ప్రాచీన మధ్యయుగపు వాగ్గేయకారుల సారస్వత పరిచయం-2

0
3

[డా. సి. ఉమా ప్రసాద్ గారి ‘ప్రాచీన మధ్యయుగపు వాగ్గేయకారుల సారస్వత పరిచయం’ అనే ఫీచర్ అందిస్తున్నాము.]

ఉపోద్ఘాతము:

[dropcap]నా[/dropcap] ఈ పరిశోధనా గ్రంథాన్ని 5 అధ్యాయాలుగా విభజించాను. మొదటి అధ్యాయంలో సంగీత కళా ప్రాశస్త్యమును, ఆవిర్భావ వికాసాలను వివరించాను. ఈ అధ్యాయంలో నాద ప్రాశస్త్యాన్ని, సంగీత నాద ప్రధానమైన వేదాల విశిష్టతను, తొలి వాగ్గేయకారుడైన వాల్మీకి తొలి శ్లోకావిర్భావాన్ని వివరించాను. తదనంతర సంగీత వికాసాన్ని స్థూలంగా చర్చించాను.

రెండవ అధ్యాయములో త్యాగరాజ పూర్వపు వాగ్గేయకారుల జీవిత విశేషాలను, వారి సంగీత సృష్టికి ప్రేరకాలైన ప్రత్యేక అంశాలను వివరించాను. మూడవ అధ్యాయంలో ఆ వాగ్గేయకారుల సంగీత సేవను వేరు వేరుగా వివరించాను. వారి సంగీత సృష్టిలోని ప్రత్యేక అంశాల ప్రాభవాన్ని వివరించే ప్రయత్నాలు చేసాను.

నాలుగవ ఆధ్యాయంలో తదనంతర వాగ్గేయకారులపై వీరి ప్రభావాలను విశదీకరించాను. అయిదవ అధ్యాయంలో త్యాగరాజు ప్రవేశం వరకు సంగీత ప్రపంచంలో వచ్చిన మార్పులు సమీక్షించాను.

నా ప్రయత్నంలోని పొరబాట్లను మన్నించి, సరిదిద్దవలసినదిగా రసహృదయులను కోరుకుంటున్నాను.

సంగీత ప్రాశస్త్రములో అంశాలు – 1వ భాగము:

  • ఎ. కళ – నిర్వచనం
  • బి. సంగీత కళ – ఆపాతమధురం: 4 అంశాలు వివరణ
  • సి. కవులచే ప్రస్తుతించబడినది. కవుల కొటేషన్స్
  • డి: నాద, స్వర, సాహిత్య సమ్మేళం – సంగీతం

~

ఎ. కళ:

మానవుని మేధాశక్తిచే విశ్వరంజకముగా సంగీత ధ్వనులను, సమ్మేళనము చేసి గాత్రంతో గాని, జంత్రంపై గాని గానము చేయటం.

సంగీత శాస్త్రం అంటే సంగీత ధ్వనుల ఉత్పత్తి, వాటి పరిమితి, వాటి భేదాలు – ఆయా ధ్వనులలో ఒకదానితో మరియొక దానికి గల సంబంధాలు వాటి సమ్మేళనం చేసే క్రమాలు, ఆయా క్రమాలకి సంబంధించిన నియమాలు మొదలైన లక్షణాలు అన్నీ చేరియుండుట.

పరమాత్మ తనను తాను సకల చరాచర సృష్టిగా అభివ్యక్తీకరించుకుంటున్నాడు. ఈ పరంజ్యోతిని అనుభూతి చెందని ప్రాణి వుండదు. ప్రాణకోటిలో అంతశ్చైతన్యాన్ని పెంపొందించుకున్న ఈ అనుభూతిని మానవుడు సృష్టిలో ప్రతిఫలించే పరంజ్యోతిని మరింతగా అనుభూతి చెందగలడు. అవగాహన స్థాయికి తెచ్చుకోగలిగినవాడు జ్ఞాని. అవగాహనను మనోప్రపంచంలో తిరిగి దర్శించగలిగినవాడు భావుకుడు. ఈ దర్శనాన్ని అభివ్యక్తీకరించగలిగినవాడు కళాకారుడు.

