[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత, సంపాదకులు, పాత్రికేయులు జి. వల్లీశ్వర్ ’99 సెకన్ల కథ’ సిరీస్‌లో ఈ వారం రెండు కథలు సంచిక పాఠకులకు అందిస్తున్నారు. ఈ కథలు ప్రపంచతత్వాన్ని, మానవ మనస్తత్వాన్ని సూక్ష్మంగా ప్రదర్శిస్తాయి. [/box]
1. పెళ్ళికి నన్ను తీసుకెళ్తారా?
“ఏరా, ఇప్పటికీ వాణ్ణి క్షమించలేకపోతున్నావా?”
“శేషయ్యా, ఈ ఒక్క విషయంలో నన్ను వదిలేయరా. వాసు క్షమార్హుడు కాడు…కాడు.” కటువుగా చెప్పాడు 75 ఏళ్ళ రామచంద్ర మూర్తి.
శేషయ్య వదల్లేదు తన బాల్య మిత్రుణ్ణి.
తామిద్దరూ కోతికొమ్మచ్చులాడే వయసునుంచీ, ఊరి చెరువులో ఒకళ్ళతో ఒకళ్ళు పోటీ పడి ఈతలు కొట్టే రోజుల్నుంచీ ఉన్న బంధం అది.
చదువులు, వృత్తులు తమ దారుల్ని వేరు చేసినా కలిసినప్పుడల్లా బాల్య స్మృతులు నెమరు వేసుకుంటూ ఆనందపడే స్నేహం అది.
శేషయ్యకి మూర్తిని చూస్తే జాలేస్తోంది.
“మూర్తి చాలా తప్పు చేస్తున్నావ్. ఎప్పుడో 40 ఏళ్ళ క్రితం జరిగిపోయినదాన్ని మనసులో పెట్టుకొని, సొంత తమ్ముడి మీద ఇంత కక్ష అవసరమా ?… దీని పరిణామాలు ఆలోచించకుండా ఇంత …”
మూర్తిలో 40 ఏళ్ళనాటి కడుపుమంట వెంటాడుతుంటే ఆవేశంగా ప్రశ్నిస్తున్నాడు:
“వాడు చేసిందేమైనా చిన్న నేరమా? నేను అమెరికాలో పిహెచ్.డి చేస్తున్నప్పుడు, మా నాన్న ఇద్దరికీ పంచి ఇచ్చి పోయిన పొలంలో హద్దులు జరిపేయటం చిన్న నేరమా? నా సంతకం ఫోర్జరీ చేసి నేను పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చినట్లుగా కాగితాలు సృష్టించి నా పంట అనుభవించటం, నా వాటాలో సగం అమ్మేయటం.. ఇవన్నీ చిన్న నేరాలా? నాకు విషయాలన్నీ తెలిసి, ఇండియాకి వచ్చి మాట్లాడటానికి కబురు చేస్తే, ఊరొదిలేసి మొహం చాటేసి, ఇప్పుడొచ్చి కాళ్ళమీద పడితే క్షమించెయ్యాలా?… బాధ నీది కాదుగా. ఎన్నయినా చెబుతావు!”
శేషయ్య నవ్వారు.
“వాడు నిన్ను మోసం చేసి ఏం బావుకున్నాడు! వ్యాపారం చేసి గొప్పగా ఎదగాలనుకున్నాడు. పూర్తిగా నష్టపోయాడు. నువ్వొచ్చేసరికి ఈ ఊళ్ళో ఉండలేక కుటుంబంతో సహా వెళ్ళిపోయాడు. దుర్వ్యసనాలతో చితికిపోయాడు..”
“బాగా జరిగింది. దేవుడు ఊరుకుంటాడా?” పళ్ళు కొరికాడు మూర్తి.
“ఒరేయ్ మూర్తి, నీ పట్టుదల మూలంగా నీ కొడుకు, కూతురు, వాళ్ళ పిల్లలు, కూడా నీ తమ్ముడి పిల్లలతో, మనవలతో మాట్లాడుకోలేని పరిస్థితి ఏర్పడింది. అయినా, వాడే స్వయంగా భార్యతో కలిసి వచ్చి, నీ కాళ్ళ మీద పడి, కన్నీళ్ళతో క్షమించమని అడిగాక కూడా వాడి మనవరాలి పెళ్ళికి రానని నువ్వు ఇలా భీష్మించుకోవటం బాగాలేదు… ఆలోచించు, నీకు కలిగిన అనుభవంతో సంబంధం లేని నీ తరువాత తరాలు నీ మనసులోకి తొంగి చూడలేరు. వాళ్ళు తమ కజిన్స్‌తో తమని కలవనీయకుండా చేసిన మూర్ఖుడివని జీవితకాలం నీ గురించి చెప్పుకుంటారు. నీకు 40 ఏళ్ళ క్రితం కలిగిన అనుభవం కన్నా వాళ్ళకి వాళ్ళ కాలంలో సమవయస్కులతో స్నేహ బంధాల అనుభవం ముఖ్యం…”
మూర్తి తలెత్తి చూస్తున్నాడు శేషయ్య వంక సాలోచనగా.
