[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత, సంపాదకులు, పాత్రికేయులు జి. వల్లీశ్వర్ ’99 సెకన్ల కథ’ సిరీస్‌లో ఈ వారం రెండు కథలు సంచిక పాఠకులకు అందిస్తున్నారు. ఈ కథలు ప్రపంచతత్వాన్ని, మానవ మనస్తత్వాన్ని సూక్ష్మంగా ప్రదర్శిస్తాయి. [/box]
1. ఇంటింటి కథ
ఆ రోజు ప్రొద్దుటే కాంతం మళ్ళీ శేషయ్యకి ఫోన్ చేసింది.
“చూశారా, మీ బుద్ధిమంతస్వామి గారు ఏం చేశాడో!” అంటూ కొత్త పంచాయతీని ఆయన ముందు పెట్టింది.
“ఏమైందమ్మా?” అన్నారు శేషయ్య తాపీగా.
“మీ స్వామి అబద్ధాలు బాగా నేర్చుకున్నారండి. నేను చెబితే మీరు నమ్మటంలేదు. రాత్రి తాగి వచ్చారని నాకు వాసన వచ్చింది. అప్పటికే పదకొండు దాటింది. అప్పుడే గొడవ పెట్టుకుందును. కానీ, వీధంతా వింటారని ఊరుకొని ప్రొద్దుటే లేచాక అడిగాను. ‘అబ్బే, నేనా, త్రాగటమా…’ అంటూ బుకాయించేశారు. ఇలా ఎందుకు ఈయన దిగజారిపోతున్నాడో నాకు అర్థమే కావటం లేదు. నాతో అబద్ధలాడటమేమిటి బాబాయి గారు….” అంటూ ముక్కుచీదేసింది కాంతం.
“అమ్మా, రామస్వామి అలాంటి వాడు కాడే…” అన్నారు సంశయంగా శేషయ్య. అయినా కాంతం విడిచిపెట్టలేదు. ఒక 20 నిమిషాలపాటు ఆయన్ని ఊపిరి తీసుకోనివ్వకుండా తన స్వామి గోడు కుమ్మరించింది.
రామస్వామి చాల ఉత్తముడు అని చెప్పి ఇరవై ఏళ్ళక్రితం తనే పెళ్ళి చేశాడు. తనకి ఇప్పటికీ నమ్మకం – స్వామి తప్పులు చేయడు.
కాని కాంతం చెప్పింది….?
మళ్ళా నాల్రోజులకే ఇంకో పంచాయతీ పెట్టింది కాంతం.
“బాబాయి గారు, మీరు చాలా పక్షపాతం చూపిస్తున్నారు. ఈ ఊళ్ళో మీరున్నారని మా నాన్న నా పెళ్ళప్పుడే భరోసా ఇచ్చారు. నేను మిమ్మల్నే నమ్ముకున్నాను. కాని…” అంటూ కాంతం కళ్ళల్లో కొళాయి విప్పిన శబ్దం వినిపించింది శేషయ్యకి.
“మళ్ళీ ఏమైంది తల్లీ ?”
“ఆయన వాళ్ళ వదినగారిని వెళ్ళి కలిశారు. ఎంత దుర్మార్గం ఇది చెప్పండి?”
ఆ తోడికోడళ్ళ మధ్య గతంలో జరిగిన గొడవలు గుర్తుకొచ్చాయి శేషయ్యకి. అప్పట్నుంచి వాళ్ళిద్దరి మధ్య రాకపోకలు లేవు. ఎప్పుడైనా అత్యవసరమైతే అన్నదమ్ములు ఫోనులో మాట్లాడుకోవటం తప్ప రామస్వామి వదినగారిని కలిసింది లేదు.
“ఇప్పుడే జరిగిందమ్మా?”
“(కొళాయి శబ్దాలతో మొదలైంది).. ఆయన కలిసి వారం అయిందట. నాకు చెప్పలేదు. కాని వాళ్ళ పనిమనిషి మొన్న కూరల మార్కెట్లో కనబడి అయ్యగారు వచ్చారు, మీరు రాలేదేంటమ్మ?’ అని అడిగింది.
ఈయన్నిపొద్దుటే అడిగాను. ‘మీరు ఆవిడగారిని కలిశారా?’ అని. మళ్ళీ అదే తంతు బాబాయిగారు. ‘అబ్బెబ్బె’ అంటూ డబాయించి బయటకెళ్ళిపోయారు…నా బ్రతుకు ఎల్లా కాలిపోతోందో చూస్తున్నారా ..?” కాంతం కొళాయి శబ్దం వినిపిస్తూనే ఉంది.
