99 సెకన్ల కథ-21

6
3

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత, సంపాదకులు, పాత్రికేయులు జి. వల్లీశ్వర్ ’99 సెకన్ల కథ’ సిరీస్‌లో ఈ వారం రెండు కథలు సంచిక పాఠకులకు అందిస్తున్నారు. ఈ కథలు ప్రపంచతత్వాన్ని, మానవ మనస్తత్వాన్ని సూక్ష్మంగా ప్రదర్శిస్తాయి. [/box]

1. అంతరిక్షంలోకి ఎగరాలి!

[dropcap]మొ[/dropcap]దటి సారి కొడుకు పుట్టిన ఉత్సాహంలో వున్నారు ఆ యువ దంపతులు రమణ, సీత. ఇద్దరివీ సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలే.

తొలి భారసాల కాబట్టి ఘనంగా చేయాలని స్నేహితులని, బంధువుల్ని – నగరంలో వున్న వాళ్ళందర్నీ పిలిచేశారు.

కార్యక్రమం అంతా సజావుగా సాగుతోంది. కాని, నామకరణ మహోత్సవం దగ్గరకొచ్చేసరికి …. ?

వాడెవరో అంతరిక్షంలోకి వెళ్ళిన అమెరికన్ సైంటిస్ట్ పేరు పెట్టాలని, తన కొడుకు వాడిలా అంతరిక్షంలోకి ఎగరాలని రమణ కోరిక.

“లేదు లేదు, నా కొడుకు సుందర పిచాయ్ లాగా పెద్ద కంపెనీకి యజమాని అవుతాడని నా చెయ్యిచూసినాయన చెప్పాడు. కాబట్టి ‘చాయ్’ అనే అక్షరాలు వచ్చేలా…” అంటూ సీత మల్లగుల్లాలు పడుతున్నారు.

అయిదు నిమిషాల్లో వాదోపవాదాలు ఎక్కడికో వెళ్ళిపోయాయి.

రమణ తల్లి ముక్కున వేలేసుకొని చూస్తోంది. సీత తల్లికి వినబడదు. కాని తండ్రి ఏదో మాట్లాడబోయి, “ప్రేమ పెళ్ళి చేసుకుంది గదా. తెలిసిరానీ..” అనుకుంటూ మొహం ముడుచుకొని కూర్చొని తమాషా చూస్తున్నాడు.

అప్పుడే ప్రక్క ఇంట్లో వుండే శేషయ్య వచ్చారు..

పంచాయతీ ఆయన ముందు పెట్టారు యువ దంపతులు. ఆయన గురించి తెలిసున్న వాళ్ళంతా లేచి, నమస్కారాలు చేశారు.

యువజంట వాళ్ళ వాళ్ళ వాదనలు వినిపించారు. శేషయ్య, “నేను ఇందులో కల్పించుకోలేనయ్యా. కాని ఒక కథ చెబుతాను” అంటూనే, చెప్పారు:

భాగవతంలో… ఒక సదాచార, నిత్యాగ్నిహోత్రులైన బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువకుడు కొన్ని దురదృష్టకర పరిస్థితుల్లో భ్రష్టుడైపోతాడు. తల్లిని, తండ్రిని, కుటుంబాన్ని… అన్నీ వదిలేశాడు. ఎవరితోనో వుంటున్నాడు. లెక్ఖలేనన్ని పాపాలు చేశాడు. పెద్దవాడయిపోయాక, ఓ రోజు దాహం వేసి, అక్కడ పుట్టిన కొడుకుని పిలిచాడు – “నారాయణా” అని. మరుక్షణం ప్రాణం పోయింది. అతన్ని తీసుకువెళ్ళాలని దూతలు వచ్చారు. ఎవరి దూతలు? (ఆపారు శేషయ్య)

“యమదూతలు” అన్నారు కథ ఉత్కంఠతో వింటున్న వాళ్ళు.

(మళ్ళీ ఆరంభించారు.) కదా! అప్పుడే విష్ణుదూతలు కూడా వచ్చారు. అతను జీవిత కాలంలో అనేక వేల సార్లు ‘నారాయణా’ అని స్మరించేవాడు (కొడుకునే); ప్రాణం పోయే ముందు కూడా స్మరించాడు. కాబట్టి విష్ణులోకానికే వెళ్ళాలి – అని విష్ణుదూతలు తేల్చేశారు… మన తల్లిదండ్రులు పాపాలు చేయలేదు. అయినా మనకి అలాంటి పేర్లే పెట్టారు… ఏమైనా మీ అబ్బాయి పేరు మీ ఇష్టం సుమా…! (ఆపేశారు శేషయ్య)

కొద్ది సెకనులు నిశ్శబ్దం.

“అయితే మా మనవడికి శివుడి పేరు వచ్చేలా పెడతాం. మేం లింగధారులం కదా..” అంది రమణ తల్లి.

“ఎలా కుదురుతుందమ్మా, మేం శ్రీ వైష్ణవులం కాబట్టి ఆ పేరు …” సీత తండ్రికి గుర్తుంది కూతురిది ప్రేమ పెళ్ళి కదా.

మళ్ళీ వాదన.

రమణ, సీత నిస్సహాయంగా శేషయ్య వంక చూశారు.

శేషయ్య చిరునవ్వులోంచి ఒక శ్లోకం వచ్చింది.

“యత్ర యత్ర రఘునాథ కీర్తనం …… మారుతిం నమత రాక్షసాంతకం”

అతిథులంతా అరిచేశారు. “మారుతి … మారుతి..”

