[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]
నీలి కనుమల్లో
~
చిత్రం: నవాబ్
గీతం: సిరివెన్నెల
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
గానం: ఏ.ఆర్.రెహమాన్, నకుల్ అభ్యంకర్
~
పాట సాహిత్యం
పల్లవి:
నీలి కనుమల్లో నీటి అలలే పడవలుగా
తేలి వెళుతున్న పూల ఘుమఘుమలు
గాలి గుసగుసలు తెలిపే కథలవుదాం
కొంటె కిలకిలలు కొత్త కువకువలు పరులెవరూ వినరందాం
ఇద్దరి ఏకాంతం మన ఒక జతకే సొంతం
చెట్టు కొమ్మలలో గువ్వ జంట మనం
గుండె సవ్వడిలో ఏం విన్నామో పైకనం
కిచ్ కీచన్నది వచ్చి పొమ్మన్నది
ముచ్చటేదో మరి పిట్ట భాష అది@2
ఒక చిరు చినుకు ఇలకు జారిన అలికిడిలో చేరే కబురేదో,
కిచ్ కీచన్నది వచ్చి పొమ్మన్నది
ముచ్చటేదో మరి, పిట్ట భాష అది
ఎన్నెన్ని కలలు కనుపాపల లోగిలిలో వాలినవో
ఆ కలలసలే లోకంలో ఇన్నాళ్ళూ కొలువుండేవో
అడగాలో మానాలో.. నీలి కనుమల్లో
జతలోన జగతిని మరచి గడిపే మనని చూసి
ఆకాశమే పిలిచింది మేఘాలు పరిచింది
కిచ్ కీచన్నది వచ్చి పొమ్మన్నది
ముచ్చటేదో మరి, పిట్ట భాష అది
చరణం:
అలలుగ ఎగసిన తలపుల వేగం
ఇల విడి ఎగిరిన చిలకల మైకం
మిల మిల మెరిసిన తొలకరి మేఘం
జల జల కురిసిన చినుకుల రాగం
అప్పుడలా గగనమెందుకు ఉరిమిందో
ఎందుకలా శరమై సమయం తరిమిందో
గుర్తే లేదు కదా ఎపుడు నాలో చేరావో
చెప్పలేను ఎలా నువ్వు నా చేయి జారావో
గుండె తడుముకు చూస్తే ఉట్టి శూన్యమే ఉందే
చిట్టి చిలకమ్మా నువ్వెప్పుడు ఎలా వెళ్ళిపోయావే నన్నొదిలి
ఇంకా ఎన్నాళ్ళ వరకూ ఒంటి రెక్కై ఎగరాలి ఎగరాలి
నీతో ప్రతి నిమిషం పగటి కల అయ్యిందా
అంతా క్షణంలో కథలా ముగిసిందా
మౌనం మనసులో ఎంత అలజడి చేస్తోందో
మన జ్ఞాపకాల సంకెళ్ళ నుండి విడుదలనే అడగనని
అంతా క్షణంలో కథలా ముగిసిందా
నీతో ప్రతి నిమిషం పగటి కల అయ్యిందా
మౌనం మనసులో ఎంత అలజడి చేస్తోందో
మన జ్ఞాపకాల సంకెళ్ళ నుండి విడుదలనే అడగనని
♠
‘గడగడ ఉరిమే మిరుగం వచ్చే.. ఏమి
పెడదమే చిన్న కోడలా..’ అని మామ అంటే
‘కోరీకోరీ కొర్రలు పెడదాం.. తలచి తలచి
తైదలు వేద్దాం’ అంటూ కోడలు పిల్ల
సమాధానమిచ్చిందని, ఒక తెలంగాణ జానపదం చెబుతుంది. ఆ పాటలోని సొగసుకు మరింత వన్నెలు దిద్దింది, అందులోని జంట పదాలు.
