Site icon Sanchika

99 సెకన్ల కథ-46

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత, సంపాదకులు, పాత్రికేయులు జి. వల్లీశ్వర్ ’99 సెకన్ల కథ’ సిరీస్‌లో ఈ వారం రెండు కథలు సంచిక పాఠకులకు అందిస్తున్నారు. ఈ కథలు ప్రపంచతత్వాన్ని, మానవ మనస్తత్వాన్ని సూక్ష్మంగా ప్రదర్శిస్తాయి. [/box]

1. సీతనిస్తానంటే రాముడు ఒప్పుకోలేదు?

సికింద్రాబాద్ – తాడ్‌బన్ హనుమాన్ ఆలయ ప్రాంగణంలోని కల్యాణవేదికలో ఒక వివాహానికి హాజరై బయటకు వస్తున్న శేషయ్యకి హనుమాన్ గుడిలోంచి వస్తున్న శ్రీరామ్ కనుపించాడు. శేషయ్యకి బాల్యమిత్రుడి మనవడు శ్రీరామ్.

శేషయ్య కేకేశారు. శ్రీరామ్ ఆయన్ని చూస్తూనే కొంచెం తత్తరపడ్డాడు. అయినా దగ్గరకొచ్చాడు. పాదాలకు నమస్కారం చేశాడు.

“ఏమయ్యా, నువ్వు మీ ఊరినుంచి వచ్చి ఇక్కడ ఉద్యోగంలో చేరి మూడేళ్ళవుతున్నట్లుంది. ఇలా బయట ఎక్కడో కనబడటమే!.. ఈ గుడికి ఇదే రావటమా?”

“లేదు తాతగారు, ప్రతి శనివారం వస్తాను. చిన్నప్పుడు మా నాన్న అలవాటు చేసిన ‘హనుమాన్ చాలీసా’ రోజూ చదవటం, వారం వారం ఇక్కడికి పూజకి రావటం ….” అంటూ మధ్య మధ్యలో వెనక్కి చూస్తున్నాడు కొంచెం తొట్రుపడుతూ శ్రీరామ్. శేషయ్య ఇంకా ఏదో అడుగుతున్నారు.

అంతలో “తాతగారు, వెళ్ళొస్తాను” అన్నాడు శ్రీరామ్.

శేషయ్య దృష్టి అటు పడింది. గుడిలోంచి ఒక యువతి బయటకొచ్చింది. శ్రీరామ్ కేసి వడివడిగా వస్తోంది. ఛాయ తక్కువ కాని, మొహంలో కళ ఉంది. కనుముక్కు తీరు బాగుంది.

శేషయ్య శ్రీరామ్‌ని ఆపి నవ్వుతూ అడిగారు.

“నీ మనసు దోచిన స్నేహితురాలా?”

శ్రీరామ్ సిగ్గుపడ్డాడు. ఆ యువతి దగ్గరకొచ్చేసింది.

శ్రీరామ్ ఇక తప్పించుకునే ప్రయత్నం చేయలేదు.

“తాతగారు, తను పావని. మా కంపెనీలోనే పనిచేస్తోంది…” అంటూ పావనికి సైగ చేశాడు. పావని కూడా శేషయ్యకి పాదాభివందనం చేసింది.

శేషయ్యకి విషయం అర్థమైపోయింది.

“ఇవాళ శనివారం మీకు సెలవే కదా? కాస్సేపు మా ఇంటికి వెళ్దాం రండి. ఇక్కడికి దగ్గరే” అన్నారు శేషయ్య.

శ్రీరామ్ కాదనలేకపోయాడు. “నా కారులో వెళ్దాం తాతగారు” అంటూ కారు తేవటానికి వెళ్ళాడు. దూరంగా పార్క్ చేసి ఉన్న కారు తేవటానికి శ్రీరామ్ కి 15 నిమిషాలు పట్టింది.

శేషయ్య పావనితో కొన్ని విషయాలు ముచ్చటించారు.

….