అటు అమ్మ, ఇటు నాన్న శాంతించేశారు.

యువదంపతుల మొహాలు ఆనందంతో వెలిగిపోయాయి.

శేషయ్య వంక చూసి, మనసుతోటే నమస్కారం చేశారు.

2. అమెరికా వెళ్ళిపోతా…

“శేషయ్య గారు, నేను ఈ ట్రస్టుని మూసెయ్యాలనుకుంటున్నాను.”

శేషయ్య రాసుకోవటం ఆపి, తలెత్తి ఆశ్చర్యంగా పరమేశ్వరం వంక చూశారు.

“మూసేసి…?”

“మళ్ళీ వెనక్కి అమెరికా వెళ్ళిపోతాను…” పరమేశ్వరం మాటల్లో నిరాశ,

నిస్పృహ కొట్టొచ్చినట్లు కనుపిస్తున్నాయి.

“ఎందుకని?”

“ముఖ్యమంత్రి స్థాయిలో మీరు నా గురించి, నా ప్రాజెక్టు గురించి బాగా చెప్పారు. ఆయన  ఎవరో సెక్రటరీలకి చెప్పారు. అక్కడిదాకా బాగుంది. కాని, గత అయిదేళ్ళలో నా ప్రాజెక్టులో 30  శాతానికి మించి నేను  అమలుచేయలేకపోయాను. ప్రతిసారీ, మీ దగ్గరకు వచ్చి, ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక రావటం లేదు…”

శేషయ్యకి జాలేసింది.

ఈ పరమేశ్వరం ఒక ఇంజినీర్.  1970 దశకంలో అమెరికాలో సంవత్సరానికి రెండు లక్షల డాలర్లు జీతం వచ్చే ఉద్యోగాన్ని వదులుకొని, తన  రాష్ట్రంలో మారుమూల  వెనుకబడ్డ ప్రాంతంలో కనీసంగా ఒక లక్ష కుటుంబాలతో ప్రారంభించి, ప్రజలకు నాణ్యమైన విద్యనివ్వటం, అక్కడి గ్రామీణ ప్రజలకి తన తెలివితేటలతో ఆదాయ వనరుల్ని కల్పించి, విస్తరించటం  తొలి దశ లక్ష్యంగా పెట్టుకొని సొంత భూమికి వలస వచ్చేశారు.

“ఈ మూడేళ్ళలో ఎంతవరకు వచ్చింది?”

“ఒక పాతిక గ్రామాల్ని ఎంచుకున్నాను కదా! మోదుగు ఆకులతో దొప్పలు, విస్తళ్ళు కుట్టించి దేవస్థానాలకి సరఫరాచేయటం వంటి పనులు  మొదలుపెట్టాను. వాళ్ళ పిల్లలకి గ్రహణశక్తిని పెంచే పాఠ్యాంశాలతో సిలబసు  తయారుచేశాను. .. చాలా చోట్ల రహదారుల్లేవు. స్కూళ్ళు పెట్టడానికి, రహదార్లు వేయటానికి, విద్యుత్ సదుపాయానికి, పిల్లలకి ఆట స్థలానికి… ఇలా ప్రతిదానికీ ఆఫీసుల చుట్టూ తిరుగుతూనేవున్నాను. లంచం అడిగేవాళ్ళు, భాగస్వామ్యం  అడిగేవాళ్ళు, తన పేరు చేర్చమనే రాజకీయ నాయకులు …. ఎన్ని అవరోధాలండి? నా వల్ల కాదు. వెళ్ళిపోతాను.”

శేషయ్య నవ్వారు. “వివేకానంద ఒకసారి కేదారనాథ్‌కి హిమాలయాల్లో ఒక సన్యాసుల బృందంతో నడిచి వెళ్తుంటే, మీ లాగానే ఒక వృద్ధుడు సగం దూరం వెళ్ళాక, ‘నేనింక నడవలేను బాబోయ్’ – అంటూ కూలబడిపోయాట్ట.  కాని అతన్ని వివేకానంద లేపి చివరిదాకా నడిపించాడు – ఒకే ఒక్క వాక్యంతో.”

పరమేశ్వరం ఆశ్చర్యంగా చూస్తున్నారు.

“ఏ వాక్యం?”

“వెనక్కి తిరిగి చూడవయ్యా, నువ్వు అడుగు ముందుకేస్తుంటే, ఎన్ని మైళ్ళ పొడవాటి ఘాట్ రోడ్డు నీ కాళ్ళ క్రింద నుంచి వెనక్కి వెళ్ళిపోయిందో!… “

పరమేశ్వరం మొహంలో ఏదో కొత్త  వెలుగు.

“అలాగే, ఇప్పుడు మీరూ అడుగు వేయండి. శూన్యం దగ్గర  మొదలుపెట్టి, 30 శాతం ఎలా సాధించారు?… నేను మీతో వున్నాను. తెలుసుకదా భర్తృహరి చెప్పింది:

ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై, ఆరంభించి పరిత్యజింతురురు విఘ్నాయాత్తులై మధ్యముల్…”

50 ఏళ్ళ పరమేశ్వరం ఇంక శేషయ్యని చెప్పనివ్వలేదు. ఉత్సాహంగా లేచారు.

…. మరో పాతికేళ్ళ తరువాత అది దేశంలోకెల్లా  అతి పెద్ద స్వచ్ఛంద సంస్థ అయింది.

(వాస్తవ కథ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here