99 సెకన్ల కథ-49

0
3

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత, సంపాదకులు, పాత్రికేయులు జి. వల్లీశ్వర్ ’99 సెకన్ల కథ’ సిరీస్‌లో ఈ వారం రెండు కథలు సంచిక పాఠకులకు అందిస్తున్నారు. ఈ కథలు ప్రపంచతత్వాన్ని, మానవ మనస్తత్వాన్ని సూక్ష్మంగా ప్రదర్శిస్తాయి. [/box]

1. మాటే మంత్రం!

“… నా తమ్ముడి పిల్లలకి నా ఇంటి కుక్కకున్న విశ్వాసం కూడా లేదు.” ఆవేశంగా అరిచేశాడు శ్రీనివాసరావు శేషయ్య ముందు.

ఆపుకోలేనంతటి ఉమ్మస్సుతో ఊగిపోతున్నాడు.

శేషయ్య అతన్ని ఆపాలని ఒకటి రెండుసార్లు ప్రయత్నించారు.

“మీరు ఒక్క అయిదు నిమిషాల ముందు రావలసింది. వాడు కూసిన కూత వింటే, మీరు కూడా ‘థూ’ అని మొహాన ఉమ్మేసి ఉండేవారు… వాడు ఎమ్మెస్ చదవటానికి అమెరికా వెళ్తానంటే, అమ్మా నాన్న లేని పిల్లాడు కదా అని సాయం చేశాను. వాడి చెల్లెలి పెళ్ళికి నేనే సంబంధం చూసి, దగ్గరుండి ఘనంగా పెళ్ళి చేశాను. అది పోయి, ఆస్ట్రేలియాలో సెటిల్ అయిపోయింది. ఇప్పుడు వీడొచ్చి, ‘నా వారసత్వ పొలం అమ్మేద్దామనుకుంటున్నా, సరిహద్దుల విషయంలో రాళ్ళు జరిగినట్లున్నాయి, కొంచెం కొలిపిస్తావా?’ అని అడిగాడు. ఎంత ధైర్యం? నేను అలా రాళ్ళు జరిపే స్థాయివాడినా? ఎంత అవమానించాడు వాడి ఫ్రెండు ముందర? …”

శ్రీనివాస్ మొహం సగం కోసిన కందగడ్డ రంగులోకి తిరిగిపోయింది. ఉద్రేకంగా అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు.

శ్రీనివాస్ భార్య లీల కూడా ఆయన్ని ఆపే ప్రయత్నం చేయటం లేదు. పైగా భయపడుతోంది.

“ఈయనకి రక్తపుపోటు ఉంది అన్నయ్యగారూ…” అని సన్నగా శేషయ్యకి వినబడేలా గొణుగుతోంది.

శేషయ్య సూచనతో లీల చల్లటి మజ్జిగ తెచ్చింది. శేషయ్య చొరవగా ఒక మజ్జిగ గ్లాసుని శ్రీనివాసుకిచ్చి త్రాగించాడు.

అతని ఆవేశం చల్లారాక, శేషయ్య గొంతు విప్పారు.

“75 ఏళ్ళ వయసులో ఆ ఆవేశమేమిటి?… ఎంతయినా రామం నీ తమ్ముడి కొడుకు. నీకన్న వయసులో చిన్నవాడు.”

“ఏమిటి చిన్న? వాడికీ 40 నిండాయి.”

“నేను ఇంట్లో అడుగుపెట్టేసరికి అంతటి వాణ్ణి – ‘కృతఘ్నుడివి, నాశనమైపోతావ్’ లాంటి పదాలతో….? ప్చ్. పైగా నా కళ్ళముందే వాణ్ణి, ‘ఫోరా, ఫో…’ అనేశావే. (శ్రీనివాస్ మాట్లాడటం లేదు.) చరిత్రలో ప్రొఫెసరుగా వందలాది పిల్లల్ని చరిత్రకారులుగా తీర్చిదిద్దినవాడివి. నువ్వే ఇలా ….”

కొద్ది నిమిషాలు నిశ్శబ్దం.