‘జలజల జల జల జంటపదాలు
గలగల గలగల జంటపదాలు
ఉన్నవిలే , తెలుగులో వున్నవిలే
విడదియుటయే న్యాయంకాదు
విడదిసేస్తే వివరంలేదు, రెండెలే రెండు ఒకటేలే..’
అని జీన్స్ చిత్రం కోసం, కన్నులతో చూసేది గురువా.. అనే పాటలో శివ గణేష్ వ్రాశారు.
జంటపదాలు విడగొట్టి మొదటి పదానికి అర్థం రెండోపదానికి అర్థం విడివిడిగా చూసుకుంటే కనబడే సొగసులు వేరు. ఒకటిగా ఆ జంటపదం ప్రయోగించబడినప్పుడు కనిపించే సొగసు వేరు.
జంటపదాల నిర్మితిలో ఓ సొబగు వుంది. అది భాషలో విలక్షణమైనది, విశిష్టమైనది కూడాను. భాషా సౌందర్యాన్ని అది ఎంతో ఇనుమడింప చేస్తుంది.
ఇంగ్లీషులో onomatopoeia, అని పిలవబడే సడి సప్పుళ్లు/చడీ, చప్పుళ్లు, అనే ధ్వని అనుకరణాలు, తెలుగులో ఓ విశిష్ట స్థానం కలిగిన పదాలు. కరకరా నమలడం, చకచకా నడవడం, గలగలా మాట్లాడడం, చిటపటలాడటం, బరబరా గీకడం, దబదబా తలుపు కొట్టడం వంటి ఎన్నో పదాలు, శ్రవణేంద్రియాలకు భావాన్ని సమర్థంగా అందిస్తూ, ప్రభావవంతంగా భావాన్ని వ్యక్తీకరిస్తాయి.
ఇంతకు విషయం ఏంటంటే, మనం ఈ వారం చర్చిస్తున్న నవాబ్ చిత్రంలోని, ‘నీలి కనుమల్లో’ అనే పాటలో, సిరివెన్నెల గారు ముచ్చటైన జంట పదాలను ఉపయోగించి, ఆ గీతానికి మరింత వన్నెలు కూర్చారు.
ఈ పాటలో మనల్ని ఏదో సౌందర్య లోకాల్లోకి తీసుకుపోయే సాహిత్యం, భాష, భావం, మృదు మధురమైన సంగీతం, గాత్రం; అన్నీ వెరసి, సిరివెన్నెల కలం లోంచి జారిన మరో ఆణిముత్యాన్ని దాచుకోవడానికి, ఆల్చిప్పల్లా మనల్ని సిద్ధంగా ఉండమని సంకేతమిస్తున్నాయి. ఒక ప్రేమ జంటకు నేపథ్యంగా వ్రాసిన ఈ పాట, కథా నేపథ్యంతో సంబంధం లేకుండా భావ లహరిలో మనము తేలిపోదాం!
నీలి కనుమల్లో నీటి అలలే పడవలుగా
తేలి వెళుతున్న పూల ఘుమఘుమలు
గాలి గుసగుసలు తెలిపే కథలవుదాం
కొంటె కిలకిలలు కొత్త కువకువలు పరులెవరూ వినరందాం
ఇద్దరి ఏకాంతం మన ఒక జతకే సొంతం
చెట్టు కొమ్మలలో గువ్వ జంట మనం
గుండె సవ్వడిలో ఏం విన్నామో పైకనం
కిచ్ కీచన్నది వచ్చి పొమ్మన్నది
ముచ్చటేదో మరి పిట్ట భాష అది@2
ఒక చిరు చినుకు ఇలకు జారిన అలికిడిలో చేరే కబురేదో,
కిచ్ కీచన్నది వచ్చి పొమ్మన్నది
ముచ్చటేదో మరి, పిట్ట భాష అది..
