99 సెకన్ల కథ-44

0
2

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత, సంపాదకులు, పాత్రికేయులు జి. వల్లీశ్వర్ ’99 సెకన్ల కథ’ సిరీస్‌లో ఈ వారం రెండు కథలు సంచిక పాఠకులకు అందిస్తున్నారు. ఈ కథలు ప్రపంచతత్వాన్ని, మానవ మనస్తత్వాన్ని సూక్ష్మంగా ప్రదర్శిస్తాయి. [/box]

1. వాయస ప్రపంచం!

[dropcap]శం[/dropcap]కర్ తన భార్య అనసూయతో కలిసి, వారం రోజుల తరువాత ఇంటికి వచ్చాడు.

సాయంత్రం అయిదు గంటలవేళ వాళ్ళు కారు దిగుతూంటే, ఆ వీధిలో వీళ్ళ రాకని (ఆ కారు హారన్నిబట్టే) గుర్తు పట్టేశాయి ఇరుగుపొరుగు ‘వాయసాలు.’

అంతే!

ఎదురింటి సావిత్రి, పక్కింటి పాండురంగారావు, ఆ పక్కనే వున్న అపార్టుమెంటులో అప్పారావు, వాళ్ళింటి వాచ్‌మ్యాన్… ఇలా అప్పటిదాకా వీధిలో దిక్కులు చూస్తూనో, బండి మీద కూరలు కొంటూనో, ఇచ్చకాలు కబుర్లు చెప్పుకుంటూనో నిలబడి ఉన్న ‘వాయస ‘ ప్రపంచం అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

గబగబా ఇళ్ళల్లోకి పరుగెత్తారు.

‘ధభీ … ధభీ ‘ అంటూ తలుపులు మూసేశారు.

ఇంక, శంకర్ ఇంటి మేడమీద ఉండే బాలాజీ అయితే, వీధిలో బ్యాడ్మింటన్ ఆడుతున్న తన పిల్లల్ని బరబరా ఇంట్లోకి లాక్కువెళ్ళిపోయాడు.

శంకర్ కూతురు హేమ కారులోంచి అమ్మా నాన్నల సామాను దించింది.

అనసూయకి ఆ కాలనీలో చాలా గొప్ప పేరు. దేవీ ఉపాసకురాలని ఆ కాలనీ వాళ్ళంతా అనసూయ కనబడగానే భక్తితో నమస్కారాలు చేసేస్తుంటారు. అలాంటిది, ఒక్కసారిగా వీథిలో ఇరుగుపొరుగున ఉన్న వాళ్ళు ఇలా అకస్మాత్తుగా తన మొహం మీదే తలుపులు మూసుకోవటం అనసూయకి బాధ కలిగించింది.

తమ ఫ్లాటులోకి వెళ్ళగానే, అనసూయమ్మకి ఏడుపు వచ్చింది.

“ఎందుకేడుస్తావు? ఇప్పుడు మీకేమీ కాలేదు. హాయిగా విశ్రాంతి తీసుకోండి…” అంటూ కూతురు హేమ సముదాయించాలని చూసింది.

ఆ రాత్రి ఎలాగో గడిచింది.

తెల్లవారగానే అనసూయ అదంతా మర్చిపోయింది.

కాని, పొద్దుటే పనిలోకి వచ్చిన పనిమనిషి మాత్రం, “అమ్మా, మీ ఇంటికి పనికి వెళ్తే, వాళ్ళింటికి పనికి రావద్దని ఆ సావిత్రిగారు, ఆ పక్క వాళ్ళు, ఈ పక్క వాళ్ళూ… చెప్పారు, అయినా నేను వస్తాలే అమ్మా” అంటూ మూతిముసుగు ధరించి, గిన్నెలు తోమేసి వెళ్ళిపోయింది లక్ష్మి.

ఇక ఆపూట ఆ ఇంట్లో అంతా చికాకు, చికాకుగా గడిచింది.

***

రెండో రోజు గడిచేసరికి చాలా విషయాలు బయట పడ్డాయి.

గుడికి అనసూయ ఫోను చేసింది.

ఆ పూజారి సన్నగా ఒక మాట చెప్పాడు:

“అమ్మా, మీకు కొరోనా వచ్చిందటగదా… ఎదురింటి శ్రీను ఓ వారం క్రితం హడావుడిగా వచ్చి చెప్పి వెళ్ళాడు… భక్తుల్లో అంతా ఇదే చెప్పుకొంటున్నారు. మీరు కొన్నాళ్ళపాటు గుడికి రాకపోవటం మంచిదేమో …!”

