Site icon Sanchika

8. మంచు మాటలు

[box type=’note’ fontsize=’16’] 2018 దసరా కవితల పోటీకి వచ్చిన కవిత.  [/box]

[dropcap]ఆ[/dropcap]కాశవీకాశము తప్పుకున్న వేళ
మంచుదుప్పటి కప్పుకున్న నేల

నిహార హారములు అల్లిన చలువ పందిళ్ళు
తుషార మార్గములు చల్లగా చల్లిన మంచు ముత్యాలు

తుహిన జడిలో విరివిగా విరిసిన పొగమంచు శ్వాసలు
నలువైపులా కనుగప్పి దోబూచులాడే ఆ నాలుగు దిశలు

సూర్యుడు సిగ్గుపడి సన్నగా నవ్విన్నట్టున్న వెలుగు వాకిట్లోకి పరుగుపరుగున వచ్చి నిస్సార పత్రములను కొమ్మ నుంచి తుంచి నేలరాల్చిన జోరుగాలి
మోడుగా మిగిలిన చెట్టుకు ప్రకృతి పంపిన ఒక తోడుగా శ్వేతశీతల హిమచర్మాన్ని చుట్టుకుని దర్శనమిచ్చే హిమ మహీరుహావళి

ధవళవర్ణశోభిత దారులకు హిమసుమధారల అభిషేకం
ఏ చోట కురవాలో  ఏ పూట కరగాలో తెలియని మంచు అవివేకం

నీపై చల్లిన లవణం కరిగించెను చల్లని నీ ప్రాణం
మిగిలెను నీ నీరు.. శాశ్వతం కాని కన్నీరు

చెరను తప్పించే ఉక్కుస్తంభాలు
చెమట తెప్పించే ఉష్ణకవచాలు

కళ్ళని కాపాడే కళ్ళజోళ్ళు
కాళ్ళని కాపాడే కాలిజోళ్ళు

దోమలకు చరచని చప్పట్లు
ఎంత దూరినా కురచయే దుప్పట్లు

Exit mobile version