Site icon Sanchika

60. అద్దాల భరిణ

[box type=’note’ fontsize=’16’] 2018 దీపావళి కథల పోటీకి వచ్చిన కథ. [/box]

[dropcap]“అ[/dropcap]య్యగారూ, మీకు తానానికి నీళ్ళు వెట్టిన…” కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉన్న ముసలాయనకు చెప్పాడు యాదగిరి.

మెల్లగా కళ్ళు తెరచి, ‘అమ్మన్ అమ్మన్’ అని గొణుక్కున్నాడు ఆయన. ఎనభై ఏళ్ళ వయసు. పండులాంటి మేని ఛాయ. విశాలమైన ఫాలభాగం మీద ఎర్రటి కుంకుమ బొట్టు. నిండుగా పెరిగిన తెల్లటి గడ్డం, బాగా పెరిగిన జుట్టుతో చెయ్యెత్తి నమస్కారం చేయాలనిపించేలా ఉన్నాడాయన. మెల్లగా లేచి, ఇంటి వెనుక భాగంలోని స్నానాల గది వైపుగా వెళ్ళాడు.

“అక్కా పాలు కాచినవా?” అక్కడే కూర్చుని కూరగాయల తట్టను సర్దుకుంటున్న సత్తెవ్వతో అన్నాడు యాదగిరి.

“నాష్టా కూడ జేసిన్రా… అయ్యోరు తానం చేసి రాగానే, ఆ పాలు, ఉప్మా పళ్ళెంలో పెట్టి ఇయ్యి…”

“అక్కా, గీయన్ని వాళ్ళూరికి చేర్చాల… పాపం వాళ్ళ ఖాన్‌దానంతా ఎంత పరేశాన్ అవుతున్రో ఏందో…”

“అవున్రా యాదా… గాయనకేమో మన బాస రాదు… మనకేమో గాయన ఏమంటుండో దెల్వదు… నువ్వన్నట్టు గాళ్ళ వూరికి గాయన్ను జల్దీ పంపించేస్తే మంచిగా…”

“ఒదినే టేసన్‌లో చూడు ఎవరైనా గీయన కోసం దేవులాడుతున్నరో ఏమో…” చా గ్లాసును ఆడబిడ్డకు అందిస్తూ అన్నది మరదలు లక్ష్మి.

“గట్లనే నే… మళ్ళి నే పోయొస్తా…” లేచి తట్ట సర్దుకుంది సత్తెవ్వ…

“అక్కా, బద్రమే… జల్దీ ఒచ్చీ…” రోజూలాగానే చెప్పాడు యాదగిరి.

పెద్దాయన స్నానం చేసి వచ్చి, ఉతికిన పంచె కట్టుకుని, అంగ వస్త్రం పైన కప్పుకున్నాడు. భరిణ లోంచి కుంకుమ తీసి నుదుట తీర్చి దిద్దుకున్నాడు. మౌనంగా అక్కడున్న జపమాల అందుకుని ‘అమ్మన్ అమ్మన్’ అంటూ జపం చేసుకోసాగాడు…

“అయ్యో జర్రంత తినేసి కూసోవచ్చుగా…” వాపోయింది లక్ష్మి.

“అరగంట దాకా గంతనేగా… తలుపు దగ్గరేసి రా…” మెల్లగా ఆమెను అవతలికి పిల్చుకుపోయాడు యాదగిరి.