శంకరానికి మండి పోయింది.

అనసూయకి కాలిపోయింది.

“వెధవ గోల, ఇంత చిన్న ఊళ్ళో ఇలా కాక ఎలా అనుకుంటారు! ఈ చెత్త అంతా పట్టించుకోకండి..”అంటూ అమ్మానాన్నల కోసం బెంగుళూరు నుంచి వచ్చి కష్టపడుతున్న కూతురు హేమ ఉద్బోధ చేసింది. పైగా అమెరికాలో ఉండే సోదరుడికి ఫోను చేసి మరీ ఈ సొదంతా వినిపించింది. వాడు ఇంకా ఉదారంగా,  

“అందుకే మీరు అమెరికా వచ్చేయాలమ్మా” అంటూ సలహా విసిరాడు.

శంకరానికి నాలుగో రోజుకి ఇంకా కొన్ని విషయాలు తెలిశాయి. తనతో చాలా సన్నిహితంగా ఉండే కళ్యాణ్, బ్యాంకు రామచంద్ర రావు, దూరపు బంధువు సుబ్బరామయ్య – అంతా ఆ కాలనీలో వాళ్ళే – ప్రతి వాడు మరొకడితో చెప్పాడట: “వీళ్ళకి కొరొనా వచ్చిందిట. తెలుసా?”

శంకరం వయసు అరవైఅయిదు దాటినా చురుకుదనం చావలేదు. అందుకే, అసలు ఎవడు పుట్టించాడు ఇది ‘కొరొనా’ అని పరిశోధన మొదలు పెట్టాడు.

“నీకు అలా ఎవడు చెప్పాడు?” అని ఎవర్ని అడిగినా, ఫలావా వాడు లేక ఫలానా ఆమె ద్వారా తెలిసింది అని చెప్పేస్తున్నారు.

శంకర్ మళ్ళీ వాళ్ళని అడగటం, వాళ్ళూ అలాగే చెప్పటం, మళ్ళీ మొదటివాళ్ళదగ్గరకే రావటం … ఇదే జరుగుతోంది. శంకరానికి ఏమీ అర్థం కావటం లేదు.

ఈలోగా అనసూయమ్మ వీధిలోకొస్తే చాలు, స్నేహితురాళ్ళు మొహాలు తిప్పేసుకోవటం… గుడి కెళ్తే కుర్ర పూజారి ఆరడుగుల దూరం నుంచే అక్షతలు ఆమె తల మీదకి విసరటం ….!

“మీరు ఈ వెధవ ప్రచారం చేసిన వాళ్ళెవరో కనుక్కుని తేల్చాల్సిందే” అంటూ అనసూయమ్మ శంకర్ ముందు పట్టుబట్టింది.

వారం గడిచిపోయింది. వాళ్ళిద్దర్నీ హేమ డాక్టరుకి చూపించింది. ఆయన, “ఇద్దరూ అద్భుతంగా ఉన్నారమ్మా. వాళ్ళు హాయిగా బయట తిరగొచ్చు. నువ్వు మీ ఊరు వెళ్ళొచ్చు” అని తేల్చి చెప్పేశాడు.

కాని ‘వాయసాల ‘ ప్రచారం ఆగలేదు.

బెంగుళూరికి వెళ్ళే ముందు హేమ ఈ విషయం మీద నడుం కట్టింది.

మరునాడు పనిమనిషి లక్ష్మిని పక్కకి తీసుకెళ్ళింది.

“లక్ష్మి, మా అమ్మానాన్నలకి వచ్చింది మామూలు జ్వరమే. 100 డిగ్రీలు దాటేసిందనేసరికి నేను ఖంగారుపడి వచ్చి, హాస్పిటల్లో చేర్చాను. నాలుగు రోజుల్లో వాళ్ళు ఇంటికి వచ్చేశారు కదే! నీరసంగా ఉందని ఇంకో నాల్రోజులు విశ్రాంతి తీసుకున్నారు. అంతే… ఈ ప్రచారం అసలు ఎక్కడ ఎలా పుట్టిందో చెప్పవే …”

“అవునా అమ్మా, నేను అలాగే అనుకున్నాను. ‘కొరొనా’ వస్తే ఎలా ఉంటుందో మా చుట్టాల్లో చూశాను. అందుకే ఇది ‘కొరొనా’ కాదని నాకు తెలిసిపోయింది. కాని, ఆ రోజు మీరు ఆస్పిటల్ కి వెళ్ళాక, మీ చుట్టం వచ్చి మునిసిపాలిటీ వాళ్ళ చేత ఇల్లంతా, లిఫ్ట్ అంతా కొరొనా మందు కొట్టించాడమ్మా. ఆ మునిసిపాలిటీ కొరొనా మందు బండి చూసి, వీథంతా ఇక ….”