“సరే శ్రీరామ్! నువ్వు చెప్పినట్లే మీ ఇద్దరూ గాఢంగా ఒకరినొకరు కోరుకుంటున్నారు. పెళ్ళి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కాని, ఇంట్లో చెప్పాలి. అమ్మ లేకపోయినా, నాన్నకి చెప్పాలి.”

శ్రీరామ్ వణికిపోయాడు.

“తాతగారు, పావని వాళ్ళ అమ్మది మా కులం కాదు. నాన్న ఈ పెళ్ళి జరగనివ్వరు… ప్లీజ్, పెళ్ళయ్యాక చెబుతాను…” బ్రతిమాలుతున్నాడు.

“శ్రీరామ్, మీ నాన్నగారికి తెలియకుండా పెళ్ళి చేయాల్సివస్తే, మా అమ్మా, నాన్న నీ గురించి ఏమనుకుంటారు? చెప్పేద్దాం” అంటోంది అనునయంగా పావని. శ్రీరామ్ మథన పడిపోతున్నాడు.

శేషయ్యకి జాలేసింది.

“శ్రీరామ్, పావని ఇందాక నాకు మీ రెండేళ్ళ ప్రేమ కథ అంతా చెప్పింది. మీదేమీ కౌమార దశలో వచ్చే ఆకర్షణ కాదు భయపడటానికి. అయినా, మీ నాన్న నాకు చాలాసార్లు చెప్పాడు – తను ‘రామకోటి’ అనేకసార్లు రాశాక నువ్వు పుట్టావని, అందుకే నీకు శ్రీరామ్ అని పేరు పెట్టుకున్నానని. నువ్వేమో రామబంటు హనుమాన్ భక్తుడివి. మరి రాముడు చేసినట్లు చేయాలి కదా!”

శ్రీరామ్ అయోమయంగా చూస్తున్నాడు.

“శివ ధనుస్సు విరిచాక, రాముడికి తనకూతుర్ని ఇచ్చి వివాహం చేస్తానని జనక మహారాజు అన్నాడు. కాని రాముడు మాత్రం ‘మా నాన్నగారు వచ్చి చూసి, అంగీకరిస్తేనే జరుగుతుంది’ అని నిస్సంకోచంగా చెప్పాడు.”

శ్రీరామ్‌కి సందేహం కలిగింది. “నేను ‘సీతారామ కళ్యాణం’ అనే ఒక ప్రవచనం ‘యు ట్యూబ్’ లో చూశాను. అందులో రాముడు ఇలా చెప్పినట్లు లేదే…!”

పావని ఆసక్తిగా చూస్తోంది.

“రాముడు ఎంత గొప్ప సంస్కారవంతుడో – సీత అరణ్యవాసంలో అత్రి మహర్షి భార్య అనసూయకి చెప్పింది. శివ ధనుస్సుని రాముడు విరవగానే, తన తండ్రి కన్యాదానం చేయటానికి జలపాత్రని స్వీకరించారని, కాని రాముడు తిరస్కరించాడని సీత చెప్పింది….” ఆగారు శేషయ్య.

“మళ్ళీ చెప్పండి. ఏమని చెప్పింది?” ఉత్కంఠగా అడిగాడు శ్రీరామ్.

“దీయమానాం న తు తదా ప్రతిజగ్రాహ రాఘవః, అవిజ్ఞాయ పితుశ్ఛందమ్ అయోధ్యాధిపతేః ప్రభోః – అయోధ్యాధిపతి అయిన తన తండ్రి అనుమతి లేకుండా నన్ను స్వీకరించటానికి శ్రీరాముడు ఇష్టపడలేదు.”

వెంటనే పావని అందుకుంది. “శ్రీరామ్, మా అమ్మ అనేక సార్లు చెప్పింది. పెళ్ళి తరువాత ఆడపిల్ల అత్త,మామల్నే తన తల్లిదండ్రులుగా భావించాలని. అయినప్పుడు, మీ నాన్నగారికి చెప్పటమే మంచిదికదా!”

శ్రీరామ్ ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాడు.    

“పోనీ, నువ్వు రేపు చెప్పు శ్రీరాం” అన్నారు శేషయ్య. శ్రీరామ్‌కి అర్థమైంది. ధైర్యం వచ్చింది. ‘సరే’ అన్నట్లు తలూపాడు.

