అనురాగంతో కలిసిమెలిసుంటే ‘ఏం పోతుంది చెప్పు?’ అని ప్రశ్నించిన కవిత

2
3

[డి. నాగ జ్యోతి శేఖర్ గారు రచించిన ‘ఏం పోతుంది చెప్పు?’ అనే కవితని విశ్లేషిస్తున్నారు శ్రీ నరేంద్ర సందినేని.]

కవయిత్రి, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయిని, డి.నాగ జ్యోతి శేఖర్ కలం నుండి జాలువారిన ‘ఏం పోతుంది చెప్పు?’ కవిత పై విశ్లేషణా వ్యాసం ఇది. ‘ఏం పోతుంది చెప్పు?’ కవితను ఆసక్తితో చదివాను. నాకు నచ్చింది. నాలో ఆలోచనలు రేకెత్తించింది.

‘ఏం పోతుంది చెప్పు?’ కవిత శీర్షిక చూడగానే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఏం జరిగిందో తెలుసుకోవాలనే కుతూహలం మనలో కలుగుతుంది. కవయిత్రి నాగ జ్యోతి శేఖర్ కవితా చరణాల్లోకి మనసు పెట్టి దృష్టి సారించండి. అలౌకిక అనుభూతిని సొంతం చేసుకోండి.

‘ఉదయాన్నే వెళుతూ వెళుతూ
గుమ్మానికో ఇష్టపు చూపును
తగిలించి పోతే..
రాత్రి విరిగిన స్వప్నాలన్నీ పెరట్లో పారేసి
చెంపల్లో నును సిగ్గుల ముగ్గు వేసుకొని
ఇల్లంతా నవ్వై తిరగదూ..!’

ఆమె అతడితో తనలో కలిగిన భావాలను ప్రేమ రూపంలో వ్యక్తీకరిస్తూ వయ్యారాలు ఒలక బోస్తుంది. ప్రకృతి పురుషుడు జంటలానే భార్యాభర్తలు ఒకే గూటి పక్షులై జీవితాన్ని కొనసాగిస్తారు. అతడు, ఆమె మధ్య అనురాగ బంధం చిరకాలం కొనసాగుతుంది. అపూర్వం, అమోఘం అయిన భార్యాభర్తల బంధం విడదీయరానిది. ఉద్యోగానికి వెళుతూ అతడు ఒక చిన్న చిరునవ్వు నవ్వి వెళ్ళిపోతే నిన్న పడ్డ కష్టాలు, రాత్రి పూట వారి మధ్య జరిగిన గొడవలన్నీ మర్చిపోయి సంతోషంగా తన కుటుంబాన్ని ఆమె సరి పెట్టుకుంటుంది. అతని ముఖంలో మెరిసే నవ్వును చూసి ఆమె మనసు ఉత్తేజం పొందుతుంది. అతనితో ఆనందంగా గడిపిన క్షణాలు ఆమెకు గుర్తుకు వచ్చి ఇద్దరి మధ్య ఏర్పడ్డ మనస్పర్ధలు మర్చిపోతుంది. సంతోషంతో ఆమె అన్ని పనులు క్షణాల మీద పూర్తి చేస్తుంది. అతను ఉదయం పూట ఇంటి నుండి ఉద్యోగ బాధ్యతలు నిర్వహణ కొరకు ఆఫీసుకు చిరునవ్వులు చిందిస్తూ ఆనందంగా వెళ్తున్నాడు. ఆఫీస్‌కు వెళ్తున్న సమయంలో అతనితో ఆమె తన మనసులోని భావాలను ప్రేమగా చెబుతున్నది. అతడు ఇంటి నుండి వెళుతున్న సమయంలో ఇంటి యొక్క ప్రధాన ద్వారానికి దృష్టి పెట్టి సంతోషంగా ప్రేమగా ఒక్కసారి తన చూపును సారిస్తే తనకు ఎంతో బాగుంటుంది. ఆమె ప్రధాన ద్వారం ముందు నిలబడి అతనిని తన కన్నులలో నిలుపుకొని అపురూపంగా చూస్తూ ఉంటుంది. అతడేమో ఆమె ఉనికిని కూడా పట్టించుకోకుండా హడావుడిగా తన పని కొరకు ఏకాగ్రతతో మనసు నిలిపి ఉల్లాసంగా ఎంచక్కా వెళ్ళిపోతాడు. అతను వెళుతున్న దిక్కు వైపే ప్రేమతో దృష్టిని సారిస్తూ ఆమె అక్కడ నిలబడి ఉంటుంది. ఆమెకు అతని పట్ల అవ్యాజమైన ప్రేమ, అనురాగం పొంగిపొరలుతూ ఉంటుంది. రాత్రి వేళ అతడు, ఆమె ఇద్దరు కలిసి ఎన్నో మధురమైన కలలు కంటారు. తెల్లవారిన తర్వాత అతనికి, ఆమెకు  రంగుల లోకంలో గడిపిన స్వప్నాలు ఎందుకో ఏవి గుర్తుండవు. రాత్రి మగత నిద్రలో వచ్చిన కలలను ఇంటి పక్క పెరట్లో వదిలేసి ఆమె అందమైన మోము, ఎర్రని బుగ్గలపై నును సిగ్గుల ముగ్గును సింగారించుకొని ఇంట్లో ఆనందంతో నవ్వుతూ పరవశించి తిరుగుతూ ఉంటుంది అంటూ కవయిత్రి వ్యక్తం చేసిన భావం అద్భుతంగా ఉంది.

