Site icon Sanchika

99 సెకన్ల కథ-47

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత, సంపాదకులు, పాత్రికేయులు జి. వల్లీశ్వర్ ’99 సెకన్ల కథ’ సిరీస్‌లో ఈ వారం రెండు కథలు సంచిక పాఠకులకు అందిస్తున్నారు. ఈ కథలు ప్రపంచతత్వాన్ని, మానవ మనస్తత్వాన్ని సూక్ష్మంగా ప్రదర్శిస్తాయి. [/box]

1. పెళ్ళాం మాట వినాలి

[dropcap]ఆ[/dropcap] మధ్య – చరవాణుల కాలం రాకమునుపు – ‘పెళ్ళాం మాట వినాలి ‘ అని ఓ సినిమా వచ్చింది.

మహా నగరంలో ఆ సినిమా విడుదలకి ముందుగా చిత్ర ప్రచారంలో భాగంగా కొందరు నగర పెద్దలతో, మీడియా వీరులతో ఒక ముందస్తు ప్రదర్శనని ఆ చిత్రం తీసిన కొత్త యువ నిర్మాత మోహనరంగం ఏర్పాటు చేశాడు.

ఈ కార్యక్రమాన్ని ఘనంగా నడిపించడం కోసం పి.ఆర్.ఓ గోపాలం ఒక అయిడియా ఇచ్చాడు.

“వివాదాలు లేని ఒక సినీ విమర్శకుడు, ‘నా ఇష్టం’ అనే సినీ మాసపత్రిక గౌరవ సంపాదకుడు, వయసులో పెద్దవాడు శ్రీగిరి అని ఉన్నాడు. ఆయన మాటని కుర్ర జర్నలిస్టులంతా గౌరవిస్తారు. ఆయన్ని మన కార్యక్రమానికి అధ్యక్షుడిగా పెట్టుకున్నామంటే సూపర్ సర్.”

మోహనరాగం తలూపేశాడు.

….

శ్రీగిరి ఈ బాధ్యత తీసుకోవడానికి ఇష్టపడలేదు.

“నాకు ఈ వేదికలు అలవాటు లేదు. వదిలేయండి” అన్నాడు చాలా మర్యాదగా.

“మీ వంటి వాళ్ళకి వేదికలెక్కటం అలవాటు లేకపోవటం వల్ల మీ మాటకి విశ్వసనీయత ఎక్కువుంటుంది. మీరు వస్తేనే ‘పెళ్ళాం మాట వినాలి’ బాగా జరుగుతుంది సుమా” అంటూ మోహనరంగం (గోపాలం సూచన ప్రకారం) బాగా మొహమాట పెట్టేశాడు.

అప్పుడు గోపాలం కార్యక్రమం వివరించాడు.

“సింపుల్ గురువుగారు. ఖచ్చితంగా 11 గంటలకి అయిదు నక్షత్రాల హోటల్లో ‘పెళ్ళాం మాట వినాలి ‘ అతిథులతో నిర్మాత & దర్శకుడు ముఖాముఖీ ఉంటుంది. చిత్ర స్ఫూర్తిని రంగం గారు వివరిస్తారు. దర్శకుడు తాను ఎలా పైన క్రిందా పడి కొత్త హీరోయిన్ చేత అద్భుతంగా నటింపజేశారో వివరిస్తారు… అసలు వ్యాఖ్యానం అధ్యక్షస్థానం నుంచి మీది. అంతా ‘మీ’ మయమే అనుకోండి. అందరికీ అప్పుడు భోజనం.”

చాలా అయిష్టంగా ఒప్పుకున్నాడు శ్రీగిరి.

