99 సెకన్ల కథ-13

7
2

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత, సంపాదకులు, పాత్రికేయులు జి. వల్లీశ్వర్ ’99 సెకన్ల కథ’ సిరీస్‌లో ఈ వారం రెండు కథలు సంచిక పాఠకులకు అందిస్తున్నారు. ఈ కథలు ప్రపంచతత్వాన్ని, మానవ మనస్తత్వాన్ని సూక్ష్మంగా ప్రదర్శిస్తాయి. [/box]

1. శాంత స్వార్ధం!

“ఏమ్మా శాంతా, ఎలా వున్నావ్? మీ ఆయన ఇప్పుడు కొంచెం ఇంటిపట్టున వుంటున్నాడా? పిల్లలు బాగా చదువుతున్నారా..?” అంటూ సుబ్బారావు ఎదురుగుండానే అతని భార్య శాంతని అడిగారు రామకృష్ణా మఠంలో శేషయ్య.

“ఆయన ఎప్పుడు ఇంటిపట్టున వుండాలండీ! కంపెనీ వాళ్ళు ఆయన సర్వీసు పొడిగించారు కదా. ‘షరా – మామూలు’ గానే ఆయనకి పొద్దుటే యోగ సేవ, సాయంత్రం క్లబ్ సేవ, పగలంతా వాళ్ళ బాసు సేవ…! ఆయన్ని మార్చలేను అని అర్థమైపోయింది. అందుకే నేను మారిపోయాను. నిత్యం పూజలు, మా పారాయణ బృందంతో కోటి పారాయణలు పెట్టేసుకున్నాను… మీరెప్పుడూ చెబుతూ వుంటారు కదా – ప్రకృతిలో, జీవితంలో మార్పు నిరంతర ప్రక్రియ అని. అందుకే ఈ హైదరాబాద్ వచ్చాక, మార్పుకి తగినట్లు వుండటం అలవాటు చేసుకున్నాను…”

“నా భార్య చాలా తెలివైనది అంకుల్. నాలాగా కాదు” అన్నాడు భార్యా విధేయుడు సుబ్బారావు. శేషయ్య నవ్వేశారు.

“కాని, బాబాయి గారు…” శాంత నసిగింది.

“చెప్పమ్మా, ఏదన్నా కొత్త సమస్యా?”

“అదేనండి. పిల్లలు కాలేజీ చదువులుకొచ్చారు. కొంచెం ప్రశాంతత దొరికింది అనుకొంటూంటే మా పిల్లలు నాకు కొత్త తలనొప్పి తెచ్చి పెట్టారండి. ఎవరో స్నేహితులిచ్చారని ఒక జాతి కుక్క పిల్లని తెచ్చి పెట్టారండి.”

“రెండేళ్ళయిపోయిందనుకొంటాను!”

“అయిపోయింది. నేను దానికి సేవ చేయలేనురా అంటే, ‘ఎందుకు, అన్నీ మేమే చూసుకుంటాం’ అని అప్పుడన్నారా! ఇప్పుడు ఒక్కటి కూడా వాళ్ళు చూడటం లేదు. అది నా చుట్టూ తోకలా తిరుగుతూంటుంది. దానికి బ్రషింగ్, దానికి తిండి పెట్టడం, పొద్దున్నే వ్యాహ్యాళికి తీసుకెళ్ళటం అన్నీ నా పనే. చివరికి, అది నేను పూజ చేసుకుంటుంటే కూడా అలా నాకేసి చూస్తూ కూర్చుంటుంది..”

“ఎందుకు ?”

“ప్రసాదం, తీర్థం కోసం.”

శేషయ్య నవ్వేశారు.

“ఫరవాలేదు. చాలా పనులు చేస్తున్నావు!”

“నా భార్య తెలివైనది కదా అంకుల్?” అన్నాడు భావి.

అలా ఆరేళ్ళు గడిచాయి. పిల్లలిద్దరికీ ఉద్యోగాలువచ్చేసి, వేరే నగరాలకి వెళ్ళిపోయారు.

ఒక రోజు పొద్దుటే శేషయ్య గారికి భావి ఆదుర్దాగా ఫోన్ చేశాడు.

“అంకుల్. నిన్న తెల్లవారుఝామున మా కుక్కగారు స్వర్గస్థులయ్యారు. దాంతో శాంత దుఃఖం నయాగరా జలపాతంలా పొంగిపోతోంది. నేను ఎన్ని రకాలుగా జీవాత్మ, పరమాత్మ కథలు చెప్పినా, తనని సముదాయించలేకపోతున్నాను. మీరు ఒక్కసారి రావాలి.”