“శీనయ్యా, నువ్వు మాట్లాడిన విధానం నీ స్థాయికి తగినట్లు లేదు. ఆ స్థితిలో వాడు నన్ను చూస్తూనే సిగ్గుతో తలొంచుకుని వెళ్ళిపోయాడు…అసలెందుకంత ఆగ్రహం వచ్చింది?” నిదానంగా ప్రశ్నించారు శేషయ్య.

అప్పటికి శ్రీనివాస్ కుదుటబడ్డాడు.

“ఎవడో ఫ్రెండుని వెంటబెట్టుకొని వచ్చాడు కదా! వాడెవరో నాకు తెలీదు. రెండేళ్ళతరువాత వచ్చినవాడు ‘ఎలా ఉన్నావు పెదనాన్న?’ అంటూ గౌరవంగా ఒక ప్రణామమూ లేదు, పరామర్శా లేదు. ‘హాయ్, పెదనాన్న’ అంటూ మొదలెట్టాడు. ‘అమెరికాలోనే సొంత ఇల్లు కట్టాలనుకుంటున్నాను. మా నాన్న వాటా పొలం అమ్మేస్తాను. నిన్న పొలం దగ్గరకే వెళ్ళి, విచారించాను. ఆ మధ్య కొలతలు చేసి, సర్వే రాళ్ళు జరిపారని ఎవరో చెప్పారు. మరోసారి, హద్దులు కొలిపిస్తే నాకు అమ్మటం సులువుగా ఉంటుంది. కొంచెం ఆ పనేదో చేయిస్తావా’ అని అడిగాడు… నా కళ్ళముందు పెరిగిన వెధవ. నా సాయంతో చదువుకున్న ఇడియట్.. వాడు తన ఫ్రెండ్ ముందర నన్ను సర్వే రాళ్ళు జరిపేసే చవకబారు మనిషిలా చూస్తాడా?…” మళ్ళీ ఆవేశం తన్నుకొస్తోంది.

శేషయ్య ఆపేశారు.

“వాడి వాటా పొలం వాడు అమ్ముకోవటంలో నీకు అభ్యంతరం ఏమిటి?”

“ఏమీ లేదు. చుట్టచుట్టి చంకలో పెట్టుకొని పొమ్మను. ఎవడిక్కావాలి ఆ ఎకరం ముక్క! నేనంటే విస్తరించుకున్నా కాబట్టి, పక్కనే ఉందని చూసుకుంటూ వస్తున్నా.”

శేషయ్యకి విషయం అర్థమైంది.

“శీనయ్యా, వాడు నిన్ను అపార్థం చేసుకోవటం మంచిదికాదు. నీ పిల్లలూ, వాడి పిల్లలూ అమెరికాలో స్నేహితులు కదా! ఆ బంధాలు బాగుండాలి. మళ్ళీ ఎప్పుడన్నా వాడు వస్తే, ఇలా ఆగ్రహం కాక ప్రేమ ప్రదర్శించటానికి ప్రయత్నించు” అంటూ లేచారు.

శ్రీనివాస్ ఆలోచించసాగాడు.

ఆ సాయంత్రం శేషయ్య హనుమాన్ గుడికి వెళ్ళేసరికి అక్కడ రామం కలిశాడు. సత్సంగం అయ్యాక, తానే ఆయన దగ్గరికి రావాలనుకుంటున్నానని రామం చెప్పాడు. ఆ ఉదయం పెదనాన్నతో జరిగింది చెప్పాడు.

“ఆయన మమ్మల్ని చదివించాడు అంకుల్. నిజమే. కాని, అదంతా నేను నా వ్యాపారం ప్రారంభించగానే తీర్చేశాను. చెల్లి పెళ్ళికి ఆయన ఖర్చుపెట్టింది కూడా. అవన్నీ ఇవ్వాళ నేను అడిగి ఉండచ్చు. కాని హనుమాన్ దీక్షలో ఉన్నాను. ఇవ్వాళ శనివారమని ఆగాను…” ఆవేదన, బాధ ధ్వనించాయి.