ఇక రసాస్వాదనకు మనం సిద్ధమేగా? నీలి కనుమల్లో, నీటి అలలే పడవలుగా తేలి వెళ్తున్న పూల ఘుమ ఘుమలు, అందమైన కబుర్లేవో మోసుకుని వెళ్తున్నాయట! ఎందరో ప్రేమికులకు సంబంధించిన విషయాలని గాలి తెరలు గుసగుసగా చెప్పుకుంటున్నాయట! ఇవన్నీ అందరికీ చెప్పే కథలుగా మనం మారిపోదాం! అన్న ఆ జంట ఆశ అనే భావన, ఎంత ఉన్నతమైన భావ కవిత్వ సౌరభాల్ని వెదజల్లుతోందో చూడండి! ప్రపంచంలో యువతీ యువకుల మధ్య ప్రేమ సర్వసాధారణమే అయినా, ఏ జంట కొంటెతనం దానిది. ఏ జంట గువ్వల కువకువలు వాటివి. దేనికవే ప్రత్యేకం, దేనికవే కొత్తదనం. మన ఇద్దరి ఏకాంతం, మనకే సొంతం కాబట్టి ఇతరులు ఎవరూ మన కబుర్లు వినరని అనుకుందాం! అని ఆ జంట భావించుకుంటోంది. ఒంటరితనంతో వచ్చే ఏకాంతం అందరికీ తెలుసు. జంటగా అనుభవించే ఏకాంతం, జంటకు మాత్రమే తెలుసు! ఆ భావాన్ని భాషలో వ్యక్తీకరించిన సిరివెన్నెల మనసుకే తెలుసు!
చెట్టు కొమ్మల్లోని గువ్వల జంటలాంటి వారట, ఆ ప్రేమికులిద్దరూ. వారి గుండె చప్పుళ్ళు ఏమి చెబుతున్నాయో పైకి చెప్పారట. కీచు కీచని శబ్దం చేస్తూ, వచ్చి పొమ్మని ఒక గువ్వ చెప్పిందట. అవి చెప్పి ముచ్చట (తెలంగాణ తెలుగులో కబుర్లు) ఏదో, మనకు అర్థం కాదట, ఎందుకంటే అది పిట్ట భాష కాబట్టి. పిట్ట భాష పిట్టకు మాత్రమే అర్థమవుతుందా? కాదండీ! మన భావకవికి కూడా అర్థమవుతుంది. సిరివెన్నెల గారి సునిశితమైన భావ జగత్తులో, పిట్టలే కాదు, నేలపైకి జారే ఒక చిరు చినుకు కూడా కబురేదో మోసుకుని వచ్చి ఆయనకు అందిస్తుంది! ఎందుకంటే ఆయన ప్రకృతి భాష తెలిసిన ఒక ‘స్వరోచి’ లాంటి వారు కాబట్టి!
(స్వరోచి, మాయా ప్రవరునికి, వరూధినికి కలిగిన సంతానమనీ, ఆయన తన భార్య విభావసి నుండి పశు, పక్షి భాషను నేర్చుకుంటాడనీ, దాని ద్వారా దాంపత్య జీవితానికి సంబంధించిన విలువలను తెలుసుకుంటాడనీ, అందమైన కల్పనను మనకు అందించారు ‘మను చరిత్ర’, స్వారోచిష మనుసంభవంలో పెద్దనామాత్యులు.
అదే విధంగా, ప్రేమ అనే చల్లగాలి తగిలిన ఒక మేఘం మనసు కరిగి, చినుకుగా మారి, భూమి అనే ప్రియురాలి పిలుపునందుకుని, ఇలకు చేరుతూ, కొన్ని కబుర్లేలేవో మోసుకుని వచ్చి, సిరివెన్నెలకు, తద్వారా మనకు వాటిని అందించింది.
ఎన్నెన్ని కలలు కనుపాపల లోగిలిలో వాలినవో
ఆ కలలసలే లోకంలో ఇన్నాళ్ళూ కొలువుండేవో
అడగాలో మానాలో.. నీలి కనుమల్లో
జతలోన జగతిని మరచి గడిపే మనని చూసి
ఆకాశమే పిలిచింది మేఘాలు పరిచింది
కిచ్ కీచన్నది వచ్చి పొమ్మన్నది
ముచ్చటేదో మరి, పిట్ట భాష అది.