ఈ కారణం వల్లనే కళలో సామాన్యుడి సహితం పరంజ్యోతిని గ్రహించి తన్మయుడు కాగలుగుతున్నాడు. అంటే కళాకారుడు జ్ఞాని, ద్రష్ట, స్రష్ట కూడా కావలసియుంది. కళలన్నింటిలో సంగీత కళ ఆపాతమధురం.

బి. సంగీత కళ – ఆపాతమధురం:

ఆపాతమధురం:

శ్లో॥

సంగీత మపి సాహిత్యం సరస్వత్యాః స్తనద్వయం

ఏకమాపాతమధుర మన్యదాలోచనామృతం

~

శ్లో॥

శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణిః

సంగీత ప్రభావానికి లోబడని వారుండరని మనకు అనేక కథలు, చరిత్రలు, ఘట్టములు తెలుపుచున్నాయి. సంగీతం శిశువులనే గాక పశువులు, విషసర్పములను కూడా ప్రభావితం చేస్తుంది. సంగీతం అభ్యసించటం వల్ల లేక కనీసం విని ఆనందించడం వల్ల మానవుడు తనను తాను ప్రక్షాళనము చేసికొని, సంఘానికి మరింత ఉపయోగపడగలడు. అలా సంగీతం వినడం వల్ల లేక అభ్యసించిన ఆత్మశుద్ధి కల్గి సంస్కారం పెరుగుతుంది అనడంలో సందేహము లేదు.

సుసంగీతం విని ఆనందించలేని వారు, ఎట్టి పాప కార్యములకైనా తగుదురని, అట్టివారు ఎన్ని శాస్త్రాలలో పండితులైనా పశువుతో సమానం అని చెప్పారు.

సంగీతానికి ప్రకృతియే లోబడింది. ఉదా: దీక్షితులు, త్యాగరాజు, శ్యామశాస్త్రి, తాన్‌సేన్, మొదలగు గాయకులెందరో తమ అపూర్వ గానంచే వర్షాలు కురిపించిరనియు, పంటలు పండించిరనియు, రుగ్మతలను పోగొట్టిరనియు వారి చరిత్రలను బట్టి తెలుస్తుంది.

జాతి, మత భేదాలకు అతీతమైనది:

విజ్ఞానం 2 రకాలు – కళలు, శాస్త్రాలు అని; కళలు 64 అని, ఆ చతుషష్ఠి కళలలో సంగీతం ఒకటి అనీ అంటారు. సంగీతం విశిష్టమైనది అత్యున్నతమైనది. ఎందుకంటే ప్రపంచంలో ఏ మారుమూలకైనను, చివరకు ఎట్టి అనాగరిక జాతికైనను ఏదో ఒక రకమైన సాంప్రదాయకమ్మైన గాన ఫణితి ఉంటుంది. సంగీతానికి భాష, మత, జాతి దేశ మొదలగు హద్దులు లేవు. సంగీతజ్ఞులు దేశాంతరములందు గౌరవింపబడుదురు.

ఉదా: ప్రఖ్యాత సితార్ విద్వాంసుడు పండిట్ రవిశంకర్ సంగీతాన్ని పాశ్చాత్యులు విని ఎంతో ఆనందిస్తున్నారు. అలాగే కీ.శే. ఖాన్ సాహెబ్ బడే గులామ్ ఆలీ, పాకిస్తాన్ చెందిన వారైనా, భారతీయులు ఆయన సంగీతానికి జోహారులర్పిస్తున్నారు.

