[శ్రీమతి కాళ్ళకూరి శేషమ్మ అనువదించిన ‘గలివర్.. సాహస సాగర ప్రయాణాలు’ అనే పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]
[dropcap]జొ[/dropcap]నాథన్ స్విఫ్ట్ రచించిన ‘గలీవర్స్ ట్రావెల్స్’ అనే నాలుగు భాగాల రచనలో A Voyage to Lilliput, A Voyage to Brobdingnag అనే మొదటి రెండు భాగాలు వివిధ భాషలలోకి అనువాదమై పెద్దలనీ, పిన్నలనీ అలరించాయి. శ్రీమతి కాళ్ళకూరి శేషమ్మ గలీవర్స్ ట్రావెల్స్ అన్‌ఎబ్రిజ్డ్ వర్షన్ సంపాదించి, తొలి రెండు భాగాలతో పాటు, తెలుగులో ప్రాచుర్యంలో లేని మలి రెండు భాగాలు – A Voyage to Laputa, Balnibarbi, Luggnagg, Glubbdubdrib and Japan; A Voyage to the Land of the Houyhnhnms లను కూడా స్వేచ్ఛానువాదం చేసి పాఠకుల ముందుకు తెచ్చారు. మలి రెండు భాగాలు వర్తమాన సమాజంలోని సామాజిక, రాజకీయ, వైజ్ఞానిక పరిస్థితులను పోలి ఉంటాయని అభిప్రాయపడ్డారు శేషమ్మ గారు.
~
గలివర్స్ ట్రావెల్స్ అనేది ఓడలో సర్జన్‌గా పనిచేసే లెమ్యూల్ గలివర్ చేసిన పలు ప్రయాణాలకు సంబంధించిన సాహస గాథలు. గుర్తింపు పొందిన ఓడరేవులకు వెళ్లే మార్గంలో వరుస ప్రమాదాల కారణంగా, అనేక తెలియని ద్వీపాలలో చిక్కుకుంటాడు. వాటిల్లో అసాధారణ ఘటనలు ఎదుర్కుని, చిత్రమైన ప్రవర్తనలు, తత్వాలు కలిగిన వ్యక్తులు, జంతువులను కలుస్తాడు. కానీ ప్రతి సాహస యాత్ర తర్వాత, అతను ఏదో ఒకవిధంగా ఇంగ్లాండ్‌లోని తన ఇంటికి తిరిగి రాగలుగుతాడు. గొప్ప అనుభవాలను ప్రోది చేసుకుని, అలసట తీర్చుకుని, మళ్లీ కొత్త సముద్రయానం మొదలుపెడతాడు.
1) మరుగుజ్జుల రాజ్యంలో:
గలివర్ ప్రయాణిస్తున్న ఓడ తుఫానులో ధ్వంసమవుతుంది. గలివర్ లిల్లిపుట్ (మరుగుజ్జులు) ద్వీపంలో చిక్కుకుంటాడు. అతనికి మెలకువ వచ్చేసరికి సుమారు ఆరు అంగుళాల ఎత్తులో ఉన్న మరుగుజ్జులచే బంధింపబడ్డాడని గ్రహిస్తాడు. వారి రాజును కలిసి తను శత్రువుని కాదని, ప్రయాణీకుడనని చెప్తాడు. రాజుకు అతని మీద నమ్మకం కలిగాక, పరిమిత స్వేచ్ఛ లభిస్తుంది. గలివర్ స్థానికుల భాష నేర్చుకుంటాడు, వారి సమస్యలను పరిష్కరించడంలో సహాయం చేస్తాడు. ముఖ్యంగా వారి శత్రువు అయిన బ్లెఫెస్కు రాజ్యంతో వారి వైరుధ్యం ముగించడానికి గలివర్ ప్రయత్నిస్తాడు. రాణి గారి అంతఃపురంలో చెలరేగిన మంటలను ఆర్పే క్రమంలో అతను రాణిని తాకిన కారణంగా గలివర్‌ను శిక్షించాలనుకుంటారు. గలివర్ బ్లెఫెస్కుకు పారిపోతాడు, అక్కడ అతను ఒక పెద్ద యుద్ధనౌకను తన అవసరాలకు తగ్గట్టుగా మార్చుకుని అక్కడి నుండి బయలుదేరి, సముద్రంలో ఒక ఆంగ్ల వ్యాపార నౌక ద్వారా రక్షించబడతాడు. ఇంగ్లాండ్‌లోని తన ఇంటికి క్షేమంగా చేరతాడు.
