[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత, సంపాదకులు, పాత్రికేయులు జి. వల్లీశ్వర్ ’99 సెకన్ల కథ’ సిరీస్‌లో ఈ వారం రెండు కథలు సంచిక పాఠకులకు అందిస్తున్నారు. ఈ కథలు ప్రపంచతత్వాన్ని, మానవ మనస్తత్వాన్ని సూక్ష్మంగా ప్రదర్శిస్తాయి. [/box]
1. ఛెళ్ళుమన్న మాట!
“మామిడి పండ్లు – పెద్ద రసాలు, చిన్న రసాలు, చెరుకు రసాలు, బంగినపల్లి కూడా – మూటకట్టించాను. మూడు నాలుగురోజుల్లో తయారతాయి. మా పాలేరు పాపయ్యకిచ్చి పంపిస్తున్నాను. వాడు సిటీకి రావటం ఇదే మొదటిసారి. ట్రైన్ దిగగానే నీకు ఫోను చేస్తాడు. నీకు వీలైతే స్టేషన్‌కి వెళ్ళి, వాడిని ఇంటికి తీసుకెళ్ళు. వాడికి ఆటో మాట్లాడటం, క్యాబ్ బుక్ చేయటం తెలియదు….” పల్లె నుంచి పరాంకుశం సిటీలో తన బావ వెంకటేశానికి ఫోన్లో చెబుతున్నాడు.
“ఓస్, ఇంతేగద బావా. నే వెళ్తాలె స్టేషన్‌కి. ఇంతకీ మీ వాడికి అసలు మాట్లాడటం అయినా వచ్చా? అదీ రాదా?” అని తన జోక్‌కి తనే విరగబడి నవ్వాడు వెంకటేశం.
“బావా, వాడు నాలుగో క్లాసుదాకా చదివాడు మా ఊరి చింతలబడిలో. మరీ అంత దిగువంచనా వేయకు,” అన్నాడు పరాంకుశం.
మామిడిపళ్ళు – అందులోనూ రసాలనే సరికి నోరూరిపోయింది వెంకటేశానికి.
***
ఆ రోజు పొద్దుటే ఆరు గంటలకి ఇంకా నిద్రలో ఉన్న వెంకటేశం తన చరవాణి మ్రోగుతుంటే ఎత్తాడు.
“అయ్యా, దండాలు. నన్ను పరాంకుశం అయ్యగారు పంపారండి. రైలు దిగాను.” అది పాలేరు గొంతు.
ఉలిక్కి పడ్డాడు వెంకూ. భార్య ఊళ్ళోలేదుగదా అని రాత్రి సిటీ బయట ఒక స్నేహితుడి ఇంటికి పార్టీకి వెళ్ళి, అక్కడే నిద్రపోయాడు.
“ఇదో పాపయ్య, నేను అనుకోకుండా ఊరికి బయట ఉన్నాను. ఇప్పుడు బయల్దేరి ఇంటికి వచ్చేస్తాను. ఒక్క అరగంట పడుతుంది. కొంచెం ఏమీ అనుకోకుండా నువ్వు ఇంటికి వచ్చేస్తావా?”
“ఎంతదూరం అయ్యా?”
“రెండు కిలోమీటర్లకి లోపలే… ఇంతకీ స్టేషన్లో నువ్వు ఎక్కడ నుంచున్నావ్?”
“ఇదేదో ప్లాటు పారం సిగారునున్నాను. నాకు ఎదురుగా సూరీడు ఉదయిస్తన్నాడు.”
“ఓహ్, అంటే అది ఒకటో నంబరు ప్లాట్‌ఫారం అయి ఉంటుంది…”
“ఆ …ఆ, ఇక్కడ ‘ఒకటి’ అని ఓ బోర్డు ఏలాడతా ఉండాదయ్యా.”
“ఇప్పుడు అక్కడ్నుంచి అదే ప్లాట్‌ఫారం మీద వెనక్కి రా. అక్కడ గేటు కనిపిస్తుంది. అందులోంచి బయటకు రా. అప్పుడు. మళ్ళీ చెబుతా.”
