[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత, సంపాదకులు, పాత్రికేయులు జి. వల్లీశ్వర్ ’99 సెకన్ల కథ’ సిరీస్‌లో ఈ వారం రెండు కథలు సంచిక పాఠకులకు అందిస్తున్నారు. ఈ కథలు ప్రపంచతత్వాన్ని, మానవ మనస్తత్వాన్ని సూక్ష్మంగా ప్రదర్శిస్తాయి. [/box]
1. రాముడూ ఇలాగే చేశాడు!
[dropcap]ఏ[/dropcap]ప్రిల్ చివరి వారంలో ఒక సాయంత్రం:
“జీవాత్మ స్వచ్ఛమైనదే. ఎలాంటి మాలిన్యం లేనిదే. కాని ఇంద్రియ వాసనలతోనిండిన ఈ శరీరంలో చేరాక, ఆ వాసనల తాలూకు భావోద్వేగాల ప్రభావానికి గురవుతుంది….” అంటూ ఉద్ధవుడికి కృష్ణ పరమాత్మ చెప్పిన గీతని రసవత్తరంగా చెబుతున్నారు శ్రోతలకి శాస్త్రిగారు.
పరమ భాగవతోత్తముడు గుండి రాజన్న శాస్త్రి ధర్మపురిలో నృసింహస్వామి క్షేత్రంలో రోజూభాగవత ప్రవచనం చేసే రోజులవి.
కరీంనగర్ నుంచి 70 ఏళ్ళ పురుషోత్తమరావు చాలా ఆందోళనగా వచ్చాడు. వస్తూనే శాస్త్రిగారి కాళ్ళమీద పడ్డాడు. దుఃఖంతో కన్నీళ్ళు కారుస్తున్నాడు.
శాస్త్రిగారి పురాణం వింటున్న వాళ్ళంతా విస్తుపోయారు. పురుషోత్తమరావు పారిశ్రామికవేత్త. ధర్మపరుడని పేరున్న వ్యక్తి. అంతటివాడు ఇలా వచ్చి శాస్త్రిగారి పాదాల్నిదుఃఖబాష్పాలతో కడగటమేమిటి?
“ఏం జరిగింది పురుషోత్తం గారు?” ప్రశాంత చిత్తంతో శాస్త్రిగారు అడిగారు.
పురుషోత్తం కొంచెం తేరుకున్నాక అపరాధభావనతో చెప్పాడు.
“నేను చాలా తప్పు చేశాను. నా రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడిని అపార్థం చేసుకొని, అనరాని మాటలు అన్నాను. వాడిని ఏడ్పించేశాను..”
ధర్మపరుడైన పురుషోత్తం నోట ఈ మాటలు విని, అంతా ఆశ్చర్యంగా, ఉత్కంఠగా వింటున్నారు.
“మీరు అలా చేశారంటే నమ్మలేకపోతున్నాను” అన్నారు శాస్త్రిగారు.
“రెండువారాల క్రితం నా ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరిగింది…. ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ కోసం పత్రాలు సిద్ధం చేయాలని తమ్ముడికి చెప్పాను. కాని, రెండు రోజుల తరువాత వాడు మార్చిలో కట్టిన ప్రీమియం రశీదులు కనబడటం లేదన్నాడు. నాకు వాడి వైఖరిమీద అనుమానం వచ్చింది…”
“అతను మంచివాడే కదా!”
“కాని, గత కొన్ని మాసాలుగా అతను వ్యాపారంలో కొత్తగా నాకు పోటీ వస్తున్న ఒక అగర్వాల్‌తో కలిసి తిరుగుతూండటం చూస్తున్నాను. అడిగితే, స్కూల్లో తన సహాధ్యాయికి తమ్ముడనీ, అంతకుమించి ఏమీ లేదనీ అన్నాడు. ఇప్పుడు ఇన్స్యూరెన్స్ పత్రాల గురించి అడిగితే ఇలా చెప్పి, ఆ అగర్వాల్‌తో కలిసి ఏదో పెళ్ళికి వెళ్ళొస్తానని వెళ్ళాడు….”
