99 సెకన్ల కథ-20

1
2

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత, సంపాదకులు, పాత్రికేయులు జి. వల్లీశ్వర్ ’99 సెకన్ల కథ’ సిరీస్‌లో ఈ వారం రెండు కథలు సంచిక పాఠకులకు అందిస్తున్నారు. ఈ కథలు ప్రపంచతత్వాన్ని, మానవ మనస్తత్వాన్ని సూక్ష్మంగా ప్రదర్శిస్తాయి. [/box]

1. రాగమతి-వెంకట్ రుసరుసలు

[dropcap]“అ[/dropcap]వతల వ్రతానికి సమయం దాటి పోతోంది. ఇంత ఎండల్లో ఆ పట్టుచీర కోసం వెంపర్లాటెందుకు? వంగపండు రంగు కాటన్ చీర ఉండాలి కదా! బాగుంటుంది. అది కట్టుకో..” విసుక్కున్నాడు యాభై ఏళ్ల వెంకట్రావు.

“వ్రతానికి వచ్చే వాళ్లంతా పట్టు చీరెలు కట్టుకొస్తారు. నాకేం తక్కువని నేను కాటన్ చీర కట్టుకోవాలి?…” అంటూనే పట్టుదలగా తనకిష్టమైన పట్టుచీర దొరికేదాకా వెదికి, అప్పుడు గదిలోంచి బయటకొచ్చింది రాగమతి.

ఆ ముదురు ఎరుపురంగు పట్టుచీర చూస్తూనే వెంకట్రావుకి ఇంకా చిర్రెత్తుకొచ్చింది. ‘వంగపండు రంగు కాటన్ చీర ఎంత బాగుంటుంది? ఈ ఆడవాళ్లు మన మాట ఎప్పుడు వింటారు కనుక!’ అని విసుక్కుంటూ కారు తీశాడు వెంకట్రావు.

అతను విసుక్కోవటం రాగమతికి నచ్చలేదు. ‘నా టేస్ట్ ఇతనికి ఎప్పుడు నచ్చింది కనుక!’ రుసరుసలాడుతూ ఆమె కూడా కారెక్కింది.

దారిలో, యథాలాపంగా భర్త మొహం వంక చూసింది. ‘ఈ మహానుభావుడు నిన్న, ఇవ్వాళ గడ్డం గీయలేదు. అబ్బా!.. తలకి రంగు వేసి పదిరోజులు దాటినట్లుంది. జుట్టు మొదళ్ళు తెల్లగా కనిపిస్తున్నాయి. నలుగురిలోకి వెళ్తున్నాం కదా! కాస్త ఆ జుట్టుకి రంగు వేసుకోవచ్చు కదా!’… ఇలా అనుకోని ఊరుకోక, పైకి అనేసింది.

“నా జుట్టు నా ఇష్టం” అంటూ ధుమ ధుమలాడాడు వెంకట్రావు. అంతే! మాటా మాటా పెరిగింది. చివరికి ఇద్దరూ ఎడ మొహం పెడ మొహంతో వ్రతానికి వెళ్లారు.

సహస్ర చంద్ర దర్శనం చేసిన పెద్దాయన శేషయ్య వీళ్ళని చూసి ఉత్సాహంగా పలకరించారు.

“ఓహో, చిలకా గోరువంకలు సమయానికి వచ్చేశారే!” అన్నారు శేషయ్య వాళ్ళిద్దర్నీ చిరునవ్వుతో ఆప్యాయంగా పలకరిస్తూ.

ఆ ఇద్దరూ మొహం మీద కొంచెం నవ్వు పులుముకుని, “నమస్కారం” అన్నారు.

సహజంగా పుట్టుకొచ్చిన నవ్వుకి, అసహజంగా పులుముకున్న నవ్వుకి తేడా బాగా తెలిసిన వయస్సు, అనుభవం శేషయ్యగారిది.

ఇద్దరి మొహాలు చూడగానే పసిగట్టారు – ‘ఏదో జరిగిందని’. ఇద్దరికీ బంధువైన శేషయ్య వాళ్ళని ఓ పక్కకి తీసుకెళ్లి గట్టిగా అడిగి విషయం తెలుసుకున్నారు.

వెంకట్రావు తన పురుషాధిక్య వాదన బలంగా వినిపించాడు. “ఈవిడతో ఎప్పుడూ ఇంతేనండి…” అంటూ తన ఉమ్మస్సు అంతా వెళ్ళగక్కాడు.

రాగమతి ఊరుకోలేదు. తనలోని స్త్రీ వాద రచయిత్రిని బయటకు లాగి ప్రయోగించింది. తనని వేధిస్తున్న వెంకట్రావు వీరగాథల్ని ఏకరువుపెట్టింది. “చివరికి ఇవ్వాళ కూడా…” అంటూ తన వేదన అంతా కక్కేసింది.

