మహాభారత కథలు-64: ద్వారక నుంచి వచ్చిన శ్రీకృష్ణుడు

0
3

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

[dropcap]ధ[/dropcap]ర్మరాజు రాజసూయయాగం ప్రారంభించాలని ద్వారకానగరం నుంచి జగదాధారుడైన శ్రీకృష్ణుడు ధనము, రత్నాలు మొదలైన అనేక సంపదల్ని తీసుకుని వచ్చాడు.

లోకపూజితుడైన శ్రీకృష్ణుణ్ని ధర్మరాజు శాస్త్రోక్తంగా పూజించాడు. తమ్ముళ్లు, ధౌమ్యుడు, ద్వైపాయనుడు, ఋత్విజులు, ఆప్తులైన మంత్రులు అందరూ ఉండగా ధర్మరాజు శ్రీకృష్ణుడితో “పద్మనాభా! నీ దయవల్లే మాకు సార్వభౌమాధికారం కలిగేట్టు రాజులందరూ మా పరక్రమానికి లొంగిపోయారు.

రాజులనుంచి సంపాదించిన ధనం విలువ చెప్పడం చాలా కష్టం. ఈ ధనాన్ని అర్హులైన వాళ్లకి దానం చెయ్యాలి. అగ్నిదేవుడి ముఖంలో శాస్త్రోక్తంగా వేసిన ఆహుతులతో దేవతల్ని; తగిన దక్షిణలతో బ్రాహ్మణోత్తముల్ని తృప్తి పరచాలి. నీకిష్టమైన యజ్ఞం చేయించి నాకు లోకానికి మంచి జరిగేలా చెయ్యి. లేదా నన్ను రాజసూయ యాగంలో నియమించి అనుగ్రహించు!” అన్నాడు.

ధర్మరాజు మాటలు విని శ్రీకృష్ణుడు “ధర్మరాజా! నువ్వు అన్ని రాజవంశాలు పూజించడానికి అర్హుడివి. స్వచ్ఛమైన ధర్మంలోను, ఎక్కువగా ఉన్న ఐశ్వర్యంలోను దేవేంద్రుడివంటి వాడివి. సామ్రాజ్యం, దైవబలం, మానవబలం నీకు అమరి ఉన్నాయి. కనుక నువ్వు రాజసూయ యాగం చెయ్యడానికి అర్హుడివి.

ధర్మరాజా! ఈ పని చెప్పవచ్చు, ఈ పని చెప్పకూడదు అని ఆలోచించకుండా నీకు ఇష్టమైన పనుల్లో నన్ను, నువ్వంటే అభిమానమున్న వాళ్లందరినీ నియమించు” అన్నాడు.

శ్రీకృష్ణుడు మాటలకి ధర్మరాజు సంతోషించి ‘నాకు శ్రీకృష్ణుడి అనుగ్రహంతో కోరికలన్నీ తీరాయి. సమకూరిన సంపదలు మంచి పనికి వినియోగపడతాయి’ అనుకున్నాడు.

రాజసూయయాగం ప్రారంభించిన ధర్మరాజు

రాజసూయయాగానికి వచ్చిన పెద్దలు

శ్రీకృష్ణుడి అనుమతి, తమ్ముళ్లు, ధౌమ్యుడు వంటి పెద్దల అంగీకారంతో ధర్మరాజు రాజసూయయాగం చెయ్యడానికి నిర్ణయించుకున్నాడు.

సహదేవుణ్ని పిలిచి “నువ్వు ధౌమ్యులవారు చెప్పిన యాగానికి అవసరమైన సామాను తేవడానికి ఇంద్రసేనుడి వంటి ప్రముఖులకి, అర్జునుడి సారథి రుక్మికి అప్పగించు. యాగశాలలో అన్ని దేశాల నుంచి వచ్చిన రాజులకి మంచి విడుదులు ఏర్పాటు చెయ్యి. భూమండలంలో ఉండే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య శూద్రులని అందరినీ రప్పించు” అని ఆజ్ఞాపించాడు.

సహదేవుడు ఇంద్రసేనుడి వంటి చాలమంది శిల్పాచార్యుల్ని నియమించాడు. శాస్త్రోక్తంగాను, యజ్ఞ సాధన సామగ్రిని మొత్తాన్ని యజ్ఞశాలలో అందంగా అమర్చాడు. అవసరమైన పదార్థాలన్నీ నింపాడు. ఇంద్రప్రస్థానికి అన్ని వైపులా ఉద్యానవనాలతో, కోనేరులతో దిగుడు బావులతో అవసరమైన నెయ్యి, నూనె, బియ్యం వంటి ఆహారపదార్థాలు సమృద్ధిగా ఉండేట్లు అతిథిగృహాల్ని ఐశ్వర్యం ఉట్టిపడేట్టుగా ఏర్పరిచాడు. ఇంద్రప్రస్థపురం అపరభూమండలంలా ప్రకాశించింది.

సహదేవుడు పిలవగా పుత్రులతో, మిత్రులతో, సోదరులతో కలిసి భూమండలంలో ఉన్న రాజులు, వేదవేదాంగాలు చదువుకున్న బ్రాహ్మణులు, తమతమ ధర్మాల్ని నిర్వర్తించే వైశ్యులు, శూద్రులు వచ్చి వాళ్ల అర్హతలకి తగినట్టు ఏర్పాటు చెయ్యబడ్డ ఇళ్లల్లో విడిది చేశారు.