2) మహాకాయుల దేశంలో:
రెండవ సముద్రయానంలో, గలివర్ ఇంకా కొందరు సిబ్బంది ఒక ద్వీపంలో మంచినీటి కోసం వెళ్తారు. బదులుగా వారు బ్రాబ్డింగ్‌నాగ్ అనే మహాకాయుల భూమిని కనుగొంటారు. సిబ్బంది పారిపోగా, గలివర్ చిక్కుకుపోతాడు. గలివర్‌ని బంధించిన రైతు, అతనిని తన ఇంటికి తీసుకువెళతాడు, గలివర్‌ను దయతో చూస్తాడు, తన కుమార్తె గ్లమ్‌డాల్‌క్లిచ్‌ని గలివర్‌కి సంరక్షురాలిగా నియమిస్తాడు. ఆమె గలివర్ పట్ల ఎంతో కరుణ చూపుతుంది. రైతు గలివర్‌ని చూపరులకు ప్రదర్శిస్తూ గ్రామీణ ప్రాంతాలకు పర్యటనకు తీసుకువెళతాడు. చివరికి, రైతు గలివర్‌ను రాణికి విక్రయిస్తాడు. రాజాస్థానంలో, గలివర్ రాజును కలుస్తాడు. వారిద్దరూ ఇద్దరూ గలివర్ సొంత దేశపు ఆచారాలు, ప్రజల ప్రవర్తనల గురించి చర్చించడానికి ఎన్నో సార్లు సమావేశమవుతారు. అనేక సందర్భాల్లో, ఇంగ్లండ్‍ను సమర్థించినందుకు రాజుకు గలివర్‌పై ఉన్న సదభిప్రాయం పోతుంది. ఒక రోజు, సముద్ర తీరంలో, గలివర్ తన పెట్టె (చెస్ట్) నుండి సముద్రం వైపు చూస్తుండగా, ఓ డేగ ఎత్తుకెళ్ళి సముద్రంలోకి జారవిడుస్తుంది. సముద్రంలో ప్రయాణిస్తున్న ఓడ తేలియాడే పెట్టెని గుర్తించి, గలివర్‌ను రక్షిస్తుంది. అతను ఇంగ్లాండ్ చేరి కుటుంబాన్ని కలుసుకుంటాడు.
3) ఎగిరే ద్వీపాలు (లాపుటా, బాల్నిబార్బి, గ్లబ్‌డబ్‌డ్రిబ్, లుగ్గనాగ్, జపాన్ పర్యటన):
తూర్పు ఇండీస్ దీవులకు వెళ్ళే ఈ ప్రయాణంలో గలివర్ సముద్రపు దొంగలకు చిక్కుతాడు. వాళ్ళు గలివర్‌ను ఒక చిన్న పడవలో ఉంచి సముద్రంలో వదిలేస్తారు. కొన్ని గంటల ప్రయాణం తరువాత, గలివర్ ఒక ఫ్లోటింగ్ ఐలాండ్‌ని చేరుతాడు. లాపుటా అని పిలవబడే ఆ ఎగిరే ద్వీపంలో, గల్లివర్ రాజుతో సహా అనేక మంది స్థానికులను కలుస్తాడు. వారంతా గణితం, సంగీతానికి సంబంధించిన విషయాలలో నిమగ్నమై ఉన్నారు. ఇక్కడి ఖగోళ శాస్త్రవేత్తలు ద్వీపాన్ని పైకి, క్రిందికి, ముందుకు, వెనుకకు మరియు పక్కకి తరలించడానికి అయస్కాంతత్వం నియమాలను ఉపయోగిస్తారు. ఇక్కడ ఉన్నప్పుడు, గలివర్ బాల్నిబార్బి, గ్లబ్‌డబ్‌డ్రిబ్, లుగ్గనాగ్ లను సందర్శిస్తాడు. గ్లబ్‌డబ్‌డ్రిబ్ ద్వీపంలో గలివర్ – చనిపోయినవారిని పిలిచే శక్తిని పొందుతాడు. ఈ శక్తితో అతను అలెగ్జాండర్, సీజర్, బ్రూటస్, హోమర్, అరిస్టాటిల్ వంటివారితో మాట్లాడుతాడు. లుగ్గనాగ్‌లో గలివర్ – మరణం లేని స్ట్రల్ట్‌బర్గ్స్ అనే తెగవారిని కలుసుకుంటాడు. వారి అమరత్వం పట్ల ఆశ్చర్యపోయినా, వారి దయనీయ స్థితికి జాలిపడతాడు. చివరకు జపాన్ చేరుకుని ఆ దేశ చక్రవర్తిని కలుస్తాడు గలివర్. అక్కడ నుండి, ఆమ్‌స్టర్‌డామ్‌కు వెళ్లి చివరికి ఇంగ్లాండ్‌కు చేరుతాడు.
