ఎంత చేరువో అంత దూరము-22

7
3

[శ్రీమతి పువ్వాడ శారద గారు రచించిన ‘ఎంత చేరువో అంత దూరము’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[బరువెక్కిన హృదయంతో ఫ్లయిట్ ఎక్కుతాడు ఆనంద్. తాను తిరిగొచ్చేసరికి జానూ ఉండదనే బాధ ఒక వైపు, ఊర్మిళని అటువంటి పరిస్థితులలో వదిలి వెళ్ళాల్సి వచ్చినందుకు బాధ మరో వైపు. ఊర్మిళ విషయంలో తాను ఎంత నచ్చజెప్పినా అప్పట్లో మాలతి వినలేదన్న విషయాన్ని గుర్తు చేసుకుంటాడు. కుటుంబ సభ్యులందరినీ కోల్పోయి ఒంటరిగా మిగిలిన ఊర్మిళ పట్ల జాలి ఆనంద్‍కి. హాస్టల్ లో చేర్పించి, డిగ్రీ చదువుకునే ఏర్పాటు చేస్తాడు. ఆప్పుడప్పుడు ఊర్మిళ ఫోన్ చేసి సబ్జెక్టులలో డౌట్లు అడిగితే, తీర్చేవాడు. ఊర్మిళ ఫోన్ కాల్స్ వల్ల తనలో సాంత్వన కలగడం గమనిస్తాడు ఆనంద్. ఓ రోజు ఆనంద్ మేనమామ ఊర్నించి వచ్చి – మాలతి విషయంలో ఏదో ఒకటి తేల్చుకోబోయావా అని అడుగుతాడు. తాను తప్పు చేశాననీ అంగీకరించాలనీ, మరెప్పుడూ చేయమని అమ్మ మీద ఒట్టు వేయాలనీ మాలతి పట్టు పట్టిందనీ, తాను ఏ తప్పూ చేయనందున అందుకు అంగీకరించలేదనీ, ఆ తర్వాత వాళ్ళు ఫోన్ నెంబర్ మార్చేసుకున్నారని చెప్తాడు ఆనంద్. అయినా మరోసారి మాట్లాడి తేల్చుకో అని మావయ్య అంటే, రాధమ్మ గారి ద్వారా మాలతి నెంబర్ తీసుకుని ఫోన్ చేస్తాడు. ఆనంద్ గొంతు వింటూనే ఆమె కాల్ కట్ చేస్తుంది. ఆనంద్ మావయ్య రాధమ్మతో మాట్లాడుతాడు. అయినా ఉపయోగం లేకపోతుంది. మాలతి రానంటే రానని పట్టుబట్టిందట. మేనమామ ద్వారా లాయర్ నోటీస్ పంపించినా ఉపయోగం ఉండదు. ఊర్మిళకుండే ఖర్చుల కోసం ఓ డెబిట్ కార్డుని మహేష్ చేత పంపిస్తాడు ఆనంద్. ఓ రోజు ఊర్మిళ పుట్టినరోజుని గుర్తొచ్చి, ఆమెను విష్ చేస్తే పొంగిపోతుంది. ఫ్లయిట్ ల్యాండ్ అవుతుంటే ఆనంద్ ఆలోచనలు కూడా అగుతాయి. ఇంట్లో తన మంచం పక్కన ఆనంద్ మాలతిల ఫోటో చూసి విస్తుపోతుంది ఊర్మిళ. అన్నమ్మని ఆ ఫోటోని వేరే సొరుగులో పెట్టమంటుంది. పిల్లలిద్దరూ వచ్చి గడప దగ్గర నుంచుంటే పిలిచి, వాళ్ళతో కాసేపు మాట్లాడి, వేణుతో చెప్పి అందరికీ ఐస్‍క్రీమ్ తెప్పిస్తుంది. తనకంటే చిన్నదీ, అందంగా ఉన్న ఊర్మిళను చూస్తుంటే మాలతిలో అసూయ పెరుగుతోంది. ఆనంద్ ఫోన్ చేసి ఆమె కండీషన్ గురించి అడగటం గుండెను మండిస్తోంది. ఆనంద్ లేనప్పుడు ఆ ఇంట్లో మాలతితో ఉండడం ఊర్మిళకి అసౌకర్యంగా ఉంటుంది. – ఇక చదవండి.]

