మహతి-58

9
3

(సంచిక పాఠకుల కోసం ప్రసిద్ధ సినీ కవి, రచయిత శ్రీ భువనచంద్ర అందిస్తున్న ధారావాహిక.)

[ఇందిరగారిది బెదిరింపుల ఆర్భాటమే తప్ప మరేమీ కాదని నమ్మచ్చా అని కల్యణి అడిగితే, తన అనుభవం నుంచి తాను ఆ విషయం గ్రహించాననీ, మహతి విశ్లేషిస్తే మంచిదని అంటుంది అల. తిమ్మూ విషయంలో ఎప్పుడో జరిగిన పొరపాట్లను తలచుకుని ఇప్పుడు బాధపడవద్దని అలకి నచ్చజెప్పి, ఇందిరగారి ప్రవర్తనకి కారణాలను విశ్లేషిస్తుంది మహతి. తల్లిదండ్రులు చెప్పిన అబద్ధాలని నమ్మేసి తన తండ్రిని దూరం చేసుకున్న ఇందిరకి నిజం తెలిసి, పెళ్ళి చేసుకోకుండా ఉండిపోయి వాళ్ళని టార్చర్ పెట్టి ఉంటుందనీ తల్లిదండ్రులు చనిపోయాకా, ఒంటరైపోయి తన కోపాన్ని తన తల్లిదండ్రుల పైకి మళ్ళించి ఉంటుందని అంటుంది మహతి. తన తండ్రిని టార్గెట్ చేయడం మొదలుపెట్టి ఎనిమిది నెలలే అయిందని, అంటే ఆమె అనారోగ్యం ఎనిమిది నెలల క్రితమే బయటపడి ఉంటుందని, ఒంటరితనం వల్లా, అనారోగ్యం కలిగించిన నిస్సహాయత వల్లా ఆమె ఇలా ప్రవర్తిస్తోందని అంటుంది మహీ. అయితే మాత్రం ఇంత శాడిస్టుగా బిహేవ్ చెయ్యాలా అని అంటుంది అల. ఆవిడ ఇంకా శాడిస్టు స్థితికి చేరుకోలేదని అంటుంది మహీ. సైకియాట్రిస్టుల సహాయం తీసుకుందామన్నా, ఆవిడ సహకరించదని మహీ అంటుంది. చర్చ వేడిగా సాగుతోందనీ, కాస్త డైవర్షన్ కోసం – కాసేపు వంటల గురించి మాట్లాడుకుంటారు. నిద్ర లానే చక్కని భోజనం కూడా మనసుకి ఎంతో మేలు చేస్తుందని అంటారు కల్యాణి. ముగ్గురూ కల్సి రకరకాల వంటకాలు చేసి, పెద్ద కేరేజీల్లో సర్దుకుని, విస్తరాకులు, మంచి నీళ్ళూ తీసుకుని కారెక్కుతారు. హాస్పటల్‍లోనే అందరూ కలిసి భోంచేయాలని నిర్ణయించుకుంటారు. అదీ మంచిదేననీ, అహల్య గారిని, ఇందిర గారిని ఒకేసారి గమనించి ఏం చెయ్యాలో ఆలోచించవచ్చని అంటారు కల్యాణి. చర్య, ప్రతిచర్య గురించి, ఈగోల గురించి చక్కగా విశ్లేషిస్తారు కల్యాణి. జీవితం గురించి కల్యాణి ఇంకో మంచి మాట చెప్పడం పూర్తయ్యే సరికి కారు ఆసుపత్రికి చేరుతుంది. – ఇక చదవండి.]

మహతి-4 మహతి-అల-5

అల:

[dropcap]ఓ[/dropcap] పక్క నేను ఢిల్లీకి వెళ్ళాల్సిన డేట్స్ దగ్గర పడుతున్నాయి. మరో పక్క ఉత్కంఠ, ఆందోళన. ఉత్కంఠ ఎందుకంటే ఎప్పుడు ఏమవుతుందో తెలీని సస్పెన్స్, ఆందోళన ఎందుకంటే, నాకు తెలివి తేటలు ఉన్నా లేకపోయినా, మహీ దగ్గరగా వుంటే, దాని టెన్షన్ కాస్త తగ్గుతుందని. వెళ్ళక తప్పదు గనుక ఏమీ చేసేదీ లేదు. ఆలోచనలలో వుండగానే, హాస్పటల్ వచ్చింది.