భవిష్యత్తు గురించి అందరికీ ఎన్నో కలలు ఉంటాయి. ఆ కలలు మన మనసులోనే దాగి ఉంటాయి. కానీ, సిరివెన్నెల గీతాల్లోని ప్రేమికులకు మాత్రం ఆ కలలు కనుపాపల లోగిలిలో వాలి, కొలువు ఉంటాయట. ఆ విషయం తేల్చుకోవాలా వద్దా, అడగాలా, మానాలా? అని నిర్ణయించుకోలేకుండా ఉన్నారట. ఈ లోకంలో ఉంటూ కూడా, లోకాన్ని మరిచిపోయి కడుపుతున్న ఈ జంటను చూసి, ఆకాశం ముచ్చటపడి, మేఘాల పరుపులు పరచి, సేదతీరడానికి రమ్మని ఆకాశం వాళ్ళకి పిట్ట ద్వారా కబురంపిందట! ఎలాంటి కల్పన ఇది! వివరించడానికి మాటలు చాలడం లేదు!
అలలుగ ఎగసిన తలపుల వేగం
ఇల విడి ఎగిరిన చిలకల మైకం
మిల మిల మెరిసిన తొలకరి మేఘం
జల జల కురిసిన చినుకుల రాగం
అప్పుడలా గగనమెందుకు ఉరిమిందో
ఎందుకలా శరమై సమయం తరిమిందో
గుర్తే లేదు కదా ఎపుడు నాలో చేరావో
చెప్పలేను ఎలా నువ్వు నా చేయి జారావో
గుండె తడుముకు చూస్తే ఉట్టి శూన్యమే ఉందే
చిట్టి చిలకమ్మా నువ్వెప్పుడు ఎలా వెళ్ళిపోయావే నన్నొదిలి
ఇంకా ఎన్నాళ్ళ వరకూ ఒంటి రెక్కై ఎగరాలి ఎగరాలి
నీతో ప్రతి నిమిషం పగటి కల అయ్యిందా
అంతా క్షణంలో కథలా ముగిసిందా
మౌనం మనసులో ఎంత అలజడి చేస్తోందో
మన జ్ఞాపకాల సంకెళ్ళ నుండి విడుదలనే అడగనని
అంతా క్షణంలో కథలా ముగిసిందా
నీతో ప్రతి నిమిషం పగటి కల అయ్యిందా
మౌనం మనసులో ఎంత అలజడి చేస్తోందో
మన జ్ఞాపకాల సంకెళ్ళ నుండి విడుదలనే అడగనని
అలల్లాగా ఎగసిపడే తలపుల వేగంతో, ఏదో మైకంలో నేలను విడిచి ఆకాశానికి ఎగిరిన చిలుకల్లా వాళ్లు ఎగిరినప్పుడు, తొలకరి మేఘం మెరిసి, చినుకుల రాగం వినిపించిందట. అయితే, కథా నేపథ్యంలో, వాళ్ళిద్దరికీ వివాహమైన తొలి రోజుల్లోనే, ప్రియురాలు హత్యకు గురై మరణించడం జరుగుతుంది.. ఆ భావంతో, ఈ చరణం రెండవ సగం సాగుతుంది.
జంట కట్టే సమయంలో గగనమలా ఎందుకు ఉరిమిందో, కాలం శర వేగంగా తరిమి, తన ఉసురుని ఎందుకు తీసిందో, తనకు తెలియకుండానే తన మనసులోకి ఆమె ఎప్పుడు వచ్చి చేరిందో, తాను ఎలా చేజారి పోయిందో, ఏది అర్థం కాని అయోమయంలో ఉన్నాడు ప్రియుడు. ఆమెను కోల్పోయిన క్షణంలో, గుండెను తడుముకుంటే ఉట్టి శూన్యమే కనిపించింది. ఆ గుండెలో గూడు కట్టుకొని నివసించిన చిలకమ్మ, తనకు తెలియకుండా ఎప్పుడో ఎగిరిపోయింది, గూడు చిన్నబోయి, శూన్యంగా మిగిలింది.
