిన కోమలివని
తలిదండ్రులుఁజెప్పగ తెలివి దేవు
డిచ్చిన వరమనే వనిత మెచ్చనంత (33)

తే.గీ.
విద్యలన్నియు నేర్వగ విశ్పలుండ
అశ్వనీదేవతలు నాతి అంతరంగ
మెరిగి మగువ యింటికి వచ్చెనేరుతార్లు
లేక విద్యలన్నియుఁజెప్పులీలతోటి (34)

తే.గీ.
అశ్వనీదేవతామూర్తులందునెదను
పూర్తిగుంచిన విశ్పల పుణ్యరీతి
వేదజననీజనకులు మెచ్చ దయతోటి
యివ్విధంబున పూజించే నిలనయింతి (35)

తే.గీ.
సర్వరోగాల బాధను సతతమిలన
తొలగఁజేసెడి ఘనదేవ దూతలార!
వందనాలందుకొనరండి వడివడిగను
ప్రాణ శక్తిని పెంచు విభవము మీది (36)

తే.గీ.
సృష్టి, స్థితి తిరోదాన సృజనతోటి
లయమనుగ్రహమునుపంచ లాంచనాల
కర్మతత్వమంతనెఱుగు కలహ రహిత
జంటదేవుళ్ళకు ప్రణవ చందనాలు (37)

తే.గీ.
పంచరూపస్వరూపపు భవ్యతంత
తెలిసివర్తించునశ్వనీ దీప్తులార!
శుభ హవిస్సులందుకొనగ సుందరంగ
రండి రండి ముదముమీర రండి రండి (38)

తే.గీ.
శుభకర్మలుఁజేసెడి సురులు మీరు
జనులకారోగ్యమివ్వగ సాగువారు
విశ్వశాంతిని కాంక్షించు వేల్పులార
కదలిరండి జంటగ మమకారమదిన (39)

తే.గీ.
జలద జలవిద్యలన్నియు జయమనగ
నేర్చె విశ్పల ముదమున నేర్పుగాను
నేర్చినచదువునంతయు నీతితోటి
జనులకుపయోగపడునట్లు జవ్వనుంచే (40)

తే.గీ
బావిన పడ ముక్కుపుడక పాటవాన
తీసి విశ్పల పదుగురి దృష్టినపడే
పంచభూతాల మాటున పదును తేలి
మెరియు తేజమంతయు పట్టె మేథతోటి (41)

ఆ.వె.
రేబియనెడినాతి రేయింబగళ్ళను
వేదనీతినంత వేరుచేసి
వేదనీతియందు వెలిగేటి
శాస్త్రాన్ని జనుల నడుమనుంచు జగతిమెచ్చ (42)

ఆ.వె.
భర్తననుసరించి భవ్య పథంబున
సాగు; రేబి పతికి చచ్చుపడగ
కాళ్ళు; విశ్పల రసకాంతి వైద్యముతోటి
జబ్బు నయముఁజేసె సాదరంగ (43)

తే.గీ.
రేబి పతిని రక్షించిన రీతినంత
కథలు కథలుగ చెప్పుచు కనులయందు
ముదము పొంగంగ విశ్పల మోముఁజూచి
రెండు చేతులు జోడించే మెండు జనులు (44)

తే.గీ
సాహసాల విశ్చలఁజూచి సతిగనీమె
తనకు సరయినదనుకొనే ధర్మగతిన
రాజు రారాజు ఖేలుడు రసికజీవి
మొదటి చూపునందే వలపు ముదము పెంచే (45)

స్వాగతం:
కోకిలమ్మ రసకూతలు కూయన్
లోకమంత నవలోగిలిగవ్వన్
వేకువంత జిగి వేల్పుగమారన్
మోకరిల్ల మహిముందటనార్యుల్ (46)

ఆ.వె.
బాటసారులమని పది వరహాలిచ్చి
విశ్పలింటనుండి విభుడు విభుని
సఖుడు ముదము మీర సలలిత శోభన
రాజు విశ్పలందు రక్తి పెంచ (47)

తే.గీ.
తిండిబోతులు మేమని తేల్చ వారు
విశ్పల పాయసాల రుచిని పేర్మిగాను
చూ పెనిర్వురు మెచ్చగ సోయగాన
ఖేల ణణకులు మిక్కిలి కేళిఁజేయ (48)

