99 సెకన్ల కథ-32

2
2

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత, సంపాదకులు, పాత్రికేయులు జి. వల్లీశ్వర్ ’99 సెకన్ల కథ’ సిరీస్‌లో ఈ వారం రెండు కథలు సంచిక పాఠకులకు అందిస్తున్నారు. ఈ కథలు ప్రపంచతత్వాన్ని, మానవ మనస్తత్వాన్ని సూక్ష్మంగా ప్రదర్శిస్తాయి. [/box]

1. దంతధావనం!

[dropcap]”ఏ[/dropcap]మర్రా, దంతధావనం చేశారా?”

అమెరికానుంచి రెండు రోజుల క్రితమే దిగిన 70 ఏళ్ళ సీతారామయ్య తన మనవల్నిఅడిగాడు ఆ ఉదయాన్నే.

పదిహేనేళ్ళ ఫణి, పన్నెండేళ్ళ సీత అప్పుడే ఒళ్ళు విరుచుకుంటున్నారు.

“ఏంటి తాతగారూ, ఏమన్నారూ?” అని అడిగాడు ఫణి.

“అదేరా, దంతధావనం చేశారా?” అని అడుగుతున్నాను.

ఫణి, సీత ఒకళ్ళ మొహం ఒకరు చూసుకున్నారు.

‘ఈ ముసలాయనతో మనకెందుకులే’ అనుకొని, చక చకా మంచాలు దిగి, పెరట్లోకి పరుగెట్టబోయారు.

సీతారామయ్య పట్టుకొని ఆపాడు. తన ప్రశ్న మళ్ళీ వేశాడు.

“తాతగారు, మళ్ళీ మా అమ్మ అరుస్తుంది. మేం అర్జంటుగా బ్రష్ చేసుకోవాలి… వదలండి” అంటూ గింజుకున్నారు.

అంతలో వాళ్ళ అమ్మ అలివేలు రానే వచ్చింది. విషయం అర్హ్దమైపోయింది. నవ్వుకొంది.

పిల్లలకి చెప్పింది. “తాతగారు అడుగుతున్నదీ అదే. బ్రష్ అంటే దంతధావనమే” అంటూ పిల్లల్ని విడిపించుకొని వెళ్ళింది.

కాస్సేపటికి పిల్లలు మేడ మెట్ల మీద కూర్చొని పాలు తాగుతూ మళ్ళీ తాతగారి కంట పడ్డారు.

“ఒరేయ్, ఇవ్వాళ నరకచతుర్దశి కాబట్టి, మీరు అభ్యంగన స్నానం చేయండి. ఊరికే వేడినీళ్ళు ఒంటి మీద కుమ్మరించుకోవడం కాదు. అర్థమైందా?”

ఫణి, సీత మళ్ళీ ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు.

తాతగారు సింహంలా అక్కడే నిలబడి ఉన్నారు. ఏదో ఒకటి చెప్పాలి.

ఏం చెప్పాలి? బుర్ర గోక్కునారు.

అదును చూసి, చటుక్కున తాతగారికి చెరో పక్కనుంచి పారిపోయారు.

కూతురు అలివేలుని అడిగాడు సీతారామయ్య.

“ఏమ్మా, వీళ్ళకి అభ్యంగన స్నానం అంటే చెప్పలేదా?”

“నాన్నా, వాళ్ళకి అర్ధమయ్యే భాషలో గదా నేను చెప్పాలి! అభ్యంగన స్నానాల గురించి, సాల భంజికల గురించి చెప్పే సమయం ఎక్కడ? నేనూ ఉద్యోగానికి వెళ్తున్నా కదా! “

సీతారామయ్యకి తన చిన్నతనం గుర్తుకొచ్చింది.

అమ్మ ఒంటినిండా నువ్వులనూనె రాసి, నలుగు పెట్టి, అది ఎండిపోయాక తలారా స్నానం చేయించేది. ఆ అభ్యంగన స్నానం చేస్తే ఎంత హాయిగా నిద్ర పట్టేది! శరీరం మీద నూగు ఎలా రాలిపోయేది!

ఓ గంట తరువాత, సీత తండ్రితో చెప్పింది.

