[‘పద్య కళాప్రవీణ’, ‘కవి దిగ్గజ’ ఆచార్య ఫణీంద్ర రచించిన ‘విషాద యశోద’ అనే పద్యకావ్యాన్ని అందిస్తున్నాము.]
వేదిక
~~~~~
శా.
శ్రీ కృష్ణా! యదువంశ చంద్ర! ఇదె నీ శ్రీపాదముల్ బట్టి నే
శ్రీకారంబును జుట్టుచుంటి కృతినిన్ జేయంగ, సద్భక్తితో
సాకారం బొనరించి నాదు హృదిలో, సాక్షాత్ యశోదాంబనే!
శ్రీ కైవల్య వర ప్రసాద గుణ! సుశ్రేయంబునే గూర్చుమా! (1)
కం.
‘ఆచార్య ఫణీంద్ర’ యనెడి
ప్రాచుర్యము గల్గు నీ ప్రభాస కవీంద్రుం
డా చరితార్థ కృతుల యం
దే చాటునొ దాగిన వ్యథ నిటు వెలి పరచున్! (2)
ఉ.
కంసుని సంహరించు ఘన కార్య నిమిత్తము కృష్ణుడేగి, యా
ధ్వంస మొనర్చియున్, తిరిగి తా వ్రజ భూమికి రానిచో – మహా
హింసను గుండెయం దనుభవించె యశోద యనేక రీతు,లా
శంసువునై – వెలార్చెద ప్రశస్త “విషాద యశోద” సత్కృతిన్! (3)
కం.
విగత సుఖంబును తలచుచు,
స్వగతంబున నా యశోద – ‘పగవారికినిన్
వగ పిటు రావల’దనుచును
పొగిలి పొగిలి యొలుకు దుఃఖము – నిదె రచింతున్! (4)
ఆ.వె.
ఆ యశోదమ హృదయంబె మీ హృదయంబు
గాగ, మీ హృదయమె గాగ నా య
శోద హృదయముగ – ప్రచుర భావ జలనిధిన్
మునిగి తేలు డింక, ముందు కేగి.. (5)
#
వేదన
~~~~~
కం.
శ్రీకరముగ ననునిత్యము
గోకులమును గాచెదవని కులదైవముగా
నో కల్యాణి! నిను గొలుతు!
నా కృష్ణుని జేర్చుమమ్మ నా దరి కింకన్! (1)
కం.
కృష్ణా ! ప్రియ సుత ! నీకై
తృష్ణ నెదురు జూతును – పలు
దినములు కణచెన్
వృష్ణి కులజ! నీవు వెడలి –
ఉష్ణోదక మటు యశోద యుల్లము మరిగెన్! (2)
కం.
నా కర్మమేమొ! మధుర
న్నా కంసుండేల బూనె యాగము సలుపన్?
నా కన్నయ! యేల బిలిచె
నా కొమరుడవైన నిన్ను? నా హృది కుమిలెన్! (3)
సీ.
శ్రీ ‘ధనుర్యాగంబు’ సేయంగ బూని తా
నాహ్వానముల బంపె నందరికిని –
‘అక్రూర’ దివ్యాత్ము డరుదెంచి మన యింట
కంస భూపతి మాటగాను దెలిపె –
“బాలుండవైనను పరమ వీరుడవంచు
శ్రీకృష్ణ! నీ కంపె శ్రీముఖమ్ము –
యుద్ధ విద్యలలో ప్రయోజకత్వము జూప
నవకాశ మిదె” యంచు నతడు బలికె!
తే.గీ.
వలదు, వలదన్న నెవరు నా పలుకు వినక,
అంద రక్రూరు డెంతొ మహాత్ము డనుచు,
నతని మాట మన్నించి నిన్నంపినారు!
మేనె ఇటనుండె నాకు – నా ప్రాణ మేగె! (4)
ఆ.వె.
నుడివి, నీవటులె “ధనుర్యాగము” ను, మరి
కాంచెద మధురా నగరము ననుచు –
పిలిచె “బీరకాయ పీచు చుట్ట” మనుచు –
వలదటన్న వినక, పరగినావు! (5)
(సశేషం)