“అదేమిటయ్యా, నీ భార్య తెలివైనది కదా.”

“ఆ మాట చెప్పినా అది ఏడుపు మానటం లేదు. నిన్నంతా మా ఇంట్లో పొయ్యిలో పిల్లి లేవలేదు. ఇవ్వాళకూడా లేవకపోవచ్చు..”

మరునాడు, శేషయ్య వెళ్ళారు. ఆయన్ని చూస్తూనే శాంత భోరు భోరున కంట్లో కొళాయి విప్పేసింది. అయిదు నిమిషాలు… పది నిమిషాలు…! ఆపటం లేదు.

“నువ్వు తెలివైనదానివని సుబ్బారావు చెబితే, నిజమే అనుకుంటూ వచ్చాను.”

“నేనూ అలాగే అనుకున్నాను అంకుల్” అన్నాడు భావి.

కొళాయి ఆగటం లేదు.

“నువ్వు చాలా దుర్మార్గురాలివి శాంతా” కొంచం కటువుగా అన్నారు శేషయ్య.

శాంత టక్కున కొళాయి కట్టేసింది. ప్రశ్నార్థకంగా తలెత్తి శేషయ్య వంక చూసింది.

“అవును నువ్వు ఎంత స్వార్థపరురాలివో, ఎంత తెలివి తక్కువదానివో నాకు ఇప్పుడు అర్థమయింది.”

శాంత మాట్లాడటం లేదు. ఆయన వంకే అయోమయంగా చూస్తోంది.

“అవునమ్మా, ఆ కుక్క పూర్వ జన్మలో ఎంతో కొంత పుణ్యం చేసుకోవటం వల్ల నీ ఇంటికి వచ్చింది.ఎంత త్వరగా ఈ జన్మ నుంచి విముక్తి లభించి, మంచి జన్మ లభిస్తుందా అని రోజూ నువ్వు పెట్టే ప్రసాదం తిని, తీర్థం తాగి, నీకు విశ్వాసంగా సేవ చేసింది. కాని నువ్వేం కోరుకుంటున్నావు? ఈ కుక్క నేను చచ్చేదాకా తాను చావకుండా, చచ్చినట్లు కుక్కలాగా నాకు సేవ చేస్తూ నా కాళ్ళ దగ్గర పడివుండాలని కోరుకుంటున్నావు. ఎంత దుర్మార్గం! ఎంత స్వార్ధం!”

అంతే, ఆ తరువాత ఎప్పుడూ శాంత ఆ కారణంగా ఏడవలేదు.

2. ఎవరు కారణం?

రామకృష్ణా మఠంలో శేషయ్య గారి కోసం వెతుకుతున్నాను. ఆయన హడావుడిగా బయటకు వెళ్తూ కనుపించారు.

“అయ్యా తమ కోసమే వెతుకుతున్నాను…”

“మళ్ళీ మాట్లాడదాం ఈశ్వర్రావు. ఆ రామకోటి రమణారావు తన కొడుకు మీద ఫిర్యాదు చేస్తానంటున్నాడు. నేను వచ్చేదాకా ఆగమని చెప్పాను. తక్షణం వెళ్ళాలి.”

“అయితే నా కారులో వెళ్దాం రండి… నాకు ఇల్లు తెలియదు!”

“నాకు తెలుసు.”

కారులో వెళ్తుంటే రామకోటి రమణారావు గురించి చెబుతున్నారు.

“నీకు బాగా తెలుసా ఆయన?”

“అబ్బే, మీతోపాటు చూడటమే. మీరే పరిచయం చేశారు కదా! రాములవారికి వీర భక్తుడని, చాలా మంది చేత రామకోటి రాయిస్తూంటాడని, రామ నామ సప్తాహాలు చేయించాడని…”

“ఆ.. ఆయనే. ఉద్యోగంలో సంపాదించినదానితో స్థలాల క్రయ విక్రయాలు చేసి బాగా సంపాదించాడు. ఇప్పుడు ఆయన కొడుకు వ్యాపారం చేసుకుంటానంటే రెండేళ్ళక్రితం చాలా అయిష్టంగా డబ్బు అప్పిచ్చాడు. వాడి వ్యాపారం కాస్తా శంకరగిరి మాన్యాలు పట్టేసింది. ఇప్పుడు వాడి మీద పోలీసు కేసు పెట్టాలని ప్రయత్నం..”

నేను నమ్మలేకపోయాను. అంత రామభక్తుడికి ఎన్ని కష్టాలు! తగలేసింది కొడుకే కదా, దాని కోసం పోలీసుల దాకా ఎందుకు వెళ్తున్నాడు?… అదే అడిగాను.