***

సత్తెవ్వది రంగారెడ్డి జిల్లాలో ఉన్న కొత్తూరు దగ్గరున్న చిన్న గ్రామం. ప్రతీరోజూ ఉదయం ఏడున్నరకల్లా బయలుదేరి, పాసింజరు బండిలో ఎక్కి ఉందానగర్ స్టేషన్‌లో దిగుతుంది. స్టేషన్‌ని ఆనుకునే ఉన్న హోల్‌సేల్ కూరగాయల మండీకి వెళ్లి ఓ నాలుగైదు రకాల కూరగాయలు ఆరేడు కిలోల చొప్పున, రకరకాల తాజా ఆకుకూరలు కట్టలుగానూ కొంటుంది. మళ్ళీ పాసింజర్ బండి ఎక్కి కాచిగూడా స్టేషన్‌లో దిగుతుంది. ఆ చుట్టుపక్కల ఉన్న కాలనీలలో తిరిగి అమ్ముతుంది. సాధారణంగా పదకొండు – పదకొండున్నరకల్లా ఆమె తట్ట ఖాళీ అయిపోతుంది. ఆ తర్వాత మరో బండి ఎక్కి కొత్తూరు చేరుతుంది. షేర్ ఆటోలో ఇల్లు చేరుకొని, భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటుంది. యాభై ఐదేళ్ళ సత్తెవ్వకు భర్త, ముసలి అత్తగారూ ఉన్నారు. అయితే ఆమెకు ముప్పై ఐదేళ్ళ వయసులో భర్త తనతో పనిచేసే ఒక మహిళను మారుమనువు చేసుకున్నాడు. పైగా సత్తెవ్వకు సంతానం కలగనందుకే తానీ పని చేస్తున్నట్టు ప్రకటించాడు. మనసు విరిగిన సత్తెవ్వ మళ్ళీ తన దగ్గరకు రావద్దని తెగేసి చెప్పింది. అత్తగారు మాత్రం ఆమెను వదిలి వెళ్ళకుండా సత్తెవ్వతోనే ఉండిపోయింది. అప్పుడే దూరప్రాంతం నుండి ఆమె దగ్గరకు వచ్చిన పినతల్లి కొడుకును చేరదీసి, తమ ఊరి పిల్లనే పెళ్ళి కూడా చేసి తన దగ్గరే అట్టిపెట్టుకుంది సత్తెవ్వ. ఆమెకు ఒక రెండెకరాల పొలముంది. దాని మీద వచ్చే ఆదాయం తక్కువే అయినా, ఐదారు గేదెలతో పాడి వ్యాపారం కూడా చేస్తోందామె. ఇవన్నీ ఆమె తమ్ముడూ, మరదలూ చూసుకుంటారు. పెద్దామెను తనదగ్గరే ఉంచుకుని పెద్దవయసులో ఆమె ఆలనా పాలనా చూసుకుంటోంది సత్తెవ్వ. అంత కష్టపడి కూరలు అమ్మటానికి ఎందుకు వెళ్ళడం అని అంటారందరూ… నిజమే, తిండికీ బట్టకూ లోటు లేదు. కానీ మనిషన్నాక ఏదో ఒక పని చేసి డబ్బు సంపాదించాలన్నది సత్తెవ్వ సిద్దాంతం.

అదీ తనకోసం కాదు. కొత్తూరులో ఉన్న ఒక వృద్ధాశ్రమానికి తన వంతుగా ప్రతీ నెలా తన కూరల డబ్బులో మూడో వంతు విరాళంగా ఇచ్చేస్తూ ఉంటుంది సత్తెవ్వ. ఆ ఊరి జనమే కాదు, ఆమె ఇంటి సభ్యులు కూడా ఆమె ఔదార్యానికి విస్తుపోతూ ఉంటారు.

ఈ పెద్దాయన అనుకోకుండా ఆమెకు కాచిగూడా రైల్వే స్టేషన్‌లో కనిపించాడు ఓ సారి.

రైలు రాగానే ఆమె వెంబడే పాసింజరు బండి ఎక్కేసాడు. కొత్తూరు స్టేషన్‌కి రాగానే ఆమె వెనకే దిగేసాడు. స్టేషన్ బయట ఆటో ఎక్కబోతూ ఉంటే ‘అమ్మన్ అమ్మన్’ అని పిలిచాడు.

“ఎవరవయ్య? ఎక్కడికి వెళ్ళాలి?” అని అడిగింది దయగా సత్తెవ్వ.

జవాబుగా ఆమెకే తెలియని ఏదో భాషలో గొణుగుతూ ఆమె వైపు దీనంగా చూసాడాయన. పెద్దాయనను అలా వదిలేయలేక తనతో పాటుగా ఇంటికి తీసుకువచ్చింది సత్తెవ్వ. ఇది జరిగి రెండు నెల్ల పైమాటే… ఆయన్ను చాలా సార్లు అడిగింది, ఏ ఊరూ, ఎక్కడి వారూ అని… కానీ అతనికి తెలుగు రాదు… ఇక చేసేది లేక తన దగ్గరే ఉంచి ఆయననూ చూసుకోసాగింది సత్గ్తెవ్వ.

