99 సెకన్ల కథ-45

1
2

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత, సంపాదకులు, పాత్రికేయులు జి. వల్లీశ్వర్ ’99 సెకన్ల కథ’ సిరీస్‌లో ఈ వారం రెండు కథలు సంచిక పాఠకులకు అందిస్తున్నారు. ఈ కథలు ప్రపంచతత్వాన్ని, మానవ మనస్తత్వాన్ని సూక్ష్మంగా ప్రదర్శిస్తాయి. [/box]

1. ఇలా కూడా జరిగింది

నవనీతం హైదరాబాదులో ‘నాబార్డ్’ కార్యాలయంలో చీఫ్ జనరల్ మేనేజరుగా రిటైర్ అయింది.

ఆమె కన్నా మూడేళ్ళు ముందే ఒక ప్రైవేటు ఫార్మా కంపెనీకి వైస్ ప్రెసిడెంట్ స్థాయిలో మోహనరంగం రిటైర్ అయ్యాడు.

ముగ్గురు కూతుళ్ళని చదివించి, పెళ్ళిళ్ళు చేస్తే వాళ్ళు పతీ సమేతంగా పచ్చగా ఉన్న విదేశాలకు ఎగిరిపోయారు.

రిటైర్ అయ్యేనాటికన్నా సొంత గృహం సమకూర్చుకోవాలని నవనీత మోహనాలు చాలా ప్లాన్ చేసి, తమ సేవింగ్సుకి కొంత బ్యాంకు రుణం జోడించి నగర శివార్లలో ఓ అయిదు కోట్లకి విల్లా కొనుక్కున్నారు.

“నవనీతం, నేను రిటైర్ అయ్యాను. నీకు ఇంకా దాదాపు రెండేళ్ళు సర్వీసు ఉంది. నీ చివరి పోస్టింగ్ హైదరాబాదే ఇస్తారు అనుకుంటున్నాను. మనం వంట మనిషి, పాలు తెచ్చేవాడు, బట్టలు ఉతికేవాడు, ఇల్లు రోజూ అద్దంలా శానిటైజ్ చేసి, బ్రష్‌తో వత్తే వాడు… ఈ ఖర్చులు తగ్గించుకుంటే ఎలా ఉంటుంది?” అని మోహనం అడిగాడు చాలా ముందు చూపుతో.

“బాగుంటుంది, కానీ నాకు హైదరాబాద్ బదిలీ అయినా పని వత్తిడివల్ల నీకు సాయం చేసే అవకాశం నాకు ఉండదేమో అని భయపడుతున్నా” అంది మరింత ముందు జాగ్రత్తగా అప్పటికి ముంబైలో కేంద్ర కార్యాలయంలో పనిచేస్తున్న నవనీతం.

జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డ్)లో వివిధ ప్రాంత కార్యాలయాల్లో పనిచేసిన అనుభవం నవనీతానిది.

“ఏం ఫరవాలేదు. నేను మేనేజ్ చేస్తాగా” అన్నాడు మోహనం ముందు చూపు ఉత్సాహంతో.

నవనీతానికి చివరి పోస్టింగు హైదరాబాద్ ఇచ్చారు. మోహనం విరగబడి అన్ని పాత్రలు తానే ధరించేశాడు ఇంట్లో.

నవనీతాన్ని కాలు క్రింద పెట్టనివ్వలేదు – అన్నంతగా విజృంభించేశాడు.

చివరికి మోహనం ఆశించిన ముందు చూపు రోజు వచ్చేసింది. ప్రమోషన్ మీద హైదరాబాద్ లోనే చీఫ్ జనరల్ మేనేజరుగా కూడా పని చేసి, పదవీ విరమణ చేసింది నవనీతం.

మోహనం మనసు ఆనందంతో పరవళ్ళు తొక్కింది.

“ఇదో నవనీతం, రేపట్నుంచి పాకశాల మొత్తం నీదే. వాషింగు మొత్తం నీదే. అసలు ఇల్లంతా నీదే. నేను బయటపనులే చూస్తాను సుమా” అని ఖండితంగా, ప్రేమ రంగరించి చెప్పాడు మోహనం.

