[box type=’note’ fontsize=’16’] 2018 దీపావళి కథల పోటీకి వచ్చిన కథ. [/box]
[dropcap]“యం.[/dropcap] రఘునందన్ రావ్”. మైకులో నా పేరు వినగానే ఆహూతుల చప్పట్ల మధ్యన మెల్లగా లేచి సభావేదిక వైపు నడుస్తున్నాను. అందరి దృష్టీ నాపైనే ఉన్నట్లుంది…. కానీ నా మనసులో అనేక సందేహాలు. అనేక ఆలోచనలు. వాటి మధ్యనే సభా వేదికను చేరాను. నా ఎదురుగా జిల్లా కలెక్టర్. నమస్కారం పెట్టారు. నేను ప్రతి నమస్కారం చేసాను. కాకపోతే అతని కళ్ళలోకి సూటిగా చూడలేకపోయాను. తను మాత్రం ఏమీ తెలియనట్లు ప్రసన్న వదనం తోనే ఉన్నాడు(రు). ఇంతలో ఎదురుగా ఉన్న పెద్ద సన్మానం కుర్చీలో నన్ను కూచోబెట్టి, పూలగుత్తి ఇచ్చి, శాలువా కప్పి మొమెంటో బహూకరించారు. అది జిల్లా ఉత్తమ ఉద్యోగులకు స్వాతంత్ర్య దినోత్సవ వేళ కలెక్టర్ గారి చేతుల మీదుగా జరుగుతున్న సన్మాన కార్యక్రమం. సంతోషించాలో, సిగ్గుపడాలో తెలియని అయోమయంలో ఉన్నా. కెమెరా వాళ్లు, పత్రికల వాళ్లు కొన్ని ఫోటోలు తీసుకున్నాకా వేరే ఇంకో పేరు పిలిచారు. దానితో వేదికపైనున్న అందరికీ మరొక్కసారి నమస్కారం చేసి వేదిక దిగి నా స్థానం దగ్గరకు వస్తున్నాను. ఆనందమో, పశ్చాత్తాపమో, గర్వమో ఏమో తెలియని ఒకరకమైన భావోద్వేగంతో కళ్ళనుంచి రాలిన కొన్ని కన్నీటి బిందువులు చూసి చాలామంది సహచరులు ఆనందభాష్పాలుగా అనుకున్నారు. నిజం నాకు తెలుసు. నాకు మాత్రమే తెలుసు.
నేను మొదటినుంచి ఉన్నతభావాలు కలిగిన మనిషిని. విధి నిర్వహణలోనూ చాలా నేర్పుకలిగిన వాడిని. అందరితో కలుపుగోలుతనం కలిగిన వాడిని. దానివలన అందరూ నన్ను అభిమానించేవాళ్ళు. నా భార్య ఉపాధ్యాయురాలిగా మా ప్రక్క ఊర్లోనే పనిచేస్తుంది. మాకు ఇద్దరు పిల్లలు. మాకు అన్ని విషయాల్లోనూ ఏకాభిప్రాయమే ఒక్కదాంట్లో తప్ప.