“మహీ.. ఇందిరగారి దగ్గరికి నువ్వు కేరేజీ పట్టుకుపోయి, ఆమె మూడ్ ఎలా వుందో చూడు” అన్నారు కల్యాణి గారు.

“నేను వెళ్ళనా?” అన్నాను నేను. కల్యాణిగారు కన్‌ఫ్యూజ్ అయి “ఎందుకూ?” అన్నారు.

నేను చిన్నగా నవ్వి “ఇవాళ నా పుట్టిన రోజు కదా!” అన్నాను. మహీ, కల్యాణి షాక్ తిన్నారు. “మాకు చెప్పలేదేలేం?” సంయుక్తంగా అన్నారు ఇద్దరూ.

“నాకు తెలిసింది ఇప్పుడేగా. అందరం కలిసి భోంచేద్దామంటే ఆవిడ ఒప్పుకోదు. మనందరం ఏదో ప్లాన్ వేస్తున్నామని సందేహిస్తుంది. అదే నా బర్త్ డే అంటే ఒప్పుకోవడానికి 90% ఛాన్స్ ఉంది” అన్నాను.

“భలే ఐడియా వేశావే!” ఆనందంగా నా భుజం మీద చరిచింది మహతి. “యస్ గ్రేట్ ఐడియా..” మెచ్చుకున్నారు కల్యాణిగారు. ముగ్గురం ఆనందంగా లోపలికి నడిచాం. గౌతమ్ గారూ, అహల్యగారూ నిశ్శబ్దంగా ఉన్నారు. లోపలికి వెళ్ళగానే, “అమ్మా, నాన్నా, ఇవాళ అల.. The great heroin of Telugu and Hindi గారి జన్మదినం” అన్నది మహి.

“ఓ.. హేపీ బర్త్ డే అమ్మా. నిండు నూరేళ్ళూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లు” నా నుదుటిన ముద్దు పెట్టుకుని అన్నారు అహల్యగారు.

“హపీ బర్తడే అమ్మా,, ఆయుష్మాన్ భవ్.. దిగ్విజయీ భవ” అన్నారు గౌతమ్ గారు నా తల నిమిరి. బర్త్ డే కాకపోయినా నాకు చాలా ఆనందం కలిగించింది.

నేనూ మహీ ఇద్దరం వెళ్ళాము ఇందిరగారి దగ్గరికి.

“ఆంటీ, ఇవ్వాళ అల పుట్టినరోజు. మిమ్మల్ని చూడాలని వచ్చింది. సినిమా ఘాటింగ్‌ని ఆపేసి. ఎందుకంటే, రేపో ఎల్లుండో హిందీ సినిమా ఘాటింగ్ కోసం ఢిల్లీ వెళ్ళిపోతుంది” అని ప్లీజింగ్‌గా చెప్పింది మహీ.

“ఓహ్.. హేపీ బర్త్ డే అలా.. జన్మదిన శుభాకాంక్షలు. బెడ్ మీద వున్నాను లేకపోతే అతి చిన్న గిఫ్ట్ అయినా ఇచ్చేదాన్ని. సారీ!” అంది నా చేతులు పట్టుకుని.

“ఆంటీ నేనెందుకొచ్చానో తెలుసా, మా అమ్మ నవ్వితే అచ్చు మీలాగే వుంటుంది. మీ అందం ఎవరికీ రాదనుకోండి. అయినా, నేను విజయవాడ వెళ్ళలేను, కారణం షూటింగ్. నాకో చిన్న కోరిక వుంది. గిఫ్టుగా ఇస్తారా?” అన్నాను.

“ఏమిటీ?” కుతూహులంగా అడిగింది ఇందిర.

“నా పుట్టిన రోజున నా ఫ్రెండ్ కుటుంబ సభ్యులతోటి కలిసి భోజనం చేయ్యడం అలవాటు. వాళ్ళంతా విజయవాడలో వున్నారు. నా డియరెస్ట్ ఫ్రెండ్ మహీ, మహీ ఫేమిలీ, నేను చికాకుల్లో పడ్డప్పుడు సొంత తల్లిలా నన్ను చూసుకున్న కల్యాణి ఆంటీ కూడా ఇక్కడే ఉన్నారు. అందరూ ఉన్నా మా అమ్మ దగ్గర నా లేదు. అందుకే మా అమ్మ పోలికలు ఉన్న మిమ్మల్ని ఇవ్వాళ మాతో కలిసి భోజనం చెయ్యమని కోరుతున్నాను. ప్లీజ్” అన్నాను ఇందిరగారు రెండు చేతులూ పట్టుకుని.