“నాకెందుకో, రామస్వామి తప్పు చేశాడంటే నమ్మబుద్ధికావటం లేదమ్మా. అతనికి ఏది ధర్మమో ఏది కాదో తెలుసు…”
“అదే, అదే, మీరు ఇలా వెనకేసుకొస్తున్నారు కాబట్టే ఆయన రెచ్చి పోతున్నాడు…(కొళాయి శబ్దం).. ఎన్ని అబద్ధాలు, ఎన్ని అబద్ధాలు.. అమ్మో అమ్మో….”
“సరే, నేను రేపు ఊళ్ళోకి వస్తున్నాను. వచ్చాక మాట్లాడతాను…”
***
శేషయ్య ఊళ్ళోకి రాగానే రామస్వామికి ఫోన్ చేసి రమ్మన్నారు.
“ఏమిటయ్యా, ఇదంతా? ఎందుకు నువ్వు ఈ మధ్య విపరీతంగా అబద్ధాలు చెబుతున్నావట. నీ భార్య గగ్గోలు పెడుతోంది. ఆమె చెప్పిన సంఘటనలన్నీ చెబుతాను.అసలేం జరిగిందో చెప్పు…”
“అంకుల్, నేను తప్పు చేశానంటే మీరు నమ్ముతున్నారా?”
“ఆ సంగతి తరువాత చెబుతాను. ముందు ఈ సంఘటనలు గురించి చెప్పు…” అంటూ కాంతం గత కొద్ది వారాల్లో చెప్పిన సంఘటనలన్నీ స్వామి ముందు పెట్టారు శేషయ్య.
రామస్వామి వినయంగా జరిగిందంతా చెప్పాడు.
“అంకుల్, ఇప్పుడు చెప్పండి నేను తప్పు చేశానా?”
“ముందు చేసినంతవరకూ నువ్వు తప్పు చేయలేదు. కాని తరువాతైనా ఆమెకి చెప్పి ఉండాల్సింది.”
“అప్పుడు మాత్రం గొడవ చేయదా?”
“కనీసం ధర్మాన్ని పాటించినవాడివి అవుతావు. అబద్ధం చెప్పానన్న అపరాధ బావననుంచి విముక్తి వచ్చేది…పద, మీ ఇంటికి వెళ్దాం.”
కాంతంకి ఫోన్ చేసి తాను వస్తున్నానని, స్వామిని కూడా రమ్మన్నానని చెప్పారు శేషయ్య.
“కాంతమ్మా, నేను చెప్పటం పూర్తయ్యేదాకా నువ్వు ప్రశ్నలు వేయకూడదు. పూర్తిగా విన్నాక మాట్లాడు… ఆ రోజు తాగి వచ్చిన మాట నిజమే. వాళ్ళ కంపెనీకి ఒక బహుళజాతి కంపెనీ వాళ్ళతో పెద్ద ఒప్పందం కుదిరిన సందర్భంలో వాళ్ళ చైర్మన్ బలవంతపెడితే ఎప్పుడూ తాగని వాడు తాగాడు. ఆ మాట నీకు చెప్పాలనుకున్నాడు. కాని అది నీకు రుచించని విషయం కాబట్టి ఎంత బాధపడిపోతావో అని చెప్పలేదు… మీ తోడికోడలికి కరోనా సోకింది. ఇంట్లో క్వారంటైన్‌లో ఉంది. చిన్నప్పుడు ఎత్తుకొని పెంచిన వదిన. నీకు చెబితే, నువ్వు అసలు భరించలేవని చెప్పలేదు… ” ఇలా కాంతం ఎత్తిన ప్రతి విషయం వెనకాల ‘కాంత బాధపడటం’ అన్న కారణం ఎందుకు స్వామిని చెప్పనీయకుండా చేసిందో చెప్పారు శేషయ్య.
“అలాగని, నాకు చెప్పకపోవటం న్యాయమా?” కళ్ళొత్తుకుంటూ అడిగింది కాంతం.
“ధర్మం ఏం చెబుతుందంటే – ‘సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్; న బ్రూయాత్ సత్యమప్రియం; ప్రియంచ నానృతం బ్రూయాత్.’.. సత్యమే చెప్పాలి. వినేవాళ్ళకి ప్రియమైన విషయమే చెప్పాలి. వినేవాళ్ళకి రుచించని (బాధ కలిగించే) విషయమే అయితే, సత్యమైనా చెప్పకూడదు. ఒకవేళ అసత్యం ఆనందం కలిగించేదే అయినా చెప్పకూడదు.. నీ స్వామికి నీ మీదున్న ప్రేమని అర్థం చేసుకో…”
కాంతం కళ్ళొత్తుకుంది. రెండు చేతులూ జోడించి నమస్కారం చేసింది.