….

ఆ రాత్రే శ్రీరామ్ తండ్రితో శేషయ్య ఫోనులో చెప్పారు.

“… మీ వాడి సహోద్యోగి పావని అనే అమ్మాయి మీ వాడికి తగిన పిల్ల. ఇవ్వాళ చాలా సేపు మాట్లాడాను ఆ పిల్లతో. అలాంటి అమ్మాయి నీకు కోడలు కావటం మీ ఇంటి అదృష్టం. వాళ్ళ అమ్మ ఎంతో సంస్కారంతో పెంచింది. మీ వాడు ఇష్టపడుతున్నాడు. ఆ పిల్ల కుటుంబం వచ్చి అడుగుతారు. తొందరపడి ‘నో’ అనకు. సందేహాలుంటే నన్ను అడుగు…”

…….

ఒక ఏడాది తరువాత..

శ్రీరామ్ తండ్రి శేషయ్యతో అన్నాడు:

“మీరు చెప్పి ఉండకపోతే, పావని తల్లి కులం చూసి ‘నో’ అనేసి ఉండేవాణ్ణి. మా కుటుంబం ఒక మంచి కోడల్ని మిస్ చేసుకుని ఉండేది…”

2. ఇలాంటి అధికారుల్ని చూశారా?          

విశాఖపట్నంలో పెద్ద కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ.

రాత్రింబవళ్ళు హడావుడిగా కనుపించే ఆ సంస్థలో పౌర సంబంధాల విభాగాధిపతి త్ర్యయంబకేశ్వర్. మీడియాతో మంచి సత్సంబంధాలుంటాయని అందరూ చెప్పుకొంటుంటారు. ఆంగ్ల భాషమీద మంచి పట్టు ఉన్నవాడనీ, పౌరసంబంధాల విషయంలో చాలా చురుకైన వాడనీ ఆయనకు ఆ సంస్థలో టన్నులకొద్దీ పేరు ఉంది. ఆయన పేరు నోరు తిరగక, అందరూ ‘తెంబు’ గారు అని పిలుస్తుంటారు.

ఇంత సామర్థ్యం ఉన్నవాడికి ఏదో ఒక ‘విశేషం’ ఉందాలి కదా!

ఉంది.

ఒకసారి వయసులో పెద్దవాడయిన చైర్మన్ పిలిచి, “మొన్న కుస్తీ పోటీల్లో ప్రథమ ద్వితీయ విజేతలుగా వచ్చిన ఇద్దరికీ మంచి బహుమతులిద్దాం. అయిదొందలకి మించకుండా ఏమన్నా తీసుకురండి” అన్నారు.

తెంబు చైర్మన్ వంక ఎగాదిగా చూసి, వెళ్ళిపోయాడు. ఓ గంట తరువాత రెండు సర్ఫ్ ప్యాకెట్లు పట్టుకొచ్చాడు.

“సర్, మీరు చెప్పిన అయిదొందల లోపల ఈ రెండూ తప్ప ఇంకేమీ రావట సార్. ఎలాగూ కుస్తీపోటీల్లో బాగా మడ్డి కారి ఉంటుంది కదా, ఇది బాగా వదలగొడుతుంది సర్” అంటూ ఆ ప్యాకెట్లు చైర్మన్ మేజాబల్ల మీద పెట్టి తిరిగి చూడకుండా బయటకు నడిచాడు తెంబు.

చైర్మన్ మొహం పాలిపోయింది.

ఇంకో రోజున చైర్మన్ తన వ్యక్తిగత కార్యదర్శి (వ్య.కా) ద్వారా తెంబుకి కబురు చేశారు.

“రేపు ఉదయాన్నే ఢిల్లీ నుంచి ఉపరితల రవాణా శాఖ సీనియర్ అధికారి ఒకరు వస్తున్నారు. విమానాశ్రయానికి వెళ్ళి, ఆయన్ని మన అతిథి భవనానికి తీసుకురావాలి.”