పాపం ఎక్కడివాడో… ఎలా ఇక్కడికి వచ్చేసాడో తెలియదు… వాళ్ళ వాళ్ళు ఎంతగా అతని కోసం వెదుకుతున్నారో ఏమో…. ఎలా అయినా అతన్ని వాళ్ళ ఊరికి చేర్చాలని నిశ్చయించుకున్నారు, సత్తెవ్వా ఆమె కుటుంబ సభ్యులూ…

***

ఆరోజు వాడుకగా కూరలు ఇచ్చే ఇంటికి వెళ్లి అరుగు మీద తట్ట దింపుకుంది సత్తెవ్వ. ఆ బస్తీ అంతా మధ్యతరగతికి చెందిన కుటుంబాలే. చిన్నపాటి ఇల్లూ, రెండు గదులున్న డాబా ఇళ్ళూనూ… ఇంటావిడ కూరలు తీసుకుని డబ్బు ఇవ్వగానే లేచి, గంప నెత్తికి ఎత్తుకోబోయి ఆగింది. పక్కనున్న వాటాలోంచి “అమ్మన్ అమ్మన్… మురుగా మురుగా…” అని వినిపించింది. ఎవరో పూజ చేసుకుంటున్నారని అనుకుంటూ, “ఏం బాసమ్మా అదీ…” అని అడిగింది…

“నిన్ననే వచ్చారే అద్దెకీ… ఎవరో తమిళం వాళ్ళు… సేలమో ఏదో అక్కడినుంచి వచ్చారు…” చెప్పిందావిడ.

“అమ్మా, వాళ్ళతో మాట్లాడొచ్చా….”

సత్తెవ్వ వైపు చిత్రంగా చూసింది ఆ ఇంటావిడ… “వాళ్లకు తెలుగు రాదే… అయినా పిలుస్తాను…” అంటూ ఆ తమిళమ్మాయిని పిలిచింది.

“యారూ?” అంటూ వచ్చింది ఆ అమ్మాయి.

తన ఇంట్లో ఉంటున్న ముసలాయన గురించి వివరంగా తెలుగులోనే చెప్పింది సత్తెవ్వ. ఆయన్ని వాళ్ళ ఊరికి చేర్చాలని ఉందనీ, కానీ ఆయనకి తెలుగు రాదనీ… అంచేత తమిళం తెలిసిన వారెవరైనా వస్తే తనతో పాటు తీసుకువెళితే అతని స్వస్థలమేదో తెలిసే అవకాశం ఉందనీ వేడికోలుగా చెప్పింది…

ఆ తమిళమ్మాయి కుముదవల్లికి భాష రాకపోయినా, సత్తెవ్వ ఏదో విషయం తాపత్రయపడుతూ చెబుతోందని అర్థమైంది… తన కజిన్‌ని రమ్మని చెప్తానని, ఆమెకు తెలుగు తెలుసనీ మర్నాడు తప్పకుండా రమ్మనీ చెప్పింది సత్తెవ్వకు.

***

ఇంటికి రాగానే సంబరంతో తమ్ముడికీ మరదలికీ విషయం చెప్పింది సత్తెవ్వ. పెద్దాయన దగ్గరకు వెళ్ళి “అయ్యగారూ… మీ ఇంటికి పంపిస్తాను తియ్ నీ బిడ్డలు కిందా మీదా అయితుండచ్చు…” అంది…

ఆయన అర్థం కానట్టు చూసి, “అమ్మన్ అమ్మన్” అన్నాడు. మధ్య మధ్యలో అప్పుడప్పుడు ‘శరవణా ఇంగా వా…’ అంటూ ఉంటాడు… నిద్రలో కలవరిస్తూ “అళగా సాపడియా?” అంటూ ఉంటాడు.

“మీ బాసేంటో సమజైంది… తమ్మిళ్ కదా…” అంది…

ఆ మాట వినగానే ఆ పెద్దాయన కళ్ళు మెరిసాయి… “ఆమా ఆమా…” అంటూ తలకాయ ఊపాడు గబగబా….

