[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]
వజ్రబాణప్రకారాంశ్చ శిల్పినః సమదర్శయన్।
యేభ్యోశ్రావి ధ్వనిర్ధీరలోకహృత్ కంపకారకః॥
(శ్రీవర రాజతరంగిణి, 72)
శిల్పులు వజ్రబాణాన్ని విభిన్న రకాలుగా నిర్మించి ప్రదర్శించారు. వాటి నుండి వెలువడిన ధ్వని జనుల హృదయాలను కంపింపచేసింది, లేక, జనుల హృదయాలను భయంతో కంపింప చేసే ధ్వని వాటి నుండి వెలువడింది.
కశ్మీరు చరిత్రలో ఒక ప్రధాన ఘట్టాన్ని శ్రీవరుడు వర్ణిస్తున్నాడు.
క్రీ.శ.1465 లో కశ్మీరుకు ‘ఫిరంగి’లను రప్పించాడు జైనులాబిదీన్. అంటే కశ్మీరులో ఫిరంగులను తయారు చేయించాడు. ‘ఫిరంగి’ అన్న పదం ఆంగ్లేయులు భారతదేశంలో ప్రవేశించిన తరువాత వాడుక లోకి వచ్చింది. కానీ యురోపియన్లు భారతదేశంలో ప్రవేశించక ముందే కశ్మీరులో జైనులాబిదీన్ ఫిరంగిని ప్రవేశపెట్టాడు.
తొలి ఫిరంగి కశ్మీరులో తయారయిన సందర్భంలో సంబరాలు జరిగి ఉంటాయి. ఆస్థాన కవిగా, జైనులాబిదీన్ సన్నిహితుడిగా ఆ సందర్భంలో పద్యాలు చెప్పటం శ్రీవరుడి బాధ్యత. ఆ సందర్భం లోని పద్యాలను ‘ యంత్రభాండ ప్రశస్తి’ అన్న పేరిట తన రాజతరంగిణిలో పొందుపరచాడు శ్రీవరుడు.
ఇక్కడ గమనించాల్సినవి రెండు విషయాలు..
మొదటిది జైనులాబిదీన్ దూరదృష్టి.
ఇస్లామీయులకు 12వ శతాబ్దంలో ప్రేలుడు పదార్థాలు పరిచయమయ్యాయని చరిత్రకారులు నమ్ముతారు. అంతకు ముందు కత్తులు, కటార్లు, బల్లేలు, డాళ్లు వంటి విభిన్నమైన ఆయుధాలను సమర్థవంతంగా వాడుతూ దేశాలను గెలుచున్న ఇస్లామీయులకు ఫిరంగులు, తుపాకులు – చైనీయులు, మంగోలులు, యూరోపియన్లతో పరిచయం వల్ల అందుబాటులోకి వచ్చాయంటారు. అంటే ఇంకా పూర్తిగా వాడకంలోకి రాకున్నా, వర్షం వస్తే పనికి రావన్న అభ్యంతరాలు వినిపిస్తూన్నా – ‘మందుగుండు’, ఫిరంగుల ప్రాధాన్యం, యుద్ధంలో వాటి వాడకం వల్ల కలిగే లాభాల గురించి అవగాహన కలిగి వాటికి తన ఆయుధాగారంలో స్థానం కల్పించటం జైనులాబిదీన్ దూరదృష్టిని ప్రదర్శిస్తుంది. ఇదే సమయంలో కశ్మీరీయులకు పలు రకాల వృత్తులను ఏర్పాటు చేయటం, అతని పాలనా చతురతను స్పష్టం చేస్తుంది.
ఈ సందర్భంగా గమనించవలసిన రెండవ విషయం శ్రీవరుడు సంస్కృత భాషను సజీవంగా నిలిపి ప్రజలకు చేరువ చేయాలని ప్రయత్నించటం.
భాష అభివృద్ధిలో, సజీవంగా నిలవటంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది నూతన పదాల సృష్టి. సమాజం నిరంతర చలనశీలి. కొత్తకొత్త పద్ధతులు, విషయాలు సమాజంలో భాగమవుతాయి. సజీవంగా నిలిచే భాష, ప్రతి నూతన సందర్బానికి ఉచితమైన నూతన పదాలను ఏర్పాటు చేసుకుంటుంది. అలా ఏర్పాటయిన పదాలు ప్రజలను చేరితే ఆ పదం సామాన్యమవుతుంది. భాష ముందుకు సాగుతుంది.