***
“ఆ, ఇప్పుడు సెప్పండి.” పాలేరు ఫోన్.
“అక్కడ ఎదురుగా ‘లంసా టీ’ అని పెద్ద బోర్డు ఉంటుంది చూడు.”
“… ఇక్కడ అలాంటిదేదీ అవపట్టం లేదండి.”
“పోనీ, దానికి ఎదురుగా రోడ్డుకి అటువైపు పెద్ద వేపచెట్టు ఉందా?”
“ఆ.. ఉందండి.”
“అక్కడికెళ్ళి, ఆ వేపచెట్టు సందులోంచి, కొంచెం ముందుకెళ్తే, పెద్ద రోడ్డు వస్తుంది. అక్కడ ఎడమవైపుకి తిరిగి కొంచెం ముందుకెళ్తే, కుడివైపున కొబ్బరిబొండాల కొట్టు కనుపిస్తుంది. అక్కడ రోడ్డు దాటి, ఆ సందులోకి తిరుగు…”
“…. అయ్యా, మీరు చెప్పిన ఎడమ తిరిగా. అక్కడ కొబ్బరికాయల దుకానం లేదే! కొన్ని దుకానాలు ఇంకా తెరవనేదనుకుంటా.”
“ఊ..ఊ ..” వెంకటేశం మళ్ళీ అవే గుర్తులు చెప్పాడు.
“ఆ రోడ్డులో నేరుగా వెళ్ళు. అక్కడ ‘మాయ ‘ అనే చిన్న హోటల్ వస్తుంది.అక్కడ ఎడం పక్కకి తిరుగు. ఆ రోడ్డు కొంచెం మలుపులు తిరిగి ఇంకో పెద్ద అయిదురోడ్ల సెంటర్లో కలుస్తుంది… అక్కడ కుడివైపునుంచి రెండో రోడ్డులోకి తిరుగు. అక్కడ ఒక గానుగ ఉంటుంది. అదే గుర్తు. నేరుగా వచ్చేస్తే, ఎక్కడ ఆ రోడ్డు రెండుగా చీలుతుందో, అక్కడ కుడివైపు సందులో చివారికి వచ్చేస్తే, ఆకుపచ్చ రంగులో ఉన్నదే మన ఇల్లు …”
“సరే, అయ్యా” అన్నాడు పాలేరు పాపయ్య అయిష్టంగా.
ఈ లోపల, వెంకటేశం వెంటనే కారు తీసి, ఇంటికి బయల్దేరాడు. ఉదయం కావటం వల్ల ట్రాఫిక్ లేకపోవటంతో, ఇరవై నిమిషాల్లో చేరిపోయాడు.
చేరాక, అరగంటయినా పాలేరు రాలేదు. ఫోన్ చేస్తే అసలు రింగ్ పోవటం లేదు.
‘అరె, స్టేషన్ నుంచి మన ఇంటికి రెండు కిలోమీటర్ల దూరం లేదు. వీడు ఇంతసేపు ఎక్కడ తిరుగుతున్నాడు. గట్టిగా నడిస్తే 10-12 నిమిషాల్లో చేరిపోవాలి గదా!’ అనుకుంటున్నాడు.
ఖంగారు పట్టుకుంది వెంకటేశానికి.
***
పోలీసు స్టేషన్ నుంచి ఫోన్.
“వెంకటేశం గారేనా?”
“అవును.”
“మీ గ్రామం నుంచి పాపయ్య అనే పాలేరు రావాలా?”
“అవును, వాడికోసం ఎదురు చూస్తున్నాను.”
“అతను పెద్ద మూట పట్టుకొని, ఇక్కడ దగ్గర్లో ఒక విదేశీయులుండే గ్రీన్ బంగ్లా లోకి వెళ్ళిపోయాడు. వాళ్ళకి తెలుగు రాదు. దొంగ అనుకొని స్టేషనుకి ఫోన్ చేశారు… అడ్రస్ చెప్పండి. మీ ఇంటికి పంపిస్తాం.”
