[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత, సంపాదకులు, పాత్రికేయులు జి. వల్లీశ్వర్ ’99 సెకన్ల కథ’ సిరీస్‌లో ఈ వారం రెండు కథలు సంచిక పాఠకులకు అందిస్తున్నారు. ఈ కథలు ప్రపంచతత్వాన్ని, మానవ మనస్తత్వాన్ని సూక్ష్మంగా ప్రదర్శిస్తాయి. [/box]
1. భార్యలు మాట వినరు!
ఆ సాయంత్రం రఘోత్తమ రావు విమానం దిగుతూనే ఇంటికెళ్ళే దారిలో శేషయ్య గారింటికి వెళ్ళాడు.
“మీ మేనల్లుడు మీకు ఈ ప్యాకెట్ ఇమ్మని చెప్పాడు. ఇంటికెళ్ళే దారే కదా, ఇప్పుడే ఇచ్చేసి వెళ్దామని….” అంటూ శేషయ్యగారికి రఘోత్తమ్ ప్యాకెట్ ఇచ్చేశాడు.
“చాలా పెద్ద పర్యటన చేసినట్లున్నావ్! “
“లేదండి. ఒక్క నగరానికే వెళ్ళాను. ఇక్కడ బాగా పనిచేస్తున్నానని కంపెనీ వాళ్ళు అక్కడ కొంతమందికి శిక్షణ ఇవ్వటం కోసం పిలిచారు. బహుళజాతి కంపెనీ కదా! మూడు నెలలు ఇంటికి దూరంగా…”
శేషయ్య నవ్వారు.
“అవునూ, ఇవ్వాళ నీ భార్య రాణికి పెద్ద సన్మాన సభ జరుగుతోందట కదా! నన్ను అధ్యక్షత వహించమని అడిగారు… నువ్వు వస్తున్నావా? మళ్ళీ ఆఫీసుకుకెళ్ళి అక్కడే అర్ధరాత్రి దాకా ఉండిపోతావా?… (గడియారం చూశారు.) ఇంకో అరగంటలో మొదలు. మరి, ఇద్దరం కలిసి వెళ్దామా ?”
రఘోత్తమ్ మాట్లాడలేదు.
శేషయ్యకి ఏదో సంశయం కలుగుతోంది.
“ఎందుకు ఆలోచిస్తున్నావ్?… అభ్యంతరం లేకపోతే నిజం చెప్పు.”
“సర్, (కొంచెం తటపటాయించి) ఆ మధ్య రాణిని మా పనిమనిషి తరచుగా బియ్యం అడిగేది. ‘ఎందుకు ‘ అని రాణి అడిగితే, ఆ అమ్మాయి చెప్పింది – రేషన్ షాపువాడు చాలా మోసం చేస్తున్నాడని. రాణి కొంచెం లోతుగా ఆరా తీసింది. అప్పుడు బయట పడిన విషయం ఏమిటంటే – ఇలా మోసం చేస్తున్న రేషన్ షాపులు మా చుట్టుప్రక్కల కాలనీల్లో ఓ 10-15 దాకా ఉన్నాయి. ఇవన్నీ పౌరసరఫరాల మంత్రి బావమరిది – బినామీ పేర్లతో నడుపుతున్నవే. బియ్యం సహా అన్ని సరుకులు వచ్చిన రెండుగంటలకే అమ్మకం అయిపోయినట్లు బోర్డు పెట్టడం, నకిలీ ఉత్పత్తుల్ని అమ్మేయటం వగైరా చాలా జరుగుతున్నాయిట. వీటి సంగతి తేలుస్తానంటూ రాణి ఆ బస్తీ ఆడవాళ్ళకి అభయం ఇచ్చేసింది…”
“ఓహో, చాలా జరిగిందే!”
“నేను వారించాను. ‘ఇవన్నీ నీకెందుకు? నీ పి.హెచ్.డి ఏదో నువ్వు చేసుకో. ఆ రేషన్ షాపు వాడు నీకేమీ అపకారం చేయలేదు. వాళ్ళతో ఏ గొడవా లేదుకదా! ఎందుకు తగాదా? పైగా ఈ రాజకీయం రాక్షసమైంది. వాళ్ళు నీకు ఎలాంటి కీడు తలపెడతారో కూడా’ … ఇలా ఎంతో చెప్పాను” అంటూ ఆగాడు పురుషోత్తమ్.
