Site icon Sanchika

99 సెకన్ల కథ-42

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత, సంపాదకులు, పాత్రికేయులు జి. వల్లీశ్వర్ ’99 సెకన్ల కథ’ సిరీస్‌లో ఈ వారం రెండు కథలు సంచిక పాఠకులకు అందిస్తున్నారు. ఈ కథలు ప్రపంచతత్వాన్ని, మానవ మనస్తత్వాన్ని సూక్ష్మంగా ప్రదర్శిస్తాయి. [/box]

1. ఎంత పెద్ద నేరం చేస్తున్నాం!

[dropcap]ఒ[/dropcap]క పెద్ద ఇంజనీరింగ్ కళాశాల జనవరి 30 నాడు రజతోత్సవం జరుపుకుంటోంది.

‘వ్యక్తిత్వ వికాసం ‘గురించి విద్యార్ధుల్ని ఉద్దేశించి ప్రసంగించటానికి శేషయ్యగారిని ఆహ్వానించారు.

ఉదయం 11 గంటలకు సభ ఆరంభం కావాలి.

తొమ్మిదింటికే ఆయనకోసం కారు వెళ్ళింది. శేషయ్యని వెంటబెట్టుకు రావలసిన లెక్చరర్ చివరినిమిషంలో అస్వస్థతకి గురయ్యాడు.

“ఫరవాలేదు, డ్రైవర్ ని పంపండి చాలు” అన్నారు శేషయ్య.

***

శేషయ్యని తీసుకొని కారు నగరంలో బయల్దేరింది. అప్పటికే పదిదాటుతోంది. గంటలో సిటీ ట్రాఫిక్లోంచి బయటపడి, 30 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి.

కారు ఫ్లై ఓవర్ ఎక్కబోతూంటే, డ్రైవర్ అన్నాడు:

“సర్, వంతెన మీద ట్రాఫిక్ జాం అయినట్లుంది. పక్క బస్తీలోంచి దగ్గరదారిలో వెళ్దాం సర్.?”

“సరే” అన్నారు శేషయ్య.

బస్తీలోంచి వెళ్తుంటే … కారు స్లో అయింది.

ఒక హై స్కూలు బయట, ఆలస్యంగా వచ్చిన విద్యార్ధిని టీచర్ ‘ఎందుకు లేటుగా వచ్చావురా’ అని అడుగుతున్నాడు:

వాడు పొంతన లేని జవాబులిస్తున్నాడు. తెలిసిపోతోంది వాడు అసత్యాన్ని నిర్భయంగా పలుకుతున్నాడు.

కారు ఆ బస్తీలోనే నాలుగైదు రోడ్లు మలుపులు తిరిగి, ఒక చిన్న పార్కు ముందు ఆగింది.

“సర్, ఇప్పుడే వస్తాను సర్” అంటూ డ్రైవర్ కారులోంచి ఒక గిఫ్ట్ ప్యాకెట్ తీసుకుని, పార్కు ఎదురుగా సందులోకి వెళ్లాడు.

అంతలో శేషయ్య దృష్టి ఎదురుగా ఒక పాక ముందు గొడవపడుతున్న భార్యాభర్తల మీద పడింది. ఆమె వాడి చొక్కాపట్టుకుని గుంజుతోంది.

“ఏరా, మళ్ళీ రాత్రి దాని దగ్గరకి పోయావా? ఆ ముండే కావాలనుకుంటే నన్నెందుకు మనువాడావురా?…”

వాడు అడ్డంగా దొరికిపోయినట్లున్నాడు. “అబ్బె, ఉత్తుత్తినే వెళ్ళానే. అదంటే అంత మోజు లేదే…” అని సమర్ధించుకోవాలని తాపత్రయపడుతున్నాడు. నలుగురిముందూ ఆమె “అబద్ధాలాడతావురా దొంగ సచ్చినోడా…!” అంటూ ఉతికేస్తోంది.

అంతలో డ్రైవర్ వచ్చాడు.

“సారీ సర్” అంటూ కారు స్టార్ట్ చేస్తున్నాడు. వాడి వెనకాలే పదేళ్ళ పాప (వాడి కూతురు కావచ్చు)

సందు మొదలుదాకా వచ్చి, ఆ గిఫ్ట్ ప్యాకెట్ చూపిస్తూ, “థాంక్స్ ఫర్ బర్త్ డే గిఫ్ట్ నాన్నా” అంటోంది ఆనందంగా.