“సారీ అలా. నేను అమ్మనే కాదు. ఈ వయసులో కాలేను కూడా. మహతి అమ్మలోనే మీ అమ్మగార్ని చూసుకో” అంటూ తల అటు పక్కకి తిప్పుకుని అన్నది ఇందిర.

“ఆంటీ, మా అమ్మ ఎలానూ ఉంది. మా అమ్మ అందగత్తె కాదు. మీలా అంత అందగత్తె అసలే కాదు. కానీ, నా స్నేహితులు ఎవరొచ్చినా ఎప్పుడొచ్చినా చాలా ప్రేమగా చూసేది. ఎప్పుడూ ఇతరుల్ని నిరాశపర్చలేదు. మా దృష్టిలో మీరూ అంతే. అనారోగ్యం వల్ల గానీ, లేకపోతే మీరే ఎంతో సంతోషంతో తనని అక్కున చేర్చుకునే వారు. అయినా కొంచెం ఓపిక తెచ్చుకుంటే తనూ సంతోషిస్తుంది. ప్లీజ్” అన్నది మహతి.

వాళ్ళమ్మతో ఇన్‍డైరెక్ట్‌గా పోల్చడం మంచి మూవ్. అదీ అతి సున్నితంగా, చెప్పీ చెప్పకూండా. దటీజ్ మహతి.

ఇందిరగారు కొంచెం సేపు ఆలోచించి, “తప్పదంటావా? అయితే ఇక్కడే చేద్దాం” అన్నది ఆ స్వరంలో సంశయం.

“లేదాంటీ, మిమ్మల్ని పిలిచినట్టుగానే మహీ అమ్మా నాన్నగారిని, పిలిచాను. మీకు ఒంట్లో బాగుంటే ఈ కార్యక్రమం కల్యాణి ఆంటీ ఇంట్లో జరిగేది. ఆవిడకి మీరంటే చాలా ఇష్టం. ఆవిడే అన్నారు – ‘ఇందిరగారు ఇక్కడికి రాలేరు గనక మనమే అక్కడికి వెడదాం’ అని. అన్ని వంటలూ కల్యాణిగారి ఆధ్వర్యంలోనే చేశాము. డాక్టర్‍ని రిక్వెస్టు చేసి, మీటింగి హాల్లో భోజనాలు చెయ్యడానికి పర్మిషన్ తెచ్చాం. ప్లీజ్ ఆంటీ” అన్నాను.

మరో నిముషం ఆలోచించి “పదండి” అన్నది ఇందిరగారు. ఆవిడ స్వరంలో ఓ విచిత్రమైన భావం కదలాడింది.

నేను సినీ ఆర్టిస్టునని డాక్టర్‌కి తెలుసు. అందుకే అడగ్గానే మహాసంతోషంగా ఒప్పుకున్నాడు. అది చాలా పెద్ద హాస్పటల్. మీటింగ్ హాల్ కూడా చాలా పెద్దది.

మేం వెళ్ళేసరికే అక్కడ నీట్‌గా భోజనాలకి అరెంజ్‌మెంట్ జరుగుతోంది. డాక్టర్‌ని రిక్వెస్టు చేసినప్పుడే ఆయన్ని కూడా భోజనానికి పిలిచాం. సెలిబ్రెటీతో భోజనం గనక మహోత్సాహంగా “యస్.. అలాగే.. యస్..” అన్నాడు.

“భలే వుందే అలా.. నువ్వెకడికెళ్ళినా తిరుగులేదు!” నా భుజం మీద చరిచి గుసగుసగా అంటూ నవ్వింది మహీ..

“సినిమానా మజాకా” అన్నాను నేను ఆ కాంప్లిమెంట్‌కి సంతోషిస్తూ.

మహీ అమ్మా నాన్నా ఒక వైపు, నాన్న పక్కన డాక్టరుగారు, ఎదుటి కుర్చీల్లో నేనూ, మహీ, ఇందిరగారూ, కల్యాణిగారూ. ఇందిరకి అటూ ఇటూ కల్యాణి గారూ, నా పక్క మహీ.