తే.గీ.
తిండియందున మిన్ననే తినుచు రాజు
కాదు నేనేను మిన్ననే గారవాన
రాజు మిత్రుడు ణణకుడు
రక్తితోటి వాదనలు వినే విశ్పల వాలుగంటి (49)

తే.గీ.
హాసడెందిన రాజుకు హాయినివ్వ
విభుని తిత్తిండి చేసెను విశ్పలపుడు
ఆకలాకలియని యల్లాడవని పతికి
బహురుచులభోజనములు వనిత పెట్టె (50)

తే.గీ.
రాజు యాకలి చావక రయముగాను
మిత్రునిబ్బంది పెట్టగ మేథినందు
మందులిచ్చుచు నరపతి మానసంబు
విశ్పలగెలవ;తిత్తిండి వెళ్ళిపోయె (51)

తే.గీ.
విభుడు మోదాన పరిణయ విషయమంత
వనిత పెద్దలముందున వ్యక్తపరచ
మానసంబున కళ్యాణ మధురిమంత
సిగ్గుమొగ్గలేయగనాతి సిగ్గునుండె (52)

తే.గీ.
వనిత వయ్యారి నవ్వుల వాలుచూపు
రాజు మానసగుడినందు రాగమవ్వ
మన్మథవికాస సంచారి మమతలూరు
ఖేలడెందిన విశ్పల కేళిచేసే (53)

క.
కచభారములాగ వెనుక
కుచభారములాగ ముందు కుచకచ హోరున్
కుచకచభారపు పోరున్
వచియింప హరియనుచు కటి పడతిని వదిలెన్ (54)

చంద్రిక:
వరుని వదన పావనత్వమున్
నరవరతను నవ్యతంతయున్
సరిగ తెలుపు సవ్యశక్తితోన్
తరలె సురలు ధర్మ తేజమున్ (55)

తే.గీ.
లోకమంత సంతోషాల లోతులన్ని
చూచి గంతులేయుచుసాగ సోయగమున
ఖేల విభుడు విశ్పలను సుకేళితోటి
వేదధర్మాన పెళ్ళాడే వేల్పులాగ (56)

స్వాగతం:
పెళ్ళిఖేలునికి విశ్పలకంటున్
పెళ్ళివారమని పెళ్ళికి వచ్చెన్
మళ్ళిమళ్ళి సురమాన్యులు నవ్వుల్
తుళ్ళితుళ్ళిపడ దూరములేకన్ (57)

తే.గీ.
పరిణయమయిన విశ్పల పతిపలుకుల
ననుసరించి పేదల జబ్బులన్ని మాయ
చేయు వృత్తిని యావత్తు చేయుచుండె
మనుషులారోగ్యమందున మసలుచుండ (58)

తే.గీ
వద్రియను నాతి సంతానవతిగ మార
కుండుటకు కారణము పతి యూహలన్న
సత్యము తెలిసి విశ్పల సబల వద్రి
మారు మనువుకునొప్పించే మానవతన (59)

తే.గీ.
మనుజులెవ్వరు విశ్పల మాటలందు
మక్కువుంచకున్నను రాజు మాత్రమపుడు
భార్య యోచనలన్నియు భవ్యరీతి
సమ్మతించ వద్రి మనువు సాగిపోయే (60)

తే.గీ.
నూరుతెడ్లుతెగిననావ నుయ్యిలాంటి
సంద్ర మందున వేగాన సాగుతుండె
నావనందు భుజ్యుడనెడి నరుడు వర్త
కుండునుండె; యిదేమని కుములుతుండె (61)

తే.గీ.
భుజ్య! పేదల పాలిట పెన్నిదియను
సూక్తి నీనుండి వచ్చెరా సుందరాంగ
మమ్ము కాడి దేవర! మంచివాడ
యనుచు పేదలాతని నుతులందు ముంచ (62)

తే.గీ.
జనుల మానసంబున భుజ్య చంద్రికలను
గాంచు విశ్పల భుజ్యుని కరుణతోటి
రక్ష చేయగ కదిలింది రయముగాను
రమ్య యోగాన భుజ్యుని రక్షచేసె (63)

తే.గీ.
మురిసి పోయిన భుజ్యుని మురిపెమంత
మనసునందున తారాడ మమతతోటి
అశ్వనీదేవతామూర్తులంత తనకు
ముదముగిచ్చిన గుఱ్ఱాల మోముఁజూచి (64)

