62. ఆశల తీరాలకు ఆవల

0
3

మెడికోలుగా మేమంతా కలిసే వుంటాము.. చదువుకుంటాము.. ప్రాక్టికల్ క్లాసులు అంతా సీరియస్‌గా.. సేం టైం ఆనందంగా.. అలా అలా గడిపేస్తాము.

మాధవి… నన్ను ఇష్టపడుతుందని చివరి సంవత్సరంలో తెలిసింది. నేరుగా..”ఐ లవ్ యూ..” అంటూ ప్రపోస్ చేసింది.

నాకు ఆశ్చర్యం.. నా గురించి తెలిసే ప్రపోస్ చేసిందా? ఐనా నాకు తన మీద అలాంటి ఫీలింగ్ ఏమీ కలగలేదు. కేవలం ఒక ఫ్రండ్‌గా చూసాను.

అలాగని తనేమి సింపుల్ అమ్మాయి కాదు. బ్యూటిఫుల్‌గా వుంటుంది. తండ్రి ఐ.ఎ.ఎస్.. అలాంటి హైక్లాస్ ప్రొఫైల్ కలిగిన ఆ అమ్మాయి ఎక్కడ.. దాదాపు పేద కుటుంబానికి చెందిన నేను ఎక్కడ.. అదే చెప్పాను మాధవికి…

నవ్వుతూ.. “డియర్.. ప్రేమలో పేద గొప్ప తారతమ్యాలు వుండవు. నిన్ను ప్రేమిస్తున్నాను. కలసి జీవిద్దామని ప్రపోస్ చేసాను” అంది.

తన కళ్ళ నిండా ప్రేమ.. నా పట్ల ఆరాధనా భావం!

‘కొద్దిగా ఆలోచించుకోవాలి’ అన్నాను నేను.. ఏమనుకుందో మౌనంగా వుండిపోయింది.

ఓ రోజు..

నేను డాక్టర్‌గా జాయిన్ అయిన హాస్పటల్‌కి వచ్చింది.

“నేను యు.ఎస్. వెళుతున్నాను.. ఎం.ఎస్. చదవడానికి. ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. అమెరికాలో బావ వుంటాడు. బావతో నా వివాహం చేయాలని అమ్మానాన్నలు అనుకుంటున్నారు” అంది కన్నీళ్ళతో.

“నాకు ఇప్పట్లో పెళ్ళి చేసుకోవాలని లేదు..” చెప్పాను.

“నీ సమాధానం కోసం ఎదురు చూస్తుంటాను, నువ్వంటే ఇష్టం. వీలైనప్పుడు కాల్ చేయి..” అంటూ నెంబర్ ఇచ్చి వెళ్ళింది .

***

రాత్రి ఎనిమిది గంటలప్పుడు బయటకు వెళ్ళి బోజనం చేసి.. నా రూం కి చేరి పడుకున్నాను.

సొమవారం.. హాస్పటల్ ఆవరణ అంతా గోలగా ఉంది.

“డాక్టర్ గారు వచ్చారు” అన్నారెవరో.. ఆ రోజు నైటు డ్యూటీ డాక్టర్ రాలేదు. నర్సులు వాళ్ళే కేసులు చూస్తున్నారు.

“ప్రాథమిక చికిత్స  చేసాము సార్” అన్నాడు కాంపౌండర్ నరేష్, నర్స్ లతతో కలసి..

ఫస్ట్ ఫ్లోర్ కి చేరుకున్నాము..

“వెంటనే సర్జరీకి ఏర్పాట్లు చేయండి” అన్నాను.

పేషంట్ కాలు దాదాపు విరిగిన స్థితిలో వుంది.

“ఎంతసేపు అయింది పేషంట్ వచ్చి” అడిగాను.

“గంట సేపు అయివుంటుంది సార్” అన్నారు ఇద్దరూ ఒకేసారి.

“డా.రాకేష్ గారికి కబురు పెట్టండి”

డా. రాకేష్ నేను..ఇద్దరం కలసి సర్జరీ చేసాము. బయటకు వచ్చాము.. నేను జనరల్ ఫిజీషియన్, డా. రాకేష్ ఆర్ధోపెడిక్.