అలా కూర్చుంటే ఇందిరగారు అమ్మా నాన్నల్ని గమనించవచ్చు. నేను మహీ కూడా క్రీగంటి చూపుల్తో అటు అమ్మావాళ్ళనీ, గౌతమ్ గారినీ, ఇందిరగారినీ కూడా గమనించవచ్చు. దీని వల్ల ఏదో ఒరుగుతుందనీ కాదు. ఓ చిన్న ‘హింట్’ దొరికినా గొప్ప విషయమేగా. చీకట్లో ఉన్న వాళ్ళకి మిణుగురు పురుగులు కాంతి కూడా కొంచెం ధైర్యాన్నిస్తుంది. అఫ్‌కోర్స్ ఆ కాంతి వల్ల ఏమీ ఉపయోగం ఉండకపోయినా కూడా.

చిత్రం ఏమంటే, అహల్యగారూ ఇందిరగారూ కూడా మౌనంగా కూర్చున్నారు. ఒకరినొకరు చూడటం లేదని మాకు అర్థమైంది. గౌతమ్ గారు డాక్టరుగారితో మాట్లాడుతున్నారు.

మధ్యమధ్యలో నేను కూడా డాక్టరు గారితో చనువుగా మాట్లాడటం మొదలుపెట్టాను. నా ఉద్దేశం భోజనాల కార్యక్రమాన్ని వీలున్నంతగా పొడిగించాలని. డాక్టర్ సుధీర్ మహోత్సాహంగా వివరిస్తున్నారు. తినడం ఆపి మరీ.

“డాక్టర్.. ఇందిరగారు మళ్ళీ సంపూర్ణంగా పుంజుకోవడానికి ఎంత కాలం పడుతుందీ? ఎందుకంటే, మా అమ్మ ఇందిరగారూ పక్క పక్కనుంటే చూడాలని ఉంది. ఢిల్లీలో ఘాటింగ్” అన్నాను.

“హీరో ఎవరు? “అడిగారు డాక్టరు మహోత్సాహంగా.

“వినోద్ కపూర్” అన్నాను.

“ఓహ్.. అతనంటే నాకు చాలా చాలా ఇష్టం. అతనంటేనే కాదు, అసలు కపూర్స్ అంటేనే మహా ఇష్టం. పృధ్వీరాజ్ కపూర్, రాజకపూర్, షమ్మీకపూర్, శశికపూర్, రణధీరకపూర్, రిషికపూర్, ఓహ్.. గ్రేట్ ఫేమిలీ.. గ్రేటెస్ట్ యాక్టర్స్. అలగారూ, నేను ఢిల్లీ వస్తే నాకు వినోద్ కపూర్‌ని పరిచయం చేస్తారా?” డాక్టర్ చాలా ఉత్సాహంగా అడిగాడు.

“వై నాట్ మీరూ మా అమ్మ, ఇందిరగారూ, వీలైతే కల్యాణిగారు కూడా ఢిల్లీ వచ్చేయ్యండి. వినోద్ గారితో పాటు అందరం ఒకే హోటల్లో ఉందాం. అరేంజిమెట్స్ నేనే చేస్తాను” అన్నాను ప్లీజింగా నవ్వుతూ.

“యస్.. యస్.. ఆరోగ్యం బాగుపడాలంటే గాలి మార్పు చాలా హెల్ప్ చేస్తుంది. ఇందిరగారూ.. వెళ్దామా.. సరేనా” అన్నారు డాక్టర్.

“రావాలంటే నేను బ్రతకాలిగా. బ్రతకాలనే కోరికే లేదు. సినిమా వాళ్ళతో నాకేం పని డాక్టర్. అయినా, ఎవరు తీసికెళ్ళాలో వాళ్ళు మాట్లాడరు. జీవితంలో అన్నీ, అందర్నీ కోల్పోయాను. బ్రతికి ఏం లాభం? నా మానాన నన్ను వదిలెయ్యండి. మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. దయచేసి నా మానాన నన్ను వదిలెయ్యండి” అన్నది తల ఎత్తకుండానే.

సరదాగా జరుగుతున్న సంభాషణ ఒక్కసారిగా సీరియస్ అయింది. మహతి అమ్మ నాన్నా అవాక్కయ్యారు. డాక్టర్ నిశ్చేష్టుడయ్యాడు. ఇలాంటి సమాధానం వస్తుందని ఊహించి ఉండడాయన.