తే.గీ.
రాజ! యీ శ్వేత హరులను రమ్యసిరిన
అశ్వనీదేవతామూర్తులంత యిచ్చె
వాటినిపుడు బహుమతిగ భవ్యమదిన
నీకు నేనిచ్చుచుంటిని నిజము నిజము (65)

తే.గీ.
సూర్యఛాయల పుత్రులు సుందరంగ
అశ్వనులయినారని విశ్పలనగ ముదము
మీర వారిని స్తుతియించె ముక్తి నిచ్చు
వైద్య మంత మెరుగు మహా వైద్యులనుచు (66)

తే.గీ.
ఖేలుడంత తన కథను కేళితోటి
తనకే చెప్పుచున్నారన ధర్మరతిన
భర్త మోమున తారాడు భవ్యశక్తి
రీతి గమనించే విశ్పల స్తుతుల నడుమ (67)

తే.గీ.
చిత్ర బావిని విశ్పల చిత్రరీతి
అశ్వనుల సహాయంబున నందరిలన
అచ్చెరువుంద నిర్మించి నందు వివిధ
మందులొచ్చేటి తీరును మహిన దాచే (68)

తే.గీ.
శ్రీనివాసుని దయవున్న సిరులె సిరులు
స్వామి పద సేవనందున సకలమబ్బు
సత్య పథమున సాగేటి సత్య తేజ!
శ్రీనివాస! కాపాడు నాతండ్రి చిద్విలాస! (69)

తే.గీ.
పతిపతిపతిమా మంగళ పతి తిరుపతి
కొండ మీదన వెలసిన కోటి వేణు
వులోకసారిగ మ్రోగగ తలపులందు
మెరియు వేంకట నాయక! మెరుపు నీవే (70)

స్వాగతం:
వెల్గులివ్వ నవవేదిక మీదన్
వెల్గులిచ్చి రసవీణను మీటన్
వెల్గులివ్వయిలవేల్పుగ రారా
వెల్గులందు తిరువేంకటనాథా! (71)

రాజర్షి ఖేలుడు ద్వితీయాశ్వాసం సమాప్తం

తృతీయాశ్వాసము
తే.గీ
శ్రీనివాసుని చిత్తము సిరులమయము
శ్రీనివాసుని చరణాల చేరువారు
మోక్షమార్గాన పయనించు ముదముతోటి
శ్రీనివాస! దివ్యవికాస! చిద్విలాస! (1)

తే.గీ.
ఏడుకొండలవాడిగ తోడుగుండ
జాలిగుండెలఱేడుగ జయమునివ్వ
మూడు నామాలవాడిగ ముక్తినివ్వ
కదలిరావయ్య వెంకయ్య కలియుగాన (2)

తే.గీ
ఖేలరాజ్యవికాసంబు; ఖేలరాజ్య
వేద ధర్మంబునంతయు వెకిలి చిత్త
మందు నిల్పి; విష్వాచుడు యముడుగయ్యి
అద్రిరాజును రప్పించెనతనికడకు (3)

చంద్రిక:
వినుము వినుము వీరుడయ్యిలన్
కినుక తనము భేలునందునన్
పనుపుమిలనపారబుద్ధితోన్
అనియనే విభుడద్రిరాజుతోన్ (4)

తే.గీ.
లోకమెరిగిన మానవలోకవిభుడు
మహిన ఖేలుడనుచునది మనసువిప్ప
కోపమొందె విష్వాచుడు కుమతిలాగ
స్వాగతించినవారిని చంపదలచి (5)

తే.గీ.
కుటిలతత్వ విష్వాచుని క్రూరమంత
వేగిరంబున గమనించి వీరత మంత్రి
స్వాగతించినవారిని చంపరాదు
వినుము నామాట విష్వాచ వినుమనంగ (6)

తే.గీ.
దురితరాజు విష్వాచుడు తులువగయ్యి
అద్రిరాజును చీకటి అలుముకున్న
గదిన తోయించెనంధులుగాను మలచి
దురితులకు నిత్యముండుడు దూరముగను (7)

తే.గీ.
అద్రి రాజు వెతలనన్ని ఆలకించే
చారులవలన విశ్పల; సాహసాన
అద్రిరాజు సహనశీలి యనగనంత
సాటి రాజును రక్షించ సబల కదిలే (8)