“నాన్నా, నీ కిష్టమని రవ్వదోశెలు వేస్తున్నాను. పిల్లలూ, నువ్వూ తినేయండి. మీ అల్లుడు ఆ ఫోన్లు మాట్లాడి రావటానికి సమయం పడుతుంది…”

“ఓ, తప్పకుండా…” అంటూ, తాతగారు మళ్ళీ పిల్లల గదిలోకి వెళ్ళారు.

“ఒరేయ్, శుభవార్తర్రా. ఇవ్వాళ మన అల్పాహారం ఏమిటో తెలుసా?”

వాళ్ళిద్దరికీ మళ్ళీ గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది.

దీనంగా తాతగారి వంక చూశారు.

“రండి రండి, అల్పాహారం లాగిద్దాం…” అంటున్నాడు ఉత్సాహంగా తాతగారు. గది గుమ్మలో అడ్డంగా నిలబడ్డాడేమో, ‘దొరికిపోయాంరా’ అనుకుంటూ ఆముదం తాగిన మొహం పెట్టేశారు ఆ అరటిక్కెట్లు ఇద్దరూ.

తాతగారితో కలిసి భోజనాల బల్ల ముందు కూర్చున్నాక, ఆ అరటిక్కెట్లకి అర్థమైంది – అల్పాహారం అంటే ‘బ్రేక్ ఫాస్ట్.’ వాళ్ళు రవ్వదోశెలు ఆస్వాదిస్తున్న సమయంలోనే, అల్లుడు అనంతరాం వచ్చి కూర్చున్నాడు.

“మీరు తాతగారు ఏం చెప్పినా వినాలి. ఆయన మంచి పండితులు…” అంటూ పిల్లలకి చిన్న పాఠం చెప్పాడు.

అక్కడ్నుంచీ వాళ్ళిద్దరికీ అర్థమైంది తాతగారిని తప్పించుకోలేమని.

ఆ మధ్యాహ్నం వాళ్ళు “లంచ్ చేద్దాం రండి” అన్నందుకు వాళ్ళకి తాతగారి అక్షింతలు కడుపునిండా పడ్డాయి. భోజనం చేస్తున్నప్పుడు కూడా, అరటిక్కెట్లు – ‘స్పూన్ ‘, ‘కర్రీ’, ‘కర్డ్’, ‘రైస్ ‘ లాంటి పదాలు వాడినప్పుడల్లా తాతగారి గీతోపదేశం మొదలయ్యేది.

“ఏరా, నా శయ్య సిద్ధమైందా?… నా దూర్వాణి ఎక్కడ పెట్టార్రా?…. నా సులోచనాలు ఏవిరా?… ” ఇలా తాతగారు ప్రశ్నలు సంధించిన ప్రతిసారీ వాళ్ళ మొహాలు ఛార్జి అయిపోయిన చరవాణిలా, ఎదురుచూసిన సీరియల్ వచ్చే సమయానికి కరెంటు పోయిన టివిలా రంగులు మారిపోయేవి. చివరికి వాళ్ళు కుడిచేతి చిటికెన వేలు చూపించి, “బాత్ రూంకి వెళ్ళొస్తాం” అన్నా తాతగారు ఊరుకోలేదు.

“అదేమన్న విహారయాత్రా ప్రదేశమేమిట్రా, బాత్ రూంకి వెళ్తానంటునావ్. ‘అల్పాచమానం’ అనాలి. కొంచెం నాగరీకంగా ‘ప్రకృతి పిలుస్తోంది ‘ అనొచ్చు. ఇంకా ‘కాలు మడుచుకోవటం’ వగైరా . … .”

రెండు రోజుల్లో ఫణి, సీత డీలాపడిపోయారు. నీరసం శీతాకాలం దుప్పటిలా వాళ్ళని చుట్టుముట్టేసింది.

ఒకరోజు సాయంత్రం తన చిన్నప్పటి స్నేహితుడి తమ్ముడైన సీతారామయ్యను చూడాలని శేషయ్య వచ్చారు. శలవురోజు కావటంతో అల్లుడు అనంతరాం కూడా చేరాడు.

అప్పుడూ అంతే. సీతారామయ్య పిల్లల్ని పిలిచి, తేనీరు తెమ్మని అమ్మకి చెప్పమన్నాడు.