ఠపీమని గోడక్కొట్టిన బంతిలా, తెంబు నుంచి ఒక పెద్ద ప్రశ్నాపత్రం చైర్మన్ని ఉద్దేశించి ఆ వ్య.కాకి వచ్చింది.

“గౌరవ చైర్మన్ గారు చెప్పిన సీనియర్ అధికారి ఏ స్థాయివారు? కార్యదర్శా? అదనపు కార్యదర్శా? సంయుక్త కార్యదర్శా? డైరక్టరా? డిప్యూటీ డైరక్టరా?.. వారి స్థాయి చెబితే, ఎయిర్ కండిషండ్ కారు తీసుకెళ్ళాలో, నాన్ ఎ.సి కారు తీసుకెళ్ళాలో నిర్ణయించగలం. అలాగే వారికి వి.ఐ.పి సూటు ఇవ్వాలో, సాధారణ సూటు ఇవ్వాలో తేల్చుకోగలం… ఇంకా వారికి ఉదయం అల్పాహారం ఏర్పాటు చేయాలా వద్దా అన్న సంగతి గౌరవ చైర్మన్ గారు చెప్పలేదు. ఇంకా మధ్యాహ్న భోజనం, శాఖాహారం లేదా మాంసాహారం……!!!!”

ఇంకోసారి డిప్యూటీ చైర్మన్ వచ్చి చైర్మన్ దగ్గర మొర పెట్టుకున్నాడు.

“ఈ తెంబు ఏమిటి సార్? ఏది అడిగినా 99 ప్రశ్నలు వేస్తాడు. చాలా చిన్న చిన్న విషయాలక్కూడా కాగితం మీద రాసి పంపుతుంటాడు. అతను చేసేది టెక్నికల్‌గా తప్పు అని చెప్పలేం. కాని 20 ఏళ్ళ అనుభవం ఉన్నవాడు తన విచక్షణా జ్ఞానాన్ని ఉపయోగించలేడా?… ‘చెప్పుకోలేని చోట తామరలా’ తయారయ్యాడు సర్.” ఇంకా ఇలాంటి ఓ అరడజను ఉదాహరణలు చెప్పాడు.

చైర్మన్ అంతా విని, డి.ఛై మొహంలోకి చూస్తూ, “నీకు పైన నేను ఉన్నాననే కదా నాకు చెప్పుకున్నావు. మరి నేనెవడితో చెప్పుకోవాలయ్యా….” అంటూ తల కొట్టుకున్నాడు.

 “ఇంకో శాఖకి బదిలీ చేసేద్దాం సర్” అన్నాడు డి.ఛై.

“అలా వీలుపడదు. అతన్ని రిక్రూట్ చేసినప్పుడే, పౌరసంబంధాల విభాగం కోసం తీసుకున్నారు. ఒకవేళ ఇప్పుడు మారుస్తున్నామని అన్నామే అనుకో. వెంటనే ఇంకో ప్రశ్నాపత్రం సంధిస్తాడు…ఇదేమిటోనయ్యా, నేను చైర్మన్ అయి ఉండీ, ఈ తెంబు కోసం వారం వారం పరీక్షలు రాస్తున్నట్లుందయ్యా మూడేళ్ళనుంచి” అంటూ కళ్ళద్దాలు తీసి, తేమ తుడుచుకున్నాడు చైర్మన్. డి.ఛై మరేమీ మాట్లాడలేకపోయాడు.

చైర్మన్ పదవీకాలం పూర్తయింది. వీడ్కోలు సభలో, తెంబు ఘనంగా మాట్లాడారు.

“ఇంత సహనం, ఓర్పు గల చైర్మన్ని నేను గత 20 ఏళ్ళలో చూడలేదు. ఆయన తన సహనశక్తి ద్వారా, పరీక్షా పత్రాలు సెట్ చేసే ఒక ఎగ్జామినర్‌గా నేను ఎదగటానికి ఎంతో దోహదపడ్డందుకు శత సహస్ర టన్నుల ధన్యవాదాలు…” చైర్మన్ గారి మొహంలో సంభ్రమాశ్చర్యానందాలతో కూడిన వెర్రి భావోద్వేగం తొంగి చూసింది.