“మరి ఏమంది రాణి?” శేషయ్య ప్రశ్న.
“నా మాట వినలేదు. కళ్ళముందు నోరులేని వాళ్ళకి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోను – అంది. ‘సరే. అయితే, జరగకూడనిది ఏం జరిగినా నాకు బాధ్యత లేదు’ అనేసి నేను అమెరికా వెళ్ళిపోయాను. ఇప్పుడే వస్తున్నాను… మధ్యలో నేనేమీ అడగలేదు. నేను వచ్చేసేముందు తను ఫోన్ చేసి చెప్పింది సన్మానం గురించి.”
ఆపేసి తల ఒంచుకున్నాడు రఘోత్తమ్.
శేషయ్య నవ్వారు.
“అర్ధమయింది. కాని, ఈ మధ్యలో ఆమె నా సాయంతో ప్రభుత్వ ప్రధానకార్యదర్శిని కలిసి, ఆయన్ని ఒప్పించి, దర్యాప్తు చేయించి, నగరంలో ఉన్న రేషన్ షాపులన్నింటి మీద దాడులు చేయించింది. మొత్తం క్షాళన జరిగిపోయింది. ఆ మంత్రిగారి బావమరిది ఊరొదిలి పారిపోయాడు కేసులకి భయపడి… ఇప్పుడు మహిళా సంఘాలన్నీరాణీకి సన్మానం చేస్తున్నాయి… పద పద వెళ్దాం..”
రఘోత్తమ్ మాట్లాడలేదు.
శేషయ్య మళ్ళీ అడిగారు బయల్దేరమని.
“సర్, అప్పుడు తనని నిరుత్సాహపరిచాను. వద్దని గట్టిగా వారించాను. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని…”
శేషయ్య గట్టిగా నవ్వారు.
“రాముడు వనవాసం మొదలుపెట్టినప్పుడు, దండకారణ్యంలోని తాపసులంతా వచ్చి, తమని రాక్షసుల దాడుల బారినుంచి రక్షించమని కోరారు. ఆ అరణ్యంలోని రాక్షసులందర్నీ సంహరిస్తానని రాముడు అభయం ఇచ్చాడు. అప్పుడు సీత కూడా నువ్వన్నట్లే అంది – ‘అసత్యమాడటం, ఇతరుల భార్యల్ని మోహించటం, అకారణంగా ఇతరుల్ని (ఇతరప్రాణుల్ని) హింసించటం పాపం. ఆ రాక్షసులతో నీకు ఏ తగాదా లేదు కదా! ఎందుకు చంపుతానంటున్నావ్? ఆ రాక్షసుల గొడవ మనకెందుకు! వద్దు రామా’ అని నొక్కి నొక్కి చెప్పింది…”
రఘోత్తముడు ఉత్సుకతతో వింటున్నాడు..
“శూర్పణఖ చెప్పుడు మాటలు నమ్మి రాక్షససైన్యం యుద్ఢానికి వచ్చింది. రావణాసురుడి తమ్ముడయిన ఖరుడు, దూషణుడు, త్రిశిరుడు వగైరా పద్నాలుగువేల మంది అపజయం ఎరుగని రాక్షసుల్ని రాముడు ఒక్కడే తుడిచిపెట్టిపారేశాడు. తాపసులంతా వచ్చి ప్రశంసించారు. సీత – నీలాగా తన అహం దెబ్బతిన్నదని బాధపడలేదు.
‘తం దృష్ట్వా శత్రుహంతారం మహర్షీణాం సుఖావహమ్,
బభూవ హృష్టా వైదేహీ భర్తారం పరిషస్వజే …
… .. పునః పరిష్వజ్య శశిప్రభాననా,
బభూవ హృష్టా జనకాత్మజా తదా….’
