62. ఆశల తీరాలకు ఆవల

0
3

“నేను ఈ అమ్మ నాన్నలకి పుట్టలేదట. అమ్మనాన్నలకి పిల్లలు చాలా కాలం పుట్టక పోవడంతో.. నన్ను పెంచుకున్నారట.. మరి నేను వీళ్ళదగ్గరకి ఎలా చేరానో మాత్రం తెలియదు”

నాకు తెలిసిన విషయం.. ఏడుపు మొహం పెట్టుకుని నాన్నని అడిగాను.

“నీకెలా తెలిసింది?” ఆశ్యర్యపోతూ అడిగారు.. నాన్న వుద్దేశం.. ఆయన నన్ను ఎప్పుడూ అలా చూడలేదు కాబోలు..

కాని.. ఇద్దరు పిల్లలు పుట్టాక అమ్మలో మార్పు.. అర్థమవుతూనే వుంది. కాని ప్రశాంత్ బాబాయి నాకు ఆ సంగతి చెప్పాక.. అమ్మ అలా ఎందుకు మారిపోయిందో చూచాయగా అర్థమయింది. నవ్వొచ్చింది.

ప్రశాంత్ బాబాయి నాకెలా బాబాయి అవుతాడు?

నాన్న మౌనంగా తలూపాడు.

కొద్దిరోజులు విపరీతంగా బాధ పడ్డాను.

ఒక్కోసారి  అలా అలా ఆలోచిస్తూ కూర్చుండి పోయేవాడిని ..

అంటే నేను అనాథనా? నాకు ఎవరూ లేరా? మరి నా తల్లితండ్రులు ఎవరు? తల్లితండ్రులు లేని వాళ్ళనే కదా అనాథలు అంటారు.. మళ్ళీ నవ్వొచ్చింది.

***

అప్పటి వరకు నేను చూసిన జీవితం వేరు.. ఆరోజు నుండి నేను చూసిన చూసిన జీవితం వేరు..

నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్‌లో వుండగా.. మా కాలేజ్‌లో కొత్తగా జాయిన్ అయింది సృజన!

తన అందం నన్ను ఆకర్షించిందా? తన హుందాతనం నాకు ఇష్టం అనిపించిందో తెలియదుకాని.. అందరినీ స్నేహంగా పలకరిస్తూ.. చక్కని ప్రవర్తన కలిగిన ఆ అమ్మాయి నాకు తెగ నచ్చేసింది!

ఇష్టంగా తన వైపు చూస్తుంటే.. చిరునవ్వే సమాధానం..

ఓ రోజు ‘సృజన’ అంటూ పిలిచాను కాస్త చనువుగా.. ఏమనుకుంటుందో.. బిడియం మనస్సులో ..

“ఏంటి?” ప్రశ్నించింది .

“బోటనీ నోట్స్ ఇస్తావా? వ్రాసుకుని ఇస్తాను” అన్నాను కాస్త దైర్యం చేసి.. అలా.. మా ఇద్దరి మధ్య పరిచయం ప్రారంభమయ్యింది.

తనకీ చెల్లయి తమ్ముడూ వున్నారని చెప్పింది. చెల్లి శ్రావ్య, తమ్ముడు శ్రీకాంత్, అంటూ పేర్లతో సహా..   చెప్పేస్తూ.. తాము ఎలా పెరిగామో.. తమ మధ్య అనుబంధం ఎలా వుందో అప్పుడప్పుడూ చెబుతుండేది. ముచ్చటగా వినేవాడిని.

నేను తన కళ్ళలోకి తొంగి చూస్తున్నా.. హూందాగా నడిచే తన నడక తీరును ఎప్పుడైనా కామెంట్ చేసినా.. జోక్స్ లాంటివి ఎమైనా చెప్పినా.. నవ్వేసేది.

మా ఇద్దరి మధ్యన  వున్నది స్నేహమా? ప్రేమా? అభిమానమా? ..అంటే.. “తెలుసుకోలేని  పసిడి హృదయాలేమో” అనేసేది తనే ..

ఓ రోజు.. ఆదివారం.. ఇద్దరం హస్టల్ బయట కలుసుకున్నాం. అంటే తను ఇంటికి బయలుదేరుతుంటే..