‘సాయంత్రానికి
కొన్ని పూలను అర చేతిలో పూయించి
నెలవంకను పెదవుల పై అతికిస్తే
ఆమె చెమట చుక్కలన్నీ
పాలపుంతలై మెరియవూ..!’

నెలవంక భూమి చుట్టూ తిరిగే ఒక గ్రహం. చంద్రుడు సూర్యుని ప్రకాశం వలన వెలుగును ఇస్తున్నాడు. పాలపుంతను పాలవెల్లి అని కూడా అంటారు. పాలపుంత మానవాళి కొరకు ప్రాముఖ్యతను కలిగి ఉన్నది. మనం నివసిస్తున్న భూమి పాలపుంతలో ఉంది. పాలపుంత గెలాక్సీ లోని ఆకాశవీధి. భూమి పై నుండి రాత్రి వేళ ఒక కాంతి పట్టిగా దర్శనం ఇస్తుంది.

అతను ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రభుత్వ ఆఫీసులో చాలా శ్రమ పడతాడు. ఆఫీసు నుంచి వస్తూ వస్తూ గుప్పెడు మల్లె పూవులు ఆకాశంలోని నెలవంకలా నవ్వుతూ తీసుకు వస్తే ఆమెకు సంతోషంతో పాటు తను అతనికి జ్ఞాపకం ఉన్నాననే  తన్మయత్వం కలుగుతుంది. ఆమె ఇంట్లో ఉదయం నుంచి పడ్డ శ్రమను కూడా మరిచి పోతుంది. ఆఫీసు నుంచి ఇంటికి వచ్చిన అతన్ని విసిగించదు. అతనికి నిజంగా తన పై ప్రేమ ఉందని అర్థం చేసుకుంటుంది. అతడు ఆమె మధ్య సఖ్యతతో కూడిన బంధం ఏర్పడుతుంది. అతడు ఆఫీసులో పని పూర్తి చేసుకొని ఆహ్లాదకరమైన  సాయంకాలం వేళ అలసి సొలసి ఇంటికి వస్తూ తన ప్రేయసి కోసం పూల అంగడిలో పూలను కొనాలి. ఆదరాబాదరగా ఇంటికి వస్తూ పొద్దుట నుంచి తన కోసం ఎదురు చూసే ఆమెకు ఒక మూరెడు పూలను కొనడం మర్చిపోతాడు. తన అరచేతిలో పూల దండతో అతడు వస్తే ఎంత బాగుంటుంది అని ఆమె ఆలోచిస్తుంది. ఒక చిన్న కోరిక మూరెడు పూల కోసం అలా ఆలోచించడం ఆమె తప్పు కాదు ఒప్పు అనిపిస్తుంది. అతను ఆనందంతో చందమామను పెదవులపై పూయించి దరహాసం ఒలకబోస్తే ఎంత బాగుంటుంది. పొద్దుట నుండి సాయంకాలం వరకు పని చేసి అలసిపోయిన ఆమె చెమట చుక్కలన్నీ ఆకాశ వీధిలో కనిపించే పాలపుంతలా మెరిసి పోతుంది. ‘ఏం పోతుంది చెప్పు?’ అని కవయిత్రి వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.