“అయితే అలాగే ఇందిర ఆంటీ, మిమ్మల్ని ఇక ఇబ్బంది పెట్టను. డాక్టరుగారూ, మీరు వినోద్‌తో మాట్లాడాలనుకుంటే ఫోన్‌లో మాట్లాడవచ్చు. ఫోన్ లోనే మిమ్మల్ని పరిచయం చేస్తాను. వారు మిమ్మల్ని ఢిల్లీ ఇన్‌వైట్ చేసేలా కూడా నేను చెయ్యగలను. మీ టైమ్ చెప్పిండి చాలు” అన్నాను డాక్టర్‍ని సముదాయించడానికి.

“థేంక్యూ.. థేంక్యూ..” పాపం ఆయన సిగ్గుపడుతూ అన్నాడు. తన మాటలతో ఇందిరగారు సంతోషిస్తుందని ఆయన అనుకుని ఉంటాడు.

సడన్‌గా మహీ “డాక్టరు గారూ యీ గూత్తి వంకాయకూర నేనే చేశాను. అల అద్భుతంగా అలు పరోటా దహీ భల్లా, చింతపండు పచ్చడి చేసింది. బంగాళదుంపల వేపుడు, పచ్చి పులుసు, కంది పచ్చడీ అందరూ తిని తీరాలి. ఎందుకంటే ఇవ్వాళ మన అల పుట్టినరోజు. రెండు రోజుల్లో అది ఢిల్లీ వెళ్ళిపోతుంది. హాయిగా నవ్వుతూ దాన్ని ఫ్లైడ్ ఎక్కిద్దాం. ఇంతకీ పదార్థాలు బాగున్నాయా? దయచేసి రిలాక్సడ్‌గా తినమని నా ప్రార్థన” అన్నది.

“అవును, ‘అన్నం బ్రహ్మ, రసోవిష్ణుః భోక్తాదేవో మహేశ్వరః’ అంటారు కదా! అందుకే నివేదించిన సారం ప్రసాదమై మన శరీరంలో ఉండే చైతన్యశక్తిని పెంపొందిస్తుంది. ఈ మాట మా అమ్మగారు చెప్పేది!” అన్నారు డాక్టరుగారు కాస్త కుదురుకుని.

సిస్టం ప్రకారం ఎవరికి వాళ్ళు వడ్డించుకునేంత వీలుగా పదార్ధాలని గిన్నెలలో సర్ది టేబుల్ మధ్య పెట్టాం. ప్రతి గిన్నెలో గరిటతో సహా.

మహతి నాన్నకి గుత్తివంకాయ ఇష్టమని నాకు తెలుసు. అహల్య గారు సడన్‌గా విస్తరి చూసి “అదేంటే, మీ నాన్నకి గుత్తివంకాయ ఇష్టమని నీకు తెలుసుగా. మరీ అంత కొంచెం వేశావూ?” అన్నారు మహతితో.

ఆ మాట వినగానే ఇందిరగారు గభాల్న లేచి గరిటతో గుత్తివంకాయ కూరని గౌతమ్ గారి విస్తరిలో వేసింది.

అహల్యగారు షాక్ తిన్నారు. నిజం చెబితే అందరం షాక్ తిన్నాము. డాక్టర్ గారు ఆశ్చర్యంగా చూశారు. ఆ తరువాత తేరుకుని “గుత్తివంకాయ ఇవ్వాళ ప్రశస్తంగా ఉంది.. చాలా బాగా చేశావు మహతీ” అన్నారు ఏమీ జరగనట్టు, ఏమీ చూడనట్టూ.

నాకు అనుమానం వచ్చింది. నేను మహీ ఇందిరగారి దగ్గరకు వెళ్ళినప్పుడు కల్యాణి గారు అహల్యగారిని ప్రిపేర్ చేసి ఉండాలి. లేకపోతే ఆవిడ ఠక్కున లేచి వెళ్ళిపోయేదిగా! గౌతమ్ గారు మాత్రం సైటెంట్ గానే కంది పచ్చడి కలుపుకుంటున్నారు. ఇందిర ముఖంలో ఓ పరిహాసరేఖో, విజయరేఖో తటిల్లతలా మెరవడం నేను గమనించాను.