పేషంట్ కోసం వచ్చిన జనాలు చాలామంది వున్నారు హాస్పటల్ బయట. ఒక్కరి కోసం ఇంతమందా? నేను హాస్పటల్‌లో జాయిన్ అయ్యాక తొలిసారి చూశాను.. ఇంతమంది ఒక్కరి కోసం రావడం. ఏదైనా అర్జంట్ కేస్ వస్తే.. నెమ్మదిగా ఒక్కొక్కరూ రావడం.. లేదా ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటూ మరో ఇద్దరూ లేదా ముగ్గురు రావడం సహజంగా జరిగేది.. అంతే!

నా అస్టెంట్ రాము కూడా “సార్.. జయంత్ గారికి ఎలా వుంది” ఆత్రుతగా అడిగాడు.

“ఈయన నీకెలా తెలుసు?” అడిగాను..

“ఈయన మావీదిలోనే వుంటారు. చాలా మంచి వ్యక్తి. వచ్చినవాళ్ళు ఆయన కొలీగ్స్ మరియు మా వీధిలోని వాళ్ళు. నలుగురికీ చేతనయినంత సాయం చేస్తాడు. అలాగని ఆయనేమి గొప్ప ఉద్యోగస్తుడు కాదు. ఆఫీసులో క్లర్క్… అంతే” అన్నాడు.

రాము మాటలు వింటూ హాస్పటల్ బయటకి వచ్చాను.

“సార్.. జయంత్ గారికి ఎలా వుంది?” ఆత్రుతగా అందరూ చేరి అడుగుతుంటే..”నౌ హీ ఇస్ ఆల్‌రైట్” అన్నాను.

సహాయం చేయాలంటే స్థితిమంతులే అవవలసిన అవసరం లేదు. ఆపదలో వున్న వారికి ఆదుకోవాలన్న చిరు సంకల్పం వుంటే చాలు. చేసింది చిన్నదా పెద్దదా.. సాయం అన్న ప్రశ్న లేదు .

‘మనిషి’ అన్న పదానికి అర్థం.. మానవత్వం.. అంటే…? ఏదో కొత్త విషయం బోధపడింది.. భగవంతుడికి ఎన్ని రూపాలో.. నా మదిలో నిత్యం కొలువుండే భగవంతుడి ప్రతిరూపం డా. మనోహర్ గారు…. తరువాత తెలిసింది ఆయన సృజన వాళ్ళ నాన్న గారని..

“సృజన ఎలా వుంది? ఇప్పుడు ఎక్కడ వుంది?” అడిగాను. తన చిన్నమ్మ వాళ్ళ దగ్గర ముంబైలో వుందని చెప్పారు.

“మా సృజన నీకు ఎలా తెలుసు?” ఆయన అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పకుండా చిరునవ్వు నవ్వాను.

జీవితంలో కొన్ని సంఘటనలనీ.. కొందరు వ్యక్తులనీ ఎప్పటికీ మర్చిపోలేము. మరి నేను ‘సృజన’ని ఎలా మర్చిపోగలను.. అయినా.. తను నాకేమీ కాదు కదా..? ఇప్పుడు ఎలా వుందో? కొద్ది క్షణాల మౌనం.

***

108 వచ్చి హాస్పిటల్ ముందు ఆగింది. డ్రైవర్ దిగుతూనే.. “సర్ ఎవరో తెలియదు…. ఎవరో ఈయన్ని హాస్పటల్‌లో చేర్చారట.. అది చాలా చిన్న హాస్పటల్. వాళ్ళు ప్రాథమిక చికిత్స చేసి.. మన హాస్పటల్‌కి కబురు చేసారు. సీరియస్ కేస్” అంటుంటే..”ఏమైంది” అన్నాను.

“తెలియదు. మగ మనిషికి తలదగ్గర గాయమై చాలా రక్తం పోయిందట. బ్లడ్ అవసరం అట..” అతడు ఇంకేదో చెప్పుకు పోతున్నాడు.. విని నా క్యాబిన్ లోకి వెళ్ళాను.

స్ట్రెచర్‌పై ఆయనని ఐసియూ లోకి తరలిస్తున్నారు.. డైవర్, కాంపౌండర్, నర్స్ ..

చైర్‌లో కూర్చున్నాను. ఫొన్ రింగ్ అయింది.

“హాయ్..” అంది మాధవి.

నేనూ “హాయ్..” అన్నాను.. అసంకల్పితంగా ..