మనసారా ప్రేమించి పెళ్లాడిన భాగస్వామి దూరమైనప్పుడు, మనసు అనుభవించే తీవ్రమైన వేదనను హత్తుకునేలాగా అక్షరాలలో పలికించారు సిరివెన్నెల. ఎవరైనా సాధారణంగా జీవిత భాగస్వామిని కోల్పోయినప్పుడు, ఇంకా మిగిలిన జీవితం ఒంటరిగా ఎలా గడపాలి? నువ్వు ఎందుకు వెళ్లిపోయావు? ఎప్పుడు వెళ్ళిపోయావు? అనే దుఃఖ భావనతో తీవ్రంగా పరితపిస్తారు. వాటిని ఎంతో నిశితంగా గమనించి, మనసుతో అనుభవింప చేసి, అక్షరబద్ధం చేసారు సిరివెన్నెల. ఇంకా, ప్రియుడి వ్యథను వ్యక్తం చేస్తూ, ఒంటరి రెక్కతో నేను ఇంకెంతకాలం ఎగరాలి? మనం కన్న కలలన్నీ, పగటి కలల్లా, భ్రమల్లా మిగిలిపోతాయా? ఎందుకు మన కథ క్షణంలో ముగిసిపోయింది? మన జ్ఞాపకాల సంకెళ్ళలో చిక్కుకొని, వాటి నుండి బయటపడకుండా ఉన్నానని, నా మనసులోని మౌనం ఎంతో అలజడి చేస్తుంది, అని దుఃఖిస్తాడు ప్రేమికుడు.
మొదటి చరణంలో భావాతీతమైన ప్రేమ జగత్తును సృష్టించిన సిరివెన్నెల, రెండవ చరణంలో పూర్తి ప్రాపంచికమైన, practical grief ని, ఎంత వైవిధ్యభరితంగా ప్రదర్శించారో తలుచుకుంటే ఆశ్చర్యం కలగక మానదు. ఒకే పాటలో రెండు, విరుద్ధమైన భావాలను అదే నైపుణ్యంతో ప్రదర్శించడం ఆయనకే చెల్లు!
ఈ పాట Canvass పై మెరిసిన మరొక అందమైన వర్ణ సమాహారం, ఇందులో వాడిన కిలకిల, కువకువ, జలజల, మిలమిల, కీచు కీచు, ఘుమఘుమ, గుసగుస, వంటి ముచ్చటైన జంట పదాలు. తెలుగు భాషామ తల్లికి నిండు సొబగులు అద్దే ఇంత అందమైన సంపదలు పాతబడనీయకుండా, ఎంతో ప్రభావవంతమైన సినిమా మాధ్యమం ద్వారా ఉపయోగిస్తూ, తెలుగువారికి వారసత్వ సంపదలను కూడా అందించడంలో సిరివెన్నెల సిద్ధహస్తులు. భాషలోని ఈ జంటపదాల సౌందర్యం కూడా ‘అతీగతీ’ లేకుండా పోయే పరిస్థితి రాకుండా, పరిరక్షిస్తున్న మహనీయులలో సిరివెన్నెల కూడా ఒకరు.
తన అద్భుత కవితాప్రావీణ్యంతో ఎన్నో రసవత్కావ్యాలు సృష్టించి తెలుగు కవిత్వ ప్రేమికులకు వెలకట్టలేని మధురాతి మధురమైన కానుకనిచ్చారు సిరివెన్నెల. ఒక ప్రేమ తరంగిణిని, ఒక బాధా తప్త హృదయ వేదనను, ఒకే గీతంలో అందించి శ్రోతల/రసజ్ఞుల హృదయాలలో ఒక అలౌకిక దివ్య ప్రపంచాన్ని ఆవిష్కరించారు ఆ భావర్షి.
Images Source: Internet