వెంకటేశం ఇంకా ఖంగారు పడ్డాడు.
“అవునూ, వాడే నాకు ఫోను చేసి ఉండచ్చు గదా!” సందేహంగా అడిగాడు.
“అతని ఫోనులో ఛార్జింగ్ అయిపోయింది. ఇప్పుడే మేం ఛార్జింగ్ పెట్టి మీ నెంబరుచూసి చేస్తున్నాం.”
ఓ పావుగంట తరువాత పోలీసు జీపులోంచి పాలేరు పాపయ్య మామిడికాయల మూట బరువు మోస్తూ, పోలీసు దెబ్బల తాలూకు బాధ భరిస్తూ వెంకూ ఇంట్లోకి అడుగుపెట్టాడు. వెంకటేశానికి కోపం వచ్చింది.
“ఏరా, నేను అంత ౘక్కగా అడ్రసు చెబితే, ఎక్కడికి పోయావురా?” అంటూ పాపయ్య భుజం మీద మూటని దించాడు.
పాపయ్య క్రింద కూలబడాడు. తలెత్తి వెంకూ వంక చూశాడు. సన్నగా నీరసంగా నవ్వాడు.
“అయ్యా, మీలా అడ్రసుల్జెబితే, ఎవరూ చేరాల్సిన చోటుకి చేరరయ్యా. లంసా టీ బోర్డు, మాయ హోటలు, గానుగ మారిపోయాయయ్యా. అక్కడ ఇంకేవేవో వచ్చేశాయి. అయ్యా, నాలాంటోడికి నేనెట్టా రావాలో చెప్పాలంటే – ఆడనుంచి ఇంతదూరంలో ‘తూరుపుకి తిరుగు, ఉత్తరానికి తిరుగు’ అని సెప్పాలయ్యా. అయ్యా, ఈ బోర్డులు, దుకానాలు ఇయ్యాలుంటాయి, రేపు పోతాయి. తూరుపు, ఆగ్గేయం, దచ్చినం, నయరుతి, పడమర, వాయయ్యం, ఉత్తరం, ఈశాన్యం – ఈ ఎనిమిది దిక్కులే ఎప్పటికీ మారవయ్యా. అయ్యెటున్నాయో సెప్పే సూరీడు కూడా మారడయ్యా.”
బాగా చదువుకున్నవాణ్ణి అనుకుంటున్న వెంకటేశానికి ఛెళ్ళున తగిలింది ‘ఓ మంచి మాట…’.
2. శేషయ్య చెప్పిన భారతం
శేషయ్య చెన్నైలో దిగి, హోటల్లో దిగుతూనే రవికి ఫోన్ చేశారు.
“రవీ, బాగున్నావా?”
రవి ఆనందపడిపోయాడు. చాలా కాలం తరువాత శేషయ్య తాతగారిని కలుస్తున్నాడు. బంధుత్వం ఏమీ లేకపోయినా తన బాల్యం అంతా హైదరాబాదులో గడిచింది. పక్క ఇంట్లో ఉండే శేషయ్య గారు తనకి ఎన్నో కథలు చెబుతూ, ఆటలాడిస్తూ తన మనసులో ఒక ముద్రవేశారు. తను అమ్మా, నాన్నకి ఒక్కడే కొడుకు అయినా ఆ వెలితి తెలియకుండా చేశారు ఆరోజుల్లో.
“తాతగారూ, ఎంతో ఆనందంగా ఉంది మీతో మాట్లాడుతుంటే. నాలుగేళ్ళక్రితం అమ్మ పోయినప్పుడు వచ్చారు. ఆ తరువాత ఇదే కలవటం కదా!”
శేషయ్య నవ్వారు.
“మధ్య మధ్యలో ఫోనులో పలకరించుకుంటున్నాం గదా!”