ఈ సారి పిల్లలు గట్టిగా నిలబడ్డారు. “తేనీరు అంటే మాకే అర్థం కాలేదు. అమ్మకేం తెలుస్తుంది. అదేమిటో చెప్పండి. చెప్పే దాకా కదలం” అంటూ భీష్ముడిలా ప్రతిజ్ఞ చేశాడు ఫణి. “అవును, అన్నయ్య అడిగింది చెప్పాల్సిందే” అంటూ పట్టుబట్టింది సీత.

“ఏమిటే, నువ్వేమన్నా వాడికి అంగరక్షకుడివా? నన్ను నిలదీస్తున్నావ్!”

అంగరక్షకుడు?

ఫణి, సీత మళ్ళీ మొహాలు చూసుకున్నారు..

సీతారామయ్యలో అసహనం తొంగి చూసింది. “చూశావా శేషయ్యా! ఈ పిల్లల్ని ఆంగ్ల మాధ్యమం బడుల్లో పారేసి, ఎలా తయారు చేస్తున్నారో ? మన వాళ్ళు పిల్లల్ని తెలుగు మాధ్యమం పాఠశాలల్లో చదివించటమే మానేశారు. అందుకే మనభాషని వీళ్ళు అస్సలు తెలుసుకోక, వింతపశువుల్లా తయారవుతున్నారు…” అంటూ ఆవేశపడ్డాడు సీతారామయ్య.

శేషయ్య ఒక చిరునవ్వు నవ్వారు.

“సీతయ్యా, నువ్వు తెలుగు మీడియంలో చదివేనాటికి విదేశీ కంపెనీల ఉద్యోగాల కోసం ఇంత వెంపర్లాట లేదు. నీ భార్య చనిపోయాక నువ్వు అమెరికాలో కొడుకి దగ్గరికెళ్ళిపోయావు… ఇప్పుడు సర్కారు ఉద్యోగాలే కాదు, పివి గారి పుణ్యమా అని దేశంలోకి లక్షలాది ఉద్యోగాలు తెచ్చిన బహుళ జాతి కంపెనీలకు కావలసింది కూడా ఆంగ్ల మాధ్యమంలో చదివినవాళ్ళే. వాళ్ళు ఎదగాలంటే, ఏదో ఒక సంకర ఇంగ్లీషు భాష వస్తే చాల్లే – అనుకుంటున్నారు తల్లిదండ్రులు. …”

“అందుకని, మాతృభాషా మాధ్యమం అక్ఖర్లేదంటున్నావా?”

“కాదు, కాలానుగుణంగా మనమూ మారాలి. ఆంగ్ల మాధ్యమం వద్దని తల్లిదండ్రులు చెప్పనక్ఖర్లేదు. కాని, తెలుగు మాతృభాష అయిన పిల్లలకి ఒక నిర్బంధభాషగా తెలుగు ఉండి తీరాలని కోరుకోవాలి. అలాంటి ఉన్నతపాఠశాలల్లోనే (10 దాకా) పిల్లలని చదివించాలని మనం కోరుకోవాలి. ఇంట్లో తల్లిదండ్రులు విధిగా పిల్లలతో తెలుగులోనే మాట్లాడుతూ ఉండాలి. ఆ మాత్రం తెలుగు చాలు, మన పిల్లలకి మన ఇతిహాసాలలోని విలవలు, మన తెలుగు సంస్కృతి తెలుగు భాషలోనే బుర్రలో దూరటానికి, తెలుగు భాష మీద ప్రేమ కలగటానికి లేదా పెరగటానికి…”

అనంతరాం ఆలోచనలో పడ్డాడు.

2. మంథరలూ ఉంటారు!

“… మానవ సంబంధాల బలం అటువంటిది. ఇంత గొప్ప మానవసంబంధాలు నెరపగలిగిన వ్యక్తి ఎలాంటి విజయసోపానాలు అధిరోహించగలుగుతాడో మీకు చెప్పనఖ్ఖర్లేదు… అయితే, మానవసంబంధాలలో మౌలిక విషయం ఒకటుంది. ఇతరులు నీ పట్ల – ప్రత్యక్షంలో గానీ, పరోక్షంలో గానీ – ఎలా వ్యవహరించాలని నువ్వు కోరుకుంటావో అలా నువ్వు ఇతరుల పట్ల వ్యవహరిస్తూండటం. ఈ ఆత్మ విమర్శ ఉన్నవాళ్ళే అందరిచేత ఎక్కువగా ప్రేమించబడతారు ….”