పదకొండుంపావు అయ్యేసరికి నగర పెద్దలు చాలామంది చేరుకున్నారు. మీడియా వాళ్ళు తమ తమ స్వానుభవం వల్ల 11:30 దాకా చేరలేదు. అయినా గోపాలం బెంగపడలేదు. ఎందుకంటే అసలు రావాల్సిన నిర్మాత, దర్శకులిద్దరూ రాలేదు. ఎక్కడో చిక్కుకుపోయామని హోటలుకి ఫోన్ చేసి గోపాలానికి చెప్పించారు.

పన్నెండు అవుతోంది.

గోపాలం అందరికీ మజాలు తాగిస్తున్నాడు. బిస్కట్లు తినిపిస్తున్నాడు.

ఠంచనుగా పదకొండుకే వచ్చిన శ్రీగిరి ఒక మూలగా కూర్చుని పుస్తకం చదువుకుంటున్నాడు. మధ్య మధ్యలో చేతి గడియారం చూస్కుంటున్నాడు. ప్రతి పావుగంటకీ ఒకసారి గోపాలానికి, కుడి చేతి పిడికిలి అడ్డం తిప్పి చూపిస్తూ “ఎక్కడ?” అన్నట్లు సైగ చేస్తున్నాడు.

గోపాలం – ఆముదం దొరక్క ఆడవాళ్ళ ఫేసు క్రీం రాసుకున్నట్లుగా మొహం పెడుతూ, కాస్సేపు కనిపించకుండా తచ్చాడుతూ తిరుగుతున్నాడు.

ఎందుకైనా మంచిదని పన్నెండు దాటేసరికి గోపాలం గిఫ్ట్ ప్యాకెట్లు అన్నీ అందరికీ కనబడేలా వేదిక పక్కన పెట్టించాడు. మీడియా ఎవ్వరూ కదలటం లేదు. అయినా కొందరు నగర పెద్దలు అసహనంగా కనబడితే “అయిదు నిమిషాలు, అయిదు…” అంటూ వాళ్ళని బ్రతిమాలుతున్నాడు.

12:30

అప్పుడు దిగారు నిర్మాత, దర్శకులు. అప్పటికే నిద్రలోకి జారుకుంటున్న శ్రీగిరిని గోపాలం ఎవరూ చూడకుండా లేపి తీసుకువచ్చాడు.

కార్యక్రమం మొదలైంది. గోపాలం చిత్ర బృందాన్ని పరిచయం చేశాడు. “ఇప్పుడీ ‘పెళ్ళాం మాట వినాలి ‘ కార్యక్రమాన్ని శ్రీగిరి గారు నడిపిస్తారు” అని ప్రకటించాడు.

శ్రీగిరి నీరసంగా లేచాడు. మైకు ముందుకొచ్చాడు.

“నేను పొద్దుటే నా భార్యకి చెప్పాను – ఇలా ‘పెళ్ళాం మాట వినాలి’ అనే సినిమా పరిచయ కార్యక్రమం ఒప్పుకున్నానే, అన్నం కూడా అక్కడే తినిపిస్తారుట అని. ‘వద్దయ్యా, వెళ్ళొద్దు. నీ ఒంట్లో పెద్ద షుగర్ ఫ్యాక్టరీ వుంది. అక్కడ లేటయితే తట్టుకోలేవు. రాలేనని చెప్పేయ్. నీ కోసం ఇవ్వాళ దేశవాళీ గుత్తి కాకరకాయ కూర చేస్తున్నా. ఉల్లి కాడల పప్పు చేస్తున్నా. కొత్త ఆవకాయ వేసుకుని పదకొండింటికల్లా తినేద్దాం…’ అని మొత్తుకుంది. ‘పెళ్ళాం మాట వినాలి’ కదా! వినలేదు. చెమటలు కక్కుతూ వచ్చాను. అసలు పెళ్ళాం మాట వినాలి – అని ప్రజలకి చెప్పాలి అని నిర్మాత, దర్శకులకి వాళ్ళ వాళ్ళ అనుభవాలు చెబుతుంటే, నాకెందుకు తోచలేదో అర్థమయి చావటం లేదు.. ..

