99 సెకన్ల కథ-25

3
2

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత, సంపాదకులు, పాత్రికేయులు జి. వల్లీశ్వర్ ’99 సెకన్ల కథ’ సిరీస్‌లో ఈ వారం రెండు కథలు సంచిక పాఠకులకు అందిస్తున్నారు. ఈ కథలు ప్రపంచతత్వాన్ని, మానవ మనస్తత్వాన్ని సూక్ష్మంగా ప్రదర్శిస్తాయి. [/box]

1. ఇక కారు ఆగదు

రామచంద్రం వచ్చి, శేషయ్య గారిని బ్రతిమాలాడు.

తనకి మార్కెటింగులో రాష్ట్రస్థాయిలో గొప్ప గుర్తింపు వచ్చిందనీ, రేపు తాజ్ స్టార్ హోటల్లో చైర్మన్ స్వయంగా తనకు ప్రశంసా పత్రం ఇచ్చి సత్కరిస్తారనీ, కాబట్టి దూరపు బంధువే అయినప్పటికీ శేషయ్యగారు తప్పక రావాలనీ…. వగైరా ప్రార్థనలన్నీ చేశాడు రామచంద్రం.

శేషయ్య ‘సరే’ అనక తప్పలేదు.

మర్నాడు ఆ కంపెనీ సభలో ఛైర్మన్ స్వయంగా రామచంద్రాన్ని, అతని భార్య సీతని కలిపి గజమాలతో సత్కరించాడు.

ఛైర్మన్ ప్రసంగం మొదలైంది.

“ఒక్క సంవత్సరంలోనే కంపెనీ ఉత్పత్తుల అమ్మకాలని రెట్టింపు చేయటం అంటే అసాధారణమైన విషయం…”

 రామచంద్రం కాలర్ లేవటం మొదలైంది.

“ …. రామచంద్రం మన కంపెనీకి వచ్చి మూడేళ్ళే అయినప్పటికీ, గత ఏడాది కూడా బాగా చేశాడు. ఈ సారి బ్రహ్మాండంగా చేశాడు… మార్కెటింగ్ బృందాన్ని వెన్ను తట్టి ప్రోత్సహించటంలో, లక్ష్యాన్ని సాధించే దాకా వాళ్ళకి అందుబాటులో వుండి బిజినెస్ రాబట్టడంలో అతని కృషి అద్భుతం…” ఇలా చైర్మన్ ప్రశంసలు కురిపించాడు.

రామచంద్రం పొంగిపోతున్నాడు. కాలర్ లేచిపోయింది.

చైర్మన్ కొనసాగించాడు.

“..రామచంద్రం సామర్ధ్యం మీద నాకు నమ్మకం పెరిగింది. అందుకే వచ్చే సంవత్సరానికి మార్కెటింగ్ లక్ష్యాన్ని ఇప్పటికన్నా 100 శాతం పెంచటంగా నిర్ణయిస్తున్నాను… ఏమంటావ్ రామచంద్రం!”

అప్పటికే రామచంద్రం కాలర్ పూర్తిగా లేచిపోయింది. గాలిలో తేలిపోతున్నాడు.

“యస్ సర్ … ష్యూర్ సర్…” అనేస్తున్నాడు.

తాజ్ స్టార్ హోటల్ చప్పట్లతో మారుమ్రోగిపోయింది.

తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు, రామచంద్రం తన కారులో శేషయ్యని వాళ్ళింటిదగ్గర దింపటానికి తీసుకెళ్తున్నాడు.

వాళ్ళిద్దరూ ముందు సీట్లోనూ, సీత వెనక సీట్లోనూ కూర్చున్నారు.

రామచంద్రం ఆనందంలో ఇంకా తేలిపోతూ అడిగాడు.

“సర్, ఎలా వుంది?… చైర్మన్ నా శ్రమని ఎంత మెచ్చుకున్నారు చూశారా? నా విజయానికి ప్రతీకగా వెండి ఏనుగు ఇచ్చారు… ఎంత బాగుంది?..”

“ఒక కిలో వెండి పట్టి ఉంటుందంటారా?” వెనక నుంచి సీత ప్రశ్న.

“మీ అబ్బాయి రాలేదే ?” శేషయ్య ప్రశ్న.