భగవంతునిలో ఐక్యమయ్యె సాధనాలు:

కర్ణాటక సంగీత ప్ర్రాశస్త్యం, దాని ఆధ్యాత్మిక భావనా రీతిపై ఆధారపడియుంది. సంగీతాన్ని ముక్తి సాధన మార్గంగా భావిస్తుంది కర్ణాటక సంగీతం. కర్ణాటక సంగీతంలో అత్యధిక భాగం భగవత్ అంకిత కృతులు, కీర్తనలే. దేవుని గూర్చి పాడినంత మాత్రాన ఆధ్యాత్మ సాధన అనిపించుకోవు. కాని నాద స్వర సమ్మేళనమైన కర్నాటక సంగీత బాణి ఆధ్యాత్మిక మార్గంలో సాగుతుంది. సర్వప్రాణి కోటి హృదయాంతరగతమైన నాదాన్ని స్వర ప్రస్తార ప్రాభవంలో పలికించే సంగీత కళ చిన్మయానుభూతిని శ్రోతకందించే కళ. పాశ్చాత్యులు కూడా సంగీతాన్ని భగవంతుని ఐక్యమొనరించే కళగానే భావించారు.

సి. కవులచే ప్రస్తుతించబడినది. కవుల కొటేషన్స్:

చాలామంది చాలా రకాలుగా శ్లోకాల ద్వారా వారి, వారి అభిప్రాయాన్ని వ్యక్తపరచారు. వాటిలో కొందరు కవుల యొక్క కొన్ని అభిప్రాయాలు ఇక్కడే మనం గమనిద్దాం.

  1. శ్లో. కావ్యాలాపాశ్చయే కేచి ద్గీతానిసకలానిచ। శబ్దమూర్తిధర స్యైతే విష్ణోరం శామహాత్మనః॥ (విష్ణువు) అను శ్లోకములో శబ్ద స్వరూపమైన కావ్యాలని, సంగీతాన్ని భగవంతుని స్వరూపాంశములని తెలియుచున్నది.
  2. శ్లో. గీతిగానేన యోగ స్యాత్‌ యోగా దేవ శివైక్యతా। గీత్రిజ్ఞో యది యోగేన సయాతి ఫరమేశ్వరం॥ (సూతసంహిత) అను శ్లోకములో భక్తితో చేయబడు గానము యోగమై ఆ యోగము చేత మానవులు పరమాత్మ యందు ఐక్యమగుదురని సృష్టమగుచున్నందున సర్వులకు భక్తియుతమైన సంగీతోపాసన తరుణోపాయమునకు సులభ మార్గమగునని తెలియుచున్నది. కనుకనే త్యాగరాజు తన అపూర్వమగు సంగీత రచనలలో ఒకటైన (అ) ధన్యాసిరాగం ఆది కృతి పల్లవిలో – ‘సంగీతజ్ఞానము భక్తివినా సన్మార్గము గలదె మనసా’ అనియును (ఆ) ముఖారి ఆది లో ‘సంగీత శాస్త్రజ్ఞానము, సారూప్య సౌఖ్యదమే మనసా’ అనియును (ఇ) సారమతి రాగం ఆది – లో ‘మోక్షముగలదా భువిలో జీవన్ముక్తులు గానివారలకు’ అని కృతి అనుపల్లవిలో ‘సాక్షాత్కార నీసద్భక్తి – సంగీతజ్ఞానవిహీనులకు’ మోక్షము గలదా అనియును పేర్కొనెను.
  3. శ్లో. ఆకాశ సంభవో సోనాహతః। నఖలీయుజ చర్మాణీలోహ శారీరజాస్తిథా॥ (నారదులు)  ఓంకార నాదము నుండి అక్షరములు, ఆ అక్షరముల నుండి పదములు, ఆ పదముల నుండి ప్రస్తుత కాలమున సర్వవ్యాప్తముగా యున్న భాషయును ఏర్పడుట చేతనే ప్రపంచం నాదాత్మకముగా యున్నదని స్పష్టపరచబడింది. కావుననే మన సంగీతం నాదవిద్య అయింది. స్వరార్ణవం గ్రంథంలో ఈ శ్లోకము ద్వారా నారదులు తెలిపినారు.
  1. వేదమున బుట్టి తన్నభ్యసించువారికి మోక్షమిచ్చుచు భగవంతుని సేవించుటకై ఏర్పడిన విద్య సంగీతం.
  2. Heaven is Music – Campion
  3. Music opens Heaven – Emerson పేర్కొన్నారు.
  4. ‘ధ్యానాకర్ణన దర్శన, గానంబుల నా తలంపు గలిగినఁ జాలుం బూనెదరు కృతార్థత్వము’ (భాగవతము పూర్వ దశమ స్కందములోనిది)
  5. తే.గీ. విద్యలందెల్ల సంగీత విద్య మిగుల నుత్తమముగా। దెనిది పురుషోత్తమునకు నర్పితంబగునేని (పింగళి సూరన)
  6. కం॥ సంగీత/విశేషాభ్యాసము సఫలముగ విష్ణు పరమేశ్వరున/తా శక్తితోడ బాడుచు/వేసరక భజంపు మల్ల వేళల యందున్ (పింగళి సూరన)
  7. ‘కేళనో హరితేళనో తాళమేళగళిద్దు ప్రేమమీద గాని’ – ప్ర్రక్క వాయిద్యములున్నను భక్తి లేని సంగీతమును హరి వినడు, భరించడు (పురందర దాసు)
  8. ‘ఓంకార సంజ్ఞరశుమరామకుచవిహిత వీణామ్। సరిగమపదని నిరతామ్ మంగళ సంగీత సౌరభమన్యా॥’ (ఆది శంకర). సరస్వతీ దేవికి సంగీతమందు ప్రేమ. ఆమె మంగళ సంగీతం యొక్క సౌరభము.
  9. సూత సంహిత గ్రంథంలో – దైవముతో ఐక్యము పొందుటయే భారతీయ సంగీతం యొక్క లక్ష్యమని, విదేశ సంగీత పండితుడు ‘యాదు మన్ మోహన్’ చెప్పెను. సంగీతము శ్రోతల నేత్రముల నుండి కన్నీటిని కార్పించవలయునని కూడా ఆయనే చెప్పిరి.
  10. I pant for music which is divine – Shelley
  11. Music takes man to the very edge of the infinite and makes him gaze into wonders – Carlyle