“ఆయన ఖర్చుపెట్టింది తీర్చేసినంత మాత్రాన ఆయన తీసుకున్న బాధ్యతకి నువ్వు విలువకట్టలేవు. తప్పు. అలా ఇంకెప్పుడూ ఆలోచించకు… సరే, నీకు మీ పెదనాన్నమీద ఇంకేదన్నా కారణంగా ద్వేషం ఉందా?”

“ఎందుకుంటుంది అంకుల్? మీరు చెప్పింది నా మనసులో ఉంది. హైస్కూలు అయ్యేనాటికి అమ్మా,నాన్న కాలం చేశారు. ఆప్పుడు తనేకదా మమ్మల్ని పట్టించుకొన్నాడు!.. ఆ ఆవేశంలో ఇవ్వాళ అలా అనిపించింది కాని…” గౌరవం వినిపిస్తోంది ఆ కంఠంలో.

“అవునూ, నీతో వచ్చిన ఆ ఫ్రెండు ఎవరు?”

“అతను, అమెరికాలో నా వ్యాపార భాగస్వామి. గుజరాత్ వాడు.”

శేషయ్య రామాన్ని మర్నాడు ఉదయాన్నే ఒంటరిగా వెళ్ళి, శీనయ్యని కలవమని చెప్పాడు. “ఈ రాత్రికి, రామాయణంలో తొలిసారిగా హనుమ – రామలక్ష్మణుల ఎదుట కనుపించే కిష్కింధకాండలో మూడవ సర్గ చదువుకో” అంటూ, ఆ తరువాత ఏం చెయ్యాలో చెప్పారు శేషయ్య.

….

మర్నాడు సాయంత్రానికి శీనయ్య దగ్గరనుంచి శేషయ్యకి ఫోన్ వచ్చింది.

“శేషయ్య, ఇవ్వాళ రామం మళ్ళీ వచ్చాడు. ఏదేదో చెప్పాడు. ఎంతయినా నా సహోదరుడి తమ్ముడు కదా – అని సానుభూతితో విన్నాను. వాడిని బాధ పెట్టడం ఎందుకులే అని నా కారులోనే గ్రామానికి తీసుకెళ్ళి, పొలం కొలిపించాను. ‘మార్కెట్ ధరకన్నా 10-15 శాతం ఎక్కువిచ్చి, నేనే కొనేస్తా లేరా’ అన్నాను. పిచ్చి వెధవ. బ్రహ్మానంద పడిపోయాడను కోండి. (గొంతులో వాత్సల్యం) ఇవ్వాళ వాడు వాళ్ళ నాన్న గురించి నా చేత చాలా విషయాలు చెప్పించుకున్నాడు. నాకే జాలేసింది సుమండీ…” ఆ గొంతులో ఆప్యాయత, ఆత్మీయత వినిపిస్తున్నాయి.

రాత్రికి రామం వచ్చి కలిశాడు.

“మీరు చెప్పినట్లు నేను ఒక్కడినే వెళ్ళాను. అనుమానాస్పద స్థితిలో కనుపించిన రామలక్షణులకు హనుమ స్వాగతం చెప్పిన శ్లోకాలు తలుచుకుంటూ వెళ్ళి, పెదనాన్నకి పాదాభివందనం చేశాను. నాకు ఆయనలో కనుపించే విజ్ఞానం, సంస్కారం, సమాజసేవ అన్నీ ప్రస్తావించాను. ఆయన ఆనందంతో పెద్దమ్మని పిలిచి, ‘వీడిలో నా తమ్ముడే కనుపిస్తున్నాడు. ఇవ్వాళ వీడు ఇక్కడే భోంచేస్తాడు’ అని చెప్పాడు. ఆ తరువాత అంతా మీరు ఊహించినట్లే జరిగింది. అంకుల్, మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో…” అంటున్న రామం కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.

“నాకు కాదు రామం. కార్యసాధకులు ‘అహంభావాల ఘర్షణలకు అవకాశం ఇవ్వకుండా’ ఎలా మాట్లాడాలో మన సమాజానికి నేర్పిన వాడు నువ్వు కొలిచే హనుమ. అన్ని ధన్యవాదాలూ ఆయనకే చెందుతాయి” అంటూ శేషయ్య దరహాసం చేశారు.