అంతే!

శేషయ్య ఫెళ్ళున నవ్వారు. “మీ ఇద్దరూ ఎప్పటికీ ఇలాగే ఉండాలి సుమా” అంటూ పరమానందంగా దీవించారు. ఇద్దరికీ ఒళ్ళు మండిపోయింది.

“చూడమ్మా రాగమతి. ‘అందరూ పట్టు చీరెలే కట్టుకొస్తారు. వంగపండు రంగు కాటన్ చీర కట్టుకొని, అందరికన్నా విభిన్నంగా నా భార్య కనిపించాలి’ అని మీ ఆయన కోరుకున్నాడు. …అతను తెల్లజుట్టుకి రంగేసి, గడ్డం నీటుగా గీసుకొని, నలభై ఏళ్ల కుర్రాడిలా అందరిలో అందంగా కనబడాలని నువ్వు కోరుకున్నావు. .. ఒకరంటే ఒకరికి ఎంత ప్రేమ! ఇప్పుడు మీ ఇద్దరు చెప్పిన విషయాల సారాంశం ఇదే. …” అంటున్నారు శేషయ్య.

“అయ్యా శేషయ్య గారు, ఇక్కడ వధూ వరులకి అక్షతలు వెయ్యాలి, రండి” అంటూ లోపల్నుంచి కేకేశారు.

“ఇక్కడా అదే పని చేస్తున్నా. వస్తున్నా” అంటూ శేషయ్య, ఆ వెనకాలే సిగ్గుపడుతూ వెంకట్రావు, రాగమతి లోపలికి నడిచారు.

2. ఇది శేషగీత

కాంతారావు ఆనందానికి పట్టపగ్గాల్లేవు.

ఈ ప్రభుత్వంలో పన్నెండేళ్ళుగా ఉప కార్యదర్శి హోదాలోనే పనిచేస్తున్నాడా! పైగా, గత నాలుగేళ్ళుగా ఇదే విద్యాశాఖలోపరీక్షల విభాగంలో గాడిద చాకిరీ…!  ఇప్పటికి  పదోన్నతి లభించింది. అది కూడా ఇంకో నాలుగేళ్ళలో పదవీ విరమణ చేసే స్థితిలో…! సెక్రెటేరియట్ సర్వీసెస్ కి చెందిన తనకి అంతకన్నా ఎదిగే అవకాశం లేదు. అయినా, తాను ఆరు మాసాల క్రితం ఆ ప్రయోగం చేసివుండకపోతే …???

…ఇలా ఆ పదోన్నతి ప్రసాదించిన ఆనంద తరంగాలమీద తేలిపోతూ, బంధు మిత్రులందర్నీ ఆ ఆదివారం తన ఇంట్లో సత్యదేవ్ వ్రతానికి, ఆ వెనకాల విందుకీ “భార్యా, పిల్లల సమేతంగా రాగలరు” అని దూరాలోచనతో ఆహ్వానించాడు కాంతారావు. దానికి ఆహ్వాన పత్రిక ఘనంగా అచ్చు వేయించాడు. అందులో ముద్రారాక్షసాల కోసం ముప్ఫై మూడు సార్లు వెతికాడు. ముఖ్యంగా చివరి పంక్తులు జాగ్రత్తగా చూస్కు న్నాడు.

“సాకులు చెప్పకుండా తప్పక వచ్చి, మేమిచ్చే అక్షతలతోనే మా కుటుంబాన్ని ఆశీర్వదించాలని తహతహ లాడుతున్న మీ నికార్సయిన  శ్రేయోభిలాషి: శ్రీమతి కళ్యాణి సమేత కాంతారావు, రాష్ట్ర ప్రభుత్వంలో కొత్త సంయుక్త కార్యదర్శి.”

ఆ చివరి పంక్తిని ఎలాంటి మొహమాటం లేకుండా ముద్దక్షరాల్లో వేసుకున్నాడు.

అందరికీ అర్థమయింది. ఇష్టం వున్నాలేకపోయినా (ఆ హోదా చూసి) ఆ ఆహ్వానం అందుకున్న అన్ని కుటుంబాలూ వచ్చాయి.  వ్రతం అవగానే, బంధువులూ, ఆత్మబంధువులూ ప్రశ్నలు కుమ్మరించారు కాంతారావు మీద.