“నేనే రావద్దన్నాను.. ఎంసెట్‌కి తయారవుతున్నాడు కదా!.. అసలు శేషయ్య గారూ, చైర్మన్ అలా అంటుంటే నాకు ఎంత ఉత్సాహం వచ్చేసిందంటారూ! అబ్బబ్బ …”

“అవునూ, క్రిందటి వారం నేను మీ ఇంటికొచ్చేసరికి మీ వాడిని ‘వేస్టు ఫెలో … పనికిరాని వెధవా … సన్నాసీ …ఏబ్రాసీ….’ అని అంత ఆవేశంగా తిడుతున్నావేమిటయ్యా?”

రామచంద్రం కొంచెం అసహనంగా కదిలాడు. అయినా చెప్పాలి కదా !

“అవునండి…. నేను ఏ పని చెప్పినా ఒక్కటీ సరిగా చేయడు… కూరలు తెమ్మంటే పుచ్చులు చూడడు….  బట్టలు ఇస్త్రీ చేయించుకు రారా అంటే ఆ షర్టులు, పాంట్లు సరిగ్గా ఇస్త్రీ చేశాడో లేదో పట్టించుకోడు.. ఏ పని చేప్పినా యాంత్రికంగా చేస్తాడు… బుర్ర ఉన్నా దాన్ని సరిగ్గా ఉపయోగించడు. అసలు వాడికి పని చెప్పబుద్ధి వేయదు. కాని చెప్పకుండా జరగదు… ఎలా! అలా ఉంటే, మీకు మాత్రం కోపం రాదా?”

శేషయ్య నవ్వారు.

“మీ చైర్మన్ నిన్ను ఏ ఏ తిట్లు తిడితే నువ్వు ఇంతా బాగా పనిచేశావు? ఇంకా చేస్తానంటున్నావు?… “

“అలా అడగండి..” వెనకాల నుంచి ఉత్సాహంగా సీత.

రామచంద్రం కారు బ్రేక్ వేశాడు.

ఆగి శేషయ్య వంక ప్రశ్నార్ధకంగా చూశాడు.

“మీ చైర్మన్ నిన్ను పొగుడుతున్న కొద్దీ నువ్వు ఇంకా విరగబడి పనిచేస్తానంటున్నావు. అతను నీ మీద చూపిస్తున్న ప్రేమ అంతా వ్యాపార ప్రయోజనం కోసం పుట్టుకొచ్చింది… అతనే నిన్ను అంతగా ప్రోత్సహిస్తుంటే – నీ రక్తంలోంచి పుట్టిన, నీకు వారసుడయిన, నిన్నూ, నీ భార్యనీ మీ వృద్ధాప్యంలో కూడా చూసుకోవాల్సిన, నీ వంశానికి మంచి పేరు తీసుకురావల్సిన కొడుకుని సహజమైన ప్రేమతో ప్రోత్సహించ వలసింది పోయి ……”

శేషయ్యని రామచంద్రం ఇంక మాట్లాడనివ్వలేదు.

“క్షమించండి అంకుల్” అంటూ కారు స్టార్ట్ చేశాడు.

అది ఇక ఆగదు – ‘లక్ష్యం’ చేరే దాకా.

2. గీత ముందు ఎదిగిపోతావ్!

“అంకుల్, ఇందులో నేను ఏం తప్పు చేశానో నాకు అర్థం కావటం లేదు. నా స్నేహితుడి ముందర గీత నన్ను అలా అవహేళన చేయటం తప్పు కాదా! అతని దృష్టిలో నేను ఎంత చీప్ అయిపోతాను చెప్పండి..”

శేషయ్య ఆలోచిస్తున్నారు.

“చెప్పండి అంకుల్. ఏం చెయ్యమంటారు ఇప్పుడు?”        

“ఏమీ చేయకపోతే ఏమవుతుంది రఘు?”

“అదేంటి అంకుల్ అలా మాట్లాడతారు! ఇవ్వాళ్టికి గీత నాతో మాట్లాడి మూడు రోజులవుతోంది. టైం ప్రకారం తాగేవీ, తినేవీ తెచ్చి అక్కడ టేబుల్ మీద పడేస్తోంది. నేను ఎంత పిల్చినా పలకటం లేదు. ఒక రోజంతా చూసాను. నేనూ మాట్లాడటం లేదు …కాని ఇలా ఎంతకాలం?”

“మరి నీ మిత్రుడు ఏమంటున్నాడు ?”

రఘు నిట్టూర్పు విడిచాడు.