“పండండి అయ్యగారూ… అక్క మిమ్మల్ని మీ ఊరికి తోలిస్తుంది లే…” అన్నాడు యాదగిరి… ఆయనకి కళ్ళలో నీళ్ళు తిరిగాయి.

“అయ్యో, గిట్ల పరేషాన్ కాకుండ్రి… మేమున్నం గదా…” చెప్పింది సత్తెవ్వ. ఆ పెద్దాయనకు త్వరలోనే తన వాళ్ళను కలవగలననే నమ్మకం కుదిరింది… ఆశీర్వదిస్తున్నట్టుగా సత్తెవ్వ వైపూ, యాదగిరి వైపూ చేయి ఊపాడు.

***

రెండు రోజుల తర్వాత –

“ఆంటీ, ఇంకా ఎంత దూరం మీ ఇల్లు?” షేర్ ఆటోలో కూర్చున్న అముద ఉత్సాహంగా అడిగింది. “ఏయ్, తినబోతూ రుచి అడుగుతావెందుకూ?” వాళ్ళతో పాటు వస్తున్న మణి ఇంగ్లీష్‌లో అన్నాడు.

“వొచ్చీసినంలే తియ్…” జవాబు ఇచ్చింది సత్తెవ్వ.

కుముద తన కజిన్ అముదతో చెప్పగానే ఆమె సత్తెవ్వతో వెళ్ళి పెద్దాయనతో మాట్లాడటానికి ఎంతో ఉత్సాహ పడింది. అలాగే తనతో పాటుగా తన సహోద్యోగి మణి అనబడే సుబ్రహ్మణ్యన్‌ని కూడా తీసుకొచ్చింది…

ఇంటి దగ్గరలోనే దింపేసి ఆటో అతను వెళ్ళిపోయాడు…

“రండ్రమ్మ గిదే మా ఇల్లు… గరీబోళ్ళం…” అని లోపలికి తీసుకుపోయింది బిడియంగా…

“ఓహ్ ఎంత చల్లగా ఉందో మీ ఇల్లు…” అని అముద అన్నది…

వాళ్ళు చూపించిన బాత్ రూమ్ లోకి పోయి కాళ్ళూ చేతులూ కడుక్కుని వచ్చి అక్కడున్న కేన్ సోఫాలో కూర్చున్నారు మణీ, అముదా… తమ్ముడినీ, మరదలినీ పరిచయం చేసి, పడుకున్న అత్తగారి దగ్గరకూ తీసుకువెళ్ళింది సత్తెవ్వ. ఆమె గురించి కుముద వాళ్ళ ఇంటామె ద్వారా తెలుసుకున్న అముదకు సత్తెవ్వ అంటే ఎంతో గౌరవం ఏర్పడింది… ఎక్కడో, ఎలాగో తప్పిపోయిన ఒక వయసు మళ్ళిన, భాష తెలియని వ్యక్తిని తీసుకువచ్చి, చంటి పిల్లాడిని సాకినట్టు సాకటమే కాక అతన్ని వాళ్ళ వాళ్ళ దగ్గరకు చేర్చాలన్న ఆవిడ తాపత్రయానికి ముగ్దురాలైపోయింది… అలాగే మణి కూడా. కాకపోతే ఇటీవలే చెన్నై నుంచి భాగ్యనగరానికి ఉద్యోగ రీత్యా రావటం వలన అతనికి అట్టే తెలుగు రాదు…

“తాత పండుకుండు అమ్మా… గిప్పుడు లెవ్వగానే మాట్లాడుదురు…” అంది సత్తెవ్వ.

“గీ సకినాలు తినుండ్రి… మంచిగుంటాయి…” అంటూ పళ్ళేల నిండా సకినాలు పేర్చుకు వచ్చింది లక్ష్మి…

మొహమాటంగా చేతిలోకి తీసుకుని తినసాగారు ఇద్దరూ…

“ఏమి తింటరు అమ్మా… అన్నంలోకి ఏమి చేయించను? కూరగాయలా, ఖీంచ్ కాంటనా?” అడిగింది సత్తెవ్వ.