“ఏమయ్యా, ఇంకే పదోన్నతీ రాదని నిరాశా నిస్పృహల్లో వుండేవాడివి గదా! అకస్మాత్తుగా ఇప్పుడెలా వచ్చేసిందోయ్…. మీ బాసు – అదేదో రాష్ట్రం నుంచి డెప్యుటేషన్ మీద వచ్చిన  ఐ.ఏ.ఎస్ –  వున్నంత కాలం పైపదవి రాదని చెవిలో చెప్పేవాడివి కదా ….” అని రకరకాలుగా అడిగారు. కాంతారావులో కష్టపడి, నిజాయితీగా పనిచేసే తత్త్వం ఎక్కువపాళ్ళల్లోనూ, తెలివి తేటలు తక్కువ పాళ్ళల్లోనూ వుంటాయని వాళ్ళంతా నమ్ముతుంటారు. “చెబుతా, చెబుతా…” అంటూ ఊరించి, ఊరించి, భోజనాలయ్యాక కాంతారావు తన పదోన్నతి రహస్యం బయటపెట్టేశాడు.

తన బాసు డెప్యుటేషన్ మీద వచ్చినప్పట్నుంచి ప్రధాన కార్యదర్శి గారి మెహర్బానీ కోసం (విద్యాశాఖలో ఈ పరీక్షల విభాగం బదులు రెవెన్యూలో మంచి పదవికావాలని) ఏవేవో పనులు ఆయనకి చేసి పెడుతుండేవాడనీ, వాటిల్లో ఇంచుమించు అన్ని పనులకీ తననే వాడుకుంటుండే వాడనీ, కాని పదోన్నతి జాబితాకి మాత్రం తన పేరు పంపేవాడు కాదనీ, అప్పుడే తాను నిరాశా, నిస్పృహ లకి నిర్వచనం తెలుసుకున్నాననీ … ఇలా కథంతా చెప్పాడు కాంతారావు.

అందరికీ ఉత్సుకత పెరిగింది. “మరి పదోన్నతి ఎలా వచ్చింది?” అని అందరూ అడిగేశారు.

“ప్రధాన కార్యదర్శి గారి పని నేను ఏది చేయాల్సి వచ్చినా, అది నేను చేస్తున్నానని మా బాసు ఏనాడూ ప్ర.కా. గారికి చెప్పలేదు. శేషగీత విన్నప్పట్నుంచీ, నేను ప్ర.కా. గారి పని చేసేశాక, మా బాసుకి తెలియకుండా,  ప్ర.కా. గారికి ఎక్కడో అక్కడ ఎదురు బడి, ‘ఆ పని సత్ఫలితం ఇచ్చిందా సార్?.. ఆ మందులు పనిచేశాయా సార్?… మీరు అడిగిన పాత పుస్తకం అదేనా సార్?…’ అని అడుగుతూ వచ్చాను. ‘ఓహ్, నువ్వు చేశావా? చాలా బాగుందయ్యా’ అనేవారు ప్ర.కా. అంతే! క్రిందటివారం జరిగిన పదోన్నతి కమిటీ సమావేశంలో మన పేరే ముందుగా జెండా ఎగరేసింది… అర్థమవుతోందా నేను చెప్పిందీ!” అంటూ కాంతారావు భుజాలు ఎగరేస్తున్నాడు. అయినా ఎవరికీ అర్థం కానిది ఒకటుంది. అమాయకంగా కనుపించే కాంతారావుకి ఇన్ని తెలివితేటలు ఎక్కడనుంచి వచ్చాయి?

అడిగారు.

“అదే శేషగీతా..” అన్నాడు కాంతారావు కళ్ళెగరేస్తూ.

“అంటే…!”

అంతకు మించి ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో కాంతారావుకీ తెలియలేదు. “అదీ, అదీ …”అంటుండగా శేషయ్య వచ్చారు.

కాంతారావు ఆయన కాళ్ళ మీద పడిపోయాడు.

“కొంచెం చెప్పేయండి బాబూ, ఆ గీత ఏమిటో…” అంటూ కాంతారావు బ్రతిమాలుతున్నాడు.

“మాక్కూడా చెప్పండి సార్” అంటున్నారు బంధుగణం.

శేషయ్య నవ్వారు.

“మీ అందరికీ తెలిసిందే కాని, తెలుసు అని మాత్రం చాలామందికి తెలియదు… మనం పనిచేయటం వేరు, పనిచేస్తున్నామని ఎవరెవరికి తెలియాలో వాళ్ళకి తెలిసేలా చేసుకోవటం వేరు. ఉద్యోగంలోనయినా అంతే, కుటుంబంలోనయినా అంతే. రెండూ వుంటేనే రాణింపు వస్తుంది… “

కాంతారావు మళ్ళీ పడ్డాడు ఆయన కాళ్ళ మీద కళ్యాణి సమేతంగా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here