[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత, సంపాదకులు, పాత్రికేయులు జి. వల్లీశ్వర్ ’99 సెకన్ల కథ’ సిరీస్‌లో ఈ వారం రెండు కథలు సంచిక పాఠకులకు అందిస్తున్నారు. ఈ కథలు ప్రపంచతత్వాన్ని, మానవ మనస్తత్వాన్ని సూక్ష్మంగా ప్రదర్శిస్తాయి. [/box]
1. గీతకి నచ్చిన వరుడు!
[dropcap]”అం[/dropcap]కుల్, ఎన్నో మంచి సంబంధాలు వచ్చాయి. వాటిల్లో మా గీతకి నచ్చింది అంటూ ఒక్కటి కూడా లేదు. అక్కడికీ ఆ అబ్బాయిలతో మాట్లాడమన్నాం. కొంతమందితో మాట్లాడింది కూడా. ప్రతివాడికీ ఓ వంక పెడుతోంది. ఒకడికి బట్టతల… ఇంకొకడు గోళ్ళు కొరుక్కుంటాడట… మరొకడు అతిగా వాగుతాడట… ఎన్నని చెప్పమంటారు!” అంటూ శేషయ్య గారి ముందు వాపోయాడు సుందరం.
అతని భార్య శాంత అందుకుంది.
“..మేం చూస్తూ వుండగానే మేం ఎంపిక చేసిన మంచి సంబంధాల అబ్బాయిలకి పెళ్ళిళ్ళు కూడా అయిపోతున్నాయి…”
“ఒకరిద్దరికి అర టిక్కెట్లు కూడా పుట్టేశారు…” కళ్ళొత్తుకున్నాడు సుందరం.
“దీని వయసు పాతిక దాటిపోతోంది. వయసు పెరుగుతున్న కొద్దీ ఇంకా పెద్ద వయసు కుర్రాళ్ళనే చూడాలి కదా…”
“ఇంకా లేటయిపోతే రెండో పెళ్ళివాళ్ళు దొరకటం కూడా కష్టమే కదా అంకుల్..” మళ్ళీ సుందరం కళ్ళల్లో నీళ్ళు.
“మీరే ఏదో చేసి పుణ్యం కట్టుకోవాలి అన్నయ్య గారూ” అంటూ సుందరి కూడా తన గోడు వెళ్ళబోసుకుంది.
నా స్నేహితుడు సుందరం దంపతుల్ని నేనే శేషయ్య గారి దగ్గరికి తీసుకెళ్ళాను. వాళ్ళమ్మాయి గీత ఎమ్మెస్ చదివింది. అందంగా వుంటుంది. చురుకైంది. అవతలి వ్యక్తుల్ని అంచనా వేయటంలో మేధావి. అందుకే ఆ పిల్లకి ప్రేమించటానికి కూడా అంత స్పీడున్న వాడెవడూ తారసపడలేదు. ఈ శాంతా సుందరులు తమ బంధు వర్గాల నుంచి ఆత్మ బంధువుల దాకా అన్ని సంబంధాలు చూసేశారు. అవి కూడా దాటి, ‘మేటర్-మనీ’ (మెట్రిమొనీ) కంపెనీలకు ధారాళంగా విరాళాలు కూడా సమర్పించుకున్నారు. ఆ విరాళాలు లక్షల్లోకి చేరుతున్నాయి కానీ, వరుళ్ళు మాత్రం ఖరారు కావటం లేదు.
“అసలు పెళ్ళి చేసుకోనంటోందా?” శేషయ్య గారి ప్రశ్న.
“అలా అస్సలు అనటం లేదు…” సుందరం కళ్ళల్లో మళ్ళీ …!
“పోనీ ప్రేమ లాంటి పదార్థం ఏదన్నా రుచి చూసిందా?”
“ఛ, ఛ… దానికి అసలు ఎవడూ ఓ పట్టాన నచ్చటం లేదండీ..”
“గీత అంటే ఆ మధ్య నేను ఢిల్లీ వెళ్ళి వస్తుంటే, విమానంలో నాతో పాటు హైదరాబాద్ వచ్చింది ఒక అమ్మాయి…”
“ఆ …ఆ… తనే. మీ గురించి చాలా గొప్పగా వర్ణించి చెప్పింది అన్నయ్యగారూ.”
“తాజా పరిస్థితి ఏమిటి?”
శాంతా, సుందరాలు తాము చూసిన కొత్త సంబంధం గురించి చెప్పారు. ఐ.ఐ.టి గోల్డ్ మెడలిస్ట్.