తే.గీ.
కత్తి పట్టెను విశ్పల కదనరంగ
మందు విష్వాచ పీచమునడచు తలపు
నిండుగుండ ; కాళికవ్వుతు నిప్పుకక్కె
పగతురుభయముతోడుండ పారిపోయె (9)

తే.గీ.
విభుని సహకారమంతయు విశ్పల; ఘన
సమరరంగాన పొంది; విజయపథాన
సాగి దుర్మార్గ విష్వాచ జాతకాన్ని
ముప్పతిప్పలు పెట్టెను ముదముగాను (10)

తే.గీ.
శిరములవనిమీదుంచుచు శిక్షవేయు
నీచ విష్పాచుడధరంగ నిగమదీప్తి
నెరుగు విశ్పల మంచిని యెంచువార్ని
చెరకు దూరముగుంచుచు చెలిమి పెంచే (11)

తే.గీ
అద్రి బృందము మిక్కిలి హాయిగుండె
రజ్ర మూకయు సంతసరాగమొందె
అంధులమనుచు కుములుచునందరుండె
నయనహీనులందరు రాణి నయనమనిరి (12)

తే.గీ.
నయన హీనుల బాధను రయముగాను
రాణి గమనించి; కన్నుల రసమునుంచి
కనులు తెప్పించు శాస్త్రవికాసమంత
తలచి పసరును నూరించే ధరణిమీద (13)

తే.గీ.
అంధులంత పసరుమందునంత కళ్ళ
నుంచిరయిదుమాసంబులునోర్పుతోటి
కడకు చూపురాగ నవవికాస మనము
తోటి నాతికీ వందన తోయమిచ్చె (14)

తే.గీ.
నూత్న నయనాల తేజంబు నూత్నశక్తి
నివ్వ, సాటిరాజయిననదీలన రాణి
విశ్పలయెడను భక్తియు వినుత నమ్మ
కంబునుంచే; సుదరహాస కవనమల్లి (15)

తే.గీ.
విశ్పల సహాయ సహకార పెంపునకును
జనులు సాటిరాజులు నవ చలనముంచి
దేశ సుగతిని మరిమరి తేజమందు
నింప ముందుకు సాగిరి నిక్కముగను (16)

తే.గీ.
పాడిపంటల నడుమన పరుగుతీయు
రాజ్యశోభకు విష్వాచరాజు కుమిలి
కుమిలి దుఃఖించి పంటను కూల్చివేయు
పన్నగముపన్ని సాధించె పాప జయము (17)

తే.గీ..
చేతికందినపంట నోటతినలేక
బూడిదవ్వుటఁజూచిన పుణ్యశీల
విశ్పల పతియాన పెరగంగ విజయదుర్గ
యయ్యి వాడిఖడ్గముపట్టె నాహవాన (18)

తే.గీ.
కత్తికత్తి కలబడగ కదనమందు
శత్రు శిరములు కుప్పల సందడవ్వ
బతికున్నచాలు ఖరము పాలు తాగి
బ్రతికెదనని విష్వాచుడు పారిపోయె (19)

తే.గీ.
కుమతియింటనున్నసిరిని కొల్లగొట్టి
సుజనులకు సమర్పించు సుందరంగ
అన్న నీతిన విశ్పల అసుర బుద్ది
యున్న విష్వాచ సిరినంత ఊడ్చివేసె (20)

తే.గీ.
దురిత విష్వాచ దుర్మార్గధూర్తమందు
చేతికందినపంటలు చిద్రమయ్యి
మంటలందున పడిపోయి మాడిపోయె
విషపు కళ్ళన సుధకూడ విషముగవ్వు (21)

తే.గీ.
దురిత విష్వాచ దురితపు దుండగాన్ని
వీర విశ్పల కరిగించే వీర సబల
శత్రు రాజ్య జనులనందు సచ్చరిత్ర
వున్నవారినాహ్వానించే నువిదయపుడు (22)

తే.గీ.
జనుల కడుపుమంటలనన్ని జవ్వనపుడు
మదిన గమనించి యాకలి మంట తీర్చ
వేగరీతిన పండేటి వేల్పు పంట
హాలికులకునాశుప్రీహిహాయిగిచ్చె (23)

తే.గీ.
మహిళలందరునొకచోట మసలునట్లు
చేసి; విశ్పల వారికి చెప్పే విద్య
నందు వెలిగేటి ధీశక్తి నంత ముదిత
లమది చదువుల గుడిగ వెలగగ మహిన (24)