కశ్మీరులో ‘ఫిరంగి’ని జైనులాబిదీన్ ప్రవేశ పెట్టటం ఒక నూతన సందర్భం. ఆ నూతన సందర్భాన్ని వర్ణించాలి శ్రీవరుడు. అందుకు నూతన పదాలను సృష్టించాలి, వర్ణనలు చేయాలి. శ్రీవరుడు అదే చేశాడు.
ఫిరంగిని ‘వజ్రబాణం’ అన్నాడు. ‘బందూక్ ఔర్ తోప్’ అనలేదు. ‘గోమీగోలా’ అనలేదు. ‘వజ్రాయుధం’ శక్తివంతమైన తిరుగులేని ఆయుధం. ఆ కాలంలో ‘ఫిరంగి’ అతి శక్తివంతమైన ఆయుధం. దాన్ని ‘వజ్రబాణం’ అన్నాడు శ్రీవరుడు. చక్కటి పదప్రయోగం. బాణాల్లా శక్తివంతమయిన రాతిగుళ్ళను విసురుతుందది. దాన్ని తయారు చేసిన వారిని ఇప్పుడు మెకానిక్స్ అంటున్నాం. అప్పుడు ఆ పదం లేదు. ‘శిల్పులు’ అన్నాడు. రాతిని చెక్కి శిల్పం తయారు చేసినట్టు, లోహాన్ని ఫిరంగిలా మలిచారు.
తద్యదన్త్ర భాండ భేదాంశ్చ తత్తద్ధామమయాన్నవాక్।
ఆనీతవాన్ నరపతిః సంహతాన్ శిల్పి నిర్మితాన్॥
(శ్రీవర రాజతరంగిణి, 73)
శిల్పులు విభిన్నమైన ధాతువులతో నిర్మించిన నవీన యంత్ర భాండాన్ని రాజు కశ్మీరు తీసుకు వచ్చాడు. ‘ఫిరంగి’ని ‘యంత్రభాండం’ అంటున్నాడు.
ఈ శ్లోకాలలో సంస్కృత భాషను సమకాలీన సమాజానికి తగ్గట్టు శ్రీవరుడు మలచటం కనిపిస్తుంది.
నిజానికి, దేశంలో ఇతర ప్రాంతాలలో పర్షియన్ భాష రాజభాషగా చలామణీ అవుతోంది. ఉర్దూ, హిందుస్తానీ (హిందీ) వంటి భాషలు వాడుకలోకి వస్తున్నాయి. సంస్కృతం పలు ప్రాంతాలలో సజీవంగా ఉన్నా, కావ్య నిర్మాణం అరుదయి పోయింది. కానీ కశ్మీరంలో సంస్కృతంలో కావ్యాలను రచించటమే కాదు, పర్షియన్ కావ్యాలను సంస్కృతం లోకి అనువదించటం సాగింది. మారుతున్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా సంస్కృత భాష కూడా రూపాంతరం చెందుతూ కొత్త పోకడలు పోవటం శ్రీవరుడి రచన ప్రతిబింబిస్తుంది.
ప్రశాస్త్రిః క్రియతాం యన్త్రభాండేశ్వితి నృపాజ్ఞయా।
మయైవ రచితాన్ శ్లోకాన్ ప్రసంగాత్ కథయామ్యహమ్॥
(శ్రీవర రాజతరంగిణి, 74)
“రాజాజ్ఞను అనుసరించి యంత్రభాండాన్ని ప్రశంసిస్తూ శ్లోకాలను రచించాను. ఆ శ్లోకాలు చెప్తాను మీకు” అంటున్నాడు శ్రీవరుడు.
మళ్ళీ ‘యంత్రభాండం’ అన్న పద ప్రయోగం చేశాడు. ఒక పదాన్ని సృష్టంచటమే కాదు, దాన్ని వాడుతూ వుంటే అది అలవాటవుతుంది. ఇతరులకు చేరుతుంది. అలా అది ప్రజలలో ప్రచారమవుతుంది. భాషలో స్థిరపడుతుంది.