అధ్యాయం 22

[dropcap]ఆ[/dropcap]నంద్ దొరికిన సమయంలోనే ఢిల్లీలో షాపింగ్‌కు బయలుదేరాడు.

ముచ్చట గొలిపే ఫ్రాక్స్ చూసి నిట్టూర్చాడు. జాన్వీ వెళ్ళి పోయి ఉంటుంది. ఇంకా ఎవరి కోసం? ఈ ఫ్రాక్స్ నచ్చితే లాభం ఏమిటీ?

ఊర్మిళ బర్త్ డే దగ్గరికి వస్తూంది. ఆమె కోసం అందమైన హ్యాండ్ బ్యాగ్ కొన్నాడు. కొన్ని పంజాబీ డ్రెస్‌లు తీసుకున్నాడు.

అక్కడే ఓ అందమైన చీర రంగు చూసి, అతని స్మృతిపథంలో మాలతి మెదిలింది.

పర్స్ నిండా డబ్బుంది. గుండె నిండా కొనాలన్న ఇష్టం ఉంది.. మనుషులే దూరం..

మాలతి రాక ఆనంద్‌లో ఆశాంతి నింపింది.

ఆమె ఆరోగ్యం బాధ కలిగిస్తోంది.

 తాను నమ్మాడు –

మాలతి తన కోసం తిరిగి వస్తుందని. కానీ అది ఇంత ఆలస్యంగా జరుగుతుందనుకోలేదు.

జాన్వీ రాకను కూడా హృదయపూర్వంగా స్వాగతించేందుకు సంశయించాడు. తనపై మనసులో ఏ ముద్ర వేసుకుందో, అన్న ఫీలింగ్. ‘థాంక్స్ టు మాలతి, జాన్వీ మనసులో నాపై ప్రేమలో ఆ స్వచ్ఛతను అలాగే కాపాడావు’, అనుకున్నాడు.

హోటల్ చేరుకున్న ఆనంద్ బెల్ కొట్టి, డిన్నర్‌కు చెప్పాడు.

ఎక్కువ మాట్లాడే మూడ్ లేదు.

“తిన్నవా, మందులు వేసుకున్నావా!” అని మెసేజ్ చేసాడు.

“డన్!” అంది ఊర్మిళ.

ఆమె కూడా “డిన్నర్ అయ్యిందా!” అని మెసేజ్ పెట్టింది .

అందుకు ఊర్మిళకు, “ఇప్పుడే స్టార్ట్ చేయబోతున్నాను” అని మెసేజ్ ఇచ్చాడు.

ఆలోచనలు ఊర్మిళ వైపు మళ్ళాయి.

‘సర్! ఈ సమ్ ఎలా చేయాలి.’ అనేది ఫోన్‌లో. ఫోన్ లోనే చెప్పేవాడు. ఏవో పనుల ఒత్తిడిలో ఉన్నాడు. బయటకు వెళ్ళేది ఉంది. ఆమెకు చెప్పింది అర్థం కాకపోవడంతో హడావిడిలో తన స్వరం కాస్త గట్టిగా వచ్చింది. అంతే! అవతలి వైపు గొంతు జీరబోయింది. కళ్ళల్లో నీళ్ళు వచ్చే ఉంటాయి ‘బాప్ రే! ఇలాంటి మనిషి తోనా, ఇరుక్కున్నాను. ఇంత సున్నితమైతే ఎలా?’ అనిపించింది.

అలాంటి ఊర్మిళ మాలతి రాకను ఎలా డైజెస్ట్ చేసుకుందో! మానసికంగా ఎంత అనిశ్చితి అనుభవించిందో! ఒక్క మాటా పెదవి విప్పి అనలేదు తనతో!