హేమ తల కొట్టుకుంది.

‘అబ్బా, ముందు జాగ్రత్త చర్యగా మందు కొట్టించాలనుకున్నప్పుడు, ‘లోకులు కాకులు ‘ అన్న సంగతి ఎలా మర్చిపోయాను?’

2. రెండు కపోతాలు                

వాణి చెప్పి చెప్పి అలసిపోయింది.

“ఎన్ని సార్లు చెప్పమంటారు తాతగారు! మనోజ్ రోజు రోజుకీ నాకు పిచ్చెక్కించేస్తున్నాడు. ఏ ఒక్క పనీ నేను చెప్పినట్లు చేయడు. పోనీ తను సొంతంగా ఆలోచించి చేస్తాడా! అది నాకు నచ్చదు. పైగా తను ఏది చేసినా, దానిలో ఏదో ఒక లోపం ఉంటుంది. దాన్ని సరి చేయటానికి మళ్ళీ నేను కుస్తీ పట్టాల్సి వస్తుంది. అసలు….” అంటూ వాణి శేషయ్య గారి ముందు తన ఫిర్యాదుల చిట్టా మళ్ళీ విప్పింది.

ఇద్దరూ సూపర్ మార్కెట్లో కలుసుకున్నారు. ఆ నగరంలో వాణికి ఉన్న ఒకే ఒక ఆసరా తమకి దూరపు బంధువైన శేషయ్య.

వస్తానన్న సమయానికి ఇంటికి రాడనీ, పిల్లలు స్కూలు నుంచి ఇంటికి బస్సులో వచ్చే సమయానికి ఏనాడూ అందుకోడనీ, దాంతో ప్రతిసారీ ఆయా మీదనే ఆధారపడాల్సి వస్తోందనీ, ఇంటి పనుల్లో తనకు మూడ్ ఉంటే సాయం చేస్తాడు లేకపోతే లేదనీ, తనకి నచ్చని వెధవలతో స్నేహం చేస్తుంటాడనీ, పైగా తాను జీతం ఎలా ఖర్చు పెట్టానో తెలుసుకోవాలని ఆరా తీస్తుంటాడనీ, అకస్మాత్తుగా వాళ్ళ బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్ళాలని బలవంతంగా బయల్దేరదీస్తుంటాడనీ… ఇలా చాలా చెప్పింది వాణి తన భర్త మనోజ్ గురించి.

అంతలో ఆ మార్కెట్లో డ్రాగన్ పండు కనబడింది. “ఆహా, ఎంత తాజాగా ఉన్నాయో కదా తాతగారూ” అంటూ వాటిని ఎంచి, మార్కెట్ వాడిచ్చిన ప్లాస్టిక్ గంపలో వేసింది.

“నీకిష్టమా ఈ పండు?” అడిగారు శేషయ్య.

“అదేమీ లేదండీ. మనోజ్ ఎగపడతాడు ఇవి తాజాగా ఉంటే…”

“అవునూ, పిల్లలకి ఇవ్వాళ శలవు కదా! వాళ్ళని తీసుకురాలేదే మార్కెట్‌కి?”

“వాళ్ళని మార్కెట్లో భరించగలమా తాతగారు! మనోజ్ చూసుకుంటానన్నాడు. ఇంట్లోనే వదిలేశాను…

ఇప్పుడు ఈ సరుకులు, కూరలు కొనేసి మా ఇంటి గేటుబయట దించుతాను. పనిపిల్ల ఇంట్లో పెట్టేస్తుంది.”

“మరి నువ్వు?”

“శనివారం కదా! హాస్టల్లో ఉంటున్న నా స్నేహితురాళ్ళతో కలిసి సినిమా ప్లాన్ చేశాను…”

“సరే, ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పు. మనోజ్ బాగా అబద్ధాలు చెబుతాడా?”

“అంత అబద్ధాలకోరు కాదనుకోండి.”