(నిర్మాత ఏదో చెప్పబోయాడు.) నాకు కళ్ళముందు గుత్తి కాకరకాయ కూర, ఉల్లికాడల పప్పు, కొత్త ఆవకాయ….! ప్చ్.. ఏమైనా ఇది చాలా గొప్ప సినిమా. ఎందుకంటే పెళ్ళాం మాట వినకపోతే, ఏమవుతుందో ఇప్పుడు మీక్కూడా అర్థమయి ఉంటుంది… (నిర్మాత మళ్ళీ ఏదో..) అసలు ఎంత కోపంగా అరుచుకున్నా, తిట్టుకున్నా, ఏ పెళ్ళామయినా వంట దగ్గర ప్రేమ చూపించి తీరతారు. ఇవ్వాళ నాకు గుత్తి కాకరకాయ కూర, ఉల్లికాడల పప్పు, కొత్త ఆవకాయ ప్రాప్తం లేవంటే, అర్థం ఏమిటి? పెళ్ళాం మాట వినాలి. (నిర్మాత మళ్ళీ..) నిర్మాత మంచి అభిరుచి కలిగిన వాడు కనుక తన స్వానుభవాన్నుంచి నేర్చుకున్న విషయాలతో ఈ ‘పెళ్ళాం మాట వినాలి’ చిత్రం తీశారు. బహుశా ఈ సినిమా తీయాలని కూడా ఆయన భార్యే చెప్పి ఉంటుంది. ఆయన విన్నాడు. వినకపోతే, కాకరకాయ కూర, ఉల్లికాడల పప్పు …”

నిర్మాత మోహనం ఠపీమని లేచాడు.

“నాకసలు పెళ్ళే కాలేదు. నా మాట వినరేం?” అన్నాడు అసహనంతో.

శ్రీగిరి అమాయకంగా నిర్మాత మొహం వంక తేరిపార చూశాడు.

“ప్చ్.. చూశారా! పెళ్ళామే లేనివాడు ‘పెళ్ళాం మాట వినాలి’ సినిమా తీస్తే ఇలాగే ఉంటుంది – కాకరకాయ కూర, ఉల్లికాడల పప్పు నా కోసం ఏడుస్తున్నట్లు.”

మోహనానికి కోపం వచ్చింది.

“ఎన్ని సార్లు చెబుతారండి ఆ కాకరకాయ కూర, ఉల్లి ….?”

“పెళ్ళాం మాట వినాలి – అని మాకు అనిపించనంతగా సకాలంలో సభ జరపాలని తమకి అనిపించేదాకా.”

అంతే!

నిర్మాత మోహనం మొహం మాడిపోయింది. అందరికీ ఒంగి ఒంగి క్షమార్పణలు చెప్పాడు.

(ఓ వాస్తవ ఘటన)

2. కాముడి నిర్వేదం               

“అన్నయ్య గారూ, అమెరికానుంచి వచ్చి నెలరోజులవుతోంది. ఇక్కడికొస్తే ఆయన బాగా తేరుకుంటారని అనుకున్నాను. అక్కడికీ మద్రాసులో ఆయన బాల్య స్నేహితుడి కూతురి పెళ్ళి అంటే అక్కడిక్కూడా తీసుకెళ్ళాను. ఏమీ కోలుకోకపోగా, ఇంకా నీరసం, నిర్వేదం లోకి వెళ్ళిపోయారు. మీరొకసారి రావాలి…”

కాత్యాయని ప్రాథేయపూర్వకంగా శేషయ్యని ఫోనులో అడిగింది.

శేషయ్యకి ఆశ్చర్యంగా అనిపించింది.

“అదేమిటమ్మా, మీరు వచ్చిన మొదటి వారంలోనే కలిశాను కదా! ఇంతలోకే ఏమైంది?”