‘చివర్నో.. తొలి ముద్దలోనో
చిన్ని ప్రశంసను వదిలేస్తే
కంచంలో మరిన్ని
హృదయ స్పందనలు వడ్డించదూ..!’

వంట బాగుంది అని అతను సంతోషంతో చెబితే ఆమెకు ఒక రకమైన తృప్తిగా ఉంటుంది. అతని పట్ల అపారమైన ప్రేమ ఏర్పడుతుంది. వంట బాగుంది అని ఒక్క చిన్న మాట చెబితే అతనికి ఏం పోతుంది? ఆమె ఎంతో ప్రేమగా అతనికి భోజనం వడ్డిస్తుంది. అతడు ఆనందంగా భోజనం చేస్తాడు. భోజనం ఎలా ఉంది? అని అతడు ఏమీ చెప్పడు? అదే అతని ప్రవర్తన ఆమెకు ఎదలో బాధగా అనిపిస్తుంది. అతడు భోజనం చేస్తున్నప్పుడు ఆమె చేసిన వంట గురించి ఏదో ఒకటి ముచ్చటించాలి. అతడు ఉలకని పలకని రాయిలా మౌనంగా ఉంటే ఎలా ఉంటుంది. అతడు తొలిముద్ద పెట్టుకోగానే ఆమె చేసిన వంట ఎలా ఉందో చెప్పాలి. అతడు భోజనం చేసిన తర్వాతనైనా ఆమె చేసిన వంట ఎలా ఉందో చెప్పాలి. ఆమె అతని కొరకు పొద్దున లేచి ఒళ్ళు హూనం చేసుకొని కష్టపడి వంట చేసింది. వంట అద్భుతంగా ఉందని అతను ఒక మాట సంతోషంగా తనతో చెబితే ఏం పోతుంది చెప్పు అని ఆమె హృదయం తల్లడిల్లిపోతుంది. వంట బాగుంది అని అతడు చెబితే ఆమె హృదయం సంతోషిస్తుంది. అతని ప్రశంస వల్ల ఆమె మరిన్ని వంటకాలు కంచంలో ఇష్టంగా తయారు చేసి పెడుతుంది. ఆమె చేసిన వంటలను గుండె లోతుల్లో నుండి పొంగి వచ్చే ప్రేమతో అతనికి వడ్డిస్తుంది అని కవయిత్రి వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.

‘చైత్రంగానో
వెన్నెలలానో
గుర్తొచ్చిందని
పాకెట్లో ఆరు గజాల
ఇంద్రధనుస్సును చుట్టి తెస్తే
వెర్రి ఆనందాల ఆకాశమైపోదు!’

చైత్రం తెలుగు సంవత్సరంలో మొదటి నెల. పౌర్ణమి రోజున చంద్రుడు చిత్త నక్షత్రంతో కలిసిన రోజు. చైత్రం నెలలో దక్షిణ భారతదేశంలో వసంత ఋతువు ప్రారంభం కావడం వల్ల చైత్రంలో చెట్లు కొత్తగా చిగురించడం, పూత పూయడం మొదలుపెడతాయి. ఇంకా ఈ ప్రాంతంలో చలికాలం ముగియడంతో వాతావరణం నులి వెచ్చగా ఆహ్లాదకరంగా ఉంటుంది. రాత్రులందు చంద్రుడు నుంచి వెలువడే చల్లని వెలుగును వెన్నెల అంటారు. వెన్నెలను చంద్రకాంతి అని కూడా అంటారు. ఇంద్రధనుస్సు అనేది వక్రీభవనం, అంతర్గత ప్రతిబింబం మరియు నీటి బిందువులతో కాంతిని చెదరగొట్టడం వల్ల ఏర్పడే ఆప్టికల్ దృగ్విషయం. దీని ఫలితంగా ఆకాశంలో కాంతి యొక్క నిరంతర స్పెక్ట్రం కనిపిస్తుంది. ఇంద్రధనస్సు బహుళ వృత్తాకార ఆర్క్ రూపాన్ని తీసుకుంటుంది. చైత్ర మాసంలో సంతోషంగా ఉంటుంది. అనుకోకుండా నా ఫ్రెండ్తో కలిసి బజారుకు వెళ్లాను. అతను వాళ్ళ ఆవిడ కొరకు ఒక చీర కొన్నాడు. నేను నీ కోసం ఒక  చీర చూశాను. నాకు బాగా నచ్చింది. నీవు ఈ కొత్త చీర కట్టుకుంటే  ఇంకా బాగుంటావు అనిపించింది. అతను నన్ను గుర్తు పెట్టుకొని చీర  తెచ్చాడు. తన మనసులో నాకు చోటుంది. ఇంకా నేను అతనికి గుర్తు ఉన్నాను అనే గొప్ప  అనుభూతి కలుగుతుంది. ఇది చైత్రమాసం కదా ఆకాశంలో విరిసే వెన్నెలలాగా నువ్వు నాకు గుర్తుకు వచ్చావు. నీ రూపం నా కళ్ళలో మెదిలింది. నీ కోసం చీరను తీసుకు వచ్చాను. వర్షం పడిన తర్వాత ఆకాశంలో వెలసిన ఇంద్రధనస్సులా నీకు చీరను తీసుకువచ్చాను అని చెబితే అతను తెచ్చిన చీరను చూసి ఆమె వెర్రి ఆనందాల ఆకాశం అయిపోతుంది అని వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.

