[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత, సంపాదకులు, కాలమిస్ట్ జి. వల్లీశ్వర్ ’99 సెకన్ల కథ’ సిరీస్‌లో ఈ వారం రెండు కథలు సంచిక పాఠకులకు అందిస్తున్నారు. ఈ కథలు ప్రపంచతత్వాన్ని, మానవ మనస్తత్వాన్ని సూక్ష్మంగా ప్రదర్శిస్తాయి. [/box]
1. అలా పడ్డారు!
అంతే! ఇంటి ఓనర్ సూర్యం కాళ్ళమీద పడ్డాడు.
ఎందుకంటే …!
చీమక్కూడా కష్టం కలిగించని సంస్కారం నా తమ్ముడు సూర్యానిది. వాడికీ 75 నిండాయి. భార్యకి సర్జరీ చేయించి, అంబులెన్సులో ఇంటికి తీసుకు వచ్చేసరికి, ఇంటి ఓనర్ చూసి ఝడిసి పోయి, ఇల్లు ఖాళీ చేసేమంటున్నాడు. పాపం, ఈ వయసులో వాడు మళ్ళీ ఇంకో ఇల్లు వెతుక్కోవాలా …!
…ఇలా ఆలోచిస్తూ, శేషయ్య గారు తమ్ముడింటికి వెళ్లారు.
ఈయన మేడ మెట్లెక్కేసరికి “ఇంకా ఎంతసేపు..” అని కేకలేస్తూ ఆ ఇంటి దంపతులు పైకి వచ్చేశారు.
82 ఏళ్ల శేషయ్యగారిని చూడగానే నీళ్లు నమిలారు.
“మంచి పార్టీలు అద్దెకి వున్నారు.? మా తమ్ముడి పోర్షన్ ఇస్తారా ?”శేషయ్య ప్రశ్న.
వాళ్ళ కళ్ళు మెరిశాయి.
“వాళ్ళ ఆరోగ్యాలు బాగుంటే చాలు సార్.”
“సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో కుర్ర జంట.. సూపర్ ఆరోగ్యంలే. అద్దె బాగా ఇస్తారు. కాకపోతే, శుక్రవారం, శనివారం రాత్రి పబ్ కెళ్ళొచ్చి కొట్టేసుకుంటారు. చుట్టుపక్కల వాళ్లకి బోలెడు వినోదం..”
మెరిసిన కళ్ళు వాలి పోయాయి. నీరసంగా తల అడ్డంగా తిప్పారు.
“పోనీ, మంచి కుర్రాళ్ళ పార్టీ వుంది.
ఆరోగ్యాలు మహా సూపర్. (నాలుగు కళ్ళూ మిల మిలా..) అవివాహితులే. బ్రహ్మచారులో కాదో తెలీదనుకో. కానీ, అద్దె ఎక్కువిస్తారు. శని, ఆది వారాల్లో ఇంకో పదిమంది కుర్రాళ్ళని పిల్చి, పారాయణం చేస్తుంటారు…”
(కళ్ళు మిల మిలా)
“ఏం పారాయణం సార్?”
“చతుర్ముఖపారాయణం…”
కళ్ళు వాలిపోయి, మొహాలు పాలిపోయాయి.
“ఇంకో పార్టీ వుంది. అద్దె చాలా ఎక్కువిస్తారు. మీ వయసే. ‘వీర ఆరోగ్య’ కేసరుల కుటుంబం అది.. చూస్తారా? (కళ్ళు మహా మిల మిలా) అసలు అల్లరి పెట్టరు. వాళ్ళ కుల వృత్తి అదేదో.. క్షుద్రపూజలు.. చేతబడులతో రోగాన పడ్డ వాళ్లంతా ఆరోగ్యం కోసం వీళ్ళదగ్గరకే వస్తుంటారు… బోల్డు డబ్బు వాళ్లకి…”
ఆ ఇంటి దంపతులు వణికిపోయారు.