“మీరు వచ్చినప్పుడు ఎక్కువసేపు లేరు కదా అన్నయ్యా. పైగా, చాలా సంవత్సరాల తరువాత మిమ్మల్ని కలుసుకున్న ఆనందంలో ఆయన తాత్కాలికంగా తేరుకున్నారు. మీరు వెళ్ళిపోయిన మర్నాడే మేం మా ఆడపడుచు ఇంటికి, రెండు రోజుల తరువాత ఢిల్లీకి … అలా తిరుగుతూన్నాం. ఆ నిస్పృహ, నిర్వేదం మాత్రం …”

కాత్యాయని భర్త కామేశ్వర రావు శేషయ్యకి బంధువు. తమ్ముడి వరస. అమెరికాలో పిహెచ్‌డి చేశాడు. అక్కడే నాసాలో సైంటిస్టుగా పనిచేశాడు. ముగ్గురు కొడుకులు. అందరూ బాగా స్థిరపడ్డారు. రిటైరయ్యాక రెండు మూడేళ్ళకోసారి హైదరాబాద్ వచ్చి, సొంత ఇంటిలో తనకోసం ఉంచుకున్న వాటాలో నాలుగురోజులు ఉండటం, తన బంధువుల్ని, కాత్యాయని బంధువుల్ని పలకరించి వెళ్ళటం అలవాటు చేసుకున్నాడు.

“అవునమ్మా, పసిగట్టలేకపోయాను. ఏమిటి అనారోగ్యం?”

“తెలియదు అన్నయ్యగారు. డాక్టర్లు కూడా ఏమీ లేదంటున్నారు. ఏదో మానసిక సమస్య అంటున్నారు. ఆయన ఒప్పుకోవటం లేదు.”

శేషయ్య కొద్ది క్షణాలు ఆగారు.

“కాత్యాయని, నలభయ్యేళ్ళక్రితం మీరు అమెరికా వెళ్ళిన కొత్తలో కామేశ్వరానికి తన రీసెర్చ్ స్టేషన్లో ఒక ఆఫ్రికన్ అమ్మాయితో సంబంధం గురించి నాకు లెటర్స్ రాశావు కదా! ఆ అమ్మాయి ఇప్పుడు …?”

శేషయ్య అనుమానం కాత్యాయనికి అర్థమయింది.

“ఛ ఛ … ఆ అమ్మాయికి పెళ్ళయి, ఆస్ట్రేలియా వెళ్ళిపోయింది. గత పాతికేళ్ళలో ఈయన చాలా మారిపోయారు. భక్తి, పూజలు … కొంచెం ఒంటబట్టాయి.”

“ఇప్పుడెన్నేళ్ళు?”

“75.”

“నువ్వు ప్రేమగా అడిగి చూశావా తన సమస్య ఏమిటో?”

“అన్నీ అయ్యాయండీ. ఏమీ లేదంటారు. డాక్టర్లూ అదే అంటారు. కాని ఆయన రోజు రోజుకీ క్రుంగిపోతున్నారు …” అంటూ ఒక్కసారిగా ఏడ్చేసింది ఫోనులోనే కాత్యాయని.

“సరే, నేను రేపు ఉదయం నాతో ప్రభాత నడకకి తీసుకెళ్తాను.”

….

“ఏమయ్యా, కామేశ్వరం. నీ మానసిక సమస్య ఏమిటో నాకయినా చెప్పు. మనసులో దాచుకుని రోజు రోజుకీ నువ్వు బలహీనపడిపోతున్నావ్ – మానసికంగా, శారీరకంగా….”

శేషయ్య పదే పదే అడిగారు…

చివరికి, ‘కాత్యాయనికి చెప్పను’ అని మాట తీసుకున్నాక కాముడు బయట పెట్టాడు.

