[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత, సంపాదకులు, పాత్రికేయులు జి. వల్లీశ్వర్ ’99 సెకన్ల కథ’ సిరీస్‌లో ఈ వారం రెండు కథలు సంచిక పాఠకులకు అందిస్తున్నారు. ఈ కథలు ప్రపంచతత్వాన్ని, మానవ మనస్తత్వాన్ని సూక్ష్మంగా ప్రదర్శిస్తాయి. [/box]
1. నరకానికి మార్గం
కోట్లకు పడగెత్తిన 80 ఏళ్ళ వెంకటరత్నాన్ని (కళ్ళల్లో గ్లిసరిన్ పోసుకొని) కన్నీళ్ళు కారుస్తున్న ఆయన బంధు జనం చేత పక్క మీదనుంచి చక్రాల కుర్చీలోకి చేర్పించాడు డాక్టర్ దగ్గరుండి.
“ఎందుకర్రా ఏడుస్తారు? నేను బాగానే ఉన్నానుగా?” అని ఎక్కడెక్కడినుంచో వచ్చి వాలిన రాబందుల్లాంటి బంధువులతో రత్నం అనునయంగా అడిగాడు.
“భయం.. భయం.. నీకేమైపోతుందో అని భయం..” (పోయాడనుకుంటే బ్రతికేశాడే) అని బంధువుల ఏడుపు.
డాక్టరు వెళ్ళబోయేముందు అందరికీ వినబడేలా ఒక మాట చెప్పాడు: “ఈయన పరిస్థితి బాగా క్షీణిస్తోంది. ఎన్ని రోజులుంటారో కూడా చెప్పలేం… గాజుబొమ్మలా చూసుకోవాలి.”
అందరూ “ఓకే” అని గాట్టిఘా వాగ్దానం చేశారు.
“ఏరా, శేషయ్యకి ఫోన్ చేసి రమ్మనమని చెప్పాను గదంట్రా!. ఏమైంది?” రత్నం ప్రశ్న.
“అయ్యో, నాకు తెలీదే”… “నాకు తెలీదే…” అంటూ అందరూ పరుగెత్తారు సెల్ ఫోన్లు పట్టుకొని.
రత్నం గుర్తుచేసుకున్నాడు పాత రోజులు. శేషయ్య రామకృష్ణ మఠంలో నాలుగు దశాబ్దాల క్రితం పరిచయమైన స్నేహితుడు.
తనకి శ్రేయోభిలాషి. విదుర నీతుల్లాంటి మంచి విషయాలెన్నోచెప్పేవాడు.
వింటున్నంత సేపు బాగుండేవి. శేషయ్య వెళ్ళిపోగానే అవేవీ ఆచరించాలనిపించేది కాదు. అయిదేళ్ళక్రితం తనకి కోపం వచ్చి, “నువ్వు నాకేమీ చెప్పనఖ్కర్లేదు” అనేశాడు తను. అంతే! ఆ తరువాత శేషయ్య రెండు మూడు సార్లు ఫోన్ చేసినా తాను పలకలేదు. ఈ అయిదేళ్ళలో శక్తి తగ్గిపోయి, రామకృష్ణ మఠానికి తానూ వెళ్ళటం లేదు.
శేషయ్య వచ్చ్హారు. రత్నాన్ని చూసి జాలిపడ్డాడు. భార్య పదేళ్ళ క్రితమే క్యాన్సరుతో మరచింది. ఆ తరువాత ఏడాదికే అమెరికాలో ఉన్న ఒక్కగానొక్క కొడుకు కారు ప్రమాదంలో భార్యా పిల్లలతో సహా మరణించాడు.
“శేషయ్య, ఏ క్షణంలో పోతానో తెలీదు. పాపం, నా బంధువులు ఎక్కడెక్కడినుంచో వచ్చి చూసుకుంటున్నారు…” అంటూ రత్నం భయంకరంగా దగ్గుతున్నాడు. రత్నం పక్కనే ఒక పాత కాలపు లెదర్ సూట్కేసు.