ఆ వివరాలు వింటూనే శేషయ్య గారు చిరునవ్వు నవ్వారు.
“అది చాల మంచి సంబంధం. నాకూ తెలుసు… సరే, ప్రయత్నం చేద్దాం. ఈ ఆదివారం నేనే మీ ఇంటికొస్తాను.”
శాంతా సుందరాలు అనేక రకాలుగా ఆయన్ని ప్రార్థించి వెళ్ళారు.
***
ఆ రోజు వెళ్ళటం నాకు కుదరలేదు. కాని శేషయ్య గారు తరువాత చెప్పారు.
…..శాంతా సుందరాలతో పాటు గీత శేషయ్య గారిని గౌరవంగా ఆహ్వానించింది. ప్రారంభ చర్చలయ్యాక, శేషయ్య గారు అడిగేశారు.
“ఏమ్మా, ప్రతి వరుడికీ ఏదో ఒక బలహీతన వుందనో, లోపం వుందనో వద్దంటున్నావట! ఏ లోపమూ లేకుండా, బలహీనతా లేకుండా ఎవరన్నా వుంటారా? “
“నేను వున్నాను గదా. అలాగే…” తలొంచుకొనే మర్యాదగా చెప్పింది.
‘ఇలా అందరికీ లోపాలెంచటమే అతి పెద్ద లోపం. నీకు తెలియటం లేదా!’ అని మనసులో అనుకొని, శేషయ్య చివరగా ఒక మాట చెప్పారు.
“ఈ ఐ.ఐ.టి అబ్బాయి సంబంధం చాలా మంచిది…”
“ఇతనికి ఎలాంటి లోపం లేదు కదా?” వినయంగా అడిగింది.
“చెప్పలేను… కాని, నీకు చాలా తగిన వాడని చెప్పగలను…. అయితే, ఎలాంటి లోపమూ, బలహీనతా లేని ఒకడు వున్నాడు. కానీ…” శేషయ్య సంకోచిస్తున్నారు.
గీత కను రెప్పలు టపటపా కొట్టుకున్నాయి. మొహం వికసించింది.
“చెప్పండి.”
“సరే, ఫొటో చూపిస్తాను. తెలివైన దానివి గదా! వెంటనే ‘ఎస్ ‘ చెప్పాలి. అలా చెప్పలేకపోతే, మేం తెచ్చిన ఐ.ఐ.టి సంబంధం ఓకే చేయాలి. సరేనా!”
తలూపింది గీత ఆత్మ విశ్వాసంతో.
వెంటనే, శేషయ్య గారు తన ఐఫోన్ లో ఒక ఫొటో చూపించారు.
ఆ ఫొటో చూస్తూనే, గీత సంభ్రమంతో
“ఓ మై గాడ్!” అంది.
అంతే, ఇంకే చర్చా లేకుండా ఐ.ఐ.టి అబ్బాయి సంబంధాన్ని ఒప్పేసుకుంది.
… శేషయ్యగారు చెప్పిందంతా విన్నాక, వుండబట్టలేక అడిగేశాను.
“ఏం చూపించారండీ?”
“నువ్వూ చూడు.”
“మై గాడ్” అనేశాను ఆ గాడ్ (భగవంతుడి) ఫొటో చూస్తూనే.
2. ధర్మరాజు చెప్పిన ‘ధర్మం’
“ఒరేయ్ సూర్యం, నా పెన్షన్ మీద పెరిగిన కరువు భత్యం బకాయిలు ఓ అయిదు లక్షల దాకా రేపు వస్తాయిరా. వాటిని మన సైదాబాద్‌లో ‘వైదేహి’కి విరాళంగా ఇద్దామనుకుంటున్నాను!” అన్నాడు రఘోత్తమ రావు.
“ఆ ఆడ పిల్లల ఆశ్రమానికా!.. కాని నాన్నా, పై సంవత్సరం మన చిన్నిగాడికి మూడేళ్ళు నిండుతాయి. వాడికి భారతీయ విద్యాభవన్‌లో ఎల్.కె.జి సీటు రావాలంటే ఎంత కష్టమో నీకు తెలుసుకదా ! ఇప్పుడు అయిడియా వచ్చింది. ఈ అయిదు లక్షలు భవన్స్ ట్రస్టుకి ఇచ్చేద్దాం. చిన్నిగాడికి సీటు వచ్చేస్తుంది…” అన్నాడు సూర్యం.
విద్యుత్ బోర్డులో ఉద్యోగం వెలగ బెడుతున్న రుచిక అందుకుంది.