సంగీతము శ్రోతలను బ్రహ్మ పదార్దము వరకు కొనిపోవును. ప్రవర్తన యందు బ్రాహ్మణులే, పవిత్రులే ఇట్టి సంగీతమును పాడువారే సంగీత మహర్షులు.

వేదముల నుంచి ప్రభవించినది:

సంగీత కళ వేదాల కంటే ప్రాచీనమైనది కావచ్చేమో కాని ఆయా స్వరములను గుర్తించడం మాత్రం వేదకాలంలో జరిగింది అని చారిత్రకుల అభిప్రాయం. వేదాలతో సమానంగా ఉత్పత్తి అయ్యే వృద్ధి పొందింది. కాబట్టి భారతీయ సంగీత శాస్త్రమునకు గాంధర్వ వేదం అని, ఉప వేదం అని పేర్లు వచ్చాయి. లౌకిక సంగీత పద్ధతికి మూలం షడ్జ, మధ్య గ్రామాలు. వాటి నుంచి జాతులు, జాతి నుంచి రాగాలు వచ్చాయి. ప్రస్తుత రాగాలకు మాతృక జాతులు అని చెప్పవచ్చు.

‘విద్’ అనే జ్ఞానార్థక ధాతువు నుంచి పుట్టినది వేద శబ్దం. ఆదిఋషులు సృష్టి పరమార్థాన్ని అన్వేషిస్తూ, గ్రహించిన జ్ఞానంతో సంకలనము చేసినవి వేదాలు. ఇవి స్మృతులు. అంటే ఒకరి నుండి మరియొకరు విని నేర్చుకొన్నవి. లిపిబద్ధం కావు. ఆ కారణాన వేదాలను స్వరబద్ధం చేసి వాటి మౌలికతను, పవిత్రతను కాపాడుకుంటు వచ్చారు ఆదిఋషులు. వీటిలో సామవేదం గాన ప్రధానమైన ప్రార్థనా శ్లోక సంకల్పితం. ఋక్కులు అనగా ప్రార్థనలు నాద ప్రధానమైన వేదగాన ఫణితిలో ఉదాత్త, అనుదాత్త స్వరములు చేరి సంగీత కళకు నాంది పలికినవి.