శేషయ్య మంచినీళ్ళివ్వబోయారు. ఆ దగ్గు నుంచి రత్నం తనే తెప్పరిల్లాడు. ఆజానుబాహువు, మంచి దృఢమైన శరీరం – ఒకప్పుడు. ఇప్పుడు ఎముకలగూడులా మిగిలాడు. కళ్ళు గుంటలు పడ్డాయి.
అతని మాట బావిలోంచి వస్తున్నట్లుంది.
“నేను మన రామకృష్ణ మఠానికి విరాళం ఇవాలనుకుంటున్నాను. ఎవరికన్నా చెప్పి పంపగలవా?”
శేషయ్య నవ్వారు. “ఎందుకు? ఓ వెయ్యి ఇస్తావు. అంతే గదా!”
“వెయ్యి నూటపదహార్లు.” రత్నం సవరించాడు.
“వెంకట రత్నం, ఏ క్షణంలో పోతానో తెలియదు అంటున్నావు. అయినా, ఇంకా నీ కోట్ల ఆస్థిని అదే పాతకాలపు సూట్కేసులో పెట్టి దాచుకుంటున్నావు. ఏమిటీ, నీతో పాటు పట్టుకెళ్ళిపోదామనే..!” ఛలోక్తి విసిరాడు రత్నం లోభిత్వం గురించి బాగా తెలిసిన శేషయ్య.
“నా కోట్లు నా కష్టార్జితం. అయినా నేను చాలా దాన ధర్మాలు చేశాను గదా!..”
“ఏం చేశావు?.. పదిసార్లు అడిగినవాళ్ళకి ఒక్క వెయ్యి రూపాయలిచ్చావు !”
రత్నం మాట్లాడలేదు.
”నువ్వు రెండు తప్పులు చేశావయ్యా. నీ లోభిత్వంతో నువ్వు ఏమీ అనుభవించలేదు. కనీసం నీ భార్యని కాశీ, రామేశ్వరాలక్కూడా తీసుకెళ్ళలేదు. డబ్బు కూడబెట్టడంలోనే ఆనందం ఉందనుకున్నావు. కడుపునిండా నువ్వు తిన్నావా?, నీ భార్యని, కొడుకుని తిననిచ్చావా…?”
రత్నం మాట్లాడలేదు.
“రత్నం, నువ్వు అనుభవించిందే నీకు దక్కినట్లు లెఖ్క. నువ్వు దాచుకున్నది ఎవడు అనుభవిస్తాడో నీకు తెలియదు.కాని, నువ్వు ఇప్పటిదాకా ఏమీ అనుభవించలేదు. ఇప్పుడు చిన్న కప్పుతో పాయసం తిన్నా, పైకి వెళ్ళిపోతానేమో అన్న భయంతో తినలేవు కదా!”
“డబ్బు ఉంది కాబట్టేగా డాక్టర్లు ఇంటికొచ్చి చూసి వెళ్తునారు!”
“అది నీ అవసరం కోసం చేస్తున్నావు… నీ స్థాయికి తగిన దానాలు ఏవీ నువ్వు చేయలేదు. ..నీ లోభిత్వం అన్న గుణం నరకానికి మార్గం. ‘త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః, కామః క్రోధస్తథా లోభస్తస్మాత్ ఏతత్త్రయం త్యజేత్..’ అన్నది గీతా వాక్యం. ఆత్మని భ్రష్టు పట్టించే నరకానికి మార్గాలు కోరికలు, కోపం, లోభం.. ” అని చెప్పి ఆపారు శేషయ్య.
‘నరకం… నరకం’ రత్నం మనసులో అలజడి. .. (కొద్ది నిమిషాలు నిశ్శబ్దం…)
మనసులో ఎక్కడో ఒక వికాసం…!
“ఏం చేయమంటావు శేషయ్యా?” మరింత నీరసంగా అడిగాడు రత్నం.
“నీ ఆస్థితో ఒక సేవా కార్యక్రమాల ట్రస్టు ఏర్పాటు చేయి. బాగా పనిచేస్తున్న అనాథ బాలికల ఆశ్రమాలకి, దివ్యాంగుల సేవాశ్రమాలకి, పేదవిద్యార్ధులకి విద్యా సహాయానికి, ఏ ఆధారమూ లేని నీలాంటి వృద్ధుల ఆశ్రమాలకి, మాజీ సైనికోద్యోగుల సంక్షేమ నిధికి… ఇలాంటి మంచి కార్యక్రమాలకి ఆ ట్రస్టు సేవలందించాలని విల్లులో రాసేయ్.. నీమీద ఆశతో వచ్చిన బంధువులకి నీ ప్రేమని బట్టి ఇవ్వాలనిపించింది ఇవ్వు…”
శేషయ్య లేచారు.