“పోనీ, అతనికి ఆడ స్నేహితులెవరైనా ఉన్నారా? నీకు తెలియకుండా డబ్బు వాళ్ళకోసం పెడుతుంటాడా?”

“ఛ ఛ. అలాంటిదేమీ లేదు…”

“పోనీ, నీకు ప్రమోషన్ వస్తే, వెంటనే ఎవరికి చెప్పాలనిపిస్తుంది?”

లిప్త కాలం కూడా ఆలోచించకుండా చెప్పింది:

“మనోజ్‌కే.”

సామాను కొనటం పూర్తయింది.

బయటకొచ్చేశారు.

“భారతంలో భీష్ముడు అంపశయ్య మీద ఉన్నఫ్ఫుడు ధర్మరాజుకి బోధించిన అనేక ధర్మాలలో ‘శరణాగత ధర్మం’ ఒకటి. భార్యా భర్తలయిన రెండు కపోతాలను ఉద్దేశించి చెప్పినా అది మనుషుల కోసమే…’నాస్తి భర్తృసమో నాథః నాస్తి భర్తృ సమం సుఖం, విసృజ్య ధన సర్వస్వం భర్తావై శరణం స్త్రియాః’ – స్త్రీకి భర్తకి మించిన భద్రతలేదు. భర్తతో సమానమైన సుఖం లేదు. ధనం అంతా పోయినా భర్తే నిజమైన తోడు… నీ భర్త అనవసరంగా అబద్ధాలు చెప్పడు. చెడు తిరుగుళ్ళు తిరగడు. నీ పిల్లల్ని ప్రేమగా చూస్తాడు. నువ్వు కూడా అతనికిష్టమైన డ్రాగన్ పండ్లు కొంటున్నావు… అన్నింటికన్నా ముఖ్యంగా నీకు సంబంధించిన ఏ మంచి వార్త అయినా అతనికే చెప్పాలనుకుంటున్నావు…”

“అంటే, ఏమిటి తాతగారు?”

“మనోజ్ మీద నీకున్న ఈ ప్రేమ చాలు – నీ ఫిర్యాదులన్నీ వాస్తవాల్ని విశ్లేషించటం చేతకాక చెబుతున్న చాడీలు అనటానికి… ఉంటా మరి.”

వాణి ఆత్మావలోకనంలో పడిపోయింది.

నాలుగు రోజుల తరువాత శేషయ్య గారికి మనోజ్ రామకృష్ణ మఠంలో కలిశాడు. మాటల్లో వాణి గురించి అతను కూడా ఇలాంటి ఆరోపణలే చేశాడు.

అలా మాట్లాడుకుంటూ మఠం బుక్ స్టాల్లోకి వెళ్ళారు.

అక్కడ భారతీయ ఇతిహాసాల్లోని మేనేజిమెంటు కథల పుస్తకాలు కొన్నాడు మనోజ్.

“ఏమిటయ్యా, ఇవన్నీ నువ్వు చదువుతావా?” అడిగారు శేషయ్య.

“నాకు ఆసక్తి లేదండి. వాణి మానవ వనరుల శాఖలో ఆఫీసరు కదా! తరచుగా మేనేజిమెంటు క్లాసులు తీసుకుంటూంటుంది. ఆమెకి ఉపయోగపడతాయని …”

“చూశావా! నువ్వు ఎన్ని ఆరోపణలు చెప్పినా, ఆమె అబద్ధాలు చెబుతుందని చెప్పలేదు. ఆమెకి చెడు అభ్యాసాలున్నాయని చెప్పలేదు. ఇల్లు పట్టించుకోదని చెప్పలేదు. పైగా ఆమెకిష్టమైన పుస్తకాలు కొంటున్నావు. ఈ లెక్ఖన వాణి – భీష్ముడు చెప్పిన ఆడ కపోతంలాంటిదేనోయ్.”

“భీష్ముడు ఏం చెప్పాడు?”

“నాస్తి భార్యా సమో బంధుః నాస్తి భార్యా సమా గతిః, నాస్తి భార్యా సమో లోకే సహాయో ధర్మసంగ్రహే’- భార్యకి సమానమైన బంధువు లేడు, శ్రేయోభిలాషి లేడు… చూడు మనోజ్, పుణ్యం సంపాదించాలన్నా భార్య ఉండాలయ్యా. ఈ కోణంలో ఒకసారి ఆత్మ విమర్శ చేసుకొని చూడు…”

మనోజ్ ఆలోచనలో పడ్డాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here