“అయ్యయ్యో, ఏం వద్దాంటీ… ఇంటికెళ్ళి తింటాం… ఇవి పెట్టారు కదా…” అంది మొహమాటంగా అముద.

“కాదులే… కూరగాయలే జేయిస్త… మీరు గుడ్డు కూడా తినరేమో…” అంటూ మరదలిని పిలిచి పురమాయించింది సత్తెవ్వ.

ఆమెకు అడ్డు చెపితే బాధ పడుతుందేమో అని, “సరే ఆంటీ, కానీ కొంచెం కారాలు తక్కువేయండి… పెరుగుంటుందిగా మీ ఇంట్లో?” అని అడిగింది అముద.

“మస్తుగా ఉందమ్మా… పచ్చిపులుసు, తియ్యపప్పు, ఆకుకూర చేపిస్తా…. పాపడాలు వేపిస్తా…సరేనా? కొనాకీ పెరుగుతో తిందురు… అదిగో… అయ్యగారు లేసిండు…” అంటూ పక్కనే గదిలో నేలమీద నడుము వాల్చిన పెద్దాయనను చూపించింది…

లేచి, చాపమీద కూర్చున్నాడు పెద్దాయన… అముదా, మణీ లోపలకు వెళ్ళారు.

***

“తాతగారూ మీరు ఎవరు? ఎక్కడనుంచి వచ్చారు?” మణి ఆయన ఎదురుగా నేల మీద కూర్చుని తమిళంలో అడిగాడు…

తెలిసిన భాష వినగానే ఆయనకు ప్రాణం లేచి వచ్చినట్టు అయింది… మణిని చేయి పట్టి దగ్గరకు లాక్కుని, ఏడవసాగాడు…

“నన్ను నా కొడుకుల దగ్గరికి చేరుస్తావా?” అని ఆశగా అడిగాడు… ఆయనకు అలాగేనని హామీ ఇచ్చి అతని వివరాలన్నీ సేకరించాడు మణి. ఒక్క వారం పదిరోజుల్లోనే ఆయన్ను కొడుకుల దగ్గరకు చేరుస్తానని మాటిచ్చాడు…

భోజనం చేస్తూ ఉండగా చెప్పాడు మణి. ఆయన పేరు పాండ్యన్ అనీ, ఇద్దరు కొడుకులనీ వాళ్ళ పేర్లు శరవణన్, అళగు రామన్ అనీ చెప్పాడు. తనకు చదవటం వ్రాయటం రాదనీ, తమది కోయంబత్తూరు దగ్గరలోని చిన్న ఊరనీ, కొడుకులు ఇద్దరూ బట్టల వ్యాపారం చేస్తారనీ, అందరూ కలిసి దేవీ పట్టణం అనే ఊరిలోని కాలియమ్మన్ అనే అమ్మవారి జాతరకు వెళ్ళామనీ, అక్కడ రద్దీలో తాను తప్పిపోయాననీ, నీరసంగా ఉండి ఒళ్ళు తెలియని జ్వరంతో రైలు ఎక్కేసాననీ… కాచిగూడా స్టేషన్‌లో దిగేవరకూ తనకు స్పృహ లేదనీ వివరంగా చెప్పాడు. సత్తెవ్వను చూడగానే తాను నిత్యం కొలిచే అమ్మన్ మదిలో మెదిలిందనీ, ఆమె తనకు సహాయం చేస్తుందని మనసుకు తోచి, ఆమె వెంట వచ్చేసానని చెప్పాడు. అమ్మన్ నిజంగా మహిమ గలదనీ, దయ గలదనీ, సత్తెవ్వ రూపంలో తనకు ఆశ్రయం కలిగించి ఆకలి తీర్చింది అనీ మనసారా ఆమెకు ఆశీస్సులు చెప్పాడు.

ఇవన్నీ సత్తెవ్వకు వివరించి, “అసలు మీరింతవరకూ ఈయన్ని పోలీస్ స్టేషన్‌లో ఎందుకు అప్పగించలేదు ఆంటీ?” అని అడిగాడు వచ్చీరాని తెలుగులో…

అలా చెప్పాలని తోచలేదనీ, అదీ గాక, ఆయన ఆరోగ్యం అంత మంచిగా లేదనీ, వెంటనే పంపటానికి మనసు ఒప్పలేదనీ చెప్పింది సత్తెవ్వ.