2. గుడి గంటలు మోగాయి      

“…. పశ్చిమ దేశాల్లో విడాకులు ఎక్కువ. ఒక్క భారతీయ సనాతన ధర్మమే విడాకులకు అవకాశం లేని దాంపత్యాన్ని ప్రోత్సహిస్తోంది….”

అమెరికాలో – చికాగోలోని స్వామి నారాయణ్ దేవాలయ ప్రాంగణంలో అక్కడి భారతీయ యువతనుద్దేశించి ప్రసంగించారు స్వామి సుజ్ఞాన స్వరూపానందజీ మహరాజ్.

…..

రాజమండ్రిలో ఒక పెద్ద లాయరుగారింట్లో అయిదు రోజుల పెళ్ళి. సిటీ బయట ఒక రాజావారి తోటబంగళాలో జరుగుతోంది.

ఆ పెళ్ళిలో ఛంగు ఛంగుమని గెంతుతూ మగ యువత గుండెల్ని లాగేసేలా తన వాల్జడని వయ్యారంగా విసురుతూ, కాటుక కళ్ళని లేడిపిల్లలా అటూ ఇటూ తిప్పుతూన్న పాతికేళ్ళ కళ్యాణి మొదటిరోజునే మగ కళ్ళన్నంటినీ తన చీర కొంగు చుట్టూతిరిగేలా కట్టి పడేసింది. “బాపు ఈ అమ్మాయిని చూసే ఆ బొమ్మలు గీసుంటాడు” అని 70-80 ఏళ్ళ యువకులు కూడా చెవులు చప్పరించుకున్నారు.

కళ్యాణి మాత్రం, మొదటి రోజు సాయంత్రానికి ‘కన్యాశుల్కం’ సినిమాలో ఎన్.టి.రామారావులా గిరజాల జుట్టుతో, తెల్ల పంచకట్టి, అదే రంగు లాల్చీ వేసి విలాసంగా రుమాలుతో మొహం అద్దుకుంటూ దిగిన పచ్చి తెలుగు కామేశం మీద చూపులు (అప్పటికి) పారేసుకుంది.

అక్కడ్నుంచి కాఫీ కప్పులు మొదలుకొని కిళ్ళీలు అందించే సీను దాకా తరచూ కళ్యాణే వచ్చి ఇవ్వటం, ఆ ఇద్దరి వేళ్ళు తాకీ తాకనట్లు తాకి, నరాలు జివ్వుమన్న భ్రాంతి కలగటం మొదలైంది. అలా వచ్చి కళ్యాణి వెనక్కి తిరిగినప్పుడల్లా వాళ్జడ కామేశం ఛాతీకి తగిలి, తన గుండెని ఆమె లాక్కుపోతోందన్ని భ్రమ కలిగేది.

మూడోరోజు సాయంత్రానికి కళ్యాణి, కామేశాల ‘ఢీ’ కథలు గంగావతరణం గాథలా ప్రచారంలోకి వచ్చేశాయి. వధూవరుల పాణిగ్రహణ సమయంలో ఈ ఇద్దరూ తమకే పెళ్ళి జరుగుతున్నట్లు ఆ మంత్రాలు వింటూ పరవశించిపోయారని ఒకరంటే …

మధ్యాహ్నం అంతా భోజనాల శాలలో భోజనం చేస్తుంటే, వీళ్ళిద్దరూ గోళ్ళు కొరుక్కుంటూ వెనకాల గోశాలలో ఆవులకి పాలు తాగిస్తున్నారని మరొకరు …

…ఇలా అతిథులంతా అసలు వధూవరుల్ని వదిలేసి, వీళ్ళకోసం ఆరా తీయటంలో ఆనందపడిపోతున్నారు.

ఈ కథలు విని వినీ, తమకి చెప్పకుండా సభ్య సమాజం పాడై పోతోందని 70-80 ఏళ్ళ యువకులు విలవిల్లాడిపోయారు.

ఎవరు వీళ్ళిద్దరూ?

లాయరు చెప్పాక తెలిసింది. పుల్లేటికుర్రు పరంధామయ్య మనవరాలు కళ్యాణి. ఆమెని ఢీ కొట్టే చాన్సుకోసం గుమ్మాల చాటున పడిగాపులు కాసే పంచ కుర్రాడు ముంబై మల్లిఖార్జునానికి మేనల్లుడు.