“సరేలే, మరి ఇంటి మీద ఋణం తీరేదాకా తప్పదు కదా” అంది నవనీతం ఇంటికి దీపంలా.

ఒక్క నెలరోజుల్లో పాత్రలు మారిపోయాయి.

పొద్దుటే పాలు తెచ్చి ఇచ్చాక మోహనం కాలుమీద కాలు వేసుక్కూర్చుని పేపర్ చదువుతూ, “ఏవోయ్, కాఫీ” అనగలుగుతున్నాడు.

సరుకులు, కూరలు మాత్రం వారానికోసారి నాణ్యతకోసం బయటకెళ్ళి తెస్తున్నాడు.

పొద్దుటే ఇల్లు శుభ్రం చేసుకోవటం,

కాఫీ చేయటం,

కూరలు తరుక్కోవటం,

బట్టల్ని ఉతుకుడు యంత్రంలో వేసి, ఉతికి ఆరేయటం,

అప్పుడు ఉదయపు అల్పాహారం తయారు చేయటం,

స్నానం చేసి కాసేపు “పిల్లల కుటుంబాలు బాగుండాలి” అని పూజ చేసుకోవటం,

అదయ్యాక వంట చేయటం,

మధ్యాహ్నం భోజనాలు అయ్యాక,

అప్పుడు ఆ రోజు పేపర్లు చూడటం,

అదయ్యాక కాసేపు తనకిష్టమైన వ్యవసాయ పరపతి రంగం గురించి వెబ్ పత్రికల్లో, ఆర్థిక విషయాల పత్రికల్లో ఏం రాశారో చదువుకోవటం, ఆసక్తి ఉన్న రోజున తనే ఆయా పత్రికలకి వ్యాసాలు రాయటం,

నాలుగు అయ్యేసరికి నిద్రలేచి వచ్చే పతి దైవానికి టీ పెట్టడం,

సాయంత్రం ఇద్దరూ కలిసి సంయుక్త నడక సాగించటం,

తిరిగొచ్చాక స్నానం, మళ్ళీ రాత్రికి చపాతీలు ….

మూడు నెలలు గడిచాయి. ఇద్దరూ తమ తమ పాత్రలకి అలవాటు పడిపోయారు.

మోహనం తన ముందుచూపుకి తనని తనే అభినందించుకున్నాడు.

నగరంలో పెద్ద టెలివిజన్ ఛానళ్ళ వాళ్ళు మోహనాన్ని పట్టుకొని కొంచెం తమ ఛానలుకి నవనీతం మేడం చేత అప్పుడప్పుడు ‘వ్యవసాయం, పరపతి, ప్రభుత్వ విధానాలు’ గురించి మాట్లాడించాలని అడుగుతుండేవాళ్ళు. మోహనం నవనీతాన్ని మొహమాటపెట్టేసేవాడు. తన భార్య గురించి కాలర్ ఎగరేసుకుంటూ ఇంటిదగ్గరే ఓ కెమెరా కొని పెట్టేశాడు. దాంతో నేషనల్ ఛానళ్ళలో కూడా నవనీతం వెలిగిపోయింది.

నాలుగో నెలలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ప్రభుత్వం మారిపోయింది.

ఓ రోజు పొద్దుటే మోహనం కాలు మీద కాలు వేసుకొని నవనీతం ఇచ్చిన వేడి వేడి కాఫీ తాగుతూ వార్తలు చూస్తున్నాడు…

ఒక్కసారిగా పక్కలో పిడుగు పడ్డట్లుగా అదిరిపడ్డాడు.

“నవనీతం” అంటూ పెద్ద కేకపెట్టి కాఫీతో సహా కుర్చీలోంచి క్రింద పడిపోయాడు ముందుచూపు మోహనం.

“ఏమైంది, ఏమైంది” అంటూ నవనీతం పాకశాల్లోంచి పరుగెత్తుకొచ్చింది.

టివిలో వార్త నడుస్తోంది.

“వ్యవసాయ పరపతి విధానం పై నాబార్డుకి పూర్తి సమయం సలహాదారుగా శ్రీమతి నవనీతం నియామకం … మూడేళ్ళ కాలపరిమితి …హైదరాబాదులోనే ఆఫీసు ఏర్పాటు….”