‘స్మార్ట్, స్పీడ్’ వగైరా లక్షణాలకితోడు, ఎదుటివాడు చెప్పేది పూర్తి కాకుండానే వాడి మెదడు వాసనపట్టేసే -నలభయ్యో పడిలో ఉన్న- ఐ.ఏ.ఎస్ అధికారి చైర్మన్‌గా వచ్చాడు.

ఓ శుభముహూర్తాన ఎవరో చైర్మన్‌కి తెంబు గురించి చెప్పారు. “ఈయనకి ఆఫీసులో కన్నా పౌరసంబంధాల పేరుతో బయట ‘సాంస్కృతిక’ షెడ్యూల్స్ ఎక్కువండీ.” కొ.ఛై వినీ విన్నట్లు విని ఊరుకున్నాడు.

ఓ రోజు తెంబుకి చైర్మన్ ఓ సందేశం పంపాడు.

“వచ్చే వారం మన సంస్థ ఆవిర్భావ దినోత్సవం. దీనికి ఏర్పాట్లు చేయండి.”

‘షరా మామూలే ‘అనే పాత కాలపు వాణిజ్యప్రకటనల్లాగా, తెంబు ఒక ప్రశ్నా పత్రాన్ని కొ.ఛైకి కూడా సంధించాడు.

చైర్మన్ నవ్వుకున్నాడు. పిలిచి ఏంచేయాలో చెప్పాడు.

ఓ నెల తరువాత అద్భుతం జరిగింది.

జాతీయ పౌర సంబంధాల సంఘం (Public Relations Society of India) గడచిన సంవత్సరంలో ఈ సంస్థ పౌర సంబంధాల విభాగానికి ‘ఉత్తమ పనితీరు’ అవార్డు ప్రకటించింది. అప్పుడు తెంబు కొ.ఛైకి ఒక నోట్ పంపాడు.

“మన పౌర సంబంధాల విభాగానికి ఇంత జాతీయ స్థాయి బహుమతి రావటం ఇదే ప్రథమం, సంస్థకి ప్రతిష్టాత్మకం కూడా. దీనికి ఒక అభినందన సభ మన సంస్థలో ఏర్పాటు చేస్తే మా సిబ్బంది అందరికీ ప్రోత్సాహకంగా ఉంటుంది.”

“చాలా బాగుంది. అభినందనలు. ఈ పురస్కారానికి కారణం – చైర్మన్ దగ్గరనుంచి క్రింద దాకా ఎవరు పనిచేసినా చేయకపోయినా, ఒక్క పౌర సంబంధాల విభాగం మాత్రమే పనిచేయటమా? లేక, అన్ని విభాగాలూ పనిచేయటమా?.. ఒకవేళ అన్ని విభాగాల్లో అందరూ పనిచేయటమే కారణమయితే, అందర్నీ ప్రోత్సహించనవసరం లేదా? … ఎవరూ పనిచేయకుండా, ఒక్క పౌర సంబంధాల విభాగం పని చేయటం వల్లనే ఈ పురస్కారం వచ్చి ఉంటే, అలా ‘కృత్రిమ ప్రచారాన్ని సృష్టించటం’ సమర్థనీయమా?… అసలు ఈ పురస్కారానికి మన సంస్థలో విభాగాన్ని ఎంపిక చేయటానికి పాటించిన ప్రమాణాలు ఏమిటి? తెలిస్తే నాకు చెప్పగలరా?… (ఇలా 26 ప్రశ్నలు) వీటికి మీరిచ్చే జవాబుల్ని బట్టి, మరి కొన్ని సందేహాలు కూడా ఉత్పన్నం కావచ్చు” అంటూ కొత్త ఛైర్మన్ స్వయంగా తెంబుకి ప్రశ్నలు సంధించారు.

అంతే!

ఆ తరువాత తెంబూ ఎప్పుడూ అలాంటి ప్రక్రియల్ని కొనసాగించే ధైర్యం చేయలేదు.

Exit mobile version