“మా నాన్నకి మేం నలుగురం మగపిల్లలం. ఆడపిల్ల ఉంటే ఇంటికి కళ అని, కాని ఒక్క ఆడపిల్లయినా పుట్టలేదని మా అమ్మ బాధ పడేది. వినగా వినగా నాకూ ఆ కోరిక పుట్టింది. ఆడపిల్ల వున్న ఇంట్లో వాతావరణం, కళ నిజంగానే వేరు. ఏమంటారు?”

“ఊ…”

“మాకు మొదట ఆడపిల్ల పుట్టాలనుకున్నాను. కాత్యాకి చెప్పాను. కాని, కొడుకు పుట్టాడు. నేను బాధపడ్డాను. కాత్య ఏడ్చింది – నా కోరిక తను తీర్చలేకపోయానని. రెండోసారీ అంతే. నేను ఏడ్చాను. తను ఇంకా ఏడ్చింది. ఆ దుఃఖంలో తనకి ఫిట్స్ వచ్చాయి. మూడోసారి అయినా నాకోసం ఆడపిల్లపుట్టాలని తను కూడా మొక్కులు మొక్కింది. నోములు పట్టింది. దేవుడు కరుణించలేదు. మళ్ళీ దుఃఖం… ఆమెని ఆ ఫిట్స్ సమస్యనుంచి కాపాడుకోవటం గగనమైపోయింది. అప్పట్నుంచీ తన దగ్గర ఆ ప్రస్తావన తేవటంలేదు. నా కోరిక లోలోపలే నన్ను క్రుంగదీస్తోంది. మా కుటుంబంలోనే ఇలా ఎందుకు జరుగుతోంది ?…” ఇలా అంటూ కాముడు ఒక్కసారిగా నీరసంతో ఆ పార్కులో కూలబడి పోయాడు.

శేషయ్య కాముడికి సేదతీర్చే హాస్యోక్తులు వినిపించాడు. కాముడు సేదదీరాడు.

“కాముడూ, ఆడపిల్ల పుట్టుకకి పరమార్థం ఏమిటో తెలుసా?.. కన్యాదానం. మనిషి చేయాల్సిన షోడశ దానాలలో కన్యాదానం ఒకటి. కన్యాదానం చేయటంవల్ల ఎంత పుణ్యం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయో తెలుసా?”

కాముడు శ్రద్ధగా వింటూనే తల అడ్డంగా ఊపాడు.

“ఒక పెద్ద ఆవాల రాశిలోని ప్రతి ఆవగింజని లెక్కించటానికి ఎంతకాలం పడుతుందో, అంతకాలం ఆ కన్యాదాత పితృదేవతలకు పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి. పెళ్ళిలో వరుడి తండ్రి – సమస్త దేవతలు, పంచభూతాల సాక్షిగా కన్యాదానం చేస్తూ, ‘దశ పూర్వేషాం …. కన్యాదానం అహం కరిష్యే’ అంటాడు. నా పితృరుణం తీరటంకోసం, వెనకటి పదితరాలు, ముందు పదితరాల్లో నా వంశీయులైన పితరులకు శాశ్వత బ్రహ్మలోక నివాసం కోసం, బంగారంతో అలంకరించిన ఈ కన్యను దానం చేస్తున్నాను…”

“నాకు ఆ ప్రాప్తం లే…” అంటూ కాముడు మాట్లాడబోతే, ఆపారు శేషయ్య.

“సైదాబాదులో ‘వైదేహి’ ఆశ్రమంలో అమ్మా, నాన్న లేని ఆడపిల్లల్ని నీ కన్నా, నా కన్నా మంచి సంస్కారంతో పెంచి చదివిస్తున్నారు. కన్యాదానం చేసే భాగ్యం నీకు అక్కడ లభిస్తుంది. ఈ నిర్వేదం వదిలేయ్…”

కామేశ్వర రావులో నిర్వేదం స్థానంలో కొత్త ఆశ, కొత్త ఉత్సాహం పరవళ్ళు త్రొక్కాయి.

మొహం వెలిగిపోయింది.

Exit mobile version