ఏ విషయమైనా నేను ఎదుటివాళ్ళతో పోల్చి చూస్తా. నా చుట్టుపక్కల అందరి కంటే అన్నింట్లో గొప్ప స్థానంలో ఉండాలని, నా కుటుంబాన్ని అందరూ గొప్పగా చూడాలని అనుకునే వాడిని. మొదటినుంచి అది నా నైజం. కానీ ఈ విషయంలో నా భార్య నాకు పూర్తి భిన్నం. ఎవరి జీవనవిధానం వాళ్ళది. ఒకళ్ళతో పోలిక ఎప్పుడూ మంచిది కాదనేది ఆమె భావం. అలా అయితే ఎప్పుడూ అక్కడే ఉండిపోతాం ఎదగలేం అనేది నా ఉద్దేశ్యం. ఈ విషయంలో మాకు తరచూ విభేదాలు ముదిరి గొడవలుగా మారేవి. దానికితోడు మా అబ్బాయి గొప్ప తెలివైన వాడు కావాలని మంచి ఇంటర్నేషనల్ స్కూల్ లో పెట్టా. అయినా వాడికి మామూలు మార్కులు వచ్చేవి. నేను తట్టుకోలేకపోయేవాడిని. మిగతా సహచరుల పిల్లలు మంచి మార్కులు సాధించేవారు. నా అహానికి అది చాలా కష్టం కలిగించేది. ఆ కోపాన్ని నేను వాడిపై చూపించేవాడిని. పిల్లలపై ఒత్తిడి ఎక్కువ పెట్టకూడదని అది వాళ్ళ భవిష్యత్తుకు మంచిది కాదని నా భార్య వాదించేది. అసలు వాడు చాలా చిన్నవాడని, ఆడుకునే వయసులో ఈ ఒత్తిడి మంచిదికాదని వాదించేది. ఈ క్రమంలో ఒక రోజు పెద్ద గలాభానే జరిగింది. వాడిని కొట్టబోతుంటే ఆమె అడ్డుకుంది… దానితో ఆ దెబ్బ ఆమెపై పడింది. ఆమె ఉద్యోగం చెయ్యటంవలననే ఆమెకు అహంకారం పెరిగిందని నేను భావించి ఉద్యోగానికి రాజీనామా చెయ్యమని బలవంతం చేశా. ఆమె బ్రతిమాలే కొలదీ నా అహంభావం మరింత పెరిగింది. చివరకు, “ఉద్యోగమా, నేనా తేల్చుకో” అని హుకుం జారీ చేశా. నిర్ఘాంతపోయిన ఆమెనుంచి నేనూహించని సమాధానం వచ్చింది. “నా ఉద్యోగం మీకు అడ్డుకాదు. నేను మీ చర్యలను సమర్ధించకపోవటం మీకు నచ్చటంలేదు. అదీకాక మీ చర్యలవల్ల రేపు పిల్లల భవిష్యత్తు పైనా నాకు భయం కలుగుతోంది. కాబట్టి నేను నా ఉద్యోగానికి రాజీనామా చెయ్యలేను” అని కరాఖండిగా మొహానే చెప్పేసింది. అలా చెప్పటాన్ని నా మనసు అంగీకరించలేకపోయింది. వెంటనే “అయితే మనకు విడాకులే”, హతాశురాలై నన్ను చూసి “ఏం మాట్లాడుతున్నారు. అసలు ఆలోచిస్తున్నారా?” అంది. “ఇంకా ఆలోచించేది ఏం లేదు. నాకు నచ్చని పద్ధతులు, మనుషులతో నేను ఈ ప్రయాణం సాగించలేను” అని చెప్పి బయటకువెళ్ళా. ఆమె ఎంత చెప్పిచూసినా నేను కరగలేదు. పెద్దలు ఎన్ని చెప్పిచూసినా వినదలచుకోలేదు. ఆ విధంగా మావిడాకులు మంజూరై విడిపోయాము. పిల్లలు మైనర్లు కావటం చేత ఆమెతోనే ఉండాలని కోర్టు ఆదేశం. అలా మేం విడిపోయాం. నేను వీరికి దూరంగా ఉండాలని బదిలీ చేయించుకుని అందరికీ దూరంగా వెళ్ళిపోయాను.
ఇన్నేళ్ళలో ఎన్నోసార్లు ఆమెను, పిల్లలను కలవాలనిపించినా నా అహం నన్ను ఆపేసింది. అలా ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలా. కొద్దిరోజుల క్రితం సాయంత్రం టీవిలో చానెల్స్ మారుస్తూ ఉంటే, ఒక లోకల్ చానెల్ లో వస్తున్న ఇంటర్వ్యూ పై నా మనసు పడింది. ఒక్క క్షణం ఊపిరి ఆగినట్లైంది..అది ఎవరో కాదు… నా కొడుకు ప్రతాప్ సింహా, పక్కనే వాళ్ళమ్మతో. కొత్తగా ఈ జిల్లాకు వచ్చిన కలెక్టర్.