అంతస్తు అందం ఉన్న వారైనా లేని వారైనా క్రూరత్వం విషయంలో తమని తాము నిగ్రహించుకోలేరని ఇందిరగారి ప్రవర్తనలో నాకు అర్థం అయింది.

ప్రేమంటే ఏమిటీ? జీవితాంతం ప్రేమ పేరుతో ఒకళ్ళని కట్టిపడెయ్యడమా? నేను నిన్ను ప్రేమించాను గనక నువ్వు నన్ను ప్రేమించాలనడం అనేది ఎక్కడి ధర్మం?

అలాగే పెళ్ళి. పెళ్ళయినంత మాత్రం చేత ఒకరికొకరు బానిసల్లా బ్రతకాలా? అదీ, వ్యక్తిత్వాలనీ, ఆశలనీ ఆలోచనలనీ అన్నింట్నీ చంపుకుని. ఇదేమి వ్యవస్థ. ప్రేమతోటో పెళ్ళితోటో ఒక్కరైన వాళ్ళు ఎలా ఉండాలీ? ప్రేమించిన వాడ్నో ప్రేమించినదాన్నో హింసకి గురిచెయ్యాలా? అలా హింసిస్తే అది ప్రేమవుతుందా?

నాకు నవ్వు బాధా ఒకేసారి వచ్చాయి. నేను చేసిందీ అదేగా ప్రేమ పేరు మీద హింసించడమేగా!

“బర్త్ డే పాపా ఏ లోకంలో ఉన్నావ్?” అన్నది మహీ నన్ను కుదిపి.

“ఏం లేదే” అన్నాను సన్నగా.

“ఏమిటో చెప్పు తల్లీ.. సస్పెన్స్ నా ఒంటికి పడదు” అన్నది మహీ.

“ప్రేమ అంటే ఏమిటో అని ఆలోచిస్తున్నాను. పెళ్ళి అంటే ఏమిటా అని కూడా ఆలోచిస్తున్నాను. చాలా చాలా రోజుల్నుంచీ! అందరి ఎదుటా ఇలా ప్రేమ పెళ్ళి అని మాట్లాడుతున్నందుకు క్షమించండి.

ప్రేమ పెళ్ళి అనేవి జీవితంలోని భాగాలు. ముఖ్యమైన సన్నివేశాలు. ఏ తల్లీ తండ్రీ కూడా ప్రేమ గురించీ పెళ్ళి గురించీ పిల్లలకు వివరించి చెప్పరు. ఒక వేళ పిల్లలు ప్రేమలో పడితే, పరువు, ప్రతిష్ఠా అని వాళ్ళని చావగొట్టి చెవులు మూస్తారేగానీ, కనీసం తన కష్టాన్నీ లేదా అయిష్టాన్నీ చెప్పుకునే అవకాశమూ చనువూ కూడా ఇవ్వరు. అసలు ఎందుకలా జరుగుతోందీ? ప్రేమ అనేది ఓ భయంకరమైన విషపురుగా? జీవితంలో ఒక్కసారైనా ప్రేమించని మనిషంటూ లోకంలో ఉండడా? ఉంటుందా? నేనూ తెలిసి తెలియని వయసులో ఒకడ్ని ప్రేమిచా. ప్రేమించా అనేకంటే పిశాచిలా వాడ్ని బాధపెట్టి హింసించా. ఇప్పుడు నాకు తెలుసు. దాన్ని ప్రేమ అనరనీ, పిశాచ ప్రేమ అంటారనీ. ప్రేమ అంటే ఏమీ ఆశించదనీ, అసలేమీ షరతులు వుండవనీ, దైవం కంటే అది గొప్పదనీ, ప్రేమించకుండా, గొప్పగా చచ్చేకంటే, ప్రేమ విఫలైనా అది వెయ్యి రెట్లు గొప్పదని గుర్తించి చావడం ఎంత గొప్ప! గొప్ప కాదు నిజం. ఇదిగో, యీ స్నేహితురాలు నన్నా పిచ్చి పిశాచ ప్రేమలోంచి బయటపడేసింది. నాకు నేనుగా బ్రతికే ధైర్యం నూరిపోసింది. నేనూ మా సినిమా యూనిట్ నిస్సహాయ స్థితిలో ఉండగా ఓ చక్కని సలహా ఇచ్చి మమ్మల్ని బైట పడేసింది” అగాను.

“ఆ విషయం గుర్తు చేసుకోవద్దన్నానా?” అన్నది మహీ.