‘ఇంటి లోపల తోటలో
తిరిగే పూల పరిమళం
తనదేనని వాకిలికి చెప్పినప్పుడల్లా
మరింతగా విచ్చుకొనే
సౌగంధికమై పోదూ!’

ఇంటిలో ప్రశాంత వాతావరణం ఆమె వల్లనే వచ్చింది అని అతడు బయట వారికి చెబితే కుటుంబంలో మరింత ఆత్మీయత నెలకొంటుంది. అతను ఇతరులకు చెప్పడం వల్ల ఆమెకు సంతోషంగా ఉంటుంది. ఆమె గురించి చెప్పడం వల్ల పూల పరిమళం ఎప్పుడు వాడి పోదు. సౌగంధిక పుష్పం యొక్క పరిమళం ఎప్పుడు వ్యాపించి ఉంటుంది. ఆ ఇల్లును చూసి ఇల్లు బాగుందని ఇంటి యజమానిని పొగుడుతారు. ఇల్లు బాగుండటానికి కారణం ఆమె వల్లనే అని ఎవ్వరికి చెప్పరు. ఆమె అహర్నిశలు శ్రమించి ఇల్లును బాగా ఉంచుతుంది. ఆమె పిల్లల బాగోగులు చూస్తుంది. ఆమె అతని  పట్ల ఎంతో అనురాగం కురిపిస్తూ ఉంటుంది అని ఎవరికి చెప్పరు. ఇల్లు బాగుండటానికి కారణం ఆమె తెలివితేటలు కలది అని చెబితే సంతోషంగా ఉంటుంది. ఆమె తెలివి కలది అని ఆ ఒక్క మాట అతని నోటి నుండి వస్తే సమాజంలో ఆమె పట్ల గౌరవం ఇనుమడుస్తుంది. ఆమె అనే వ్యక్తికి ఒక గౌరవం ఉంది అని ఆనందంగా గడుపుతుంది. ఇంటి లోపల ఉన్న తోటలో పూల చెట్ల పరిమళం ఆమెదేనని అని అందరికి  చెప్పాలి. ఆమె సువాసనలు వెదజల్లే దేవతలకు అర్పించే సౌగంధికమైపోతుంది అని కవయిత్రి వ్యక్తం చేసిన తీరు చక్కగా ఉంది.

‘పక్కనే చోటిచ్చి
కొన్ని ఆలోచనల్ని దోసిట్లో పోస్తే
ఓ కొత్త కలై చీకటిని వెలిగించదూ..!’

పెద్ద పెద్ద సమస్యలు వచ్చినప్పుడు అతడు ఆమెతో చర్చిస్తే బాగుంటుంది. ఆమె అభిప్రాయాలకు విలువ ఇచ్చినట్లు ఉంటుంది. ఆమె కూడా తెలివైనది. ఆమె కూడా చక్కటి సలహా ఇస్తుంది. ఆమెకు కూడా గౌరవం ఇస్తే  నిర్ణయాల్లో కూడా సమానత్వం ఇచ్చినట్లుగా ఉంటుంది. అతడు ఏదైనా పని చేసే ముందు ఆమె సలహా అడిగితే బాగుంటుంది. ఆమె మదిలో మెదిలే అనేకమైన ఆలోచనలు పంచుకుంటుంది. ఆమె ఆలోచన ద్వారా సరైన కార్యాచరణతో ముందుకు సాగేలా చేస్తుంది. అతని పట్ల ఆమెకు గౌరవ భావం పెరుగుతుంది. ఆమె కూడా సరి కొత్త ఆలోచన ద్వారా అతని అభిమానం చూరగొంటుంది.