2. అంకుల్, ఈ కథ చాలు..      

“మధుబాబు, పై లోకాల్లో ఇద్దరు ప్రాణస్నేహితులు ఉండేవారు. ఒకడి పేరు అవిజ్ఞాతుడు, మరొకడు పురంజనుడు. ఇద్దరూ ఒకరినొకరు విడిచిపెట్టి ఉండరు. అంత గొప్ప స్నేహితులన్న మాట… అలాంటిది పురంజనుడికి సుఖపడే ప్రదేశం కావాలనిపించి, అవిజ్ఞాతుడికి చెప్పకుండా భూమిమీదకి వచ్చి వెతికాడు. ఒక అందమైన నగరం, తొమ్మిది ద్వారాలతో మెరిసిపోతోంది. దాని బయట తోటలో ఒక అతిలోక సుందరి కలిసింది. ఇంకేమిటి? ‘మనిద్దరం ఈ నగరంలో కలిసి జీవిద్దామా?’ అన్నాడు ఆశగా పురంజనుడు. ఒక అయిదు తలల సర్పం రక్షణలో ఉన్న ఆ యువతి ఈ అందగాడిని చూసి ‘సరే’ అంది. అలా ఆ ఇద్దరూ ఆ నగరంలో సరససల్లాపాలతో నూరు సంవత్సరాలు గడిపేశారు. వాళ్ళకి కొడుకులు, కూతుళ్ళు కూడా వందల్లో ……”

శేషయ్య ఈ కథ చెబుతున్నారు,

నలభయ్యో పడి చివర్లో ఉన్నా, మంచి శరీర సౌష్టవంతో ఆకట్టుకునే ప్రభుత్వాధికారి మధుబాబుకి ఎందుకో అనుమానం వచ్చింది.

“అంకుల్, ఈ కథ నాకెందుకు చెబుతున్నారు?”   

రామకృష్ణ మఠం ద్వారా ఆప్తుడైన శేషయ్య తనని ఇంటికి పిలిచి మరీ ఈ కథ చెప్పటం మధుబాబులో ఏదో శంక కలిగిస్తోంది. అయినా గట్టిగా అడగలేకపోతున్నాడు.

“మధూ, ఆ మధ్య బెంగుళూరు విమానాశ్రయంలో సుమతి అనే ఆమెని పరిచయం చేశావు కదా! ఆమెకీ నీకూ ఏమిటి సంబంధం?”

“ఒహో, సుమతా! ఆమె వాణిజ్యపన్నుల శాఖలో ఉద్యోగం చేస్తోంది అంకుల్.”

“అహ, ఆమెకీ నీకు ఏమిటి…?”

మధు కొంచెం సిగ్గు పడ్డాడు.

“మంచి స్నేహితురాలు అంకుల్. నేనంటే చాలా ఇష్టం.”

“మరి, రెండు వారాల క్రితం నేను చెన్నైలో రామకృష్ణా మఠంలో సభలకి వెళ్ళి వస్తుంటే ఎగ్మూర్ స్టేషన్ దగ్గర్ మ్యూజియంలో నీతో కనబడిన చామనఛాయ ఆమె…?”

“ఆ .. తను.. తను.. తులసి అంకుల్… ఒక వాట్సప్ గ్రూపులో ఫ్రెండ్…” అంటున్నాడు కానీ, మధుబాబు మొహంలో ఏదో ఇబ్బంది తొంగి చూస్తోంది.

అతనిలో ఈ ఇబ్బందిని శేషయ్య పసిగట్టారు.

“కథ చెప్పనా? మరి కొన్ని ప్రశ్నలు అడగనా?”

“అ.. ఆ…” అంటూ, ‘కథే మంచిదేమో’ అనుకున్నాడు మధు.

అదే చెప్పండన్నాడు.