రత్నం ఆయన చేయి పట్టుకొని ఆప్పాడు.
“ఆ పనేదో నువ్వే చేయించు.ఇవ్వాళే, ఇప్పుడే …ఆ ట్రస్టుకి నువ్వే చైర్మన్” దీనంగా అడిగాడు రత్నం.
2. ఒక్కడే మంచివాడు!
“మహిళలు తాము ఇంకా వంటింటి కుందేళ్ళమని అనుకునే రోజులు పోయాయి. చదువుకుంటున్నారు. చదువుకి తగ్గ ఉద్యోగాలు చేస్తున్నారు. …ఇప్పుడిక పాత ఆత్మన్యూనతా భావాన్ని వదిలేశాం. కాని ఆర్థికంగా తాను శక్తిమంతురాలైంది కాబట్టి, పురుషుల్ని తక్కువగా చూడవచ్చు అన్న భావనని మహిళ రానీయకూడదు… ఇద్దరూ చదువుకున్నారు. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఇద్దరూ కలిసి నడుపుతున్నారు రెండెడ్ల బండి అనే కుటుంబాన్ని…. ఒక్క ఎద్దు ఒక పక్కకి, మరో ఎద్దు మరో పక్కకి లాగితే ఆ ‘బండి ‘ అనే కుటుంబం ఏమవుతుంది ?….”
ఆ సభాస్థలి చప్పట్లతో మారుమ్రోగింది.
ఆ వక్త ఇంకా సీతారాముల కథ, నల దమయంతుల కథ, పార్వతీ పరమేశ్వరుల కథ, రాజ్యాంగం చెప్పిన విషయాలూ… కూడా ఉదహరిస్తూ మాట్లాడారు.
కరతాళ ధ్వనులు ప్రతిధ్వనించాయి. వక్తని ఘనంగా సత్కరించారు.
ఆ అంతర్జాతీయ మహిళాదినోత్సవ సభకి ప్రతినిధులుగా హాజరైన వనజ, జలజ, కామేశం, వెంకటేశం, పార్వతీశం అల్పాహార విందులో మాట్లాడుకుంటున్నారు.
“బాగా మాట్లాడాడు కాని, ఇస్త్రీ చేయని ఆ చొక్కా ఏమిటి, ఆ పైజామా ఏమిటి …?” అంది చాలా చురుకైన వనజ.
“అవును మేడం, డ్రస్సూ బాగా లేదు, ఆ హైర్ స్టైల్ బాగాలేదు. అది పిచ్చిక గూడు లాగ లేదూ?” అన్నాడు చాలా నీటుగా వుండటాన్ని పాటించే పరమేశం.
“అస్సలు వేదిక మీద ఆ గోళ్ళు కొరుక్కోవటమేమిటి! ఛీ .. ఛీ..” అని ఛీత్కరించుకొంది జలజ.
“ఏదో పత్రికల్లో మహిళల అభ్యుదయం గురించి వ్యాసాలు రాస్తుంటాడని పిలిచారు మేడం. అంతే …” అంది అప్పుడే వచ్చి చేరిన కుతూహలమ్మ.
మరో నిమిషంలో ఇంకో నలుగురైదుగురు చేరారు. అందరూ నగరంలో స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులూ, లేదా వాటి ప్రతినిధులూ. ఒకరిద్దరికి తప్ప, ఎవ్వరికీ ఆ వక్త వేషభాషలు, వేదిక మీద కూర్చున్న విధానం వగైరా నచ్చలేదు. కాని ఆ వక్త కూడా ఒక వికలాంగుల స్వచ్ఛంద సంస్థ నడుపుతున్నాడు.
అతని పేరు సుగుణారావు. అతనో ఎమ్మే.