“అతను నాకు మంచి మిత్రుడే కానీ, మరీ బాల్య స్నేహితుడేమీ కాదు. అతను కూడా నాకు ఫోన్ చేయటం మానేశాడు. నేను చేసినా పలకటం లేదు…”

శేషయ్య సాలోచనగా వింటున్నారు.

“తప్పు నీలోనే ఉంది రఘు.”

రఘు వింతగా చూశాడు శేషయ్యగారి వంక.

“అంకుల్, మీరు సరిగ్గా విన్నట్లు లేదు!.. మేం ఆ సభనుంచి నా కారులో తిరిగి వచ్చేటప్పుడు నేను, నా మిత్రుడితో సీరియస్‌గా చెబుతున్నాను. ఆ సభకి నేను ఎంత ప్లాన్ చేశానూ, మాకు వేదిక వెనకాల అనుకోని అవాంతరాలు ఎన్ని వచ్చాయీ, అయినప్పటికీ నేను ఎలా మేనేజ్ చేశానూ…. ఇదంతా. అతను ఉత్సాహంగా వింటున్నాడు. మధ్య మధ్యలో గీత మాట్లాడుతుంటే అతను ప్రోత్సహిస్తున్నాడు. ఉన్నట్టుండి గీత ఒక చెత్త జోక్ వేసింది.

(కంఠంలో ఆవేశం చేరింది.) నేను ‘ఈవెంట్ మేనేజిమెంట్ కంపెనీలో మేనేజర్ ‘ పోస్టుకి బాగా పనికొస్తానట!… (పళ్ళు బిగించాడు.)… నాకు కోపం వచ్చింది. కారు ఆపేసి, ఆ మిత్రుణ్ణి కారు దిగి పొమ్మన్నాను… చెప్పండి, ఇందులో నా తప్పు నిజంగా ఉందా!”

శేషయ్య అతని ఆవేశం చూసి, చల్లటి మంచినీళ్ళు ఇచ్చారు.

“నువ్వు చాలా అదృష్టవంతుడివయ్యా. ఇదే అమెరికాలో అయితే, ఈ పాటికి విడాకులిచ్చేసేవాళ్ళు…!” అంటూ శేషయ్య నవ్వారు.

“చూడు, గీత నీ గురించి నీ మిత్రుడి ముందు ఛలోక్తి మాత్రమే విసిరింది. కాని, నువ్వు…! జోక్ చేయలేదు. సీరియస్ అయిపోయావు. నీ భార్య మీద కోపాన్ని అతని మీద చూపించావు. అతన్ని ఇంటిదాకా దింపాల్సిన వాడివి, రోడ్డు మధ్యలో ఆపేసి దిగి పొమ్మన్నావు. అంటే, నీ భార్య ముందు అతన్ని అవమానించావని అతను అనుకున్నాడు. ఇందుకు నీ మిత్రుడికి కోపం వచ్చింది. నీ మిత్రుడి ముందు జోక్ చేసే హక్కు నీ భార్యకి లేదన్నట్లుగా అతని ముందు నీ భార్య మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేశావు… అన్ని తప్పులూ నీవే కదా!”

రఘు తెల్లబోయి చూస్తున్నాడు.

“రఘూ, స్థిమితంగా ఆలోచించు. ఇదే జోక్ – గీత కాక, నువ్వు ఆమె గురించి ఆమె స్నేహితురాలి ముందు వేసి ఉంటే, గీత ఇలాగే ప్రతిస్పందించి ఉంటే …నువ్వెలా చూస్తావ్?

… తేడా అంతా ఒక్కటే. నువ్వు పురుషుడివి. పుడుతూనే పురుషాహంకారంతో పుడతామయ్యా. అందుకే ఈ వడ్లపుగింజలో బియ్యపుగింజ అలకలు….”

రఘుకి అర్ధమవుతోంది.

“స్నేహితుడిని ఇవ్వాళ కాకపోతే రేపయినా ప్రసన్నం చేసుకోవచ్చు. కలిసిపోతాడు. కాని నీ కుటుంబం నీకు ముఖ్యం. కొంచెం పురుషాహంకారం చంపుకొని, ఆమెకి పశ్చాత్తాపం వ్యక్తం చేసేయ్.. నీ భార్య దృష్టిలో నువ్వు చాలా ఎదిగిపోతావ్.. రేపట్నుంచి హాయిగా మాట్లాడుకోగలుగుతారు…”

శేషయ్యకి పాదాభివందనం చేశాడు రఘు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here