ఎప్పుడూ అదే సహనం..

జీవితం నుండి పారిపోవాలి అనుకుంది. బ్రహ్మకుమారీస్‌లో తల దాచుకోవాలనుకుంది.

మనుషులపై నమ్మకం కోల్పోయిన ఆమె, తన విషయంలో పూర్తి భరోసాతో ఉంది.

ఊర్మిళ కు మంచి బుక్స్ సెలెక్ట్ చేసి, మహేష్‌తో పంపేవాడు.

నిజానికి బుక్ లిస్ట్ మామయ్య చలువనే! తానెప్పుడూ ఇలా బుక్స్ చదివి ఉండలేదు.

ఫేమస్ ఇంగ్లీష్ ఆథర్స్ బుక్స్ పంపినపుడు చదవలేనని టెన్షన్ పడింది. ఆప్ ఓపెన్ చేసుకుని, అర్థం కాని వర్డ్స్ అందులో చూసి అనువదించుకుని చదవమని చెప్పాడు.

ఇంగ్లీష్ ఇంప్రూవ్ అయ్యేందుకు హెల్ప్ చేస్తుందని చెప్పాడు.

డిగ్రీ ఫస్ట్ క్లాస్ మార్కులతో మురిసిపోతున్న ఊర్మిళ ముఖంలో సంతోషం చూసి, పీజీలో జాయిన్ అవమన్నాడు.

ఊర్మిళ ఎం.కామ్. మొదటి సంవత్సరంలో ఉండగా అనుకోకుండా ఒక రోజు –

తనకు తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. ఆఫీస్ నుండి గంట క్రితమే ఇంటికి వచ్చాడు విలవిల లాడుతూ.

మహేష్‌ను మళ్ళీ రమ్మని ఫోన్ చేసాడు. కారులో హాస్పిటల్‌కు వెళుతుంటే, యూనివర్సిటి హాస్టల్ నుండి ఊర్మిళ ఫోన్ – ఏదో బుక్ దొరకడం లేదు అని.

తన పరిస్థితి ఆమెకు తెలియకూడదని బాధను భరిస్తూ సమాధానం చెప్పాడు. కానీ సిస్టరమ్మ తన బాధను పసిగట్టింది. ఇంక తప్పదని మహేష్ తన ఫోన్ తీసుకొని, ఆమెకు విషయం చెప్పాడు.

ఊర్మిళ, “సర్! నేనూ వస్తాను” అంది. ఆమె గొంతు వణుకుతూంది.

“ఏమి కాదు సర్! టెన్షన్ లేదు.” అంది.

ఆమె ఇప్పుడు పిరికి పిల్ల కాదు. తనకు ధైర్యం చెప్పేందుకు ఆమె నిబ్బరం అరువు తెచ్చుకుంది. ‘గుడ్, ఊర్మిళా!’ అనుకున్నాడు. ఈ వ్యక్తిత్వ మార్పు స్త్రీకే సాధ్యమయ్యే ఓ గొప్ప సుగుణం.

టాబ్లెట్ కాస్సేపు ఉపశమనం కలిగించింది. మళ్ళీ నొప్పి ఊపు అందుకుంది. పంటి బిగువున భరిస్తూన్నాడు.

హాస్పిటల్‌కు రాగానే లోపలికి తీసికెళ్ళారు. టెస్ట్ చేసారు. స్కానింగ్ అవసరం అన్నారు.

స్కానింగ్ నుండి వచ్చాక, మళ్ళీ నొప్పి ఉధృతం అయ్యింది. “అల్సర్ ఉంది. అర్జంట్‌గా ఆపరేషన్ అవసరం కావొచ్చు. మీ వాళ్ళు ఈ పేపర్స్‌పై సంతకం పెట్టాలి” అన్నాడు ఓ యువ డాక్టర్.