‘నాకేమివ్వాలో తనకు తెలుసు..!’

కుటుంబానికి స్త్రీ ప్రతీది ఇస్తుంది. ఏ సమయానికి ఏది చేయాలో అనేది ఆమెకు తెలుసు. ఆమె అతనికి ఏం ఇవ్వాలో అనే విషయంలో సరైన అవగాహన ఉంది. ఆమె ఎల్ల వేళలా అతని కనుసన్నలలో మెలుగుతూ ఉంటుంది. ఆమె అతనికి కావలసినవి చేసి పెడుతూ ఉంటుంది. సతతం అతనిని సంతోష పెట్టడానికి ఆమె జీవితం అంకితమై ఉంటుంది. అతను కూడా ఆమెలాగే ఉంటే సంసారం ఆనందమయం అవుతుంది. అప్పుడు అతను ఆమె కుటుంబం నందవనంలా సాగుతుంది అని కవయిత్రి వ్యక్తం చేసిన భావం అద్భుతంగా ఉంది.

‘తనకేం కావాలో ఇస్తే
ఏం పోతుంది చెప్పు?’

అతను ఆమెకు ఏం కావాలో ఇస్తే ఏం పోతుంది చెప్పు? అని ప్రశ్నించడం యథార్థం అని తోస్తుంది. వారిద్దరి  జంట అనురాగంతో కలిసిమెలిసి ఉంటే జీవితం నందనవనం అవుతుంది. అతను ఆమె అభిప్రాయాలకు అనుగుణంగా మెలుగుతూ అడిగినవి ఇస్తే ఏం పోతుంది చెప్పు అని కవయిత్రి చెప్పిన తీరు అద్భుతగా ఉంది.

‘మహా అయితే
నా పేరు ముందు చేరి
ప్రేమగా ధ్వనిస్తుంది అంతేగా!’

లోకంలో సీతారాముల జంట అనే పేరు ఉంది. అది ఎప్పటికీ నిలిచి ఉంటుంది. సీతారాముడు అని పిలవడం వల్ల ఆమె ఎక్కువ కాదు, అతను ఎక్కువ కాదు. సీత రాముడు ఇద్దరు సమానమే. భార్యా భర్త ఇద్దరు సమానమే. ఎవరు ఎక్కువ కాదు. ఎవరు తక్కువ కాదు. భార్య భర్త ఇద్దరు రెండు కళ్ళలాంటి వారు. అతడు ఆమె ఇద్దరు అనురాగంతో కలిసిమెలిసి ఉంటే ఏం పోతుంది చెప్పు అని గొప్ప ఆలోచనతో కవిత రాసి సమాజానికి కవయిత్రి స్ఫూర్తిని అందించారు. కవయిత్రి నాగ జ్యోతి శేఖర్‌ను అభినందిస్తున్నాను. కవయిత్రి మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.


దొండపాటి నాగ జ్యోతి 26-04-1982 రోజున జన్మించారు. అనపర్తి గ్రామం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు. వీరి తల్లిదండ్రులు సత్యవతి, సత్యనారాయణ. వీరి తండ్రి సత్యనారాయణ వ్యవసాయ కూలీ పని చేస్తూ జీవనం సాగించేవీహ. వీరు 1 నుండి 5 వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాల, వెంకట రత్నాపురం, అనపర్తి గ్రామంలో చదివారు. 6 నుండి 10వ తరగతి వరకు ద్వారంపూడి బుల్లమ్మాయి గర్ల్స్ హై స్కూల్, అనపర్తి గ్రామంలో చదివారు. ఇంటర్మీడియట్ గులుగూరి బాపిరాజు జూనియర్ కళాశాల, అనపర్తి గ్రామంలో చదివారు. వీరు డి.ఇడి. డిప్లమా ఇన్ ఎడ్యుకేషన్ టీచర్ ట్రైనింగ్ బొమ్మూరు, రాజమండ్రిలో చేశారు. బి.ఏ. డిగ్రీ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, రాజమండ్రిలో చదివారు. ఎం.ఏ. ఇంగ్లీష్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, రాజమండ్రిలో చదివారు. ఎం.ఎస్.సి. సైకాలజీ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, రాజమండ్రిలో చదివారు. బి.ఇడి. అద్దేపల్లి మహిళా కళాశాల, రాజమండ్రిలో చదివారు.