తే.గీ.
సదుపయోగ విద్యల రససారమంత
వనితలందరి యెదలందు పదునుగుంచే
విశ్పల; నవశాస్త్రంబున వెలుగులన్ని
నాతులందరికలవడగ నవ్యరీతి (25)

తే.గీ.
దురిత విష్వాచుడప్పుడు దురితరీతి
సంచరించి; ఖేలుని వీర సైనికులను
మాయన నపుంసకులుగను మార్చివేయ
తల్లడిల్లిరి వీరులు ధరణినందు (26)

తే.గీ.
వీరులందరి బాధను వీరవనిత
మనసు పెట్టి తెలుసుకొని మందులివ్వ
స్వల్ప కాలాన మామూలు జనులుగయ్యె
విశ్పలను వేయి నోళ్ళతొ వేల్పుయంటు (27)

తే.గీ.
దురిత విష్వాచుడంతట దురితుడయ్యి
పాడియావులన్నిటికిని పాలురాని
మందునిచ్చి గొడ్డావుల మంద చేయ
గొల్లుమనినారు గోపాలకూటమంత (28)

తే.గీ.
విశ్పలంతట గోగణ విత్తమునకు
పచ్చమందిచ్చి దివ్యంగ పాలనిచ్చు
పాడియావులఁ జేయగ వసుధ మీద
పంచె గోపాలురానంద ప్రణవరసము (29)

తే.గీ.
వినుత గోపూజఁజేయించే విశ్పలటను
గోవులన్న భువిన సురగురువులంటు
గోవునందలి దివ్యత గోప్యతంత
తెలిపే విశ్పల ముదమున దివ్యమదిన (30)

తే.గీ.
శయుని గోసంపదంతయు సంహరించ
నపహరించ; విష్వాచుడు యముడుగయ్యి
కత్తి పట్టిన విశ్పల కదనమందు
కాళికయ్యి గెలిచే నవ ఘనత పెరగ (31)

తే.గీ.
ధర్మపత్ని సుగతిఁజూచి దర్పముగను
ఖేలరాజు వనములందు కేళితోటి
సంచరించెనడవులన్ని సస్యరమగ
మారవలయునన్నమదిన మసలసాగె (32)

తే.గీ.
ఆశ్రమాలను పెంచంగ యతులతోటి
దివ్యమార్గంబు చూపండి దీక్షతోటి
సుగతి పథమంత మీదిగ చూపరండి
అనెడి ; ఖేలవిభుడు నవయశమునొంది (33)

తే.గీ.
పెరిగే యాగశాలలచట పెరిగే యతులు
పెరిగే ధర్మము, సత్యము పెరిగే రుతము
తరిగే కాలుష్యమంతయు; తరిగె బద్ద
కంబును తరిగె దురితవికారములును; (34)

తే.గీ.
యాగశాలల తేజంబు యాగములకు
కావలసినపదార్థాలు క్రమము తప్ప
కుండ విశ్పల పంపగ; కోమలంగ
యతుల యాగములందున యమము హెచ్చె (35)

తే.గీ.
ధర్మపత్ని గమనమంత ధర్మపథము
తప్పకుండగ సాగగ ధర్మరీతి
ఖేలుడప్పుడు రాజర్షి ఖేలుడవ్వ
యాగమాచరించు తలపున యతిగ మారె (36)

తే.గీ.
యాగ తేజపురోహిత అగ్నిదేవ
సురుల రుత్విజ!హోతవు సోమదేవ!
సంపదల ప్రదాత! దయన సాగవయ్య
అనుచు రాజర్షి ఖేలుడు అగ్నిననియె (37)

ఆ.వె.
స్త్రీలచిత్తమందు చేర్చగ యజ్ఞము
యాగధర్మతేజ యోగమంత
ణణకుడంత యతిగ ప్రణతులిచ్చి
కదిలే రాజమిత్రగరిమతోటి (38)

తే.గీ.
దివ్య మేథన యశసించు భవ్య వనిత
లంతనపుడు విష్వాచునియావరణకు
శాస్త్ర చర్చలుఁ సేయగ సనగనతడు
అంగవర్ణనలనుజేసెనల్పుడయ్యి (39)