శేషయ్యకి అర్థమైంది డ్రైవర్ కారుని ఇటు ఎందుకు తెచ్చాడో.

క్షణాల్లో కారు వేగం పుంజుకొని మెయిన్ రోడ్డు ఎక్కేసింది.

శేషయ్య మనసులో ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి.

***

10 నిమిషాలు ఆలస్యంగా వాళ్ళ కారు కళాశాల ఆడిటోరియం చేరుకుంది.

కళాశాల అధ్యక్షుడు సహా పాలకవర్గం అంతా సాదరంగా శేషయ్యని స్వాగతించారు. విద్యార్ధులు దారిపొడవునా పూలు జల్లుతున్నారు. వాళ్ళల్లో వంగపండురంగు ఓణీ అమ్మాయి శేషయ్య దృష్టిని ఆకర్షించింది.

శేషయ్య కారు దిగి అడుగు ముందుకు వేస్తుంటే వెనకాల ప్రిన్సిపాల్ ప్రశ్నకి డ్రైవర్ చెబుతున్న జవాబు వినబడుతోంది. “ఫ్లై ఓవర్ మీద ట్రాఫిక్ జాం వల్లే లేటయింది సర్…”

***

ఒక యువ అధ్యాపకురాలు ‘జ్యోతి ప్రజ్వలనం’ ప్రకటించింది.

అది అవగానే, అధ్యక్షులు ఆ అధ్యాపకురాలిని పిలిచి చెవిలో అడుగుతున్నారు: “వందేమాతరం ఉందిగా! పాడించలేదే?”

“సారీ సర్. ఆ పాడాల్సిన అమ్మాయి లేటుగా ఇప్పుడే వచ్చింది. పాడిస్తాను” అంది అతి వినయంగా ఆయన చెవిలో. ఎవరికీ వినబడలేదు పక్క సీట్లో కూర్చున్న శేషయ్యకి తప్ప.

“ఇప్పుడు వందేమాతరం …” ప్రకటించింది.

ఆ వంగపండు ఓణీ అమ్మాయి వేదిక ఎక్కింది. శేషయ్య భ్రుకుటి ముడిపడింది.

‘ఈ అమ్మాయి తాను వచ్చేసరికే ఉంది కదా! లేటుగా వచ్చిందనటమేమిటి?’ …

ఆ అమ్మాయి శ్రావ్యంగా గీతాన్ని ఆలపించింది.

శేషయ్య ప్రసంగం మొదలైంది:

“మీరంతా మా తరం కన్నా తెలివైన వాళ్ళు. మాతరం వాళ్ళం మీ వయస్సులో తప్పు చేయటానికి భయపడేవాళ్ళం. మీరు నేరం చేయటానికి కూడా భయపడటం లేదు…! (సభలో నిశ్శబ్దం.)

మీరు ఎంతపెద్ద నేరస్థులు అవుతున్నారంటే …(ఉత్కంఠ)… మనిషి పతనానికి కారణమైన ఒక దుర్గుణం ‘అసత్యం’ ఆడటం. ప్రతిచిన్నదానికీ ‘అసత్యం’ చెప్పేస్తున్నాం. అది తప్పుకాదు అనుకుంటున్నాం. తల్లిదండ్రులతో, మిత్రులతో, భార్యతో, భర్తతో …. !

అబద్ధం చెప్పటం చిన్న విషయం అనుకుంటున్నాం. వ్యాసుడు ధృతరాష్టృడికి చెప్పాడు. శ్రీకృష్ణుడు గీతలో చెప్పాడు. రామాయణంలో అరణ్యవాసానికి వెళ్తూ రాముడు చెప్పాడు. సత్యం స్థిరమైంది. దాన్ని దాచిపెట్టి అసత్యం పలకటం వల్ల మన వ్యక్తిత్వం దిగజారుతుంది. ఆ రుగ్మత క్యాన్సర్ లాంటిది. ఒంటినిండా వ్యాపించి, అసత్యం తప్పుకాదనే విశ్వాసాన్ని పెంచి, అతి తరచుగా అనేక విషయాల్లో మనల్ని నేరస్థుల్ని చేస్తుంది…. (ఒక్క చినుకు కురిసినా వినబడే నిశ్శబ్దం)… మీలో ప్రతి ఒక్కరూ మోహన్ దాస్ కరంచంద్ గాంధీ కాగలరు – సత్యం మాత్రమే మీ జీవనసరళిగా చేసుకోగలిగితే….”