మరుక్షణంలో సూర్యం కాళ్ళమీద పడిపోయారు –
“మహాప్రభో, మీరు ఇల్లు ఖాళీ చేయొద్దు.”
2. పద్మిని X రాధిక
పద్మిని భరించలేకపోతోంది.
రెండేళ్ళ క్రితం ఆ సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో చేరిన పద్మిని తన గోడంతా తాత గారి ముందు కుమ్మరించింది.
“తాతయ్యా, రాధికకి నాకు అసలు ఏ తగాదా లేదు. ఈ ఆఫీసులో చేరిన గత రెండేళ్ళలో నాకు చాలా దగ్గరయిన స్నేహితురాలు తను ఒక్కతే. ఇది వరకు చాలా సార్లు తనే ‘నెలలో ఉత్తమ ఉద్యోగి’ అవార్డు కొట్టేసేది. క్రిందటి నెల ఆ అవార్డు నాకు వచ్చిన దగ్గరనుంచి నాతో మాట్లాడటం మానేసింది… అదంతా అసూయ, పొగరే కదా తాతా? ఛ! నేను ఎంత ప్రేమగా పలకరించినా పలకటం లేదు… చాలా బాధగా వుందనుకో.”
“బాధ ఎందుకురా ?”
“మొదట్లో పనిలో నాకు తెలియనవి చాలా నేర్పేది. నాతో చాలా స్నేహంగా వుండేది. ఇప్పుడు అసూయతో…”
“మీ మధ్య స్నేహాన్ని చూసి ఓర్వలేని వాళ్ళెవరైనా చెప్పుడు మాటలు చెప్పి వుండొచ్చు కదా! అన్నట్లు, నువ్వు ఆ రాధిక గురించి ఇంకెవరి దగ్గరయినా – నాకు చెప్పినట్లే – చెప్పావా?”
“ఆ… చెప్పాను. అసూయతో కుళ్ళు కుంటూంటే చెప్పనా?”
“ఎంతమందితో?”
“ఇద్దరు ముగ్గురితో..”
“సరే, ఇంక ఆ రాధికని వదిలేయి.”
“నాతో ఇంతకాలం బాగుండి ఇప్పుడు మొహం తిప్పేసుకుంటుంటే ఎలా వదిలేయమంటావు తాతా!”
“వాళ్ళ దగ్గరా వీళ్ళ దగ్గరా నోరు పారేసుకున్నావు కదా! ఇంకెందుకే?”
“నువ్వు అన్నట్టే, చెప్పుడు మాటలు విని తను నా గురించి చెడుగా అను కొంటుంటే అస్సలు భరించలేను తాతా.”
“అంటే, నీకు తనంటే అంతిష్టమా ?”
“ఊ… ఊ… “
“అయితే, నేను చెప్పినట్లు చేయి. ఇది రహస్యం సుమా!” అంటూ శేషయ్య గారు తన మనవరాలికి ఓ ఇడియా ఇచ్చారు.
***
ఓ నెల తరువాత మనవరాలు ఫోన్ చేసి, ఫోన్లోనే ఎగిరి గంతేస్తోంది.
“సూపర్ తాతా. నువ్వు చెప్పినట్లే మా కామన్ ఫ్రెండ్స్ దగ్గరా, రాధిక తమ్ముడి దగ్గరా… రాధికలో మంచి గుణాలు సందర్భానికి అతికినట్లు చెప్పేస్తూ వచ్చానా! ఇప్పుడు రాధిక నాతో బాగా, బాగా కలిసి పోయింది తాతా. భలే ఐడియా తాతా… .”
శేషయ్య తనలో తాను నవ్వుకున్నాడు.
ప్రేమతో ఎవరినైనా జయించవచ్చు (పిచ్చివాళ్ళని తప్ప).
నా మనవరాలు ఇదేదో గొప్ప ఐడియా అనుకుంటోంది.