తే.గీ.
అందమే పందెమా యనునాతడపుడు
నువ్వు మేథావివనుటను నూటికిలను
నూరుపాళ్ళు తప్పన్నదే; నూరుపాళ్ళు
నిజము నిజమని మహిళలు నిజముఁజెప్పె (40)

తే.గీ.
మట్టికుండవు నీవయ్య మట్టివన్న
నీవు విష్వాచ! మేథావి నీవుకాదు
యనుచు మహిళలు తమమేథయంత చూప
కుటిల చూపుల విష్వాచ కులుకుతరిగె (41)

తే.గీ
ఖేలునికి విషయంబంత కేళిగాను
తెలియ; విషచిత్తముండెడి దిష్టికడకు
పోవుటన్నను వెఱ్ఱియెపుట్టుననియె
మూర్ఖచిత్తంబు మార్చెడి మునియులేడు (42)

తే.గీ.
రమ్య రాజర్షి ఖేలుడు రాగవదన
సిరిన వివిధయాగంబులు సేయగాను
యక్షసురకిన్నెరనరులు యతులుగయ్యి
యాగశాలకు వచ్చినారాదరంగ (43)

తే.గీ.
సర్వజనుల సుఖంబును సర్వశాస్త్ర
గరిమనంతను పెంచగ కామరహిత
మదిన రాజర్షి ఖేలుడు మంచి రుషుల
మంత్రములయందు యశసించే మహిమతోటి (44)

తే.గీ.
అగ్నిదేవుడు కరుణల హాయినందు
ఆహ! రాజర్షి ఖేలుడు అమరతత్వ
శోభనందు వెలుగుచుండె సుందరంగ
రాజు ముదితల మేధస్సు రచనచేసె (45)

తే.గీ.
సూర్య సావిత్రి శాస్వతి సుందరంగ
గార్గి ఆత్రేయి జుహులంత కరుణతోటి
జగములన్నియు రక్షింప జగతి సాగు
చున్నదనిరాజు పలకేను సోయగాన (46)

తే.గీ.
మిధున రాశిన యశసించు మిన్నయైన
అశ్వనీదేవతలు రసహాయినందు
సోమరసమంత తనకివ్వ సొగసుతోటి
కేళినొందెను కలలోన ఖేలవిభుడు (47)

తే.గీ.
కనిన కలలోని దివ్యత కంటిముందు
కదులుచుండగ రాజర్షి కన్నులందు
దివ్య దేవతలందరు దిగిరి భువికి
మహిన రాజర్షి భేలుని మహిమ పెంచ (48)

తే.గీ.
ఆశ్రమాలను విష్వాచనమలిన మది
నాశనముఁజేయమ నుచుండ నవ్యరీతి
తోటి కదనరంగానికి తులువలాగ
కత్తి పట్టి సాగెను నరకంబుఁజూడ (49)

తే.గీ.
దివ్య రాజర్షి ఖేలుని దీప్తి తరగ
కుండ చేయగ విశ్పల కుత్తుకలను
శత్రువులకు లేకుండెడి సవ్యపనిని
ఆమె స్వీకరించుచు దూకెనవనిమీద (50)

తే.గీ.
మురికి వలయంబు విష్వాచ మోమునందు
మెదల; కఠినమనంబున ముదముతోటి
వలయ శక్తిని పెంచెను పాప శక్తి
తోటి విష్వాచ దురితుడు తులువలాగ (51)

తే.గీ.
వలయమంతను ఛేదించే భవ్యరాణి
మునుల మానసంబంతను మోదమొంద
దురిత విష్వాచుని దరికిదూరివచ్చి
ఘోరసమరము చేసెను ఘోరముగను (52)

తే.గీ.
అనిన కాళిక విశ్పల అనుచు మునులు
స్తుతులుఁజేయగ విశ్పల సురగయయ్యె
విధిబలీయంబు పెరగగ విశ్పలమ్మ
కాళ్ళు నరికె విష్వాచుడు కత్తిబట్టి (53)

తే.గీ
కాళ్ళు పోయిన కుమలక కాళికయ్యె
విశ్పలసమరరంగాన విక్రమంబు
చావలేదని పెంచెను సత్తువంత
శత్రువుల కుత్తుకలనట చావచిదిమె (54)

తే.గీ.
ధర్మసమరాన పడివున్న ధర్మతేజి
తనువునందున క్షాత్రమంత సిరులొలుక
విశ్పలసిపట్టె నుప్పొంగ వీరమంత
రాణి నుత్సాహమంతయు రాజుఁగనియె (55)