వీరు 17-10-2002 రోజున ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ద్వారంపూడి గ్రామంలో ఎస్జీటీ టీచర్‌గా నియమించబడ్డారు. ప్రస్తుతం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, రామన్నపాలెం గ్రామం, తాళ్లరేవు మండలం, కాకినాడ జిల్లాలో పనిచేస్తున్నారు.

నాగ జ్యోతి ఇంటర్మీడియట్ చదువుతున్నప్పటినుండి సృజన చేయడం ప్రారంభించారు. వీరి వివాహం లకవరపు రాజశేఖర్ బాబుతో 11-02-2006 రోజున మురమళ్ల గ్రామంలో జరిగింది. రాజశేఖర్ బాబు ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్, ఇంగ్లీష్ టీచర్‌గా పని చేస్తున్నారు. నాగజ్యోతి రాజశేఖర్ బాబు దంపతులకు ఒక్కతే సంతానం. కూతురు పేరు చైత్ర వర్ణిత.

వీరు డి.నాగ జ్యోతి శేఖర్ అనే కలం పేరుతో రచనలు చేస్తున్నారు. వీరు రాసిన తొలి కథ ‘మెరుపుతీగ’ 2000 సంవత్సరంలో ఆంధ్రభూమి సచిత్ర వార పత్రికలో ప్రచురితం. వీరు రాసిన తొలి విద్యా సంబంధ మినీ వ్యాసం 2000 సంవత్సరంలోఆంధ్రభూమి దినపత్రికలో వేదికలో ప్రచురితం. వీరు రాసిన ‘అత్తలందు మా అత్త వేరయా’ కథ ఈనాడు ఆదివారంలో 2013 సంవత్సరంలో ప్రచురితం. వీరు రాసిన విద్యా సంబంధ వ్యాసం తెలుగు వెలుగు పత్రికలో  ప్రచురితం.

తొలి కవితా సంపుటి ‘రెప్పవాల్చని స్వప్నం’ డిసెంబర్, 2021లో వెలువరించారు. 2023వ సంవత్సరంలో ‘రెప్పవాల్చని స్వప్నం’ తొలి కవితా సంపుటికి ఉత్తమ రచయిత్రిగా సిరికోన అకాడమీ, మాతృశ్రీ జింక రుక్మిణమ్మ స్మారక పురస్కారాన్ని  అందుకున్నది.

కవయిత్రి నాగజ్యోతి శేఖర్  పొందిన బహుమతుల వివరాలు:

  1. 2001 సంవత్సరంలో సృజన సాహితీ సంస్థ, రాజమండ్రి వారిచే జిల్లా స్థాయి కవితల పోటీలో ప్రథమ బహుమతి.
  2. 2001 సంవత్సరంలో కడియం,తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి కవితల పోటీలో శ్రీ బేతబోలు రామ బ్రహ్మంగారి ప్రత్యేక ప్రోత్సాహక బహుమతి.
  3. 2001 సంవత్సరంలో గౌతమి గ్రంథాలయం రాజమండ్రి వారిచే జిల్లా స్థాయి కవితల పోటీలో తృతీయ బహుమతి.
  4. 2003 సంవత్సరంలో SBSR CHARITABLE TRUST,పొలమూరు,తూర్పుగోదావరి జిల్లా స్థాయి కవితల పోటీలో ద్వితీయ బహుమతి.
  5. 2005 సంవత్సరంలో తూర్పుగోదావరి జిల్లా స్థాయి కవితల పోటీలో రామచంద్రపురం వారిచే ద్వితీయ బహుమతి.
  6. 2020 సంవత్సరంలో ‘తడిసిన హృది’ కథ మొట్టమొదటిసారిగా అంతర్జాతీయంగా ‘తెలుగు కళా సమితి’ అమెరికా వారి తెలుగు జ్యోతి పత్రికలో ప్రచురితం.
  7. 2021 తెలుగు జ్యోతి వారి కథల పోటీలో ‘ప్రియధ్వని’ కథకు తృతీయ బహుమతి అందుకోవడం జరిగింది.
  8. 2020 సంవత్సరంలో తానా (తెలుగు అసోసియేషన్, ఉత్తర అమెరికా) ఫోటోగ్రఫీ కవితల పోటీలో బహుమతి.
  9. 2020 సంవత్సరంలో నాటా (ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన్) కవితల పోటీలో బహుమతి పొందడం జరిగింది.
  10. 2018 సంవత్సరంలో అనపర్తి తెలుగు భాషా సంఘం వారి ఉగాది కవితల పోటీలో ప్రథమ బహుమతి.
  11. భిలాయి నుండి వెలవడిన‘భిలాయి వాణి’ పత్రిక 2019 సంవత్సరంలో కవితల పోటీలో బహుమతి గెలుపొందడం జరిగింది.
  12. సహరి అంతర్జాల పత్రిక కవితల పోటీలో 2021 సంవత్సరంలో బహుమతి.
  13. ఓజోన్ డే సందర్భంగా 2020 సంవత్సరంలో తెలంగాణ అటవీ శాఖ వారు నిర్వహించిన పర్యావరణ కవితల పోటీలో ప్రథమ బహుమతి.
  14. 2020 ఈనాడు రామోజీ ఫౌండేషన్ నిర్వహించిన రెండు తెలుగు రాష్ట్రాల కరోనా కవితల పోటీల్లో ప్రథమ బహుమతి.
  15. 2021 సంవత్సరంలో సేవ సంస్థ వారి 100 మంది కవులతో 100 గంటల కవితా పఠనంలో పాల్గొని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదు కావడం జరిగింది.
  16. తెల్సా (తెలుగు సొసైటీ ఆఫ్ అమెరికా) కవితల పోటీ 2022 సంవత్సరంలో ఉత్తమ కవితా బహుమతి.
  17. 2024 సంవత్సరంలో శ్రీ వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా తెలుగు ప్రపంచ సభలు,కాకినాడ కవితల పోటీలో తృతీయ బహుమతి.

కవయిత్రి నాగ జ్యోతి శేఖర్  పొందిన పురస్కారాలు:

  1. 2017 సంవత్సరంలో శ్రీ అభ్యుదయ కళానికేతన్,కాకినాడ వారి ‘అభ్యుదయ శ్రీ స్మార్ట్ అవార్డు –
  2. 2017 సంవత్సరంలో ఐ పోలవరం మండలం విద్యాశాఖ వారిచే మండల ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డు.
  3. 2020 పి.టీ. ఎమ్. సంస్థ, తూర్పుగోదావరి వారిచే ‘కావ్య శిరోమణి’ బిరుదు.
  4. మంత్రి శ్రీ గొల్లవిల్లి సూర్యారావు గారిచే ‘కళా పురస్కారం’కవితా విభాగం మలికిపురం తూర్పుగోదావరి జిల్లా
  5. కలం స్నేహం వాట్సాప్ వేదిక వారిచే‘కలం భూషణ్’ బిరుదు
  6. నేటి కవిత వాట్సాప్ వేదిక వారిచే ‘కవితా భూషణ’ బిరుదు
  7. శ్రీ లావణ్య స్కూల్ అనపర్తి,తూర్పుగోదావరి జిల్లా టాలెంట్ ఫెస్ట్ – 2018 -2019 ప్రత్యేక గౌరవ పురస్కారం.
  8. 2023 అమరావతి సాహితీ మిత్రులు,గుంటూరు వారిచే ఉగాది పురస్కారం.
  9. 2023 కోనసీమ జిల్లా కలెక్టర్ శ్రీ హిమాన్షు శుక్లా గారి చేతుల మీదుగా ఉగాది సత్కారం.
  10. 2024 కాకినాడ జిల్లా కలెక్టర్ శ్రీ జే నివాస్ గారి చేతుల మీదుగా ఉగాది సత్కారం.
  11. ప్రజ్ఞా సాహితీ సంస్థ, ఐ పోలవరం,కోనసీమ వారిచే ‘కవి రత్న’ పురస్కారం.
  12. 2023 సంవత్సరంలో లయన్స్ క్లబ్ తాళ్లరేవు వారిచే ‘ఉత్తమ ఉపాధ్యాయురాలు’ పురస్కారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here