“ఇక్కడ ఎంత బాగుందో తెలుసా.. వావ్ అమెరికా! లవ్లీ ప్లేస్..” అంటూ చెప్పుకు పోతుంది.

తనకి వికాస్‌తో వివాహం కుదిరిందని.. బావకి తనెంతో నచ్చానని.. తల్లితండ్రులని ఒప్పించి అతడు ఈ మ్యారేజ్ ప్రపోస్ చేసాడని ఉత్సాహంగా చెబుతుంటే వింటుండిపోయాను.

కాల్ మాట్లాడడం పూర్తి అయ్యాక..

ఐ సి యూ వైపు కదిలాను.. నెమ్మదిగా.. ఎందుకో తెలియదు.. నా గుండెల్లో సన్నని కంపనలు.. వాళ్ళు..

ఆ దంపతులు.. వున్న దగ్గరకి వెళ్ళాను..

ప్రక్క ప్రక్కనే బెడ్స్..

కేస్ షీట్ చదువుతూ వాళ్ళని చూస్తున్నాను.. నిన్న న్యూస్‌పేపర్లో చదివిన ఆర్టికల్‌లోని జంట.. ఫోటోలో చూసిన జంట..

సెలైన్ ఎక్కుతుంది.. ఆ వ్యక్తి నిశ్చలంగా పడుకుని వున్నాడు.. మగత నిద్రలో వున్నట్లున్నాడు.. తల దగ్గర కట్టు కట్టి వుంది.

ప్రక్కనే బెడ్ పై పడుకున్న ఆమె.. భర్త వైపు తిరిగి పడుకుని వుంది. ఆమె వున్న బెడ్‌ని సమీపిస్తుంటే.. నా హృదయ స్పందనలు నాకే వినిపిస్తున్నాయి.. దగ్గరకి చేరుకున్నాను. నాడి పట్టుకుని చూసాను. చిరునవ్వునవ్వింది. ప్రక్కకి తిరిగాను..

బెడ్ పై పడుకున్న ఆ వ్యక్తి లో చిరు కదలిక.  కళ్ళు మగతగా తెరిచాడు.. అస్పష్టంగా నేను కనిపిస్తున్నానేమో.. కళ్ళు కొద్దిగా నలుపుకొని చూస్తున్నాడు.

నన్ను డాక్టర్‌గా గుర్తించాడేమో .. నమస్కరించబోతుంటే .. వద్దంటూ చేతులు పట్టుకున్నాను.

ఆ వ్యక్తిని పరిశీలనగా చూస్తుంటే.. నా గుండె లయ.. తప్పుతుందేమో అనుకున్నాను. ఎంతో ఉద్యేగానికి గురయ్యాను ఆ సమయంలో.. ఆ పెద్దయన రూపం.. అచ్చూ నా పోలికే..! కాదేమో.. నేనే ఆయన పోలిక!

ప్రత్యేకంగా డి.ఎన్.ఎ టెస్ట్‌లు అవసరం లేనంత స్పష్టంగా ఆయన పోలికలు నాలో..

ఆయన నా వైపు చూస్తూ.. “మాది.. శ్రీకాకుళం దగ్గర చిన్న పల్లెటూరు.. నా పేరు రామనాధం” అన్నాడు.

మాట్లాడవద్దు అన్నట్లుగా సైగ చేసాను.

మా ఇద్దరినీ గమనిస్తూ..అమ్మ అంటుంది..

ఆమె లోనూ ఒకింత ఆశ్చర్యం.. ఆనందం. కళ్ళలో భావాలు స్పష్టంగా తెలుస్తున్నాయి.

“నాకు ఇద్దరు పిల్లలు. ఇద్దరూ మొగపిల్లలే. ఓసారి ట్రైన్‌లో ప్రయాణిస్తుంటే.. పెద్దోడు తప్పిపోయాడు. అప్పుడు వాడి వయస్సు రెండున్నర సంవత్సరాలు. వాడి ఆచూకీ గురించి ఎంతో వెతికాము. ఇప్పటి వరకూ తెలుసుకోలేకపోయాము. కాని నువ్వు మా పెద్దబ్బాయిలా వున్నావు” అంది.