సామవేదం నుండి బ్రహ్మ సంగీత కళను గ్రహించి భరతాదుల కిచ్చినట్లు ఐతిహ్యం వుంది. ఈ రకంగా సామవేదం తొలి శాస్త్రీయ గ్రంథం అని చెప్పుకోవచ్చు. అటు తరువాత సంస్కృతము లోని రామాయణ భారతాలు, మూల ద్రావిడ భాషలోనే శిలప్పాధికారం, తొలి కావ్యాలు, గ్రంథాలు మొదలైనవి కూడా గాన యోగ్యమైన సంగీత గ్రంథములు గానే చెప్పుకోవచ్చును. కాని వీటిని ప్రధానంగా పురాణాలుగా పరిగణిస్తున్నాం. మన తొలి పురాణాలన్నీ గాన యోగ్యమైనవి. సామ వేదం నుంచి సంగీతం ఆవిర్బవించినది అని చెప్పుటకు గల కొన్ని ఉదాహరణలు పరిశీలిద్దాం:

‘నిగమోత్తమ సామ వేదసారం’ అని ‘నాదతనుమనిశం’ అను కీర్తనలోను; ‘అఖిల నైగమాశ్రిత సంగీత’ అని ‘ఆనంద సాగరమీదని’ అను కీర్తనలోను – సంగీతం సామవేదం నుంచి పుట్టినదని త్యాగయ్య వ్రాసిరి.

‘సామవేదాదిదం గీతం సంజగ్రాహ పితామహః’ – బ్రహ్మ సామవేదము నుండి సంగీతం గ్రహించెను అని సంగీత రత్నాకరమున వ్రాయబడినది.

‘రామాభిరామ’ అను కీర్తనలో చరణలో భాగంలో ‘బంగారు మేటి పాంపుపై భామామణి జానకి ష్రంగారించుకొని చెలువొందగ నిన్ను గని పొంగుచు మల్లె విరుల పూజించువేళ ష్రీహరి సంగీతము బాడుమని స్వామి త్యాగరాజునితో’ అన్నారు త్యాగయ్య.

‘బంగారు పూల పూజింతు బాగుగ నిను సేవింతు సంగీతము వినిపింతు’ (వద్దనుండునదే బహు మేలు వారిజాక్ష – కీర్తన) అన్నారు త్యాగయ్య.

పరిణామవికాసాలు:

చందోబద్ధమై, గానయోగ్యమైన శ్లోక పద్య రచన క్రమముగా జయదేవుని కాలము నాటికి అష్టపదులుగా పరిణమించినది. గాన శావ్యమైన గీతానికి కావ్య రచనకు విస్పష్ప విభేదం ఏర్పడింది. అష్టపదులను ప్రచారంలోకి తెచ్చిన ఘనత జయదేవుడిది. అష్టపదుల ఆధారంగా పద కవితలను సృష్టించి పద కవితా లక్షణాలను సృష్టించి పదాలు అనబడే కీర్తనలను ప్రచారంలోకి తెచ్చిన ఘనత మొట్టమొదటి వాగ్యేయకారుడు తాళ్లపాక అన్నమయ్యదే. ఈతని కీర్తనలు అన్ని శ్రీ వేంకటేశ్వరుని స్తోత్రాలు కావటం వల్ల వీటికి సంకీర్తనలు అని పేరు వచ్చినది.

పదకవితా మార్గంలోనే మరింతగా కృషి చేసి వివిధ రాగాలలో భగవద్ అంకితముగా కీర్తనలు రచించిన వారు పురందర దాసు, నారాయణతీర్థులు, క్షేత్రయ్య, రామదాసు మొదలగువారు. కృతులు రచించి సంగీత చరిత్రను కొత్త మలుపు తిప్పిన ఘనత త్యాగరాజుది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here