దగ్గరవుండి బస్ ఎక్కించాలని.. మా వార్డెన్‌కి మస్కా కొట్టి.. వాచ్‌మన్‌కి చిన్న గిఫ్ట్ ఇచ్చి.. ఇద్దరం కలసి బయటపడ్డాము.

ఓ గంట సేపు ఇద్దరం కూర్చున్నాము ప్రక్కప్రక్కనే.. వచ్చిపోయేవాళ్ళు మమల్ని గమనిస్తున్నా పట్టించుకునే స్టితిలో లేము ఇద్దరమూ..

నా గతం గురించి చెప్పాను.. శ్రద్దగా విన్నది. “అలాగా..” అంది. ఆ రోజు ఎందుకో నా మదిలోని  భావాలను.. నా ఆలోచనలను తనతో పంచుకోవలనిపించింది.

“అనాథ అంటే..” చివరగా ప్రశ్నిచింది. నేను చెప్పిన దాంట్లో ఏం అర్దం చేసుకుందో కాని.. కొద్ది క్షణాల తరువాత “ఆ పదానికి అర్థం నేనే” అన్నాను.

చిరునవ్వు నవ్వింది. ఆ నవ్వు నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ చిరునవ్వు నాకు జన్మంతా ఓ అద్భుత చిత్రంలా ఇప్పటికీ నా కళ్ళముందు కదులుతూనే వుంటుంది.

తనెంత అందంగా వుంటుందో.. అంతకంటే అందంగా వుంటుంది తన మనస్సు..

వాచ్ చూసుకుంది.

“బస్ వచ్చే టైం అవుతుంది” అంది.

అప్పుడుగాని గుర్తుకు రాలేదు అది బస్‌స్టాండ్ అని.. మేమిద్దరం కబుర్లు చెప్పుకుంటూ.. ఓ ప్రక్కగా  కూర్చున్నామని ..

“అందరూ చుట్టూ వున్నా.. వాళ్ళెవరూ తన వాళ్ళు కాదనుకుంటూ జీవించే వాళ్ళనే అనాథలు అంటారు. అంతే కాని నీలాంటి వాళ్ళని కాదు. అయినా ఒక్కసారి గుర్తు తెచ్చుకో..  నేను, మన ఫ్రండ్స్,  మన హాస్టల్ స్టూడెంట్స్.. అందరూ నీకు ఫ్రండ్స్ కదా.. కొంతమంది నిన్ను ఎంతగా ఇష్టపడతారో నీకు తెలియదు. తెలుసుకో. యు ఆర్ టాపర్ ఇన్ క్లాస్.. ఇంకాస్త శ్రద్ధ పెట్టి చదివితే నువ్వు డాక్టర్  అవుతావు. ఎయిమ్ ఫర్ ఎంసెట్” అంది.

***

ఆ తరువాత ..

నేను ఎంసెట్ లో ది బెస్ట్  సాధించడం.. తనేమో డిగ్రీలో చేరడం జరిగింది. నాకు వచ్చిన ర్యాంక్ చూసి అమ్మానాన్నలు ఎంతో సంతోషించారు.

కాని అంత డబ్బు ఖర్చుపెట్టి డాక్టర్ చదివించడానికి అమ్మ ఒప్పుకోలేదని, ఆస్తులు అమ్మవద్దని.. అన్నట్లు తరువాత తెలిసింది.

సృజన కలిసింది ఒక రోజు. నా  వివరాలు అడిగింది. వద్దన్న వినకుండా.. సెల్ ఫోన్ కొనిచ్చింది. ఎంతో హ్యపీగా అనిపించింది. అలాంటి అనందం అనుభవించి చాలాకాలం అయింది.

నెంబర్ జాగ్రర్త అంది సిమ్ తీసుకుంటుంటే..షాప్‌లో!

డాక్టర్ కోర్స్ ఎలా చదవాలో ఉపాయం చెప్పింది. ఫ్రేరణ.. జీవితంలో విజయాలు సాధించేందుకు స్ఫూర్తిగా  నిలుస్తుంది. నాకు ఆ సమయంలో స్ఫూర్తి, ప్రేరణా.. అంతా తనే..