ఇంటర్వ్యూ ఆసక్తికరంగా వింటున్నా. వాడి మాటతీరు చూస్తే ముచ్చటగా ఉంది. ప్రతి మాటా మనిషిని కదిలించేలా ఉంది. మట్టిలా ఉన్నవాణ్ని పూజించే విగ్రహంలా మార్చిన తన తల్లి గొప్పదనం గురించి వాడు చెప్తుంటే, సిగ్గుతో నా మనసు తలదించుకుంది. ఏమీ లేదనుకున్న వాడి మెదడులో, ఎదుటి వారితో పోల్చి నేను మరింత మట్టిని పోస్తే, వాడిలో ఉన్న బలాన్ని వాడు గుర్తించేలా చేసి, ఆ మట్టికింద ఉన్న అద్భుతమైన జ్ఞాన వజ్రాలమూటల్ని బయటకు తీయటంలో ఆ తల్లి పడిన శ్రమని వాడు వివరిస్తుంటే… సిగ్గుతో నా గుండె బరువెక్కింది. “మీ నాన్నగారి గురించి చెప్పగలరా” అన్న ప్రశ్నకు ఏం చెప్తాడో అని ఆశగా విన్నా. “ఆయనో జ్ఞాపకం. అంతే” ఒక్కమాట తో నన్ను అధఃపాతాళానికి నెట్టేశాడు. అలా అని నాపై వ్యతిరేకంగా ఏం చెప్పలేదు. కానీ ఆ ప్రశ్న అడిగినప్పుడు నా భార్య కళ్లల్లో ఒకరకమైన మెరుపుని మాత్రం గుర్తించగలిగాను. ఆమెకు నా పట్ల ఉన్న ప్రేమను అది చెప్పకనే చెప్పింది. ఒక తండ్రిగా, భర్తగా నేనెంత పాపం చేశానో చెప్పకనే చెప్పినట్లైంది. నా మనసు ఆనందం (నా భార్యాపిల్లలు ఆ ఊర్లోనే ఉన్నారని), ఒకవైపున బాధ(నేను చేసిన పనికి) నా మనసుని మెలిపట్టి తిప్పినట్లుంది. కలవాలనే ఆశ కలిగినప్పటికీ, ఎందుకో నా మనసు అంగీకరించలేదు. నేను చేసిన తప్పు, క్షమించలేనంత పెద్దదని నా భావన. అందుకే ఎప్పట్లా దూరంగానే ఉండాలనుకున్నా. కానీ వృత్తిలో నా నిబద్ధతను చూసి నన్ను ఉత్తమ ఉద్యోగిగా గుర్తిస్తున్నట్లు, స్వాతంత్ర్యదినోత్సవం నాడు కలెక్టర్ గారి చేతుల మీదుగా అవార్డు ఇస్తున్నట్లు తెలియగానే కాస్త ఆలోచించా. అందుకోవాలా, ఒద్దా అని. చివరకు అందుకుందామనే అనుకున్నా. అందుకే ఇప్పుడు ఇక్కడ ఉన్నా.
నన్ను సత్కరించినప్పుడు, కలెక్టర్, అదే మా వాడి కళ్ళల్లోకి చూసినా వాడు నన్ను పోల్చుకోలేకపోయాడు. ఎందుకంటే వాళ్లు నానుంచి దూరమైన క్షణం మొదలు నేను చాలా మారిపోయాను. అది నా ఆరోగ్యంపై ప్రభావం చూపి నన్ను ముందుగానే వయసుకన్నా పెద్దవాణ్ని చేసేసింది. దానితో వాడు నన్ను పోల్చుకోలేకపోయాడు. ఇది జరిగిన కొద్ది రోజులకే నేను మళ్ళీ బదిలీకి దరఖాస్తు(అప్లై) చేసుకున్నాను. ఎందుకంటే రోజూ వాడి గురించి వింటూ, నేను చేసిన తప్పును పదే పదే ఆలోచిస్తూ నేను ఈ నరకం అనుభవించలేను… అందుకే ఎంత మంది ఎన్ని రకాలుగా చెప్పినా… ఒక మారుమూల ప్రాంతానికి బదిలీకి దరఖాస్తు చేసుకున్నా. కొద్ది రోజుల్లో వెళ్ళిపోతా. ఒకటే చెప్పదలచుకున్నా.
ప్రతిమనిషిలోనూ తెలియని సామర్ధ్యం ఉంటుంది. అది తెలుసుకుని, వాళ్ళని ఆ దిశగా ప్రోత్సహించాలి తప్ప, పనికిరాని పోలికలతో, వాళ్ళలో లేని ఆత్మన్యూనతా భావాన్ని పెంచి శక్తిహీనులను చెయ్యొద్దు. సింహం గొప్పదే… కానీ నీటిలో మొసలి కన్నా గొప్పది కాలేదు.