అప్పుడే కౌమార దశలో ఉన్న మూర్తి మనవలు, మనవరాళ్ళు వచ్చారు తాత దగ్గరకి.
“తాతా, మనం రాణి పెళ్ళికి వెళ్ళటం లేదా? నాన్న, అమ్మ అంటున్నారు నీకు ఇష్టం లేదని. ఎందుకు తాతా?”
మూర్తి మాట్లాడటం లేదు.
“మూర్తీ, నీ కక్షల కథ చెప్పి వాళ్ళ మనస్సులు పాడు చేయకు… పదమూడేళ్ళపాటు అరణ్యాలు పట్టి, అజ్ఞాతంలో ఇంకొకడి మోచేతి నీళ్ళు తాగి బతికిన చక్రవర్తి ధర్మరాజు అంతటి వాడు కృష్ణుడి ద్వారా రాయబారం పంపాడు – ‘జరిగిపోయిన అవమానాలు, అన్యాయాలు అన్నీ మర్చిపోతాం, కనీసం అయిదూళ్ళయినా ఇమ్మని.’ .. చేతకాక, చేవలేక కాదు. క్షమయే శక్తి, క్షమయే సత్యం, క్షమయే దైవం…. చెప్పు, నీ మనవలు నిన్ను చూసి ఏం నేర్చుకోవాలని కోరుకుంటున్నావురా పురాతన సంస్కృతుల విశ్వవిద్యాలయ మాజీ కులపతీ – కక్షలూ, కార్పణ్యాలా?”
రామచంద్రమూర్తి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. మనవల్ని, మనవరాళ్ళని దగ్గరకు తీసుకుంటూ అన్నాడు:
“రాణి పెళ్ళికి నన్ను కూడా తీసుకెళ్తారా మరి?”.
2. కరోనా పెళ్ళివారు!
తెల్లవారు ఝామున అయిదున్నరవుతోంది.
మగ పెళ్ళివారు విశాఖపట్నంలో గోదావరి ఎక్స్ ప్రెస్ దిగారు.
“దిగండి, దిగండి” నాగరాజు పెళ్ళి పెద్ద కేకలు.
నిద్రమత్తులో జోగుతున్న వాళ్ళు, ఇంకా నిద్ర లేవని వాళ్ళు గోదావరి ట్రైన్‌ని తిట్టుకుంటూ దిగుతున్నారు.
ఆ ట్రైన్‌కి అదే చివరి స్టేషన్. రెండు మూడు ఎ.సి. బోగీల్లో ఉన్న ఆడా మగా పిల్లా దిళ్ళూ దుప్పట్లూ (కరోనా మూలంగా ఎవరివి వాళ్ళే తెచ్చుకోవాలి) అన్నీ దిగాయి.
“మొత్తం 36 సామాన్లు ఉండాలి. లెక్కపెట్టండిరా” మళ్ళీ నాగరాజు పిపికె.
ఇందుమతి గణితశాస్త్రం టీచర్. ఎన్నిసార్లు లెక్కపెట్టినా ఒకటి తగ్గుతోందని గోల… పోర్టర్లు వచ్చారు. “అయ్యా, మొత్తం ట్రాలీ ఎక్కిస్తాం… తొమ్మిదొందలిచ్చీసెయ్యండి.”
“మాది ఈ ఊరే. నాలుగిస్తా…” పిపికె.
“అదేటి బాబు, మీరు నాకు బా తెల్సు. శానాసార్లు నే చూశాగా మిమ్మల్ని ఈడ..” పెద్ద పోర్టర్ తెలివి.
అంతలో… కెవ్వు కేక వినబడింది.
పెళ్ళి కొడుక్కి వేలు విడిచిన మేనమామ తాను రాలేక పెళ్ళికి తన ద్వితీయ కళత్రం దేవకాంతని, కొడుకుని పంపాడు. ఆ కేక దేవకాంతానిది.
“అయ్యో.. అయ్యో.. మా పిల్లడు కనబడటం లేదు… బాబోయ్.. ఎక్కడ దిగిపోయాడో! ఎలా తప్పిపోయాడో.. ఇంకేనా ఉందా? వాడు తప్పిపోతే సవతి తల్లి కాబట్టి పట్టించుకోలేదని ఎంతమంది ఎన్నంటారో.. మా ఆయనకి ఏం చెప్పాలి దేవుడా..” దేవకాంత కంఠం కంచులా మ్రోగుతోంది.
నాగరాజు “వెతకండిరా. బోగీలోనే నిద్దరోతున్నాడేమో..”
అంతా మళ్ళీ ఎ.సి. బోగీలు – తాము ఎక్కినవి ఎక్కనివి అన్నీ వెతికేస్తున్నారు.
అంతలో రైల్వే పోలీసులు వచ్చారు.
“బాబూ, మీరు ప్లాట్‌ఫార్మ్ ఖాళీ చేయాలి. ఇంకో గంటదాకా ట్రైన్ లేదు. ప్లాట్‌ఫార్మ్ మూసేయాలి అప్పటిదాకా.. లేవండి లేవండి.”