తను తోడుగా వుంటే జీవితం వెన్నెల బాట. కాని అంతా అనుకున్నట్లుగా జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది? తన తల్లితండ్రుల నిర్ణయం మేరకు తను ముంబై వెళ్ళాలని.. అక్కడ డిగ్రీ చదువుతానని చెప్పింది.

“మళ్ళీ ఎప్పుడు కలుస్తావు?”

చిరునవ్వు నవ్వుతూ “నీ డాక్టర్ చదువు పుర్తయ్యాక తప్పకుండా కలుస్తాను” అంది.

‘ఎంతైనా నువ్వు నా వాడివి కదా’ అన్న ఫీలింగ్ తన కళ్ళలో..

ప్రేమ.. ఇరు  హృదయాలను ఏకం చేసే బంధం! ప్రేమ .. నీకు నేను నిత్యం తోడుంటాను నేస్తం.. అనిపించే మధుర భావన !

***

సృజన చెప్పిన వివరాలు నాన్నకు చెబితే..

నాన్న ఒప్పుకున్నారు. “అలాగే చేద్దాం” అన్నారు.

“స్ఫూర్తి ఫౌండేషన్” అక్షరాలు తళతళా మెరుస్తున్నయి.. మేమిద్దరం నిలబడి వున్న ఇంటి ముందు వున్న శిలాఫలకంపై.. నాన్న, నేను బిడియంగానే అందులోకి అడుగుపెట్టాము..

“డా. మనోహర్ గారు లోపలే వున్నారు.. రా రా శివయ్య” అంటూ మనోహర్ గారి డ్రైవర్ సూర్యం మమ్మల్ని లోనికి తీసుకువెళ్లాడు.

నాన్నకి సూర్యంగారితో వున్న కొద్దిపాటి పరిచయం.. ఆ రోజు మేము అయన్ని కలిసేలా చేసాయి.

నా ర్యాంక్ వివరాలు,  జూనియర్ కాలేజ్‌లో నా మార్క్స్, టెంత్‌లో నా ప్రతిభ ఆయనకు ఎంతో  నచ్చాయి. “మీ వాడికి మంచి భవిష్యత్ వుంది” అన్నారు… నా వైపు ప్రశంసాపూర్వకంగా చూస్తూ….

“నాకు.. మా అబ్బాయిని  డాక్టర్ కోర్స్ చదివించే స్తోమత లేదు” నాన్న మాటలు కూడబలుక్కుంటూ చెప్పాడు.

“సూర్యం.. వీళ్ళ వివరాలు మన ఫౌండేషన్ రికార్డ్స్‌లో వ్రాయమని పరంధామయ్య గారికి తెలియజేయి” అన్నారు.

ఇంటర్ కంలో ఫొన్ చేసి.. ఆ విషయం పరంధామయ్య గారికి చెప్పాడు సూర్యం. పరంధామయ్య వచ్చి వాళ్ళ ముందు నిలబడ్డాడు. అదే సమయంలో హాస్పటల్ నుండి మనోహర్ గారికి ఫొన్ రావడంతో..

“ఓ గంట సేపటి తరువాత వస్తాను..” అంటూ హడావుడిగా బయలుదేరాదు మనోహర్ గారు… సూర్యంతో కలసి!

డా. మనోహర్ గారు సిటీలో పేరు గాంచిన డాక్టర్.. కార్డియాలజిస్ట్ !

పూర్వీకులనుండి వచ్చిన ఆస్తి.. వైద్యరంగంలో వున్న గొప్ప పేరు ప్రఖ్యాతులు.. ఆయనని ఎం.ఎల్.ఎగా గెలిచేలా చేసాయి! అయినా వృత్తిపట్ల వున్న ప్రేమ.. అంకితభావం.. ఆయన్ని డాక్టర్ వృత్తిలో కొనసాగేలా..

‘స్ఫూర్తి ఫౌండేషన్ ఫర్ పూర్’ నెలకొల్పేలా చేసాయి.

అలా అన్న ఆయన సాయంత్రం ఆరుగంటలకు ఇంటికి వచ్చారు. అప్పటి వరకూ నిరీక్షిస్తున్న మమ్మల్ని చూసి..