‘మా వాళ్ళా!’ అనుకునేంతలో ఊర్మిళ కంగారుగా హాస్టల్ వాళ్ళ పర్మిషన్ తీసుకొని అప్పుడే హాస్పిటల్ కు వచ్చింది. పరిస్థితి అర్థం చేసుకుంది. క్షణం ఆలోచించకుండా పేపర్స్‌పై సంతకం పెట్టింది.

స్ట్రెచర్ లోపలికి నడిచింది. తన కెవరూ లేరు అని చెప్పుకునే పరిస్థితిని ఊర్మిళ తప్పించింది.

ఆ తర్వాత రూమ్‌కు షిఫ్ట్ చేశారు. మందుల ప్రభావమేమో మగత వదలట్లేదు.

మగతలో ఏవో ఆలాపనలు.. భ్రమలు..

అచ్చు మాలతి తనకు జ్వరం వచ్చినప్పటిలాగా, ముందుకు వంగి నుదుటి మీద చేయి వేసినట్టు ఆ చల్లని చేతి స్పర్శ.. ఆ చేతి గాజుల గలగలలు.. ఆమెవేనన్న భావోద్వేగం..

మాలతి వచ్చిందా!

మాలతీ – మాలతీ! మనసు ఆక్రోశిస్తోంది.

జాన్వి కళ్ళ ముందు అందకుండా పరిగెడుతోంది.

కాస్త మగత విచ్చుకొని కళ్ళు తెరిచాడు.

తననే జాలిగా గమనిస్తూ ఉన్న ఊర్మిళ – “సర్! ఎలా ఉంది” అంది.

“ఐ ఫీల్ బెటర్ నౌ!” అన్నాడు. ఆ సమాధానంతో తృప్తి పడింది.

ఇంతలో డ్యూటీ చేసే సిస్టర్ వచ్చింది. టాబ్లెట్స్ ఏవో మింగించింది.

ఆమె వెళ్లిపోయాక, “ సర్! నేనూ మీకు ఒకప్పుడు ఇలాగే మందులు మింగించాను” అంది, గతం గుర్తు చేసుకుంటూ.

తాను అవునన్నట్టు తలాడించాడు.

తాను ఇంకా పూర్తి యాక్టివ్‌గా అవలేదు. అయినా ఏవో ఆలోచనలు..

ఇదంతా ఇలా జరిగిందేమిటి?

ఆ క్షణం అనుకోలేదు. ఊర్మిళతో పరిచయం ఇంత కాలం కొనసాగుతుందని.

ఊర్మిళనే జీవితం తన చేతుల్లో పెట్టిందా! తానే ఆమె జీవితం చేతుల్లోకి తీసుకున్నాడా!

ఏదైనా ఆమెపై సానుభూతి, దయతోనే!

మనసుకు మాలతి ఓదార్పే కావాలి.

ఆమె సాన్నిహిత్యం, ప్రేమ కోసం అల్లాడుతూంది. ఊర్మిళ ఓ అనాథ – పిరికి, మంచి పిల్ల. ఆమెపై అభిప్రాయం అంతవరకే!

కృతజ్ఞతతో ఆమె చేసే సేవలకు మనసు శాంతి పొందడం లేదు.

అకారణంగా దూరమైన మాలతి తనని అర్థం చేసుకున్నప్పుడే తనకు శాంతి.

“సర్! రాధమ్మ గారికి ఫోన్ చేసి, మీ ఆరోగ్య పరిస్థితి చెబితే, మీరు రమ్మన్నారని చెబితే మాలతి గారు వస్తారేమో!” అంది.

తన పరిస్థితి మాలతికి తెలిస్తే, అలా అయినా ఆమె రావాలనే ఆశ తనకూ ఉంది.

“ఇప్పుడు మాట్లాడే అంత ఓపిక లేదు ఊర్మిళ! ఆవిడ నెంబర్ మాత్రమే ఉంది. వాట్సాప్ ఉంటే కలిపి, మెసేజ్ పెట్టు” అన్నాడు.

ఊర్మిళ ఆమె నెంబర్ కు వాట్సాప్ కలిపింది.