“లేదు మహీ.. అది గుర్తు ఉంచుకోబట్టే ఎప్పటికప్పుడు నన్ను నేను సరిదిద్దుకోగలుగుతున్నాను. ఓ విషయం చెప్పనా? నిన్ను చూసి నేనెంత మారానో నీకు తెలీదు. నాకు తెలుసు! అదక్కడ పెడితే, ఇవ్వాళ నేను అందరి ముందూ ప్రేమ గురించీ పెళ్ళి గురించీ ఆలోచించడం నిజం. నా ఆలోచన ఓ కొలిక్కి వచ్చాక మళ్ళీ అందర్నీ కలిసి చర్చిస్తాను” అని పాయసం చేతిలోకి తీసుకున్నాను.

అందరిలోనూ ఓ ఆశ్చర్యం, ఓ నిశ్చేష్ట స్థితి.

“అవును.. అవును.. తల్లిదండ్రులు ప్రేమ గురించీ పెళ్ళి గురించీ చక్కగా విశదంగా పిల్లలతోటి చర్చిస్తే లోకంలో యూ ఆత్మహత్యలూ, పరువు హత్యలూ ఉండవు అమ్మాయ్. తొందరపడి శీలాన్ని పోగొట్టుకున్న ఆడపిల్లలు ఎన్ని వందల మంది హాస్పటల్స్‌కి వచ్చి ‘భ్రూణహత్యా పాపం’ కట్టుకుంటారో తెలుసా? మనవాళ్ళు, అంటే పెద్దవాళ్ళు సంపాదనకీ, రాజకీయ నాయకులకీ, సరదాలకీ, షాపింగులకీ, వెచ్చించే సమయంలో వందో వంతు కూడా పిల్లల కోసం కేటాయించరు. కేటాయిస్తారు, వాళ్ళని చావగొట్టి చితగొట్టి వందకి వందా మార్కులు తెచ్చేట్టు చూడటం కోసం. ఆ మార్కులు జీవితానికి ఏమి ఉపయోగపడతాయాయీ? 10th లో నూటికి నూరూ వచ్చిన వాడు కాలేజీలో పదిసార్లు తప్పవచ్చు. 10thలో ఏవరేజ్‌గా ఉన్న పిల్లవాడు కాలేజీలో సూపర్ ఇంటలిజంట్‌గా మారొచ్చు. అసలు పిల్లల బాల్యాన్ని పెద్దవాళ్ళం ఎందుకు హరించాలి?”

చాలా మంచిగా మాట్లాడారు డా. సుధీర్.

“అవును డాక్టరుగారూ. మీరు 100% రైట్. నేను పుస్తకాలు పురుగుని కానని నాకు తెలుసు. ఎంత చదివినా అది బుర్రకెక్కేది కాదు. ఓ విరక్తితో చదువుని అటకెక్కించి సినిమాల్లోకి వచ్చాను. ‘నిజమైన చదువు’ని ఇప్పుడు చదువుకుంటున్నాను. సమయం ఎంత విలువైనదో, అసలు జీవితం ఇంకెంత విలువైనదో ఇప్పుడే నాకు తెలుస్తోంది. గతపు సమాధులు మధ్య అస్థిపంజరాల్నింటి జ్ఞాపకాల్ని వెతికి తీసే బదులు, చివురాకుల్లాంటి కొత్త క్షణాల్ని ఆనందంగా, ఆప్యాయంగా ఆనందించాలని తెలుసుకున్నాను. ఎవరేమనుకున్నా, నాకు నేనే తోడుండాలనీ, నన్ను నేను పోగొట్టుకోకూడదనీ మనసా వాచా కర్మణా నిర్ణయించుకున్నాను. ఇవన్నీ అతిశయంగా చెప్పడం లేదు. ఇంత మంది మంచి మిత్రులు, బంధువులు దొరికిన ఆనందంలో చెబుతున్నాను” అని పాయసం సిప్ చెయ్యడం మొదలు పెట్టాను.

అందరూ నావంకే చూస్తున్నారనీ నాకు తెలుసు. అందుకే నేను ఎవరి వంకా చూడటం లేదు. ఇంత పెద్ద స్పీచ్ ఇవ్వడం నాకే ఎంబరాసింగ్‌గా అనిపించింది. అయినా నేను దాని గురించి ఆలోచించదలచుకోలేదు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here