యదనుగ్రహేణ రాజ్ఞాం సమయో లీలావిలాసమయః।
సమయశ్చ యన్త్రతన్త్రైః స్థిరాం ప్రతిష్ఠాం క్రియాత్ స మయః॥
(శ్రీవర రాజతరంగిణి, 75)
ఎవరి అనుగ్రహంతో రాజులకు లీలావిలాస సమయం వస్తుందో, ఆ సమయం, ఆ శిల్పి రాజు ప్రతిష్ఠను సుస్థిరం చేయాలి.
ఈ శ్లోకం కాస్త గజిబిజిగా అనిపిస్తుంది. రాజు ఎంత గొప్ప వీరుడయినా, అతని సైన్యానికి ఆధునిక మారణాయుధాలుండి, వాటి వాడుకలో వారు నిష్ణాతులై ఉంటే, ఆ రాజు విజయం సాధించటం తథ్యం. విజయం సాధించిన రాజు సకల భోగాలు అనుభవిస్తాడు. అతడిపై ఇతర రాజుల ఆనందవిషాదాలు ఆధారపడి ఉంటాయి. ‘ఆధునిక మారణాయుధం’ అంత ప్రాధాన్యం. అలాంటి మారణాయుధాన్ని జైనులాబిదీన్ కశ్మీరుకు తెచ్చాడు. ఆ ఆయుధ ప్రభావంతో జైనులాబిదీన్ ప్రతిష్ఠ మరింత సుస్థిరం కావాలని శ్రీవరుడు ఆశీర్వదిస్తున్నట్టు అనిపిస్తుంది.
రసవసుశిఖిచంద్రాయికే శాకే నాకేశవిశ్రుతో రాజా।
శ్రీ జైనోల్లాబ్దీనః కశ్మీరాన్ పాలయన్ విజయీ॥
(శ్రీవర రాజతరంగిణి, 76)
శకవర్షం 1386లో ఇంద్రుడి లాంటి వీరుడు రాజు జైనులాబిదీన్ కశ్మీరును పాలిస్తూ –
శకవర్షం 1386 మన ప్రస్తుత లెక్కల ప్రకారం 1464-65. ఈ సంవత్సరంలో కశ్మీరులోకి ఫిరంగి అడుగు పెట్టిందని శ్రీవరుడి రాజతరంగిణి ద్వారా తెలుస్తోంది. మరో విషయం ఏమిటంటే, 1464లో ఫిరంగి తయారీ ఆరంభమయింది. 1465 లో తయారీ పూర్తయి, బహిరంగ ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా సుల్తాన్ కోరికపై శ్రీవరుడు ‘యంత్రభాండ ప్రశస్తి’ రాశాడు. దీన్ని బట్టి తెలిసే మరో విషయం ఏంటంటే, సుల్తాన్ జైనులాబిదీన్ కాలంలో ఏదైనా కొత్త సంఘటన సంభవిస్తే, దాని గురించి సంస్కృతంలో ప్రశస్తి శ్లోకాలు రాయటమనే ఆనవాయితీ కొనసాగింది. సంస్కృత భాషను మతపరంగా ఎవరూ భావించలేదు. సంబరాలప్పుడు సంస్కృత శ్లోకాలు ఆనవాయితీగా ఉండే స్థితి నుంచి, ప్రమాణ స్వీకారం ఎవరయినా సంస్కృతంలో చేస్తే సంబరంగా చెప్పుకునే స్థితికి గత ఏడు వందల ఏళ్ళలో ఎదిగాము మనం!
వర్షే శశివేదాంకే నిర్మితవాన్ యన్త్రభాండమిదమ్।
తదితి మౌసులభాషాఖ్యాతం లోకేచ తత్ కాండమితి॥
(శ్రీవర రాజతరంగిణి, 77)
ఈ శ్లోకంలో శ్రీవరుడు పర్షియన్ భాష పదాలను ప్రయోగించాడు. ఆ కాలంలో ప్రచారంలో ఉన్న స్థానిక కశ్మీరు భాష పదాన్ని ఉపయోగించాడు. ఇదంతా సంస్కృత భాషతో కలిపి వాడేడు.