అధ్యక్షుడు సహా అంతా నిలబడి కరతాళధ్వనులు చేశారు.

2. మంత్రి కూతురికి అవమానం!

తిరుమల తిరుపతి దేవస్థానాల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కార్యాలయానికి ఒక ఫోన్ కాల్ వచ్చింది.

ఇ.ఓ ప్రసాద్ గారి క్యాంపుక్లర్కు నారాయణ ఫోన్ ఎత్తాడు.

ఆ కాల్ వినగానే ఖంగారు పడిపోయాడు.

వెంటనే తిరుమల కొండమీద ఉన్న ఇ.ఓ గారికి ఫోన్ చేసి చెప్పాడు.

ఆయన అంతా విని, ఏం చేయాలో నారాయణకి చెప్పేశాడు.

ఆ ఆదేశాల ప్రకారం, నారాయణ ఒక ఎయిర్ కండిషండ్ కారును ఒక అసిస్టెంట్ ఇ.ఓ తో రైల్వే స్టేషనుకి పంపాడు.

ఓ 40 నిమిషాల తరువాత …

టిప్ టాప్‌గా ముస్తాబయిన పాతికేళ్ళ నీలవేణి కొండమీద విఐపిలు ఉండే పద్మావతి అతిథి భవనం ముందు కారు దిగింది.

“అమ్మా, తమరు ఎప్పుడు దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నారో చెబితే ఏర్పాటు చేస్తాం! ఇంకేమైనా సేవలు చేయాలనుకుంటుంటే, నాకు చెబితే, ఇ.ఓ గారికి చెప్పి, ఏర్పాటు చేస్తాం…”

ఆ నీలవేణి హుందాగా తల ఊపింది. తన చలువ కళ్ళద్దాల్లోంచే చూస్తూ, “మేం సిద్ధమయ్యాక చెబుతాం..” అంటూ తన విఐపి సూటులోకి ఠీవిగా నడిచింది.

***

ఒక గంట తరువాత తిరుమల ఆలయంలోని పేష్కారు కృష్ణస్వామికి కబురు వెళ్ళింది.

“కేంద్రమంత్రి స్వామినాథన్ గారి అమ్మాయి బ్రేక్ దర్శనానికి వస్తున్నారు. ఇ.ఓ గారి ఆదేశాల ప్రకారం హారతి దర్శనం ఏర్పాటు చేయించండి… స్పెషల్ ప్రసాదాలను బుట్టలో వారి సూటుకి పంపించండి…”

***

నీలవేణి పట్టుచీర ధరించి, దక్షిణ మాడవీధి వైపు కారు దిగింది. అక్కడ మెట్లు దిగి, ఆలయ సిబ్బంది దారి చూపిస్తుంటే, మహద్వారం చేరుకుంది.

సుతారంగా చీరె కుచ్చెళ్ళు పైకి ఎత్తిపట్టి, మహద్వారం ముందు పాదాలు కడుక్కుంది.

మహద్వారపు గడపకు నమస్కరించింది.

అక్కడ్నుంచి టకటకా ఆలయ పేష్కారు సారథ్యంలో, సిబ్బంది ఆమెను గరుడాళ్వార్ సన్నిధికి తీసుకెళ్ళారు…

నీలిరంగు పట్టు చీరెలో ధగధగా మెరిసిపోతున్న నీలవేణిని క్యూలో ఉన్న భక్తులు, ఆలయ సిబ్బంది కళ్ళప్పగించి చూస్తున్నారు.

గరుడాళ్వారుని దర్శించి, జయ విజయుల సన్నిధిలోంచి మెల్లగా నీలవేణి అపర మీరాబాయిలా ‘తన్మయత్వంతో ‘ రాములవారి మేడ దాటి గర్భగుడి ముందు నిలబడిపోయింది.