“ఆ వ్యాపారం పెట్టమని ప్రోత్సహించింది వాడి మావగారట. ఎందులో పెట్టుబడి పెట్టారో ఆ సంస్థలో ఆయనకి వాటా వుందిట… ఇప్పుడు కొడుకు మీద కేసు పెడితేనే డొంకంతా కదులుతుందని ఆయన నమ్మకం.”

“మరి కొడుకు అన్యాయమైపోతాడు కదా!”

“కదా. వాడు కేసు వద్దు మొర్రో అంటూ లబో దిబోమని మని ఏడుస్తునాడు. పైగా, తండ్రి తిట్లు పడలేక వాడు, వాడి భార్య ఇంటికి కూడా రావటంలేదు.. అయినా రమణారావు మహా పట్టుదలగా వున్నాడు. తన కొడుకుని తనకి కాకుండా చేశారని అనుమానం..”

“అయినా కొడుక్కి బుద్ధి వుండాలి కదా!”

“వాడు స్వతహాగా మంచివాడు.. ఏం చేస్తాం! ఇదంతా ఎందుకు జరుగుతుందంటే…”

అంతలో రామకోటి రమణారావు ఇంటికి వచ్చేశాం.

“ఆ, చెప్పండి. నన్నెందుకు ఆగమన్నారు శేషయ్యగారు?” ఆవేశంగా వున్నాడు రామకోటి.

అయినా, “ముందు కాఫీ తాగండి” అంటూ మర్యాద చేశారు. అప్పుడు చూశాను ఆ ఇల్లు. ఎంత అందంగా కట్టారు! 600 వందల గజాల్లో మూడో వంతే ఇల్లు. మిగతా స్థలంలో రకరకాల పూలమొక్కల సమూహాలు. ఆ సమూహాలకి పేర్లు పెట్టాడు – ‘మిథిల, అయోధ్య, చిత్రకూట, సరయూ తీర …! ప్రతి ప్రహరీగోడ లోపలవైపు ‘జై శ్రీరాం’ అంటూ పొడవాటి నామాల పంక్తి పెయింట్ చేయించాడు.

“నన్నెందుకు ఆపుతున్నారు? నేను పొదుపు చేసుకున్న లక్షలన్నీ నాశనమైపోయాయి.”

రమణారావు గొంతు ధాటిగా మోగుతోంది.

“కేసు ఎవరి మీద పెడతారు?”

“నా కొడుకు మీద, వాడి మామ మీద, ఇంకా ఎవరెవరు నా సొమ్ము నాశనమవటానికి కారణమయ్యారో వాళ్ళందరి మీదా.”

“మరి రాముడు ఎవరి మీద పెట్టాలి?”

“ఎవరు?” రామకోటికి అర్థం కాలేదు.

“తాను చేయని తప్పుకి అకారణంగా తాను వనవాసానికి వెళ్ళాల్సి వచ్చింది కదా మీ రాముడు. అతను ఎవరి మీద కేసు పెట్టాలి?”

ఆలోచిస్తున్నాడు.

“చూడండి రమణారావు. మీరు నిజంగా రామభక్తుడైతే, రాముడి అడుగుజాడల్లో నడవాలని తాపత్రయ పడుతున్న మనిషే అయితే, ఇలాంటి సందర్భంలో రాముడు ఎలా ఆలోచించాడో వినండి.

(శ్లోకం) సుఖదుఃఖే భయక్రోధౌ లాభాలాభౌ భవాభవౌ, యచ్చ కించిత్ తథా భూతం నను దైవస్య కర్మ తత్..”

రామకోటి నిశ్శబ్దంగా వింటున్నారు.

“సృష్టిలో అన్ని ప్రాణులకి కలిగే సుఖదుఃఖాలకి, కష్టాలకి, లాభనష్టాలకి, చావుపుట్టుకలకి కారణం – విధి… ఎవరినో ఒకరిని మన కష్టాలకి కారణం అనుకొని వాళ్ళ మీద ద్వేషం పెంచుకొని, కత్తులు దూసి, మనశ్శాంతిని పోగొట్టుకునే పని మీ రాముడే చేయలేదు. మీరెందుకు చేస్తున్నారు? రాముడు ఆదర్శం కాదు అనుకుంటే మీ ఇష్టం.”

రామకోటి రమణారావు ఏమీ మాట్లాడలేదు.

రెండురోజుల తరువాత శేషయ్య చెబుతున్నారు. రామకోటి కేసు పెట్టలేదు. కొడుకుని, కోడలిని ఇంటికి తీసుకొచ్చాడు. కొడుక్కి ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం వేయించాడు. వియ్యంకుడు వచ్చి ఎంతో కొంత రికవరీ అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here