“ఇన్స్యూరెన్స్ కంపెనీలోనే రశీదు నకలు అడిగితే ఇవ్వరా?”
“ఇస్తారు. కాని నాలుగు రోజులుగా కంపెనీలో జాతీయ స్థాయిలో సమ్మె జరుగుతోంది. నాలో తమ్ముడి వైఖరి మీద అనుమానం బలపడిపోయింది. అగ్నిప్రమాదం బాధలో సహనం కోల్పోయాను. నిరాశ నిస్పృహలో మునిగిపోయాను. వాడు ఊరినుంచి రాగానే, కృతఘ్నుడనీ, విశ్వాసఘాతకుడనీ, తల్లి పాలు త్రాగి రొమ్ము గుద్దే …… ఎన్నెన్ని మాటలో అన్నాను…..” ఏడ్చేశాడు పురుషోత్తం.
“ఇప్పుడు బాధ ఎందుకు?”
ఎలాంటి ఉద్వేగం లేకుండా అడిగారు శాస్త్రిగారు.
“తమ్ముడు ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ పత్రాలన్నీ సక్రమంగా తయారు చేసి తెచ్చాడు. రశీదులన్నీఉన్నాయి. ప్రమాదం సర్వే కూడా అనుకూలంగా ఉండేలా ఫొటోలు సిద్ధం చేశాడు… కాని, నేను ఎంత దుర్మార్గుడిని. వాడిని అపార్థం చేసుకొని …! పాపం చేశాను స్వామీ. (దుఃఖం).. దీనికి నిష్కృతి చెప్పండి… చెప్పండి”
అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు – గురువుగారు ఏం చెబుతారు.
శాస్త్రిగారు చిరునవ్వు నవ్వారు.
“అవతారపురుషుడిగా మనమంతా పూజించే రాముడే అపార్థం చేసుకున్నాడు. మనమెంత?”
పురుషోత్తం ఏడుపు ఆపేశాడు. ప్రశ్నార్థకంగా తలెత్తి చూశాడు. అందరిలో ఉత్సుకత పెరిగింది.
“మాయ జింక కారణంగా సీతని కోల్పోయి, రాముడు దండకారణ్యం అంతా మతిస్థిమితం కోల్పోయినవాడిలా తిరుగుతూంటే, రెక్కలు తెగి పర్వతశిఖరంలా నేలకూలి, నోటినుంచి రక్తం కక్కుతున్న జటాయువుని చూశాడు. చూస్తూనే లక్ష్మణుడితో ఆవేశంగా అన్నాడు: ‘గృధ్రరూపం ఇదం రక్షో వ్యక్తం భవతి కాననే; భక్షయిత్వా విశాలాక్షీమ్ ఆస్తే సీతామ్ యథాసుఖమ్; ఏవం వధిష్యే దీప్తాస్త్యైః ఘోరైర్బాణైరజిహ్మగైః ‘ – గ్రద్ద రూపంలో ఉన్న ఈ రాక్షసుడే సీతని భక్షించి, సుఖంగా కూర్చున్నాడు. వీడిని ఇప్పుడే వధిస్తాను’ అంటూ ధనుస్సు ఎక్కుపెట్టి జటాయువు మీదకి వెళ్ళబోయాడు. …”
అందరికీ ఆశ్చర్యం, ఆదుర్దా! సీతని రక్షించడం కోసం రావణుడితో భీకరంగా పోరాడిన జటాయువుని రాముడు చంపాలనుకున్నాడా?
శాస్త్రిగారు చెబుతూనే ఉన్నారు.
“కాని ఆ జటాయువు చెబితేనే రాముడికి తెలిసింది – తన సీతని అపహరించిన వాడు రావణుడు అనే అసురుడు….”
పురుషోత్తముడిలో ఏదో స్వాంతన.
“అనుమానాలు, అపార్థాలు మానవ సహజం. కాని ఆత్మవిమర్శ చేసుకోవటం, పశ్చాత్తాపంతో తప్పును సరిచేసుకోవటం వివేకవంతులు చేయాల్సిన పని. రాముడు కూడా తన తొందరపాటుకి బాధపడ్డాడు. ప్రేమతో జటాయువుని ఆలింగనం చేసుకున్నాడు. రాముడి ప్రేమ వల్ల జటాయువు ఉత్తమగతులు పొందాడు…”
పురుషోత్తముడిలో ఒక మనోవికాసం.