“వివరాలు ఇచ్చివెళ్ళవచ్చుకదా” అన్నారు.

“అమ్మగారు పెట్టిన భోజనం తిన్నాము.. అలా పెరటిలో వున్న పచ్చని చెట్ల మధ్యన కూర్చున్నాము.  మిమ్మల్ని మరొక్కసారి కలిసి మా వివరాలు చెప్పి వెళదామని ఆగాము” ఈసారి నాన్న ధైర్యంగా చెప్పాడు.

మనోహర్ గారి సహాయంతో నేను డాక్టర్ కోర్స్‌లో జాయిన్ అయ్యాను. నా చదువు, హాస్టల్ ఫీజ్ అన్నీ ఫౌండేషన్ నుండే.. మనుష్యుల మధ్యన దేవుళ్ళు వుంటారని.. ఆ పెద్దాయన్ని చూశాకే తెలిసింది. ఎంతోమంది నాయకులు.. పేరు ప్రఖ్యాతులతో పాటుగా గొప్ప పదవులూ విపరీతంగా డబ్బు సంపాదించినా.. ఇంకా చాలక.. తరతరాలకు ఆస్తులూ, అంతస్తులూ అప్పజెప్పాలని చూస్తారు.

కానీ మనోహర్ గారు పేద విద్యార్ధులు మంచి మార్క్స్ సాధించి.. చదువుపట్ల శ్రద్ద కలిగి వుంటే.. అటువంటి వారిని చేరదీసి.. తన ఫౌండేషన్ పేరుతో చేయూతనిస్తారు. ఆయన వక్తిత్వం.. ఉన్నతమైన ఆలోచనా విధానం నాకెంతో నచ్చాయి. నా మనసంతా పుర్తిగా చదువులపైనే కేంద్రీకరించాను!

ఏదో సాధించాలన్న పట్టుదల.. అది పూర్తిగా ఇదీ అని స్పష్టంగా ఏదో తెలియకపోయినా.. వైద్యరంగం ద్వారా.. ఐ మీన్ నేను ఎంచుకున్న రంగం ద్వారా ఈ సమాజానికి అంతో ఇంతో మేలు చేయాలన్న తపన.. ఆలోచన!

ప్రతి ఒక్కరికీ భగవంతుడు ఇచ్చే ఒకే ఒక అవకాశం.. అదృష్టం.. ఈ జీవితం! జీవితమంటే..? పుట్టుకకీ.. చావుకీ.. మధ్య జరిగే నాటకమా? దేవుడు ఆడించే నాటకమేమో..! ఏదైనా.. నేనంటే ఏంటో ఈ ప్రపంచానికి తెలియాలి.

గెలుపు కోసం ఆరాటమా? గెలుపు కోసం పోరాటమా? తెలీదు.

డాక్టర్ పట్టా పుచ్చుకున్నాక.. నా కుటుంబానికి నా వీలైనంత సహాయం చేయాలి. నన్నూ నా వున్నత స్థితిని చూసి వాళ్ళు గర్వపడాలి. ఆర్థికంగా కుటుంబానికి అండగా నిలవాలి. నాన్న ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కదా!

పార్వతి శివయ్యల పుత్రుడిగా నలుగురిలో గుర్తింపూ గౌరవం పొందాలి! ఒక్కోసారి అనిపిస్తుంటుంది.. ఆమ్మా నాన్నలు మంచివాళ్ళే.. కాకపోతే నేను వాళ్ళకు పుట్టలేదు. వాళ్ళ పెంపకంలో ఎటువంటి లోపం లేదు. నా ఆలోచనలు సరయిన దిశలో సాగవు అప్పుడప్పుడూ.. వాళ్ళకి సంతానం కలిగాక నాపై కాస్త శ్రద్ధ తగ్గింది అంతే!

అయినా ఇంతకాలం నన్ను ఆదరణగా చూసిన.. నా తల్లితండ్రులకి.. జీవితాంతం.. ఋణపడి వుండాలి. మదిలో.. ఏదో మూల చిరు అలజడి. అది ఎప్పటికీ తీరదేమో.. అందుకే అప్ప్పుడప్పుడూ.. అనాథననే ఫీలింగ్!

***