“అది కూడా ఆరుమాసాల పైనే అయింది గదా తాతగారూ!.. మీరెలా ఉన్నారు ? ఆరోగ్యం బాగుంటోందా?.. ఇంతకీ ఎక్కడనుంచి మాట్లాడుతున్నారు?”
“మీ నగరం వచ్చానయ్యా… రైల్వేలో మీ పాత బాసు మురళి రామస్వామి నాకు స్నేహితుడు కదా! ఇవ్వాళ అతని భీమరథ శాంతికి వచ్చి ఆశీర్వదించాలని పిలిచాడు… నువ్వు వస్తున్నావా?”
“అయ్యో తాతగారూ, రాకుండా ఎలా ఉంటాను! ఆయన నాకు రెండుసార్లు బదిలీల విషయంలో సహాయం చేశాడు. ఒక సారి ప్రమోషన్ విషయంలో అసాధారణమైన సహాయం చేశాడు. పుత్ర వాత్సల్యంతో చూస్తాడు…”
“ఈ ఉత్సవం జరిగే దేవాలయ ప్రాంగణానికి దగ్గర్లోనే హోటల్లో ఉన్నాను. నువ్వు అక్కడికి వెళ్ళేముందు వస్తావా! కలిసి వెళ్దాం.”
రవి కొంచెం సంకోచించాడు.
“అంటే, ఏమీ లేదు తాతగారు. ఇవ్వాళ నాన్న పుట్టినరోజు. నేను, సుజాతా కలిసి వెళ్ళి, ఆయన్ని పలకరించి రావాలి. మీరు నాకోసం చూడకండి. అక్కడే కలుద్దాం.”
శేషయ్య సూటిగా అడిగారు.
“అంటే, నాన్న నీతో లేరా?”
“నాన్నగారికి చాదస్తం బాగా పెరిగిపోయింది తాతగారూ. అందుకని …”
శేషయ్య ఫోను పెట్టేశారు.
***
మురళి రామస్వామికి 69 ఏళ్ళు నిండి, 70వ పడిలోకి అడుగుపెడుతున్న సందర్భంలో అతని పిల్లలు సుబ్రహ్మణ్యస్వామి క్షేత్రంలో భీమరథ శాంతిని ఘనంగా జరిపిస్తున్నారు.
అప్పుడే రవి తన భార్యతో కలిసి అక్కడికి చేరుకున్నాడు.
గణపతి హోమంతో మొదలుపెట్టి రకరకాల హోమాలు చేశారు. ముఖ్యంగా ఆయుర్దాయం, ఆరోగ్యం బాగుండాలని ఆయుష్ హోమం కూడా చేశారు. వివిధ దేవతల ముందు ఉంచిన కలశాల్లోని పవిత్ర నదీ జలాలతో రామస్వామి దంపతులకి అభిషేకం చేశారు.
పవిత్ర స్నానాలు అయ్యాయి.
రామస్వామి దంపతుల నూతన వస్త్రధారణ జరిగింది.
పురోహితులు ఇచ్చిన మహా మాలలు మార్చుకున్నారు. బంధువులు, స్నేహితులు వచ్చి వాళ్ళ వాళ్ళ వయస్సుని బట్టి ఆశీర్వదించటం, ఆశీస్సులు తీసుకోవటం, బహుమతులు ఇవ్వటం చేస్తున్నారు.
వేద పండితులు ఆశీర్వచనం మొదలుపెట్టే ముందు, “బంధువులు, శ్రేయోభిలాషులలో ఎవరన్నా పెద్దవారు ఉంటే ఆశీస్సులు చెప్పవచ్చు” అన్నారు.
మురళి రామస్వామి స్వయంగా – శేషయ్యే తమకు పెద్దవారని, ఆయన సహస్ర చంద్ర దర్శనం చేసినవారని – అనటంతో, పురోహితులు శేషయ్యనే ఆశీస్సులు చెప్పమన్నారు.