శతృసంహారం చేసి, ఆ తాపసులకు ఆనందాన్ని కలిగించాడని గర్వపడుతూ, వాళ్ళ ఎదుటే తన రాముడిని ప్రశంసాపూర్వకంగా మళ్ళీ మళ్ళీ ఆలింగనం చేసుకొంది.”
రఘోత్తముడికి సాంత్వన కలుగుతోంది.
“మనకి ఆదర్శం ఆ సీతారాములే. పురుషాహంకారాన్ని వదిలేయ్. లేదా, తగ్గించుకో. నీ భార్య సామర్థ్యానికి గర్వపడటం నీ ధర్మం. తన ఇంటిపేరు నిలబెట్టే భార్య – ఎదిగిపోతోందని దుఃఖపడే మగవాడు సంస్కారవంతుడు ఎలా అవుతాడయ్యా!..”
మనోవికాసంతో కొత్త రఘోత్తమ్ లేచాడు.
“కలిసే వెళ్దాం, రండి సర్” అన్నాడు శేషయ్యతో.
“కాని ఓ షరతు. వేదికమీద నువ్వు కూడా నీ స్పందన తెలియజేయాలి.”
“సీత లాగానా ..!”
ఇద్దరూ నవ్వుకుంటూ బయల్దేరారు.
2. తెలివైన దేశభక్తి!
భారతదేశం ఇంకా బ్రిటీష్ వారి దాస్య శృంఖలాలలో మ్రగ్గుతున్నరోజులు అవి.
రోడ్లమీద, బహిరంగ వేదికలమీద, టెలివిజన్లలో, సోషల్ మీడియాలో, పత్రికలలో పక్కింటివాడిదగ్గర్నుంచి ప్రధానమంత్రి దాకా ఎవడిమీదైనా మన నోటికొచ్చినట్లు దుమ్మెత్తిపోయాలంటే జైలుకెళ్ళటానికి సిద్ధంగా ఉండాలి. ప్రభుత్వం గురించికాని, స్వాతంత్ర్యం గురించికాని బహిరంగంగా కూసినవాడేకాదు, రాసినవాడు కూడా కారాగారానికి పోవటానికి సిద్ధపడి ఉండాల్సిన పరిస్థితులు అవి.
ఇప్పుడు ఎంత స్వేచ్చ, స్వాతంత్ర్యం అనుభవిస్తున్నామో కదా!
సరే, ఇలాంటి స్వేచ్ఛ గట్రా ఏమీ లేకుండా నోళ్ళు మూసుకొని కూర్చోవాల్సిన ఆ రోజుల్లో, దేశభక్తులు ప్రాణాలమీద ఆశ, పెళ్ళాం పిల్లలమీద ప్రేమ ఇంట్లోవదిలేసి, వీధుల్లోకొచ్చి, “వందేమాతరం” … “మనదే రాజ్యం” అని గొంతులో నరాలు తెగేలా అరుస్తూ ప్రదర్శనలు చేసేవారు.
అలాంటి రోజుల్లో మా ఊళ్ళో ఒక విచిత్రం జరిగింది.
తడికలపాడు తిప్పయ్య, తాటాకులపాలెం తిరుమలయ్య అనుకోకుండా మా ఊరి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న పండ్ల దుకాణాల దగ్గర కలుసుకున్నారు.
ఇద్దరూ దేశభక్తులే. ఇద్దరికీ దేశంకోసం ప్రాణాలిచ్చేయాలన్నంత భక్తి ఉంది.
చాలా రోజులతరువాత వాళ్లు కలుసుకున్నారు.
అదికూడా తిప్పయ్య తన కూతురి పెళ్ళికోసం సామాను కొంటూ చివరగా పండ్ల దుకాణం దగ్గర తేలాడు.
తిరుమలయ్య ఓ చిన్న ఇల్లు కట్టి, గృహప్రవేశానికి సామాను కొంటూ కొంటూ పండ్ల కొట్ల దగ్గర ఆగాడు.
ఇద్దరూ ఒకరినొకరు చాలాకాలం తరువాత కలుసుకోవటంతో ఆనందం పట్టలేక దేశభక్తి పరిభాషలో పలకరించుకున్నారు.
“వందేమాతరం” అని నినాదం చేశాడు తిప్పయ్య.