ఇలా సాగిన ప్రసంగంతో శేషయ్య ఆ కంపెనీ ఉద్యోగుల ప్రశంసలు అందుకున్నారు.

చెన్నపురిలో ఒక ప్రఖ్యాత జాతీయ ఉత్పత్తుల, మార్కెటింగ్ వ్యవస్థకి చెందిన ఉగ్యోగులకు మానవ సంబంధాల మీద వారం రోజుల పాటు జరుగుతున్న పునశ్చరణ సభలకు శేషయ్య ముఖ్య అతిధి. ప్రారంభ సభ అవగానే, ఆ కంపెనీ సి.ఇ.ఓ సుబ్రమణ్యం తన కారులోనే శేషయ్యని ఇంటికి తీసుకువెళ్ళాడు. శేషయ్య బాల్య స్నేహితుడి కొడుకు మణ్యం.

దారిలో మణ్యం తన కంపెనీ విశేషాలు చెబుతున్నాడు. అంతలో అతని ఫోన్ మ్రోగింది. బ్లూ టూత్‌లో మణ్యం మాట్లాడుతున్నాడు.

“ఏం నల్లముత్తు, ఏమిటి విశేషం?”

“సర్, మీరు చెప్పినట్లుగానే కేంద్ర వ్యవసాయ శాఖ అధికారికి పైవారం తాజ్ అయిదు నక్షత్రాల హోటల్లో సూట్ ఏర్పాటు చేయమని మన జి.ఎం జనార్దన్‌కి సందేశం పంపాను సర్…”

“సందేశం పంపటమేమిటయ్యా, నువ్వే స్వయంగా చెప్పి చేయించమన్నానుగా!”

“నిన్న సాయంత్రం నేను సీటుదగ్గరికి వెళ్ళేసరికి జి.ఎం సర్ వెళ్ళిపోయారు సర్. అందుకే …”

“అదేమిటి? అతనికీ చెప్పానే. నువ్వొస్తావని, ఇది చాల అర్జంటు అని…”

“ఏమో సర్, జి.ఎం సర్ అప్పుడప్పుడు త్వరగా వెళ్ళిపోతున్నారు సర్. అయినా, నేను నా పరిచయాలు ఉపయోగించి, తాజ్ హోటల్లో సూట్ పెట్టించేశాను సర్ …”

“ఓ, వెరీ గుడ్..” నల్ల ముత్తుని మెచ్చుకున్నాడు మణ్యం.

***

రెండు రోజుల తరువాత, మళ్ళా ఇలాగే శేషయ్య, మణ్యం కలిసి ఆఫీసుకి వెళ్తున్నారు. ఫోన్ మ్రోగింది.

“ఏం మంచి ముత్యం (నల్ల ముత్తు)! ఏమిటి …”

“వణక్కం సర్… కష్టమ్స్‌లో గూడ్స్ విడిపించే విషయం జి.ఎం జనార్దన్ సారుకి చెప్పాను సర్. ఆయన ఎవరితోనో మాట్లాడారంట. రెండు రోజుల తరువాత చేస్తాన్నారు సర్..”

“రెండు రోజుల తరువాతా! అలా ఎందుకన్నాడు?…”

“తెలవదు సర్. నేను మాత్రం మీరు గట్టిగా చెప్పారని చెప్పాను సర్. ఆయన ‘సరే, సరే’ అనేశారు సర్.”

“సరేలే …”

***

మళ్ళా మూడు రోజుల తరువాత, ఉద్యోగులకు పునశ్చరణ శిబిరం చివరి రోజు, మణ్యం, శేషయ్య కలిసి ఆఫీసుకి వెళ్తున్నారు.

మణ్యం ఫోను మ్రోగింది…బ్లూ టూత్ ఆన్ అయింది.

“వణక్కం సర్…”

“చెప్పు మంచి ముత్యం!”