“అర్థమైంది స్వామీ” అంటూ శాస్త్రిగారికి పాదాభివందనం చేశాడు.
ఆయన ఆశీర్వదించారు.
(ధర్మపురిలో గోదావరి తీరాన రాజన్న శాస్త్రికి గుడి కట్టారు ధర్మపురివాసులు.)
2. ఆశావాది – నిరాశావాది
చాలా ఇష్టపడి గొప్ప పాత్రికేయుడు కావాలని హై స్కూలు స్థాయినుంచి కలలుకని, కమ్యూనికేషన్స్ – జర్నలిజంలో పోస్టు గ్రాడ్యుయేషన్ చేసి, ఢిల్లీ యూనివర్సిటీ స్థాయిలో బంగారు పతకం పొందిన ఆనందంతో ఊగిపోయాడు ఆనందరావు.
చిన్నతనం నుంచి తన కలలకి ప్రోత్సాహం ఇచ్చిన తాతగారు శేషయ్యకి ఆనందరావు మెయిల్ రాశాడు:
“‘ఢిల్లీ క్రానికల్’ పత్రిక ఎడిటర్ నాకు ఎడిటోరియల్ అసిస్టెంట్ పోస్టు ఆఫర్ చేశారు… ఏనుగెక్కినంత ఆనందంగా ఉంది. మీ ఆశీస్సులు ఎప్పుడూ నాతో ఉండాలి…”
“ఈ వృత్తి ఎప్పటికీ నీకు ఇదే ఆనందం ఇవ్వాలి గాక” అంటూ శేషయ్య ఆశీస్సులు పంపారు.
***
రెండేళ్ళు గడిచాయి. మధ్య మధ్యలో ఆనంద్ తాను ఏయే మీడియా సంస్థలు మారుతున్నాడో శేషయ్యకి రాస్తున్నాడు. తనకి సంతృప్తినిచ్చిన ఇంటర్వ్యూలు, ప్రయోగాలు కూడా రాస్తూ వచ్చాడు.
అకస్మాత్తుగా ఒక రోజు శేషయ్యకి ఫోన్ చేశాడు.
“తాతగారు, నేను ఈ వృత్తిని వదిలేసి, ఇంకేదైనా వృత్తిలోకి వెళ్ళిపోవాలనుకుంటున్నాను…”
శేషయ్య నవ్వారు.
“అర్థమైంది… అయినా నువ్వు చెప్పు. బాల్యం నుంచి ఇది ఒక గొప్ప వృత్తిగా భావించి వీరావేశంతో ఇందులో ప్రవేశించావు గదా! ఇప్పుడేమైంది?”
ఆనంద్ చెప్పసాగాడు:
మొదట చేరిన పత్రిక వాళ్ళు చాలా త్వరగా నాకు మేథావిగా ముద్ర వేశారు. నేను రాసిన వ్యాసాలు మంచి గుర్తింపు తెచ్చాయి… కాని, మేనేజిమెంట్ తరచుగా నన్ను తమ వ్యాపారప్రయోజనాలకు అనుగుణంగా వ్యాసాలు రాయాలని పరోక్షంగా సూచించేది. అప్పుడప్పుడు ఎడిటర్ చేత చెప్పించేది. నాకు నచ్చలేదు. కొంతకాలం అయిష్టంగా రాశాను. అంతరాత్మని చంపుకొని రాయలేక బయటకొచ్చేశాను…
(శేషయ్య మళ్ళీ నవ్వారు. “తరువాత?”)