శ్రీవరుడి దూరదృష్టి, ఆధునికపుటాలోచనలను, సమకాలీన పరిస్థితులను ఆకళింపు చేసుకుని వాటికి తగ్గట్టు మారే లక్ష్మణమూ ఈ ‘యంత్రభాండ ప్రశస్తి’ శ్లోకాలలో మరింత ప్రస్ఫుటమవుతాయి.
41వ సంవత్సరంలో ఈ యంత్రభాండం నిర్మాణం పూర్తయింది. మౌసుల భాష (ముస్లిం భాష) లోనూ, స్థానికంగానూ దీన్ని ‘కాండ’ అంటారు.
ఈ శ్లోకానికి పాఠ్యాంతరాలున్నాయి.
‘తదితి’ అన్న రెండవ పాదంలోని ఆరంభ పదం స్థానంలో పదాన్ని కొందరు ‘తోప్ ఇతి’ గా భావిస్తారు. ‘తోప్’ అంటే ఫిరంగి. అలాగే, రెండవ పాదం చివరి పదం ‘తత్ కాండమితి’ ని ‘దుద్ కాండమితి’ గా భావిస్తారు. పర్షియన్ భాషలో ‘దుద్’ అంటే పొగ. ‘కాండ’ అంటే గొట్టం. ‘దుద్ కాండ’ అంటే పొగ గొట్టం. మౌసుల భాషే, లోకేచ అనటం వల్ల పర్షియన్ భాషలోనూ, స్థానికులూ ఈ ‘తోప్’ను ‘దుద్ కాండ’, ‘పొగ గొట్టం’ అంటారని చెప్తున్నాడు శ్రీవరుడు. ‘గన్ బారెల్’ను ‘దుద్ కాండ’, ‘పొగ గొట్టం’ అని స్థానికులు అనేవారేమో! ఆ పదాన్ని శ్రీవరుడు ప్రయోగించినట్టున్నాడు. ‘దుద్’ పర్షియన్ పదం; ‘కాండ’ స్థానిక కశ్మీరీ భాషా పద. శ్లోకం సంస్కృత శ్లోకం!
దుర్గేషు దుర్గాతి పరం హృస్ఫోటకరం తరంగ దత్తదరం।
దూరోన్ముక్తాశ్శశరం కటకబలాన్య దృష్ట చరమ్॥
(శ్రీవర రాజతరంగిణి, 78)
దుర్గాలను (కోటలను) ధ్వంసం చేస్తుంది. హృదయాలను బద్ధలు చేస్తుంది. గుర్రాలను కంగారెత్తించి అటూ ఇటూ పరుగెత్తేట్టు చేస్తుంది. దూరం నుంచే రాళ్ల బాణాలను కురిపిస్తుంది. సైన్యాలకు దిక్కు తోచని పరిస్థితి కల్పిస్తుంది.
ఈ శ్లోకంలో కూడా సంస్కృత భాషను ఆధునిక అవసరాలకు పనికి వచ్చేట్టు సాగదీయటం కనిపిస్తుంది. ఫిరంగుల నుండి వెలువడే గుళ్ళు కోటగోడలను ధ్వంసం చేస్తాయి. వాటి శబ్దానికి గుండెలు అదురుతాయి. ఆ శబ్దానికి భయంతో అశ్వాలు కూడా అదుపు తప్పి విచ్చలవిడిగా స్వైరవిహారం చేస్తాయి. ఫిరంగులు విసిరే రాళ్ళు (ఆశ్మ) బాణాలు (శరం) ఈ ఘోరాన్ని కలిగిస్తాయి. అవి ఎక్కడి నుంచో దూరం నుంచి ఈ రాళ్ళ బాణాలు విసురుతాయి కాబట్టి, అవి ఎక్కడ నుంచి వచ్చి పడుతున్నాయో తెలియక సైనికులు కకావికలమవుతారు.
ఫిరంగి గుళ్ళు కలిగించగల విధ్వంసాన్ని కళ్ళకు కట్టినట్టు చూపాడు. ఈ విసిరే రాళ్ళను ‘ఆశ్మశరం’ – రాళ్ళ బాణాలని చక్కగా వర్ణించాడు.