“కేంద్ర వ్యవసాయం అధికారి సారుని నేనే విమానం దగ్గరుండి జాగ్రత్తగా ఎక్కించాను సర్. మీ గురించి చాలా ఘనంగా చెప్పాను సర్…”

“వెరీ గుడ్… అవునూ, జి.ఎం జనార్దన్ రాలేదా?”

“జనార్దన్ సార్ మధ్యాహ్నం నుంచి ఆఫీసుకి రాలేదు సర్. వీడులో ఏదన్నా పని ఉందేమో సర్… నేను ఉన్నాను గదా సర్, మీకు మాటరానిస్తానా ?…”

“గుడ్…గుడ్…థాంక్యూ”

నల్లముత్తు మళ్ళీ మళ్ళీ అణకువగా వణక్కాలు పారేశాడు మణ్యానికి.

“ఏమిటయ్యా విషయం?” అని అడిగారు శేషయ్య.

“ఈ నల్లముత్తు చాలా నమ్మకమైన వాడు సర్. ఇక్కడ మాది కేంద్ర కార్యాలయం కదా! ఎక్కడెక్కడ ఏం జరుగుతోందో నాకు ప్రైవేటుగా చెబుతుంటాడు…ఈ జి.ఎం జనార్దన్ స్వతహాగా మంచివాడే. మంచిపేరు ఉంది. కానీ ఇప్పుడు చూశారా ఎలా తయారయ్యాడో!”

“కాని తప్పు చేస్తున్నావు మణ్యం.”

“అదేమిటి అంకుల్ ?”

“ఈ వారం రోజుల్లో ఇక్కడ చాలామందితో నేను ముఖాముఖీ మాట్లాడే అవకాశం వచ్చింది కదా! జి.ఎం జనార్దన్ మీ సంస్థలో ఒక ఆణిముత్యం… నువ్వు కేవలం ఆ డిప్యూటీ జి.ఎం మంచిముత్యం చెప్పుడు మాటలు విని జనార్దన్ పట్ల నీ అభిప్రాయం మార్చుకుంటున్నావు… ఇంకేం కారణాలు ఉన్నాయి నీకు చెప్పు?”

సి.ఇ.ఓ మణ్యం ఆలోచిస్తున్నాడు.

“మణ్యం, ఈ చెప్పుడు మాటలు చెప్పే వాళ్ళు చాలా తెలివిగా నీ అభిప్రాయాన్ని మార్చేస్తారు… నీకు తెలుసా – కైకేయి మహా ఉత్తమురాలు. మంథర వచ్చి, ‘రాముడికి యువరాజ పట్టాభిషేకం ఏర్పాట్లు జరుగుతున్నాయి’ అనగానే, బ్రహ్మానంద పడిపోయింది మనసారా. ఒక స్వర్ణాభరణాన్ని మంథరకి బహుమానంగా ఇచ్చింది. ‘నాకు భరతుడు ఎంతో, రాముడూ అంతే….

‘రామే వా భరతేవాహం విశేషం నోపలక్షయే; తస్మాత్తుష్టాస్మి యద్రాజా రామం రాజ్యేభిషేక్ష్యతి…’

ఎంత గొప్ప వార్త తెచ్చావు మంథరా! ఇంతకన్నా గొప్ప శుభవార్త ఇంకేమీ నాకు ఉండబోదు గదా!’ అంది ఆనందం పట్టలేక…. ఆ ఆనందంలో కపటం లేదు, ప్రేమ మాత్రమే ఉంది.”

మణ్యం ఏకాగ్రచిత్తంతో వింటున్నాడు.

“అంతటి ఉత్తమురాలైన కైకేయిని సయితం కేవలం చెప్పుడు మాటలతో మంథర మార్చేసింది. రాముడు వనవాసానికి వెళ్ళేలా చేసింది.. ఎంతటి ఉత్తమపురుషుడైన రాముణ్ణి వనవాసానికి వెళ్ళేలా చేసిందో కూడా చెప్పాలా?”

మణ్యం తల అడ్డంగా ఉపాడు.

“ఏ సంస్థలోనైనా చెప్పుడు మాటలు ఆధారంగా మాత్రమే నిర్ణయానికి వచ్చే లక్షణం నీలాంటి అధికారులకి, సంస్థకి కూడా మంచిది కాదు.”

మణ్యంలో వికాసం తొంగి చూసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here