“అలా పురంజనుడు – పురంజని అనే ఆ అనామక యువతితో భోగం అనుభవించటం ఒక్కటే జీవిత పరమావధిగా జీవించాడు. అతనికి ఆమె తప్ప ప్రపంచం లేదు. ఆమెకి మించిన పురుషార్థం లేదు. నూరు సంవత్సరాలు గడిచాయి. ఎవరూ తనని పెళ్ళి చేసుకోవటంలేదని ఏడుస్తూన్న (కాలుడి కూతురు) అనాకారి జర – పురంజనుడిని ఆవహించి తృప్తి పడసాగింది. యవనుడు అనే వాడు కూడా ఆవహించాడు. అప్పుడు కాలుడు అనేవాడు దాడి చేశాడు. 350 మంది తెల్ల సైన్యం, 350 మంది నల్ల సైన్యంతో దాడి చేశాడు. అంతే! పురంజనుడు తనతో సహజీవనం చేసిన యువతి మీద మోహం వదల్లేక వదల్లేక మరణించాడు…” మధు నవ్వాడు.

“చచ్చాక కూడా మోహం వెంటాడిందా?”

“కదా! ఈసారి ఒక రాజకుమార్తెగా జన్మ ఎత్తాడు పురంజనుడు. ఇంకో రాజుతో పెళ్ళయింది. పెద్దవయస్సు వచ్చాక తపస్సు చేసుకుందాం అని వెళ్ళారు. ఆ రాజు చనిపోయాడు. ‘అయ్యో నా భర్త చనిపోయాడే, నేను మహా పతివ్రతని. నేనేమై పోతాను?’ అంటూ ఆమె ఏడుస్తూ కూర్చుంది.”

మధుబాబుకి సందేహం వచ్చింది.

“అసలు కథ మొదట్లో ఇంకో స్నేహితుడు ఉన్నాడన్నారే, అతనేమై పోయాడు?”

“ఏడుస్తున్న ఆ యువతి దగ్గరకి ఆ స్నేహితుడు అవిజ్ఞాతుడే ఒక పండితుడి రూపంలో వచ్చి, అసలు విషయం చెప్పాడు. ‘నీ పూర్వ జన్మలో ఏదో సుఖపడిపోవాలనుకున్నావ్. నాకు చెప్పకుండా, నన్ను విడిచిపెట్టి వచ్చి కేవలం స్త్రీ వ్యామోహంతో తొమ్మిది ద్వారాల మానవదేహంలో చేరావు. నిన్ను మోహింపజేసిన స్త్రీ నీ మనస్సు. జర (వృద్ధాప్యం), యవ్వనులు (రోగాలు), కాలుడి 350 తెల్ల నల్ల సైనికులు, అంటే – రాత్రి పగళ్ళతో కూడిన కాలం నిన్ను కబళించినా, ఇంకా స్త్రీ వ్యామోహం చావక ఈ జన్మలో స్త్రీగా పుట్టావు. ఇప్పుడు ఏదో కోల్పోయినట్లు ఏడుస్తున్నావ్ !”

మధుబాబుకి శేషయ్య ఏం చెప్పాలనుకుంటున్నారో అర్థమవుతోంది.

“అంకుల్, నా చిన్న బలహీనత మీద ఇంత కథ చెప్పటం…” నసిగాడు.

“ఏది చిన్న బలహీనత? ధర్మాన్ని, అర్థాన్ని, కామాన్ని ఆర్జించటంలో కానీ, ఆచరించటంలో కానీ నీ భార్యని అతిక్రమించనని అగ్నిసాక్షిగా ప్రమాణం చేసి, ఇప్పుడు కేవలం పరస్త్రీ వ్యామోహంతో అతిక్రమిస్తున్నావే, ఇదే పని నీ భార్య చేస్తే కూడా చిన్న బలహీనత అని సరిపెట్టుకుంటావా?… అవిజ్ఞాతుడు అనే ‘పరమాత్మ’కు దూరమైన పురంజనుడు అనే ‘ఆత్మ’ కథ భాగవతం లోది, మనందరిది. ధర్మం తప్పటమంటే, పరమాత్మకు దూరమవటమే… పోనీ, ఇంకో కథ చెప్పనా?”

మధు కళ్ళల్లో నీళ్ళు.

“అంకుల్, నేను నాస్తికుణ్ణి కాదు. ఇప్పుడు చెప్పిన కథ చాలు.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here