అంతకు ముందు ఒకసారి మాలతికి రింగ్ చేసాడు. రాధమ్మ గారిని అడిగి మామయ్య తీసుకున్న నెంబర్ అది.

 ఫోన్ కట్ అయ్యింది. తమకు తెలిసిందని నెంబర్ మళ్ళీ మార్చుకోలేదు కదా!

“సర్! ఏమని మెసేజ్ పెట్టను.” అంది ఊర్మిళ.

 ఏమి చెప్పాలి?

 జాన్వి కోసం ఎన్ని పగళ్ళు రాత్రిళ్ళు ఏడ్చాడో చెప్పాలా!

 తన కోసం మనసు తలుపులు తెరిచే ఉన్నాయని చెప్పాలా!

“చెప్పు ఊర్మిళా! ఆరోగ్యం బాగా లేదని, వాళ్ళ కోసం పలవరిస్తూన్నానని, వచ్చేయమని మెసేజ్ పెట్టు. నాకు ఎలాంటి ఇగో లేదు. నేను రమ్మని అభ్యర్థిస్తున్నానని చెప్పు.”

ఊర్మిళ మెసేజ్ పంపింది.

“సర్! మేడం వస్తారు సర్!” అంది.

“కష్టాల్లో కలవని బంధం బంధమే కాదు సర్!” అంది.

 ఆమె వంక చూశాడు.

 మెసేజ్ చేసి, మంచి పని చేసిన తృప్తి కనిపిస్తూంది.

 ఆ సంతోషం కళ్ళల్లో తళుక్కు మంటూంది.

 ఊర్మిళ కేది’ ఓన్’ చేసుకోవాలనిపించదా!

 మాలతి మీద కాస్త కూడా అసూయ లేదా!

 గొప్ప వ్యక్తిత్వమే!

“ఊర్మిళా! నువ్వు చేయాల్సిన పని ఒకటుంది.” అని,

“ఇంటికి వెళ్ళి ఇన్సూరెన్స్ పేపర్స్, ఏటీఎం కార్డు తీసుకురావాలి. మహేష్‌ను తీసుకొని వెళ్ళు!” అంటూ అవి ఎక్కడ ఉన్నాయో చెప్పాడు.

“సర్ మీరు ఎమోషనల్ అయ్యి అప్సెట్ అయ్యారు. మీరు కాస్త సెట్ అయ్యాక వెళ్తాను” అంది.

“నేను బాగున్నాను నువ్వెళ్ళు!” అన్నాడు.

 ఊర్మిళకు తప్పలేదు.

 ఆనంద్‌ను మళ్ళీ మగత కమ్ముకుంది.

 కళ్ళు తెరిచే సరికి ప్రక్కన మహేష్ ఉన్నాడు.

“సార్! ఇప్పుడు ఎలా ఉంది సార్” అన్నాడు.

“బాగుంది మహేష్!” అన్నాడు. ఊర్మిళ కోసం చుట్టూ చూసాడు.

“ఊర్మిళమ్మ ఆటోలో ఇంటికి వెళ్ళి పోయారు సార్! మీరు ఒక్కరున్నారని వచ్చేదాకా ఇక్కడ ఉండమన్నారు.”

“నేను బాగానే ఉన్నాలే! నువ్వెళ్ళు!”

 మరి కాసేపటికి మహేష్ వెళ్ళి పోయాడు.

 అప్పుడు మోగింది తన చేతిలో ఫోన్.

 రాధమ్మ నెంబర్ చూస్తూనే, ఆరాటంగా చేతిలోకి తీసుకున్నాడు.

“అమ్మా! చెప్పండి అన్నాడు.”

ఆమె చెప్పిన సారాంశం ఇది.