అర్చకులు హారతి ఇచ్చారు…

అక్కడే తీర్థం ఇచ్చారు …

చటారం ఇచ్చారు …

…. నిమిషం …. 2 నిమిషాలు …. 4 నిమిషాలు … నీలవేణిని అర్చకులు “అమ్మా” అంటూ జాగృదావస్థలోకి పిలవబోయారు.

పేష్కార్ కళ్ళతోనే వారించారు.

***

ఓ పదినిమిషాల తరువాత వకుళమాత సన్నిథి, అద్దాలమహలు, రంగమంటపం వగైరా అన్నీ చూపించారు.

ప్రసాదాలు తినిపించారు.

ఆలయదర్శనం తరువాత ఏక శిలా తోరణం, పాపనాశనం వగైరా తిప్పారు.

మధ్యాహ్నం భోజనం, విరామం … బాగా జరిగిపోయాయి.

కాని ఆ రాత్రి ఒక ఘోరం ‘జరిగింది.’

మరునాడు ఉదయమే పద్మావతి అతిథి భవనంలోంచి గగ్గోలు మొదలైంది.

టిటిడి సిబ్బంది హుటాహుటిన ఇ.ఓ గారి దృష్టికి తీసుకు వెళ్ళారు.

మరో 20 నిమిషాల్లో క్రైం బ్రాంచ్ ఇనస్పెక్టర్ రంగప్రవేశం చేశారు.

“What is this nonsense? నా డజను బంగారు గాజులు, గొలుసు, బ్రేస్‌లెట్, పట్టు చీరలు …అన్నీ దోచేశారు దొంగలు. ఇదేం టిటిడి? ఇక్కడ అసలు పాలన ఉందా ? ఎవరు ఇ.ఓ? కేంద్రమంత్రి కూతురికి ఇంత అవమానమా?…. “

నీలవేణి కేకలు, అరుపులు బయటకు వినిపిస్తున్నాయి.

విషయం తిరుపతిలో అడిషనల్ ఎస్‌ పి రావు దృష్టికి వెళ్ళింది. “దర్యాప్తు చేయిస్తాం మేడం. కొంచెం సమయం పడుతుంది…” అంటూ ఆయన నచ్చజెప్పబోయాడు.

“సారీ, నేను ఈ సాయంత్రం సప్తగిరి ట్రైనులో మెడ్రాస్ వెళ్ళాలి. మా డాడీ బంధువుల ఇంట్లో పెళ్ళి ఉంది … నాకు వెంటనే మీరు పరిష్కారం చేయాలి…. ” కేంద్రమంత్రికుమార్తె తన అధికార దర్పాన్ని ప్రదర్శించింది.

“సరే” అన్నారు అడిషనల్ ఎస్ పి రావు చేసేదేమీ లేక.

మధ్యాహ్నం రెండయింది … మూడయింది … అయిదింటికే ట్రైన్ !!!

“మీరు స్టేషనుకి వెళ్ళేసరికి నేను ఏర్పాటు చేస్తాను. నమ్మండి…” అని రావుగారు కబురు పంపారు.

ఆమె కారులో స్టేషనుకి బయల్దేరింది.

***

నీలవేణి కోరుకున్నట్లే ఆమె ‘సప్తగిరి’ ఎక్కేలోపల అడిషనల్ ఎస్ పి రావుగారు ఆమె కేసును పరిష్కరించారు.

ఆమె ట్రైన్ ఎక్కగానే వెళ్ళి ఆమెకి బహూకరించారు ….. ఉక్కు ‘అరదండాలు!’

***

“మీ అమ్మాయి ఆభరణాల చోరీ విషయంలో మేం చాలా కష్టపడుతున్నాం. శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం. మీ అమ్మాయికి నచ్చజెప్పండి. రెండు మూడురోజుల్లో ఈ కేసుని ఛేదిస్తాం…” అంటూ రావుగారు పంపిన టెలెక్స్ సందేశానికి ఢిల్లీలోని కేంద్రమంత్రి స్వామినాథన్ కార్యాలయం ఇచ్చిన టెలెక్స్ జవాబు:

“మంత్రిగారికి అసలు ఆడపిల్లలే లేరు.”

~ ~

(1981-82లో జరిగిన ఘటన ఆధారం)

Exit mobile version