‘మరి మీ పెద్దబ్బాయి దొరికాడా?’ ప్రశ్నించలేదు నేను. నన్ను ప్రేమగా అల్లుకుపోయింది అమ్మ…

నాన్న నన్ను దగ్గరికి తీసుకుంటుంటే.. ఆ కౌగిలిలో ఏదో తెలియని భద్రతా భావం… లక్షలు, కోట్లు కూడా విలువ కట్టలేవేమో.. ఆ అనుబందాన్ని!

“నాన్నా” ప్రేమగా పిలిచాను.

నిజానికి ఆ సమయంలో నా మస్తిష్కం పనిచేయడం ఆగిపోయింది. అసంకల్పితంగా వచ్చాయి ఆ పిలుపులు..

“చిన్నోడు.. పెళ్ళయ్యాక మారిపోయాడు.. అందుకే ఈ తిప్పలు” అంటూ ఫొన్ చేసి ఏదో మాట్లాడింది అమ్మ.

మరుసటి రోజు ..

నాన్నకి చిన్నపాటి సర్జరీ జరిగింది తల దగ్గర. రెండు మూడు రోజులలో కోలుకుంటారని అమ్మకి దైర్యం చెప్పాను.

చిన్నోడు నాదగ్గర నిలబడ్డాడు. “ఎందుకు ఇలా చేసావు?” సున్నితంగా మందలిస్తూ  అడిగాను.

“అప్పుచేసి వ్యవసాయం చేసాను. ఈ యేడు సరిగ్గా పంటలు పండలేదు. ఓ వైపు పిల్లల చదువులు..  తల్లితండ్రుల భాద్యత. మా మధ్యన చిన్న గొడవ జరిగింది” అన్నాడు.

“ఎంత అప్పు?”

“ముప్పయి వేలు”

వెంటనే చెక్కు వ్రాసి వాడి చెతికి ఇచ్చాను.. సంతోషంగా అందుకొని “రెండు రోజులు ఆగి.. నీరజని తీసుకుని వస్తాను” అని  అన్నాడు. అలాగే అన్నాను నేను.

వాడి ఆనందం నా సంతోషాన్ని రెట్టింపు చేసింది. రెండు రోజుల తరువాత.. జీవితాన్ని సంపుర్ణంగా మార్చేసే సంఘటన జరిగింది. అన్నీ కలిసొచ్చే సమయం అంటే ఇదే కాబోలు. ఏమైనా ..భగవంతుడి సృష్టి గొప్పది. ఆ దేవ దేవుడు చేసే లీలలు అన్నీ ఇన్నీ కాదు!

మనుష్యుల మద్య బంధాలు, అనుబంధాలు, ఆప్యాయతలు, అనురాగాలు, ప్రేమ.. అంటూ ఓ ప్రత్యేకమైన  అల్లికను ఏర్పాటు చేసి.. జరిగేదంతా చిరునవ్వుతో వీక్షిస్తాడేమో..

“సాయినాధ్! మిమ్మల్ని కలవడానికి ‘స్రవంతి’ వచ్చారు” అంటూ కేశవ్ అంటుంటే.. రిసెప్షన్ వైపు నడిచాను..

తను ఎం.ఎ. ఇంగ్లీష్ లిటరేచర్ చదువుతున్నానని చెప్పింది.. సృజన స్రవంతి! “వెయిటింగ్ ఫర్ యూ డియర్ సాయినాధ్” అంటూ నా చేయి అందుకుంది.

చెప్పొద్దు “థ్యాంక్ గాడ్” అనుకున్నాను మనస్సులోనే.. జీవిత బాగస్వామిగా సృజనస్రవంతిని నా జీవితం లోకి ఆహ్వానిస్తూ..

రామనాధం,జానకిల కన్నబిడ్డను.. శివయ్య, పార్వతమ్మల ముద్దుబిడ్దను.. సృజన స్రవంతి తోడైన  సాయినాధ్‌ని ….

నన్ను అభిమానించే వాళ్ళు.. ప్రేమించే వాళ్ళు ఇందరు వుండగా.. నేను అనాథను ఎలా అవుతాను? మరొక్కసారి.. భగవంతుడికి కృతజ్ఞతలు అర్పించుకున్నాను. ఎన్నో రకాల పరీక్షలు పెట్టి.. నాకు జీవితం విలువ తెలియజేసి.. జీవనపోరాటంలో గెలిచి ‘విజేత’ గా నిలిచే అదృష్టాన్ని ఇచ్చినందుకు!