మాలతి ఆమె తోనూ ముభావంగానే ఉంటుంది. కారణం – ఆమెను సమర్థించక పోవడమేనట. ఇల్లు విడిచి మాలతి వచ్చిన వైనం భద్రం గారు చెప్పినప్పుడు ఆమె మందలించారట. ఓ దిక్కు మొక్కు లేని ఆడపిల్ల ఆపదలో ఉంటే నీ భర్త సహాయపడి ఇంటికి తెచ్చాడు, ఒక్క రాత్రి ఆశ్రయమిస్తే ఏమైపోయింది. పుణ్యమే కదమ్మా! తెల్లవారి ఆ పిల్ల మానాన ఆ పిల్ల వెళ్ళిపోయింది కదా! చిలువలు పలువలుగా ఊహించుకొని గొడవ లెందుకు మాలతీ! ఆనంద్ అట్లాంటి వాడిలా అవుపించడు” అన్నారట. ఆ మాటలతో మాలతి కినుక వహించి మాటలు ఆపేసిందట. ఎప్పుడైనా పలకరిస్తే సమాధానం చెప్పడం లేకపోతే లేదు. అయినా తన ఆరోగ్యం విషయం చెప్పేసరికి హాస్పిటల్‌లో ఉన్నాడని విని, ఏమైందోనని భయపడి ఏడుస్తూ బ్యాగ్ సర్దుకుందట. భద్రమన్నయ్య కూడా సంతోషించారు అన్నారు. మళ్ళీ అరగంటకే భద్రం గారు ఫోన్ చేసి మాలతి హైదరాబాద్ వెళ్ళట్లేదు అన్నారని చెప్పారు.” అన్నారు.

“అంత లోనే ఏమైంది అమ్మా!” అని ఆనంద్ అంటే, “మాలతిపై కుళ్ళుకునే బంధువెవరి పనో బాబూ, ఇది. ‘మీ వారిని హాస్పిటల్‌లో చూసాను, ఏమయ్యిందో పాపం! వెంట ఎవరో ఆవిడ ఉంది’ అని చెప్పిందిట. ఎవరు ఆవిడ అని మాలతి అడిగితే, ఆమె ఊర్మిళను వర్ణించి మరీ చెప్పిందట. అంతే! బ్యాగ్ పక్కన పడేసిందట. ‘చూసారా! నా అనుమానం నిజం’ అంటూ కూలబడిపోయిందట.”

ఆవిడ చెప్పింది విని స్థాణువయ్యాడు.

తన చేతుల్లోని ఫోన్ భరించలేని బరువు అవుతున్నట్టు ఉంది.

అయిపోయింది. ఇంక మాలతి రాదు. ఆ పనికిమాలిన అనుమానం మరింత బలపడింది. ఇంకెవరన్నా మార్చగలరన్న ఆశ లేదు.

తన చిన్న జాన్విని ఇంకెప్పటికీ చూస్తాడు.

మాలతి, తాను, జాన్వి – ముచ్చటైన తన కుటుంబం ఎక్కడ?

ధారగా కారుతున్న కన్నీటిని తుడుచుకున్నాడు.

మరి కాసేపటికి పని మీద వెళ్లిన ఊర్మిళ కార్డ్స్ తీసుకొని వచ్చింది.

“సర్! రాధమ్మ గారు ఫోన్ చేశారా!” అంది, ఆరాటంగా.

ఆనంద్ కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత చెప్పాడు.

“చేశారు, మాలతి ‘రాను’ అని చెప్పిందట.”

ఊర్మిళ ఆ మాట విని హతశురాలైంది.

ఆమె బాధపడుతుందని, అంతకంటే ఏమీ చెప్పలేదు .

మాలతి తల్లి లాంటి రాధమ్మ గారితో పెట్టుకోవడం ఏమిటి? తనకు అసలు బుద్ది లేకుండా పోతోంది.

ఇంక భద్రం గారు – అడ్వకేట్ బుర్ర కదా, సగం అనుమానంతోనే ఉంటుంది. బలవంతంగా పంపితే, ఒక వేళ కూతురి మాటలే నిజమయితే, ఒక్కగా నొక్క కూతురు ఏమైనా చేసుకుంటుందేమోనని భయం అట.