“ఎనిమిదొందలిచ్చీద్దురూ.. మేం లాగేస్తాం..” పోర్టర్లు బేరమాడుతున్నారు.
“అయ్యో.. ఇంత బతుకూ బతికి సవతి తల్లి కాబట్టే పిల్లాడ్ని వదిలేసిందని మాటపడిపోతున్నానే .. ఎందుకొచ్చానో ఈ పెళ్ళికి … దేవుడా” దేవకాంత కంఠస్వరం పెంచింది.
బోగీలెక్కినవాళ్ళంతా తిరిగొచ్చారు.
“బెర్తులన్నీ ఖాళీ… బాత్ రూములన్నీ ఖాళీ …”
కుర్ర తమన్నాని వాళ్ళాయన మెల్లగా అడుగుతునాడు – “ఈ స్టేషన్‌లో వైఫై ఉందా?”
తమన్నా కొంచెం గట్టిగా అంది ఈ గోలలో అతనికి వినబడాలని “వై ఫై ఉంది.”
దేవకాంతకి మరోలా వినబడింది.
“అయ్యో ఈ ఊళ్ళో మాఫియా ఉందా? ఓరి నాయనో, సవతి తల్లి బ్రతుకెంత ఘోరంరా నాయనో. ఆ మాఫియా గాంగ్ వాణ్ణి నిద్రలోనే ఎత్తుకుపోయారో ఏమో..” ఇంక కళ్ళల్లో మునిసిపల్ కుళాయిలు విప్పేసింది.
“బాబూ, ఏడొందలిచ్చీసేయ్…. మరేటిసేత్తాం. లాగేస్తాం” పోర్టర్లు చొరవగా స్యూట్ కేసులెత్తేస్తున్నారు.
పోలీసులు మళ్ళీ వచ్చారు “లేవాలి, లేవాలి” అరుస్తున్నారు.
“బావా, ఏదో ఒకటి మిస్ అయిపోయినట్లే. ..”
నాగరాజుకి అర్ధమే కావటం లేదు. ఏడేళ్ళ కుర్రాడు ఎలా తప్పిపోయాడు.
దేవకాంతం గగ్గోలు…
పోర్టర్ల బేరసారాల మతలబులు …
ఇందుమతి లెక్కల గారడీ …
పోలీసుల హెచ్చరికలు …
…
“అబ్బా, ఆపండి” అని జుట్టు పీకేసుకుంటూ పిపి.
“బయటకెళ్ళి పోలీసుకి ఫిర్యాదు చేద్దాం. లేవండి…”
అయిష్టంగా ఇందుమతి, డబాయింపుతో పోర్టర్లూ, ఏడుస్తూ దేవకాంతం, నిద్రమొహాల్తో మిగతా వాళ్ళూ… బయల్దేరారు..
“ఠాంగ్ ” అంటూ శబ్దమైంది.
అందరూ నిశ్శబ్దం.
ఖాళీ అయిన ట్రైన్ ని తీసేస్తున్నారు.
అంతే! దేవకాంత సవతితల్లి రోదన దేవలోకం దాకా వినబడుతోంది.
“రాజు తాతా, అడుగో వాడు” అంటూ అరిచింది 60 ఏళ్ళ ఈశ్వరం గారి భుజం ఎక్కి , వెనక్కి చూస్తూన్న అయిదేళ్ళ గాయత్రి.
అంతా ఆగి వెనక్కి చూశారు.
గోదావరి ట్రైన్ తీయగానే దానికి అవతలివైపు కూర్చొని బిక్క చూపులు చూస్తున్న దేవకాంత సవతి కొడుకు …!
“అయ్యో నాయనా, నేను సవతి తల్లినని …”
పిపికె అరిచాడు “ఆపవమ్మా, దొరికాడు కదా!”
క్షణాల్లో తేలిపోయింది. ట్రైన్ ఆగాక అవతలివైపు తలుపు తీసి ఉంటే దిగిపోయాడు. ఎటు వెళ్ళాలో తెలియలేదు. అంతలో ఎవరో తలుపు మూసేశారు.
ఇందుమతి చంకలెగరేసుకుంటూ వచ్చింది. “బావా, నా భుజానికున్న బాగు కలిపితే 36 సరిపోయాయి.”
నాగరాజు ఊపిరి పీల్చుకున్నాడు.
ప్లాట్‌ఫార్మ్ బయటకొచ్చేశారు అందరూ.
కార్లు రాలేదు.
కరోనా మూలంగా అక్కడ ఒక్క కుర్చీ కూడా లేకుండా ఎత్తేశారు రైలు వారు.
అంతలో పెళ్ళికూతురి తండ్రి ఫోన్ చేశాడు:
“అయ్యా, దుర్ముహూర్తం వల్ల, మీరు ఇంకో గంట సేపు అక్కడే వుండండి. కార్లు అప్పుడొస్తాయి…” పిపి నిఝంగా జుట్టు పీకేసుకున్నాడు.