[29-06-24 న అక్షజ్ఞ పబ్లికేషన్స్ మరియు హాస్యానందం సంయుక్తంగా నిర్వహించిన ముళ్లపూడి జయంతి సభ వివరాలను అందిస్తున్నాము.]
[dropcap]ము[/dropcap]ళ్లపూడి వెంకటరమణ పుట్టిన రోజు వేడుకలు శనివారం (29-06-24)న అక్షజ్ఞ పబ్లికేషన్స్ మరియు హాస్యానందం సంయుక్తంగా నిర్వహించాయి. హైదరాబాద్ – అబిడ్స్ లోని స్టాన్లీ మహిళా ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన ఈ వేడుకల్లో నందిగామకు చెందిన సీనియర్ జర్నలిస్ట్, రచయిత తుర్లపాటి నాగభూషణ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఆనందంగా ఉండటం అలవాటు చేసుకుంటే జీవితంలో వ్యక్తిత్వం వికసిస్తుందన్న సత్యం ముళ్లపూడి వెంకట రమణ గారి రచనల చదవడం వల్ల తేటతెల్లమైందని తుర్లపాటి అన్నారు. ముళ్లపూడి రచనలు అనగానే హాస్యం గుర్తుకు వస్తుంది.. అయితే వారి ఒక్కో రచనలో అంతర్లీనంగా పర్సనాలటీ డెవలప్మెంట్ కోణం కనబడుతుంటుందని అభిప్రాయపడ్డారు. వారి రచనలు వ్యక్తిత్వ వికాసానికి ఉపయుక్తంగా ఉంటాయని తుర్లపాటి అన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు ముళ్లపూడి రచనలు చదువుతుంటే మనసు తేలిక అవుతుందనీ, ఈ రచనలు ఓ టానిక్‌లా పనిచేయడమే కాకుండా ఆనందకరమైన జీవితానికి మార్గదర్శిగా నిలుస్తాయని చెప్పారు. నేటి తరం పిల్లలు వ్యక్తిత్వ వికాసం కోసం ప్రత్యేకంగా పుస్తకాలు కొని చదవనక్కర్లేదనీ, ముళ్లపూడి రచనలు చదువుతూ బాపు బొమ్మలు చూస్తుంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుందనీ, జీవితానికి చక్కటి బాటలు వేసుకోవచ్చని అన్నారు.
ఈ సభకి మామిడి హరికృష్ణ, తనికెళ్ళ భరణి, ఓలేటి పార్వతీశం, పొత్తూరి విజయలక్ష్మి, వింజమూరి వెంకట అప్పారావు, బ్నిం వంటి ప్రముఖ వ్యక్తులు ముఖ్య అతిథులుగా హాజరై ముళ్లపూడి వారి రచనలు, వారి జీవనంలోని స్ఫూర్తిదాయక సంఘటనలను గుర్తుచేసుకుని ముళ్ళపూడికి ఘన నివాళిలర్పించారు.
***
ఈ సభలో ముళ్ళపూడి వారి సింగిల్ పేజీ కథానికల పోటీలో గెలిచిన విజేతలకు బహుమతులు అందజేశారు. సంచిక రచయిత్రి శ్రీమతి యలమర్తి అనూరాధ గారు బహుమతిని గెలుచుకుని శ్రీ తనికెళ్ల భరణి గారి చేతుల మీదుగా స్వీకరించారు.