అంతే! ఈ దేశంలో మగవాడి పని అంతే! మగవాడి క్యారెక్టరైజేషన్ చేసే హక్కు ఆడవాళ్ళకే ఉంది. చిన్నప్పుడు తల్లి వాడిని కోపిష్టి, పిరికి, మొద్దు మొఖం అందంటే, వాడికి ఇంక జీవితాంతం అదే బ్రాండ్ ఉంటుంది. వాడు అలాగే తయారయినా ఆశ్చర్యం లేదు.

భార్య అనుమానించి వెళితే, శ్రీరామచంద్రుడయినా, లోకం దృష్టిలో తిరుగుబోతు వాడే! ఎలాంటి వాడు కాకపోతే పెళ్ళాం వదిలేసి వెళ్తుంది, అంటారు.

అదే భర్త అనుమానిస్తే వాడో నరరూప రాక్షసుడు అంటారు. ఉత్త అనుమానపు వాడు అంటారు.

ఇదే సమాజ రీతి –

తనకే అలవాటూ లేదు. ఉంటే ఏ దేవదాసు లాగానో అయ్యేవాడు.

ఇంక స్థిరం కావలిసింది తన మనసే..

మరుపును వరంలా పొందే తపస్వి తానే కావాలి. చిన్ని జాన్వీలా ఎవరైనా కనబడితే, కదిలి పోకుండా మనసును కట్టుదిట్టం చేయాలి.

ఇంటి దారి పట్టిన కారులో తాను, మహేష్, ఊర్మిళ ఉన్నారు.

ఊర్మిళను మరునాడే హాస్టల్‌కు వెళ్ళి పొమ్మన్నాడు.

మహేష్ చెప్పాడట. ‘సర్! సరిగా తినకే ఇలా అయ్యిందని. వండుకోలేక బయటదొరికిన ఫుడ్ ఏదో ఒకటి తినేయడం వల్లే ఇలా జరిగింద’ని. ఇంక ఊర్మిళ హాస్టల్‌కు వెళ్ళనని తీర్మానం చేసింది. ఎంత చెప్పినా వినలేదు.

“మీకు డైట్ విషయంలో కొన్నాళ్ళ వరకు స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. కనీసం అప్పటి దాకా అయినా వెళ్ళను.” అంది.

ఇప్పటికి చిన్న చికిత్సతో సరిపెట్టారు. సర్జరీ దాకా వెళ్ళకుండా కాపాడకాపాడుకోవడం తన విధి.

ఊర్మిళ వంట చేసి, భోజనం వడ్డించేది.

కారం లేకుండా చప్పిడి తినాల్సిన తనకు, కారం లేకుండానే నోటికి రుచి తగిలేలా ఎన్నో వెరయిటీస్ వండి పెడుతోంది.

ఊర్మిళలో ఇంత టాలెంట్ ఉందని తనసులు ఊహించలేదు.

డాక్టర్ దగ్గరికి చెకప్ కు వెళ్ళి వచ్చాడు. బెటర్మెంట్ చూసి, డాక్టర్ చాలా మెచ్చుకున్నాడు.

నిజంగా ఇది అంతా ఆమె చలువనే. వేళకు ఆరోగ్యకరమైన భోజనం, మందులు, సూప్స్..

“నేను బాగున్నాను. నువ్వు ఇంక వెళ్ళి పో!” అన్నాడు.

“వెళ్తాను. మీరు ఎవరయినా మంచి కుక్‌ని పెట్టుకోవాలి.”

“ఇప్పుడు ఇక్కడ ఎవరయినా దొరకాలి కదా! అది నేను చూసుకుంటాను. ముందు నువ్వు హాస్టల్‌కు వెళ్ళి పో!” అన్నాడు.

 వెళ్ళింది.. మళ్ళీ కొన్నాళ్ళకు వచ్చింది.

“నాకు మీ హెల్త్ ముఖ్యం” అంది. ఇంక ఏమి చెప్పలేక పోయాడు.

ఊర్మిళ తన కోసం సమాజాన్ని ధిక్కరిస్తూంది. ఆమె సమాజాన్ని లెక్క చేయదు. సమాజంలో ఆమెకంటూ గుర్తింపు లేని ఒంటరి ఆమె.