పెద్దాయన తన ఊరిపేరు చెప్పాడు కానీ తన కొడుకుల ఫోన్ నంబర్లు నోటికి రాకపోవడంతో చెప్పలేకపోయాడు…

***

“అమ్మా, మీరు నిజంగా అమ్మనే… ఈయనకోసం తమిళనాడులో వెతికించని ప్రదేశం లేదు… ఇలా ఇక్కడి వరకూ వచ్చేస్తారని మేము ఊహించలేదు… దేవీపట్టణంకి రెండు మూడు సార్లు వెళ్ళి వెదికాము. ఈ అబ్బాయి మణీ అక్కడ మేము ఉన్న హోటల్‌కి ఫోన్ చేసి వివరాలు అందించాడు… అమ్మా, మా అప్పకు అమ్మై అన్నం పెట్టి, జ్వరం వస్తే మందులిచ్చి, సేవచేసి బ్రతికించారు… మీ ఋణం ఎలా తీర్చుకోగలం?” గద్గద స్వరంతో అన్నాడు శరవణన్. అతని మాటలను తెలుగులోకి అనువదించింది అముద.

“నాదేముంది బాబూ, గాయన నమ్ముకున్న అమ్మోరే మీ తానకు గాయన్ను జేర్సింది. దీనికే ఋణాలని అనకండి…” వినమ్రంగా రెండు చేతులూ జోడించింది సత్తెవ్వ.

తండ్రిని కౌగలించుకుని ఉన్నాడు కన్నీళ్ళతో అళగు రామన్… అన్నగారివైపు సాభిప్రాయంగా చూసాడు… శరవణన్ బ్యాగ్ లోంచి ఒక లక్ష రూపాయలు తీసి సత్తెవ్వకు అందించాడు. కానీ ఆమె దానిని చిరునవ్వుతో తిరస్కరించింది…

“లక్ష రూపాలిచ్చి గమ్మునైతారా బాబులూ… ఇది తీస్క పోయి కొత్తూరులో ఉన్న ఆశ్రమానికిచ్చేయండి… గట్లనే నెలకో సారి వాళ్లకి పైసలివ్వండి… మీకెంత తోస్తే అంత… గాడ గిసుమంటి అప్పలూ, అమ్మలూ మస్తుమంది ఉన్నరు… తప్పిపోయినోళ్ళు కాదు… బిడ్డలు వొదిలించుకున్నోళ్ళు…”

“ఆమా అమ్మా….” రెండు చేతులూ జోడించి నమస్కరించారు వాళ్ళు… గుమ్మంలో టాక్సీ వచ్చి ఆగింది.

పాండ్యన్ (పెద్దాయన) సత్తెవ్వ వైపు భక్తిగా చూసాడు… ఆ కళ్ళలోంచి, భక్తి, గౌరవాలతో పాటుగా అంతులేని ప్రేమా, వాత్సల్యం కురుస్తున్నాయి…

“పోయిట్టు వరే మా…” అన్నాడు… గొంతు జీరబోతుండగా…

కానీ కొడుకుల వెంట ఆయన అడుగు సాగటం లేదు… దేనికోసమో వెదుకుతున్నట్టు ఆగిపోయి, ఆలోచించసాగాడు…

వెంటనే లోపలికి వెళ్లి ఒక వస్తువు తీసుకువచ్చి అతని చేతుల్లో పెట్టింది సత్తెవ్వ. అది ఒక అద్దాల కుంకుమ భరిణ. దానినిండా ఎర్రటి కుంకుమ… పాండ్యన్ నుదుట దిద్దుకునే కుంకుమ అదే…

“తీస్కపొండ్రి అయ్యగారూ…” అంది రెండు చేతులూ జోడించి.

అపురూపంగా ఆ అద్దాల భరిణను చూసుకుంటూ కొడుకుల వెంట కారెక్కాడు పాండ్యన్.

Exit mobile version