“నాన్నా. ప్రమోషన్ లిస్టులో వున్నాను. మా బాస్ తల్లికి ఒక చారిటీ ట్రస్టు వుంది. వాళ్ళు చాలా సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. ఈ అయిదూ ఆ ట్రస్టుకి ఇచ్చాం అనుకో. నా ప్రమోషన్ ఖాయం. చిన్నిగాడు ఏ స్కూల్లో నయినా ఎల్.కె.జి చదవచ్చు…”
ఆ అన్నా చెల్లెళ్ళ మధ్య వాగ్వాదం మొదలైంది.
రఘోత్తముడికి ఏం చేయాలో తోచటం లేదు. భార్య వంక చూశాడు.
ఆమె “మీ ఇష్టం. నన్ను ఇందులోకి లాక్కండి” అన్నట్లు ఓ చూపు విసిరేసి, పక్కింట్లో ఆడుకుంటున్న మనవల కోసం వెళ్ళింది.
అప్పుడు గుర్తొచ్చింది – షణ్ముఖ శర్మ గారి భారతం ప్రవచనం అవ్వాళ్టితో ఆఖరు. వెంటనే స్నానానికని కుర్చీలోంచి రఘోత్తముడు లేచాడు.
సూర్యం, రుచిక పట్టుపట్టారు – ఇదేదో తేల్చాల్సిందేనని.
“ఏమయ్యా, రఘూ, ప్రవచనానికి వస్తున్నావా ?” అంటూ శేషయ్య గారు వచ్చారు.
“ఆ.. ఆ.. ఇదిగో అయిదు నిమిషాలు… కూర్చోండి, వచ్చేస్తా”
అంటున్న రఘోత్తముణ్ణి కొడుకు, కూతురు ఆపేశారు.
పంచాయతీ శేషయ్య గారి ముందు పెట్టారు.
“అసలు నువ్వు ఆ అయిదు లక్షలూ ‘వైదేహి’ కివ్వాలని ఎందుకు అనుకున్నావు రఘూ?”
రఘు వినయంగా చెప్పాడు.
“భగవంతుడి దయవల్ల జీవితంలో బాగా సెటిల్ అయ్యాను. పిల్లలకి మంచి చదువులు ఇచ్చాడు.. కెరీర్‌లు ఇచ్చాడు. పెళ్ళిళ్ళయ్యాయి. ఇక నేను జీవితంలో చెప్పుకోదగిన ధర్మకార్యం అంటూ ఏమీ చేయలేదు. ఇప్పటికైనా ఒక్క ధర్మకార్యమైనా చేయాలన్న కోరిక. ‘వైదేహి’ బాగా పనిచేస్తోంది కదా …!”
సూర్యం, రుచిక మాట్లాడబోయారు.
శేషయ్య ఆపేశారు. వాళ్ళని అడిగారు.
“మీ నాన్న ధర్మం చేయటం మీకిష్టం లేదా ?”
“ఛ…ఛ.. అదికాదు తాతగారు. ఆ చేసేదేదో మనకి ఉపయోగపడేలా చేయచ్చుగదా అని….” చ్యూయింగ్ గం నముల్తున్నట్లు మాటలు మింగేశారు.
“అందరూ వినండి. ఇదే ప్రశ్న ధర్మరాజుకీ వచ్చింది. మీలాగే – వనపర్వంలో ద్రౌపది కూడా అడిగింది ధర్మరాజుని… ధర్మాన్ని ఆచరించటం వల్ల ఏదన్నా ప్రయోజనం ఉండాలి కదా – అని. అప్పుడు ధర్మరాజు ఏం చెప్పాడంటే ….” ఆపారు.
“ఆ.. ఏం చెప్పాడు?”
“మీ నాన్న అలా చేస్తే ఫరవాలేదా?”
“తప్పకుండా…” ఆ అన్నా చెల్లెళ్ళిద్దరిలో ఆశ మొలకెత్తింది.
“…. ధర్మ వాణిజ్యకో హీనః జఘన్యో ధర్మవాదినాం (శ్లోకం)… ధర్మాన్ని ఆచరించటం ధర్మం కోసమే. ఏదో ప్రయోజనాన్ని ఆశించి దాన ధర్మాలు చేయాలనుకుంటే అది ధర్మంతో వ్యాపారం చేయటమే. అలా చేసే వాళ్ళు ధర్మ వాదులలోకెల్లా అతి నీచులు…”
అంతే!
నిశ్శబ్దం. అన్నా చెల్లెలు మళ్ళీ నోరెత్తలేదు.
రఘోత్తముడు ఉత్సాహంగా లేచాడు స్నానానికి.