కానీ తాను ఆలా కాదు. తాను సమాజం మధ్య ఉన్నాడు. ఏమి చెప్పి ఊర్మిళను ఇంట్లో పెట్టుకోగలడు?

కానీ వెళ్ళమని మళ్ళీ చెప్పలేక పోయాడు.

‘ప్రేమించే హృదయానికి ప్రణమిల్లవే మనసా!’ (ఋతురాగాలు)

తన మౌనమే ఆమెకు అంగీకారం అయ్యింది..

ఊర్మిళకు అప్పుడే ఆపద్భాందవిలా అన్నమ్మ దొరికింది.

కరువు ప్రాంతం నుంచి వలస వచ్చిన అన్నమ్మ కుటుంబాన్ని ఆదుకుంది ఊర్మిళ. వెనకాల ఖాళీగా ఉన్న రూమ్ అద్దె తాము కడుతూ ఆమె నిలదొక్కుకునే దాకా, సహాయం చేసింది.

అందుకే అన్నమ్మకు ఊర్మిళ అంటే అతి ప్రేమ, కృతజ్ఞత కూడా. ఆ అతి ప్రేమ వల్లే ఊర్మిళపై అప్పుడప్పుడు అతి చనువు ప్రదర్శిస్తుంది. అది తనకు నచ్చకపోవడం వేరే విషయం.

మాలతి ఇక రాదూ అన్న విషయం గుర్తు కు వచ్చినప్పుడు మనసు ప్రయత్నపూర్వకంగా మళ్ళిస్తున్నాడు. జాన్వీ చిత్రం చెరిపి వేయడానికి గుండె బండ కావాలి.

బండ బారడానికి, మగ వాడికి కూడా గుండె ఉంటుందని తెలియని ఆడవాళ్ళూ ఉన్న లోకమిది.

సంసార విచ్చేదము నుండి మగవాడు మాములు మనిషి కావడం, మళ్ళీ జన్మ ఎత్తడం లాంటిదే!

మేల్ ఇగో అతన్ని బయట పడనివ్వదు. ఆడకూ, మగకూ అదే భేదం!

ఈ హోటల్ రూమ్ నాలుగు గోడల నిశ్శబ్దంలో.. మనసు గతపు పరుగులు ఎక్కడి నుండి ఎక్కడికో సాగాయి.

ఆనంద్ కు ఏ.సి. ఎక్కువ ఉందనిపించి, రిమోట్ తో కంట్రోల్ చేసాడు.

నిద్ర పట్టడం లేదు.

మాలతి రాక గురి విసిరిన రాయిలా, అలలు అలలుగా గతపు ప్రకంపనాలు రేపడం – మూడ్ సరి లేదు.

ఊర్మిళకు ఫోన్ చేసాడు.

“నర్స్ రోజూ వచ్చి ఇంజక్షన్ చేస్తుందా!” అని అడిగాడు.

వస్తుందని చెప్పింది ఆమె.

“పిల్లలు ఎక్కడ పడుకున్నారు. నువ్వు మెట్లు ఎక్క లేవు కదా! క్రింద నీ రూమ్ లోనే బెడ్ వేయించావా!” అన్నాడు.

“లేదు. పైనే పడుకున్నారు. జానూ దగ్గర, ఎప్పటి లాగే!” అంది.

“వెళ్ళలేదా?”

ఆనంద్ ఖంగు తిన్నాడు.

ఊర్మిళ ఈ విషయం తనకు చెప్పలేదు. కంప్లైంట్ లాగా చెప్పదు తను.

మాలతి ఎందుకు వెళ్ళలేదు?

కూతురిని తీసుకొని వెళతానని యుద్ధం ప్రకటించి వచ్చిన మాలతి వెళ్ళక పోవడంలో ఆంతర్యం అర్థం కావట్లేదు.

ఈ ట్విస్ట్ ఏమిటి?

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here