2. ఆ ఫోన్ ఇప్పటికీ మోగుతూనే ఉంది…
ఆ ఫోన్ ఇప్పటికీ మోగుతూనే ఉంది…
అప్పారావు ఫోన్ మ్రోగింది.
ఎత్తాడు.
“ఎవురూ ?”
“అయ్యా, నేను జి.గురునాథాన్ని.”
“ఆ ఏంటి చెప్పు.”
“అహ ఏం లేదు. ఒక విషయం…”
“ఏం లేదా! ఆ కాడికి ఎందుకు ఫోన్ చేశావ్. పెట్టేయ్.”
ఠప్ మంటూ ఫోన్ పెట్టేశాడు అప్పారావు.
మళ్ళీ ఫోన్ ‘ట్రింగ్..ట్రింగ్..’
అప్పారావు ఎత్తాడు.
“ఎవురూ ?”
“నేనే, జిగురునాథాన్ని. ఒక్క మాట మీకు చెప్పాలని …”
“ఒక్క మాటా! అప్పుడే మూడు మాటలు మాట్లాడుండావుగందా! పెట్టేయ్.”
ఫోన్ ఠప్.
అప్పారావుచేత ఎలా మాట్లాడించాలబ్బా ??? ఇది జిగురునాథం సమస్య.
మళ్ళీ మోగింది.
“ఎవురూ?”
“నేనే. జిగురునాథాన్ని స్వామీ.”
“సరే, చెప్పు.”
“మీకు ఓ రహస్యం చెప్పాలి స్వామీ. అది…”
“ఆగాగు. ఈ మధ్య ఫోన్లు సర్కారోళ్ళు ట్యాప్‌లు చేస్తుండారంట. పాత సిఎం ఎన్నో సార్లు చెప్పిఉండలా! రగస్యం అయితే, మా ఊరికొచ్చి నా చెవిలో చెప్పిపో..”
ఫోన్ ఠప్.
జిగురునాథానికి మండింది.
మళ్ళీ మోగింది.
“ఎవురూ?”
“నేనే, జిగురునాథాన్ని సామీ. కొంచెం వినండి.”
“సరే, చెప్పు.”
“విషయం ఏందంటే… (మధ్యలో ఎవరో మాట్లాడుతున్న శబ్దం).. సామీ, మా సారు పిలుస్తున్నాడు. ఒక్క సెకను లైనులో ఉండండి…”
ఫోన్ ఠప్.
మళ్ళా ‘ట్రింగ్..ట్రింగ్..’
“ఎవురూ?”
“న్నేను జ్జిగ్గురునాథాన్ని. ఫోన్ ఎందుకు పెట్టేసినట్లు. లైనులో ఉండమన్నానా?” పళ్ళు కొరికేస్తున్నాడు.
“ఓరి నీ బండ బడ. ఒక్క సెకనే అని చెప్పిఉండావుగదయ్యా. సెకను అవ్వంగానే పెట్టేసే పన్లేదా?”
ఫోన్ ఠప్.
జిగురునాథం పళ్ళు టకటకమంటున్నాయి గోదావారి బ్రిడ్జ్ మీద కోరమాండల్ ట్రైన్ పరుగెడుతున్నట్లు.
ట్రింగ్… ట్రింగ్ …
“ఎవురూ?”
“జిగురునాథాన్నే ఇంకా…”
“ఆ, నువ్వేనా ! ఏంది సంగతి?”
“మీరు బాగున్నారా?”
“ఓరి నీ బండ బడ. బాగాలేకపోతే ఇంతసేపు ఎట్లా మాట్లాడుండాను! అందుకేనా ఫోను? పెట్టేయ్.”
ఫోన్ ఠప్.
జిగురునాథానికి ఓపిక నశిస్తోంది.
ఇంకోసారి ఫోన్ ‘ట్రింగ్..ట్రింగ్’
“ఎవురూ ?”
“సర్కారు పథకాల గురించి మీకు చెప్పాలని ….”
“అందుకా! అయ్యన్నీ పేపర్లో సదువుతుండలే. పెట్టేయ్.”
ఫోన్ ఠప్.
పట్టువదలని జిగురునాథం చివరి అస్త్రం ప్రయోగించాడు.
మళ్ళీ ఫోన్ ‘ట్రింగ్..ట్రింగ్’
అప్పారావు ఫోన్ ఎత్తాడు.
“ఎవురూ?”
“కోకా కోలా లాటరీలో మీకు కోటి రూపాయలు వచ్చింది… వచ్చి తీసుకోండి… “
“ఆ .. ఆ … ఎక్కడికి రావాల … ఎక్కడికి … ఎప్పుడు రావాల …”
కాల్ కట్.
జిగురునాథం ఫోన్ మాత్రం ఆపకుండా మోగుతూనే ఉంది.