భీష్ముడు మొదలైన పెద్దలందరూ ధనరాశుల్ని వెంట తీసుకుని సంతోషంగా ఇంద్రప్రస్థపురానికి వచ్చారు. భీష్ముడు, ధృతరాష్ట్రుడు, విదురుడు, ద్రోణుడు మొదలైన వాళ్లని ధర్మరాజు ఆదరంగా అహ్వానించాడు. “మీ అందరి అనుగ్రహంతో ఈ రాజసూయ యాగాన్ని చెయ్యడానికి తలపెట్టాను. ప్రేమతో మీరందరూ దీన్ని ఘనంగా వెలితి లేకుండా జరిగేలా చూడండి” అని చెప్పి అందరి అనుగ్రహం పొందాడు.

బంగారము, వెండి, రత్నాల్ని దక్షిణలుగా దానాలు ఇచ్చే విషయంలో కృపాచార్యుణ్ని, చెయ్యవలసినవి చెయ్యకూడని పనుల గురించి సలహాలు ఇవ్వడానికి భీష్మద్రోణుల్ని, అన్ని పదార్థాల్ని ఉపయోగించడంలో విదురుణ్ని, వివిధ దేశాల రాజులు తెచ్చేకానుకల్ని తీసుకోడానికి దుర్యోధనుణ్ని, భక్ష్యభోజ్యపదార్థాల్ని అందరికీ అందచెయ్యడానికి దుశ్శాసనుణ్ని నియమించాడు.

యజ్ఞదీక్ష తీసుకున్న ధర్మరాజు

వివేకవంతుడు, ధర్మాలన్నీ తెలిసిన ధర్మరాజు యజ్ఞదీక్ష తీసుకుని బ్రాహ్మణులు దాయాదులు తన చుట్టూ ఉండగా మహావైభవంగా యజ్ఞశాలలోకి ప్రవేశించాడు.

బ్రహ్మతేజస్సుకి, క్షత్ర తేజస్సుకి ఉత్తమ ఆభరణాల రత్న తేజస్సుకి మెరుగులు దిద్దుతూ తన తేజస్సు ప్రకాశిస్తూ ఉండగా మంచి గుణాలతో వెలిగేవాడు, యజ్ఞదీక్ష తీసుకున్నవాడు, రూపుతాల్చిన ధర్మంలా ఉన్న ధర్మరాజుని రాజ్య ప్రజలంతా గొప్ప ఆనందంతో చూశారు.

బ్రహ్మజ్ఞాన సంపన్నులైన బ్రాహ్మణోత్తములు అందరూ తన చుట్టూ ఉండగా బ్రాహ్మణుల మేలు కోరే ధర్మరాజు బ్రహ్మర్షులతో సేవించబడే బ్రహ్మదేవుడిలా ప్రకాశించాడు. వేదమంత్రాల ధ్వని, ఆశీర్వచనాల ధ్వని, అనేక వాద్యాల మహాధ్వనులన్నీ కలిసి ప్రజలకి ఇతర ధ్వనులు వినపడకుండా వ్యాపించాయి.

అనంత వేదాలవంటి వాళ్లైన ‘పైల, ధౌమ్యులు’ ఋగ్వేదతంత్రాన్ని నిర్వహించే ఋత్విక్కులుగాను, ‘యాజ్ఞ్యవల్క్యుడు’ యజుర్వేద తంత్రాన్ని నడిపే అద్వర్యుడుగాను, ‘వేదవ్యాసుడు’ ప్రధాన ఋత్విక్కైన బ్రహ్మగాను, ‘సుసాముడు’ సామవేద తంత్రాన్ని నడిపే ఋత్విక్కుగాను, ఈ నలుగురికి సంబంధించిన పుత్రులు, శిష్యులు; మైత్రావరుణుడు, అచ్ఛావాకుడు మొదలైనవాళ్లు సహాయ ఋత్విక్కులుగాను, ‘నారదుడు’ మొదలైన బ్రహ్మర్షులు సదస్యులుగాను, భీష్ముడు మొదలైన రాజర్షులు సహాయులుగాను అన్ని రకాలుగా అమగ్రమై, ఆరు వేదాంగాలైన శిక్షావ్యాకరణాదులతో నిండినది, సంపూర్ణ దక్షిణలతో కూడినది, ధనధాన్య సమేతమైనది జగన్నాథుడైన శ్రీకృష్ణుడితో రక్షించబడుతున్నది ప్రజలందరికీ ఆనందకరమైందిగా ఉంది ధర్మరాజు చేస్తున్న రాజసూయ యాగం.

ఆ రాజసూయ యాగంలో అగ్నిహోత్రుడి ముఖంలో మంత్రపూరితాలైన ఆహుతుల్ని ఎక్కువగా వేల్చడం వల్ల దేవతలు; నిండుగా దక్షిణలు, దానాలు ఇవ్వడం వల్ల బ్రాహ్మణులు; తగిన విధంగా సన్మానించబడ్డ దేశదేశాల రాజులు; ఇష్టమైన అన్నదానం ఆపకుండా చెయ్యడం వల్ల సామన్య ప్రజలు పూర్తిగా తృప్తి పొందారు.

ధర్మబద్ధమైన నడవడిక కలిగి పుణ్యాత్ముడై తమ్ముళ్లతో కలిసి ఉన్న ధర్మరాజుని ఆనందంతో అందరూ ప్రశంసించారు” అని జనమేజయుడికి వైశంపాయన మహర్షి ఎంతో ప్రేమతో వీనులవిందుగా శ్రీమదాంధ్ర మహాభరతము సభాపర్వము మొదటి ఆశ్వాసము వివరంగా చెప్పాడు.

సభాపర్వంలోని మొదటి ఆశ్వాసము సమాప్తం  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here