‘ది ఎకనామిక్ వరల్డ్’ లో స్పెషల్ కరస్పాండెంటుగా ఆహ్వానించారు. చాలా పరిణామాలను ముందస్తుగానే పసిగట్టి స్టోరీలు రాశాను. క్రమంగా కొన్ని పెద్ద వ్యాపార సంస్థల మేనేజిమెంట్లు నన్ను విందులకు ఆహ్వానించేవి. ఖరీదైన బహుమతులిచ్చేవి. ప్రభుత్వవిధాన ప్రకటనలు ‘ఎలా ఉంటే దేశానికి (తమకి) మంచిదో’ చెప్పి అందుకు తగినట్లుగా నేను నా శీర్షికలో వ్యాసాలు రాయాలని ఆశించేవి… మా ఎడిటర్‌కి చెప్పేవాడిని. ‘ఫరవాలేదయ్యా, మన వ్యాపార ప్రయోజనాలకి భంగం కలగనంతవరకూ రాయొచ్చు. వాళ్ళు మనకి పేజీలకి పేజీలు ప్రకటనలిస్తున్నారు కదా…!’ అనేవాడు… నా అంతరాత్మ కోరుకున్న వృత్తి ఇదా! బయటకొచ్చేశాను…
(శేషయ్య నవ్వారు. ‘అప్పుడు…?’)
‘మేరా దేశ్ ‘ అనే ప్రముఖ టెలివిజన్ న్యూస్ ఛానల్ నన్ను ఎడిటర్‌గా పిలిచింది. చాలాపెద్ద జీతం. హోదా, కారు, సెక్రెటరీ… అన్నీ బాగున్నాయి. పెద్ద పెద్ద నాయకులతో, ఆర్థికనిపుణులతో చర్చలు, ముఖాముఖీలు చాలా చేశాను. ఎంతో ఆనందం పొందాను. కాని, ఎన్నికలు రాగానే…
(శేషయ్య అందుకున్నారు: ‘ఫలానా పార్టీ ప్రయోజనాలకు అనుకూలంగా ప్రజాభిప్రాయాన్ని ప్రోది చేయాలని వత్తిడి తెచ్చుంటారు. రాజీనామా చేసి ఉంటావ్ ! అంతేనా?’)
ఆనందరావు సంభ్రమంలో మునిగిపోయాడు.
***
“ఆనంద్, నీ అంతరాత్మ ఇంకా బ్రతికే ఉన్నందుకు గర్వపడుతున్నాను. ఈ వృత్తి నీ బాల్యంలో నిన్ను ప్రభావితం చేసినప్పటిలా ఇప్పుడు లేదు. నిజమే. కాని ఏ వృత్తి గొప్పగా ఉంది? విద్యారంగంలో కీచక ఉపాధ్యాయులు, వైద్య వృత్తిని వ్యాపారంగా మార్చుకున్నడాక్టర్లు, లంచం తీసుకొని బెయిలు మంజూరు చేస్తున్న న్యాయమూర్తులు…. చెప్పు, ఏ వృత్తి కశ్మల రహితంగా ఉంది?”
“కాని జర్నలిజం విషయం వేరు. నువ్వు చెప్పిన మేనేజిమెంట్ల ప్రయోజనాల కథలు టెలివిజన్ ఛానల్సులో అయినా, పత్రికలలో అయినా – ఈ దేశంలో నడుస్తున్న చరిత్రలోమహా అయితే 10 శాతం. లేదా 20 శాతం! మిగతా ప్రపంచంలో ప్రజా సమస్యలు కోకొల్లలు. ఒక్క వార్తతో ప్రభుత్వాలు కూలిపోవచ్చు… ప్రజా సమస్యలు పరిష్కారం కావచ్చు… ఎన్నోకుంభకోణాలు వెలికిరావచ్చు…”
“ఆనంద్, నిరాశావాది ఎప్పుడూ పలాయనవాదాన్నే ఎంచుకుంటాడు. నీ వృత్తి చాలా గొప్పది. దాన్ని ప్రేమిస్తూనే ఆశావాదంతో ముందుకు వెళ్ళు. దేశం గర్వపడే విజయాలు సాధిస్తావు… స్వామి వివేకానంద చెప్పారు. లక్ష్యం మీదే దృష్టి పెట్టి అడుగు ముందుకు వేస్తుంటే, గోతులు, రాళ్ళూ అన్నీ నీ కాళ్ళక్రింద నుంచి నీ వెనక్కి పరుగెడతాయి…”
ఆనందరావులో కొత్త యువ జర్నలిస్టు మేల్కొన్నాడు. మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు.