99 సెకన్ల కథ-1

1
1

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత, సంపాదకులు, కాలమిస్ట్ జి. వల్లీశ్వర్ ’99 సెకన్ల కథ’ సిరీస్‌లో ఈ వారం రెండు కథలు సంచిక పాఠకులకు అందిస్తున్నారు. ఈ కథలు ప్రపంచతత్వాన్ని, మానవ మనస్తత్వాన్ని సూక్ష్మంగా ప్రదర్శిస్తాయి. [/box]

1. భార్యల తప్పులు!

…కోపంతో విసురుగా కంచం తోసేసి, హడావుడిగా బట్టలు వేసుకొని, ఆఫీసుకి బయల్దేరాడు వెంకట్రావు. స్కూటర్ తీస్తుంటే పెద్దాయన శేషయ్య గారు వచ్చారు.

“అ.. అ.. నాకోసం ఆగొద్దు. వీలైతే సాయంత్రం రామకృష్ణ మఠానికి రా. అక్కడ కలుద్దాం. ఇప్పుడు భానుని కలిసి వెళ్తాను…” అంటూ మామిడి పళ్ళ సంచీతో లోపలికి నడిచారు శేషయ్య.

***

సాయంత్రం మఠంలో శేషయ్య గారిని చూస్తూనే వెంకట్రావు ఆఫీసు గొడవలు ఏకరువు పెట్టాడు.

“నేను గాడిద చాకిరీ చేస్తున్నా. బాసు గాడికి కృతజ్ఞత లేకపోగా ప్రతిదానికీ కోడిగుడ్డుకి ఈకలు పీకుతాడు. ఇవ్వాళకూడా నేను మనసు పెట్టి తయారు చేసిన ముఖ్యమైన మూడు పేజీల డ్రాఫ్టులో రెండు స్పెల్లింగ్ తప్పులు న్నాయని ఫైలు విసిరేస్తాడా…!”

“ఏదీ! ఇంగువ ఎక్కువై, పులుసు చేదొచ్చేసిందని నువ్వు కంచం విసిరేసినట్లా?”

షాక్ తిన్నాడు వెంకట్రావు. అంటే పొద్దున జరిగిందంతా భాను ఈయనకి చెప్పేసిందా?

“మీ బాసు ఏం చేసి వుండాల్సిందంటే…. నీ డ్రాఫ్టుని ముందు మెచ్చుకొని, ‘ఈ చిన్న చిన్న స్పెల్లింగ్ తప్పులు సరిచేసి ఇవ్వయ్యా. చాలా బాగుంటుంది’ అని చెప్పి వుండాల్సింది. అప్పుడు నీకు ఇంత బాధ ఉండేది కాదు. కదా!”

అవునన్నట్లుగా తలూపాడు వెంకట్రావు ఏదో ఆలోచిస్తూ. అంతలో మఠంలో భజన మొదలైంది.

***

మర్నాడు పొద్దున ఆఫీసుకి వెళ్ళే ముందు భోజనానికి కూర్చున్నాడు వెంకట్రావు.

తనకిష్టమైన ఆవపెట్టిన పనసపొట్టు కూర. నోట్లో లాలాజలం లావాలా పొంగింది…

కాని, ముద్ద నోట్లో పెట్టగానే…! ఒళ్ళు మండింది.

“ఛత్. ఇంత చప్పగా తగలడిందేమే?” అని అరవాలనిపించింది. తమాయించు కున్నాడు.

“భాను, కూర చాలా బాగుందోయ్. కొంచెం ఉప్పు వేసివుంటే ఇంకా బాగుండేదోయ్” అన్నాడు ప్రేమగా.

“సారీ.. సారీ” అంటూ, కూర కొంచెం వేడిచేసి, ఉప్పు కలిపింది భాను వినయంగా.

అంతే! లొట్టలేసుకుంటూ తిన్నాడు.

…. వెంకట్రావు ఆఫీసుకెళ్ళాక, భాను ఆనందంగా శేషయ్య గారికి ఫోన్ చేసింది.

“థాంక్స్ అంకుల్.”

2. పెళ్ళానికి పి.డి వాగ్దానం

మధ్యాహ్నం రెండు దాటింది.

మూడు రోజులపాటు సెలవులొచ్చాయని, ఆట విడుపుగా నాగార్జున సాగర్ తీసుకెళ్తానని ప్రత్యక్షదైవం (పి.డి) వాగ్దానం చేశాడు గదా!

పిల్లలకి, తనకి, పి.డి కి బట్టలు సర్దేస్తోంది భాను.

అంతలో… సంచారవాణి మోగింది.

లైన్లో పి.డి!

“భాను, మా బాస్ ఇప్పుడే పిలిచాడు. అతను హెడ్ ఆఫీస్‌కి పంపించాల్సిన రెండు బహు గోప్యమైన రిపోర్టులు ఉండిపోయాయిట. తాను వాళ్ళ అమెరికా ఫ్రెండు కోసం జైపూర్ వెళ్ళాలిట. నన్ను రేపూ ఎల్లుండి ఆఫీస్ కొచ్చి వాటిని పూర్తి చేసేయమని – పాపం చాలా బేలగా – అడుగుతున్నాడు….. ప్లీజ్, నేను సాగర్ రాలేను… ఆహా, నువ్వు మానొద్దు. పిల్లల్ని తీసుకొని, నీ ఫ్రెండు పక్కింటి కాంతాన్ని తీసుకొని ఝామ్మని వెళ్ళొచ్చేయ్. నేను డ్రైవర్‌ని ఏర్పాటు చేస్తాగా …”

భాను నిట్టూరుస్తూ ఫోన్ పెట్టేసింది.

సెలవులకి బయటికెళ్దామనుకున్న ప్రతిసారీ పి.డి గారు వాగ్దానం చేయటం, బాసు ఏదో అప్పగించటం, ఈయన గారు తన ప్రభు భక్తిని నొక్కి నొక్కి చాటుకోవటం కోసం – ఇంటి విషయం ఆయనకి చెప్పకుండా – ఆఫీస్‌కి అంకితమై పోవటం… ఎప్పుడూ జరిగే తంతే!

మనసులో కలుక్కుమంది.. ఆలోచిస్తోంది. బట్టలు సర్దటం ఆపలేదు.

***

సాయంత్రం ఏడింటికి వెంకట్రావు ఇంటికొచ్చేసరికి, తన మార్గదర్శి శేషయ్యగారు పిల్లల్తో కొత్తగా విడుదలైన ‘బతుకుతెరువు’ సినిమా గురించి మాట్లాడుతున్నారు.

పరామర్శలయ్యాక, శేషయ్య గారు అడిగారు. “రేపు సాగర్ వెళ్తున్నారట గదా!..”

వెంకట్రావు మధ్యాహ్నం భానుకి చెప్పిందే చెప్పి, “బాస్ అలా దీనంగా అడిగితే కాదనలేం కదా!” అన్నాడు.

శేషయ్య నవ్వారు.

“ఎప్పుడన్నా ఆలోచించావటయ్యా! నువ్వు వాడికి ఊడిగం చేస్తున్నది నీ కుటుంబం సుఖంగా జీవించటం కోసం. వాడికి ఊడిగం చేయటం కోసమే నువ్వు జీవిస్తున్నావా?… ఆలోచించు..”

వెంకట్రావుకి బుర్ర తిరిగిపోయింది.

అంతే.

వెంటనే బాస్‌కి ఫోన్ చేసి అందంగా “సారీ” చెప్పేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here