“మనదే రాజ్యం” అంటూ, పిడికిలి పైకెత్తి ఎలుగెత్తి కేకపెట్టాడు తిరుమలయ్య.
తిప్పయ్య ఇంకా ఆవేశంగా “వందేమాతరం”…
తిరుమలయ్య గొంతు నరాలు తెగేలా “మనదేరాజ్యం”…
అంతే! ఎదురుగుండా పోలీసు స్టేషనులోంచి బిలబిలమంటూ సబినస్పెక్టరూ, ఆయన పరివారం పరుగెత్తుకుంటూ వచ్చి, ఆ ఇద్దర్నీ వేరువేరు కటకటాల వెనకాలపడేశారు.
‘అరెరే, పట్నానికి వచ్చిన అసలు పని మర్చిపోయి ఆవేశపడ్డామే. ఇదేదో ఇంట్లో శుభకార్యం అయిపోయాక చేసి ఉండాల్సింది కదా!’ అని ఇద్దరూ విచారించారు.
ఆ రోజుల్లో ఇప్పటిలా కట్టలకొద్దీ కాపుసారాకేసులూ, భూ కబ్జా కేసులూ లేకపోవటంతో ఆ ఇద్దర్నీ రెండోరోజునే మేజిస్ట్రేట్ కోర్టులో నిలబెట్టారు.
మేజిస్ట్రేట్ ముందుగా తిప్పయ్యని విచారించాడు.
“ఏమయ్యా, ‘వందేమాతరం’ అన్నావా?”
“అన్నానండయ్యా.”
“అలా అనటం నేరమని తెలీదా?”
“అదేంటయ్యా. మా అమ్మాయి పెళ్ళికి అరటిపళ్ళుకొందామని వచ్చానండయ్యా.”
“ఆ, వచ్చి…?”
“ఆ పళ్ళకొట్లో అడిగానండి – ‘వంద ఏ మాత్రం’ అని. ఇది నేరమా అయ్యా?”
మేజిస్ట్రేట్ బిత్తరపోయాడు.
“అలా అడిగావా? అయితే అది నేరం కాదే” అంటూ కేసు కొట్టేశాడు.
పైగా, ఆ సబినస్పెక్టరుని తిట్టాడు ఇలాంటి తప్పుడు కేసు పెట్టినందుకు.
తిరుమలయ్య చూశాడు.
‘తిప్పయ్య తెలివిగా బయటపడ్డాడు, నా సంగతి ఏమిటి?’ అనుకున్నాడు.
భారతమాతని తల్చుకున్నాడు.
ఇప్పుడు తిరుమలయ్యని బోను ఎక్కించారు.
మేజిస్ట్రేట్ అడిగాడు.
“ఏమయ్యా, నువ్వు ‘మనదే రాజ్యం’ అన్నావా?”
“అవునండి”
“అలా అనటం నేరం అని తెలీదా?”
“అదేంది దొరవారు! అదెలా నేరమవుద్ది? నాకు ముందు మీరు ఇచారించినతను అరటిపళ్ళు ‘వంద ఏ మాత్రం’ అని కొట్లో అడిగాడు కదా దొరా!”
“అవునూ, అయితే…?”
“అదే గదా ఇసయం. ఈ పరగణా అంతా అరటిపళ్ళు డజన్ల లెఖ్కన అమ్ముతారే. అతనేంటి వంద లెఖ్కన అడుగుతున్నాడు! ‘ఈ ఊరికి కొత్తలా ఉందే’ అనుకొని, ‘మనదే రాజ్యం’ బాబూ అని అడిగాను. ఇదెట్టా తప్పవుద్ది?”
“ఓ, అలా అడిగావా! ఇది అస్సలు తప్పే కాదు” అంటూ ఆ కేసు కూడా కొట్టేశాడు మేజిస్ట్రేట్.
రెండు తప్పుడు కేసులు పెట్టి కోర్టు సమయాన్ని వృథా చేసినందుకు గాను “సబినస్పెక్టరు సాయంత్రం కోర్టు ముగిసేదాకా కోర్టులోనే నిలబడి ఉండాలి” అని శిక్ష కూడా విధించాడు!