***
ఒకటి రెండు మాసాల తరువాత…
రాజధాని నగరంలోని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధి ఒకరికి గవర్నర్ కోటాలో శాసనమండలి సభ్యత్వం ఇవ్వాలని నిర్ణయమైంది. 60-70 సంస్థలున్న నగరంలో ఏ సంస్థ నిర్వాహకుని ఎంపిక చేయాలి?
అందుకని గవర్నర్ ఒక సందేశం పంపారు:
“మీలో మీరే ఒక ఉత్తముడిని ఎంపిక చేసి, ఆ పేరు మాకు పంపండి.”
నగరంలోని స్వచ్ఛంద సంస్థల సమాఖ్య గౌరవాధ్యక్షులు శేషయ్య ఆధ్వర్యంలో సభ్యులంతా సమావేశమయ్యారు.
“మీలో ఎవరన్నా ఎవరి పేరునైనా ప్రతిపాదిస్తే, నేను మిగతా వారి అభిప్రాయం తీసుకుంటాను” అన్నారు శేషయ్య.
ఎవరూ స్పందించలేదు. ఆయనకి అర్ధమైంది. బాహాటంగా ఎవరూ చెప్పదలుచుకోలేదు.
“సరే, రెండు నిమిషాలలోపల మీ ప్రతిపాదనల్ని నా ఫోన్‌కి పంపండి” అన్నారు శేషయ్య.
మొత్త మూడు పేర్లు – వనజ, పరమేశం, సుగుణా రావు వచ్చాయి.
శేషయ్య ఒక సూచన చేశారు.
“మీ మీ ఎంపిక ఎవరో, ఎందుకని మిగతా ఇద్దర్నీ వద్దనుకుంటున్నారో ఒక కాగితం మీద రాసి పంపండి.”
10 నిమిషాల్లో అది కూడా పూర్తయింది. అవన్నీ కార్యదర్శి విశ్లేషణ చేశారు.
శేషయ్య లేచి, మైకు తీసుకున్నారు:
“మీ అభిప్రాయాల సారాంశం ఇది. ..ఇద్దరు అభ్యర్ధుల్ని తిరస్కరిస్తున్న వాళ్ళ విషయంలో వాళ్ళ నిజాయితీ గురించి, వాళ్ళ నడవడి గురించి కొందరు తమ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సుగుణారావు విషయంలో ఒకే రకమైన అభ్యంతరాన్ని అందరూ వ్యక్తం చేశారు…”
సమావేశం అంతా నిశ్శబ్దం.
సుగుణారావు యథాప్రకారం ఎటో చూస్తూ, ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు.
“సుగుణారావుకున్న – సరైన దుస్తులు ధరించకపోవటం, తల అందంగా దువ్వుకోకపోవటం, మోటుగా నవ్వటం లాంటి రకరకాల బలహీనతలు గురించే అందరూ చెప్పారు. కాని అతని వాక్చాతుర్యాన్ని మాత్రం అభినందించకుండా ఉండలేకపోయారు…”
అందరికీ అర్థమయిపోయింది – ఇదే కారణంగా సుగుణారావుని శేషయ్య ఎంపిక చేస్తారని.
శేషయ్య అందరికీ ఒక ప్రశ్న వేశారు.
“ఇక్కడ బలహీనతలు లేనివారు ఎవరైనా ఉన్నారా?” నిశ్శబ్దం.
“బలహీనతలు లేని మనిషిని చూపించగలరా?” నిశ్శబ్దం.
“సుగుణారావు ఇతరులకి హాని చేసే గుణం ఉన్నవాడని ఎవరైనా చెప్పగలరా ?” నిశ్శబ్దం.
“బలహీనతలు అందరికీ ఉన్నాయి. మరి ఎవరు మంచివాళ్ళు? పక్కవాళ్ళకి హాని కలిగించని ప్రతి వ్యక్తీ మంచివాడే. సుగుణారావు బలహీనతలు ఎవరికన్నా హాని కలిగించాయా? … ఇప్పుడు చెప్పండి, ఎవరిని ఎంపిక చేద్దాం?” అన్ని చేతులూ పైకి లేచాయి “సుగుణ.. సుగుణ..” అంటూ.