వృద్ధ యువకులంతా కలిసి, ఒక ప్లాను ప్రకారం రెండు బృందాలుగా ఏర్పడి, ఈ ఇద్దరికీ ఇప్పుడే పెళ్ళి నిశ్చయించేద్దాం అనుకున్నారు.

అప్పుడు కళ్యాణి ఓ బృందాన్ని ఓ ప్రశ్న అడిగింది.

అలాంటి ప్రశ్నే కామేశమూ రెండో బృందాన్ని అడిగాడు.

ఆశ్చర్యంగా, ఇద్దరూ ఒకే జవాబు చెప్పారు.

ఇంకేంటి?

“శీఘ్రమే కళ్యాణి ప్రాప్తిరస్తు” అని కామేశాన్ని,

“శీఘ్రమే ఇష్ట కామేశార్ధ సిద్ధిరస్తు” అని కళ్యాణిని అంటూ అంతా ఆశీస్సులు కుమ్మరించారు.

అటు సీతారామయ్యని, ఇటు మల్లిఖార్జున్ దంపతుల్ని వెంటనే పిలిపించి, మూడుమాసాల తరువాత మంచి మహూర్తం కూడా రోల్డు గోల్డు పత్రం మీద పురోహితుడిచేత రాయించేసారు.

….

చికాగోలోని స్వామి నారాయణ్ ఆలయ ప్రాంగణంలో పాంటు, చొక్కాతో ప్రదక్షిణ చేస్తున్న కళ్యాణి, చినిగీ చినగనట్లు దారాలు వేళ్ళాడుతున్న నిక్కరుతో కామేశం ఎదురుపడ్డారు. అంతే, మాటా మాటా పెరిగింది.

“ఇదేమిటి? సనాతన ధర్మం కోసం నన్ను చేసుకుంటున్నానన్నావ్. కానీ, నువ్వు అమెరికాలో ఉంటున్నట్లు నాకు చెప్పలేదు…నువ్వూ చెప్పలేదు … మోసం … మోసం..”

గుళ్ళో అరుచుకుంటే దేవుడి ప్రశాంతతకు భంగం అని ఇద్దరూ వీధిన పడ్డారు.

వాళ్ళ అరుపులు, ఆవేశాల వర్షాలు చూసి, అటుగా వెళ్తున్న ఓ అమెరికన్ వృద్ధ జంట కారు దిగారు.

చేతి కర్రతో అతనూ, అతని చేయి పట్టుకొని భార్య వీళ్ళిద్దరి మధ్యకీ వచ్చేశారు.

ఇద్దరు ఒకరినొకరు ఎలా “మోసం చేశారో” తెలుసుకున్నారు.

వాళ్ళ తీర్పు ఏమిటంటే …

“మీ ఇద్దరూ మీ దేశ సాంప్రదాయాన్ని గౌరవించే భారతీయుల్నే పెళ్ళాడాలనుకున్నారు. అందుకోసం మీ పద్ధతిలో మీరు వెతుక్కున్నారు. ఎందుకు? విడాకుల్లేని దాంపత్యం కోసం. విడాకులదాకా వెళ్ళకుండా కాపురాల్ని నిలబెట్టేవి – వివాహ వ్యవస్థ పట్ల విశ్వాసం, గౌరవం. అవి ఉన్నంత వరకూ ఏ దేశంలో నయినా విడాకుల అవసరం లేదు, రాదు. మా ఇద్దరికీ చర్చిలో పెళ్ళయి 65 ఏళ్ళు. మేమింకా విడిపోలేదు. భవిష్యత్తులో…” అంటూ ఒకరినొకరు చూసుకొని ఫెళ్ళున నవ్వారు. (వాళ్ళకి పళ్ళు లేకపోవటంతో, ఆ నవ్వు బయటికి వినబడలేదు.)

కాని, కళ్యాణి, కామేశాలకి గుళ్ళో గంటలు వినిపించాయి.

వాళ్ళ పెళ్ళి వాయిదా పడలేదు, ఆగిపోనూ లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here