సారం సురీతి బద్ధం ఘనఘోషం శిల్పికల్పితమహార్ధమ్।
నవమివ నగరం నృపతేః కల్పం స్తాద్యన్త్రభాండ మిదమ్॥
(శ్రీవర రాజతరంగిణి, 79)
ధృఢమైనది, లోహకవచం కలది, మేఘల్లా గర్జించేదీ ఈ యంత్ర నిర్మాణ రహస్యం దొంగిలించలేనిదీ, అయిన ఈ యంత్రభాండ కలకాలం చిరంజీవిగా ఉండాలి. రాజు నిర్మించిన కొత్త నగరం ఎలా చిరకాలం మన్ననలో ఉంటుందో అలా చిరకాలం ఈ నూతన యంత్రం పనికిరావాలి. ఫిరంగిని రాజు కట్టిన నూతన నగరంతో పోలుస్తున్నాడు. లోహకవచాన్ని ‘సురుతీబద్ధం’ – లోహంతో చుట్టబడినది – అని వర్ణిస్తున్నాడు. శ్రీవరుడి రచనా ప్రతిభ ఈ ‘యంత్రభాండ ప్రశస్తి’ లోని ప్రతి పదంలో కనిపిస్తుంది.
ధాతువిభక్తిస్ఫారాత్ పదప్రత్యుత్యా ప్రయోజితే శబ్దే।
అర్థోపలబ్ధి హేతోర్భవత్విదం వృద్ధిగుణయుక్త చా॥
(శ్రీవర రాజతరంగిణి, 80)
ఎలాగయితే పదాలను రూపాంతరం చెందించి ప్రయోగించాలంటే ధాతు విభక్తి ప్రత్యయాలను మరింత విస్తారం చేయటం వల్ల కొత్త అర్థం వస్తుందో, అలాగే ఈ యంత్రం అనేకానేక లాభాలు కలది. దీని ప్రయోగం వల్ల కొత్త కొత్త లాభాలు కలుగుతాయి.
ఇతి పద్యాంకితా యన్త్రభాండాలీ వ్యరుచన్నవా।
యదుష్మౌధధ్వా నిశ్చక్రే మేఘగర్జిత తర్జనమ్॥
(శ్రీవర రాజతరంగిణి, 81)
యంత్రభాండం విసిరే రాతి బాణాలపై ఈ పద్యాలు లిఖించారు. నవీన యంత్రాన్ని అలంకరించారు. అవి రాళ్లను విసర్జించినప్పుడయ్యే ధ్వని మేఘ గర్జనను కూడా పరాజితం చేసింది.
ఫిరంగి విసిరే గుళ్ళపై ‘యంత్రభాండ ప్రశస్తి’ పద్యాలు రాయటం అన్నది అనౌచిత్యం. బహుశా ఈ పద్యాలను అందరూ చదివి మెచ్చుకున్నారేమో. యంత్రాన్ని పూలతో అలంకరించి పూజ చేయటం ఆనవాయితీ. అయితే, ఇప్పుడు ఏ దేశం తయారు చేసే ఆయుధాలపై ఆ దేశం గుర్తు ముద్రించేట్టు, బహుశా, ఆ కాలంలో ఫిరంగి గుళ్లపై కశ్మీరు రాజ్య చిహ్నం ఏదో ముద్రించి ఉంటారు. శ్రీవరుడు దాన్నే ప్రస్తావిస్తుండి ఉంటాడు. కశ్మీరు గుళ్ళపై ‘కమలం చిహ్నం’ ఉండేదని పర్షియన్ రచనల ద్వారా తెలుస్తుంది.
ఆదమ్ ఖాన్ దేశ బహిష్కారం ప్రస్తావించి, హఠాత్తుగా ‘యంత్రభాండం ప్రశస్తి’ని మధ్యలో చెప్పిన శ్రీవరుడు ఈ శ్లోకం తరువాత మళ్ళీ ఆదమ్ ఖాన్ దగ్గిరకు వస్తాడు.
(ఇంకా ఉంది)