4) విచిత్ర జీవుల మధ్య:
నాల్గవ పర్యటనలో సర్జన్‍గా కాకుండా ఓ ఓడకి కెప్టెన్‍గా ప్రయాణించే అవకాశం వస్తుంది. కానీ ఆ వాణిజ్య నౌక తుఫాను తాకిడికి గురవుతుంది. సిబ్బంది చాలామంది చనిపోతారు. మిగిలిన సిబ్బందిని సముద్రపు దొంగలు బంధించి తమ వైపు తిప్పుకుంటారు. మడగాస్కర్ వద్ద ఓ చిన్న పడవలో గలివర్‍ని ఎక్కించి, సముద్రంలోకి పంపేస్తారు. హ్యుహ్నిమ్స్ అనే విచిత్ర తెగల భూమికి చేరతాడు గలివర్. పొందికైన, స్వచ్ఛమైన, ఇబ్బంది లేని సమాజం అది. హ్యుహ్నిమ్స్ మానవ ఆకృతిలో ఉన్న మృగాలైన యాహూస్ అసభ్యత, క్రూరత్వంతో విభేదిస్తారు. వారి మానవ దుర్గుణాలను గుర్తించడానికి కూడా ఇష్టపడడు గలివర్. అతను చాలా సంవత్సరాలు హ్యుహ్నిమ్స్‌తో కలిసి ఉంటాడు. తన యజమాని అడిగిన మీద ఇంగ్లండ్ చరిత్రను వివరిస్తాడు. వాళ్ళను ఎప్పటికీ విడిచిపెట్టకూడదనుకునే స్థితికి చేరుకుంటాడు. చివరికి తనను తాను యాహూ అనుకుంటాడు. కానీ ఆ ద్వీపం వదిలి వెళ్ళాల్సిన సమయం ఆసన్నమైనప్పుడు, అతను వేదనతో మూర్ఛపోతాడు. ఇంగ్లండ్‌కు తిరిగి వచ్చిన గలివర్ తన అనుభవాలను గ్రంథస్తం చేస్తాడు. తన పుస్తకాలను చదివిన ఏ కొద్దిమందైనా తమ లోని అవలక్షణాలను సరిదిద్దుకోవాలని ఆకాంక్షిస్తాడు.
~
గలివర్ సాహస గాథలు వినోదం, ఉత్కంఠని కలిగించటమే కాకుండా నైతికతని, విలువల ప్రాముఖ్యతను బోధిస్తాయి. మౌలికంగా ఈ కథ బ్రిటీష్ ప్రజలకు చెందినది, ఇంగ్లాండ్ సంస్కృతి, రాజకీయాలకు సంబంధించినది. అయితే ఈ పుస్తకం నుండి మనమందరం కూడా ఎంతో కొంత నేర్చుకోవచ్చు. ద్వేషంతో గుడ్డివారైన ప్రజలు చిన్న వాదనను సైతం ఘోరమైన యుద్ధంగా మారుస్తారని మొదటి భాగం చెబుతుంది. ఆధునిక ప్రజలు అహంకారంతో ఇతరులకు హాని కలిగించే ప్రమాదకరమైన ఆయుధాలను ఎలా సిద్ధం చేస్తున్నారో రెండవ భాగం తెలియజేస్తుంది. వెర్రితలలు వేస్తున్న శాస్త్ర సాంకేతిక అభివృద్ధి మానవులను దిగజారుస్తున్నదని మూడవ భాగం సూచిస్తుంది. నాలగవది, చివరి భాగం మానవులలో పెరుగుతున్న దురాశనీ, నైచ్యాన్ని వర్ణిస్తుంది, మనుషులు జంతువుల కంటే హీనంగా మారారని అంటుంది.
~
కాళ్ళకూరి శేషమ్మగారి అనువాదం చాలా సరళంగా సాగింది. ప్రతీ భాగం ముగిసిన తరువాత ఆ భాగంలోని కీలక అంశాలను ప్రస్తావించడం ఉపయుక్తంగా ఉంది. అవసరమైన చోట అదనపు సమాచారం వికీపీడియా నుంచి సేకరించి అందించారు. గలివర్స్ ట్రావెల్స్‌కి తెలుసులో అనువాదాలు ఉన్నప్పటికి, తాను ఎందుకు అనువాదానికి పూనుకున్నారో ముందుమాటలో వివరించారు. గలీవర్ ప్రయాణాలను కొత్త కోణంలో ఆవిష్కరించిన ఈ రచన పెద్దలను పిన్నలను ఆకట్టుకుంటుందనడంలో సందేహం లేదు.
***
గలివర్.. సాహస సాగర ప్రయాణాలు
మూలం: జొనాథన్ స్విఫ్ట్
స్వేచ్ఛానువాదం: కాళ్లకూరి శేషమ్మ
స్మృతి పబ్లికేషన్స్, కాకినాడ. మార్చి 2024
పేజీలు: 152
ధర: ₹ 150/-
ప్రతులకు:
స్మృతి పబ్లికేషన్స్,
1-9-23, శ్రీరామ్‍నగర్
కాకినాడ. ఫోన్: 9885401882
~
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్. ఫోన్: 9000413413
ఆన్‍లైన్‍లో:
https://www.telugubooks.in/te/products/gulliver-sahasa-sagara-prayanalu
~
శ్రీమతి కాళ్ళకూరి శేషమ్మ గారి ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-mrs-kallakuri-seshamma/