“..నాకు మురళి రామస్వామిని చూస్తే ముచ్చటేస్తోంది. ఆయన నలుగురు పిల్లలు కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.. ‘మీరు ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నారయ్యా ‘అని వాళ్ళని అడిగాను.
ఇలా చేయటం పిల్లలుగా తమ ధర్మం అని పండితులు చెప్పారని, అందువల్లనే తాము వేర్వేరు నగరాల్లో, దేశాల్లో ఉన్నప్పటికీ ఇది చేసి తీరాలని అనుకున్నామని చెప్పారు. అలా పండితులు చెప్పారన్నంత మాత్రాన ఇవ్వాళ్టి రోజుల్లో అందరూ చేస్తారా? ఈ రోజుల్లో చదువుకున్న పిల్లలు ‘ఎందుకు చేయాలీ?’ అని అడుగుతారు కదా!…”
శేషయ్య ఆపారు.
అందరూ ఉత్సుకతతో వింటున్నారు. “పండితులు మంచిదని చెప్పారు కాబట్టి చేస్తారు, అంతేకదా” అని కొంతమందీ, “చేస్తే, ఆ ముసలివాళ్ళకి మంచిది కదా అని చేస్తున్నారేమో” అని కొంతమందీ అనుకుంటున్నారు.
“మనలో చాలామంది వయసు పైబడ్డ తల్లిదండ్రుల్ని- ‘చాదస్తం పెరిగిందనీ, నస భరించలేకపోతున్నామనీ’ – ఇలా రకరకాల కారణాలు చూపిస్తూ, వృద్ధ ఆదరణ కేంద్రాలకి తరలిస్తున్నాం. పోషించే శక్తి లేక కాదు, ఆసక్తి లేక. అలాంటి వాళ్ళని ఏమంటారో తెలుసా?” మళ్ళీ ఆపారు శేషయ్య.
అందరిలో ఉత్కంఠ… ఆతృత.
“వనవాసంలో ఉన్న పాండవుల్లో నలుగురు తమ్ముళ్ళూ త్రాగటానికి నీళ్ళు తెస్తామని వెళ్ళి, తేలేక విగతజీవులై మడుగు వద్ద పడి ఉంటే, ధర్మరాజు వెళ్ళాడు. యక్షుడు (యమధర్మరాజు) – తన ప్రశ్నలకి జవాబులిస్తేనే నీళ్ళు త్రాగనిస్తాను – అన్నాడు. ఆ ప్రశ్నల్లో ఒక ప్రశ్న ఇది: “బుద్ధిమంతుడై, ఇంద్రియసుఖాలను అనుభవిస్తూ, ఊపిరితీస్తూ కూడా జీవించనివాడెవడు?” …. విచిత్రంగా ఉంది కదా! శ్వాసిస్తూ జీవించనివాళ్ళు ఉంటారా?
ధర్మానికి ప్రతిరూపమైన ధర్మరాజు ఇలా చెప్పాడు :
“దేవతాతిథిభృత్యానాం పితౄణామాత్మనశ్చయః, న నిర్వపతి పంచానాం ఉఛ్చ్వసన్ న స జీవతి” – ఎవరైతే దేవతలను, అతిథులను, తల్లిదండ్రులను సేవించడో, ఆ వ్యక్తి (శ్వాసిస్తూ ఉన్నా) చచ్చినవాడితో సమానం…”
శేషయ్య రామస్వామి దంపతుల్ని, అతని పిల్లల్ని ఆశీర్వదించారు.
రవి దగ్గరికి వచ్చి, “మీ నాన్నగారి వయస్సెంత ఇప్పుడు?” అని చెవిలో అడిగారు.
రవి కళ్ళల్లో బాష్పాలు. గొంతు గాద్గదికమైంది.
“69 వచ్చే నెలతో నిండుతాయి… నాన్నని ఇంటికి తెచ్చేస్తాను. భీమరథ శాంతి మీ చేతులమీదుగా జరగాలి తాతగారూ”అంటూ రెండు చేతులూ జోడించాడు.