తే.గీ.
ఆయుధాలన్ని పట్టేటి ఆమె మనసు
తెలిసి ఖేలుడామెను రయ్యన ధీరమంత
పెయిన తారాడ మెడమీద పేర్పు చేసి
నవ్యఖడ్గమునిచ్చె విన్నాణముగను (56)

తే.గీ.
రాణి కాళికయ్యె సమరరంగమందు
మగని మెడమీదనుండియే మండిపడుతు
కత్తి తిప్పేను వేగంగ కదనమందు
శత్రువులపీచమణచుచు సాహసాన (57)

తే.గీ.
ఆహవంబున శత్రువులంత పరుగు
పరుగునపరుగులెత్తగ పడతి రాణి
అంతిపురమున కేగె గెలుపునందు మునిగి
కాళ్ళు లేవన్న విషయము కానరాక (58)

తే.గీ.
రాణిమందిరంబున రాణి రక్తి తొలగి
తెగిన కాళ్ళను చూచుచు తెలివిలేక
నుండనశ్వనీ దేవతలుండెనక్క
డ పడతి విషయంబం తెరిగిపదునయ్యి (59)

తే.గీ.
రాణి కాళ్ళను తీవ్రంగ రక్తితోటి
వివిధ పరిశీలనలుఁజేసి పేర్మితోటి
ఇనుపకాళ్ళను రాణికినిచ్చతోటి
వైద్యపథమున పెట్టగ వైద్యులయిరి (60)

తే.గీ
రాణియశ్వనీదేవసరాగమంత
రెండుకళ్ళతోఁగాంచుచు రేయిపగలు
పూజలందించే ముదమున పూలతోటి
రాణి నూత్నశక్తిని గాంచె రాజు మహిన (61)

తే.గీ.
తియ్యని తలపుల మెరుపు దేవదేవ
తీరని ఋణాల కలగల్పు దివ్య తేజ!
దేవమాయన విశ్పల దివ్యరీతి
సుపరిపాలననందించే సుగతి మెచ్చ (62)

తే.గీ.
నవరసాలొలికించేటి నగరమన్న
నవత ఘనతలు మెచ్చేటి నగరమన్న
నవ్య విద్యలు వెలుగొందు నగరమన్న
రాణి విశ్పల నగరము; రక్తిమయము (63)

తే.గీ.
కొంగు బంగారమయ్యేను కోమలంగ
మనుజుల మదిన విశ్పల; మమతలూర
చిగురు వేసేను భూమాత చినుకులన్ని
క్రమమఁదప్పకుండగ పడ రయముగాను (64)

తే.గీ.
నిండుకుండగ చెర్వులు నిండుగుండ
నీటి కర్వులు లేకుండే నేలమీద
రాణి విశ్పల పాలన వాణిఁజూచి
చదువులమ్మ విశ్పలనుచు సన్నుతించె (65)

తే.గీ.
చెయ్యి చెయ్యి కలుపుకుంటు చిందులందు
మురిసిపోతు మనుషులంత ముందడుగుల
ప్రగతి బాటన సాగగ రయముగాను
రాజ్యవృద్ధిన విశ్పల రక్తి పెరిగే (66)

తే.గీ.
రంహ రాజర్షి ఖేలుడు రాజసాన్ని
రాణి విశ్పల ముందుంచి రవిని సురప
థంబుకంపగ వనముకు తరలిపోయె
నప్పుడప్పుడు నగరానికరుగుచుండె (67)

తే.గీ.
గతమసాంతము కదలాడ కన్నులందు
రాజ్ఞి జీవాన యశసించు రవినమంత
మానసాన తారాడగ మహిమ మీర
వెలుగే రాజర్షి భేలుడు వేల్పులాగ (68)

తే.గీ.
దివ్య రాజర్షి ఖేలుని దివ్య చరిత
చదువువారంత జీవనజగతినందు
శాస్త్రవిజ్ఞానదీప్తిన శస్తులయ్యి
నిండునూరేళ్ళు జీవించు నీతిగాను (69)

తే.గీ.
వేదవేదాంత నాయక వేల్పుల సిరి
వెలుగు నిన్నంటి సాగెర వేంకటేశ!
శ్రీనివాస! రక్షించగ చేరుమయ్య
నాయెదనుగుడిగ మలచినాను రార (70)

Exit mobile version